కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నా జీవితాన్ని సార్థకం చేసుకున్నాను

నా జీవితాన్ని సార్థకం చేసుకున్నాను

నా జీవితాన్ని సార్థకం చేసుకున్నాను

గాస్పార్‌ మార్టీనెజ్‌ చెప్పినది

ఒక విధంగా నాది పల్లె నుండి పట్టణానికి వచ్చి ఐశ్వర్యవంతుడైన ఓ పేద కుర్రవాడి కథ. కానీ ఊహించని ఐశ్వర్యాన్ని నేను సంపాదించానని మీరు తెలుసుకుంటారు.

నే ను 1930లలో ఉత్తర స్పెయిన్‌లోని రియోహ ప్రాంతంలో పెరిగాను. మాది బీడు బారిన గ్రామీణ ప్రాంతం. పదేళ్ల వయసులో నేను బడి మానేయాల్సివచ్చింది. అయితే అప్పటికే చదవడం, రాయడం నేర్చేసుకున్నాను. మేము మొత్తం ఏడుగురు పిల్లలం. మేమందరం గొర్రెలను కాస్తూ, మాకున్న చిన్న పొలాన్ని సాగుచేసేవాళ్లం.

పేదరికంలో మగ్గిపోవడం వల్ల ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం ఎంతో అవసరమని మాకు అనిపించేది. మాకన్నా ఎక్కువున్న వారిని చూసి ఈర్ష్యపడేవాళ్లం. ఒకసారి బిషప్‌ మా గ్రామం గురించి ఇలా చెప్పాడు, “నా అధీనంలో ఉన్న గ్రామాల్లో ఇదే అన్నిటికన్నా మతనిష్ఠగలది.” కానీ భవిష్యత్తులో చాలామంది క్యాథలిక్‌ మతాన్ని విడిచిపెడతారని అప్పట్లో ఆయన గుర్తించలేకపోయాడు.

మెరుగైన దాని కోసం అన్వేషణ

నేను మెర్సథాస్‌ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆమెది మా ఊరే. కొంతకాలానికి మాకు ఒక బాబు పుట్టాడు. 1957లో మేము దగ్గర్లోవున్న లోగ్రొనో నగరానికి తరలివెళ్లాం. కొంతకాలానికి మా కుటుంబమంతా అక్కడికి వచ్చింది. నాకు ఏ పనిలోనూ పెద్దగా నైపుణ్యంలేదు కాబట్టి నా కుటుంబాన్ని పోషించేంత ఆదాయం సంపాదించే అవకాశాలు ఎక్కువగా లేవని కొన్ని రోజుల్లోనే అర్థమయ్యింది. ఈ విషయంలో ఎవరు దారి చూపిస్తారా అని ఆలోచిస్తూ దగ్గర్లోని గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాల్లో వెదకడం మొదలుపెట్టాను. అయితే నిజానికి నేను దేనికోసం వెదుకుతున్నానో నాకే తెలియదు.

బైబిలు కరస్పాండెన్స్‌ కోర్సు ఇస్తున్న ఒక రేడియో కార్యక్రమం గురించి విన్నాను. ఆ కోర్సు పూర్తి చేసిన వెంటనే, కొంతమంది ఇవాంజలికల్‌ ప్రొటస్టెంట్లు వచ్చి నన్ను కలిశారు. వాళ్ల ఆరాధనా స్థలానికి ఒకట్రెండుసార్లు వెళ్లేసరికే, వాళ్ల ప్రముఖుల మధ్య గొడవలు ఉన్నాయని అర్థమైంది. అన్ని మతాలు ఇంతేనేమో అనుకుని నేను మళ్లీ అక్కడికి వెళ్లలేదు.

కళ్ల మీదున్న పొరలు తొలగిపోయాయి

1964లో యుకేన్యో అనే ఓ యువకుడు మా ఇంటికి వచ్చాడు. ఆయనొక యెహోవాసాక్షి. ఆ మతం గురించి అంతకుముందు ఎప్పుడూ వినలేదు. కానీ నేను బైబిలు గురించి మాట్లాడడానికి ఇష్టపడ్డాను. అప్పటివరకు నాకు బైబిలు గురించి బాగా తెలుసనుకున్నాను. కరస్పాండెన్స్‌ కోర్సులో నేర్చుకున్న కొన్ని బైబిలు లేఖనాలను ఉపయోగించి ఆయన అడిగినవాటికి సమాధానం చెప్పాను. కొన్ని ప్రొటస్టెంట్‌ సిద్ధాంతాలను నేను నిజంగా నమ్మకపోయినా వాటిని సమర్థించడానికి ప్రయత్నించాను.

