నా జీవితాన్ని మలచిన మూడు సమావేశాలు
నా జీవితాన్ని మలచిన మూడు సమావేశాలు
జార్జ్ వారెన్‌చక్ చెప్పినది
ఒక సమావేశంలో విన్న అంశాన్ని బట్టి ఉత్తేజితులై మీరు మీ జీవితంలో పెనుమార్పులు చేసుకున్నారా? నా విషయంలో అలాగే జరిగింది. గతాన్ని నెమరువేసుకుంటున్నప్పుడు, ముఖ్యంగా మూడు సమావేశాలు నా జీవితాన్ని మలిచాయని నాకు అర్థమైంది. బిడియాన్ని తగ్గించుకోవాలి, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండాలి, దేవుని సేవలో ఎక్కువ చేయాలి అనే మూడు విషయాలను ఆ సమావేశాల్లో నేర్చుకున్నాను. నేను ఆ మార్పులు ఎలా చేసుకున్నానో చెప్పే ముందు నా బాల్యం గురించి అంటే ఆ సమావేశాల ముందు జరిగిన కొన్ని సంఘటనల గురించి చెబుతాను.
నేను 1928లో పుట్టాను. మా అమ్మానాన్నలకు మేము ముగ్గురు పిల్లలం. వారిలో నేనే చిన్నవాణ్ణి. మా అక్కలు మార్జే, ఒల్గాలు, నేనూ అమెరికాలోని న్యూజెర్సీలోవున్న సౌత్ బౌండ్ బ్రుక్ అనే ప్రాంతంలో పుట్టి పెరిగాం. అప్పుడు ఆ పట్టణ జనాభా దాదాపు 2,000 ఉండేది. మేము పేదవాళ్లమే అయినా అమ్మకు మాత్రం ఇచ్చే గుణం ఎక్కువ. చేతిలో డబ్బుంటే అమ్మ ఏదైనా మంచి వంటకం వండి ఇరుగుపొరుగువారికి పంచిపెట్టేది. నాకు తొమ్మిదేళ్లున్నప్పుడు మా ఇంటికి హంగేరియన్ భాష మాట్లాడే ఓ సాక్షి వచ్చారు. మా అమ్మది కూడ అదే భాష కావడంతో ఆమె చెప్పిన బైబిలు సందేశాన్ని జాగ్రత్తగా విన్నది. ఆ తర్వాత, 20-24 మధ్య వయసులో ఉన్న బర్త అనే సహోదరి అమ్మతో బైబిలు అధ్యయనం కొనసాగించి, యెహోవా సేవకురాలయ్యేందుకు సహాయం చేసింది.
అమ్మ చాలా ధైర్యస్థురాలు. నేను అమ్మలా కాదు. అంతేకాక, నాకు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండేది. అది చాలదన్నట్లు మా అమ్మ నన్ను చులకన చేసి మాట్లాడేది. “ఎందుకు ప్రతీసారి నన్ను ఏదో ఒకటి అంటుంటావు?” అని ఏడుస్తూ అడిగితే, నేనంటే తనకు ఇష్టమే కానీ నన్ను గారాభం చేసి పాడుచేయడం తనకు ఇష్టం లేదని చెప్పేది. మా అమ్మ ఉద్దేశం మంచిదే అయినా, నన్ను ఎప్పుడూ మెచ్చుకోకపోవడం వల్ల, ఎందుకూ పనికిరానివాణ్ణనే భావన నాలో పెరిగింది.
