కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘అందరితో సమాధానంగా ఉండండి’

‘అందరితో సమాధానంగా ఉండండి’

‘అందరితో సమాధానంగా ఉండండి’

“శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.”—రోమా. 12:18.

1, 2. (ఎ) యేసు తన అనుచరులను ఏమని హెచ్చరించాడు? (బి) వ్యతిరేకత ఎదురైనప్పుడు ప్రవర్తించాల్సిన తీరు గురించిన ఉపదేశం ఎక్కడ ఉంది?

యేసు తన శిష్యులతో మాట్లాడుతూ జనాంగాలు వారిని వ్యతిరేకిస్తాయని హెచ్చరించాడు. తాను మరణించడానికి ముందు రోజు సాయంత్రం దానికిగల కారణాన్ని ఆయన వివరిస్తూ, “మీరు లోకసంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది” అని అన్నాడు.—యోహా. 15:19.

2 అపొస్తలుడైన పౌలు ఆ వాస్తవాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. పౌలు తన యువ సహచరుడైన తిమోతికి రాసిన రెండవ పత్రికలో “నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును . . . హింసలను ఉపద్రవములను, తెలిసికొనినవాడవై నన్ను వెంబడించితివి” అని అన్నాడు. అంతేకాక, “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు” అని కూడ ఆయన రాశాడు. (2 తిమో. 3:10-12) రోమీయులు 12వ అధ్యాయంలో, వ్యతిరేకత ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తించాలో పౌలు అప్పటి క్రైస్తవులకు వివరించాడు. ఆయన ఇచ్చిన మంచి ఉపదేశం ఈ అంత్యకాలంలో కూడ ఉపయోగపడుతుంది.

‘యోగ్యమైనవాటిని చేయండి’

3, 4. రోమీయులకు 12:17లో ఉన్న ఉపదేశాన్ని (ఎ) కొందరు సత్యంలో లేని కుటుంబాల్లో, (బి) పొరుగువారితో వ్యవహరిస్తున్నప్పుడు ఎలా అన్వయించుకోవచ్చు?

3రోమీయులకు 12:17 చదవండి. మనతో ఎవరైనా కఠినంగా ప్రవర్తిస్తే కీడుకు ప్రతికీడు చేయకూడదని పౌలు వివరించాడు. కొన్ని కుటుంబాల్లో అందరూ సత్యంలో ఉండకపోవచ్చు. అలాంటి కుటుంబాలు ఈ ఉపదేశాన్ని పాటించడం ఎంతో ప్రాముఖ్యం. అవిశ్వాసియైన భాగస్వామి బాధపెట్టే మాటంటే లేదా కటువుగా ప్రవర్తిస్తే సత్యంలోవున్న భర్త/భార్య, మాటకు మాట చెప్పకుండా లేదా కటువుగా ప్రవర్తించకుండా జాగ్రత్తపడతారు. ‘కీడుకు ప్రతికీడు’ చేయడం వల్ల ప్రయోజనమేమీ ఉండకపోగా పరిస్థితి మరింత విషమిస్తుంది.

4 “మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగియుండుడి” అనే మంచి సలహా పౌలు ఇచ్చాడు. ఓ కుటుంబంలో, అవిశ్వాసియైన భర్త విశ్వాసియైన భార్య నమ్మకాల గురించి చెడుగా మాట్లాడినప్పుడు ఆమె అతనితో దయగా ప్రవర్తిస్తే వారి మధ్య వాదోపవాదాలు చోటుచేసుకోవు. (సామె. 31:12) ఇప్పుడు బెతెల్‌లో పనిచేస్తున్న కార్లోస్‌, వాళ్లమ్మ దయతో ప్రవర్తిస్తూ, ఇంటిని బాగా చూసుకుంటూ వాళ్ల నాన్న నుండి ఎదురైన తీవ్ర వ్యతిరేకతను ఎలా అధిగమించిందో వివరించాడు. “నాన్నను గౌరవించమని మా అమ్మ మాకు ఎప్పుడూ చెప్పేది. నాకు బూల్‌ (ఫ్రాన్స్‌ దేశంలో ఆడే బౌలింగ్‌ ఆట) ఆట ఇష్టంలేకపోయినా, నాన్నతో కలిసి ఆడమని నన్ను బలవంతపెట్టేది. అలా ఆడితే నాన్న సంతోషపడేవాడు” అని కార్లోస్‌ చెప్పాడు. వాళ్ల నాన్న కొంతకాలానికి బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టి బాప్తిస్మం తీసుకున్నాడు. “మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవి” చేసే విషయంలో యెహోవాసాక్షులు మంచి మాదిరినుంచారు. విపత్తులు జరిగినప్పుడు వారు తరచూ తమ పొరుగువారికి అవసరమైన సహాయాన్ని అందించారు. అలా వారు పొరుగువారి మనసులో ఉన్న వివక్షను తొలగించగలిగారు.

