మీ పొరుగువానితో సత్యమే మాట్లాడండి
మీ పొరుగువానితో సత్యమే మాట్లాడండి
“మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.” —ఎఫె. 4:25.
1, 2. చాలామంది నిజాయితీగా ఉండడం గురించి ఏమనుకుంటున్నారు?
మానవులు నిజాయితీగా ఉండడం, సత్యాన్ని తెలుసుకోవడం సాధ్యమేనా అని ఎంతో కాలంగా చర్చ జరుగుతోంది. సా.శ.పూ. ఆరవ శతాబ్దంలో గ్రీకు కవి అల్కేయస్ ఇలా చెప్పాడు: “తాగితే నిజం బయటపడుతుంది.” ఓ వ్యక్తి పూటుగా తాగితే ఎక్కువగా మాట్లాడతాడు కాబట్టి, నిజం చెప్పాలనుకుంటాడు. మొదటి శతాబ్దపు రోమా అధిపతి అయిన పొంతి పిలాతు యేసుతో అన్న మాటల్లో కూడ సత్యం విషయంలో ఆయనకు ఎలాంటి తప్పుడు అభిప్రాయం ఉందో తెలుస్తుంది. ఆయన హేళనగా యేసును “సత్యమనగా ఏమిటి?” అని అడిగాడు.—యోహా. 18:37.
2 మన కాలంలో సత్యం గురించి ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. “సత్యం” అనే పదానికి అనేక అర్థాలున్నాయని లేక ప్రజలు అన్ని సందర్భాల్లో నిజాయితీగా ఉండరని చాలామంది అంటారు. మరికొందరు తమకు లాభం ఉందనుకున్నప్పుడు లేదా ఏదైనా సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని అనుకున్నప్పుడు నిజం చెబుతారు. ది ఇంపార్టెన్స్ ఆఫ్ లైయింగ్ అనే పుస్తకం ఇలా చెబుతోంది: “నిజాయితీగా ఉండడం మంచిదే. కానీ అది జీవితంలో పెద్దగా పనికిరాదు. నిజాయితీగా ఉంటే బ్రతుకలేం, మన జీవితం ప్రమాదంలో పడవచ్చు. బ్రతకాలంటే అబద్ధం చెప్పడం తప్ప వేరే దారి లేదు.”
3. సత్యం మాట్లాడే విషయంలో యేసు ఎలా మంచి మాదిరి ఉంచాడు?
3 అలా ఆలోచించేవారికీ క్రీస్తు శిష్యులకూ చాలా తేడా ఉంది. సత్యం విషయంలో యేసు అభిప్రాయం మనం ముందు చెప్పుకున్న వారి అభిప్రాయంలా లేదు. ఆయన ఎప్పుడూ సత్యమే మాట్లాడాడు. చివరకు, ఆయన శత్రువులు కూడ ఇలా ఒప్పుకున్నారు: “బోధకుడా, నీవు సత్యవంతుడవై యుండి, దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావు.” (మత్త. 22:16) మన కాలంలోని నిజ క్రైస్తవులు కూడ యేసు మాదిరిని అనుసరిస్తున్నారు. వారు సత్యం మాట్లాడడానికి వెనకాడరు. “మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను” అని అపొస్తలుడైన పౌలు తోటి విశ్వాసులకు చెప్పిన మాటలతో వారు మనస్ఫూర్తిగా ఏకీభవిస్తారు. (ఎఫె. 4:25) పౌలు చెప్పిన మాటల్లో మూడు విషయాలను చూద్దాం. మొదటిది, మన పొరుగువారు ఎవరు? రెండవది, సత్యం మాట్లాడడమంటే ఏమిటి? మూడవది, మన రోజువారి జీవితంలో సత్యాన్ని ఎలా మాట్లాడవచ్చు?
మన పొరుగువారు ఎవరు?
4. పొరుగువారు ఎవరనే విషయంలో యేసు మొదటి శతాబ్ద యూదా నాయకులకు భిన్నంగా యెహోవా ఆలోచనా విధానాన్ని ఎలా కనబరిచాడు?