నాతో ఎప్పుడూ మంచిగా మాట్లాడే మా పొరిగింటావిడ చర్చిలో జరిగే సండే స్కూలుకు వాళ్ల అబ్బాయిలకు తోడుగా వెళ్లమని ఒకరోజు అడిగింది. నేను అలా వెళ్తే యెహోవాకు కోపం తెప్పిస్తానని తెలిసినా, వెళ్లనంటే ఆమె ఎక్కడ బాధపడుతుందోనని భయపడ్డాను. అందుకే, నేను చేసిన పనికి నాకే సిగ్గు అనిపించినా ఎన్నో నెలలపాటు చర్చికి వెళ్లాను. మనుష్యుల భయం స్కూల్లో కూడ నన్ను వెంటాడేది. దాంతో మనస్సాక్షి చెప్పినట్లు నడుచుకోలేకపోయేవాణ్ణి. నియంతలా ప్రవర్తించే మా స్కూలు ప్రిన్సిపల్ పిల్లలందరూ జండా వందనం చేసేలా చూడమని టీచర్లకు చెప్పిపెట్టాడు. నేనూ జండా వందనం చేసేవాణ్ణి. అలా ఒక సంవత్సరం చేసిన తర్వాత, నాలో ఓ మార్పు వచ్చింది.
ధైర్యంగా ఉండాలని నేర్చుకున్నాను
1939 నుండి మా ఇంట్లో పుస్తక అధ్యయనం జరిగేది. అప్పట్లో దాన్ని బెన్ మిస్కాల్‌స్కీ అనే యువ పయినీరు సహోదరుడు నిర్వహించేవాడు. మేము ఆయనను బిగ్ బెన్ అని పిలిచేవాళ్లం, ఆ పేరు ఆయనకు సరిగ్గా సరిపోయింది. ఎందుకంటే ఆయన మా ద్వారానికి సరిపడేంత భారీగా, పొడుగ్గా నాకు కనిపించేవాడు. ఆయన కనిపించడానికి ఆజానుబాహుడే అయినా మనసు మాత్రం వెన్నలాంటిది. ఆయన ఆప్యాయతతో చిందించిన చిరునవ్వు నా భయాలను పటాపంచలు చేసింది. అందుకే తనతో కలిసి పరిచర్యలో పాల్గొనమని అడిగినప్పుడు సంతోషంగా సరేనన్నాను. మేము కొంతకాలానికి స్నేహితులమయ్యాం. నేను
బాధలో ఉన్నప్పుడు శ్రద్ధ చూపించే పెద్దన్న మాట్లాడినట్లు నాతో మాట్లాడేవాడు. అది నాకు ఎంతో సంతోషాన్నిచ్చేది. నేను ఆయనను ఎంతో ఇష్టపడ్డాను.1941, మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో జరిగే సమావేశానికి బెన్ మా కుటుంబాన్ని తన కారులో రమ్మన్నాడు. ఎప్పుడూ 80 కి.మీ. మించి ప్రయాణించని నేను ఇప్పుడు 1,500 కి.మీ. దూరం ప్రయాణించబోతున్నాను. అప్పుడు నా ఆనందానికి అవధుల్లేవు! అయితే, సెయింట్ లూయిస్‌లో సమస్యలు ఎదురయ్యాయి. సాక్షులను తమ ఇళ్లలో ఉండనివ్వొద్దని మతనాయకులు చర్చివారికి గట్టిగా చెప్పారు. అలా సాక్షులకు మాట ఇచ్చిన చాలామంది మాట తప్పారు. మేము ఎవరింట్లో ఉండాలో వారిని కూడా మతనాయకులు బెదిరించారు. అయినా వారు మమ్మల్ని తమ ఇంట్లో ఉండనిచ్చారు. ‘మీకిచ్చిన మాట తప్పము’ అని ఆ ఇంటివారు మాతో అన్నారు. వారి ధైర్యాన్ని చూసి నేనెంతో అబ్బురపడ్డాను.
