కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఆయనలో గుప్తములైవున్న’ సర్వసంపదల కోసం అన్వేషించండి

‘ఆయనలో గుప్తములైవున్న’ సర్వసంపదల కోసం అన్వేషించండి

‘ఆయనలో గుప్తములైవున్న’ సర్వసంపదల కోసం అన్వేషించండి

“బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.”—కొలొ. 2:3.

1, 2. (ఎ) ఏ కళాకృతులు 1922లో వెలుగులోకి వచ్చాయి? అవి ఇప్పుడు ఎక్కడ మగ్గుతున్నాయి? (బి) దేవుని వాక్యం ఏమి చేయమని ప్రతీ ఒక్కరినీ ఆహ్వానిస్తోంది?

నిక్షిప్తంగా ఉన్న సంపదలు వెలుగులోకి రావడం గురించిన వార్తలు వార్తాపత్రికల్లో ప్రముఖంగా వస్తుంటాయి. ఉదాహరణకు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఎన్నో ఏళ్లు కష్టపడిన బ్రిటీష్‌ పురావస్తుశాస్త్రజ్ఞుడు హోవర్డ్‌ కార్టర్‌ 1922లో అద్భుతమైన సంపదను కనుగొన్నాడు. సుమారు 5,000 వస్తువులున్న ఫరో టుటెన్‌ఖామన్‌ సమాధిని ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు. దాన్ని కట్టి ఎన్నో ఏళ్లు గడిచిన అది దాదాపు చెక్కుచెదరలేదు.

2 కార్టర్‌ కనుగొన్న కళాకృతులు అద్భుతమైనవే అయినా, వాటిలో చాలావరకు ఇప్పుడు మ్యూజియమ్‌లలో లేదా కొంతమంది వ్యక్తుల దగ్గర మగ్గుతున్నాయి. అవి సృజనాత్మకంగా ఉన్నా, చరిత్ర గురించి తెలుసుకోవడానికి పనికొచ్చినా వాటిలో మన రోజువారీ జీవితంలో పనికొచ్చేవి పెద్దగా లేవు లేదా అసలు లేనేలేవు. అయితే, మనకు ఎంతో ఉపయోగపడే సంపదల కోసం వెతకమని బైబిలు మనలో ప్రతీ ఒక్కరినీ ఆహ్వానిస్తోంది. అలా వెతికితే అమూల్యమైన వస్తు సంపదలన్నిటికన్నా ఎంతో విలువైనదాన్ని మనం కనుగొంటాం.—సామెతలు 2:1-6 చదవండి.

3. యెహోవా తన ఆరాధకులను వెతకమంటున్న సంపదలవల్ల మనం ఎలాంటి ప్రయోజనాలను పొందుతాం?

3 యెహోవా తన సేవకులను వెదకమంటున్న సంపదలు ఎంత విలువైనవో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి సంపదల్లో “యెహోవాయందైన భయము” ఒకటి. అపాయకరమైన ఈ కాలాల్లో అది మనల్ని రక్షించి, కాపాడుతుంది. (కీర్త. 19:9) “దేవుని గూర్చిన విజ్ఞానము” కనుగొనడంవల్ల మహోన్నతునితో మన అనుబంధం పెరుగుతుంది. అంతకన్నా గొప్ప గౌరవం మానవులకు మరొకటి లేదు. దేవుడు ఇచ్చిన తెలివి, జ్ఞానం, వివేచన వంటి సంపదలతో మనం జీవిత సమస్యలను, చింతలను ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. (సామె. 9:10, 11) అలాంటి అమూల్యమైన సంపదలను మనం ఎలా కనుగొనవచ్చు?

ఆ సంపదలను ఎందుకు వెతకాలి?

4. దేవుడు వాగ్దానం చేసిన ఆధ్యాత్మిక సంపదలను మనం ఎలా కనుగొనవచ్చు?

