కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భూమ్మీద నిత్యజీవం దేవుడు ఇచ్చిన నిరీక్షణ

భూమ్మీద నిత్యజీవం దేవుడు ఇచ్చిన నిరీక్షణ

భూమ్మీద నిత్యజీవం దేవుడు ఇచ్చిన నిరీక్షణ

‘సృష్టి నిరీక్షణ కలదై వ్యర్థపరచబడింది.’—రోమా. 8:20.

1, 2. (ఎ) భూమ్మీద నిరంతరం జీవించడానికి సంబంధించిన నిరీక్షణ మనకు ఎందుకు ప్రాముఖ్యం? (బి) భూమ్మీద నిరంతరం జీవించడం అసాధ్యమని చాలామంది ఎందుకు అనుకుంటారు?

సమీప భవిష్యత్తులో ప్రజలు మరణం, వృద్ధాప్యం లేకుండా ఇదే భూమ్మీద నిరంతరం జీవిస్తారని తెలుసుకున్నప్పుడు మీరు ఎంత సంతోషించారో మీకు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. (యోహా. 17:3; ప్రక. 21:3, 4) బైబిలు అలాంటి భవిష్యత్తు గురించి మాట్లాడుతుందని మీరు సంతోషంగా ఇతరులకు చెప్పివుంటారు. ఎంతైనా, ప్రకటనా పనిలో మనం నిత్యజీవానికి సంబంధించిన నిరీక్షణ గురించే ఎక్కువగా మాట్లాడుతుంటాం. జీవితం విషయంలో మన అభిప్రాయాన్ని, మనం చేసే పనులను, సమస్యలను ఎదుర్కొనే విధానాన్ని అది ప్రభావితం చేస్తుంది.

2 సాధారణంగా, క్రైస్తవమత సామ్రాజ్యంలోని మతశాఖలు భూమ్మీద నిరంతరం జీవించే అవకాశముందన్న విషయాన్ని చాలావరకూ నిర్లక్ష్యం చేశాయి. మానవుడు మరణించినప్పుడు అతనిలో ఏదీ సజీవంగా ఉండదని బైబిలు బోధిస్తుంటే, చాలా చర్చీలు మానవులకు అమర్త్యమైన ఆత్మ ఉంటుందని, అది మరణం తర్వాత ఆత్మ లోకంలో సజీవంగా ఉంటుందని బోధిస్తున్నాయి. (ప్రసం. 9:5) కాబట్టి, చాలామంది భూమ్మీద నిరంతరం జీవించడం అసాధ్యమని అనుకుంటారు. అందుకే, మనం భూమ్మీద నిరంతరం జీవిస్తామని అసలు బైబిలు బోధిస్తోందా, అలా అది బోధిస్తున్నట్లయితే, దేవుడు ఈ విషయాన్ని మానవులకు మొదట ఎప్పుడు చెప్పాడు వంటి ప్రశ్నలు మనకు రావచ్చు.

‘సృష్టి నిరీక్షణ కలదై వ్యర్థపరచబడింది’

3. చరిత్ర ప్రారంభంలోనే మానవులపట్ల దేవునికున్న ఉద్దేశం ఎలా స్పష్టమైంది?

3 చరిత్ర ప్రారంభంలోనే మానవులపట్ల యెహోవాకున్న ఉద్దేశం స్పష్టమైంది. ఆదాము విధేయునిగా ఉంటే అతడు నిరంతరం జీవిస్తాడని దేవుడు స్పష్టంగా చెప్పాడు. (ఆది. 2:9, 17; 3:22) మానవులు పరిపూర్ణతను కోల్పోయారని ఆదాము తర్వాతి తరాలవారు తెలుసుకునేవుంటారు. ఏదెను తోటలో ప్రవేశించలేకపోవడం, మానవులు వృద్ధులై మరణించడం వంటివి గమనించి తాము తెలుసుకుంది నిజమని వారికి అర్థమైంది. (ఆది. 3:23, 24) కాలం గడిచేకొద్ది మానవుల ఆయుష్షు తగ్గుతూవచ్చింది. ఆదాము 930 ఏళ్లు జీవించాడు. జలప్రళయాన్ని తప్పించుకున్న షేమును తీసుకుంటే ఆయన 600 సంవత్సరాలే జీవించాడు. ఆయన కుమారుడు అర్పక్షదు 438 సంవత్సరాలు జీవించాడు. తెరహు 205 ఏళ్లు జీవిస్తే, ఆయనకు పుట్టిన అబ్రాహాము 175 ఏళ్లే జీవించాడు. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు 180 సంవత్సరాలు జీవిస్తే, యాకోబు 147 సంవత్సరాలే జీవించాడు. (ఆది. 5:5; 11:10-13, 32; 25:7; 35:28; 47:28) నిత్యమూ జీవించే అవకాశాన్ని కోల్పోయాం కాబట్టే అలా ఆయుష్షు తగ్గుతూ వచ్చిందని చాలామంది గ్రహించివుంటారు. మానవులు మళ్లీ నిత్యమూ జీవించగలరని వారు ఎందుకు నమ్మారు?