మా అక్కలిద్దరూ ఆ సమావేశంలోనే బాప్తిస్మం తీసుకున్నారు. బ్రూక్లిన్ బెతెల్ నుండి వచ్చిన సహోదరుడు రూథర్‌ఫర్డ్ ఆ రోజు ఉత్తేజకరమైన ప్రసంగాన్నిచ్చాడు. ఆ ప్రసంగంలో, దేవుని చిత్తం చేయాలనుకుంటున్న పిల్లలందర్నీ లేచి నిలబడమన్నాడు. దాదాపు 15,000 మంది లేచి నిల్చున్నారు. నేనూ నిల్చున్నాను. ప్రకటనా పనిలో చేయగలిగినదంతా చేయాలని అనుకునేవారిని “చేస్తాను” అని చెప్పమన్నాడు. వేరే పిల్లలతోపాటు నేనూ “చేస్తాను” అని అన్నాను. ఆ ప్రాంతమంతా చప్పట్లతో మారుమ్రోగింది. ఆ సమావేశం నన్నెంతో ఉత్తేజపరచింది.
సమావేశం అయిన తర్వాత, పశ్చిమ వర్జీనియాలో ఉంటున్న ఒక సహోదరుణ్ణి వెళ్లి కలిశాం. ఒకసారి తాను పరిచర్యలో ఉన్నప్పుడు కొంతమంది ముష్కరులు కోపంతో తనను కొట్టి, టారు ఈకలతో కప్పారనీ చెప్పాడు. నేను నోరు వెళ్లబెట్టి విన్నాను. “ఏదేమైనా, నేను ప్రకటనా పని మాత్రం అపను” అని ఆ సహోదరుడు చెప్పాడు. అక్కడ నుండి వచ్చిన తర్వాత, గొల్యాతులాంటి మా స్కూలు ప్రిన్సిపాల్‌తో దావీదులా పోరాడడానికి సిద్ధమయ్యాను.
తిరిగి వచ్చిన తర్వాత, స్కూల్లో ప్రిన్సిపాల్‌ను కలిశాను. ఆయన నావైపు కోపంగా చూశాడు. సహాయం కోసం యెహోవాకు మనసులో ప్రార్థించాను. ఆ తర్వాత, “నేను యెహోవాసాక్షుల సమావేశానికి వెళ్లాను. ఇక ఎప్పుడూ జండాకు వందనం చేయను!” అని గుక్కతిప్పకుండా చెప్పేశాను. చాలాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆయన మెల్లగా కుర్చీలోంచి లేచి నా దగ్గరకు వచ్చాడు. ఆయన ముఖం కోపంతో ఎర్రబడింది. ఆయన, “జండాకు వందనం చెయ్యకపోతే నిన్ను స్కూలు నుండి పంపించేస్తాను” అని కోపంతో అరిచాడు. ఈసారి నేను రాజీపడలేదు, లోలోన అంతకు ముందెప్పుడూ పొందని ఆనందాన్ని పొందాను.
ఈ విషయం బెన్‌తో ఎప్పడెప్పుడు చెబుతామా అని ఆతురపడ్డాను. రాజ్యమందిరంలో ఆయనను చూడగానే, “జండాకు వందనం చేయనందుకు నన్ను స్కూలు నుంచి తీసేశారు!” అని అరిచాను. బెన్ నవ్వుతూ నా భుజం చుట్టూ చేతులేసి, “యెహోవా నిన్ను తప్పకుండా ప్రేమిస్తాడు” అని చెప్పాడు. (ద్వితీ. 31:6) ఆయన మాటలు నన్ను ఎంతగానో ప్రోత్సహించాయి! ఆ ప్రోత్సాహంతో 1942 జూన్ 15న బాప్తిస్మం తీసుకున్నాను.
ఉన్నదాంతో సంతృప్తిగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా ఊపందుకుంది. అందరూ ధనసంపాదనలో పడ్డారు. నాకు మంచి ఉద్యోగం దొరికింది, దాంతో నేను ఒకప్పుడు కన్న కలలను సాకారం చేసుకునే అవకాశం దొరికింది. నా స్నేహితుల్లో కొంతమంది బైకులు కొనుక్కున్నారు. ఇతరులు తమ ఇళ్లకు మరమ్మత్తులు చేసి కొత్త హంగులు తెచ్చుకున్నారు. నేను కొత్త కారు కొన్నాను. అది కొనాలి ఇది కొనాలి అనే ఆశతో యెహోవా సేవ చేయడం తగ్గించాను. నేను దారి తప్పుతున్నానని తెలుసు. 1950, న్యూయార్క్‌లో జరిగిన సమావేశం నా పద్ధతిని మార్చుకునేందుకు సహాయం చేసింది.
