కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవ కుటుంబ సభ్యులారా, యేసు మాదిరిని అనుకరించండి

క్రైస్తవ కుటుంబ సభ్యులారా, యేసు మాదిరిని అనుకరించండి

క్రైస్తవ కుటుంబ సభ్యులారా, యేసు మాదిరిని అనుకరించండి

‘మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు క్రీస్తు మీకు మాదిరి ఉంచిపోయెను.’ —1 పేతు. 2:21.

1. (ఎ) సృష్టి చేయడంలో దేవుని కుమారుడు ఎలా సహాయం చేశాడు? (బి) మానవులపట్ల యేసుకున్న వైఖరి ఏమిటి?

దేవుడు భూమ్యాకాశాలను సృష్టించినప్పుడు ఆయన అద్వితీయ కుమారుడు ఆయన పక్కనే “ప్రధానశిల్పి”గా పనిచేశాడు. ఈ భూమ్మీద లెక్కలేనన్ని రకాల జంతువులను, చెట్లను సృష్టించినప్పుడు కూడా దేవుని కుమారుడు ఆయనకు సహాయంచేశాడు. యెహోవా తన స్వరూపంలో తన పోలికచొప్పున సృష్టించిన నరుల కోసం పరదైసును సిద్ధం చేస్తున్నప్పుడు కూడా ఆయన సహాయం చేశాడు. యేసు అనే పేరుతో మనకు పరిచయమున్న దేవుని కుమారుడు ‘నరులను చూసి ఎంతో ఆనందించాడు.’—సామె. 8:27-31; ఆది. 1:26, 27.

2. (ఎ) అపరిపూర్ణ మానవుల ప్రాయశ్చిత్తం కోసం యెహోవా దేన్ని ఏర్పాటు చేశాడు? (బి) జీవితానికి సంబంధించిన ఏ విషయం గురించి బైబిలు నిర్దేశాన్నిస్తుంది?

2 మొదటి మానవజత పాపం చేసిన తర్వాత, మానవుల పాపాలను ప్రాయశ్చిత్తం చేయడం చాలా ముఖ్యమని యెహోవా నిర్ణయించుకున్నాడు. దాని కోసం ఆయన క్రీస్తు విమోచన క్రయధన బలిని ఏర్పాటుచేశాడు. (రోమా. 5:8) అంతేకాక, యెహోవా తన వాక్యమైన బైబిలును కూడా ఇచ్చాడు. వారసత్వంగా వచ్చిన అపరిపూర్ణతలున్నా జీవితంలో విజయం సాధించడానికి ఏమి చేయాలో అది చెబుతోంది. (కీర్త. 119:105) అంతేకాక, కుటుంబాలు చిరకాలం ఐక్యంగా, సంతోషంగా ఉండేందుకు కావాల్సిన నిర్దేశం కూడా అందులో ఉంది. వివాహం గురించి ఆదికాండము పుస్తకంలో, భర్త “తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు” అని చెప్పబడింది.—ఆది. 2:24.

3. (ఎ) వివాహం గురించి యేసు ఏమి బోధించాడు? (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏమి చూస్తాం?

3 యేసు భూమ్మీదున్నప్పుడు వివాహం ఒక శాశ్వత బంధంగా ఉండాలని చెప్పాడు. తమ వివాహ జీవితాన్ని విచ్ఛిన్నం చేసే లేదా సంతోషం లేకుండా చేసే ఆలోచనలకు, ప్రవర్తనలకు దూరంగా ఉండేందుకు కుటుంబ సభ్యులకు సహాయం చేసే సూత్రాలను ఆయన బోధించాడు. (మత్త. 5:27-37; 7:12) ఈ ఆర్టికల్‌లో జీవితాన్ని సంతోషకరంగా, సంతృప్తికరంగా చేసుకోవడానికి యేసు భూమ్మీదున్నప్పుడు చేసిన బోధలు, ఉంచిన మాదిరి భర్తలకు, భార్యలకు, తల్లిదండ్రులకు, పిల్లలకు ఎలా సహాయం చేస్తాయో చూద్దాం.