4 సా.శ. మొదటి శతాబ్దంలో, కొందరు యూదా నాయకులు తోటి యూదులను, స్నేహితులను మాత్రమే “పొరుగువారు” అని పిలవొచ్చని బోధించారు. అయితే, యేసు తన తండ్రి వ్యక్తిత్వాన్ని, ఆలోచనా విధానాన్ని పరిపూర్ణంగా కనబరిచాడు. (యోహా. 14:9) దేవుడు జాతి, జనాంగం అనే తేడా లేకుండా అందరినీ అనుగ్రహంతో చూస్తాడని యేసు తన శిష్యులకు చూపించాడు. (యోహా. 4:5-26) అంతేకాక, పరిశుద్ధాత్మ ప్రేరణతో అపొస్తలుడైన పేతురు, “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును” అని రాశాడు. (అపొ. 10:28, 34, 35) కాబట్టి, అందరినీ మన పొరుగువారిగానే చూస్తూ, చివరకు శత్రువుల్లా ప్రవర్తించే వారిని కూడ ప్రేమించాలి.—మత్త. 5:43-45.
5. మన పొరుగువారితో సత్యం మాట్లాడడమంటే ఏమిటి?
5 పౌలు ఏ ఉద్దేశంతో మన పొరుగువారితో సత్యం మాట్లాడాలని చెప్పాడు? సత్యం మాట్లాడాలంటే మనం ఇతరులను మోసగించకుండా వాస్తవాలను చెప్పాలి. నిజ క్రైస్తవులు ఇతరులను మోసగించాలని వాస్తవాలను రోమా. 12:9) ‘సత్యదేవుణ్ణి’ అనుకరిస్తూ మనం అన్ని విషయాల్లో నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండడానికి కృషిచేయాలి. (కీర్త. 15:1, 2; 31:5) బాగా ఆలోచించి మాట్లాడితే మనల్ని ఇబ్బందిపెట్టే పరిస్థితుల్లో కూడ ఇతరుల మనసు నొప్పించకుండా నిజం చెప్పగలుగుతాం.—కొలొస్సయులు 3:9, 10 చదవండి.
మార్చి చెప్పరు లేదా అబద్ధం చెప్పరు. వారు “చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని” ఉంటారు. (6, 7. (ఎ) నిజం మాట్లాడడమంటే అడిగిన ప్రతీవారికీ సొంత విషయాలు కూడ చెప్పాలని అర్థమా? వివరించండి. (బి) మనం ఎవరికి పూర్తి వివరాలు ఇవ్వాలి?
6 ఇతరులతో నిజం మాట్లాడడమంటే అడిగిన ప్రతీవారికీ అన్ని వివరాలు చెప్పాలని దానర్థమా? లేదు. కొందరు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరంలేదని లేదా కొన్ని వివరాలు ఇవ్వాల్సిన అవసరంలేదని యేసు భూమ్మీదున్నప్పుడు చూపించాడు. ఏ అధికారంతో సూచనలు, అద్భుతకార్యాలు చేస్తున్నావని వేషధారులైన మతనాయకులు ఆయనను అడిగినప్పుడు యేసు, “నేనును మిమ్మును ఒక మాట అడిగెదను, నాకుత్తరమియ్యుడి, అప్పుడు నేను ఏ అధికారమువలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును” అని వారికి జవాబిచ్చాడు. యేసు అడిగిన ప్రశ్నకు శాస్త్రులు, పెద్దలు జవాబివ్వడానికి ఇష్టపడనప్పుడు యేసు వారితో “ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పను” అని జవాబిచ్చాడు. (మార్కు 11:27-33) తప్పుడు ఆచారాలను పాటించే అలాంటి అవిశ్వాసులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని ఆయన అనుకున్నాడు. (మత్త. 12:10-13; 23:27, 28) మన కాలంలో కూడ స్వార్థం కోసం మాయోపాయాలచేత ఇతరులను మోసగించే మతభ్రష్టులు, దుష్టుల విషయంలో యెహోవా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.—మత్త. 10:16; ఎఫె. 4:14.
