కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబ ఆరాధన రక్షణకు చాలా ప్రాముఖ్యం!

కుటుంబ ఆరాధన రక్షణకు చాలా ప్రాముఖ్యం!

కుటుంబ ఆరాధన రక్షణకు చాలా ప్రాముఖ్యం!

“సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము” ఎంత భయానకంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. (ప్రక. 16:14) ప్రవక్తయైన మీకా స్పష్టమైన అలంకారాలతో ఆ మహాదినాన్ని ఇలా వర్ణించాడు: “అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటముమీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును.” (మీకా 1:4) యెహోవాను సేవించనివారు ఎలాంటి వినాశనాన్ని చూస్తారు? “ఆ దినమున యెహోవాచేత హతులైన వారు ఈ దేశముయొక్క యీ దిశనుండి ఆ దిశవరకు కనబడుదురు” అని దేవుని వాక్యం చెబుతోంది.—యిర్మీ. 25:33.

అలాంటి హెచ్చరికలను మనసులో ఉంచుకొని ఒంటరి తండ్రులు లేక తల్లులతోసహా కుటుంబ పెద్దలందరూ ఆలోచించే సామర్థ్యమున్న తమ పిల్లల గురించి ఇలా ప్రశ్నించుకోవడం మంచిది, ‘మా పిల్లలు అర్మగిద్దోనును తప్పించుకుంటారా?’ వారి వయసుకు తగినట్లు ఆధ్యాత్మికంగా బలంగా ఉంటే అర్మగిద్దోనును తప్పించుకుంటారని బైబిలు భరోసా ఇస్తోంది.—మత్త. 24:21.

కుటుంబ ఆరాధన కోసం ఎందుకు సమయాన్ని కేటాయించాలి?

పిల్లల్ని “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను” పెంచడానికి మీరు చేయగలిగినదంతా చేయడానికి తగిన చర్యలు తీసుకోండి. (ఎఫె. 6:4) మీరు మీ పిల్లలతో బైబిలు అధ్యయనం చేయడం ఎంతో ప్రాముఖ్యం. మన పిల్లలు ఫిలిప్పీలోని క్రైస్తవుల్లా ఉండాలని మనం కోరుకుంటాం. యెహోవాకు ఇష్టపూర్వకంగా విధేయులైనందుకు పౌలు వారిని మెచ్చుకున్నాడు. “నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులైయున్నప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమేగాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి” అని పౌలు వారికి రాశాడు.—ఫిలి. 2:12.

మీరు వారి ప్రక్కన లేనప్పుడు కూడ మీ పిల్లలు యెహోవా నియమాలను పాటిస్తారా? వారు స్కూల్లో ఉన్నప్పుడు వాటిని పాటిస్తున్నారా? మీరు ప్రక్కన లేనప్పుడు కూడ యెహోవా నియమాలను పాటించేలా మీ పిల్లలకు మీరెలా సహాయం చేయవచ్చు? వాటిని పాటించడం వల్ల మేలు జరుగుతుందని వారికి నమ్మకం కుదిరేలా ఎలా సహాయం చేయవచ్చు?

ఈ విషయంలో మీ పిల్లల విశ్వాసాన్ని బలపర్చడానికి కుటుంబ ఆరాధన ఎంతో సహాయం చేస్తుంది. అందుకే, మీ కుటుంబ బైబిలు అధ్యయనాన్ని విజయవంతం చేసుకునేందుకు ఎంతో అవసరమైన మూడు విషయాలను మనమిప్పుడు చూద్దాం.

క్రమం తప్పకుండా చేయండి

దేవదూతలు దేవుని సన్నిధికి నియమిత సమయాల్లో ఆహ్వానించబడతారని బైబిలు సూచిస్తోంది. (యోబు 1:6) మీ పిల్లల విషయంలో కూడ అలాగే చేయండి. కుటుంబ ఆరాధన ఏ రోజున ఏ సమయానికి చేయాలో నిర్ణయించుకొని, క్రమం తప్పకుండా దాన్ని నిర్వహించండి. అంతేకాక, అనుకోని పరిస్థితుల వల్ల ఆ రోజు అధ్యయనం చేయడం వీలుకాకపోతే దాన్ని ఏ రోజు, ఎప్పుడు చేయాలో కూడ ముందే నిర్ణయించుకోండి.