క్రైస్తవ భర్త భార్యను ఎలా గౌరవించాలి?

4. బాధ్యతల విషయంలో యేసుకూ క్రైస్తవ భర్తలకూ మధ్యవున్న పోలిక ఏమిటి?

4 దేవుడు, సంఘానికి శిరస్సుగా క్రీస్తును నియమించినట్లే, కుటుంబ శిరస్సుగా భర్తను నియమించాడు. ‘క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై యున్నాడు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను’ అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. (ఎఫె. 5:23, 25) యేసు తన అనుచరులతో వ్యవహరించిన తీరును చూసి క్రైస్తవ భర్తలు తమ భార్యలతో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవచ్చు. దేవుడు ఇచ్చిన అధికారాన్ని యేసు ఎలా చూపించాడో చూద్దాం.

5. యేసు శిష్యులపై తన అధికారాన్ని ఎలా చూపించాడు?

5 యేసు ‘సాత్వికుడు, దీనమనస్సు గలవాడు.’ (మత్త. 11:29) అవసరమైనప్పుడు చర్య తీసుకోవడానికి ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. తన బాధ్యతల నుండి ఎన్నడూ పారిపోలేదు. (మార్కు 6:34; యోహా. 2:14-17) ప్రేమతో ఆయన తన శిష్యులకు ఉపదేశమిచ్చాడు. అవసరమైనప్పుడు ఆయన మళ్లీమళ్లీ ఉపదేశమిచ్చాడు. (మత్త. 20:21-28; మార్కు 9:33-37; లూకా 22:24-27) కానీ వారిని దూషించడం, చిన్నచూపు చూడడం, వారంటే తనకు ఇష్టంలేదన్నట్లు ప్రవర్తించడం లేక తాను వాళ్లకు బోధించింది పాటించలేరన్నట్లు చూడడం వంటివి చేయలేదు. వారిని మెచ్చుకొని సరైనది చేయమని ప్రోత్సహించాడు. (లూకా 10:17-21) యేసు తన శిష్యులను ప్రేమించి, వారితో దయతో వ్యవహరించాడు కాబట్టి ఆయన వారి గౌరవాన్ని చూరగొన్నాడు.

6. (ఎ) యేసు తన శిష్యులతో వ్యవహరించిన విధానం నుండి భర్తలు ఏమి నేర్చుకోవచ్చు? (బి) భర్తలను ఏమి చేయమని పేతురు ప్రోత్సహించాడు?

6 యేసు ఉదాహరణను అనుకరించాలనుకుంటే క్రైస్తవ భర్తలు తమ భార్యలపై అజమాయిషీ చేసే బదులు వారిని గౌరవిస్తూ స్వయంత్యాగపూరిత ప్రేమను చూపించాలి. యేసు తన శిష్యులతో ప్రేమగా వ్యవహరించినట్లే భర్తలు భార్యలతో వ్యవహరించాలని అపొస్తలుడైన పేతురు ప్రోత్సహించాడు. భార్యలను ‘సన్మానిస్తూ కాపురం’ చేయడం ద్వారా వారలా యేసు మాదిరిని అనుకరించవచ్చు. (1 పేతురు 3:7 చదవండి.) మరైతే భర్త తన భార్యను సన్మానిస్తూనే తన అధికారాన్ని ఎలా చూపించవచ్చు?

7. భర్త, భార్యను ఎలా సన్మానించవచ్చు? వివరించండి.