4 పురావస్తుశాస్త్రజ్ఞులు, అన్వేషకుల్లా మనం సంపదల కోసం అన్నిచోట్లా వెతకాల్సిన అవసరంలేదు. ఎందుకంటే, ఆధ్యాత్మిక సంపదలు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నాయో మనకు తెలుసు. దేవుని వాక్యం నిధివున్న చోటును తెలిపే మ్యాపులాంటిది. ఆయన వాగ్దానం చేసిన సంపదలను మనం ఖచ్చితంగా ఎక్కడ కనుగొనవచ్చో అది తెలియజేస్తుంది. క్రీస్తు గురించి ప్రస్తావిస్తూ అపొస్తలుడైన పౌలు, “బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి” అని రాశాడు. (కొలొ. 2:3) ఆ వచనాన్ని చదువుతున్నప్పుడు మనం ఈ ప్రశ్నల గురించి ఆలోచించాలి: ‘మనం ఆ సంపదల కోసం ఎందుకు వెతకాలి? అవి క్రీస్తులో ఎలా “గుప్తములై” ఉన్నాయి? మనం వాటిని ఎలా కనుగొనవచ్చు?’ వీటి జవాబులను తెలుసుకునేందుకు మనం అపొస్తలుడైన పౌలు మాటలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం.

5. పౌలు ఆధ్యాత్మిక సంపదల గురించి ఎందుకు రాశాడు?

5 పౌలు ఆ మాటలను కొలొస్సయిలోని తోటి విశ్వాసులకు రాశాడు. ‘వారు ప్రేమయందు అతుకబడి, హృదయములలో ఆదరణపొందేలా’ వారి కోసం పోరాడుతున్నానని వారితో అన్నాడు. (కొలొస్సయులకు 2:1, 2 చదవండి.) ఆయన వారి గురించి ఎందుకు అంతగా ఆందోళనపడ్డాడు? గ్రీకు తత్త్వజ్ఞానాన్ని ప్రోత్సహించే లేదా మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడం మానకూడదని ప్రోత్సహించే వారి ప్రభావం అక్కడి సహోదరులమీద పడివుంటుందని పౌలుకు తెలుసు. అందుకే ఆయన అక్కడి సహోదరులకు ఇలా గట్టిగా హెచ్చరించాడు: “ఆయనను [క్రీస్తును] అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.”—కొలొ. 2:8.

6. పౌలు ఇచ్చిన ఉపదేశం గురించి మనం ఎందుకు ఆలోచించాలి?

6 మనం కూడ సాతాను, అతని దుష్ట వ్యవస్థ నుండి అలాంటి ప్రభావాలనే ఎదుర్కొంటున్నాం. మానవతావాదం, పరిణామ సిద్ధాంతంతోపాటు మానవ తత్వజ్ఞానం ప్రజల ఆలోచనలను, నైతిక విలువలను, లక్ష్యాలను, జీవనశైలిని మలచుతున్నాయి. ప్రజాదరణ పొందిన అనేక పండగలను అబద్ధ మతాలే ప్రోత్సహిస్తున్నాయి. వినోద పరిశ్రమ ప్రజల తప్పుడు కోరికలను తృప్తిపరచే కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఇంటర్నెట్‌లోని అనేక విషయాలు చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరికీ ప్రమాదకరంగా తయారయ్యాయి. ఈ విషయాలను, మరితర లోక పోకడలను పదేపదే చూడడంవల్ల యెహోవా నిర్దేశంపట్ల మనకున్న అభిప్రాయం మారి, వాస్తవమైన జీవితం మీద మనకున్న పట్టును కోల్పోవచ్చు. (1 తిమోతి 6:17-19 చదవండి.) కాబట్టి, మనం సాతాను ఉరుల్లో పడకూడదంటే పౌలు కొలొస్సయులకు రాసిన మాటలను అర్థంచేసుకోవాలి, వాటి గురించి జాగ్రత్తగా ఆలోచించాలి.

7. కొలొస్సయులకు అవసరమైన ఏ రెండు విషయాలు పౌలు చెప్పాడు?