7 కొందరికి పూర్తి వివరాలు ఇవ్వాల్సిన అవసరంలేదని పౌలు కూడ సూచించాడు. “వదరుబోతులును పరులజోలికి పోవువారు” ‘ఆడరాని మాటలు’ మాట్లాడుతున్నారని ఆయన చెప్పాడు. (1 తిమో. 5:13) ఇతరులు తమకు సొంత వివరాలు చెప్పడానికి ఇష్టపడరని పరుల వ్యవహారాల్లో తలదూర్చేవారికి లేదా రహస్యంగా ఉంచాల్సిన విషయాన్ని మనసులో దాచుకోలేనివారికి తెలుసు. వారు దైవప్రేరణతో పౌలు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని పాటించడం ఎంతో మంచిది. ఆయన ‘మీరు పరులజోలికి పోక, మీ సొంతకార్యములను జరుపుకొనుడి’ అని చెప్పాడు. (1 థెస్స. 4:10, 11) అయితే కొన్నిసార్లు సంఘ పెద్దలు తమకు ఇవ్వబడిన బాధ్యతలను నెరవేర్చడానికి వ్యక్తిగత విషయాలను కూడ అడగాల్సివస్తుంది. అలాంటప్పుడు వాస్తవాలను చెప్పి వారికి సహకరించడం ఎంతో మంచిది.—1 పేతు. 5:2.
కుటుంబ సభ్యులతో సత్యం మాట్లాడండి
8. సత్యం మాట్లాడడంవల్ల కుటుంబ సభ్యులు ఎలా ఒకరికి ఒకరు దగ్గరౌతారు?
8 సహజంగానే, మన కుటుంబంతో మనకు అనుబంధం ఉంటుంది. దాన్ని బలపర్చుకోవాలంటే మనం ఒకరితో ఒకరం సత్యం మాట్లాడడం ఎంతో ప్రాముఖ్యం. దాపరికం లేకుండా, దయతో నిజాయితీగా మాట్లాడడంవల్ల ఎన్నో సమస్యలను, మనస్పర్థలను తగ్గించుకోవచ్చు లేదా అరికట్టవచ్చు. ఉదాహరణకు, మనం తప్పుచేస్తే దాన్ని భార్య/భర్త, పిల్లలు లేదా దగ్గరి బంధువుల ముందు ఒప్పుకోవడానికి వెనకాడుతున్నామా? మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగితే కుటుంబంలో శాంతి, ఐక్యతలుంటాయి.—1 పేతురు 3:8-10 చదవండి.
9. సత్యం మాట్లాడాలనే సాకుతో మనం కటువుగా ఎందుకు మాట్లాడకూడదు?
ఎఫె. 4:31, 32) మనం ఇతరులకు తగిన గౌరవమిస్తూ దయతో మాట్లాడితే మన మాటకు విలువుంటుంది, ఎదుటివారిని గౌరవించినట్లౌతుంది.—మత్త. 23:12.
9 సత్యం మాట్లాడడమంటే ఇతరుల మనసు నొప్పించేలా కటువుగా మాట్లాడడమని కాదు. అలా మాట్లాడితే ప్రజలు మనం చెప్పేది వినడానికి ఇష్టపడరు. “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.” (సంఘ వ్యవహారాల్లో సత్యం మాట్లాడండి
10. సత్యం మాట్లాడే విషయంలో యేసు ఉంచిన మంచి మాదిరి నుండి క్రైస్తవ పెద్దలు ఏమి నేర్చుకోవచ్చు?
10 యేసు తన శిష్యులకు అర్థమయ్యేటట్లు, ఖచ్చితంగా మాట్లాడాడు. ఆయన ఎప్పుడూ ప్రేమతోనే ఉపదేశమిచ్చాడు. అయినా తన శ్రోతలను మెప్పించాలనే ఉద్దేశంతో సత్యాన్ని నీరుగార్చలేదు. (యోహా. 15:9-12) ఉదాహరణకు, తమలో ఎవరు గొప్పవారు అనే విషయం మీద అపొస్తలులు పదేపదే వాదులాడుకున్నప్పుడు, యేసు ఖచ్చితంగానే అయినా ఓపిగ్గా, వినయాన్ని అలవర్చుకోవడం ఎంత అవసరమో చూపించాడు. (మార్కు 9:33-37; లూకా 9:46-48; 22:24-27; యోహా. 13:14) అలాగే నేటి క్రైస్తవ పెద్దలు నీతిని స్థిరంగా అనుసరిస్తారు. అలాగని దేవుని మందమీద అధికారం చలాయించరు. (మార్కు 10:42-44) వారు ఇతరులపట్ల ‘దయతో కరుణాహృదయంతో’ ప్రవర్తించడం ద్వారా క్రీస్తును అనుకరిస్తారు.
