‘సత్క్రియలు చేయడానికి ఆసక్తి చూపించండి!’
‘సత్క్రియలు చేయడానికి ఆసక్తి చూపించండి!’
“ఆయన [యేసు] సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్ను తానే మనకొరకు అర్పించుకొనెను.” —తీతు 2:14.
1. సా.శ. 33, నీసాను 10న దేవాలయానికి యేసు వచ్చినప్పుడు ఏమి చేశాడు?
అది సా.శ. 33, నీసాను 10. కొన్నిరోజుల తర్వాత యూదులు పస్కా పండుగను ఆచరిస్తారు. యెరూషలేము ఆలయానికి వచ్చిన చాలామంది పండుగ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. యేసు అక్కడికి వచ్చి ఏమి చేస్తాడు? ఆయన రెండవసారి వ్యాపారం చేస్తున్నవారినీ కొనేవారినీ అక్కడనుండి వెళ్లగొట్టాడని మత్తయి, మార్కు, లూకా అనే మూడు సువార్త రచయితలు రాశారు. యేసు రూకలు మార్చేవారి బల్లలను, గువ్వలను అమ్మేవారి పీఠలను పడద్రోశాడు. (మత్త. 21:12; మార్కు 11:15; లూకా 19:45, 46) ఆయన మూడు సంవత్సరాల క్రితం చేసినదాన్నే మళ్లీ చేశాడు కాబట్టి, ఆయన ఆసక్తి సన్నగిల్లలేదు అని చెప్పవచ్చు.—యోహా. 2:13-17.
2, 3. యేసు దేవాలయాన్ని పరిశుభ్రం చేస్తున్నప్పుడు మాత్రమే కాక, వేరే విషయాల్లో కూడ ఉత్సాహం చూపించాడని ఎలా చెప్పవచ్చు?
2 యేసు దేవాలయాన్ని పరిశుభ్రం చేస్తున్నప్పుడు మాత్రమే కాక తన దగ్గరికి వచ్చే కుంటివారిని గుడ్డివారిని బాగుచేస్తున్నప్పుడు కూడ ఉత్సాహం చూపించాడని మత్తయి సువార్త చెబుతోంది. (మత్త. 21:14) యేసు వేరే పనులను కూడ చేశాడని అంటే ఆయన ‘ప్రతిదినం దేవాలయంలో బోధిస్తూ వచ్చాడు’ అని లూకా తెలియజేస్తున్నాడు. (లూకా 19:47; 20:1) అలా ఆయన తనకు పరిచర్య అంటే ఎంతో ఆసక్తి ఉందని చూపించాడు.
తీతు 2:14) “సత్క్రియలయందాసక్తి” ఉందని మనం నేడు ఏయే విధాలుగా చూపించవచ్చు? యూదా రాజుల మంచి ఉదాహరణ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
3 యేసు “సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్ను తానే మనకొరకు అర్పించుకొనెను” అని అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలో చెప్పాడు. (ప్రకటనా పనిలో, బోధనా పనిలో ఉత్సాహం
4, 5. నలుగురు యూదా రాజులు సత్క్రియలను చేయడంలో ఏయే విధాలుగా ఉత్సాహాన్ని చూపించారు?
4 ఆసా, యెహోషాపాతు, హిజ్కియా, యోషీయాలు విగ్రహారాధనను రూపుమాపడానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఆసా “అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నతస్థలములను పాడుచేసి ప్రతిమలను పగులగొట్టి దేవతాస్తంభములను కొట్టి వేయిం[చాడు].” (2 దిన. 14:3) యెహోవా ఆరాధనపట్ల ఉత్సాహంతో యెహోషాపాతు “ఉన్నత స్థలములను దేవతాస్తంభములను యూదాలోనుండి తీసివే[శాడు].”—2 దిన. 17:6; 19:3. *
5 హిజ్కియా యెరూషలేములో ఏర్పాటు చేసిన పవిత్రమైన ఏడు దినాల పస్కా పండుగ ముగిసిన తర్వాత, “అక్కడనున్న ఇశ్రాయేలువారందరును యూదా పట్టణములకు పోయి, యూదా దేశమంతటను, బెన్యామీను ఎఫ్రాయిము మనష్షే దేశముల యందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలముచేసి, దేవతాస్తంభములను ముక్కలుగా నరికి, ఉన్నతస్థలములను బలిపీఠములను పడగొట్టిరి.” (2 దిన. 31:1) యోషీయాకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడే రాజయ్యాడు. బైబిలు ఆయన గురించి ఇలా చెబుతోంది: “తన యేలుబడి యందు ఎనిమిదవ సంవత్సరమున తానింకను బాలుడై యుండగానే అతడు తన పితరుడైన దావీదుయొక్క దేవునియొద్ద విచారించుటకు పూనుకొనినవాడై, పండ్రెండవయేట ఉన్నతస్థలములను దేవతాస్తంభములను పడగొట్టి, చెక్కిన విగ్రహములను పోతవిగ్రహములను తీసివేసి, యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను.” (2 దిన. 34:3) ఆ నలుగురు రాజులు సత్క్రియలను చేయడంలో ఉత్సాహం చూపించారని దీన్నిబట్టి అర్థమౌతుంది.
