కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మిమ్మల్ని విడిపించడానికి యెహోవా చేసిన ఏర్పాట్ల పట్ల కృతజ్ఞత ఉందా?

మిమ్మల్ని విడిపించడానికి యెహోవా చేసిన ఏర్పాట్ల పట్ల కృతజ్ఞత ఉందా?

మిమ్మల్ని విడిపించడానికి యెహోవా చేసిన ఏర్పాట్ల పట్ల కృతజ్ఞత ఉందా?

‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలుగజేసెను.’—లూకా 1:68.

1, 2. మన ప్రస్తుత పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పేందుకు ఒక ఉదాహరణ చెప్పండి. మనం ఏ ప్రశ్నలను చర్చిస్తాం?

మీరు ఆసుపత్రి బెడ్‌ మీద ఉన్నారని ఊహించుకోండి. మీతోపాటు ఆ వార్డులో ఉన్నవారంతా చికిత్సలేని ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నారని అనుకుందాం. ఒక డాక్టరు ఆ వ్యాధిని నయం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నాడని మీకు తెలిసినప్పుడు, ఆయన చికిత్స కనుగొంటాడనే ఆశతో ఎదురుచూస్తారు. డాక్టరు చేస్తున్న పరిశోధన గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటారు. మీరు ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది! ఆ వ్యాధికి చికిత్సను కనుగొనడానికి ఆ డాక్టరు ఎన్నో త్యాగాలు చేశాడు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మిమ్మల్నీ, ఆ వార్డులోవున్న అనేకమందినీ మరణాన్నుండి తప్పించిన ఆ వ్యక్తిని మీరెంతో గౌరవిస్తారు. మీ హృదయం కృతజ్ఞతాభావంతో నిండిపోతుంది.

2 వాస్తవ జీవితంలో ఆ పరిస్థితి ఎదురుకాదని మనకు అనిపించవచ్చు, కానీ మనం నిజంగా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం. మనలో ప్రతీ ఒక్కరం, పైన ప్రస్తావించబడిన పరిస్థితికన్నా ఎంతో తీవ్రమైన పరిస్థితిలో ఉన్నాం. మనల్ని తప్పనిసరిగా ఎవరో ఒకరు విడిపించాలి. (రోమీయులు 7:24 చదవండి.) మనల్ని విడిపించడానికి యెహోవా దేవుడు ఎంతో త్యాగం చేశాడు. ఆయన కుమారుడూ ఎన్నో త్యాగాలు చేశాడు. వారు చేసిన త్యాగాలకు సంబంధించి మనం నాలుగు ముఖ్యమైన ప్రశ్నలను చర్చిద్దాం. అసలు మనకు విడుదల ఎందుకు అవసరం? మనల్ని విడిపించడానికి యేసు ఏమి త్యాగం చేయాల్సివచ్చింది? యెహోవా ఏమి త్యాగం చేశాడు? మనల్ని విడుదల చేయడానికి దేవుడు చేసిన ఏర్పాట్లకు విలువిస్తున్నామని మనం ఎలా చూపించవచ్చు?

మనకు విడుదల ఎందుకు అవసరం?

3. పాపం ఒక అంటువ్యాధి వంటిది అని ఎలా చెప్పవచ్చు?

3 ఇటీవలి నివేదిక ప్రకారం, 1918లో వచ్చిన స్పానిష్‌ ఇన్‌ఫ్లూయెన్జా ఘోరమైన అంటువ్యాధుల్లో ఒకటిగా చరిత్రలో పేరుగాంచింది. అది లక్షలాదిమందిని పొట్టనబెట్టుకుంది. ఒక విధంగా చెప్పాలంటే, దానికన్నా ప్రాణాంతక వ్యాధులు ఎన్నో ఉన్నాయి. ఆ వ్యాధులు వచ్చేది కొద్దిమందికే అయినా ప్రాణనష్టం మాత్రం చాలా జరుగుతుంది. * అయితే, అలాంటి అంటువ్యాధులతో పోలిస్తే పాప ప్రభావం ఎంతవరకు ఉంటుంది? రోమీయులకు 5:12లోని మాటలను గుర్తుచేసుకోండి. అక్కడ ఇలా ఉంది: “ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” అపరిపూర్ణ మానవులందరూ పాపం చేశారు కాబట్టి పాపం అందరికీ అంటువ్యాధిలా వ్యాపించింది. (రోమీయులకు 3:23 చదవండి.) ఈ పాపం వల్ల ఎంతమంది చనిపోతారు? పాపం వల్ల మరణము “అందరికిని సంప్రాప్తమాయెను” అని పౌలు రాశాడు.