ఆ సమావేశంలో ప్రతీ ప్రసంగీకుడు ప్రేక్షకులను ప్రకటనా పనిలో ముందుకు కొనసాగమని ప్రోత్సహించాడు. “కనీస అవసరాలతో సంతృప్తి చెందుతూ పరుగుపందెంలో పాల్గొనండి” అని ఒక ప్రసంగీకుడు మమ్మల్ని ప్రోత్సహించాడు. ఆయన
నాతోనే మాట్లాడుతున్నట్లు నాకు అనిపించింది. ఆ మధ్యకాలంలోనే నేను గిలియడ్ తరగతి స్నాతకోత్సవానికి కూడా హాజరయ్యాను. అది చూసిన తర్వాత ‘నా వయసువాళ్లే అన్నీ వదులుకుని ఇతర దేశాల్లో సేవ చేయడానికి వెళ్తున్నప్పుడు, నేనూ వారిలా ఇక్కడే ఉండి ఎందుకు సేవచేయకూడదూ?’ అని అనిపించింది. ఆ సమావేశం ముగిసేసరికి, నేను పయినీరు అవ్వాలి అని నిర్ణయించుకున్నాను.అప్పట్లో, నేను ఎవ్లన్ మోండక్‌తో ప్రేమలో పడ్డాను. నేను వెళ్లిన సంఘంలో ఆమె ఉత్సాహంగా సేవచేసేది. ఎవ్లన్ తల్లి చాలా ధైర్యస్థురాలు, ఆమెకు ఆరుగురు పిల్లలు. ఆ ఊరిలో పెద్ద రోమన్ కథోలిక్ చర్చి ఉండేది. దాని ముందు నిల్చొని దారిలో వెళ్లేవారికి సాక్ష్యం ఇవ్వడమంటే ఆమెకు చాలా ఇష్టం. అక్కడ మాట్లాడవద్దని మతగురువు ఆమెకు ఎన్నిసార్లు చెప్పినా అక్కడ నుండి ఒక అంగుళం కూడా కదిలేది కాదు. వాళ్లమ్మలాగే ఎవ్లన్ కూడా మనుష్యులకు భయపడేది కాదు.—సామె. 29:25.
1951లో నేనూ ఎవ్లన్ పెళ్లిచేసుకుని ఉద్యోగాలు వదిలి పయినీరు సేవ మొదలుపెట్టాం. ఒక ప్రాంతీయ పైవిచారణకర్త న్యూయార్క్ పట్టణానికి 160 కి.మీ. దూరంలోవున్న అమగాన్‌సెట్ అనే గ్రామానికి వెళ్లమని ప్రోత్సహించాడు. అది అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతంలోవుంది. మాకు బస ఏర్పాటు చేయలేమని అక్కడి సంఘపువారు చెప్పినప్పుడు మా దగ్గర ఉన్న డబ్బుతో ఒక ట్రైలర్ (చక్రాల బండి) కొనాలనుకున్నాం, కానీ సరైనది దొరకలేదు. చివరకు పాడైన ఓ ట్రైలర్ మాకు తారసపడింది. దాని యజమాని దాన్ని 900 డాలర్లకు ఇస్తానన్నాడు. దాంతో మా పెళ్లికి కానుకగా వచ్చిన డబ్బంతటిని దానికే ఇచ్చేశాము. దాన్ని కొని, బాగుచేసుకొని మేము సేవ చేసే చోటుకు తీసుకెళ్లాం. అయితే, మేము అక్కడకు చేరుకునేసరికి మా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. మేము పయినీర్లుగా ఎలా నెట్టుకొస్తామా అని అనుకున్నాం.