6. మన పరిచర్యను నమ్మకమైన నలుగురు రాజులు చేపట్టిన కార్యక్రమాలతో ఎందుకు పోల్చవచ్చు?
6 ఆ నలుగురు రాజులు విగ్రహారాధనను రూపుమాపేందుకు కృషిచేసినట్లే మనమూ విగ్రహారాధనను, అబద్ధమత బోధలను ప్రజలు విడిచిపెట్టేలా సహాయం చేసేందుకు కృషిచేస్తున్నాం. ఇంటింటి పరిచర్యలో పాల్గొనడంవల్ల మనం అన్నిరకాల ప్రజలను కలుసుకోగలుగుతున్నాం. (1 తిమో. 2:4) ఆసియాలోని ఓ అమ్మాయి, ఇంట్లో వాళ్లమ్మ అనేక విగ్రహాల ముందు పూజలు చేసేదని గుర్తుచేసుకుంటుంది. విగ్రహాలన్నిటినీ సత్యదేవుళ్లుగా పరిగణించలేమని ఆమెకు అనిపించేది. అందుకే, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆశతో తరచూ ప్రార్థించేది. ఒకసారి ఆమె ఇంటికి ఇద్దరు సాక్షులు వచ్చారు. వారు దేవునికి యెహోవా అనే గొప్ప పేరు ఉందని ఆమెకు చెప్పారు. విగ్రహాల గురించి బైబిలు ఏమి చెబుతుందో ఆమె తెలుసుకొని ఎంతో సంతోషించింది. ఆమె ఇప్పుడు యెహోవా గురించి, ఆయన చిత్తం గురించి ఇతరులకు ప్రకటించడానికి ఎంతో కష్టపడి పనిచేస్తూ చక్కని ఆసక్తిని చూపిస్తుంది.—కీర్త. 83:18; 115:4-8; 1 యోహా. 5:21.
7. యెహోషాపాతు రోజుల్లో దేశమంతటా సంచరించిన బోధకుల్లా మనం ఎలా ప్రకటించవచ్చు?
7 ఇంటింటి పరిచర్యలో మనకు కేటాయించిన ప్రాంతాన్ని ఎంత సమగ్రంగా పూర్తిచేస్తున్నాం? ఆసక్తికరంగా, యెహోషాపాతు తన పరిపాలనలోని మూడవ సంవత్సరంలో ఐదుగురు పెద్దలను, తొమ్మిదిమంది లేవీయులను, ఇద్దరు యాజకులను పంపించాడు. ప్రజలకు యెహోవా నియమాలు బోధించడానికి వారిని అన్ని పట్టణాలకు పంపించాడు. వారు ఎంత చక్కగా ప్రజలకు బోధించారంటే చుట్టూ ఉన్న జనాంగాలు కూడ యెహోవాకు భయపడ్డాయి. (2 దినవృత్తాంతములు 17:9, 10 చదవండి.) వేర్వేరు రోజుల్లో వివిధ సమయాల్లో ఇంటింటి పరిచర్యకు వెళ్లడంవల్ల ఒకే ఇంట్లో అనేకమందికి ప్రకటించగలుగుతాం.
8. మనం ప్రకటనా పనిని మరింత ఎక్కువగా ఎలా చేయవచ్చు?