నెలలు గడిచే కొద్ది, వీలైనప్పుడు చేద్దాంలే అని అనిపించవచ్చు. అలాంటి ఆలోచనను దరిచేరనివ్వకండి. మీ పిల్లలే మీకు ఎంతో ప్రాముఖ్యమైన బైబిలు విద్యార్థులని గుర్తుంచుకోండి. అయితే, సాతాను వారికి హాని చేయాలనుకుంటాడు. (1 పేతు. 5:8) ఓ రాత్రి టీవీ చూడడం కోసం లేదా ప్రాముఖ్యంకాని మరో పని చేయడం కోసం ఎంతో విలువైన కుటుంబ ఆరాధనను ఎగ్గొడితే, సాతాను మీ మీద విజయం సాధించినట్లే.—ఎఫె. 5:15, 16; 6:12; ఫిలి. 1:9, 10.

కుటుంబ అవసరానికి తగ్గట్టు మలచుకోండి

కుటుంబ అధ్యయనాన్ని జ్ఞానం సంపాదించుకోవడానికి మాత్రమే చేయకూడదు. మీ కుటుంబ అవసరానికి సరిపోయే విధంగా కూడ దాన్ని మలచుకోవడానికి కృషిచేయాలి. ఎలా? కొన్నిసార్లు, భవిష్యత్తులో మీ పిల్లవాడు ఎదుర్కొనే పరిస్థితులను మనసులో ఉంచుకొని విషయాలను ఎంపిక చేసుకోండి. ఉదాహరణకు, పరిచర్యలో ఎలా మాట్లాడాలో ఎందుకు ప్రాక్టీసు చేయకూడదు? పిల్లలు బాగా వచ్చినవాటిని చేయడానికే ఇష్టపడతారు. పరిచర్యలో ఏయే విషయాలు మాట్లాడాలో ప్రాక్టీసు చేస్తూ, ఇంటివారు లేవనెత్తే ప్రశ్నలకు ఎలా జవాబివ్వాలో చర్చిస్తే ప్రకటనా పనికి సంబంధించిన వివిధ అంశాల్లో వారు మరింత ధైర్యంగా పాల్గొనగలుగుతారు.—2 తిమో. 2:15.

తోటివారి నుండి ఒత్తిడి ఎదుర్కొన్నప్పుడు వారితో ఎలా వ్యవహరించాలో మీ పిల్లలతో ప్రాక్టీసు చేయించవచ్చు. సిగరెట్టు తాగమని, డేటింగ్‌ చేయమని, డ్రగ్స్‌ తీసుకోమని, టీచర్లపై తిరగబడమని తోటివారు మీ పిల్లలను ఒత్తిడి చేస్తుండవచ్చు. అలాంటి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవచ్చో మీరు మీ పిల్లలతో చర్చించడానికి, ప్రాక్టీసు చేయించడానికి మన రాజ్య పరిచర్య, డిసెంబరు 2000 సంచికలోని 8వ పేజీలో ఉన్న “తోటివారి ఒత్తిడి, ప్రకటించే మీ ఆధిక్యత,” కావలికోట మే 15, 1994 సంచికలోని 13 పేజీ, 13-15 పేరాల్లోని విషయాలు మీరు ఉపయోగించవచ్చు. కుటుంబ అధ్యయనంలో అప్పుడప్పుడు మీరెందుకు అలా ప్రాక్టీసు చేయకూడదూ?

ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేందుకు కూడ కుటుంబ అధ్యయనాన్ని మీరు ఉపయోగించవచ్చు. “యౌవనస్థులారా—మీ జీవితంలో మీరేమి చేస్తారు?” అనే కరపత్రంలో దీని గురించి చక్కని సమాచారముంది. ఆ కరపత్రాన్ని చర్చిస్తున్నప్పుడు, జీవితంలో యెహోవా సేవకు ప్రాముఖ్యతనిస్తే ఎంతో మేలు జరుగుతుందని మీ పిల్లవాడికి అర్థమయ్యేలా చెప్పండి. పయినీరు సేవ, బెతెల్‌ సేవ, పరిచర్య శిక్షణా పాఠశాల హాజరవడం లేదా ఏదో ఒక రకమైన పూర్తికాల పరిచర్యలో పాల్గొనడం వంటి లక్ష్యాలను సాధించాలనే కోరిక పిల్లల్లో కలిగేలా కృషిచేయండి.