4. మనం ఎంతకాలం జీవించాలని దేవుడు ఉద్దేశించాడు? ఆయన ఉద్దేశానికీ నేడు చాలామందికి ఉన్న అభిప్రాయానికీ తేడా ఏమిటి?

4 నేడు చాలామంది పాప మరణాలను మామూలు విషయమే అని అనుకుంటారు. ఎవరైనా చిన్న వయసులో చనిపోతే బాధపడతారు కానీ వృద్ధాప్యం వల్ల మరణిస్తే “మామూలు విషయమే” అని సరిపెట్టుకుంటారు. ఈ విషయంలో సృష్టికర్త ఉద్దేశాన్ని మానవులు తేలిగ్గా మరచిపోతున్నారు. దేవుడు ఉద్దేశించిన దానికన్నా మనం చాలా తక్కువకాలం జీవిస్తున్నాం. నిజం చెప్పాలంటే, ఇంతవరకు ఏ మానవుడూ యెహోవా దృష్టిలో కనీసం ‘ఒక్క దినమైనా’ జీవించలేదు. (2 పేతు. 3:8) అందుకే, మన ఆయుష్షు వట్టి ఊపిరివంటిదనీ, మనం గడ్డిలా త్వరగా వాడిపోతామనీ బైబిలు చెబుతోంది. (కీర్త. 39:5; 1 పేతు. 1:24) మనం ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకు? మనల్ని పీడించే “వ్యాధి” తీవ్రతను అర్థం చేసుకున్నప్పుడే దాన్ని నయం చేసే “చికిత్సకు” లేదా విడుదలకు ఎంతో విలువివ్వగలుగుతాం.

5. పాపం వల్ల మనం దేన్ని అనుభవించలేకపోయాం?

5 మనం పాపాన్ని, పాపం వల్ల వచ్చిన నష్టాలను అర్థం చేసుకోవాలంటే అసలు పాపం వల్ల ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మన మొదటి తల్లిదండ్రులు అనుభవించినదాన్ని పాపం వల్ల మనం ఇప్పుడు అనుభవించలేకపోతున్నాం కాబట్టి దాన్ని తెలుసుకోవడం మనకు మొదట్లో కష్టమనిపించవచ్చు. ఆరంభంలో ఆదాముహవ్వలు పరిపూర్ణమైన మానవ జీవితాన్ని అనుభవించారు. మానసికంగా, శారీరకంగా వారు పరిపూర్ణులు కాబట్టి తమ ఆలోచనలనూ, భావాలనూ, క్రియలనూ నియంత్రించుకునే సామర్థ్యం వారికి ఉండేది. యెహోవా దేవుని సేవకులుగా వారు ఎన్నో మంచి లక్షణాలను వృద్ధిచేసుకుంటూ ఉండగలిగేవారు. కానీ యెహోవా దేవుడు వారికి ఇచ్చిన పరిపూర్ణ జీవితమనే వరాన్ని చేతులారా పోగొట్టుకున్నారు. యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వల్ల వారి కోసం, వారి సంతానం కోసం యెహోవా ప్రారంభంలో ఉద్దేశించిన జీవితాన్ని పోగొట్టుకున్నారు. (ఆది. 3:16-19) అలా, మనం చర్చించుకుంటున్న ఆ భయంకరమైన “వ్యాధి” వారికే కాదు, వారి కారణంగా మనకూ వచ్చింది. అందుకే, యెహోవా వారికి తీర్పు తీర్చాడు. కానీ విడుదల విషయంలో యెహోవా మనలో ఆశను నింపాడు.—కీర్త. 103:10.

మనల్ని విడిపించడానికి యేసు ఏమి త్యాగం చేశాడు?

