కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

సామెతలు 24:27 నుండి ఏ పాఠాన్ని నేర్చుకోవచ్చు?

సామెతల రచయిత యువతీయువకులకు ఇలా సలహా ఇస్తున్నాడు: “బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొలములో దాని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును.” ఈ ప్రేరేపిత సామెత నుండి ఏమి నేర్చుకోవచ్చు? పెళ్లి చేసుకుంటే ఎన్నో బాధ్యతలొస్తాయి. ఆ విషయాన్ని మనసులో ఉంచుకుని, పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడయ్యే ముందే వాటికోసం సరిగా సిద్ధపడాలి.

గతంలో కొన్నిసార్లు ఈ లేఖనాన్ని ఇలా వివరించారు. ఒక కుటుంబ యజమాని, తండ్రి కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేస్తే సరిపోదుగానీ, దేవుని గురించి, బైబిలు గురించి నేర్పించడం వంటివి చేస్తూ తన కుటుంబాన్ని ప్రోత్సహించాలి, బలపర్చాలి. అయితే ఆ వివరణ తప్పేమీ కాదు, లేఖనానుసారంగా కూడా సరైనదే. కాకపోతే ఈ లేఖనం ముఖ్యంగా దాని గురించే మాట్లాడుతున్నట్లు కనిపించడం లేదు. అలా ఎందుకు చెప్పొచ్చో అర్థం చేసుకోవడానికి రెండు కారణాలు చూద్దాం.

మొదటిగా, ఈ లేఖనం వివాహితుడైన వ్యక్తి గురించి అంటే అప్పటికే ఉన్న కుటుంబాన్ని ప్రోత్సహించడం లేదా బలపర్చడం గురించి మాట్లాడడం లేదు. ఇది నిజంగా ఓ ఇంటిని కట్టడం గురించి చెబుతుంది. ‘కట్టుకోవడం’ అనే పదాన్ని కుటుంబాన్ని నిర్మించుకున్నారని అంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నారని చెప్పడానికి కూడా వాడేవారు.

రెండవదిగా, ఒక క్రమపద్ధతిలో పనులు చేయాలని ఈ లేఖనం నొక్కి చెబుతోంది. మరో మాటలో చెప్పాలంటే ఈ లేఖనం “ముందు ఇది చేసి తర్వాత అది చేయండి” అని చెబుతోంది. మిగతా పనులు చక్కబెట్టుకున్న తర్వాతే ఆధ్యాత్మిక బాధ్యతలను చూసుకోవాలని దానర్థమా? కానేకాదు!

బైబిలు కాలాల్లో ఎవరైనా ‘ఇల్లు కట్టుకోవాలి’ లేదా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే, ‘నేను పెళ్లి చేసుకుంటే భార్యను పోషించగలనా? ఒకవేళ పిల్లలు పుడితే వాళ్లను కూడా చూసుకోగలనా?’ అని ఆలోచించుకోవాలి. పెళ్లి చేసుకునే ముందు ఒక వ్యక్తి పొలం పనులు చూసుకోవాలి. అందుకే ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌ బైబిల్లో ఈ వచనం ఇలా ఉంది: “మీ పొలంలో నాట్లు వేయక ముందు నీ ఇల్లు కట్టుకోవద్దు. నీవు నివసించేందుకు ఒక గృహం కట్టుకొనకముందే నీవు ఆహారం పండించడానికి సిద్ధంగా ఉన్నట్టు గట్టిగా తెలుసుకో.” దానిలోని సూత్రం ఇప్పటికీ వర్తిస్తుందా?

వర్తిస్తుంది. అందుకే పెళ్ళి చేసుకోవాలనుకునేవారు పెళ్లితో పాటు వచ్చే బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు సిద్ధపడాలి. ఆయనకు పనిచేసే శక్తి ఉంటే కష్టపడి పని చేయాల్సిందే. అయితే, కుటుంబాన్ని పోషించడానికి కష్టపడి పనిచేస్తే సరిపోదు. తన కుటుంబ భౌతిక, భావోద్రేక, ఆధ్యాత్మిక అవసరాలు కూడా తీర్చాలి. అలా చేయని వ్యక్తి అవిశ్వాసికన్నా చెడ్డవాడని బైబిలు చెబుతోంది! (1 తిమో. 5:8) కాబట్టి, పెళ్లికి సిద్ధపడుతున్న యౌవనస్థుడు, ‘నేను కుటుంబాన్ని పోషించడానికి సిద్ధంగా ఉన్నానా? ఆరాధన విషయంలో నేను కుటుంబాన్ని ముందుండి నడిపించగలనా? భార్యాపిల్లలతో క్రమంగా బైబిలు అధ్యయనం చేయగలనా?’ అని ఆలోచించుకోవాలి. ఈ బాధ్యతలు నిర్వర్తించడం చాలా ప్రాముఖ్యమని దేవుని వాక్యం నొక్కి చెబుతోంది.—ద్వితీ. 6:6-8; ఎఫె. 6:4.

అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యౌవనస్థుడు సామెతలు 24:27లో ఉన్న సూత్రాన్ని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. అలాగే, పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి కూడా ‘నేను ఒక భార్యకు, తల్లికి ఉండే బాధ్యతలను నిర్వర్తించగలనా?’ అని ఆలోచించుకోవాలి. ఒక యువ జంట పిల్లలు కావాలనుకుంటున్నప్పుడు అలాంటి ప్రశ్నలే వేసుకోవాలి. (లూకా 14:28) ఈ దైవ ప్రేరేపిత నిర్దేశం ప్రకారం నడుచుకుంటే దేవుని ప్రజలకు తర్వాత బాధపడాల్సిన పరిస్థితి రాదు, కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది.

[12వ పేజీలోని బ్లర్బ్‌]

ఓ యువకుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందుగా ఏమి ఆలోచించుకోవాలి?