4. ఆదాము కోల్పోయిన ఆశీర్వాదాలను దేవుడు మళ్లీ ఇస్తాడని ప్రాచీన కాలంలోని నమ్మకమైన సేవకులు ఎందుకు విశ్వసించగలిగారు?

4 దేవుని వాక్యం ఇలా చెబుతోంది: ‘[మానవ] సృష్టి నిరీక్షణకలదై వ్యర్థపరచబడెను.’ (రోమా. 8:20) మానవులకు ఏ నిరీక్షణ ఇవ్వబడింది? బైబిల్లోని మొట్టమొదటి ప్రవచనం, ‘సర్పము తలను’ చితకగొట్టే “సంతానము” గురించి తెలియజేసింది. (ఆదికాండము 3:1-5, 15 చదవండి.) దేవుడు సంతానం గురించి అలా వాగ్దానం చేశాడు కాబట్టి మానవులపట్ల తనకున్న ఉద్దేశాన్ని ఆయన తప్పక నెరవేరుస్తాడని నమ్మకస్థులైన మానవులు ఆశతో ఎదురుచూశారు. ఆ వాగ్దానాన్నిబట్టే హేబెలు, నోవహు వంటి వారు ఆదాము కోల్పోయిన ఆశీర్వాదాలను దేవుడు మళ్లీ నమ్మకస్థులైన మానవులకు ఇస్తాడని విశ్వసించగలిగారు. ‘మడిమె మీద కొట్టబడినప్పుడు’ రక్తం చిందుతుందని వారు గుర్తించివుంటారు.—ఆది. 4:4; 8:20; హెబ్రీ. 11:4.

5. పునరుత్థానం మీద అబ్రాహాముకు నమ్మకముందని ఎలా చెప్పవచ్చు?

5 అబ్రాహాము విషయం తీసుకోండి. దేవుడు అబ్రాహామును పరీక్షించినప్పుడు, ఆయన తన ఏకైక పుత్రుడైన ఇస్సాకును బలిగా అర్పించబోయాడు. ఆయన అలా అర్పించడానికి ఎందుకు సిద్ధపడ్డాడు? (హెబ్రీయులు 11:17-19 చదవండి.) ఎందుకంటే, తన కుమారుణ్ణి దేవుడు పునరుత్థానం చేయగలడని ఆయన నమ్మాడు! ఆయనలా నమ్మడానికి కారణముంది. ఎంతైనా, యెహోవా ఆయనకు మళ్లీ పిల్లలను కనే శక్తిని ఇచ్చాడు. అలా ఆయనకు, ఆయన భార్యయైన శారాకు ముసలితనంలో ఒక కుమారుడు పుట్టేలా యెహోవా చేశాడు. (ఆది. 18:10-14; 21:1-3; రోమా. 4:19-21) అంతేకాక, “ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును” అని యెహోవా అబ్రాహాముకు మాట కూడ ఇచ్చాడు. (ఆది. 21:12) అందుకే, దేవుడు ఇస్సాకును పునరుత్థానం చేస్తాడని అబ్రాహాము బలంగా నమ్మాడు.

6, 7. (ఎ) యెహోవా అబ్రాహాముతో ఏ నిబంధన చేశాడు? (బి) అబ్రాహాముకు యెహోవా చేసిన వాగ్దానం మానవులకు నిరీక్షణ ఉందని ఎలా చూపించింది?

