కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తొంభై ఏళ్ల క్రితం నా ‘సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడం’ మొదలుపెట్టాను

తొంభై ఏళ్ల క్రితం నా ‘సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడం’ మొదలుపెట్టాను

తొంభై ఏళ్ల క్రితం నా ‘సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడం’ మొదలుపెట్టాను

ఎడ్విన్‌ రిజ్వెల్‌ చెప్పినది

యు ద్ధ విరమణ జరిగిన రోజున అంటే 1918 నవంబరు 11న అనుకోకుండా మా స్కూలువాళ్లు మహాయుద్ధం ముగింపును జరుపుకునేందుకు పిల్లలనందరినీ పిలిస్తే మేము స్కూలుకు వెళ్లాం. ఆ తర్వాత ఆ మహాయుద్ధాన్నే మొదటి ప్రపంచ యుద్ధం అని పిలిచారు. నాకు అప్పుడు ఐదేళ్లు కాబట్టి అసలు ఏమి జరుగుతుందో అర్థంకాలేదు. నేను చిన్న పిల్లవాడ్నే అయినా నా తల్లిదండ్రులు నాకు దేవుని గురించి బోధించినందువల్ల దానిలో పాల్గొనకూడదని అనుకున్నాను. నేను దేవునికి ప్రార్థించినా ఏడ్పును ఆపుకోలేకపోయాను. ఏదేమైనా ఆ ఆచారంలో మాత్రం పాల్గొనలేదు. నా ‘సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడం’ అదే మొదలు.—ప్రసం. 12:1, 2.

ఇది జరగడానికి కొన్ని నెలల ముందు మా కుటుంబం స్కాట్లండ్‌లోని గ్లాస్గో పట్టణానికి దగ్గర్లోని ప్రాంతానికి తరలివెళ్లింది. ఆ సమయంలో మా నాన్నగారు “ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమంది మరెన్నడూ మరణించరు” అనే బహిరంగ ప్రసంగాన్ని వినడానికి వెళ్లారు. అది ఆయన జీవితాన్నే మార్చేసింది. మా అమ్మానాన్నలు బైబిలు అధ్యయనాన్ని ఆరంభించి దేవుని రాజ్యం గురించి, అది తీసుకొచ్చే ఆశీర్వాదాల గురించి తరచూ మాట్లాడుకునేవారు. దేవుణ్ణి ప్రేమించేలా ఆయనపై నమ్మకముంచేలా మా తల్లిదండ్రులు నాకు అప్పటినుండే శిక్షణ ఇచ్చినందుకు యెహోవాకు ఎప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తాను.—సామె. 22:6.

పూర్తికాల పరిచర్య మొదలుపెట్టాను

15వ ఏట నేను పైచదువులు చదివే అర్హత సంపాదించినప్పటికీ నాకు మాత్రం పూర్తికాల పరిచర్యే చేయాలనివుండేది. నేను చాలా చిన్నవాణ్ణని నాన్నకు అనిపించింది. దాంతో నేను కొంతకాలం ఒక ఆఫీసులో పనిచేశాను. అయితే, పూర్తికాల సేవ చేయాలనే కోరిక నాలో ఎంత బలంగా ఉండేదంటే అప్పట్లో ప్రకటనా పనిని పర్యవేక్షిస్తున్న జె. ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌కు ఒకరోజు ఉత్తరం రాశాను. ఈ విషయంలో ఆయన అభిప్రాయం అడిగాను. “నీకు పనిచేసేంత వయసు వచ్చిందంటే ప్రభువు సేవ చేసేంత వయసు వచ్చినట్టే. . . . యథార్థంగా ప్రభువు సేవ చేయడానికి కృషిచేస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతున్నాను” అని సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ జవాబు రాశాడు. 1928, మార్చి 10న ఆయన రాసిన ఉత్తరం మా కుటుంబాన్ని ఎంతో ప్రోత్సహించింది. కొంతకాలానికే మా నాన్న, అమ్మ, పెద్దక్క, నేను పూర్తికాల సేవను చేపట్టాం.

1931, లండన్‌లో జరిగిన సమావేశంలో సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ విదేశాల్లో సేవ చేయడానికి ముందుకు రమ్మని ప్రోత్సహించాడు. ఆ విషయంలో నేను ఆసక్తి చూపించడంతో నన్నూ ఆండ్రూ జేక్‌ అనే మరో సహోదరుణ్ణి లిథువానియా రాజధాని అయిన కౌనాస్‌కు పంపించారు. అప్పుడు నాకు 18 ఏళ్లు.

