కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రీస్తులాంటి మనసును కలిగివుండండి

క్రీస్తులాంటి మనసును కలిగివుండండి

క్రీస్తులాంటి మనసును కలిగివుండండి

‘క్రీస్తుయేసునకు కలిగిన మనస్సు మీరును కలిగియుండుడి.’—ఫిలి. 2:5.

1. క్రీస్తులా ఉండేందుకు మనం ఎందుకు కృషిచేయాలి?

‘నా యొద్దకు రండి. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను కాబట్టి నాయొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును’ అని యేసు చెప్పాడు. (మత్త. 11:28, 29) ఆప్యాయతతో యేసు చెప్పిన ఆ మాటలు ఆయనకు ఎంత ప్రేమవుందో తెలియజేస్తున్నాయి. ఆయనంత మంచి మాదిరిని మరెవరూ ఉంచలేరు. ఆయన దేవుని కుమారుడే అయినా, ఆయనకు ఎంతో అధికారం, శక్తివున్నా, ఆయన ప్రాముఖ్యంగా బాధపడుతున్నవారి పట్ల దయ చూపించాడు. వారికి వచ్చిన కష్టం తనకే వచ్చినంతగా బాధపడ్డాడు.

2. యేసు చూపించిన ఏ లక్షణాలను మనం ఇప్పుడు తెలుసుకుంటాం?

2 ఈ ఆర్టికల్‌లో, తర్వాతి రెండు ఆర్టికల్స్‌లో మనం “క్రీస్తు మనస్సు”ను ఎలా పెంపొందించుకోవచ్చో, దాన్ని మన జీవితంలోని అన్ని సందర్భాల్లో ఎలా కనబరచవచ్చో పరిశీలిస్తాం. (1 కొరిం. 2:16) సాత్వికం మరియు వినయం, దయ, విధేయత, ధైర్యం, చెక్కుచెదరని ప్రేమ అనే ఐదు లక్షణాలను ఆయన ఎలా చూపించాడో మనం ముఖ్యంగా తెలుసుకుంటాం.

క్రీస్తులా సాత్వికాన్ని కనబరచండి

3. (ఎ) వినయం చూపించే విషయంలో యేసు తన శిష్యులకు నేర్పించిన ఒక పాఠమేమిటి? (బి) తన శిష్యులు బలహీనతలు కనబరచినప్పుడు యేసు ఎలా స్పందించాడు?

3 దేవుని పరిపూర్ణ కుమారుడైన యేసు అపరిపూర్ణులైన, పాపులైన మానవుల మధ్య సేవచేయడానికి ఇష్టపూర్వకంగా భూమ్మీదకు వచ్చాడు. వారిలో కొందరు తనను చంపబోతున్నారని తెలిసినా యేసు ఎప్పుడూ తన ఆనందాన్నీ, నిగ్రహాన్నీ కోల్పోలేదు. (1 పేతు. 2:21-23) ఇతరులు మన విషయంలో పొరపాట్లు చేయవచ్చు లేదా అపరిపూర్ణతల వల్ల మన మనసు బాధపెట్టవచ్చు. అలాంటప్పుడు మనం యేసు మాదిరిని ‘చూస్తే’ లేదా పరిశీలిస్తే మనం కూడ మన ఆనందాన్ని కాపాడుకోగలుగుతాం, నిగ్రహాన్ని కోల్పోకుండా ఉండగలుగుతాం. (హెబ్రీ. 12:1, 2) తనతోపాటు తన కాడిని ఎత్తుకొని తన నుండి నేర్చుకోమని యేసు తన శిష్యులను ప్రోత్సహించాడు. (మత్త. 11:29) వారు ఏమి నేర్చుకోవచ్చు? మొదటిగా, యేసు సాత్వికుడు. తన శిష్యులు తప్పులు చేసినా వారితో ఆయన ఓపిగ్గా వ్యవహరించాడు. తాను చనిపోయే ముందు రాత్రి యేసు వారి పాదాలు కడిగి, ‘దీనమనస్సు’ కనబరిచే విషయంలో వారు ఎప్పటికీ మరచిపోలేని ఓ పాఠాన్ని నేర్పించాడు. (యోహాను 13:14-17 చదవండి.) పేతురు, యాకోబు, యోహానులు ‘మెలకువగా’ ఉండలేకపోయినప్పుడు, యేసు సానుభూతితో వారి బలహీనతలను అర్థంచేసుకున్నాడు. “సీమోనూ, నీవు నిద్రించుచున్నావా? . . . మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము” అని యేసు అన్నాడు.—మార్కు 14:32-38.