ఎవ్లన్ ఇళ్లల్లో పనిచేసేది. నేను ఇటాలియన్ రెస్టారెంటులో మధ్యరాత్రివరకూ పనిచేసేవాణ్ణి. అక్కడ నా పని శుభ్రం చేయడం. అక్కడ యజమాని, “ఏమైనా మిగిలిపోతే నీ భార్య కోసం తీసుకెళ్లు” అని చెప్పేవాడు. తెల్లవారుజామున రెండుగంటలకు నేను ఇంటికి వెళ్లినప్పుడు పిజ్జా, పాస్తా వాసనతో మా ట్రైలర్ అంతా ఘుమఘుమలాడేది. శీతాకాలంలో ఆ ట్రైలర్‌లో చలికి వణికిపోయేవాళ్లం. అప్పుడు వేడిచేసుకుని వాటిని తింటుంటే మంచి విందులాగే అనిపించేది. అంతేకాక, సంఘంలోని సహోదరులు కొన్నిసార్లు మా కోసం పెద్ద చేపను తెచ్చి మా ట్రైలర్ మెట్ల దగ్గర పెట్టి వెళ్లేవారు. మేము అమగాన్‌సెట్ సహోదరులతో కలిసి పనిచేస్తున్నప్పుడు, కనీస అవసరాలతో సంతృప్తిగా ఉండడంవల్ల జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని నేర్చుకున్నాం. ఆ సంవత్సరాలు చాలా సంతోషంగా గడిచాయి.
పరిచర్య ఎక్కువ చేయాలని ప్రోత్సహించబడ్డాం
1953 జూలైలో న్యూయార్క్ పట్టణంలో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి వివిధ దేశాలనుండి వచ్చిన వందలాది మిషనరీలను కలిశాం. వారు ఎన్నో ఆసక్తికరమైన అనుభవాలను మాతో పంచుకున్నారు. వారి ఉత్సాహం మాకూ అంటుకుంది. అంతేకాక, ఆ సమావేశ ప్రసంగీకుడు చాలా ప్రాంతాలకు రాజ్య సందేశం ఇంకా చేరలేదనే విషయాన్ని నొక్కి చెప్పినప్పుడు మాకు ఏమి చేయాలో అర్థమైంది అంటే మా పరిచర్యను ఇంకా ఎక్కువ చేయాలని అర్థమైంది. ఆ సమావేశంలోనే మేము గిలియడ్ పాఠశాల కోసం దరఖాస్తు పెట్టుకున్నాం. ఆ సంవత్సరమే మమ్మల్ని 1954 ఫిబ్రవరిలో మొదలయ్యే 23వ గిలియడ్ తరగతికి రమ్మని ఆహ్వానించారు. అది ఎంత గొప్ప అవకాశం!
మమ్మల్ని బ్రెజిల్‌కి నియమించారని తెలుసుకున్నప్పుడు ఎంతో పులకించిపోయాం. అక్కడకు వెళ్లాలంటే స్టీమర్‌లో 14 రోజులు సముద్ర ప్రయాణం చేయాలి. బయలుదేరే ముందు బెతెల్‌లో బాధ్యతాయుత స్థానంలోవున్న ఒక సహోదరుడు, “మీతోపాటు బ్రెజిల్‌కు తొమ్మిదిమంది మిషనరీ సహోదరీలు వస్తున్నారు. వారిని జాగ్రత్తగా చూసుకోండి!” అని నాతో చెప్పాడు. పదిమంది అమ్మాయిలను నేను వెంటబెట్టుకుని వస్తుంటే నావికులు ఎంత సంబరపడివుంటారో ఊహించగలరా? అయితే ఆ పరిస్థితిలో సహోదరీలు చాలా తెలివిగా ప్రవర్తించారు. సురక్షితంగా బ్రెజిల్ గడ్డమీద అడుగుపెట్టినప్పుడు నా మనసు తేలికపడింది.