7 కుటుంబానికి సంబంధించిన నిర్ణయలు తీసుకునే ముందు భార్య అభిప్రాయాలను, మనోభావాలను తెలుసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా భర్త తన భార్యను సన్మానించవచ్చు. ఇల్లు మారడం, ఉద్యోగంవంటి విషయాలతోపాటు, సెలవులు ఎక్కడ గడపాలి లేక ఆర్థిక సమస్య ఎదురైనప్పుడు ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి వంటి రోజువారి విషయాల గురించి కూడా నిర్ణయం తీసుకోవాల్సివుంటుంది. అది కుటుంబానికి సంబంధించిన నిర్ణయం కాబట్టి భార్య అభిప్రాయం కూడా తీసుకుంటే తమ ఇద్దరి అభిప్రాయాన్ని మనసులో ఉంచుకొని మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. అలా చేసినప్పుడు భర్తకు సహకరించడం భార్యకు కష్టమనిపించదు. (సామె. 15:22) భార్యను సన్మానించే క్రైస్తవ భర్త ఆమె ప్రేమనూ గౌరవాన్నీ చూరగొంటాడు. మరిముఖ్యంగా ఆయన యెహోవా ఆమోదాన్ని కూడా పొందుతాడు.—ఎఫె. 5:28, 29.

భార్య భర్తపట్ల ప్రగాఢ గౌరవాన్ని ఎలా చూపించాలి?

8. హవ్వ చేసినట్లు ఎందుకు చేయకూడదు?

8 అధికారానికి లోబడే విషయంలో క్రైస్తవ భార్యలకు యేసు పరిపూర్ణ మాదిరి ఉంచాడు. అధికారానికి లోబడే విషయంలో ఆయన అభిప్రాయానికీ హవ్వ అభిప్రాయానికీ ఎంత తేడా! అధికారానికి లోబడే విషయంలో హవ్వ మంచి మాదిరిని ఉంచలేదు. యెహోవా తాను నియమించిన శిరస్సు ద్వారా ఆమెకు నిర్దేశాన్ని ఇచ్చాడు. కానీ హవ్వ భర్త అధికారాన్ని ధిక్కరించింది. ఆదాము తనకు ఇచ్చిన నిర్దేశాన్ని ఆమె పాటించలేదు. (ఆది. 2:16, 17; 3:3; 1 కొరిం. 11:3) హవ్వ మోసగించబడిందన్న మాట వాస్తవమే అయినా ‘దేవునికి తెలుసని’ ఆమెతో సాతాను అన్నమాట ఎంతవరకు నిజమో భర్తను అడిగి తెలుసుకోవాల్సింది. కానీ అలా చేయకుండా అహంకారంతో భర్తకే నిర్దేశాన్నిచ్చింది.—ఆది. 3:5, 6; 1 తిమో. 2:14.

9. లోబడే విషయంలో యేసు ఏ మాదిరి ఉంచాడు?

9 యేసు విషయానికొస్తే తన శిరస్సుకు లోబడే విషయంలో పరిపూర్ణ మాదిరిని ఉంచాడు. యేసు ‘దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదుగాని దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొన్నాడు’ అని ఆయన ఆలోచనా విధానాన్నిబట్టి, జీవితాన్నిబట్టి తెలుస్తుంది. (ఫిలి. 2:5-7) యేసు నేడు రాజుగా పరిపాలిస్తున్నప్పటికీ అదే వైఖరిని చూపిస్తున్నాడు. అన్ని విషయాల్లో తన తండ్రికి వినయంగా లోబడుతూ శిరస్సత్వానికి మద్దతిస్తున్నాడు.—మత్త. 20:23; యోహా. 5:30; 1 కొరిం. 15:28.

10. భార్య భర్త శిరస్సత్వానికి ఎలా సహకరించవచ్చు?

10 తన భర్త శిరస్సత్వానికి సహకరించడం ద్వారా క్రైస్తవ భార్య యేసు మాదిరిని అనుకరించాలి. (1 పేతురు 2:21; 3:1, 2 చదవండి.) అలా సహకరించే అవకాశం దొరికే ఒకానొక సన్నివేశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఏదో ఒక విషయంలో తల్లిదండ్రుల అనుమతి అవసరమై ఓ అబ్బాయి వాళ్లమ్మ దగ్గరకు వచ్చాడనుకుందాం. అంతకుముందెప్పుడూ ఆ విషయం ఇంట్లో చర్చించుకోలేదు. అలాంటప్పుడు తల్లిగా ఆమె, “మీ నాన్నను అడిగావా?” అని వాకబుచేయాలి. అబ్బాయి అడగకపోతే, ఆ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునేముందు భర్తతో దాన్ని చర్చించాలి. అంతేకాక, క్రైస్తవ భార్య పిల్లల ముందు భర్త అభిప్రాయాన్ని వ్యతిరేకించడం గానీ ఖండించడం గానీ చేయకూడదు. ఏ విషయంలోనైనా భర్తతో ఆమె విభేదిస్తే ఆ విషయాన్ని ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనతో చర్చించాలి.—ఎఫె. 6:4.