4, 5. ఇతరులు పొరపాట్లు చేసినప్పుడు సరైన విధంగా స్పందించేలా యేసు ఉదాహరణ మనకు ఎలా సహాయం చేస్తుంది?

4 మన తోటివిశ్వాసుల్లో కొందరికి పోటీతత్వం ఉండవచ్చు, త్వరగా కోపగించుకునే స్వభావం ఉండవచ్చు. పెద్దలు లేక “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ఇచ్చే నిర్దేశాన్ని వారు వెంటనే పాటించకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం? (మత్త. 24:45-47) అలాంటి లక్షణాలు లోకస్థులు కనబరిస్తే అది మామూలే అని సర్దిచెప్పుకుంటాం కానీ మన సహోదరులే వాటిని కనబరిస్తే వారిని క్షమించడం మనకు కష్టమనిపించవచ్చు. ఇతరుల తప్పిదాలను చూసి మనకు వెంటనే కోపమొస్తుంటే, ‘నేను “క్రీస్తు మనసును” మరింత చక్కగా ఎలా కనబరచవచ్చు?’ అని ఆలోచించాలి. తన శిష్యులు కొన్ని విషయాల్లో తన మాదిరిని అనుసరించకపోయినా యేసు వారిమీద విసుక్కోలేదని గుర్తుంచుకోండి.

5 అపొస్తలుడైన పేతురు విషయమే తీసుకోండి. దోనె దిగి నీటిమీద నడుచుకుంటూ తన దగ్గరకు రమ్మని యేసు పేతురుకు చెప్పినప్పుడు ఆయన కొంతదూరం నీటిమీద నడిచాడు గానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. యేసు ఆయనను కోపగించుకొని, “నీకిది జరగాల్సిందే! ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో” అని అన్నాడా? లేదు! ఆయన తన చెయ్యిచాపి అతణ్ణి పట్టుకొని, “అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివి” అని అన్నాడు. (మత్త. 14:28-31) పేతురుకు సహాయం చేయడానికి యేసు చేయి అందించినట్లే, మనం కూడ మన సహోదరుడికి మరింత విశ్వాసం అవసరమైతే ఆయనకు దయతో సహాయం చేయాలి. ఈ పాఠాన్ని పేతురు పట్ల యేసు సాత్వికంతో వ్యవహరించిన తీరు నుండి నేర్చుకుంటాం.

6. గొప్పతనం కోసం ప్రాకులాడే విషయంలో యేసు తన అపొస్తలులకు ఏమి బోధించాడు?

6 తమలో ఎవరు గొప్పవారు అని అపొస్తలులు ఎప్పుడూ వాదులాడుకొనేవారు. పేతురు కూడ వారితో వాదించేవాడు. యేసు రాజ్యంలో ఆయనకు కుడిప్రక్కన ఒకరు, ఎడమప్రక్కన మరొకరు కూర్చోవాలని యాకోబు యోహానులు కోరుకున్నారు. అది విన్నప్పుడు పేతురుకు, ఇతర అపొస్తలులకు కోపం వచ్చింది. వారు ఆ పోటీ స్వభావాన్ని తాము పెరిగిన సమాజంలో నేర్చుకొనివుంటారని యేసుకు తెలుసు. అందుకే, వారిని తన దగ్గరకు పిలిచి, “అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును. మీలో ఆలాగుండకూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను; మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను” అని అన్నాడు. యేసు తాను ఉంచిన మాదిరిని తెలియజేస్తూ, “ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను” అని అన్నాడు.—మత్త. 20:20-28.

7. సంఘం ఐక్యంగా ఉండేందుకు మనవంతు కృషి ఎలా చేయవచ్చు?