యుకేన్యో, నేనూ చాలాసేపు మాట్లాడుకున్నాం. అలా ఆయనతో రెండుసార్లు మాట్లాడిన తర్వాత ఆయనకు దేవుని వాక్యం మీద మంచి పట్టు ఉందని ఒప్పుకోక తప్పలేదు. ఆయన నాకన్నా తక్కువ చదువుకున్నా ఎక్కడెక్కడో ఉన్న లేఖనాలను తీసి వివరిస్తుంటే ఆశ్చర్యపోయాను. మనం అంత్యదినాల్లో ఉన్నామని, దేవుని రాజ్యం ఈ భూమిని పరదైసుగా మారుస్తుందని యుకేన్యో నాకు బైబిలు నుండి చూపించాడు. దాంతో ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అనిపించింది.—కీర్త. 37:11, 29; యెష. 9:6, 7; మత్త. 6:9, 10.

వెంటనే బైబిలు అధ్యయనానికి ఒప్పుకున్నాను. దాదాపు నేను నేర్చుకున్న ప్రతీ విషయం నాకు కొత్తగా అనిపించింది, హృదయాన్ని స్పృశించింది. నేను చేయగలిగినవి చాలా ఉన్నాయని నాకు తెలిసింది, నేను దేనికోసం జీవించాలో తెలుసుకున్నాను. దాంతో నా అన్వేషణ ముగిసింది. చివరకు అనారోగ్యం, మరణం కూడా లేని రోజు రాబోతుంది కాబట్టి సమాజంలో హోదా పెంచుకోవడానికి ప్రయత్నించడంలో అర్థంలేదని, మంచి ఉద్యోగం కోసం కష్టపడడం అంత ప్రాముఖ్యం కాదని అనిపించింది.—యెష. 33:24; 35:5, 6; ప్రక. 21:4.

వెంటనే నేను తెలుసుకున్న వాటిని మా చుట్టాలకు చెప్పడం మొదలుపెట్టాను. భూమిని పరదైసుగా మారుస్తానని, అందులో నమ్మకస్థులైన మనుష్యులు నిరంతరం జీవిస్తారని దేవుడు చేసిన వాగ్దానాలను వారికి ఉత్సాహంగా వివరించడం మొదలుపెట్టాను.

నా కుటుంబం సత్యాన్ని అంగీకరించింది

కొంతకాలానికి మాలో ఓ పన్నెండుమంది మా చిన్నాన్న వాళ్లింట్లో సమకూడి బైబిలు వాగ్దానాల గురించి ప్రతీ ఆదివారం మధ్యాహ్నం మాట్లాడుకునే ఏర్పాటు చేసుకున్నాం. మేము ప్రతీ వారం రెండుమూడు గంటలు మాట్లాడుకునేవాళ్లం. మా బంధువుల్లో అంతమంది బైబిలు పట్ల ఆసక్తి చూపిస్తున్నారని యుకేన్యో తెలుసుకుని ప్రతీ కుటుంబానికి వేర్వేరుగా బైబిలు అధ్యయనం జరిగే ఏర్పాటు చేశాడు.

120 కి.మీ. దూరంలోవున్న డురొంగొ అనే చిన్న పట్టణంలో కూడా మాకు బంధువులు ఉండేవారు. అప్పట్లో అక్కడ యెహోవాసాక్షులు ఎవరూ లేరు. మూడు నెలల తర్వాత, నేను కొత్తగా తెలుసుకున్న సత్యాన్ని వాళ్లకు వివరించాలని రెండ్రోజులు సెలవు పెట్టి వాళ్ల దగ్గరకు వెళ్లాను. ఆ రెండు రోజులూ నేను చెప్పేది వినడానికి పదిమంది వచ్చారు. వారితో సాయంత్రం నుండి తెల్లవారే వరకు మాట్లాడేవాణ్ణి. వారందరూ ఎంతో సంతోషంగా విన్నారు. తిరిగివస్తున్నప్పుడు వాళ్లకు కొన్ని బైబిళ్లను, బైబిలు సాహిత్యాన్ని ఇచ్చాను. అప్పటినుండి నేను వారితో టచ్‌లో ఉండేవాణ్ణి.