6, 7. (ఎ) మనల్ని విడిపించడానికి గొప్ప త్యాగం చేయాల్సి ఉంటుందని మొదట్లో యెహోవా ఎలా చూపించాడు? (బి) హేబెలే కాక, ధర్మశాస్త్రానికి ముందు జీవించిన పూర్వీకులు అర్పించిన బలుల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

6 ఆదాముహవ్వల సంతానాన్ని విడిపించడానికి గొప్ప త్యాగం చేయాల్సి ఉంటుందని యెహోవాకు తెలుసు. ఆదికాండము 3:15లోని ప్రవచనాన్ని పరిశీలిస్తే, విడిపించడానికి ఏమి త్యాగం చేయాల్సివుందో కొంత తెలుస్తుంది. యెహోవా మనల్ని రక్షించడానికి ఒక “సంతానాన్ని” పంపిస్తాడు. ఆయన సాతానును ఒకరోజు సమూలంగా నాశనం చేస్తాడు. అయితే, ఆ ప్రయత్నంలో ఆ సంతానం ఎన్నో బాధలుపడాలి. అలంకారార్థంగా ఆయన తన మడిమె మీద కొట్టబడాలి. ఎవరికైనా మడిమె మీద దెబ్బతగిలితే చాలా నొప్పిపుడుతుంది, వారు పనిచేయలేకపోవచ్చు లేక నీరసించిపోవచ్చు అని మనకు తెలుసు. అయితే, ఈ ప్రవచనంలో మడిమె మీద కొట్టబడడం అంటే ఏమిటి? యెహోవా చేత నియమించబడినవాడు అసలు ఎలాంటి శ్రమలను సహించాల్సివుంటుంది?

7 మానవులను పాపం నుండి విడిపించడానికి ఆ విమోచకుడు ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాలి. అంటే పాప పరిణామాలను తీసివేసి మానవులు తిరిగి దేవునితో సమాధానపడేందుకు మార్గాన్ని తెరిచే ఏర్పాటు చేయాలి. అంటే ఆయన ఏమి చేయాలి? మొదట్లో జరిగిన సంఘటనలను బట్టి బలి అవసరమని తెలుస్తుంది. మానవుల్లో మొదటి విశ్వాసియైన హేబెలు జంతు బలులు అర్పించినప్పుడు యెహోవా దేవుడు వాటిని అంగీకరించాడు. ఆ తర్వాత, దేవుని పట్ల భయభక్తులున్న నోవహు, అబ్రాహాము, యాకోబు, యోబు వంటి పూర్వీకులు కూడా అలాంటి బలులు అర్పించారు. వాటినీ దేవుడు అంగీకరించాడు. (ఆది. 4:4; 8:20, 21; 22:13; 31:54; యోబు 1:5) శతాబ్దాల తర్వాత, మోషే ధర్మశాస్త్రం బలి అర్పణ గురించి ప్రజలకు మరింత స్పష్టంగా వివరించింది.

8. వార్షిక ప్రాయశ్చితార్థ దినాన ప్రధాన యాజకుడు ఏమి చేసేవాడు?

8 ధర్మశాస్త్రం ప్రకారం, ఇశ్రాయేలీయులు అర్పించాల్సిన బలుల్లో వార్షిక ప్రాయశ్చితార్థ దినాన అర్పించే బలులు అత్యంత ప్రాముఖ్యమైనవి. ఆ రోజు ప్రధాన యాజకుడు జరగబోయేదానికి ముంగుర్తుగా కొన్ని పనులు చేసేవాడు. మొదట యాజక తరగతి కోసం, ఆ తర్వాత యాజకులుకాని గోత్రాల కోసం యెహోవాకు ప్రాయశ్చిత్త బలులను అర్పించేవాడు. ప్రధాన యాజకుడు గుడారంలోని లేదా మందిరంలోని అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేవాడు. సంవత్సరంలో ఆ ఒక్క రోజు మాత్రమే, అదీ ఆయన ఒక్కడే వెళ్లగలిగేవాడు. నిబంధనా మందసం ముందు బలి అర్పించిన జంతు రక్తాన్ని ప్రోక్షించేవాడు. యెహోవా దేవుని ప్రత్యక్షతను సూచిస్తూ కరుణాపీఠం మీద కొన్నిసార్లు మెరిసే మేఘం కనిపించేది.—నిర్గ. 25:22; లేవీ. 16:1-30.

9. (ఎ) ప్రాయశ్చిత్తార్థ దినాన ప్రధాన యాజకుడు ఎవరికి సూచనగా ఉన్నాడు, ఆయన అర్పించిన బలి దేన్ని సూచిస్తుంది? (బి) ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడం దేన్ని సూచిస్తుంది?