కానీ ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మంచి ఉద్దేశంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు ఫలాని లక్ష్యాలను సాధించాలని కోరుకుంటారు. వారలా ఎంతగా కోరుకుంటారంటే వారి పిల్లలు ఇప్పటికే చేస్తున్న మంచి పనులను వారు పట్టించుకోరు. బెతెల్‌ సేవ, మిషనరీ సేవ వంటి మంచి లక్ష్యాలను పెట్టుకోమని పిల్లలను ప్రోత్సహించడం మంచిదే. కానీ అలా ప్రోత్సహిస్తున్నప్పుడు మీ ఆశలను వారిమీద రుద్ది విసిగించకండి. అలా విసిగిస్తే వారు కృంగిపోవచ్చు. (కొలొ. 3:21) ఏదో మీరు చెప్పారని వారు యెహోవాను ప్రేమించడం కాదుగానీ మనస్ఫూర్తిగా వారే ఆయనను ప్రేమించాలి అని ఎప్పుడూ గుర్తుంచుకోండి. (మత్త. 22:37) మీ అబ్బాయి లేదా అమ్మాయి ఇప్పటికే కొన్ని విషయాల్లో రాణిస్తుండవచ్చు. ఆ విషయంలో వారిని మెచ్చుకోండి. అంతేగానీ, వారు ప్రస్తుతం చేయలేకపోతున్నవాటి గురించి ఎక్కువగా మాట్లాడకండి. యెహోవా చేసిన కార్యాల పట్ల కృతజ్ఞతాభావాన్ని పెంపొందించండి. అప్పుడు యెహోవా మంచితనం చూసి మీ పిల్లవాడు యెహోవాను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు.

ఆహ్లాదకరంగా ఉండేలా చూడండి

మూడవదిగా, కుటుంబ బైబిలు అధ్యయనం విజయవంతం కావాలంటే అది ఆహ్లాదకరంగా ఉండేలా చూసుకోవాలి. దానికోసం ఏమి చేయాలి? బహుశా కొన్నిసార్లు మీరు ఆడియో డ్రామాలు వినవచ్చు లేదా మన సంస్థ వీడియోలు చూసి వాటిని చర్చించవచ్చు. లేక కుటుంబ సభ్యులందరూ వంతులవారిగా ఓ బైబిలు భాగాన్ని చదవవచ్చు.

కుటుంబ చర్చకు ఉపయోగపడే ఎన్నో విషయాలు కావలికోట సార్వజనిక పత్రికల్లో వస్తున్నాయి. ఉదాహరణకు, “మన యువతకు” అనే శీర్షికతో యౌవనస్థుల కోసం బైబిలు అధ్యయన పాఠాలు, “మీ పిల్లలకు నేర్పించండి” అనే శీర్షికతో చిన్న పిల్లల కోసం ఆర్టికల్స్‌ వస్తున్నాయి.

తేజరిల్లు!లో వచ్చిన “యువత ఇలా అడుగుతోంది” అనే ఆర్టికల్స్‌ను యుక్తవయసు పిల్లలువున్న తల్లిదండ్రులు ఎంతో ఇష్టపడతారు. దానిలోని విషయాలు కుటుంబ చర్చలకు ఎంతో ఉపయోగపడతాయి.