వ్యతిరేకతను ‘నిప్పుతో’ కరిగించండి

5, 6. (ఎ) ఏ విధంగా శత్రువు తలమీద ‘నిప్పులు’ కుప్పగా పోయవచ్చు? (బి) రోమీయులకు 12:20లో ఉన్న ఉపదేశాన్ని అన్వయించుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చూపించే ఓ స్థానిక అనుభవం చెప్పండి.

5రోమీయులకు 12:20 చదవండి. పౌలు సామెతలు 25:21, 22 వచనాలను మనసులో ఉంచుకొనే ఆ వచనంలోని మాటలు చెప్పివుంటాడు. అక్కడిలా ఉంది: “నీ పగవాడు ఆకలిగొనినయెడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనినయెడల వానికి దాహమిమ్ము అట్లు చేయుటచేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును.” రోమీయులు 12వ అధ్యాయంలో పౌలు ఇచ్చిన ఉపదేశాన్నిబట్టి, ఆయన ఆ వచనంలో నిప్పుల్లాంటి వాటితో దాడిచేసి వ్యతిరేకులను శిక్షించమని లేదా అవమానపరచమని చెప్పడంలేదని అర్థమౌతుంది. పౌలు చెప్పిన మాటలూ సామెతల్లోని మాటలూ ఒకే విషయం గురించి చెబుతున్నాయి. అవి ముడిఖనిజాన్ని కరిగించడానికి ఉపయోగించే ప్రాచీన పద్ధతిని సూచిస్తుండవచ్చు. 19వ శతాబ్దపు ఆంగ్ల విద్వాంసుడైన ఛార్లెస్‌ బ్రిడ్జెస్‌ ఇలా అన్నాడు: ‘మలిచేందుకు కష్టమైన ఆ లోహం చుట్టూ నిప్పులు పెట్టి, దాని కింద మాత్రమే కాకుండా దానిపైన కూడ నిప్పులు కుమ్మరించండి. కొందరు ఆ లోహంలాగే కఠినంగా వ్యవహరిస్తారు. మంచి కోసం దేన్నైనా ఓపిగ్గా భరిస్తూ, ప్రగాఢమైన ప్రేమ చూపించేవారి ప్రవర్తనను చూసి ఎంతటి కఠినహృదయులైనా కరగక మానరు.’

6 దయతో మనం చేసే పనులు ఆ ‘నిప్పుల్లాంటివే.’ వాటిని చూసి వ్యతిరేకులు తమ మనసు మార్చుకోవచ్చు, మనతో క్రూరంగా ప్రవర్తించకపోవచ్చు. మనం దయతో చేసే పనులను చూసి ప్రజలు యెహోవా సేవకుల పట్ల వారు అందించే బైబిలు సందేశం పట్ల సదభిప్రాయాన్ని ఏర్పరచుకోవచ్చు. అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు: “అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.”—1 పేతు. 2:12.

“సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి”

7. క్రీస్తు తన శిష్యులకు ఏ శాంతిని అనుగ్రహించాడు? మనం ఎలా ప్రవర్తించేందుకు అది మనల్ని ప్రోత్సహించాలి?

7రోమీయులకు 12:18 చదవండి. యేసు తన అపొస్తలులతో గడిపిన చివరిరోజు సాయంకాలం, “శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను” అని అన్నాడు. (యోహా. 14:27) యెహోవా, ఆయన ప్రియ కుమారుడు తమను ప్రేమిస్తున్నారనీ, వారి అనుగ్రహం తమకు ఉందనీ తెలుసుకున్నప్పుడు వారు పొందే మనశ్శాంతి గురించే ఆయన తన శిష్యులతో మాట్లాడాడు. మనం ఇతరులతో సమాధానంగా ప్రవర్తించడానికి ఈ మనశ్శాంతి మనకు సహాయం చేయాలి. నిజక్రైస్తవులు శాంతికాముకులే కాక, సమాధానపరచువారు కూడ.—మత్త. 5:9.