9 అపొస్తలుడైన పౌలు దైవ ప్రేరణతో ఆ ఆచారాలకు అర్థమేమిటో వివరించాడు. ప్రధాన యాజకుడు మెస్సీయ అయిన యేసుక్రీస్తును సూచిస్తున్నాడనీ, ఇశ్రాయేలీయులు అర్పించే బలులు క్రీస్తు బలి మరణాన్ని సూచిస్తుందనీ ఆయన వివరించాడు. (హెబ్రీ. 9:11-14) ఆయన అర్పించిన పరిపూర్ణ బలి వల్ల రెండు గుంపులకు అంటే క్రీస్తుకు చెందిన ఆత్మాభిషిక్తులైన 1,44,000 మందివున్న యాజక తరగతికీ, ‘వేరే గొర్రెలకు’ నిజమైన ప్రాయశ్చిత్తం కలుగుతుంది. (యోహా. 10:16) ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడం, యేసు విమోచన క్రయధన బలి విలువను తీసుకొని పరలోకంలోవున్న యెహోవా దేవుని సముఖానికి వెళ్లడాన్ని సూచిస్తుంది.—హెబ్రీ. 9:24, 25.

10. మెస్సీయ ఏమి అనుభవిస్తాడని బైబిలు ప్రవచనాలు తెలియజేస్తున్నాయి?

10 ఆదాముహవ్వల సంతానాన్ని విమోచించాలంటే నిజంగానే ఎంతో గొప్ప త్యాగం చేయాల్సివుంది. మెస్సీయ తన ప్రాణాన్ని అర్పించాల్సివుంది! హెబ్రీ లేఖనాన్ని రాసిన ప్రవక్తలు ఆ సత్యాన్ని ఎంతో స్పష్టంగా వివరించారు. ఉదాహరణకు, “అభిషిక్తుడగు అధిపతి” “దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు” ‘నిర్మూలము చేయబడతాడనీ’ లేక చంపబడతాడనీ ప్రవక్తయైన దానియేలు స్పష్టంగా చెప్పాడు. (దాని. 9:24-26) అపరిపూర్ణ మానవుల పాపాన్ని మోయడానికి మెస్సీయ తిరస్కరించబడతాడని, శ్రమలు అనుభవిస్తాడని, చివరకు చంపబడతాడని లేదా గాయపరచబడతాడని యెషయా ప్రవచించాడు.—యెష. 53:4, 5, 7.

11. మన విడుదల కోసం బలి అర్పించడానికి సంసిద్ధంగా ఉన్నానని యెహోవా కుమారుడు ఏయే విధాలుగా చూపించాడు?

11 మానవులను విడిపించడానికి తానేమి చేయాల్సివుందో ఈ భూమ్మీదకు రాకముందే దేవుని అద్వితీయ కుమారునికి తెలుసు. ఆయన తీవ్రంగా హింసించబడి, చంపబడాలి. ఆ విషయాలన్నీ తన తండ్రి తనకు వివరించినప్పుడు యేసు వెనక్కి తగ్గాడా లేక తిరుగుబాటు చేశాడా? ఆయన తిరుగుబాటు చేయలేదుగానీ ఇష్టపూర్వకంగా తన తండ్రి చెప్పినట్లు చేశాడు. (యెష. 50:4-6) అంతేకాక, యేసు ఈ భూమ్మీద ఉన్నప్పుడు విధేయతతో తన తండ్రి చిత్తాన్ని చేశాడు. ఎందుకు? దానికి రెండు కారణాలు ఆయన చెప్పాడు. “నేను తండ్రిని ప్రేమించుచున్నాను” అని అన్నాడు. అంతేకాక “తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు” అని అన్నాడు. (యోహా. 14:31; 15:13) కాబట్టి, మన విడుదలకు యెహోవా కుమారుని ప్రేమ కూడా ప్రముఖపాత్ర వహించింది. తన పరిపూర్ణ మానవ జీవితాన్ని అర్పించాల్సివున్నా మన విమోచన కోసం ఆ త్యాగం చేయడానికి సంతోషంగా ముందుకొచ్చాడు.

మనల్ని విమోచించడానికి యెహోవా ఏ త్యాగం చేశాడు?