6 అబ్రాహాము అసాధారణమైన విశ్వాసాన్ని చూపించాడు. అందుకే అతని ‘సంతానం’ విషయంలో యెహోవా అబ్రాహాముతో నిబంధన చేశాడు. (ఆదికాండము 22:18 చదవండి.) ఆ ‘సంతానంలో’ ప్రాథమిక భాగం యేసుక్రీస్తే అని ఆ తర్వాత తెలిసింది. (గల. 3:16) ఆయన ‘సంతానం’ ‘ఆకాశ నక్షత్రములవలె, సముద్రతీరమందలి యిసుకవలె’ విస్తరిస్తుందని యెహోవా వాగ్దానం చేశాడు. ఆ సంతానంలో ఎంతమంది ఉంటారో అబ్రాహాముకు తెలియదు. (ఆది. 22:17) అయితే, ఆ తర్వాత వారి సంఖ్య తెలియజేయబడింది. యేసుక్రీస్తు, ఆయనతోపాటు పరిపాలించే 1,44,000 మంది ఆ ‘సంతానం’లో ఉంటారని బైబిలు చెబుతోంది. (గల. 3:29; ప్రక. 7:4; 14:1) అలా మెస్సీయ రాజ్యం ద్వారా ‘భూలోకములోని జనములన్నీ ఆశీర్వదించబడతాయి.’

7 యెహోవా తనతో చేసిన నిబంధన అబ్రాహాముకు పూర్తిగా అర్థమైవుండదు. అయినా, ‘పునాదులుగల ఆ పట్టణముకోసం ఆయన ఎదురుచూశాడు’ అని బైబిలు చెబుతోంది. (హెబ్రీ. 11:10) దేవుని రాజ్యమే ఆ పట్టణం. ఆ రాజ్యంలో ఆశీర్వాదాలను పొందాలంటే అబ్రాహాము మళ్లీ బ్రతకాలి. ఎందుకంటే, ఆయన పునరుత్థానం చేయబడితేనే భూమ్మీద నిత్యం జీవించగలడు. ఆర్మగెద్దోనును తప్పించుకునేవారు లేక పునరుత్థానం చేయబడేవారు మాత్రమే నిత్యజీవం పొందే అవకాశముంది.—ప్రక. 7:9, 14; 20:12-14.

“ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది”

8, 9. ఓ వ్యక్తి ఎదుర్కొన్న పరీక్షల గురించి మాత్రమే యోబు గ్రంథం వివరించడంలేదని ఎందుకు చెప్పవచ్చు?

8 అబ్రాహాము మునిమనవడైన యోసేపు జీవించిన కాలానికీ, ప్రవక్తయైన మోషే జీవించిన కాలానికీ మధ్యలో యోబు అనే వ్యక్తి జీవించాడు. యోబు గ్రంథాన్ని మోషే రాసివుంటాడు. యోబు పరీక్షలను ఎదుర్కొనేందుకు యెహోవా ఎందుకు అనుమతించాడో, ఆ తర్వాత ఏమి జరిగిందో ఆ గ్రంథం వివరిస్తుంది. అయితే యోబు గ్రంథం ఓ వ్యక్తి ఎదుర్కొన్న పరీక్షలను మాత్రమే కాదు, మానవులనూ, ఆత్మ ప్రాణులనూ ప్రభావితం చేసే విషయాలను కూడ వివరిస్తోంది. యెహోవా నీతియుక్తంగా పరిపాలిస్తాడని ఈ గ్రంథం తెలియజేస్తుంది. భూమ్మీది దేవుని సేవకుల యథార్థతకు, వారి భవిష్యత్తుకు ఏదెనులో లేవదీయబడిన వివాదాంశంతో సంబంధముందని అది తెలియజేస్తుంది. ఆ వివాదాంశం గురించి యోబుకు తెలియకపోయినా, తన సహచరులు తనకు విరుద్ధంగా ఎన్ని మాటలన్నా తాను మాత్రం తన యథార్థతను కోల్పోలేదని ఆయన నమ్మాడు. (యోబు 27:5) అది మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. అంతేకాక, మనం మన యథార్థతను నిలుపుకొని, యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించగలమనే నమ్మకాన్ని మనలో కలిగిస్తుంది.