8 మన కాలంలో అనేకమంది దేవుని సేవకులు తమ ఇళ్లను విడిచిపెట్టి ఉత్సాహవంతులైన ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. మీరూ వారిలాగే చేయగలరా? అలా వేరే
ప్రాంతాలకు వెళ్లలేని మనలోని కొందరు తమ ప్రాంతంలోనే ఉంటున్న వేరే భాష మాట్లాడే ప్రజలకు ప్రకటించడానికి ప్రయత్నించవచ్చు. రాన్ ఉదాహరణ తీసుకోండి. ఆయన ఉంటున్న ప్రాంతంలో అనేక దేశాలవారు నివసిస్తున్నారు కాబట్టి 81 ఏళ్ల వయసులో ఆయన 32 భాషల్లో పలకరించడం నేర్చుకున్నాడు! ఆయన ఇటీవల ఒక ఆఫ్రికన్ జంటను దారిలో కలిసినప్పుడు వారిని వారి మాతృభాషయైన యొరూబలో పలకరించాడు. వారు ఆశ్చర్యపోయి, ‘మీరు ఎప్పుడైనా ఆఫ్రికాకు వెళ్లారా’ అని ఆయనను అడిగారు. లేదని చెప్పినప్పుడు, ‘మరి మా భాషను మీరు ఎలా నేర్చుకున్నారు’ అని ఆయనను అడిగారు. దానివల్ల ఆయన వారికి చక్కని సాక్ష్యం ఇవ్వగలిగాడు. వెంటనే వారు ఆయన దగ్గర కొన్ని పత్రికలను తీసుకొని తమ చిరునామాను సంతోషంగా ఇచ్చారు. వారు బైబిలు అధ్యయనం చేసేలా ఆ సహోదరుడు వారి చిరునామాను వారికి దగ్గర్లోవున్న సంఘానికి పంపించాడు.9. పరిచర్యలో బైబిలును చదవడం ఎందుకు ప్రాముఖ్యం? ఒక ఉదాహరణ చెప్పండి.
9 యెహోషాపాతు ఆజ్ఞ ప్రకారం, దేశంలో సంచరించిన బోధకులు తమతోపాటు “యెహోవా ధర్మశాస్త్రగ్రంథమును” తీసుకెళ్లారు. బైబిలు దేవుని వాక్యం కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా మనం ప్రజలకు బైబిలు నుండి బోధించడానికి కృషిచేస్తాం. పరిచర్యలో బైబిలును తెరచి చూపించడానికి కృషిచేయడం ద్వారా మనం బైబిలు ఎంత ప్రాముఖ్యమో చూపిస్తాం. ఒకామె లిండా అనే సాక్షితో, తన భర్తకు పక్షవాతం వచ్చింది కాబట్టి తాను ఆయన దగ్గరే ఉండాలని చెప్పింది. “నేనేమి చేశానని దేవుడు ఇలా జరుగనిచ్చాడు?” అని ఆమె బాధపడింది. దానికి లిండా, “మీకు ధైర్యాన్నిచ్చే ఓ మాట చెప్పనా?” అని అంది. ఆ తర్వాత లిండా యాకోబు 1:13 చదివి, “మనం, మన ఆత్మీయులూ బాధపడుతున్నారంటే దానర్థం దేవుడే మనల్ని శిక్షిస్తున్నాడని కాదు” అని చెప్పింది. అప్పుడు ఆ ఇంటావిడ లిండాను ఆప్యాయంగా హత్తుకుంది. లిండా ఇలా చెబుతోంది: “బైబిలు లేఖనాలను చూపించి నేను ఆమెను ఓదార్చగలిగాను. మనం కొన్నిసార్లు చదివే లేఖనాలు వారు అంతకుముందు ఎప్పుడూ వినుండరు.” అలా మాట్లాడడంవల్ల లిండా ఆ ఇంటావిడతో క్రమంగా బైబిలు అధ్యయనం చేయగలిగింది.
ఉత్సాహంగా సేవచేసే యౌవనస్థులు
10. మన కాలంలోని క్రైస్తవ యౌవనస్థులకు యోషీయా ఎలా ఓ మంచి మాదిరి ఉంచాడు?
10 యోషీయా ఉదాహరణను మళ్లీ చూద్దాం. ఆయన చిన్నప్పటి నుండే సత్యారాధనలో భాగం వహించాడు. దాదాపు 20 ఏళ్లున్నప్పుడు విగ్రహారాధనను రూపుమాపడానికి ఆయన ఎన్నో చర్యలు చేపట్టాడు. (2 దినవృత్తాంతములు 34:1-3 చదవండి.) నేడు అనేకమంది యౌవనస్థులు రాజ్య పరిచర్యలో అలాంటి ఉత్సాహాన్నే చూపిస్తున్నారు.
11-13. యెహోవాకు ఉత్సాహంగా సేవచేస్తున్న నేటి యౌవనస్థుల నుండి మనం ఏ పాఠాలు నేర్చుకుంటాం?