7 పౌలు కొలొస్సయులకు రాసిన మాటలను మరోసారి పరిశీలిద్దాం. ఆ వచనాల్లో పౌలు, కొలొస్సయుల విషయంలో తనకున్న ఆందోళనను వ్యక్తంచేసిన తర్వాత, వారిని ఓదార్చి, ప్రేమలో ఐక్యపరచే రెండు విషయాలు చెప్పాడు. మొదటిగా, వారు ‘సంపూర్ణ గ్రహింపుతో కూడిన’ నమ్మకంతో ఉండాలని ఆయన చెప్పాడు. తమ విశ్వాసం స్థిరంగా ఉండేలా తాము లేఖనాలను సరిగ్గా అర్థంచేసుకున్నామనే పూర్తి నమ్మకం వారికి ఉండాలి. (హెబ్రీ. 11:1) రెండవదిగా, వారు ‘దేవుని మర్మాన్ని స్పష్టంగా తెలుసుకోవాలని’ లేక ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలని చెప్పాడు. ప్రాథమిక సత్యాల గురించిన జ్ఞానంతో సరిపెట్టుకోక దేవుని గురించిన లోతైన విషయాలను బాగా అర్థం చేసుకోవాలి. (హెబ్రీ. 5:13, 14) ఆ మంచి సలహా కొలొస్సయులకే కాదు, మనకూ ఎంతో అవసరం. అయితే మనం అలాంటి నమ్మకాన్ని, ఖచ్చితమైన జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవచ్చు? యేసుక్రీస్తు గురించి పౌలు చెప్పిన మాటల్లో దానికి జవాబువుంది. “బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి” అని ఆయన అన్నాడు.

క్రీస్తులో ‘గుప్తములైవున్న’ సంపదలు

8. క్రీస్తులో “గుప్తములై” ఉండడం అంటే ఏమిటో వివరించండి.

8 తెలివి, జ్ఞానం అనే సంపదలు క్రీస్తులో “గుప్తములై” ఉన్నాయని చెప్పినంత మాత్రాన వాటిని సంపాదించడం అసాధ్యమని కాదు. వాటిని పొందాలంటే మనం ఎంతో ప్రయాసపడాలని, యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలని దానర్థం. యేసు కూడ తన గురించి ఇలా చెప్పాడు: “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.” (యోహా. 14:6) అందుకే దేవుని గురించిన జ్ఞానం సంపాదించాలంటే మనం యేసు ఇచ్చే సహాయాన్ని తీసుకుని, ఆయన నిర్దేశాన్ని పాటించాలి.

9. యేసు ఎలాంటి ప్రాముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నాడు?

9 యేసు, తాను “మార్గము” అనే కాక, ‘సత్యము, జీవము’ అని కూడ చెప్పాడు. కాబట్టి, తండ్రిని సమీపించడానికి ఆయన కేవలం మార్గమే కాదు. బైబిలు సత్యాన్ని అవగాహన చేసుకోవడానికి, నిత్యజీవం పొందడానికి కూడ ఆయన చాలా ప్రాముఖ్యమని తెలుస్తుంది. వెలకట్టలేని ఆధ్యాత్మిక సంపదలు బైబిలును జాగ్రత్తగా పరిశీలించేవారి కోసం యేసులో గుప్తములైవున్నాయి. మన భవిష్యత్తు నిరీక్షణను, దేవునితో మన సంబంధాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేసే కొన్ని సంపదలు మనం ఇప్పుడు పరిశీలిద్దాం.

10. కొలొస్సయులు 1:19; 2:9లో మనకు యేసు గురించి ఏమి తెలుస్తుంది?

10“దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.” (కొలొ. 1:19; 2:9) యేసు తన పరలోక తండ్రితో ఎన్నో యుగాలు గడిపాడు కాబట్టి, తన తండ్రి గురించి, ఆయన చిత్తం గురించి యేసుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. యేసు భూమ్మీదున్నప్పుడు, తన తండ్రి తనకు బోధించినవాటిని ఇతరులకు బోధించాడు. తన తండ్రి నేర్పించిన లక్షణాలను క్రియల్లో చూపించాడు. అందుకే ఆయన, “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పగలిగాడు. (యోహా. 14:9) దేవుని వివేకము, జ్ఞానము క్రీస్తులో గుప్తములైవున్నాయి లేదా ఆయనలో నివసిస్తున్నాయి. యెహోవా గురించి తెలుసుకోవాలంటే సాధ్యమైనంతమట్టుకు యేసు గురించి జాగ్రత్తగా తెలుసుకోవడం తప్ప మరో మంచి మార్గంలేదు.