11. సహోదరులపట్ల ప్రేమ ఉంటే మనం మన నాలుకను ఎలా ఉపయోగిస్తాం?
11 ముక్కుసూటిగా కాకుండా నిక్కచ్చిగా మన మనసులోని మాటలను చెబితే మనం మన సహోదరులను బాధపెట్టకుండా ఉండగలుగుతాం. మనం మన నాలుకను ఎన్నడూ ఇతరులను సూటిపోటి మాటలతో గాయపర్చేందుకు లేదా కించపర్చేందుకు “మంగల కత్తివలె” ఉపయోగించకూడదు. (కీర్త. 52:2; సామె. 12:18) సహోదరులపట్ల మనకు ప్రేమ ఉంటే ‘చెడ్డ మాటలు పలుకకుండ మన నాలుకను కపటమైన మాటలు పలుకకుండ మన పెదవులను కాచుకుంటాం.’ (కీర్త. 34:13) అలా దేవుని ఘనపర్చి, సంఘ ఐక్యతకు తోడ్పడతాం.
12. ఎలాంటి అబద్ధాలకు న్యాయపరమైన చర్య అవసరమౌతుంది? వివరించండి.
12 ఇతరుల పేరును పాడుచేసే వారి నుండి సంఘాన్ని రక్షించడానికి పెద్దలు ఎంతో కృషిచేస్తారు. (యాకోబు 3:14-16 చదవండి.) అలా ఇతరుల పేరు పాడు చేసేవారు ఏదో విధంగా ఎదుటి వ్యక్తిని బాధపెట్టాలనో కృంగదీయాలనో అబద్ధాలాడతారు. అది కేవలం చిన్నచిన్న అబద్ధాలు లేదా ఒక విషయాన్ని గోరంతను కొండంతగా చూపించడం మాత్రమే కాదు. ఏదేమైనా అసలు అబద్ధమాడడమే తప్పు. కానీ అన్ని సందర్భాల్లో న్యాయపరమైన చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి, పెద్దలు అలాంటి చర్య అవసరమో లేదో నిర్ణయించుకునేముందు అసలు ఆ వ్యక్తి కావాలని, అలవాటుగా ఇతరుల పేరు పాడుచేయాలని అబద్ధాలు చెబుతున్నాడా అనేది పరిశీలించాలి. లేదా లేఖనాల నుండి ప్రేమపూర్వకంగా ఖచ్చితంగా ఉపదేశాన్నిస్తే సరిపోతుందేమో ఆలోచించాలి. పెద్దలు ఈ విషయంలో న్యాయంగా సమతుల్యంగా, చక్కని విచక్షణతో వ్యవహరించాలి.
వ్యాపార వ్యవహారాల్లో నిజాయితీగా ఉండండి
13, 14. (ఎ) కొందరు తమ యజమానిని ఎలా మోసం చేస్తారు? (బి) నిజాయితీగా, నమ్మకంగా పనిచేయడంవల్ల ఎలాంటి మంచి ఫలితాలు రావచ్చు?
13 మన కాలంలో అన్నిచోట్లా మోసం కనిపిస్తుంది కాబట్టి యజమానిని మోసగించకుండా ఉండడం కష్టంగానే అనిపించవచ్చు. ఉద్యోగానికి ధరఖాస్తు వేసుకున్నప్పుడు చాలామంది పచ్చి అబద్ధాలు రాస్తారు. ఉదాహరణకు, వారు మంచి జీతంవచ్చే ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి లేని అనుభవాన్ని ఉన్నట్లూ, చేయని డిగ్రీని చేసినట్లూ చెప్పుకుంటారు. అంతేకాక, చాలామంది ఉద్యోగస్థులు కంపెనీ నియమాలకు విరుద్ధంగా వ్యక్తిగత పనులు చూసుకుంటున్నా తాము పనిచేస్తున్నట్లు చెప్పుకుంటారు. వారు నిజానికి తమ పనికి సంబంధంలేనివి చదువుతుండవచ్చు, ఫోనులు చేసుకుంటుండవచ్చు, వేరే వారికి మెస్సేజ్‌లు పంపిస్తుండవచ్చు, ఇంటర్నెట్ను చూస్తుండవచ్చు.