11 ఇంగ్లండ్‌లో ఉంటున్న హానా, దగ్గర్లోని మరో పట్టణంలో ఫ్రెంచ్ భాషా గుంపు మొదలైందని తెలుసుకొని పాఠశాలలో ఫ్రెంచ్ భాష నేర్చుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు ఆమెకు 13 ఏళ్లు. అక్కడ జరుగుతున్న కూటాలకు తనకు తోడుగా వెళ్లేందుకు వాళ్లనాన్న ఒప్పుకున్నాడు. ఇప్పుడు హానాకు 18 ఏళ్లు. ఆమె క్రమ పయినీరుగా ఫ్రెంచ్ భాషలో ఉత్సాహంగా ప్రకటిస్తోంది. మీరూ మరో భాషను నేర్చుకొని ప్రజలు యెహోవా గురించి తెలుసుకునేందుకు సహాయపడగలరేమో ఆలోచించండి.
12దేవుని మహిమపర్చే లక్ష్యసాధనకు కృషిచేయండి (ఆంగ్లం) అనే వీడియోను రేచల్ ఎంతో ఇష్టపడింది. 1995లో తాను యెహోవా సేవను ప్రారంభించినప్పుడు తాను ఏమనుకునేదో చెబుతూ, “నేను సత్యంలో ప్రగతి సాధిస్తున్నాననే అనుకున్నాను. కానీ నేను ఇన్నేళ్లు పెద్దగా ఏమీ చేయకుండానే గడిపేశానని ఆ నాటకం చూసిన తర్వాతే నాకు అర్థమైంది. నేను సత్యం కోసం పోరాడాలనీ వ్యక్తిగత అధ్యయనం, సేవా ఇంకా ఎక్కువగా ఎలా చేయాలో ఆలోచించి దాని కోసం కృషిచేయాలనీ తెలుసుకున్నాను.” ఇప్పుడు మరింత ఉత్సాహంతో యెహోవాను సేవిస్తున్నానని తనకు అనిపిస్తోంది. దానివల్ల ఆమె ఎలా ప్రయోజనం పొందింది? “యెహోవాకు నేను మరింత దగ్గరయ్యాను. అర్థవంతంగా ప్రార్థన చేయగలుగుతున్నాను, నేను బైబిలును లోతుగా అధ్యయనం చేసి మరింత ఆనందం పొందుతున్నాను, బైబిల్లోని సంఘటనలు నా కళ్ల ముందే జరుగుతున్నట్లు ఊహించుకోగలుగుతున్నాను. దానివల్ల నేను పరిచర్యను ఎంతో ఆనందంగా చేస్తున్నాను. యెహోవా వాక్యం నుండి ఇతరులు ఓదార్పు పొందడం చూసి ఎంతో సంతృప్తిని పొందుతున్నాను.”
13 లూక్ అనే మరో యువకుడు, యువత ఇలా అడుగుతోంది—నేను నా జీవితంలో ఏమి చేస్తాను? (ఆంగ్లం) అనే వీడియోను చూసి ఎంతో ప్రోత్సాహాన్ని పొందాడు. దీన్ని చూసిన తర్వాత లూక్ ఇలా రాశాడు: “నా జీవితాన్ని నేనెలా గడుపుతున్నానో ఒక్కసారి ఆలోచించాలనిపించింది.” ఆయన ఇలా ఒప్పుకున్నాడు: “మొదట పైచదువులు చదివి, డబ్బు సంపాదించి జీవితంలో స్థిరపడిన తర్వాత ఆధ్యాత్మిక లక్ష్యాల గురించి ఆలోచించాలనే ఒత్తిడిని గతంలో ఎదుర్కొన్నాను. అలాంటి ఒత్తిడివల్ల యెహోవాకు దగ్గరకాము సరికదా మానసికంగా కూడ కృంగిపోతాం.” యువ సహోదర సహోదరీల్లారా, హానా చేసినట్లే పాఠశాల్లో మీరు నేర్చుకున్నవాటిని పరిచర్యలో మరింత చేసేందుకు ఉపయోగించగలరేమో ఒకసారి ఆలోచించండి. రేచెల్‌లా దేవుణ్ణి నిజంగా ఘనపర్చే లక్ష్యాలను సాధించేందుకు ఉత్సాహంగా కృషిచేయగలరేమో ఆలోచించండి. లూక్‌లా మీరు కూడ అనేకమంది యౌవనస్థులను తప్పుదారి పట్టిస్తున్న విషయాలకు దూరంగా ఉండండి.