విదేశాల్లో రాజ్య సందేశాన్ని ప్రకటించాను

అప్పట్లో, లిథువానియా నిరుపేద దేశం. ప్రజలు వ్యవసాయం చేసుకొని బ్రతికేవారు. ఆ ప్రాంతంలో ప్రకటించడం కష్టమయ్యేది. తలదాచుకోవడానికి ఇళ్లు దొరకడమే కష్టమయ్యేది. మేము బసచేసిన స్థలాలను కొన్నింటిని ఇప్పటికీ మరచిపోలేం. ఒకసారి ఏమయిందంటే పడుకోవడం ఇబ్బందిగా ఉండడంతో నేనూ ఆండ్రూ నిద్రలో నుండి లేచి కూర్చున్నాం. దీపం వెలిగించి చూస్తే మంచం నిండా నల్లులే నల్లులు. అవి తల నుండి అరికాలు వరకూ తెగ కుట్టేశాయి. మంటను తగ్గించుకోవడానికి ప్రతీరోజు ఉదయాన్నే దగ్గర్లోవున్న నదిలోకి వెళ్లి చల్లటి నీటిలో మెడలోతువరకు మునిగివుండేవాడిని. అలా ఒక వారం చేశాను. అయినాసరే పరిచర్య మాత్రం మానకూడదని నిర్ణయించుకున్నాం. కొంతకాలం తర్వాత ఒక యువ జంట సత్యాన్ని అంగీకరించింది. వారు పరిచయం కావడంతో సరైన ఇంటి కోసం మేము పడ్డ బాధలు తప్పాయి. వాళ్లు మమ్మల్ని తమ ఇంట్లో ఉండనిచ్చారు, వాళ్ల ఇల్లు చిన్నదే అయినా శుభ్రంగా ఉండేది. నేలపైనే పడుకోవాల్సివచ్చినా నల్లుల బాధ లేకపోవడంతో ఎంత హాయిగా నిద్రపట్టేదో!

అప్పట్లో లిథువానియాలో రోమన్‌ క్యాథలిక్‌ చర్చి, రష్యన్‌ ఆర్థోడాక్స్‌ మతనాయకుల ఆధిపత్యం నడిచేది. సంపన్నులు మాత్రమే బైబిలు కొనగలిగేవారు. సాధ్యమైనంత ఎక్కువ ప్రాంతాన్ని పూర్తిచేసి, ఆసక్తి చూపించినవారికి వీలైనన్ని బైబిలు సాహిత్యాలు ఇవ్వాలన్నదే మా ముఖ్య లక్ష్యంగా ఉండేది. ఒక పట్టణానికి వెళ్లిన తర్వాత, మొదటిగా ఉండడానికి ఒక చోటు కోసం వెతుక్కునేవాళ్లం. ఆ పట్టణ శివార్లలో జాగ్రత్తగా పనిచేసిన తర్వాత, త్వరత్వరగా ఆ పట్టణాన్ని కూడా పూర్తిచేసేవాళ్లం. స్థానిక ఫాదిరీలు ఏదో ఒక సమస్య సృష్టించక ముందే ప్రకటనా పని ముగించుకొని అక్కడి నుండి జారుకునేవాళ్లం.

అలజడి రేగడంవల్ల అందరికీ తెలిసింది

1934లో ఆండ్రూను కౌనాస్‌లోని బ్రాంచి కార్యాలయంలో పనిచేయడానికి నియమించారు. దాంతో నాతో పనిచేయడానికి జాన్‌ సెంపేను పంపించారు. అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను ఇప్పటికీ మరచిపోలేను. ఒకరోజు నేను ఓ చిన్న పట్టణంలో లాయరు ఆఫీసుకు వెళ్లాను. ఆ లాయరు కోపంతో బల్ల అరలోంచి తుపాకి తీసి అక్కడి నుండి వెళ్లిపొమ్మని అరిచాడు. నేను మనసులో ప్రార్థన చేసుకుని “మృదువైన మాట క్రోధమును చల్లార్చును” అనే బైబిలు ఉపదేశాన్ని గుర్తుచేసుకున్నాను. (సామె. 15:1) “నేను ఒక స్నేహితునిగా సువార్త సందేశంతో మీ దగ్గరకు వచ్చాను, మీరు నన్ను కాల్చనందుకు కృతజ్ఞతలు” అని చెప్పాను. అలా అనేసరికి ఆ లాయరు, తుపాకి ట్రిగ్గర్‌ మీద నుండి వేలు తీసేశాడు. దాంతో నేను అక్కడ నుండి మెల్లగా వెనక్కివచ్చేశాను.