తల్లిదండ్రులకు యేసు మాదిరి

11. తల్లిదండ్రులకు యేసు ఎలాంటి మాదిరి ఉంచాడు?

11 యేసు పెళ్లి చేసుకోకపోయినా ఆయనకు పిల్లలు లేకపోయినా ఆయన క్రైస్తవ తల్లిదండ్రులకు ఒక మంచి మాదిరిని ఉంచాడు. ఎలా? యేసు తన మాటల ద్వారా చేతల ద్వారా తన శిష్యులకు ప్రేమతో ఓపిగ్గా నేర్పించాడు. వారికి అప్పగించిన పనిని ఎలా చేయాలో కూడా చూపించాడు. (లూకా 8:1) వారిపట్ల ఆయనకున్న అభిప్రాయం, వారితో ఆయన ప్రవర్తించిన తీరు నుండి వారు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నారు.—యోహాను 13:14-17 చదవండి.

12, 13. పిల్లలు దైవభక్తిగలవారిగా పెరగాలంటే తల్లిదండ్రులు ఏమి చేయాలి?

12 సాధారణంగా పిల్లలు మంచైనా, చెడైనా తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాల గురించి ఆలోచించాలి: ‘టీవీకి, వినోదాలకు సమయాన్ని వెచ్చించే విషయంలో అలాగే బైబిలు అధ్యయనానికి, పరిచర్యకు సమయాన్ని వెచ్చించే విషయంలో మనం మన పిల్లలకు ఎలాంటి మాదిరి ఉంచుతున్నాం? మన కుటుంబం ఏ విషయాలకు ప్రాముఖ్యతనిస్తుంది? మన జీవితాల్లో సత్యారాధనకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మనం మంచి మాదిరిని ఉంచుతున్నామా?’ పిల్లలను దైవ భక్తిగలవారిగా పెంచాలంటే దేవుని ధర్మశాస్త్రం మొదట తల్లిదండ్రుల హృదయంలో ఉండాలి.—ద్వితీ. 6:6.

13 రోజువారి పనుల్లో తల్లిదండ్రులు బైబిలు సూత్రాలను పాటించడానికి కృషిచేస్తే పిల్లలు దాన్ని తప్పకుండా గమనిస్తారు. తల్లిదండ్రుల మాటలు, నేర్పించే విషయాలు పిల్లలపై ప్రభావం చూపిస్తాయి. పిల్లలకు పెట్టిన నియమాలు తల్లిదండ్రులే పాటించకపోతే పిల్లలు బైబిలు సూత్రాలు అంత ప్రాముఖ్యమైనవి కావని లేక అవి పనికిరావని అనుకుంటారు. దానివల్ల, పిల్లలు లోక ఒత్తిళ్లకు లొంగిపోవచ్చు.

14, 15. దేన్ని వెతకమని తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి? ఎలా ప్రోత్సహించవచ్చు?

14 పిల్లలను పెంచి పెద్దచేయడమంటే వారి భౌతిక అవసరాలు తీర్చడం ఒకటే కాదని తల్లిదండ్రులు గుర్తించాలి. కాబట్టి, కేవలం డబ్బు సంపాదనకు ఉపయోగపడే లక్ష్యాలను పెట్టుకోమని పిల్లలకు చెప్పడం ఎంతమాత్రం తెలివైన పనికాదు. (ప్రసం. 7:12) రాజ్యాన్ని, నీతిని మొదట వెదకమని యేసు తన శిష్యులకు బోధించాడు. (మత్త. 6:33) ఈ విషయంలో క్రైస్తవ తల్లిదండ్రులు క్రీస్తును అనుకరించాలి. దేవుని సేవను మరింత చేయాలనే కోరిక పిల్లల్లో కలిగించేందుకు వారు కృషిచేయాలి.