ఉత్సాహంగా హెచ్చరికలను లక్ష్యపెట్టండి
14. యెహోవా తమ ఆరాధనను అంగీకరించాలంటే ఆయన ప్రజలు ఎలా ఉండాలి? అలా ఉండడం మన కాలంలో ఎందుకు కష్టం?
14 తమ ఆరాధనను యెహోవా అంగీకరించాలంటే ఆయన ప్రజలు పరిశుభ్రంగా ఉండాలి. యెషయా ఇలా హెచ్చరించాడు: “పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దానియొద్దనుండి [బబులోను] తొలగిపోవుడి యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి.” (యెష. 52:11) యెషయా ఆ మాటలు రాసిన ఎన్నో సంవత్సరాల ముందు, మంచి రాజైన ఆసా యూదా నుండి లైంగిక దుర్నీతిని పూర్తిగా తీసివేయడానికి ఎన్నో చర్యలు తీసుకున్నాడు. (1 రాజులు 15:11-13 చదవండి.) శతాబ్దాల తర్వాత, అపొస్తలుడైన పౌలు ‘సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన సొత్తుగా చేసుకునేలా’ యేసు వారిని పవిత్రపరిచేందుకు తనను తాను అర్పించుకున్నాడని తీతుకు రాశాడు. (తీతు 2:14) ప్రాముఖ్యంగా యౌవనస్థులకు మన కాలంలోవున్న భ్రష్టుపట్టిన సమాజంలో నైతికంగా పరిశుభ్రంగా ఉండడం అంత సులభమేమీ కాదు. ఉదాహరణకు, పెద్దాచిన్నా అనే తేడా లేకుండా దేవుని సేవకులందరూ అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డులమీద, టీవీలో, సినిమాలో, మరిముఖ్యంగా ఇంటర్నెట్‌లో కనిపించే అశ్లీల చిత్రాలవల్ల తమ మనసులు పాడవకుండా ఉండేందుకు పోరాడాలి.
15. మనం చెడు పట్ల ఎలా అసహ్యాన్ని పెంచుకోవచ్చు?
15 మనం ఉత్సాహంగా దేవుని హెచ్చరికలను లక్ష్యపెడితే, చెడును అసహ్యించుకుంటాం. (కీర్త. 97:10; రోమా. 12:9) అశ్లీల చిత్రాలు, సాహిత్యానికి ఉన్న “బలమైన ఆకర్షణా శక్తి నుండి బయటపడాలంటే” మనం వాటిని అసహ్యించుకోవాలని ఒక క్రైస్తవుడు చెప్పాడు. అయస్కాంత శక్తి వల్ల ఒకదానితో ఒకటి అతుక్కుపోయిన లోహపు ముక్కలను వేరు చేయాలంటే అంతకన్నా ఎక్కువ శక్తి అవసరమౌతుంది. అలాగే, అశ్లీల చిత్రాలు, సాహిత్యాన్ని చూడాలనే శోధన నుండి బయటపడాలంటే మనం ఎంతో కృషిచేయాలి. అవి ఎంత నష్టం కలుగజేస్తాయో అర్థం చేసుకుంటే మనం వాటి పట్ల ఏవగింపును పెంచుకోగలుగుతాం. ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలను చూసే అలవాటును మానుకోవడానికి ఒక సహోదరుడు ఎంతో కృషిచేశాడు. ఆయన తన కంప్యూటర్‌ను కుటుంబమంతటికీ కనిపించే స్థలంలో పెట్టాడు. అంతేకాక, తనను తాను పరిశుభ్రపరచుకొని సత్క్రియల పట్ల ఆసక్తి చూపించాలనే పట్టుదలను పెంచుకున్నాడు. ఆయన మరో చర్య కూడ తీసుకున్నాడు. ఆయన తన పని కోసం ఇంటర్నెట్‌ను వాడడం తప్పదు. కాబట్టి తన భార్య పక్కన ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఉపయోగించాలనుకున్నాడు.
మంచిగా ప్రవర్తించడంవల్ల ప్రయోజనం
16, 17. మన మంచి ప్రవర్తన చూసే వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఓ ఉదాహరణ చెప్పండి.