సాక్షులు డురొంగొకు వెళ్లేసరికి అంతవరకు ఎవరూ ప్రకటించని ఆ ప్రాంతంలో 18 మంది బైబిలు అధ్యయనం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాళ్లు సంతోషంగా ప్రతీ కుటుంబానికి ఒక బైబిలు అధ్యయనాన్ని ఏర్పాటు చేశారు.

మెర్సథాస్‌, బైబిలు బోధల పట్ల ఆసక్తి లేక కాదుగానీ మనుష్యుల భయంతోనే తను అప్పటివరకూ సత్యం నేర్చుకోవడానికి ఇష్టపడలేదు. అప్పట్లో, స్పెయిన్‌ ప్రభుత్వం యెహోవాసాక్షుల పనిని నిషేధించింది. దాంతో పిల్లలను బడి నుండి తీసేస్తారేమోనని, మమ్మల్నందర్నీ దేశం నుండి వెలివేస్తారేమోనని తను భయపడేది. కానీ కుటుంబంలో అందరూ బైబిలు సత్యాన్ని అంగీకరించడం చూసి తను కూడా అధ్యయనం చేయడానికి ఒప్పుకుంది.

రెండేళ్లలోనే మా కుటుంబంలో 40 మంది యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకున్నారు. నేను జీవితంలో పెట్టుకున్న లక్ష్యాన్ని వారు కూడ సాధించాలనుకున్నారు. నిజంగా ఎంతో విలువైనదాన్ని సాధించానని నాకనిపించింది. మాకు ఆధ్యాత్మిక సంపదలు విస్తారంగా దొరికాయి.

వయసుతోపాటు జీవితంలో సంతృప్తి పెరిగింది

ఆ తర్వాతి 20 సంవత్సరాలు, మా ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేస్తూ, సంఘానికి సహకరించాను. మేమిద్దరం లోగ్రొనోకు వచ్చినప్పుడు దాని జనాభా 1,00,000 ఉండేది. అప్పుడు ఇంచుమించు 20 మంది సాక్షులే ఉండేవారు. కొంతకాలానికే సంఘంలో నాకు ఎన్నో బాధ్యతలొచ్చాయి.

నాకు 56 ఏళ్లున్నప్పుడు నేను పనిచేస్తున్న కర్మాగారం ఉన్నట్టుండి మూతపడడంతో నిరుద్యోగినయ్యాను. నాకు మొదట్నుంచి పూర్తికాల సేవ చేయాలని కోరిక బలంగా ఉండేది. అనుకోకుండా ఉద్యోగంపోవడం వల్ల నాకు దొరికిన సమయాన్ని పయినీరు సేవ చేయడానికి ఉపయోగించుకున్నాను. నాకు చాలీచాలని పింఛను వచ్చేది కాబట్టి కుటుంబం గడవడం కష్టంగావుండేది. మెర్సథాస్‌ పార్ట్‌టైమ్‌ పని చేస్తూ కుటుంబానికి తాను చేతనైనంత సహాయం చేసేది. అవసరమైనవాటికి కొదువ లేకుండా సంసారం ఎలాగో గట్టేక్కేది. నేను ఇప్పటికీ పయినీరునే, తను కూడా అప్పుడప్పుడు సహాయ పయినీరు సేవ చేస్తూ పరిచర్యలో ఎంతో ఆనందం పొందుతోంది.

కొన్ని సంవత్సరాల క్రితం పత్రికలు ఇవ్వడానికి మెర్సథాస్‌, మెర్ఛే అనే యువతి ఇంటికి క్రమంగా వెళ్లేది. మెర్ఛే చిన్నప్పుడెప్పుడో బైబిలు అధ్యయనం చేసింది. మెర్ఛే మన సాహిత్యాన్ని ఇష్టంగా చదివేది. బైబిలు సత్యం పట్ల ఆమెకు గౌరవం తగ్గలేదని మెర్సథాస్‌ గమనించింది. చివరకు మెర్ఛే బైబిలు అధ్యయనానికి అంగీకరించి ప్రగతి సాధించడం మొదలుపెట్టింది. కానీ, ఆమె భర్త బీథేంటే మాత్రం విపరీతంగా తాగుతూ ఏ ఉద్యోగాన్ని నిలబెట్టుకునేవాడు కాదు. డబ్బులు ఇంటికి ఇచ్చేవాడే కాదు, అతని తాగుడు వల్ల వాళ్లిద్దరూ విడిపోయే పరిస్థితి ఏర్పడింది.

