కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేనీ మతంలో ఉన్నది నా ఇష్టంతోనా? తల్లిదండ్రుల ప్రోద్బలంవల్లనా?

నేనీ మతంలో ఉన్నది నా ఇష్టంతోనా? తల్లిదండ్రుల ప్రోద్బలంవల్లనా?

నేనీ మతంలో ఉన్నది నా ఇష్టంతోనా? తల్లిదండ్రుల ప్రోద్బలంవల్లనా?

పోలండ్‌లోని చాలామంది “నేను ఈ మతంలోనే పుట్టాను, చనిపోయేంతవరకు ఈ మతంలోనే ఉంటాను” అని యెహోవాసాక్షులతో అంటుంటారు. తల్లిదండ్రుల మతాన్నే పిల్లలు అవలంబిస్తారని వారు అనుకుంటున్నట్లు దీన్నిబట్టి తెలుస్తోంది. మీ ప్రాంతంలో కూడా మతం విషయంలో అలాంటి అభిప్రాయమే ఉందా? ఒకవేళ ఉంటే ఏమౌతుంది? మతం కుటుంబ సాంప్రదాయంలా తయారౌతుంది. పిల్లలు ఏదో మొక్కుబడిగా మతాన్ని అవలంబిస్తారు. తల్లిదండ్రుల నుండో తాతామామ్మల నుండో సత్యం తెలుసుకున్న యెహోవాసాక్షుల విషయంలో కూడా ఇలా జరిగే అవకాశం ఉందా?

సత్య దేవుణ్ణి నమ్మి, ఆయనను ప్రేమించాలని వాళ్ల అమ్మా, అమ్మమ్మల దగ్గర నేర్చుకున్న తిమోతి విషయంలోనైతే అలా జరగలేదు. తిమోతికి పరిశుద్ధ లేఖనాలు “బాల్యము నుండి” తెలుసు. కొంతకాలానికి క్రైస్తవత్వమే సత్యమని వాళ్ల అమ్మా, అమ్మమ్మలతో పాటు తిమోతికి కూడా నమ్మకం కుదిరింది. యేసుక్రీస్తు గురించి లేఖనాల నుండి తాను విన్నవి ‘రూఢియని తెలుసుకునేందుకు’ సహాయం పొందాడు. (2 తిమో. 1:3-5; 3:14, 15) అదే విధంగా, క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలు యెహోవా సేవకులయ్యేందుకు తాము చేయగలిగినదంతా చేయాలి. అయితే, యెహోవాను సేవించాలనే కోరిక పిల్లల్లోనే కలగాలి.—మార్కు 8:34.

ఏమి జరిగినా యెహోవా పట్ల యథార్థతను కాపాడుకోవాలంటే లేదా ప్రేమతో ఆయనను సేవించాలంటే ఒక వ్యక్తి తాను నేర్చుకుంది సత్యం అని సరైన తర్కంచేత ఒప్పించబడాలి. అప్పుడే అతని విశ్వాసం బలంగా, స్థిరంగా ఉంటుంది.—ఎఫె. 3:15-17; కొలొ. 2:6, 7.

పిల్లలు ఏమి చేయాలి?

యెహోవాసాక్షుల కుటుంబంలో పుట్టిపెరిగిన ఆల్బర్ట్‌ * ఇలా అంటున్నాడు: “యెహోవాసాక్షులది నిజమైన మతం అని నాకెప్పుడూ అనిపించేది. నేనెలా ఉండాలో వారు చెప్పేవారు. కానీ వారు చెప్పినట్లు చేయడం కష్టమనిపించేది.” మీరు యౌవనస్థులైతే మీకూ అలాగే అనిపిస్తుండవచ్చు. దేవుడు మనం ఎలా జీవించాలని కోరుతున్నాడో తెలుసుకుని ఆయన చిత్తం చేయడంలో ఉన్న ఆనందాన్ని పొందడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? (కీర్త. 40:8) “నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. మొదట్లో కష్టమనిపించేది. బలవంతంగా ప్రార్థించేవాణ్ణి. కొంతకాలం గడిచేసరికి సరైంది చేయడానికి ప్రయత్నిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడని అనిపించింది. దాంతో అవసరమైన మార్పులు చేసుకోగలనన్న నమ్మకం కలిగింది.” మీరు కూడ దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని వృద్ధి చేసుకుంటే ఆయనకు నచ్చింది చేయాలనే కోరికను పెంచుకుంటారు.—కీర్త. 25:14; యాకో. 4:8.