ఆ తర్వాత జాన్‌ను కలిసినప్పుడు తనకూ అలాంటి అనుభవమే ఎదురైందని చెప్పాడు. పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే ఒక బ్యాంకునోటును తాను కలిసిన ఒక స్త్రీ నుండి కాజేశాడనే తప్పుడు ఆరోపణ ఆయన మీద మోపి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. స్టేషన్‌లో జాన్‌ బట్టలను తీయించి సోదాచేశారు. అయితే జాన్‌ దగ్గర బ్యాంకునోట్‌ దొరకలేదనుకోండి. అసలు దొంగ ఆ తర్వాత దొరికాడు.

ప్రశాంతంగా ఉండే పట్టణంలో ఆ రెండు సంఘటనల వల్ల కొంత అలజడి చెలరేగింది. అలా ఎక్కువ కష్టపడకుండానే చాలామందికి మా సందేశం తెలిసింది.

రహస్య కార్యకలాపాలు

ప్రకటనా పని నిషేధించబడిన పొరుగు దేశమైన లాట్వియాకు బైబిలు సాహిత్యాలను చేరవేయడం చాలా ప్రమాదకరమైన పని. మేము అక్కడకు నెలకొకసారి రైలులో రాత్రిళ్లు ప్రయాణం చేసేవాళ్లం. కొన్నిసార్లు సాహిత్యాలను అక్కడ చేరవేసిన తర్వాత మరిన్ని సాహిత్యాల కోసం ఎస్తోనియాకు వెళ్లేవాళ్లం. అక్కడ నుండి వెనక్కి వస్తునప్పుడు వాటిని లాట్వియాకు చేరవేసేవాళ్లం.

ఒక సందర్భంలో కస్టమ్స్‌ అధికారికి మా పని గురించి ఎవరో ఉప్పందించారు. దాంతో ఆయన మమ్మల్ని రైలు దింపి మా దగ్గరున్న సాహిత్యాలను తీసుకొని పైఅధికారి దగ్గరకు రావాలన్నాడు. మాకు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించాం. ఆయన మేమేమి తీసుకువెళ్తున్నామో పైఅధికారికి చెప్పకుండా “వీళ్లేమో చెప్పడానికి వచ్చారు” అని మాత్రమే చెప్పడం మాకు ఆశ్చర్యమనిపించింది. ఈ లోకం ఇన్ని కష్టాలతో ఉండడానికిగల కారణాలను స్కూలు పిల్లలు, కాలేజీ పిల్లలు అర్థంచేసుకోవడానికి సహాయం చేసే సమాచారం ఈ సాహిత్యాల్లో ఉందని ‘చెప్పాను.’ ఆ పైఅధికారి మమ్మల్ని వెళ్లనివ్వడంతో మేము సురక్షితంగా సాహిత్యాలను చేరవేయగలిగాం.

బాల్టిక్‌ రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితి క్షీణిస్తుండడంవల్ల యెహోవాసాక్షుల మీద వ్యతిరేకత ఎక్కువై లిథువానియాలో కూడా ప్రకటనా పని నిషేధించబడింది. ఆండ్రూ, జాన్‌ను అక్కడి నుండి పంపించేశారు. రెండవ ప్రపంచ యుద్ధ ఛాయలు కమ్ముకోవడంతో బ్రిటీష్‌ పౌరులందరినీ దేశం నుండి వెళ్లిపోమన్నారు. నేనూ అక్కడి నుండి వెళ్లిపోవాల్సి వచ్చినందుకు చాలా బాధపడ్డాను.