7 వినయం కనబరిచే విషయంలో యేసు మాదిరిని ధ్యానిస్తే మనం మన సహోదరుల మధ్య ‘అత్యల్పులముగా ఉండగలుగుతాం.’ (లూకా 9:46-48) అలా సంఘ ఐక్యతకు మన వంతు కృషి చేయగలుగుతాం. ఓ పెద్ద కుటుంబంలో తండ్రిలాగే యెహోవా తన పిల్లలందరూ ‘ఐక్యంగా నివసించాలని’ కోరుకుంటాడు. (కీర్త. 133:1) క్రైస్తవులందరి కోసం యేసు ఇలా ప్రార్థించాడు: “వారియందు నేనును నాయందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.” (యోహా. 17:23) కాబట్టి, మనం ఐక్యంగా ఉంటే మనం క్రీస్తు అనుచరులమని ఇతరులు గుర్తిస్తారు. అలాంటి ఐక్యత ఉండాలంటే మనం ఇతరుల అపరిపూర్ణతల విషయంలో యేసులాగే ప్రవర్తించాలి. యేసు ఇతరులను క్షమించాడు. మనం ఇతరులను క్షమిస్తేనే మన తప్పులు క్షమించబడతాయని కూడ ఆయన బోధించాడు.—మత్తయి 6:14, 15 చదవండి.

8. ఎన్నో ఏళ్లుగా క్రీస్తును అనుసరిస్తూ వస్తున్నవారి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

8 ఎన్నో ఏళ్లుగా క్రీస్తును అనుసరిస్తూ వచ్చినవారి విశ్వాసాన్ని అనుకరించడం ద్వారా కూడ మనం ఎంతో నేర్చుకోవచ్చు. యేసులాగే వారు సాధారణంగా ఇతరుల అపరిపూర్ణతలను అర్థంచేసుకొని ప్రవర్తిస్తారు. క్రీస్తులా కనికరం చూపిస్తే ‘బలహీనుల దౌర్బల్యములను భరించగలుగుతామనీ’ సంఘ ఐక్యతకు దోహదపడగలుగుతామనీ వారు గ్రహించారు. అంతేకాక, సంఘమంతా క్రీస్తు మనసును కనబరిచేందుకు అది ప్రోత్సహిస్తుంది. అపొస్తలుడైన పౌలు రోమాలోని క్రైస్తవుల విషయంలో కోరుకున్నట్లే వీరు తమ సహోదరుల విషయంలో కోరుకుంటారు. ఆయన ఇలా అన్నాడు: “మీరేకభావము గలవారై యేకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము, క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసినవారై [‘క్రీస్తుయేసుకున్న మనసుతో ఐక్యంగా,’ NW] యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక.” (రోమా. 15:1, 5, 6) మనం ఐక్యంగా ఆరాధించడం ద్వారా యెహోవాను ఘనపరుస్తాం.

9. యేసు మాదిరిని అనుకరించడానికి మనకు ఎందుకు పరిశుద్ధాత్మ సహాయం అవసరం?

9 యేసు ‘సాత్వికాన్ని’ ఆత్మఫలంలోని దీనమనస్సుతో ముడిపెట్టాడు. కాబట్టి, యేసు మాదిరిని పరిశోధించడంతోపాటు, యెహోవా పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకుంటేనే మనం యేసు మాదిరిని సరైన విధంగా అనుకరించగలుగుతాం. దేవుని పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించి, ఆత్మ ఫలంలోని “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” వంటి లక్షణాలను పెంపొందించుకునేందుకు కృషిచేయాలి. (గల. 5:22, 23) యేసులా మనం వినయాన్ని, సాత్వికాన్ని చూపిస్తే మన పరలోక తండ్రియైన యెహోవాను సంతోషపెట్టగలుగుతాం.

యేసు ఇతరుల పట్ల దయతో ప్రవర్తించాడు

10. యేసు దయను ఎలా చూపించాడు?