మీకు ఇష్టమైన క్రికెట్‌, చెస్‌ వంటి ఆటల గురించి ఆలోచించండి. మీకు ఆట నియమాలు తెలియకపోయినా, అసలు ఎలా ఆడాలో తెలియకపోయినా ఎంత బోరుకొడుతుందో కదా! అదే ఆట నియమాలు తెలుసుకుని, ఆడడం బాగా నేర్చుకుంటే ఎప్పుడెప్పుడు ఆడదామా అని ఎదురుచూస్తారు. వీలుచేసుకుని మరీ ఆడతారు! క్రైస్తవ కార్యకలాపాల విషయంలో కూడా అంతే. కాబట్టి ముందుగా క్రైస్తవ కూటాలకు సిద్ధపడండి. క్రైస్తవ కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొనండి. అలా చేస్తే, మీరు ఏ వయసువారైనా, మీ చక్కని మాదిరి ద్వారా ఇతరులను కూడా ప్రోత్సహించగలుగుతారు.—హెబ్రీ. 10:24, 25.

మీ విశ్వాసం గురించి ఇతరులకు చెప్పే విషయంలో కూడా ఇది ముమ్మాటికీ నిజం. ఏదో చెయ్యాలి కదా అన్నట్టు కాకుండా ప్రేమతో చేయాలి. ‘నేను ఇతరులకు యెహోవా గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నాను? ఆయనను నేను ఎందుకు ప్రేమిస్తున్నాను?’ అని ప్రశ్నించుకోండి. యెహోవా దేవుడు ప్రేమగల తండ్రని మీరు తెలుసుకోవాలి. ఆయన యిర్మీయా ద్వారా ఇలా చెప్పాడు: “మీరు నా కొరకు అన్వేషిస్తారు. మీరు మీ హృదయపూర్వకంగా నా కొరకు వెదకితే మీరు నన్ను కనుగొంటారు.” (యిర్మీ. 29:13, 14, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అలా చేయడానికి మనం ఏమి చేయాలి? యాకూప్‌ మాటల్లో దానికి జవాబు దొరకుతుంది. ఆయన ఇలా చెప్పాడు: “నేను నా ఆలోచనా తీరును మార్చుకోవాల్సి వచ్చింది. నేను చిన్నప్పటి నుండి కూటాలకు, పరిచర్యకు వెళ్లేవాణ్ణి, కాని ఏదో చెయ్యాలి కదా అని వాటిలో పాల్గొనేవాణ్ణి. యెహోవాతో దగ్గరి సంబంధం ఏర్పరచుకున్న తర్వాతనే క్రైస్తవ కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొనడం మొదలుపెట్టాను.”

మీరు పరిచర్యను ఎంత ఇష్టపడతారనేది మీరు ఎంచుకునే సహవాసాన్ని బట్టి ఉంటుంది. “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును” అని ప్రేరేపిత సామెత చెబుతోంది. (సామె. 13:20) కాబట్టి, ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకున్నవారితో, యెహోవాను సంతోషంగా సేవిస్తున్నవారితో స్నేహం చేయడానికి ప్రయత్నించండి. యోలా ఇలా చెప్పింది: “దేవుని సేవకు ప్రాధాన్యతనిచ్చే ఎంతోమంది యౌవనస్థులతో స్నేహం చేయడం మంచి ప్రోత్సాహాన్నిచ్చింది. అప్పటినుండి ప్రకటనా పనిని ఎంతో ఆనందంగా, క్రమంగా చేస్తున్నాను.”

