యెహోవాకు నేనేమి చెల్లించగలను?
యెహోవాకు నేనేమి చెల్లించగలను?
రూత్ డ్యానా చెప్పినది
1933వ సంవత్సరంలో హిట్లర్ అధికారంలోకి రావడం, పోప్ దాన్ని పవిత్ర సంవత్సరమని ప్రకటించడం, నేను పుట్టడం వంటి ఊహించని విపత్తులు జరిగాయని అమ్మ సరదాగా నన్ను ఆటపట్టించేది.
మా అమ్మానాన్నలు ఫ్రాన్స్‌లోని చారిత్రక ప్రాంతమైన లొరెయిన్‌లో ఉన్న యూట్స్ అనే పట్టణంలో ఉండేవారు. అది జర్మనీ సరిహద్దుకు దగ్గర్లో ఉంది. 1921లో మా అమ్మానాన్నల పెళ్ళైంది. అమ్మ నిష్ఠగల కాథలిక్ అయితే నాన్న ఓ ప్రొటస్టెంటు. 1922లో మా పెద్దక్క హెలెన్ పుట్టింది. మా అమ్మానాన్నలు ఆమెకు, పసితనంలోనే కాథలిక్ చర్చిలో బాప్తిస్మం ఇప్పించారు.
1925లో నాన్నకు జర్మన్ భాషలో దేవుని వీణ అనే పుస్తకం ఎవరో ఇచ్చారు. ఆ పుస్తకం చదివిన తర్వాత నాన్నకు అదే సత్యమని నమ్మకం కుదిరింది. నాన్న ఆ పుస్తక ప్రచురణకర్తలకు ఉత్తరం రాస్తే వారు బీబల్‌ఫార్షర్‌లను కలిసే ఏర్పాటు చేశారు. జర్మనీలో యెహోవాసాక్షులను అప్పట్లో అలా పిలిచేవారు. వెంటనే నాన్న తాను తెలుసుకున్నది వేరేవారికి చెప్పడం మొదలుపెట్టారు. అమ్మకు అది నచ్చలేదు. “నువ్వు ఏమన్నా చెయ్యి కానీ ఆ బీబల్‌ఫార్షర్‌లతో మాత్రం కలిసి తిరగొద్దు!” అని వినసొంపుగా ఉండే తన జర్మన్ భాషలో అనేది. ఏదేమైనా నాన్న తన నిర్ణయాన్ని మార్చుకోదల్చుకోలేదు. ఆయన 1927లో బాప్తిస్మం తీసుకొని బీబల్‌ఫార్షర్ అయ్యాడు.
దాంతో మా అమ్మను విడాకులు తీసుకోమని మా అమ్మమ్మ పోరుపెట్టడం మొదలుపెట్టింది. ఓ రోజు మాస్ జరుగుతున్నప్పుడు ఫాదిరీ, “అబద్ధ ప్రవక్త అయిన డ్యానాకు దూరంగా ఉండండి” అని చర్చికి వచ్చినవారిని హెచ్చరించాడు. మాస్ నుంచి తిరిగొచ్చాక అమ్మమ్మ మేడమీద నుంచి నాన్న మీద పూలకుండీ విసిరేసింది. ఆ పూలకుండీ ఆయన భుజం మీద పడింది, కొద్దిలో తప్పిపోయింది లేదంటే తలకు తగిలుండేదే. అలా జరగడంతో ‘మనుష్యులను హంతకులుగా మార్చేది సరైన మతం కాదు’ అని అమ్మకు అనిపించింది. అప్పటినుండి మా అమ్మ యెహోవాసాక్షులు ప్రచురించిన పుస్తకాలను చదవడం మొదలుపెట్టింది. తాను తెలుసుకుంది సత్యమని మనస్ఫూర్తిగా నమ్మి, 1929లో బాప్తిస్మం తీసుకుంది.