9 పేరుకు మాత్రమే ఆదరణకర్తలైన యోబు ముగ్గురు స్నేహితులు మాట్లాడడం ఆపిన తర్వాత ‘బూజీయుడైన బరకెయేలు కుమారుడగు ఎలీహు మాటలాడడం మొదలుపెట్టాడు.’ అలా మాట్లాడేలా ఆయనను ఏది ప్రోత్సహించింది? “నా మనస్సునిండ మాటలున్నవి నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది” అని ఆయన అన్నాడు. (యోబు 32:5, 6, 18) దైవప్రేరణతో ఎలీహు మాట్లాడిన మాటలు, యోబు పరీక్షలు పూర్తైనప్పుడు నెరవేరాయి. ఎలీహు మాటలు యోబు విషయంలో నెరవేరినప్పటికీ అవి ఇతరులకూ ఎంతో ప్రాముఖ్యమైనవి. ఆయన మాటలు, మంచి భవిష్యత్తు ఉందనే అభయాన్ని యథార్థవంతులందరికీ ఇచ్చాయి.

10. కొన్నిసార్లు యెహోవా దేవుడు ఒకే ఒక వ్యక్తికి సందేశమిచ్చినా దానిలో మానవులందరికీ వర్తించే సమాచారం ఉండొచ్చని ఎలా చెప్పవచ్చు?

10 కొన్నిసార్లు యెహోవా దేవుడు ఒకే ఒక వ్యక్తికి సందేశమిచ్చినా దానిలో మానవులందరికీ వర్తించే సమాచారం ఉండొచ్చు. దీనికి బబులోను రాజైన నెబుకద్నెజరు కన్న కల ఓ ఉదాహరణ. ఆ కలలో ఓ పెద్ద వృక్షం నరికివేయబడిందని దానియేలు ప్రవచించాడు. (దాని. 4:10-27) నెబుకద్నెజరు విషయంలో ఆ కల నెరవేరినప్పటికీ, అది మరింత గొప్ప విషయాన్ని సూచించింది. రాజైన దావీదు వంశీయుల పరిపాలన ద్వారా యెహోవా భూమిపట్ల తన సర్వాధిపత్యాన్ని సా.శ.పూ. 607 వరకు చూపించాడని, ఆ సంవత్సరం మొదలుకొని 2,520 సంవత్సరాల తర్వాత దాన్ని మళ్లీ చూపిస్తాడని అది సూచించింది. * దేవుడు 1914లో పరలోకంలో యేసుక్రీస్తును రాజుగా నియమించి భూమిపట్ల తన సర్వాధిపత్యాన్ని సరికొత్తగా చూపించసాగాడు. ఆ రాజ్య పరిపాలన, విధేయులైన మానవుల ఆశలను త్వరలో ఎలా నెరవేరుస్తుందో ఒక్కసారి ఆలోచించండి!

“పాతాళములోనికి దిగి వెళ్లకుండ వానిని విడిపింపుము”

11. ఎలీహు మాటలు దేవుని గురించి ఏమి తెలియజేస్తున్నాయి?

11 ఎలీహు యోబుకు జవాబిస్తూ, ‘నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడైన ఒక మధ్యవర్తి’ గురించి చెప్పాడు. ఈ మధ్యవర్తి ‘దేవుడు వానిని కటాక్షించేలా బతిమాలుకుంటే’ ఏమి జరుగుతుంది? అప్పుడు ఏమి జరుగుతుందో ఎలీహు చెప్పాడు. ఆయన, “దేవుడు వానియందు కరుణ జూపి—పాతాళములోనికి దిగి వెళ్లకుండ వానిని విడిపింపుము ప్రాయశ్చిత్తము నాకు దొరకెనని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలురమాంసముకన్న ఆరోగ్యముగా నుండును. వానికి తన చిన్ననాటిస్థితి తిరిగి కలుగును” అని అన్నాడు. (యోబు 33:23-26) దేవుడు పశ్చాత్తాపపడిన మానవుల తరఫున చెల్లించబడే ‘ప్రాయశ్చిత్తాన్ని’ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని ఆ మాటలు సూచిస్తున్నాయి.—యోబు 33:24.

12. ఎలీహు మాటలు మానవులకు ఏ నిరీక్షణను ఇచ్చాయి?