15 తల్లిదండ్రులు, తమ పిల్లలు పూర్తికాల సేవకులతో సహవసించేందుకు ఏర్పాట్లు చేయడం ద్వారా అలా చేయవచ్చు. పయినీర్లతో లేక ప్రాంతీయ పైవిచారణకర్తతో, ఆయన భార్యతో పరిచయం ఏర్పరచుకోవడం యౌవనస్థులకు ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో ఆలోచించండి. వేరే దేశాల నుండి వచ్చిన మిషనరీలు, బెతెల్‌ సభ్యులు, అంతర్జాతీయ నిర్మాణ పనుల్లో సేవచేస్తున్న వారు యెహోవాకు సేవ చేయడంలోవున్న ఆనందం గురించి ఉత్సాహంతో మాట్లాడతారు. అంతేకాక పిల్లలకు చెప్పడానికి వారి దగ్గర ఎన్నో ఆసక్తికర అనుభవాలు ఉండవచ్చు. వారు చేసిన త్యాగాలు చూసి పిల్లలు ఎంతో ప్రోత్సాహం పొందవచ్చు. పిల్లలు వారిలా సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు, ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోవచ్చు, పూర్తికాల సేవలో సహాయపడే అవసరమైన విద్యను చేపట్టవచ్చు.

పిల్లలారా, మీరు ఎలా యేసు మాదిరిని అనుకరించవచ్చు?

16. యేసు భూమ్మీదున్నప్పుడు తన తల్లిదండ్రుల్ని, పరలోక తండ్రిని ఎలా గౌరవించాడు?

16 పిల్లలారా, యేసు మీకు కూడా ఎంతో మంచి మాదిరిని ఉంచాడు. యేసును చూసుకునే బాధ్యత యోసేపు, మరియలకు అప్పగించబడింది, కాబట్టి ఆయన వారికి లోబడ్డాడు. (లూకా 2:51 చదవండి.) అపరిపూర్ణతలున్నా తనను చూసుకునే బాధ్యతను దేవుడు వారికి అప్పగించాడని ఆయన గుర్తించాడు. అందుకే, యేసు వారిని గౌరవించాడు. (ద్వితీ. 5:16; మత్త. 15:4) పెద్దవాడైన తర్వాత యేసు, తన పరలోక తండ్రికి సంతోషాన్ని తీసుకొచ్చే పనులే చేశాడు. అంటే ఆయన శోధనకు లొంగిపోలేదు. (మత్త. 4:1-10) యౌవనస్థులారా, మీ తల్లిదండ్రులకు లోబడకూడదనే శోధన కొన్నిసార్లు మీకు రావచ్చు. అలాంటప్పుడు యేసు మాదిరిని మీరు ఎలా అనుసరించవచ్చు?

17, 18. (ఎ) యౌవనస్థులు స్కూల్లో ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు? (బి) యౌవనస్థులు పరీక్షలను ఎదుర్కోవాలంటే దేన్ని గుర్తుంచుకోవాలి?

17 బహుశా మీ స్కూల్లో చాలామంది బైబిలు ప్రమాణాలను పెద్దగా లేక ఏమాత్రం పట్టించుకోకపోవచ్చు. తప్పుడు పనులు చేసేలా వారు మీపై ఒత్తిడి తీసుకురావచ్చు, మీరు అలా చేయడానికి ఒప్పుకోకపోతే మిమ్మల్ని హేళన చేయవచ్చు. వారితో మీరు చేతులు కలపనందుకు వారు మీకు పేర్లు పెడుతున్నారా? అలాంటప్పుడు మీరేమి చేస్తారు? మీరు వారికి భయపడి నలుగురు చేసినట్లే చేస్తే మీ తల్లిదండ్రుల్ని యెహోవాను నిరాశపరుస్తారనేది మీకు తెలుసు. మీరు మీ తోటి విద్యార్థుల్లా చేస్తే ఏమౌతుంది? మీరు పయినీరుగా, పరిచర్య సేవకునిగా సేవచేయడం, రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్నచోట లేక బెతెల్‌ సేవచేయడం వంటి కొన్ని లక్ష్యాలు పెట్టుకొనివుండవచ్చు. తోటి విద్యార్థులతో సహవసిస్తే మీ లక్ష్యాలను సాధించగలరా?