నేనూ మా అక్క యెహోవా నిజంగా ఉన్నాడని నమ్మడానికి మా అమ్మానాన్నలు శాయశక్తులా కృషిచేశారు. మాకు బైబిలు కథలు చదివి వినిపించి ఆ కథల్లోని వారు ఎందుకలా చేశారని అడిగేవారు. కూటాలకూ పరిచర్యకూ వెళ్ళడానికి, మాతో కలిసి బైబిలు పఠించడానికి నాన్న సాయంత్రాలు, రాత్రుళ్లు పనిచేసేందుకు ఒప్పుకునేవారు కాదు. దానివల్ల కుటుంబానికి వచ్చే రాబడి ఎంతో తగ్గినా ఆయనలా చేసేవారు.
కారు మబ్బులు కమ్ముకున్నాయి
మా అమ్మానాన్నలు స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ నుండి వచ్చే ప్రయాణ పైవిచారణకర్తలను, బెతెల్ సభ్యులను మా ఇంటికి పిలిచేవారు. మా ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న జర్మనీలోని తోటి విశ్వాసులు ఎన్ని కష్టాలుపడుతున్నారో వారు చెప్పేవారు. అప్పట్లో నాజీ ప్రభుత్వం యెహోవాసాక్షులను సామూహిక నిర్బంధ శిబిరాల్లోకి
పంపించి, వాళ్ళ పిల్లలను తల్లిదండ్రుల నుండి దూరం చేసేది.మా ముందున్న అగ్ని పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో మా అమ్మానాన్నలు మాకు నేర్పించారు. మాకు సహాయం చేయగల బైబిలు లేఖనాలను మాతో కంఠస్థం చేయించారు. “మీకు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి ఎదురైతే సామెతలు 3:5, 6లనూ, స్కూల్లో పరీక్షలు ఎదురైతే 1 కొరింథీయులు 10:13నూ, పోలీసులు మిమ్మల్ని మా నుండి వేరుచేస్తే సామెతలు 18:10నీ గుర్తుచేసుకోమని” చెప్పేవారు. 23వ, 91వ కీర్తనలను కంఠస్థం చేసి, యెహోవా నన్ను ఎల్లప్పుడూ కాపాడతాడని తెలుసుకున్నాను.
1940లో నాజీ జర్మనీ ఆల్‌సైస్-లొరెయిన్‌ను స్వాధీనం చేసుకుంది. ఆ కొత్త ప్రభుత్వం, పెద్దవారంతా నాజీ పార్టీలో చేరాలనే ఆజ్ఞ జారీ చేసింది. మా నాన్న ఒప్పుకోకపోయేసరికి జర్మన్ గూఢచారులు నాన్నను జైల్లో పెడతామని బెదిరించారు. సైనిక దుస్తులు కుట్టడానికి నిరాకరించినందుకు మా అమ్మనూ బెదిరించారు.
నాకు బడికి వెళ్లాలంటేనే భయమేసేది. ప్రతీరోజు, క్లాసులు మొదలయ్యే ముందు హిట్లర్ కోసం ప్రార్థించేవారు. ఆ తర్వాత “హిట్లర్‌కు జయం” అని సెల్యూట్ చేసి, కుడిచేయి ముందుకు చాపి జాతీయ గీతాన్ని పాడేవారు. హిట్లర్‌కు సెల్యూట్ చేయొద్దని చెప్పేబదులు మా అమ్మానాన్నలు మనస్సాక్షిని ఉపయోగించి నిర్ణయించుకోవడం నాకు నేర్పించారు. కాబట్టి, నా అంతట నేనే నాజీ సెల్యూట్ చేయకూడదని నిర్ణయించుకున్నాను. టీచర్లు నన్ను చెంపమీద కొట్టి బడి నుండి తీసేస్తామని బెదిరించేవారు. నాకు ఏడేళ్లు ఉన్నప్పుడు, మా బడిలో ఉన్న మొత్తం 12 మంది టీచర్ల ముందు నేను నిల్చోవాల్సివచ్చింది. హిట్లర్ సెల్యూట్ చేసేలా నన్ను బలవంతపెట్టడానికి వారు ప్రయత్నించారు. యెహోవా సహాయముంది కాబట్టి నేను వారికి తలొగ్గలేదు.