ఉత్తర ఐర్లాండ్‌లో పొందిన నియామకాలు, ఆశీర్వాదాలు

అప్పటికే మా తల్లిదండ్రులు ఉత్తర ఐర్లాండ్‌కు తరలివెళ్లారు. 1937లో నేనూ వాళ్ల దగ్గరకు వెళ్లాను. యుద్ధ భయంతో ఉత్తర ఐర్లాండ్‌లో కూడా మన సాహిత్యాలను నిషేధించారు. అయినా యుద్ధం జరుగుతున్నప్పుడు మేము ప్రకటించడం మానుకోలేదు. అయితే రెండవ ప్రపంచ యుద్ధ అనంతరం నిషేధం ఎత్తివేయడంతో ప్రకటనా పని మళ్లీ సాఫీగా సాగింది. చైనాలో మిషనరీగా పనిచేసిన అనుభవంగల పయినీరు అయిన హెరాల్డ్‌ కింగ్‌ బహిరంగ స్థలాల్లో ప్రసంగాలు ఇచ్చేందుకు ఏర్పాటుచేశాడు. “ఈ శనివారం, ముందుగా నేను ప్రసంగం ఇస్తాను” అని ఆయన చెప్పాడు. నా వైపు చూసి “వచ్చే శనివారం నువ్వు ఇస్తున్నావ్‌” అని చెప్పాడు. అలా ఒక్కసారిగా చెప్పేసరికి నా నోట మాట రాలేదు.

నా మొదటి ప్రసంగం నాకింకా బాగా గుర్తుంది. దానికి వందలాది మంది హాజరయ్యారు. ఒక పెట్టె మీద నిల్చొని మైక్‌ లేకుండానే ప్రసంగమిచ్చాను. ప్రసంగం పూర్తయిన తర్వాత ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, షేక్‌హ్యాండ్‌ ఇచ్చి తన పేరు బిల్‌ స్మిత్‌ అని పరిచయం చేసుకున్నాడు. జనం గుమికూడడం చూసి ‘ఏమి జరుగుతుందో చూద్దామని వచ్చాను’ అని అన్నాడు. తనను అంతకు ముందే మా నాన్నగారు కలిశారని చెప్పాడు. కానీ పయినీరు సేవ చేయడం కోసం మా నాన్నవాళ్లు డబ్లిన్‌కు వెళ్లడంతో ఆయనను మళ్లీ కలుసుకోలేకపోయారు. ఆయనతో నేను బైబిలు అధ్యయనం ఆరంభించాను. బిల్‌ కుటుంబంలోని మొత్తం తొమ్మిదిమంది యెహోవా ఆరాధకులయ్యారు.

బెల్‌ఫాస్ట్‌ శివార్లలోని పెద్దపెద్ద బంగ్లాలకు వెళ్లి ప్రకటించాను. ఒకప్పుడు లిథువానియాలో నివసించిన రష్యన్‌ స్త్రీని అక్కడ కలిశాను. నేను ఆమెకు కొన్ని సాహిత్యాలను చూపిస్తే, వాటిలో ఒక పుస్తకాన్ని చూసి “ఇది నా దగ్గర ఉంది. కౌనాస్‌లోని విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మా పెదనాన్న నాకు ఇచ్చారు” అని చెప్పింది. ఆమె పోలిష్‌ భాషలోవున్న క్రియేషన్‌ అనే పుస్తకాన్ని నాకు చూపించింది. పుస్తకం అంచుల్లో నోట్సు రాసివుంది. కౌనాస్‌లోని వాళ్ల పెదనాన్నకు ఆ పుస్తకాన్నిచ్చింది నేనేనని తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోయింది.—ప్రసం. 11:1.

ఉత్తర ఐర్లాండుకు వెళ్తున్నానని జాన్‌ సెంపే తెలుసుకొని తన చెల్లెలు నెల్లీ బైబిలు సత్యం పట్ల కొంత ఆసక్తి చూపిస్తుందని చెప్పి నన్ను వెళ్లి కలవమన్నాడు. నా చెల్లెలు కోన్నీ నేనూ తనతో బైబిలు అధ్యయనం ప్రారంభించాం. నెల్లీ త్వరత్వరగా సత్యాన్ని నేర్చుకొని యెహోవాకు తన జీవితాన్ని సమర్పించుకుంది. కొంతకాలానికి ఒకరినొకరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం.

యెహోవా సేవలో నేనూ నెల్లీ 56 సంవత్సరాలు గడిపాం. వందకన్నా ఎక్కువమందికి బైబిలు సత్యాలను నేర్పించే గొప్ప అవకాశం మాకు దొరికింది. మేమిద్దరం జంటగా హార్‌మెగిద్దోనును దాటి నూతనలోకంలోకి వెళ్లాలనుకున్నాం. కానీ 1998లో క్రూర శత్రువైన మరణం ఆమెను నా నుండి దూరం చేసింది. నన్ను కృంగదీసిన అత్యంత తీవ్రమైన పరీక్ష అదే.