పోర్చుగీసు బాషను నేర్చుకున్న తర్వాత, నన్ను ఉత్తర బ్రెజిల్‌లోని రియో గ్రాండె డొ సల్ అనే రాష్ట్రానికి ప్రాంతీయ పైవిచారణకర్తగా నియమించారు. ఒక పెళ్లి కాని సహోదరుని స్థానంలో నన్ను నియమించారు. ఆయన మాతో, “పెళ్లైనవారిని ఇక్కడకి పంపించడం ఆశ్చర్యంగా ఉంది, ఇది ఎత్తుపల్లాల ప్రాంతం” అని అన్నాడు. ఆ సర్కిట్‌లోని ప్రాంతం చాలా పెద్దది. దూరదూరాలకు ప్రయాణించాల్సి వచ్చేది. అన్ని సంఘాలు పల్లెల్లోనే ఉండేవి. కొన్ని ప్రాంతాలకు కేవలం ట్రక్కుల్లోనే వెళ్లాలి. డ్రైవరుకు భోజనం కూడా పెడితేనే తన ట్రక్కుపైకి ఎక్కనిచ్చేవాడు. ట్రక్కుపైకి ఎక్కి గుర్రాలపై ఎలా కాళ్లు చాచుకుని కుర్చుంటామో అలా కూర్చొనేవాళ్లం. సరుకు పడిపోకుండా కట్టి ఉంచే తాడును గట్టిగా రెండు చేతులతో పట్టుకొని కూర్చొనేవాళ్లం. ఘాట్ రోడ్డు మలుపుల్లో ట్రక్కు పక్కకు ఒరిగినప్పుడల్లా ఆ సరుకుల మీద కూర్చున్న మాకు లోతైన లోయలు కనిపించేవి. దాంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించేవాళ్లం. మా రాక కోసం ఎదురుచూస్తున్న సహోదరుల ముఖాల్లోని ఆనందాన్ని చూసి మేము పడిన కష్టాన్నంతా మరచిపోయేవాళ్లం.
అక్కడ సహోదరుల ఇళ్లల్లో ఉండేవాళ్లం. వాళ్లు చాలా పేదవారైనప్పటికీ ఇవ్వడానికి వెనకాడేవారు కాదు. ఒక మారుమూల ప్రాంతంలోని సహోదరులంతా మాంసాన్ని ప్యాక్ చేసే కర్మాగారంలో పనిచేసేవారు. వాళ్ల కొచ్చే జీతానికి కేవలం రోజుకి ఒక్కపూట మాత్రమే భోజనం చేయగలిగేవారు. ఏ రోజుకారోజు పనిచేస్తేనే పూట గడిచేది. అయినా, మేము సందర్శనానికి వెళ్లినప్పుడు సంఘ కార్యక్రమాల్లో పాల్గొనేలా వారు రెండు రోజులు సెలవుతీసుకునేవారు. వారి భారం యెహోవా మీద వేసేవారు. దేవుని రాజ్యం కోసం ఆ పేద సహోదరుల చేసిన త్యాగం చూసి మేము ఎంతో నేర్చుకున్నాం. మేము దాన్ని ఎప్పుడూ మరచిపోలేం. వారితో ఉన్నప్పుడు స్కూల్లో నేర్చుకోలేని ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఆ మధురస్మృతులనూ, వారినీ గుర్తుచేసుకున్నప్పుడల్లా ఆనందంతో కంటతడి పెట్టుకుంటాం.