ఒక టీచరు మాయమాటలతో నన్ను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించింది. నేను మంచి విద్యార్థిననీ, నేనంటే తనకు ఎంతో ఇష్టమనీ, నన్ను బడి నుండి తీసేస్తే తాను ఎంతో బాధపడుతుందని నాతో అంది. ఆమె నాతో, “నువ్వు చెయ్యి పూర్తిగా చాచాల్సిన అవసరంలేదమ్మా, కొద్దిగా లేపితే చాలు. ‘హిట్లర్‌కు జయం’ అని కూడ చెప్పనక్కర్లేదు. పెదాలు కదుపుతూ నటిస్తే చాలు” అని చెప్పింది.
మా టీచరు నాతో అన్న మాటలు మా అమ్మకు చెబితే అమ్మ నాకు బబులోను రాజు నిలబెట్టిన ప్రతిమ ముందు నిల్చున్న ముగ్గురు హెబ్రీ యువకుల గురించి జ్ఞాపకం చేసింది. “వాళ్ళను ఏం చేయమన్నారు?” అని నన్ను అడిగింది. అప్పుడు నేను “నమస్కరించమన్నారు” అని అన్నాను. “అలా వంగి ప్రతిమకు నమస్కరించాల్సి వచ్చినప్పుడు వారు బూటు లేసులు ముడివేసుకోవడానికి వంగి ఉంటే వారు సరిగ్గా ప్రవర్తించినట్లౌతుందా? నువ్వే ఆలోచించు, నీకేది సరైందనిపిస్తే అదే చెయ్యి.” షద్రకు, మేషాకూ, అబేద్నెగోల్లాగే నేను కూడా యెహోవాకు మాత్రమే నమ్మకంగా ఉండాలనుకున్నాను.—దాని. 3:1, 13-18.
మా టీచర్లు నన్ను చాలాసార్లు బడి నుండి పంపించేశారు. అమ్మానాన్నల నుండి దూరం చేస్తామని భయపెట్టేవారు. నేను ఎంతో భయపడేదాన్ని కానీ అమ్మానాన్నలు నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ ఉండేవారు. నేను బడికి వెళ్తున్నప్పుడు అమ్మ నన్ను దగ్గరకు తీసుకొని యెహోవా కాపుదల కోసం ప్రార్థించేది. నేను ధైర్యంగా సత్యం వైపే నిలబడేలా యెహోవా బలాన్నిస్తాడని నాకు తెలుసు. (2 కొరిం. 4:7) వాళ్ళు మరీ ఒత్తిడి చేస్తే అసలేమీ భయపడకుండా ఇంటికి వచ్చేసెయ్ అని నాన్న చెప్పేవారు. ఆయన “నువ్వంటే మాకెంతో ఇష్టంరా, నువ్వెప్పుడూ మా చిట్టి తల్లివే,” “ఇది నీకూ యెహోవాకూ మధ్యవున్న విషయం” అని అనేవారు. ఆ మాటలు యెహోవాకు నమ్మకంగా ఉండాలన్న నా కోరికను బలపర్చాయి.—యోబు 27:5.
సాక్షుల ప్రచురణలు మా ఇంట్లో ఏమన్నా ఉన్నాయేమో సోదా చేయడానికీ అమ్మానాన్నలను విచారణ చేయడానికీ జర్మన్ గూఢచారులు అడపాదడపా మా ఇంటికి వచ్చేవారు. విచారణ కోసమని మా అమ్మను తీసుకెళ్లి చాలాసేపు ఉంచేసేవారు, నాన్ననూ అక్కనూ వాళ్ళ పనిచేసే చోట నుండి తీసుకెళ్తుండేవారు. నేను బడి నుండి ఇంటికి వెళ్లేసరికి అమ్మ ఇంట్లో ఉంటుందనే నమ్మకం ఉండేది కాదు. కొన్నిసార్లు మా పక్కింటావిడ, “వాళ్లొచ్చి మీ అమ్మను తీసుకెళ్ళారు” అని చెప్పేది. అప్పుడు నేను ఇంట్లో దాక్కొని, “వాళ్ళు అమ్మను చిత్రహింసలు పెడుతున్నారేమో? అసలు అమ్మను మళ్ళీ ఎప్పటికైనా చూస్తానా?” అని అనుకునేదాన్ని.