11. యేసుకూ, బైబిలు ప్రవచనాలకూ మధ్యవున్న సంబంధమేమిటి?

11“యేసునుగూర్చిన సాక్ష్యము ప్రవచనసారము.” (ప్రక. 19:10) బైబిల్లోని అనేక ప్రవచనాలు ఆయన చుట్టూ అల్లుకొనివున్నాయని దీన్నిబట్టి తెలుస్తుంది. మెస్సీయ రాజ్యానికి సంబంధించి యేసు పాత్రను పరిశీలిస్తేనే, ఆదికాండము 3:15లో యెహోవా చెప్పిన మొదటి ప్రవచనం నుండి ప్రకటనా గ్రంథంలోని అద్భుతమైన దర్శనాల వరకున్న బైబిలు ప్రవచనాలను సరిగ్గా అర్థంచేసుకోవచ్చు. అందుకే, వాగ్దానం చేయబడిన మెస్సీయ యేసేనని ఒప్పుకోనివారికి హెబ్రీ లేఖనాల్లోని అనేక ప్రవచనాలు అర్థంకావు. అంతేకాక, అనేక మెస్సీయ ప్రవచనాలున్న హెబ్రీ లేఖనాలను పట్టించుకోనివారు యేసు కేవలం ఓ గొప్ప వ్యక్తి మాత్రమే అని ఎందుకు అనుకుంటారో దీన్నిబట్టి తెలుస్తుంది. యేసు గురించిన జ్ఞానాన్ని సంపాదించుకుంటే భవిష్యత్తులో నెరవేరాల్సిన బైబిలు ప్రవచనాలను దేవుని ప్రజలు అర్థంచేసుకోగలుగుతారు.—2 కొరిం. 1:20.

12, 13. (ఎ) యేసు ఎలా ‘లోకమునకు వెలుగుగా’ ఉన్నాడు? (బి) మతసంబంధమైన అంధకారం నుండి క్రీస్తు అనుచరులు విడిపించబడ్డారు కాబట్టి, వారికి ఏ బాధ్యత ఉంది?

12“నేను లోకమునకు వెలుగును.” (యోహాను 8:12; 9:5 చదవండి.) యేసు భూమ్మీద పుట్టడానికి ఎంతోకాలం ముందే ప్రవక్తయైన యెషయా, “చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణచ్ఛాయగల దేశనివాసులమీద వెలుగు ప్రకాశించును” అని రాశాడు. (యెష. 9:2) యేసు ప్రకటనా పనిని ఆరంభించి, “పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడి” అని చెప్పినప్పుడు యేసు విషయంలో ఆ ప్రవచనం నెరవేరిందని అపొస్తలుడైన మత్తయి వివరించాడు. (మత్త. 4:16, 17) యేసు పరిచర్యవల్ల ప్రజలు ఆధ్యాత్మిక అంధకారం నుండి బయటపడ్డారు, అబద్ధమత బోధలను విడిచిపెట్టారు. “నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను” అని యేసు అన్నాడు.—యోహా. 1:3-5; 12:46.

13 అనేక సంవత్సరాల తర్వాత అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులతో ఇలా అన్నాడు: “మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు. గనుక . . . వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి.” (ఎఫె. 5:8-10) క్రైస్తవులు మతసంబంధమైన అంధకారం నుండి విడిపించబడ్డారు కాబట్టి వెలుగు సంబంధీకులుగా ప్రవర్తించాల్సిన బాధ్యత వారికి ఉంది. కొండమీది ప్రసంగంలో యేసు కూడ ఆ విషయాన్నే చెప్పాడు. ఆయన, “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి” అని అన్నాడు. (మత్త. 5:16) మీకు తెలిసిన క్రీస్తులోని సంపదలను మీరు ఇష్టపడుతున్నారా? దానివల్ల ఎంతో ప్రయోజనముందని మీరు మీ మాటల్లో, చేతల్లో ఇతరులకు చూపించేంతగా దాన్ని ఇష్టపడుతున్నారా?