12. విమోచన క్రయధనం ఎవరు ఏర్పాటు చేశారు? ఎందుకు ఏర్పాటు చేశారు?

12 విమోచన క్రయధనం గురించి మొదట ఆలోచించింది, దాన్ని ఏర్పాటు చేసింది యేసు కాదు. మానవులను విమోచించాలనేది యెహోవా చిత్తంలో ప్రాముఖ్యమైన అంశం. దేవాలయంలోని బలులు అర్పించబడే బలిపీఠం యెహోవా చిత్తాన్ని సూచిస్తోందని అపొస్తలుడైన పౌలు చూపించాడు. (హెబ్రీ. 10:10) కాబట్టి, క్రీస్తు బలి ద్వారా సాధ్యమైన విమోచనకు మనం ముఖ్యంగా యెహోవాకు రుణపడివున్నాం. (లూకా 1:68) ఆయన పరిపూర్ణ చిత్తాన్నీ, మానవుల పట్ల ఆయనకున్న ప్రగాఢమైన ప్రేమనూ అది తెలియజేస్తోంది.—యోహాను 3:16 చదవండి.

13, 14. యెహోవా మన కోసం చేసిన త్యాగాన్ని అర్థంచేసుకొని, కృతజ్ఞత చూపించేందుకు అబ్రాహాము ఉదాహరణ ఎలా సహాయం చేస్తుంది?

13 మనమీదున్న ప్రేమను ఈ విధంగా చూపించడానికి యెహోవా ఏ త్యాగం చేశాడు? దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం మనకు కష్టమే. అయితే, ఒక బైబిలు వృత్తాంతాన్ని పరిశీలిస్తే దాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతాం. నమ్మకస్థుడైన అబ్రాహామును చాలా కష్టమైన పనిని యెహోవా చేయమన్నాడు. ఆయన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమన్నాడు. అయితే, అబ్రాహాము ఒక ప్రేమగల తండ్రి. అబ్రాహాము ఇస్సాకును ఎంతగా ప్రేమించాడంటే యెహోవా ఇస్సాకు గురించి చెబుతూ ‘నీవు ప్రేమించే నీ ఒక్కగానొక్క కుమారుడు’ అని అబ్రాహాముతో అన్నాడు. (ఆది. 22:2) అయినప్పటికీ, ఇస్సాకు పట్ల తనకున్న ప్రేమకన్నా యెహోవా చిత్తానికే అబ్రాహాము ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు. యెహోవా మాటలకు విధేయత చూపిస్తూ అబ్రాహాము తన కుమారుణ్ణి అర్పించడానికి ముందుకొచ్చాడు. అయితే, భవిష్యత్తులో తానే ఒకరోజు చేయబోయే పనిని యెహోవా అబ్రాహామును చేయనివ్వలేదు. అబ్రాహాము తన కుమారుణ్ణి ఇక బలి అర్పిస్తాడనగా ఆయనను ఆపడానికి దేవుడు తన దూతను పంపించాడు. పునరుత్థానం చేయబడితే తప్ప తన కుమారుణ్ణి మళ్లీ చూడలేనని తెలిసినా ఆ తీవ్రమైన పరీక్షలో యెహోవాకే విధేయత చూపించాలని అబ్రాహాము గట్టిగా నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో, ఒకవేళ తన కుమారుడు చనిపోయినా దేవుడు ఆయనను పునరుత్థానం చేస్తాడని అబ్రాహాము పూర్తిగా నమ్మాడు. నిజానికి, అబ్రాహాము ఇస్సాకును “ఉపమానరూపముగా” మృతులలోనుండి మళ్లీ పొందాడని పౌలు కూడా చెప్పాడు.—హెబ్రీ. 11:17-19.