తల్లిదండ్రులు ఏమి చేయాలి?

“నాకు యెహోవా గురించి నేర్పించినందుకు మా అమ్మానాన్నలకు నేనెంతో రుణపడివున్నాను” అని యోలా అంది. పిల్లల నిర్ణయాల మీద తల్లిదండ్రుల ప్రభావం చాలావరకు ఉంటుంది. ‘తండ్రులారా, మీ పిల్లలను ప్రభువు శిక్షలో, బోధలో పెంచండి’ అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (ఎఫె. 6:4) తల్లిదండ్రులు పిల్లలకు తమ ఇష్టాయిష్టాలను నేర్పించే బదులు యెహోవా కోరుకుంటుంది నేర్పించాలని బైబిలు చెబుతోంది. మీ పిల్లలు కొన్ని లక్ష్యాలను పెట్టుకోవాలనే ఆశ మీకు ఉండవచ్చు. వాటిని బలవంతంగా వారి మీద రుద్దే బదులు దేవునికి నచ్చే జీవిత లక్ష్యాలను పెట్టుకునేందుకు సహాయం చేస్తే ఎంత బాగుంటుంది!

మీ పిల్లల మనసుల్లో యెహోవా వాక్యాన్ని నాటి, ‘ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలో నడుస్తున్నప్పుడు, పడుకొంటున్నప్పుడు, లేచేటప్పుడు వాటి గురించి మాట్లాడాలి.’ (ద్వితీ. 6:6, 7) “మేము వివిధ రకాల పూర్తికాల పరిచర్యల గురించి చాలా మాట్లాడుకునేవాళ్లం” అని ముగ్గురు పిల్లలున్న ఈవా, రిషార్డ్‌లు చెబుతున్నారు. వారలా చేయడం వల్ల ఏమి జరిగింది? “దైవపరిపాలనా పాఠశాలలో చేరాలనే కోరిక మా పిల్లల్లో చిన్నప్పుడే కలిగింది, చిన్నప్పుడే పరిచారకులయ్యారు, బాప్తిస్మం తీసుకోవడానికి తమంతటతామే ముందుకొచ్చారు. పెద్దవారైన తర్వాత, బెతెలు సేవ లేక పయినీరు సేవ చేపట్టారు” అని వారు చెబుతున్నారు.

తల్లిదండ్రులు చక్కని మాదిరి ఉంచడం చాలా అవసరం. “ఇంట్లో ఒకలా, సంఘంలో మరోలా ఉండకూడదని మేము తీర్మానించుకున్నాం” అని రిషార్డ్‌ అంటున్నాడు. అందుకే ఇలా ప్రశ్నించుకోండి, ‘నా పిల్లలకు నేను ఎలాంటి మాదిరిని ఉంచుతున్నాను? నేను యెహోవాను నిజంగా ప్రేమిస్తున్నానని వాళ్లకు అనిపిస్తుందా? నా ప్రార్థనలో, క్రమంగా చేసే వ్యక్తిగత అధ్యయనంలో వారికి ఆ ప్రేమ కనిపిస్తుందా? పరిచర్య, వినోదం, వస్తుసంపదల విషయంలో నేను తీసుకునే నిర్ణయాల్లో వారు ఆ ప్రేమను గమనిస్తున్నారా? సంఘంలోని ఇతరుల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వారు నాలో ఆ ప్రేమను చూస్తున్నారా?’ (లూకా 6:40) పిల్లలు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. మీరు చెప్పేదానికీ చేసేదానికీ ఏ మాత్రం తేడా వచ్చిన వాళ్లు ఇట్టే గుర్తుపడతారు.

పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడం అవసరం. అయితే “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము” అని బైబిలు చెబుతోంది. (సామె. 22:6) “ప్రతీ అబ్బాయితో వేర్వేరుగా బైబిలు అధ్యయనం చేయడానికి సమయం తీసుకునేవాళ్లం” అని ఈవా, రిషార్డ్‌లు చెబుతున్నారు. ప్రతీ పిల్లవాడితో విడివిడిగా బైబిలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందో లేదో నిర్ణయించుకోవాల్సింది తల్లిదండ్రులే. ఏదేమైనా పిల్లవాడికీ ఓ వ్యక్తిత్వం ఉంటుందని గుర్తుపెట్టుకుని వారితో ప్రవర్తించాలి. అలా ప్రవర్తించాలంటే పట్టువిడుపులు చూపించాలి, వారి నుండి ఎక్కువ ఆశించకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు కొన్నిరకాల సంగీతం వినడం మంచిది కాదని చెప్పేబదులు, మంచి సంగీతాన్ని ఎలా ఎంచుకోవచ్చో మీరే ఎందుకు చూపించకూడదు? ఆ విషయంలో బైబిలు సూత్రాలు ఎలా సహాయం చేస్తాయో వాళ్లకు ఎందుకు చెప్పకూడదు?

మీ పిల్లలు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో మీ పిల్లలకు ఖచ్చితంగా తెలిసుండొచ్చు, మీరు ఇష్టపడినట్లే వారు ప్రవర్తిస్తున్నట్టు కనిపించవచ్చు. అయినప్పటికీ, మీరు వాళ్ల హృదయాన్ని చేరుకోవాలి. “నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్లవంటిది, వివేకముగలవాడు దానిని పైకి చేదుకొనును” అనే మాటను మనసులో ఉంచుకోండి. (సామె. 20:5) మీ పిల్లవాడి మనసులో ఏ మూలనైనా సత్యాన్ని స్వీకరించే విషయంలో సమస్య ఉందేమో గుర్తించండి. అలాంటి సమస్య ఉందని మీకనిపిస్తే వెంటనే చేయాల్సింది చేయండి. వారిమీద నిందలు వేయకుండా వారి మంచి గురించే ఆలోచిస్తున్నారని చూపించండి, తగిన ప్రశ్నలు వేయండి. అలాగని ప్రశ్నల వర్షం కురిపించకండి. మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే వాళ్ల హృదయాన్ని చేరుకొని వారికి సహాయం చేయగలుగుతారు.

సంఘ బాధ్యతేమిటి?

యౌవనస్థులు తల్లిదండ్రుల నుండి నేర్చుకున్న సత్యానికి విలువిచ్చేలా సంఘంలోని దేవుని సేవకులుగా మీరు సహాయం చేయగలరా? పిల్లలకు శిక్షణనిచ్చే బాధ్యత తల్లిదండ్రులదే అయినా సంఘంలోని ఇతరులూ, ప్రాముఖ్యంగా సంఘ పెద్దలు ఆ విషయంలో తల్లిదండ్రులకు చేయూతనివ్వవచ్చు. ప్రత్యేకంగా తల్లి/తండ్రి మాత్రమే సత్యంలో ఉన్న పిల్లలకు అలా సహాయం చేయడం ప్రాముఖ్యం.

యౌవనస్థులు యెహోవాను ప్రేమించేలా పెద్దలు వారికి ఎలా సహాయం చేయవచ్చు? సంఘంలో యౌవనస్థులు విలువైనవారని, వాళ్ల అవసరం సంఘానికి ఎంతో ఉందని వారికి అనిపించేలా పెద్దలు ఏమి చేస్తే బాగుంటుంది? పోలండ్‌లో పైవిచారణకర్తగా సేవ చేస్తున్న మార్యుష్‌, “పెద్దలు యౌవనస్థులతో మాట్లాడాలి, మాట్లాడాలి, మాట్లాడాలి. సమస్యలొచ్చినప్పుడు మాత్రమే కాదు ఇతర సందర్భాల్లో కూడా వాళ్లతో మాట్లాడుతుండాలి. అంటే పరిచర్యలో ఉన్నప్పుడు, కూటాలు అయిపోయిన తర్వాత, బయట టీ తాగుతున్నప్పుడు కూడా వారితో మాట్లాడాలి” అని అంటున్నాడు. సంఘ గురించి వాళ్ల అభిప్రాయాన్ని ఎందుకు అడగకూడదు? అలా దాపరికం లేకుండా మాట్లాడుకోవడం వల్ల యౌవనస్థులు సంఘానికి దగ్గరౌతారు. తాము కూడా సంఘంలో ఒకరమనే భావన వారిలో కలుగుతుంది.