14, 15. (ఎ) బైబిలు కాలాల్లో సత్యారాధన కోసం గొర్రెలు, మరితర జంతువులు ఎలా ఉపయోగించబడ్డాయి? (బి) “దేవుని గొఱ్ఱెపిల్ల”గా యేసు సాటిలేని సంపద అని ఎందుకు చెప్పవచ్చు?

14యేసు “దేవుని గొఱ్ఱెపిల్ల.” (యోహా. 1:29, 36) పాప పరిహారార్థానికి, దేవుణ్ణి సమీపించడానికి గొర్రెలు ఎంతో అవసరమయ్యేవని బైబిలు చెబుతోంది. ఉదాహరణకు, అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధపడినప్పుడు, ఆయనకు హానిచేయవద్దనీ ఆయనకు బదులుగా దగ్గర్లోని పొదలో చిక్కుకున్న పొట్టేలును అర్పించమనీ యెహోవా ఆజ్ఞాపించాడు. (ఆది. 22:12, 13) ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదలచేయబడిన తర్వాత వారు “యెహోవాకు” అర్పించిన “పస్కా బలి”లో కూడా ప్రాముఖ్యంగా గొర్రెను ఉపయోగించారు. (నిర్గ. 12:1-13) అంతేకాక, మోషే ధర్మశాస్త్రం ప్రకారం గొర్రెలు, మేకలతోపాటు వివిధ జంతువులను అర్పించేవారు.—నిర్గ. 29:38-42; లేవీ. 5:6, 7.

15 ఆ బలులతోపాటు మానవులు అర్పించే బలులేవీ పాపమరణాల నుండి శాశ్వత విముక్తి కల్పించలేవు. (హెబ్రీ. 10:1-4) యేసు విషయానికొస్తే, ఆయన “లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.” ఇప్పటివరకు దొరికిన వస్తుసంపదలన్నిటికన్నా ఎంతో విలువైన సంపద యేసే అని చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు. కాబట్టి, విమోచన క్రయధన బలి గురించి జాగ్రత్తగా అధ్యయనం చేయడానికి సమయం తీసుకొని, ఆ అద్భుతమైన ఏర్పాటుపట్ల విశ్వాసం చూపించాలి. అలా చేస్తే మనకు అద్భుతమైన ఆశీర్వాదం, బహుమానం పొందే అవకాశముంటుంది. మనం ‘చిన్నమందకు’ చెందినవారమైతే పరలోకంలో క్రీస్తుతోపాటు మహిమ, ఘనత పొందుతాం. ‘వేరేగొర్రెలకు’ చెందినవారమైతే పరదైసు భూమిపై నిత్యజీవాన్ని ప్రతిఫలంగా పొందుతాం.—లూకా 12:32; యోహా. 6:40, 47; 10:16.

16, 17. ‘విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువానిగా’ యేసుకున్న పాత్రను అర్థం చేసుకోవడం ఎందుకు చాలా అవసరం?

16యేసే ‘విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడు.’ (హెబ్రీయులు 12:1, 2 చదవండి.) హెబ్రీయులు 11వ అధ్యాయంలో పౌలు ఎంతో నేర్పుగా విశ్వాసం గురించి వివరించాడు. అక్కడ ఆయన విశ్వాసం అంటే ఏమిటో క్లుప్తంగా వివరించి, ఆ విషయంలో ఆదర్శవంతులైన నోవహు, అబ్రాహాము, శారా, రాహాబు పేర్లను ప్రస్తావించాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత, ‘విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూడండి’ అని పౌలు తన తోటి విశ్వాసులను ప్రోత్సహించాడు. ఆయన యేసువైపు చూడమని ఎందుకు చెప్పాడు?