14 తన కుమారుణ్ణి బలి అర్పించడానికి సిద్ధపడుతుండగా అబ్రాహాము పడిన బాధను మనం ఊహించడం కష్టం. అబ్రాహాము పడిన వేదనను అర్థంచేసుకుంటే, యెహోవా “ఈయనే నా ప్రియ కుమారుడు” అని పిలిచినవాణ్ణి బలి అర్పించినప్పుడు ఎంత వేదన అనుభవించివుంటాడో కొంతవరకు అర్థం చేసుకోగలుగుతాం. (మత్త. 3:17) అయితే, యెహోవా అబ్రాహాముకన్నా ఎక్కువ బాధను అనుభవించి ఉంటాడని గుర్తుంచుకోండి. యెహోవా, తన కుమారునితో కోట్లాది సంవత్సరాలు, బహుశా వందల కోట్ల సంవత్సరాలు గడిపాడు. ఆయన ప్రియమైన “ప్రధానశిల్పి”గా, ఆయన ప్రతినిధిగా లేదా “వాక్యము”గా ఆ కుమారుడు తన తండ్రితో కలిసి సంతోషంగా పనిచేశాడు. (సామె. 8:22, 30, 31; యోహా. 1:1) తన కుమారుడు యాతనపెట్టబడి, హేళనచేయబడి, అపరాధిగా చంపబడినప్పుడు యెహోవా పొందిన బాధను మనం అర్థం చేసుకోవడం కష్టం. మనల్ని విడిపించడానికి యెహోవా ఎంతో గొప్ప త్యాగం చేశాడు. మనకు ఆ విడుదల పట్ల కృతజ్ఞతాభావం ఉందని ఎలా చూపించవచ్చు?

విమోచన పట్ల మీకు కృతజ్ఞతభావం ఉందని ఎలా చూపించవచ్చు?

15. పాప పరిహారార్థానికి సంబంధించిన గొప్ప ప్రక్రియ యేసు ఎలా పూర్తి చేశాడు? దానివల్ల ఏది సాధ్యమయ్యింది?

15 పరలోకానికి పునరుత్థానం చేయబడిన తర్వాత యేసు పాప పరిహారార్థానికి సంబంధించిన గొప్ప ప్రక్రియను పూర్తిచేశాడు. అప్పుడు ఆయన తన ప్రేమగల తండ్రి దగ్గరకు వెళ్లి తన బలి విలువను అప్పగించాడు. దానితో ఎన్నో ఆశీర్వాదాలు వచ్చాయి. మొదట, క్రీస్తు ఆత్మాభిషిక్త సహోదరుల పాపాలకూ, ఆ తర్వాత “సర్వలోక” పాపాలకూ పూర్తి క్షమాపణ సాధ్యమయ్యింది. ఆ బలి అర్పణవల్లే, నేడు తమ పాపాల విషయంలో నిజంగా పశ్చాత్తాపపడి, క్రీస్తు నిజ అనుచరులయ్యేవారు యెహోవా దేవునితో మంచి సంబంధాన్ని అనుభవించగలుగుతున్నారు. (1 యోహా. 2:2) ఈ విషయం మీకెలా వర్తిస్తుంది?

16. మనకు విడుదల సాధ్యం చేసిన యెహోవాకు మనం ఎందుకు కృతజ్ఞత చూపించాలో ఉదాహరణతో వివరించండి.

16 మనం మొదట్లో చెప్పుకున్న ఉదాహరణను మళ్లీ చూద్దాం. ఆ డాక్టరు మీ వార్డులోని పేషెంటుల దగ్గరకు వచ్చి, చికిత్స తీసుకునేవారు తాను చెప్పిన విషయాలన్నీ పాటిస్తే తప్పకుండా బాగౌతారని అన్నాడనుకుందాం. డాక్టరు చెప్పినట్లు క్రమం తప్పకుండా మందులు వేసుకోవడం లేదా ఆయన చెప్పిన నియమాలన్నీ పాటించడం ఎంతో కష్టమని వాదిస్తూ చాలామంది ఆయన చెప్పినట్లు చేయడానికి ఒప్పుకోకపోతే ఏమౌతుంది? ఆ చికిత్స పనిచేస్తుందనడానికి ఎన్నో రుజువులు చూసిన తర్వాత కూడా మీరు వారిలాగే డాక్టరు చెప్పింది చేయకుండా ఉంటారా? ఉండరు కదా. ఆ చికిత్సను కనుగొన్నందుకు ఆయనకు కృతజ్ఞత తెల్పుతూ, ఆయన చెప్పినవన్నీ జాగ్రత్తగా పాటిస్తారు. బహుశా మీ నిర్ణయాన్ని ఇతరులకూ చెబుతారు. మన కోసం అంత చేసిన డాక్టరుకు ఎంతో కృతజ్ఞత చూపిస్తాం. అలాంటప్పుడు తన కుమారుని విమోచన క్రయధన బలి ద్వారా మనకు విడుదల సాధ్యం చేసిన యెహోవాకు ఇంకెంత కృతజ్ఞత చూపించాలి?—రోమీయులకు 6:17, 18 చదవండి.