8. మనం ఇంట్లో, సంఘంలో సమాధానపరచువారిగా ఎలా ఉండవచ్చు?

8 కుటుంబంలో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, పరిస్థితి విషమించకముందే వీలైనంత త్వరగా పరిష్కరించుకుంటే సమాధానపరచువారిగా ఉండవచ్చు. (సామె. 15:18; ఎఫె. 4:26) క్రైస్తవ సంఘంలో కూడ మనం అలా ప్రవర్తించాలి. సమాధానం కోసం పాటుపడాలంటే నోటిని అదుపులో ఉంచుకోవాలని అపొస్తలుడైన పేతురు వివరించాడు. (1 పేతు. 3:10, 11) అంతేకాక, యాకోబు నోటిని అదుపులో ఉంచుకోమని, మత్సరానికి, వివాదానికి దూరంగా ఉండమని గట్టిగా హెచ్చరించిన తర్వాత ఇలా రాశాడు: “పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది. నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.”—యాకో. 3:17, 18.

9. మనం ‘అందరితో సమాధానంగా ఉండడానికి’ ప్రయత్నిస్తున్నప్పుడు దేన్ని గుర్తుంచుకోవాలి?

9 రోమీయులకు 12:18లో పౌలు కుటుంబంలో, సంఘంలో సమాధానపరచువారిగా ఉండడం గురించి మాత్రమే మాట్లాడడంలేదు. మనం “సమస్త మనుష్యులతో సమాధానముగా” ఉండాలని ఆయన చెప్పాడు. (రోమా. 12:18) అంటే పొరుగువారితో, తోటి ఉద్యోగస్థులతో, తోటి విద్యార్థులతో, పరిచర్యలో మనం కలుసుకునే వ్యక్తులతో కూడ మనం సమాధానపరచువారిగా ఉండాలి. అపొస్తలుడైన పౌలు “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు” అనే మాటను కూడ చేర్చాడు. దేవుని నీతి సూత్రాల విషయంలో రాజీపడకుండా ‘అందరితో సమాధానంగా ఉండడానికి’ మనం చేయగలిగినదంతా చేయాలని దానర్థం.

పగతీర్చుకోవడం యెహోవా పని

10, 11. మనం ‘దేవుని ఉగ్రతకు చోటివ్వడం’ ఎందుకు సరైనది?

10రోమీయులకు 12:19 చదవండి. మన పని, సందేశం విషయంలో ‘ఎదురాడేవారితోపాటు’ మనల్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నవారితో వ్యవహరిస్తున్నప్పుడు కూడ మనం ‘కీడును సహిస్తూ’ ‘సాత్వికంతో’ ప్రవర్తిస్తాం. (2 తిమో. 2:23-26) పగతీర్చుకోకుండా ‘దేవుని ఉగ్రతకు చోటివ్వాలని’ పౌలు క్రైస్తవులకు ఉపదేశించాడు. మనం క్రైస్తవులం కాబట్టి, పగతీర్చుకోవడం మన పనికాదని తెలుసు. “కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము” అని కీర్తనకర్త రాశాడు. (కీర్త. 37:8) సొలొమోను ఇలా ఉపదేశించాడు: “కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు యెహోవాకొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును.”—సామె. 20:22.

11 వ్యతిరేకులు మనకు హానిచేస్తే, మనం పగతీర్చుకునే బదులు శిక్షించే పనిని యెహోవాకే వదిలేయాలి. ఆయన సరైన సమయంలో వారిని శిక్షిస్తాడు. యెహోవా ఉగ్రత గురించి తాను మాట్లాడుతున్నానని తెలియజేస్తూ పౌలు ఇంకా ఇలా చెప్పాడు: “పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.” (ద్వితీయోపదేశకాండము 32:35ను పోల్చండి.) కాబట్టి, పగతీర్చుకోవడానికి ప్రయత్నిస్తే మనం అహంకారంతో ఆయన అధికారాన్ని మన చేతుల్లోకి తీసుకున్నట్లౌతుంది. అంతేకాక, “నేనే ప్రతిఫలము నిత్తును” అనే యెహోవా వాగ్దానం మీద నమ్మకంలేదని చెప్పినట్లౌతుంది.

12. యెహోవా తన కోపాన్ని ఎప్పుడు, ఎలా చూపిస్తాడు?