10 దయ కూడ ఆత్మఫలంలోని ఒక అంశమే. యేసు ఇతరులతో ఎల్లప్పుడూ దయతో ప్రవర్తించాడు. యేసు తమను ‘దయతో చేర్చుకున్నట్లు’ నమ్మకంగా ఆయనను అనుసరించినవారు గ్రహించారు. (లూకా 9:11 చదవండి. *) యేసు చూపించిన దయ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? దయగల వ్యక్తి ఇతరులతో స్నేహపూరితంగా, మృదువుగా, మర్యాదగా, సానుభూతితో వ్యవహరిస్తాడు. యేసు ఇతరులతో అలా వ్యవహరించాడు. ప్రజలు “కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున” ఆయన వారిమీద కనికరపడ్డాడు.—మత్త. 9:35, 36.

11, 12. (ఎ) యేసు దయను చేతల్లో చూపించిన ఓ సంఘటనను వివరించండి. (బి) మీరు చూసిన ఉదాహరణ నుండి ఏమి నేర్చుకున్నారు?

11 యేసు కనికరాన్ని, దయను చేతల్లో కూడ చూపించాడు. ఒక ఉదాహరణ తీసుకోండి. ఒక స్త్రీ 12 ఏళ్లపాటు విపరీతమైన రక్తస్రావంతో బాధపడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, రక్తస్రావంతో బాధపడుతున్న తాను అపవిత్రురాలని, తనను ముట్టుకున్నవారు అపవిత్రులౌతారని ఆమెకు తెలుసు. (లేవీ. 15:25-27) అయినా, యేసుకున్న మంచిపేరునుబట్టి, ఇతరులతో ఆయన వ్యవహరించిన తీరునుబట్టి తనను బాగుచేయగలడని అనుకుంది. అలా చేస్తాడనే నమ్మకం ఆమెకు కుదిరింది. “నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును” అని తనలో తాను అనుకుంది. ఆమె ధైర్యం కూడగట్టుకొని, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. అలా ముట్టగానే తనకు నయమైందని ఆమెకు అర్థమైంది.

12 తనను ఎవరో ముట్టారని యేసు గ్రహించాడు. ఎవరో తెలుసుకోవడానికి ఆయన చుట్టూ చూశాడు. ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినందుకు యేసు తనను మందిలిస్తాడేమో అనే భయంతో ఆమె వణుకుతూ ఆయన కాళ్లమీదపడి అసలు విషయం చెప్పింది. యేసు బాధలోవున్న ఆ అభాగ్యురాలిని మందలించాడా? లేదు! ఆయన ఎంతో అనునయంతో, “కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము” అని చెప్పాడు. (మార్కు 5:25-34) దయతో యేసు అన్న మాటలు ఆమెకు ఎంత ఊరటనిచ్చివుంటాయి!

13. (ఎ) యేసుకూ పరిసయ్యులకూ మధ్యవున్న తేడా ఏమిటి? (బి) యేసు పిల్లలతో ఎలా ఉండేవాడు?

13 కఠినహృదయులైన పరిసయ్యులు తమ అధికారాన్ని ఉపయోగించి ఇతరుల భారాన్ని పెంచేవారు, అయితే యేసు వారిలా ఎప్పుడూ చేయలేదు. (మత్త. 23:4) బదులుగా, ఆయన దయతో, ఓపికతో ఇతరులకు యెహోవా మార్గాలను బోధించాడు. ఆయన ఎల్లప్పుడూ ఆప్యాయతగల నిజమైన స్నేహితునిగా తన అనుచరులతో మెలిగాడు. (సామె. 17:17; యోహా. 15:11-15) ఆయన దగ్గరకు రావడానికి పిల్లలు కూడ ఇష్టపడేవారు. ఆయన వారితో చక్కగా కలిసిపోయేవాడు. ఆయనకు ఎంత పనివున్నా వారితో సమయం గడిపేవాడు. ఓ సందర్భంలో ప్రజలు తమ పిల్లలను ఆయన దగ్గరకు తీసుకువస్తున్నప్పుడు వారిని వారించేందుకు శిష్యులు ప్రయత్నించారు. తమ చుట్టూ ఉండే మతనాయకుల్లా తమ గొప్పతనం గురించి ఆలోచించారు కాబట్టి వారలా చేశారు. అప్పుడు యేసు వారిమీద కోపగించుకున్నాడు. ఆయన వారితో, “చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు; దేవునిరాజ్యము ఈలాటివారిదే” అని అన్నాడు. పిల్లలను చూపిస్తూ యేసు, “చిన్నబిడ్డవలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంతమాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని శిష్యులకు ఒక పాఠాన్ని నేర్పించాడు.—మార్కు 10:13-15.