17. మిమ్మల్ని విడిపించడానికి యెహోవా చేసిన ఏర్పాటు పట్ల కృతజ్ఞత ఉందని మీరు ఏయే విధాలుగా చూపించవచ్చు?

17 పాపమరణాల నుండి విడిపించడానికి యెహోవా, ఆయన కుమారుడూ చేసిన త్యాగం పట్ల మనకు కృతజ్ఞత ఉంటే, దాన్ని చేతల్లో చూపిస్తాం. (1 యోహా. 5:3) పాపం చేయాలనే కోరికకు తలొగ్గం. ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తూ ద్వంద్వ జీవితాన్ని ఎన్నడూ గడపం. అలా చేస్తే విమోచన క్రయధనమంటే మనకు విలువలేదని, దానిపట్ల మనకు కృతజ్ఞత లేదని చెప్పినట్లే అవుతుంది. బదులుగా, యెహోవాతో మనకున్న అనుబంధాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడడం ద్వారా కృతజ్ఞతను చూపిస్తాం. (2 పేతు. 3:14) ఇతరులు కూడ యెహోవాతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకొని నిత్యమూ జీవించే అవకాశాన్ని పొందేలా దేవుడు చేసిన అద్భుతమైన ఏర్పాటు గురించి వారికి చెబుతాం. అలా మన కృతజ్ఞతను చేతల్లో చూపిస్తాం. (1 తిమో. 4:16) యెహోవాను, యేసుక్రీస్తును స్తుతించేందుకు మన సమయాన్ని, శక్తిని పూర్తిగా ధారపోయాలి. ఎందుకంటే, మన స్తుతిని పొందేందుకు వారు అన్నివిధాలా అర్హులు. (మార్కు 12:28-30) దీని గురించి ఒక్కసారి ఆలోచించండి! పాపం నుండి పూర్తిగా విముక్తి పొందే కాలం కోసం మనం ఎదురు చూడవచ్చు. అంతేకాక, యెహోవా ఉద్దేశించిన ప్రకారం మనం పరిపూర్ణులముగా నిరంతరం జీవించగలుగుతాం. యెహోవా మనల్ని విడిపించడానికి చేసిన ఏర్పాటు వల్ల ఇదంతా సాధ్యమౌతుంది.—రోమా. 8:20, 21.

[అధస్సూచి]

^ పేరా 3 స్పానిష్‌ ఇన్‌ఫ్లూయెన్జా అప్పటి ప్రపంచ జనాభాలో దాదాపు 20 నుండి 50 శాతం మందికి సోకిందని చెబుతారు. అది సోకిన వారిలో 1 నుండి 10 శాతం మంది మరణించారు. ఎబోలా అనే వైరస్‌ విషయమే తీసుకుంటే, అది ఎంతో అరుదుగా సోకుతుంది. కానీ అది ప్రబలిన కొన్ని సందర్భాల్లో దాని బారినపడిన తొంభై శాతం మంది చనిపోయారు.

మీరెలా జవాబిస్తారు?

• మీకు విడుదల ఎందుకు అత్యవసరం?

• యేసు చేసిన స్వయంత్యాగానికి మీరు ఎలా కృతజ్ఞత చూపించాలనుకుంటున్నారు?

• యెహోవా ఏర్పాటు చేసిన విమోచన క్రయధనం అనే వరం గురించి మీరేమి అనుకుంటున్నారు?

• మనల్ని విడిపించడానికి యెహోవా చేసిన ఏర్పాట్ల పట్ల కృతజ్ఞతతో మీరు ఏమి చేయాలనుకుంటున్నారు?

[అధ్యయన ప్రశ్నలు]

[27వ పేజీలోని చిత్రం]

ప్రాయశ్చితార్థ దినాన ఇశ్రాయేలీయుల ప్రధాన యాజకుడు మెస్సీయకు ముంగుర్తుగా ఉండేవాడు

[28వ పేజీలోని చిత్రం]

తన కుమారుణ్ణి బలి అర్పించడానికి అబ్రాహాము ఇష్టపూర్వకంగా ముందుకు రావడం యెహోవా అర్పించిన గొప్ప బలి గురించి ఎంతో చెబుతోంది