బాల్టిక్‌ రాష్ట్రాలకు తిరిగి వెళ్లడం

నెల్లీ చనిపోయి దాదాపు ఏడాది గడిచిన తర్వాత నేనొక అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందాను. ఎస్తోనియాలోని టల్లిన్‌ బ్రాంచి కార్యాలయాన్ని సందర్శించడానికి నన్ను రమ్మన్నారు. ఎస్తోనియాలోని సహోదరులు రాసిన ఉత్తరంలో, “1920ల చివర్లో 1930ల తొలిభాగంలో బాల్టిక్‌ రాష్ట్రాలకు పంపించబడిన పదిమంది సహోదరుల్లో మీరు మాత్రమే ఉన్నారు” అని రాసివుంది. అంతేకాక ఎస్తోనియా, లాట్వియా, లిథువానియాలో జరిగిన పని గురించి బ్రాంచి ఒక నివేదిక తయారు చేయాలనుకుంటుంది కాబట్టి “మీరు రాగలరా?” అని అందులో రాసుంది.

ప్రారంభ సంవత్సరాల్లో నాకూ నాతో పనిచేసిన సహోదరులకూ ఎదురైన అనుభవాలను వారితో పంచుకోవడం ఎంత గొప్ప విషయం! లాట్వియాలో బ్రాంచి కార్యాలయంగా మొదట ఉపయోగించిన అపార్ట్‌మెంటును, పోలీసుల కంటపడకుండా సాహిత్యాలను దాచేందుకు ఉపయోగించిన ఇంటి పైకప్పును సహోదరులకు చూపించగలిగాను. లిథువానియాలో నేను పయినీరు సేవ చేసిన షౌళా అనే చిన్న పట్టణానికి తీసుకెళ్లారు. అందరం ఒకసారి కలుసుకున్నప్పుడు ఒక సహోదరుడు, “చాలాకాలం క్రితం ఈ ఊరిలో నేనూ మా అమ్మ ఒక ఇల్లు కొన్నాం. అటకమీద ఉన్న చెత్తాచెదారాన్ని తీసేస్తుంటే యుగాల కొరకు దైవిక ప్రణాళిక, దేవుని వీణ అనే పుస్తకాలు దొరికాయి. నేను ఆ పుస్తకాలను చదివి వాటిలో సత్యముందని గుర్తించాను. చాలాకాలం క్రితం బహుశా మీరే ఆ పుస్తకాలను అక్కడ వదిలేసివుంటారు” అని అన్నాడు.

నేను పయినీరు సేవ చేసిన పట్టణంలో ప్రాంతీయ సమావేశానికి కూడా హాజరయ్యాను. అయితే ఆ ప్రాంతంలో 65 సంవత్సరాల క్రితం నేను వెళ్లిన ఒక సమావేశానికి 35 మందే హాజరయ్యారు. కానీ ఇప్పుడు 1,500 మందికన్నా ఎక్కువమంది హాజరవడాన్ని చూసి ఎంతో సంతోషించాను! యెహోవా ప్రకటనా పనిని ఎంతగా ఆశీర్వదించాడు!

‘యెహోవా నన్ను విడిచిపెట్టలేదు’

ఈ మధ్యే ఊహించని ఒక ఆశీర్వాదాన్ని పొందాను. బీ అనే ఒక చక్కని క్రైస్తవ సహోదరి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. 2006 నవంబరులో మేము పెళ్లి చేసుకున్నాం.

తన జీవితంలో ఏమి చేయాలని ఆలోచించే ప్రతీ యౌవనస్థునికి, “బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము” అని దైవప్రేరణతో సొలొమోను రాసిన మాటలను పాటించడం ఎంతో తెలివైన పని అని ఖచ్చితంగా చెప్పగలను. “దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవువారికందరికి నీశౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునైయుండువరకు నన్ను విడువకుము” అని కీర్తనకర్త సంతోషంగా చెప్పినట్లే ఇప్పుడు నేనూ చెప్పగలను.—కీర్త. 71:17, 18.

[25వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

లాట్వియాకు సాహిత్యాలను చేరవేయడం ప్రమాదకరంగా ఉండేది

ఎస్తోనియా

టల్లిన్‌

రీగా సింధుశాఖ

లాట్వియా

రీగా

లిథువానియా

విల్నా

కౌనాస్‌

[26వ పేజీలోని చిత్రం]

15 ఏళ్లున్నప్పుడు స్కాట్లండ్‌లో కల్‌పోర్చర్‌గా (పయినీరుగా) సేవచేయడం మొదలుపెట్టాను

[26వ పేజీలోని చిత్రం]

1942లో, మా పెళ్లప్పుడు నెల్లీతో