14 నిజాయితీగా, అబద్ధం చెప్పకుండా ఉండాలో లేదో ప్రతీ వ్యక్తి సొంతగా నిర్ణయించుకోవచ్చని నిజ క్రైస్తవులు అనుకోరు. (సామెతలు 6:16-19 చదవండి.) ‘మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచున్నాము’ అని పౌలు చెప్పాడు. (హెబ్రీ. 13:18) కాబట్టి, క్రైస్తవులు తమ జీతానికి తగ్గట్లు పనిచేస్తారు. (ఎఫె. 6:5-8) అంతేకాక, నమ్మకంగా పనిచేయడంవల్ల మనం మన పరలోక తండ్రిని మహిమపరుస్తాం. (1 పేతు. 2:12) ఉదాహరణకు, స్పెయిన్‌లో ఉంటున్న రోబర్టోను ఆయన యజమాని నిజాయితీగా, బాధ్యతాయుతంగా పనిచేస్తాడని మెచ్చుకున్నాడు. ఆయన మంచి ప్రవర్తనను చూసి కంపెనీ మరికొంతమంది సాక్షులను పనిలో పెట్టుకుంది. వారూ మంచి పనివారిగా పేరుతెచ్చుకున్నారు. ఆ సమయంలో, రోబర్టో బాప్తిస్మం తీసుకున్న 23 మంది సహోదరులకు, 8 మంది బైబిలు విద్యార్థులకు ఉద్యోగం ఇప్పించాడు!
15. వ్యాపారం చేస్తున్న ఓ క్రైస్తవుడు తాను నిజాయితీపరుడని ఎలా చూపించాలి?
15 మనకు సొంత వ్యాపారం ఉన్నట్లయితే, వ్యాపార లావాదేవీల్లో మనం నమ్మకంగా ఉంటున్నామా లేక మనం మన పొరుగువారికి కొన్నిసార్లు అబద్ధాలు చెబుతున్నామా అని ఆలోచించాలి. వ్యాపారం చేసుకుంటున్న క్రైస్తవుడు తన దగ్గరున్న వస్తువులు త్వరగా అమ్ముడుపోవాలని వాటి గురించిగానీ తాను అందించే సేవల గురించిగానీ అబద్ధం చెప్పకూడదు. అలాగని ఆయన లంచం ఇవ్వడు లేదా తీసుకోడు. మనతో ఇతరులు ఎలా ప్రవర్తించాలని కోరుకుంటామో మనమూ వారితో అలాగే ప్రవర్తించాలి.—సామె. 11:1; లూకా 6:31.
ప్రభుత్వ అధికారులతో సత్యం మాట్లాడండి
16. క్రైస్తవులు (ఎ) ప్రభుత్వ అధికారులకు (బి) యెహోవాకు ఏమి చెల్లించాలి?
16 “కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడి” అని యేసు చెప్పాడు. (మత్త. 22:21) మనం కైసరుకు అంటే ప్రభుత్వ అధికారులకు ఏమి చెల్లించాలి? యేసు పన్ను కట్టడం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. క్రైస్తవులు దేవుని ముందు, మనుష్యుల ముందు నిర్మలమైన మనస్సాక్షితో ఉండాలంటే వారు పన్నులు కట్టడానికి సంబంధించిన చట్టాలతోసహా దేశ చట్టాలకూ లోబడాలి. (రోమా. 13:5, 6) అయితే మనం పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణవివేకంతో, పూర్ణబలంతో ప్రేమించే యెహోవాయే విశ్వ సర్వాధిపతి, ఏకైక సత్యదేవుడు అని గుర్తిస్తాం. (మార్కు 12:30; ప్రక. 4:10, 11) కాబట్టి మనం బేషరతుగా యెహోవా దేవునికి లోబడాలి.—కీర్తనలు 86:11, 12 చదవండి.
17. సంక్షేమ పథకాల నుండి ప్రయోజనం పొందే విషయంలో యెహోవా ప్రజలు ఏమి గుర్తుపెట్టుకోవాలి?