16 యెహోవాను సేవిస్తున్న యువతీయువకులు ఎంతో చక్కని స్ఫూర్తిని కనబరుస్తున్నారు. చూసేవారిని అది ఎంతో ఆకట్టుకుంటుంది! (1 పేతురు 2:12 చదవండి.) ముద్రణా యంత్రాన్ని బాగుచేయడానికి లండన్ బెతెల్‌కు ఓ వ్యక్తి వచ్చాడు. ఓ రోజు అక్కడ పనిచేసిన తర్వాత యెహోవాసాక్షులమీద తనకున్న అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. స్థానిక సాక్షుల దగ్గర బైబిలు అధ్యయనం చేస్తున్న ఆయన భార్య ఆయనలో వచ్చిన మార్పును గమనించింది. అంతకుముందు సాక్షులు తన ఇంటికి వస్తే ఆయన ఇష్టపడేవాడు కాదు. కానీ బెతెల్‌లో పనిచేసిన తర్వాత వారు దయతో వ్యవహరించిన తీరును ఎంతగానో మెచ్చుకుంటున్నాడు. అక్కడ ఎవరూ బూతులు మాట్లాడలేదనీ, ప్రతీఒక్కరూ ఓపిగ్గా పనిచేస్తుంటారని, అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని ఆయన చెప్పాడు. యువతీయువకులు జీతాలు తీసుకోకుండా ఉత్సాహంగా పనిచేయడం, సువార్త ప్రకటనా పనికి చేయూతనిచ్చేందుకు స్వచ్ఛందంగా తమ శక్తిని, సమయాన్ని వెచ్చించడం ఆయనను ఎంతగానో ఆకట్టుకుంది.
17 ఉద్యోగాలు చేస్తూ తమ ఇంటిని పోషించుకునే సహోదరసహోదరీలు కూడ మంచి పనివారిగా పేరుతెచ్చుకున్నారు. (కొలొ. 3:23, 24) వారు నమ్మకంగా పనిచేయడాన్ని చూసి వారిని పోగొట్టుకోవడానికి యజమానులు ఇష్టపడరు.
18. మనకు “సత్క్రియలయందాసక్తి” ఉందని ఎలా చూపించవచ్చు?
18 యెహోవాపట్ల నమ్మకముంచడం ద్వారా, ఆయన నిర్దేశాలకు లోబడడం ద్వారా, కూటాలు జరుపుకునే స్థలాలను బాగా చూసుకోవడం ద్వారా మనం యెహోవా ఇంటి పట్ల ఆసక్తి చూపించవచ్చు. అంతేకాక, రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో మనం చేయగలిగినదంతా చేయడానికి కృషిచేయాలి. మనం పెద్దవాళ్లమైనా, చిన్నవాళ్లమైనా మన ఆరాధనకు సంబంధించిన నైతిక ప్రమాణాలకు కట్టుబడివుండేందుకు మనం చేయగలిగినదంతా చేసినప్పుడు ఎన్నో ప్రయోజనాలను పొందుతాం. ‘సత్క్రియలయందాసక్తిగల’ ప్రజలమనే పేరు మనకు ఉంటుంది.—తీతు 2:14.
[అధస్సూచి]
^ పేరా 4 ఆసా అబద్ధ దేవతల ఆరాధనకు సంబంధించిన ఉన్నత స్థలాలను తీసివేసివుంటాడు కానీ యెహోవా ఆరాధకుల ఉన్నత స్థలాలను తీసివేయలేదు. లేక ఆసా పరిపాలనలోని చివరి రోజుల్లో ప్రజలు ఉన్నత స్థలాలను తిరిగి నిర్మించివుంటారు. వాటిని ఆయన కుమారుడైన యెహోషాపాతు పడగొట్టాడు.—1 రాజు. 15:14; 2 దిన. 15:17.
బైబిలు ఉదాహరణల నుండి, మనకాలంలోని కొన్ని ఉదాహరణల నుండి మీరు
• ప్రకటనా, బోధనా పనిలో ఉత్సాహం చూపించే విషయంలో,
• క్రైస్తవ యువతీయువకులు “సత్క్రియలయందాసక్తి” చూపించే విషయంలో,
• మనసుల్ని భ్రష్టుపట్టించే అలవాట్ల నుండి బయటపడే విషయంలో ఏమి నేర్చుకోవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
[13వ పేజీలోని చిత్రం]
మీరు పరిచర్యలో ఎల్లప్పుడూ బైబిలును ఉపయోగిస్తున్నారా?
[15వ పేజీలోని చిత్రం]
పాఠశాలలో మరో భాషను మీరు నేర్చుకుంటే మరింత ఎక్కువగా పరిచర్యను చేయగలుగుతారు