దేశ బహిష్కరణ
1943 జనవరి 28 తెల్లవారుజామున మూడున్నరకు జర్మన్ గూఢచారులు మమ్మల్ని నిద్రలేపారు. మమ్మల్ని దేశం నుండి బహిష్కరించకూడదంటే మేము నాజీ పార్టీలో చేరాలని బెదిరించారు. సిద్ధపడడానికి మూడు గంటల సమయం ఇచ్చారు. ఇలాంటి పరిస్థితి వస్తుందనే రోమా. 8:35-39.
మా అమ్మ వేరువేరు సంచుల్లో ఒక జత బట్టలు, బైబిలు ముందే పెట్టి ఉంచింది. కాబట్టి మాకిచ్చిన సమయంలో ప్రార్థన చేసుకున్నాం, ఒకరినొకరం ప్రోత్సహించుకున్నాం. ఏదీ ‘దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేదని’ మా నాన్న మాకు గుర్తుచేశారు.—జర్మన్ గూఢచారులు తాము చెప్పినట్లే తిరిగొచ్చారు. వృద్ధ సహోదరి ఆంగ్లేడ్ కన్నీటితో మాకు వీడ్కోలు చెప్పడం నేనెన్నడూ మరచిపోలేను. వారు మమ్మల్ని మెట్స్ రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లారు. రైలులో మూడు రోజులు ప్రయాణం చేసిన తర్వాత మేము పోలాండ్‌లోని కోక్వోవెట్సీ పట్టణంలో ఉన్న ఆష్‌విట్స్‌కు సంబంధించిన ఒక లేబర్ క్యాంపుకు చేరుకున్నాం. రెండు నెలల తర్వాత మమ్మల్ని గ్లివిట్స్ పట్టణంలోవున్న లేబర్ క్యాంపుకు తరలించారు. అది ఒకప్పుడు సన్యాసినుల మఠం. మేము మా విశ్వాసాన్ని వదులుకుంటున్నట్లు ఒక దస్తావేజు మీద సంతకం చేస్తే మా ఆస్తులు మాకు తిరిగి ఇచ్చి మమ్మల్ని విడుదల చేస్తామని నాజీలు ఆశ చూపించారు. అమ్మానాన్నలు దానికి ఒప్పుకోలేదు. “మీరు మీ ఇంటి ముఖం తిరిగి చూడరు” అని సైనికులు మాతో అన్నారు.
జూన్ నెలలో మమ్మల్ని స్విటోచ్లోవైస్ ప్రాంతానికి పంపించారు. అప్పుడు మొదలైన తలనొప్పి నాకు ఇప్పటికీ తగ్గలేదు. చేతికి పుండ్లు వస్తే డాక్టరు మత్తుమందు ఇవ్వకుండానే చాలా గోళ్లను తీసేశాడు. కాపలా కాసే వాళ్లు అడిగినవి నేను తెచ్చివ్వాల్సివచ్చేది కాబట్టి అప్పుడప్పుడూ ఓ బేకరీకి వెళ్తుండేదాన్ని. అక్కడున్న ఒకావిడ తినడానికి ఏమన్నా ఇచ్చేది. చెప్పుకోవడానికి ఏదైనా మంచి విషయం ఉందంటే అదొక్కటే.
అప్పటివరకు మిగిలిన ఖైదీలకు వేరుగా మా కుటుంబమంతా ఒకేచోట కలిసి ఉండేది. 1943 అక్టోబరులో జాబ్కోవైస్ పట్టణంలోని శిబిరానికి మమ్మల్ని పంపించారు. మేము దాదాపు అరవై మంది పెద్దలు, పిల్లలతో పాటు అటకపైన ఏర్పాటు చేసిన బంక్ బెడ్‌ల మీద పడుకునేవాళ్లం. ఎస్.ఎస్. (నాజీ దళం) మాకు దాదాపు పాచిపోయి, కంపు కొడుతున్న తిండి మాత్రమే ఇచ్చేవారు.