14. ఇతరులు నిజమైన శ్రద్ధ చూపించడం వల్ల పిల్లలు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?

14 ఆ పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత, యేసుక్రీస్తు తమను ‘ఎత్తి కౌగిలించుకొని ఆశీర్వదించాడు’ అని గుర్తుచేసుకున్నప్పుడు వారికి ఎలా అనిపించివుంటుందో ఒక్కసారి ఆలోచించండి. (మార్కు 10:16) పెద్దలు, మరితరులు నిజమైన శ్రద్ధ చూపించడం వల్ల ప్రయోజనం పొందే పిల్లలు రేపు వారిని ఎంతో ఆప్యాయంగా గుర్తుచేసుకుంటారు. అంతకన్నా ముఖ్యంగా, సంఘంలోనివారు చిన్నప్పటి నుండి పిల్లల పట్ల అలాంటి శ్రద్ధ చూపిస్తే యెహోవా ఆత్మ ఆయన ప్రజల మధ్య ఉందని వారు గుర్తిస్తారు.

దయలేని లోకంలో దయ చూపించండి

15. నేడు లోకంలో దయ అడుగంటిపోవడం చూసి మనమెందుకు ఆశ్చర్యపోకూడదు?

15 ఇతరుల పట్ల దయ చూపించేంత సమయం తమకు లేదని చాలామంది అనుకుంటారు. అందుకే, స్కూల్లో, ఉద్యోగస్థలాల్లో, ప్రయాణం చేస్తున్నప్పుడు, పరిచర్యలో యెహోవాసాక్షులతో ప్రజలు కఠినంగా వ్యవహరిస్తారు. వాళ్లలా కటువుగా ప్రవర్తించడం చూసి మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. విపత్కరమైన ఈ “అంత్యదినములలో” ‘స్వార్థప్రియులను, అనురాగరహితులను’ నిజ క్రైస్తవులు కలుసుకోవాల్సివస్తుందని మనల్ని హెచ్చరించేందుకు యెహోవా పౌలును ప్రేరేపించాడు.—2 తిమో. 3:1-3.

16. సంఘంలో మనం క్రీస్తులాంటి దయను ఎలా చూపించవచ్చు?

16 దయలేని ఈ లోకంలా కాకుండా క్రైస్తవ సంఘంలోని ప్రశాంత వాతావరణం ఊరట నిస్తుంది. అయితే యేసును అనుకరించడం ద్వారా సంఘంలో అలాంటి ప్రశాంత వాతావరణం కాపాడేందుకు మనలో ప్రతీ ఒక్కరం మన వంతు కృషి చేయగలుగుతాం. అది మనమెలా చేయగలం? సంఘంలో చాలామంది అనారోగ్యంతో లేదా ఇతర సమస్యలతో బాధపడుతుండవచ్చు. అలాంటి వారికి సహాయం చేయవచ్చు, వారిని ప్రోత్సహించవచ్చు. ఈ “అంత్యదినాల్లో” అలాంటి సమస్యలు పెరుగుతున్న మాట నిజమే అయినా అవి కొత్తగా పుట్టుకొచ్చినవేమీ కాదు. బైబిలు కాలాల్లో క్రైస్తవులు కూడా అలాంటి సమస్యలతోనే బాధపడ్డారు. కాబట్టి అప్పటి క్రైస్తవులకు సహాయం చేయడం వల్ల మంచి జరిగినట్లే ఇప్పుడూ జరుగుతుంది. ఉదాహరణకు పౌలు, “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతముగలవారై యుండుడి” అని క్రైస్తవులను ప్రోత్సహించాడు. (1 థెస్స. 5:14) అలా చేయాలంటే క్రీస్తులా దయను చేతల్లో చూపించాలి.