12 ప్రవక్తలు తాము రాసిన ప్రతీ విషయాన్ని పూర్తిగా అర్థంచేసుకోనట్లే ఎలీహు కూడా ప్రాయశ్చిత్తం గురించి పూర్తిగా అర్థంచేసుకొనివుండడు. (దాని. 12:8; 1 పేతు. 1:10-12) అయినప్పటికీ, దేవుడు ఏదో ఒక రోజు ప్రాయశ్చిత్తాన్ని లేదా విమోచనా క్రయధనాన్ని అంగీకరించి, మానవులను వృద్ధాప్యంవల్ల వచ్చే బాధల నుండి, మరణం నుండి విముక్తి చేస్తాడనే ఆశ ఎలీహు మాటల్లో కనిపిస్తుంది. ఎలీహు మాటలు నిత్యజీవమనే అద్భుతమైన నిరీక్షణ ఉందని చూపించాయి. పునరుత్థానం జరుగబోతుందని కూడ యోబు గ్రంథం చూపిస్తోంది.—యోబు 14:14, 15.

13. ఎలీహు మాటలు క్రైస్తవులకు ఎందుకు ప్రాముఖ్యమైనవి?

13 నేడు కూడ ఈ దుష్ట విధాన నాశనాన్ని తప్పించుకోవాలని ఆశిస్తున్న లక్షలాదిమంది క్రైస్తవులకు ఎలీహు మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఆ నాశనాన్ని తప్పించుకునే వృద్ధులకు మళ్లీ చిన్ననాటి స్థితి కలుగుతుంది. (ప్రక. 7:9, 10, 14-17) అంతేకాక, పునరుత్థానం చేయబడేవారు యౌవనస్థులుగా లేపబడడాన్ని కళ్లారా చూస్తామనే ఆశతో నమ్మకమైన దేవుని సేవకులు ఎంతో సంతోషిస్తారు. క్రీస్తు విమోచన క్రయధన బలిపట్ల విశ్వాసం చూపిస్తేనే అభిషిక్త క్రైస్తవులు పరలోకంలో అమర్త్యమైన జీవితాన్ని పొందుతారు. ‘వేరేగొర్రెలకు’ చెందినవారు భూమ్మీద నిరంతర జీవితాన్ని పొందుతారు.—యోహా. 10:16; రోమా. 6:23.

భూమ్మీద నుండి మరణం మ్రింగివేయబడును

14. నిరంతరం జీవించే నిరీక్షణను కలిగివుండాలంటే ఇశ్రాయేలీయులు మోషే ధర్మశాస్త్రం విధించిన శాపం నుండి విముక్తి చేయబడాలని ఏది చూపిస్తుంది?

14 దేవునితో నిబంధన చేసుకున్నప్పుడు అబ్రాహాము సంతానం ఓ స్వతంత్ర జనాంగమైంది. యెహోవా వారికి ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు, “మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటివలన బ్రదుకును” అని ఆజ్ఞాపించాడు. (లేవీ. 18:5) అయితే, ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రంలోని పరిపూర్ణ ప్రమాణాలను పాటించలేకపోయారు కాబట్టి, ధర్మశాస్త్రం వారిని దోషులుగా తీర్పు తీర్చింది. వారిని ఆ శాపం నుండి విడిపించాలంటే మోషే ధర్మశాస్త్రం కన్నా గొప్పది అవసరమైంది.—గలతీయులు 3:13 చదవండి.

15. దావీదు దైవప్రేరణతో, భవిష్యత్తులో మానవులు ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుతారని రాశాడు?

15 మోషే తర్వాత వచ్చిన బైబిలు రచయితలు యెహోవా ప్రేరణతో నిత్యజీవ నిరీక్షణ గురించి రాశారు. (కీర్త. 21:4; 37:29) ఉదాహరణకు, సీయోనులోని సత్యారాధకుల మధ్య ఉన్న ఐక్యత గురించి రాస్తూ కీర్తనకర్తయైన దావీదు, “ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చియున్నాడు” అని అన్నాడు.—కీర్త. 133:3.

16. యెషయా ద్వారా ‘భూమంతటి’ భవిష్యత్తు గురించి యెహోవా ఏమని వాగ్దానం చేశాడు?

16 భూమ్మీద నిరంతర జీవితం గురించి ప్రవచించేందుకు యెహోవా యెషయాను ప్రేరేపించాడు. (యెషయా 25:7, 8 చదవండి.) ఊపిరాడకుండా చేసే ‘ముసుకులా’ పాపమరణాలు మానవులను పట్టిపీడిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. “భూమిమీదనుండి” పాపమరణాలు మ్రింగివేయబడతాయని యెహోవా తన ప్రజలకు హామీనిస్తున్నాడు.