“అయితే, బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు పోలీసుల్లా ప్రశ్నల వర్షం కురిపించకుండా జాగ్రత్తపడండి. ఉదాహరణకు, తల్లిదండ్రులు పిల్లలకు ఒక పుస్తకం ఇచ్చి, దానిలో కుటుంబంగా బైబిలు అధ్యయనంలో చర్చించిన విషయాల గురించి వారు ఏమనుకుంటున్నారో, వారి అభిప్రాయమేమిటో వాటిని తమ జీవితాల్లో ఎలా పాటించాలనుకుంటున్నారో రాసి పెట్టుకోమని ప్రోత్సహించవచ్చు. అయితే అలా వారు రాసిపెట్టుకున్నదాన్ని గట్టిగా చదివి వినిపించమని బలవంతపెట్టవద్దు. అలా బలవంతపెడితే వారు అనుకుంటున్నది నిజాయితీగా రాయడం మానేయవచ్చు. వారికి సంబంధించిన ప్రతీ విషయంలో తలదూర్చవద్దు.”

క్రమం తప్పకుండా, కుటుంబ అవసరాలను మనసులో ఉంచుకొని, ఆహ్లాదకరంగా ఉండేలా కుటుంబ అధ్యయనం చేస్తే యెహోవా మీ ప్రయత్నాలను మెండుగా ఆశీర్వదిస్తాడు. కుటుంబ అధ్యయనం కోసం మీరు ప్రత్యేకంగా కేటాయించే ఈ సమయం, మీ ఆత్మీయులు యెహోవాతో మంచి సంబంధం ఏర్పరచుకునేందుకు దోహదపడుతుంది.

[31వ పేజీలోని బాక్సు]

సృజనాత్మకంగా ఆలోచించండి

“ఏదైనా ఒక సంఘ కూటానికి సిద్ధపడుతున్నప్పుడు దానిలోని విషయాలను మా అమ్మాయిలతో చర్చించి, ఆ తర్వాత దాన్ని వివరించే ఒక బొమ్మ గీయమని నేనూ మావారూ చెప్పేవాళ్లం. కొన్నిసార్లు, మేము బైబిల్లోని సన్నివేశాలను నటించేవాళ్లం లేదా పరిచర్యలో మాట్లాడే విషయాలను ప్రాక్టీసు చేసేవాళ్లం. మా కుటుంబ అధ్యయనాన్ని వారి వయసుకు తగినట్లు, ఆసక్తికరంగా, ప్రోత్సాహకరంగా, సరదాగా ఉంచేవాళ్లం.” —జె. ఎమ్‌., అమెరికా.

“పూర్వకాలాల్లో గ్రంథపు చుట్టలను ఎలా ఉపయోగించేవారో మా స్టడీ వాళ్ల అబ్బాయి అర్థంచేసుకునేందుకు మేము యెషయా గ్రంథాన్ని అధ్యాయాల, వచనాల సంఖ్యలు లేకుండా ప్రింట్‌ చేశాం. గ్రంథపు చుట్టలా కన్పించేందుకు ఆ పేజీలన్నిటినీ ఒకదానికొకటి అతికించాం. రెండు చివర్లనూ గొట్టాలకు అతికించాం. అప్పుడు ఆ అబ్బాయి, నజరేతులోని సమాజమందిరంలో యేసు చేసినట్లు చేయడానికి ప్రయత్నించాడు. యేసు ‘యెషయా గ్రంథం విప్పగా’ తాను వెతుకుతున్న భాగం ‘దొరికింది’ అని లూకా 4:16-21 వచనాలు చెబుతున్నాయి. (యెష. 61:1, 2) కానీ యేసు కనుగొన్నట్లు ఆ అబ్బాయి అధ్యాయాల, వచనాల సంఖ్యలు లేని ఆ పెద్ద గ్రంథపు చుట్టలో యెషయా 61వ అధ్యాయాన్ని కనుగొనలేకపోయాడు. గ్రంథపు చుట్టలను ఉపయోగించే విషయంలో యేసుకున్న నైపుణ్యాన్నిబట్టి ముగ్ధుడైన ఆ అబ్బాయి: ‘యేసుకు ఎంత జ్ఞానముంది!’ అని అన్నాడు.” —వై. టి., జపాన్‌.

[30వ పేజీలోని చిత్రం]

కుటుంబ అధ్యయనంలో ప్రాక్టీసు చేస్తే తోటివారి ఒత్తిడిని మీ పిల్లలు ఎదుర్కోగలుగుతారు

[31వ పేజీలోని చిత్రం]

కుటుంబ అధ్యయనం ఆహ్లాదకరంగా ఉండేలా కృషిచేయండి