సంఘ పెద్దగా మీరు మీ సంఘంలోని యౌవనస్థులతో పరిచయాన్ని పెంచుకుంటున్నారా? పైన ప్రస్తావించబడిన ఆల్బర్ట్‌ ఇప్పుడు పెద్దగా సేవచేస్తున్నా, కుర్రవాడిగా ఉన్నప్పుడు రకరకాల పరీక్షలు ఎదుర్కొన్నాడు. “నాకు కొంచెం వయసు వచ్చిన తర్వాత, కాపరి సందర్శనం అవసరమైంది” అని ఆయన చెబుతున్నాడు. వారి ఆధ్యాత్మిక సంక్షేమం గురించి ప్రార్థించడం ద్వారా కూడా వారి పట్ల శ్రద్ధ ఉందని పెద్దలు చూపించవచ్చు.—2 తిమో. 1:3-5.

యౌవనస్థులు సంఘ కార్యకలాపాల్లో పాల్గొనడం మంచిది. లేకపోతే వాళ్లు లోక సంబంధమైన లక్ష్యాలు సాధించడానికే ప్రాముఖ్యతనిచ్చే అవకాశం ఉంది. మీరు సంఘంలో ఉన్న అనుభవజ్ఞులైతే పరిచర్యలో యౌవనస్థులతో కలిసి పని చేసి, వారితో స్నేహం చేయగలరేమో ఆలోచించండి. మీ ఖాళీ సమయాన్ని వాళ్లతో గడపండి, వాళ్ల నమ్మకాన్ని చూరగొంటూ వాళ్లతో స్నేహం చేయండి. “ఒక పయినీరు సహోదరి నా గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంది. నేను మొట్ట మొదటిసారి ఇష్టపూర్వకంగా పరిచర్యకు వెళ్లింది ఆమెతోనే” అని యోలా అంటోంది.

మీరే నిర్ణయించుకోవాలి

యౌవనస్థులారా ఇలా ప్రశ్నించుకోండి: ‘నా లక్ష్యాలేమిటి? నేను ఇప్పటికింకా బాప్తిస్మం తీసుకోకపోతే, తీసుకోవాలని అనుకుంటున్నానా?’ కుటుంబంలో అందరూ బాప్తిస్మం తీసుకున్నారు కాబట్టి నేనూ తీసుకుంటాను అని అనుకోకూడదు. బదులుగా యెహోవా మీదున్న ప్రగాఢమైన ప్రేమతో ఆ నిర్ణయం తీసుకోవాలి.

యెహోవా మీ నిజమైన స్నేహితుడవ్వాలనీ, సత్యం మీ సంపదకావాలనీ కోరుకుంటున్నాం. “నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము” అని యెహోవా తన ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పాడు. మీరు ఆయనతో స్నేహం చేసినంత వరకు యెహోవా మీకు తోడుగా ఉంటాడు. ‘నీతి అనే తన దక్షిణహస్తముతో ఆయన మనల్ని ఆదుకొని’ బలపరుస్తాడు.—యెష. 41:9, 10.

[అధస్సూచి]

^ పేరా 6 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[4వ పేజీలోని చిత్రం]

మీ పిల్లవాడి మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి

[6వ పేజీలోని చిత్రం]

యెహోవా మీదున్న ప్రగాఢమైన ప్రేమతోనే బాప్తిస్మం తీసుకోవాలని నిర్ణయించుకోవాలి