17. యెషయా ప్రవచనం ప్రకారం, నిత్యజీవ మార్గాన్ని తెరిచేందుకు మెస్సీయ ఏ పాత్రను పోషించాడు?

17 మోషే ధర్మశాస్త్రంలో విడిచిపెట్టబడే మేక గురించి ఇవ్వబడిన ఆజ్ఞను కూడ పరిశీలించండి. సంవత్సరానికి ఒకసారి, ప్రాయశ్చిత్తార్థ దినాన, ప్రధాన యాజకుడు ‘సజీవమైన ఆ మేక తలమీద తన రెండుచేతులు ఉంచి, ఇశ్రాయేలీయుల పాపములన్నీ, అంటే వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ దానిమీద ఒప్పుకొని, ఆ మేక తలమీద వాటిని మోపి, అరణ్యములోనికి దాని పంపించాలి, ఆ మేక వారి దోషాలన్నీ భరిస్తూ ఎడారి దేశానికి వెళ్తుంది.’ (లేవీ. 16:7-10, 21, 22) అలాంటి పాత్ర పోషించే మెస్సీయ వస్తాడని యెషయా ప్రవచించాడు. ఆ మెస్సీయ ‘రోగాలను,’ ‘వ్యసనాలను’ లేదా బాధలను, ‘అనేకుల పాపాలను’ భరించి, మానవులు నిత్యజీవం పొందేందుకు మార్గాన్ని తెరుస్తాడు.—యెషయా 53:4-6, 12 చదవండి.

18, 19. యెషయా 26:19లో, దానియేలు 12:13లో ఏ నిరీక్షణ గురించి చెప్పబడింది?

18 యెహోవా యెషయా ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాడు: “మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.” (యెష. 26:19) మృతులు తిరిగి లేపబడతారని, మానవులు ఈ భూమ్మీదే జీవిస్తారని హెబ్రీ లేఖనాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. ఉదాహరణకు, దానియేలుకు దాదాపు 100 ఏళ్లు ఉన్నప్పుడు యెహోవా ఆయనకు, “విశ్రాంతినొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు” అనే అభయాన్నిచ్చాడు.—దాని. 12:13.

19 మృతులు తిరిగి లేపబడతారనే నమ్మకంతోనే మార్త యేసుతో, “అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదును” అని మరణించిన తన సహోదరుని గురించి చెప్పగలిగింది. (యోహా. 11:24) యేసు బోధలు, దైవప్రేరణతో ఆయన శిష్యులు రాసిన పత్రికలు ఆ నిరీక్షణకు భిన్నమైన విషయాలు చెబుతున్నాయా? భూమ్మీద నిరంతరం జీవించే నిరీక్షణను యెహోవా మానవులకు ఇప్పటికీ ఇస్తున్నాడా? తర్వాతి ఆర్టికల్‌లో మనం ఈ ప్రశ్నలకు జవాబులను చూద్దాం.

[అధస్సూచి]

మీరు వివరించగలరా?

• మానవ సృష్టి ఏ నిరీక్షణనుబట్టి ‘వ్యర్థపరచబడింది’?

• అబ్రాహాముకు పునరుత్థానంమీద నమ్మకం ఉందని మనం ఎలా చెప్పవచ్చు?

• యోబుతో ఎలీహు అన్న మాటలు మానవులకు ఏ నిరీక్షణను ఇస్తున్నాయి?

• మృతులు తిరిగి లేపబడతారని, మానవులు ఈ భూమ్మీద నిరంతరం జీవిస్తారని హెబ్రీ లేఖనాలు ఎలా నొక్కిచెబుతున్నాయి?

[అధ్యయన ప్రశ్నలు]

[5వ పేజీలోని చిత్రం]

యోబుతో ఎలీహు అన్న మాటలు, మానవులకు ముసలితనం, మరణంలేని పరిస్థితి రాబోతుందనే ఆశను కలిగిస్తున్నాయి

[6వ పేజీలోని చిత్రం]

దానియేలు ‘కాలాంతమందు తన వంతులో నిలుస్తాడని’ యెహోవా అభయాన్ని ఇచ్చాడు