17 చాలా దేశాల్లో ఆర్థిక సహాయం అవసరమున్నవారికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను చేపడుతుంది
లేదా సేవలను అందిస్తుంది. ఒక క్రైస్తవుడు వాటిని పొందేందుకు అర్హుడైతే అలాంటి సహాయాన్ని వినియోగించుకోవడంలో తప్పేమీలేదు. అయితే, ఆ సేవలను పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులకు తప్పుడు సమాచారాన్ని అందిస్తే, మనం పొరుగువారికి అబద్ధం చెప్పినట్లే.నిజాయితీగా ఉండడంవల్ల వచ్చే ఆశీర్వాదాలు
18-20. మన పొరుగువారికి నిజం చెప్పడంవల్ల ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి?
18 నిజాయితీగా ఉండడంవల్ల ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి. నిర్మలమైన మనస్సాక్షి ఉంటుంది కాబట్టి, ప్రశాంతంగా, మనశ్శాంతితో ఉండగలుగుతాం. (సామె. 14:30; ఫిలి. 4:6, 7) అలాంటి నిర్మలమైన మనస్సాక్షిని దేవుడు ఎంతో ఇష్టపడతాడు. అంతేకాక, మనం అన్ని విషయాల్లో నిజాయితీగా ఉంటే మనం దొరికిపోతామేమో, ఎవరైనా మనల్ని పట్టించేస్తారేమో అనే భయం మనల్ని వేధించదు.—1 తిమో. 5:24.
19 నిజాయితీగా ఉండడంవల్ల మరో ఆశీర్వాదం కూడ ఉంది. ‘సత్యవాక్యము చెప్పడం ద్వారా దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితుల్లో మమ్మును మేము మెప్పించుకొనుచున్నాం’ అని పౌలు చెప్పాడు. (2 కొరిం. 6:7, 8) బ్రిటన్‌లోని ఒక సాక్షి విషయంలో ఈ మాట నిజమైంది. కారు కొందామని వచ్చిన వ్యక్తికి ఆయన కారు గురించిన విశిష్టతలే కాక బయటకు కనిపించని లోపాలను కూడ వివరించాడు. కారును నడిపి చూసుకున్న తర్వాత ఆ వ్యక్తి, ‘మీరు యెహోవాసాక్షులా?’ అని మన సహోదరుణ్ణి అడిగాడు. ఆయన ఎందుకు అలా అడిగాడు? ఆ సహోదరుని నిజాయితీని, హుందాగా కనబడడాన్ని ఆయన గమనించాడు. దానివల్ల సహోదరుడు ఆయనకు చక్కని సాక్ష్యాన్ని ఇవ్వగలిగాడు.
20 మనమూ ఆయనలాగే అన్ని సందర్భాల్లో నిజాయితీగా ఉంటూ, నిజం మాట్లాడుతూ మన సృష్టికర్తను ఘనపరుస్తున్నామా? “కుయుక్తిగా నడుచుకొనక . . . అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నాము” అని పౌలు చెప్పాడు. (2 కొరిం. 4:2) కాబట్టి, మన పొరుగువారితో నిజం మాట్లాడడానికి శాయశక్తులా కృషిచేద్దాం. అలా చేస్తే మనం మన పరలోక తండ్రికి, ఆయన ప్రజలకు ఘనతను తెస్తాం.
మీరెలా జవాబిస్తారు?
• మన పొరుగువారు ఎవరు?
• మన పొరుగువారితో సత్యం మాట్లాడడం అంటే ఏమిటి?
• మనం నిజాయితీగా ఉండడంవల్ల దేవుణ్ణి ఎలా ఘనపరుస్తాం?
• నిజాయితీగా ఉండడంవల్ల ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి?
[అధ్యయన ప్రశ్నలు]
[17వ పేజీలోని చిత్రం]
మీరు చిన్న చిన్న తప్పులను ఒప్పుకోవడానికి సుముఖత చూపిస్తున్నారా?
[18వ పేజీలోని చిత్రం]
ఉద్యోగం కోసం పెట్టుకునే దరఖాస్తులో మీరు సరైన వివరాలనే ఇస్తున్నారా?