17, 18. మనం ఏయే విధాలుగా క్రీస్తు దయను చూపించవచ్చు?

17 తమ సహోదరులను దయతో చేర్చుకునే బాధ్యత క్రైస్తవులకు ఉంది. వారితో యేసు ఎలా వ్యవహరించి ఉండేవాడో అలా వ్యవహరించాలి. మనకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్నవారి పట్ల, పరిచయం లేని వారి పట్ల నిజమైన శ్రద్ధ చూపించాలి. (3 యోహా. 5-8) ఇతరుల పట్ల దయ చూపించే విషయంలో యేసు చొరవతీసుకున్నట్లు మనమూ చొరవతీసుకుంటూ ఇతరులను ఎల్లప్పుడూ ఉత్తేజపరచాలి.—యెష. 32:2; మత్త. 11:28-30.

18 ఇతరులు అవసరాల్లో ఉన్నప్పుడు మనం వారికి సహాయం చేయడం ద్వారా వారిపట్ల శ్రద్ధవుందనీ వారి సమస్యలను అర్థం చేసుకుంటున్నామనీ చూపించవచ్చు. అవకాశం దొరికినప్పుడెల్లా సహాయం చేయడానికి చొరవ తీసుకోండి. సహాయం చేయడానికి చేతనైనంత కృషి చేయండి! “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి” అని పౌలు ప్రోత్సహించాడు. (రోమా. 12:10) అలా చేయాలంటే క్రీస్తు మాదిరిని అనుకరించాలి, ఇతరుల పట్ల దయతో సానుభూతితో వ్యవహరించాలి, “నిష్కపటమైన ప్రేమ”ను చూపించడం నేర్చుకోవాలి. (2 కొరిం. 6:6) క్రీస్తులాంటి ఆ ప్రేమను పౌలు ఇలా వర్ణించాడు: “ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు.” (1 కొరిం. 13:4) మన మనసులో సహోదరసహోదరీల పట్ల కోపాన్ని ఉంచుకునే బదులు “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి” అన్న ఉపదేశాన్ని పాటించాలి.—ఎఫె. 4:32.

19. క్రీస్తులాంటి దయను చూపించడం వల్ల వచ్చే ప్రయోజనాలేమిటి?

19 మనం క్రీస్తులాంటి దయను పెంపొందించుకొని దాన్ని అన్ని సందర్భాల్లో చూపించడానికి ప్రయత్నించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. సంఘంలో యెహోవా పరిశుద్ధాత్మ ధారాళంగా పనిచేస్తూ, ప్రతీ ఒక్కరూ ఆత్మ ఫలాన్ని ఫలించదుకు దోహదపడుతుంది. అంతేకాక, యేసు మాదిరిని మనం అనుకరిస్తూ ఇతరులు కూడా అనుకరించేలా సహాయం చేసినప్పుడు మనం సంతోషంగా ఐక్యంగా చేసే ఆరాధన దేవునికి ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు యేసులా కనికరాన్ని దయను కనబరచడానికి మనం ఎల్లప్పుడూ కృషిచేద్దాం.

[అధస్సూచి]

^ పేరా 10 లూకా 9:11 (NW): ‘జనసమూహములు అది తెలిసికొని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని దయతో చేర్చుకొని, దేవుని రాజ్యం గురించి వారితో మాట్లాడుతూ, స్వస్థత కావాల్సినవారిని స్వస్థపర్చాడు.’

మీరు వివరించగలరా?

• తాను ‘సాత్వికుడు దీనమనస్సు గలవాడు’ అని యేసు ఎలా చూపించాడు?

• యేసు దయను ఎలా చూపించాడు?

• ఈ అపరిపూర్ణ లోకంలో మనం క్రీస్తులాంటి కనికరాన్ని దయను ఏయే విధాలుగా చూపించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[8వ పేజీలోని చిత్రం]

పేతురులా మన సహోదరుల్లో ఎవరైనా విశ్వాసాన్ని కోల్పోతుంటే మనం చేయందిస్తామా?

[10వ పేజీలోని చిత్రం]

సంఘం దయకు నిలయమయ్యేలా మీరు ఏమి చేయగలరు?