బీథేంటేను నాతో మాట్లాడించమని నా భార్య ఆమెకు చెప్పింది. ఆయన మాట్లాడాడు. చాలాసార్లు కలిసిన తర్వాత బైబిలు అధ్యయనానికి అంగీకరించాడు. బీథేంటేలో మార్పు రావడం మొదలయ్యింది. వారంలో కొన్ని రోజులూ ఆ తర్వాత వారం లేదా అంతకన్నా ఎక్కువ రోజులూ తాగకుండా ఉండేవాడు. చివరకు తాగడమే మానేశాడు. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు, కుటుంబం కూడా సంతోషంగా ఉంది. భార్యా కూతురుతో కలిసి ఆయన ఇప్పుడు కానరీ దీవుల్లో ఉంటున్నాడు. అక్కడున్న చిన్న సంఘానికి వారు చక్కని మద్దతునిస్తున్నారు.

నేను గడిపిన చక్కని జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే

సంవత్సరాల క్రితం బైబిలు గురించి నేర్చుకున్న మా చుట్టాల్లో కొంతమంది చనిపోయారు. అయినప్పటికీ మా కుటుంబంలో సత్యంలో ఉన్నవారి సంఖ్య పెరుగుతూనే వచ్చింది. దేవుడు మమ్మల్ని ఎంతో ఆశీర్వదించాడు. (సామె. 10:22) 40 సంవత్సరాల క్రితం బైబిలు అధ్యయనం మొదలుపెట్టిన ఇంచుమించు ప్రతీ ఒక్కరూ, వాళ్ల పిల్లలు, పిల్లల పిల్లలతో సహా యెహోవాకు నమ్మకంగా సేవ చేస్తుండడం చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉంది.

సాక్షులైన బంధువులు ఇప్పుడు నాకు చాలామంది ఉన్నారు. వారిలో చాలామంది పెద్దలుగా, పరిచర్య సేవకులుగా, పయినీర్లుగా సేవ చేస్తున్నారు. మా పెద్దబ్బాయి, కోడలు స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లోవున్న యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సేవ చేస్తున్నారు. నేను బాప్తిస్మం తీసుకునే సమయానికి స్పెయిన్‌లో దాదాపు 3,000 మంది సాక్షులే ఉండేవారు. ఇప్పుడు లక్షకుపైగా ఉన్నారు. పూర్తికాల సేవలో నేను ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను. నా జీవితాన్ని ఆయన సేవలో ఉపయోగించే అవకాశం ఇచ్చినందుకు నేను యెహోవాకు ఎంతో రుణపడివున్నాను. నేను పెద్దగా చదువుకోకపోయినా అడపాదడపా ప్రాంతీయ పైవిచారణకర్తగా సేవ చేయగలుగుతున్నాను.

నేను పెరిగిన ఊరు దాదాపు నిర్జనంగా మారిందని నాకు ఈ మధ్యే తెలిసింది. పేదరికం వల్ల ఊరి వాళ్లందరూ భూముల్ని, ఇళ్లను వదిలి పెట్టి మెరుగైన జీవితం కోసం వలసవెళ్లారు. నాతోసహా అలా వలసవెళ్లిన వారిలో చాలామంది ఆధ్యాత్మిక సంపదల్ని కనుగొన్నారు. జీవితానికంటూ ఒక అర్థముందని, యెహోవాను సేవించడానికి మించిన ఆనందం మరొకటి లేదని మేము తెలుసుకున్నాం.

[32వ పేజీలోని చిత్రం]

సహోదరుడు మార్టీనెజ్‌ కుటుంబ సభ్యుల్లో సత్యంలో ఉన్న దాదాపు అందరూ ఈ చిత్రంలో ఉన్నారు