18 క్రైస్తవ సంఘంలోవున్న యౌవనస్థులారా మీ విశ్వాసం పరీక్షించబడే పరిస్థితులను మీరు ఎదుర్కొంటున్నారా? అలాంటప్పుడు మీరు ఏమి చేస్తారు? మీ మాదిరికర్తయైన యేసు గురించి ఆలోచించండి. ఆయన శ్రమలకు లొంగిపోకుండా తనకు సరైందని తెలిసినదాన్ని ధైర్యంగా చేశాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే, మనకు తప్పని తెలిసినదాన్ని చేయడానికి వారితో ‘చేతులు కలపము’ అని తోటివారికి స్పష్టంగా చెప్పే ధైర్యం వస్తుంది. యేసులా, జీవితమంతా యెహోవాను ఆనందంతో సేవిస్తూ, ఆయనకు విధేయులుగా ఉండాలని ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోండి.—హెబ్రీ. 12:1, 2.

కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలంటే ఏది అవసరం?

19. జీవితంలో నిజమైన సంతోషం పొందాలంటే ఏమి చేయాలి?

19 మానవులు సంతోషంగా ఉండాలని యెహోవా దేవుడు, యేసుక్రీస్తు కోరుకుంటున్నారు. మనం అపరిపూర్ణులమైనా కొంతమేరకు సంతోషంగా ఉండడం సాధ్యమే. (యెష. 48:17, 18; మత్త. 5:3) మానవులు సంతోషంగా ఉండేందుకు సహాయపడే మత సత్యాలను యేసు బోధించాడు. కానీ ఆయన అంతటితో ఊరుకోలేదు, శ్రేష్ఠమైన జీవితాన్ని ఎలా గడపాలో కూడా బోధించాడు. బోధించడం మాత్రమే కాదు సమతుల్యమైన జీవితాన్ని గడిపే, సమతుల్యమైన వైఖరి చూపించే విషయంలో ఆయన మంచి మాదిరినుంచాడు. భర్తలు, భార్యలు, తల్లిదండ్రులు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ యేసు మాదిరిని అనుకరించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. కాబట్టి అందరూ యేసు మాదిరిని అనుకరించండి! సంతృప్తికరమైన, సంతోషకరమైన కుటుంబ జీవితాలను గడపాలంటే యేసు బోధలను పాటిస్తూ ఆయన మాదిరిని అనుకరించడం చాలా అవసరం.

మీరెలా జవాబిస్తారు?

• దేవుడు తమకిచ్చిన అధికారాన్ని భర్తలు ఎలా చూపించాలి?

• యేసు మాదిరిని భార్య ఎలా అనుకరించవచ్చు?

• యేసు తన శిష్యులతో వ్యవహరించిన తీరు నుండి తల్లిదండ్రులు ఏమి నేర్చుకోవచ్చు?

• యేసు మాదిరి నుండి యౌవనస్థులు ఏమి నేర్చుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[8వ పేజీలోని చిత్రం]

కుటుంబానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు ప్రేమగల భర్త ఏమి చేస్తాడు?

[9వ పేజీలోని చిత్రం]

ఏ పరిస్థితిలో తన భర్త శిరస్సత్వానికి సహకరించే అవకాశం ఓ భార్యకు దొరుకుతుంది?

[10వ పేజీలోని చిత్రం]

పిల్లలు తల్లిదండ్రులను చూసి మంచి అలవాట్లను నేర్చుకుంటారు