17 హెబ్రీయులు 11వ అధ్యాయంలో ప్రస్తావించబడిన స్త్రీపురుషులకు బలమైన విశ్వాసమున్నా, దేవుడు తన వాగ్దానాలను మెస్సీయ ద్వారా, ఆయన రాజ్యం ద్వారా ఎలా నెరవేరుస్తాడో వారికి పూర్తిగా తెలియదు. ఆ కారణంగా, వారి విశ్వాసం పరిపూర్ణం కాదు అని చెప్పవచ్చు. అంతెందుకు, మెస్సీయకు సంబంధించిన ప్రవచనాలను రాసేలా యెహోవా ప్రేరణ పొందినవారు కూడ తాము రాసిన విషయాలను పూర్తిగా అర్థంచేసుకోలేకపోయారు. (1 పేతు. 1:10-12) కాబట్టి, యేసు ద్వారానే విశ్వాసం పరిపూర్ణం లేదా సంపూర్ణం కాగలదు. వీటన్నిటినిబట్టి, ‘విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువానిగా’ యేసుకున్న పాత్రను స్పష్టంగా అర్థంచేసుకొని దాన్ని గుర్తించడం ఎంత అవసరం!

వెతుకుతూ ఉండండి

18, 19. (ఎ) యేసులో గుప్తములైవున్న ఇతర సంపదలు ఏమిటి? ఆధ్యాత్మిక సంపదల కోసం మనం యేసువైపే ఎందుకు చూస్తూవుండాలి?

18 మానవుల రక్షణ కోసం దేవుడు చేసిన ఏర్పాట్లలో యేసు పోషించిన కేవలం కొన్ని అమూల్యమైన పాత్రల గురించి మాత్రమే మనం చర్చించాం. క్రీస్తులో ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక సంపదలు దాగివున్నాయి. వాటిని కనుగొనడంవల్ల మనం సంతోషాన్ని, ప్రయోజనాలను పొందుతాం. ఉదాహరణకు, అపొస్తలుడైన పేతురు యేసును “జీవాధిపతి,” “తెల్లవారి వేకువచుక్క” అని పిలిచాడు. (అపొ. 3:15; 5:31; 2 పేతు. 1:19) అంతేకాక, బైబిలు యేసును “ఆమేన్‌” అని కూడ పిలుస్తోంది. (ప్రక. 3:14) ఆ పాత్రలకున్న అర్థమేమిటో, వాటికి ఎలాంటి ప్రాముఖ్యత ఉందో మీకు తెలుసా? “వెదకుడి మీకు దొరకును” అని యేసు ప్రోత్సహించినట్లు మనం వెతకాలి.—మత్త. 7:7.

19 మానవుల విషయంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం, మన నిరంతర జీవితం కోసం యేసు చేసినంతగా మరెవ్వరూ చేయలేదు. మనస్ఫూర్తిగా వెదికేవారందరికీ ఆయనలోవున్న సంపదలు అందుబాటులో ఉన్నాయి. ‘ఆయనలో గుప్తములైవున్న’ సర్వసంపదలను కనుగొనడంవల్ల వచ్చే ఆనందాన్ని, ఆశీర్వాదాలను మీ సొంతం చేసుకోండి.

మీకు జ్ఞాపకమున్నాయా?

• ఏ సంపదల కోసం వెతకమని క్రైస్తవులు ప్రోత్సహించబడుతున్నారు?

• పౌలు కొలొస్సయులకు ఇచ్చిన ఉపదేశం మన కాలానికి కూడా ఎందుకు అవసరం?

• క్రీస్తులో ‘గుప్తములైవున్న’ కొన్ని ఆధ్యాత్మిక సంపదలేమిటి? వాటిని వివరించండి.

[అధ్యయన ప్రశ్నలు]

[5వ పేజీలోని చిత్రాలు]

దేవుని వాక్యం నిధివున్న చోటును తెలిపే మ్యాపులాగే క్రీస్తులో ‘గుప్తములైవున్న’ సంపదల దగ్గరకు మనల్ని తీసుకెళ్తుంది