12 రోమీయులకు రాసిన పత్రికలోని మొదటి అధ్యాయంలో పౌలు, “దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దుర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది” అని చెప్పాడు. (రోమా. 1:18) ‘మహాశ్రమలప్పుడు’ తన కుమారుని ద్వారా పరలోకం నుండి దేవుడు తన కోపాన్ని చూపిస్తాడు. (ప్రక. 7:14) అది “దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది” అని పౌలు మరో ప్రేరేపిత పత్రికలో వివరించాడు. ఆయన ఆ పత్రికలో, “ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే” అని చెప్పాడు.—2 థెస్స. 1:5-8.

మేలు చేత కీడును జయించండి

13, 14. (ఎ) ఎవరైనా వ్యతిరేకిస్తే మనం ఎందుకు ఆశ్చర్యపోము? (బి) మనల్ని హింసించేవారిని ఎలా దీవించవచ్చు?

13రోమీయులకు 12:14, 21 చదవండి. యెహోవా తన ఉద్దేశాలను నెరవేరుస్తాడనే పూర్తి నమ్మకంతో మనం సాహసాలకు పోకుండా దేవుడు అప్పగించిన పని కోసం గట్టికృషి చేయవచ్చు. ‘రాజ్యసువార్తను’ “లోకమందంతట” ప్రకటించే పనిని ఆయన మనకు అప్పగించాడు. (మత్త. 24:14) “మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు” అని యేసు మనల్ని హెచ్చరించాడు కాబట్టి, ఆ పనిలో పాల్గొంటే మన శత్రువులకు కోపం వస్తుందని మనకు తెలుసు. (మత్త. 24:9) అందుకే, మనకు వ్యతిరేకత ఎదురైనప్పుడు మనం ఆశ్చర్యపోము లేదా నిరుత్సాహపడము. అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు: “ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి.”—1 పేతు. 4:12, 13.

14 మనల్ని హింసించేవారిని శత్రువులుగా చూసేబదులు వారిలో కొందరు తెలియక అలా చేస్తున్నారని గుర్తుంచుకొని వారికి బోధించడానికి ప్రయత్నిస్తాం. (2 కొరిం. 4:4) మనం పౌలు ఉపదేశాన్ని అనుసరించడానికి కృషిచేస్తాం. ఆయన, “మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు” అని అన్నాడు. (రోమా. 12:14) వారి కోసం ప్రార్థించడం ద్వారా వారిని దీవించవచ్చు. యేసు కొండమీద ప్రసంగంలో, “మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి, మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థనచేయుడి” అని అన్నాడు. (లూకా 6:27, 28) హింసించే వ్యక్తి క్రీస్తు నమ్మకమైన శిష్యునిగా, ఉత్సాహవంతుడైన యెహోవా సేవకునిగా మారే అవకాశముందని పౌలు తన సొంత అనుభవం నుండి తెలుసుకున్నాడు. (గల. 1:13-16, 23) మరో పత్రికలో పౌలు, “నిందింపబడియు దీవించుచున్నాము; హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము; దూషింపబడియు బతిమాలుకొనుచున్నాము” అని అన్నాడు.—1 కొరిం. 4:12, 13.

15. మేలు చేత కీడును జయించే చక్కని విధానం ఏమిటి?

15 అందుకే, నిజ క్రైస్తవులు రోమీయులు 12వ అధ్యాయంలోని చివరి వచనాన్ని పాటిస్తారు: “కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.” ఈ లోకంలోని దుష్టత్వానికి అపవాదియైన సాతానే కారకుడు. (యోహా. 8:44; 1 యోహా. 5:19) అపొస్తలుడైన యోహానుకు ఇచ్చిన దర్శనంలో, తన అభిషిక్త సహోదరులు “గొఱ్ఱెపిల్ల రక్తమునుబట్టియు, తామిచ్చిన సాక్ష్యమునుబట్టియు వానిని [సాతానును] జయించియున్నారు” అని యేసు తెలియజేశాడు. (ప్రక. 12:11) సాతానుతోపాటు, లోకంపై అతడి చెడు ప్రభావాన్ని జయించాలంటే రాజ్యం గురించి ప్రకటించడం ద్వారా మంచిని చేయాలని, జయించడానికి అదే చక్కని విధానమని ఆ మాటలు తెలియజేస్తున్నాయి.

నిరీక్షణనుబట్టి సంతోషించండి

16, 17. రోమీయులు 12వ అధ్యాయంలో తెలుసుకున్నదాన్నిబట్టి, (ఎ) మన జీవితాలను ఎలా ఉపయోగించాలి? (బి) సంఘంలో ఎలా ప్రవర్తించాలి? (సి) మన నమ్మకాలను వ్యతిరేకించేవారితో ఎలా ప్రవర్తించాలి?