అన్ని కష్టాలు పడుతున్నా మేమెప్పుడూ ఆశ వదులుకోలేదు. యుద్ధం తర్వాత ఎంతో పరిచర్య చేయాల్సివుందని మేము కావలికోటలో చదివాం. అది చదివిన తర్వాత మేమెందుకు కష్టాలు పడుతున్నామో తెలిసింది, వాటన్నిటి నుండి త్వరలోనే బయటపడతామని కూడా అర్థమైంది.
మిత్రరాజ్య సేనలు నాజీ సైన్యాలను మట్టుపెడుతూ ముందుకు దూసుకొస్తున్నాయన్న వార్తలు మాకు అందాయి. 1945 ప్రారంభంలో ఎస్.ఎస్. మా శిబిరాన్ని మూసేయాలనుకుంది. ఫిబ్రవరి 19న మమ్మల్ని బలవంతంగా దాదాపు 240 కి.మీ. నడిపించుకుంటూ తీసుకెళ్ళారు. నాలుగు వారాల తర్వాత జర్మనీలోని స్టీన్‌ఫెల్స్ పట్టణానికి చేరుకున్నాం. అక్కడ గార్డులు ఖైదీలందరినీ గనిలోకి నడిపించారు. మాలో చాలామందిమి మమ్మల్ని చంపేస్తారనే అనుకున్నాం. కానీ అదే రోజు మిత్రరాజ్య సేనలు రావడంతో ఎస్.ఎస్. దళాలు పారిపోయాయి, అంతటితో మా అగ్నిపరీక్షలు ముగిశాయి.
లక్ష్యాలను సాధించాను
1945 మే 5న అంటే దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మట్టికొట్టుకుపోయి, ఒళ్ళంతా పేలతో యూట్స్‌లోని మా ఇంటికి చేరుకున్నాం. ఫిబ్రవరి నుండి మేము బట్టలు మార్చుకోలేదు కాబట్టి వాటిని కాల్చేశాం. “మన జీవితాల్లో అన్నిటికన్నా ఇదే అందమైన రోజు. మన దగ్గరేమీ లేదు. కనీసం మనం వేసుకున్న బట్టలూ మనవి కావు. ఇంత జరిగినా మనం నలుగురమూ విశ్వాసాన్ని కాపాడుకున్నాం. మనం రాజీపడలేదు” అని మా అమ్మ మాతో అనడం నాకింకా గుర్తుంది.
మూడు నెలలు స్విట్జర్లాండ్‌లో ఉండి తేరుకున్న తర్వాత మళ్లీ బడికి వెళ్లడం మొదలుపెట్టాను. అయితే ఈసారి బడి నుండి తీసేస్తారన్న భయం లేదు. అప్పటినుండి మేము బహిరంగంగా కలుసుకోగలుగుతున్నాం, ప్రకటనా పని కూడా చేయగలుగుతున్నాం. ఎన్నో ఏళ్ల క్రితం యెహోవాకు చేసుకున్న ప్రమాణానికి గుర్తుగా 1947 ఆగష్టు 28న బాప్తిస్మం తీసుకున్నాను. అప్పుడు నాకు పదమూడేళ్లు. మా నాన్న నాకు మోసల్ నదిలో బాప్తిస్మం ఇచ్చారు. నేను వెంటనే పయినీరు సేవ మొదలుపెడదామని అనుకున్నాను కానీ ముందు ఏదోక పని నేర్చుకోమని నాన్న పట్టుబట్టారు. అందుకని నేను కుట్టుపని నేర్చుకున్నాను. 1951లో నన్ను మా ఊరికి దగ్గర్లోని తయోన్విలి పట్టణానికి పయినీరుగా సేవచేయడానికి పంపించారు. అప్పుడు నాకు పదిహేడేళ్లు.
అదే సంవత్సరంలో నేను ప్యారిస్‌లో జరిగిన సమావేశానికి హాజరై మిషనరీ సేవ కోసం దరఖాస్తు పెట్టుకున్నాను. అప్పటికి నాకు వయసు సరిపోలేదు కాబట్టి సహోదరుడు నేథన్ నార్ నా దరఖాస్తు అలాగే ఉంచి “తర్వాత పరిశీలిస్తాం” అని అన్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న సౌత్ లాన్సింగ్‌లో జరిగే వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ 21వ తరగతికి హాజరవ్వమని 1952 జూన్‌లో ఆహ్వానం వచ్చింది.