1976లో అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మను చూసుకోవడానికి అమెరికాకు తిరిగివచ్చాం. బ్రెజిల్‌ను విడిచిపెట్టి వెళ్లాలంటే చాలా బాధగా అనిపించింది. కానీ ఆ దేశంలో ప్రచారకుల సంఖ్య సంఘాల సంఖ్య పెరగడాన్ని కళ్లారా చూసే అవకాశం దొరికినందుకు దేవునికి ఎంతగానో రుణపడివున్నాం. బ్రెజిల్ నుండి ఉత్తరం అందుకున్నప్పుడల్లా ఎన్నో తీపి జ్ఞాపకాలు కళ్లముందు కదలాడతాయి.
ఆత్మీయులను తిరిగి కలుసుకున్నాం
మా అమ్మను చూసుకుంటూనే పయినీరు సేవ చేశాను. అంతేకాక పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేసేవాణ్ణి. 1980లో అమ్మ చనిపోయింది. ఆమె తుదిశ్వాస విడిచేవరకు యెహోవాకు నమ్మకంగా ఉంది. ఆ తర్వాత, అమెరికాలో ప్రయాణ పైవిచారణకర్తగా పనిచేయమనే నియామకాన్ని అందుకున్నాను. మేము 1990లో కనెక్టికట్‌లో ఉన్న సంఘాన్ని సందర్శించాం. అక్కడ నేను ఎంతో ప్రత్యేకమైన వ్యక్తిని కలిశాను. ఎవరో తెలుసా? దాదాపు 50 ఏళ్ల క్రితం యెహోవాను సేవించేలా నాలో ధైర్యాన్ని నింపిన బెన్‌ను కలిశాను. ఆయన ఆ సంఘంలో ఒక పెద్దగా పనిచేస్తున్నాడు. మేము ఎంతో సంతోషంగా ఆలింగనం చేసుకున్నాం.
1996వ సంవత్సరం నుండి ఎవ్లన్ నేనూ ఇన్‌ఫర్మ్ స్పెషల్ పయినీర్లముగా (అనారోగ్యం వంటి కారణాలవల్ల తక్కువ గంటలు చేసే అవకాశమున్న ప్రత్యేక పయినీర్లుగా) న్యూ జెర్సీలోని ఎలిజబెత్ ప్రాంతంలోవున్న పోర్చుగీసు భాషా సంఘంలో సేవ చేస్తున్నాం. నాకు ఆరోగ్య సమస్యలున్నా నా ప్రియమైన భార్య సహాయంతో పరిచర్యలో నాకు చేతనైనంత చేయగలుగుతున్నాను. ఎవ్లన్ అనారోగ్యంగా, బలహీనంగావున్న వృద్ధ సహోదరికి కూడా సహాయం చేస్తుంది. ఆ సహోదరి ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు సుమారు 70 ఏళ్ల క్రితం మా అమ్మకు సత్యాన్ని నేర్పించిన బర్త అనే సహోదరే! సత్యాన్ని తెలుసుకునేలా మా కుటుంబానికి ఆమె ఎంతో సహాయం చేసింది. ఆమె రుణాన్ని ఈ విధంగా తీర్చుకునే అవకాశం దొరికినందుకు సంతోషిస్తున్నాం.
సత్యారాధన పక్షాన ధైర్యంగా నిలబడేలా, నా జీవితాన్ని నిరాడంబరం చేసుకునేలా, పరిచర్యలో మరింత ఎక్కువగా పాల్గొనేలా ఆ సమావేశాలు నన్ను ప్రోత్సహించినందుకు నేను యెహోవాకు ఎంతో రుణపడివున్నాను. ఆ సమావేశాలు నా జీవితాన్ని మలిచాయని ఖచ్చితంగా చెప్పగలను.
[23వ పేజీలోని చిత్రం]
ఎవ్లన్ వాళ్ల అమ్మ (ఎడమవైపు), మా అమ్మ
[23వ పేజీలోని చిత్రం]
నా స్నేహితుడు బెన్
[24వ పేజీలోని చిత్రం]
బ్రెజీలియన్ గడ్డమీద
[25వ పేజీలోని చిత్రం]
ఇప్పుడు ఎవ్లన్‌తో