16 రోమాలోని క్రైస్తవులకు పౌలు రాసిన పత్రికలోని 12వ అధ్యాయాన్ని మనం ఇప్పటివరకు క్లుప్తంగా చర్చించాం. ఆ చర్చలో మనకు కింద ఇవ్వబడ్డ ఎన్నో విషయాలు గుర్తుచేయబడ్డాయి. యెహోవా సమర్పిత సేవకులముగా మనం త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలుసుకున్నాం. అంతేకాక, మనం అలాంటి బలి అర్పించడం దేవునికి ఇష్టమని పరీక్షించి తెలుసుకున్నాం కాబట్టి, పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం దాన్ని ఇష్టపూర్వకంగా చేస్తాం. మనం ఆత్మయందు తీవ్రతగలవారమై వివిధ కృపావరాలను ఉత్సాహంతో ఉపయోగించాలి. మనం వినయంగా, అణకువగా ప్రవర్తిస్తూ క్రైస్తవ ఐక్యతను కాపాడడానికి చేయగలిగినదంతా చేయాలి. మనం ఆతిథ్యాన్ని చూపిస్తూ ఇతరుల సుఖదుఃఖాల్లో పాలుపంచుకోవాలి.

17 అంతేకాక, రోమీయులు 12వ అధ్యాయం వ్యతిరేకత ఎదురైనప్పుడు మనం ప్రవర్తించాల్సిన తీరు గురించి ఎన్నో విషయాలు చెబుతోంది. మనం కీడుకు ప్రతికీడు చేయకూడదని తెలుసుకున్నాం. దయతో ప్రవర్తించడం ద్వారా వ్యతిరేకతను అధిగమించడానికి కృషిచేయాలి. బైబిలు సూత్రాల విషయంలో రాజీపడకుండా మనం సాధ్యమైనంతవరకు అందరితో సమాధానంగా ఉండేందుకు కృషిచేయాలి. కుటుంబంలో, సంఘంలో, పొరుగువారి విషయంలో, పనిలో, పాఠశాలలో, పరిచర్యలో కూడ అలా ఉండేందుకు కృషిచేయాలి. ఇతరులు మనతో క్రూరంగా ప్రవర్తించినా, పగతీర్చుకోవడం యెహోవా పని అని గుర్తుంచుకొని మేలు చేత కీడును జయించడానికి మనం చేయగలిగినదంతా చేస్తాం.

18. రోమీయులకు 12:12లో ఏ మూడు సలహాలు ఇవ్వబడ్డాయి?

18రోమీయులు 12:12 చదవండి. జ్ఞానయుక్తమైన, మంచి ఉపదేశాన్ని ఇచ్చిన తర్వాత పౌలు మూడు విషయాల గురించి ఉద్భోదించాడు. యెహోవా సహాయం లేకుండా ఇవన్నీ మనం ఎప్పుడూ చేయలేం కాబట్టి, “ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి” అని పౌలు మనకు సలహా ఇచ్చాడు. అలా ప్రార్థించడం వల్ల “శ్రమయందు ఓర్పుగలవారై” ఉండండి అని ఆయన ఇచ్చిన ఉపదేశాన్ని కూడ పాటించగలుగుతాం. చివరిగా, భవిష్యత్తులో యెహోవా ఇచ్చే ఆశీర్వాదాలను మనసులో ఉంచుకోవాలి. అంతేకాక మనకు భూనిరీక్షణవున్నా లేదా పరలోక నిరీక్షణవున్నా ఆ నిరంతర జీవిత ‘నిరీక్షణనుబట్టి సంతోషించాలి.’

పునఃసమీక్ష

• వ్యతిరేకత ఎదురైనప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి?

• మనం ఎక్కడెక్కడ సమాధానపరచువారిగా ఉండేందుకు కృషిచేయాలి? ఎలా?

• పగ తీర్చుకోవడానికి మనం ఎందుకు ప్రయత్నించకూడదు?

[అధ్యయన ప్రశ్నలు]

[8వ పేజీలోని చిత్రం]

పొరుగువారికి అవసరమైన సహాయం అందిస్తే వారి మనసులో ఉన్న వివక్ష తొలగిపోవచ్చు

[9వ పేజీలోని చిత్రం]

సంఘంలో సమాధానపరచువారిగా ఉండేందుకు మీరు కృషిచేస్తున్నారా?