గిలియడ్ పాఠశాల, ఆ తర్వాత
అదో గొప్ప అనుభవం! నలుగురిలో ఉన్నప్పుడు నా భాషలో మాట్లాడడమే నాకు కష్టమనిపించేది, అలాంటిది గిలియడ్ పాఠశాలలో ఇంగ్లీషులో మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఉపదేశకులు ప్రేమతో సహాయం చేశారు. సిగ్గు పడినప్పుడు నా చిరునవ్వు ప్రత్యేకంగా ఉండేది కాబట్టి, ఒక సహోదరుడు నాకొక పేరు పెట్టాడు.
మా స్నాతకోత్సవం న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియంలో 1953 జూలై 19న జరిగింది. నన్ను ఇడా కాండూసో అనే సహోదరితోపాటు ప్యారిస్‌కి పంపించారు. సంపన్నులైన ప్యారిస్ ప్రజలకు ప్రకటించాలంటే భయమేసేది. కానీ నేను వినయస్థులైన చాలామందితో బైబిలు పఠించగలిగాను. ఇడా 1956లో పెళ్ళి చేసుకుని ఆఫ్రికాకు వెళ్లిపోయింది. నేను మాత్రం ప్యారిస్‌లోనే ఉండిపోయాను.
1960లో నేను బెతెల్‌లో సేవచేస్తున్న ఓ సహోదరుణ్ణి పెళ్లి చేసుకున్నాను. మేము షోమొంట్, విషీల్లో ప్రత్యేక పయినీర్లముగా సేవచేశాం. ఐదేళ్ల తర్వాత నాకు క్షయరోగం రావడంతో పయినీరు సేవ ఆపేయాల్సివచ్చింది. పయినీరు సేవలోనే కొనసాగాలన్నది చిన్నప్పటి నుండి నా కోరిక కాబట్టి, అది ఆపేయాల్సివచ్చినప్పుడు తట్టుకోలేకపోయాను. కొంతకాలం తర్వాత నా భర్త వేరే ఆవిడ కోసం నన్ను వదిలేశాడు. కానీ నా బ్రతుకు చీకటైపోయిందనుకున్న ఆ సంవత్సరాల్లో నా తోటి సహోదరసహోదరీలు నాకు అండగా నిలిచారు. యెహోవా నా భారాన్ని భరిస్తూనే ఉన్నాడు.—కీర్త. 68:19.
నేనిప్పుడు ఫ్రాన్స్ బ్రాంచి కార్యాలయానికి దగ్గర్లోవున్న నార్మాండిలోని లూవ్యా ప్రాంతంలో ఉంటున్నాను. ఆరోగ్య సమస్యలున్నా ఇంతవరకూ యెహోవా నాకు తోడుగా ఉన్నందుకు సంతోషిస్తున్నాను. సానుకూల దృక్పథాన్ని కాపాడుకోవడానికి మా అమ్మానాన్నల పెంపకం నాకు ఇప్పటికీ సహాయం చేస్తుంది. మా అమ్మానాన్నలు యెహోవా నిజంగా ఉన్నాడని, ఆయనను నేను ప్రేమించగలనని, ఆయనతో నేను మాట్లాడగలనని, ఆయన నా ప్రార్థనలకు జవాబిస్తాడని నాకు నేర్పించారు. “యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?”—కీర్త. 116:12.
[6వ పేజీలోని బ్లర్బ్]
“ఇంతవరకూ యెహోవా నాకు తోడుగా ఉన్నందుకు సంతోషిస్తున్నాను”
[5వ పేజీలోని చిత్రం]
ఆరేళ్ల వయసులో గ్యాస్ మాస్క్‌తో
[5వ పేజీలోని చిత్రం]
పదహారేళ్లప్పుడు లక్సెంబర్గ్‌లో మిషనరీలతో, పయినీర్లతో కలిసి ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు
[5వ పేజీలోని చిత్రం]
1953లో జరిగిన సమావేశంలో అమ్మానాన్నలతో