కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రేమలేని లోకంలో స్నేహాలను ఎలా కాపాడుకోవాలి?

ప్రేమలేని లోకంలో స్నేహాలను ఎలా కాపాడుకోవాలి?

ప్రేమలేని లోకంలో స్నేహాలను ఎలా కాపాడుకోవాలి?

“మీరు ఒకనినొకడు ప్రేమింపవలెనని యీ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను.”—యోహా. 15:17.

1. మొదటి శతాబ్ద క్రైస్తవులు చిరకాలం సన్నిహిత స్నేహితులుగా ఎందుకు ఉండాలి?

భూమ్మీదున్న చివరి రాత్రి యేసు ఒకరితో ఒకరు చిరకాలం స్నేహితులుగా ఉండమని తన నమ్మకమైన శిష్యులను ప్రోత్సహించాడు. అలా చెప్పడానికి కొంచెం సమయం ముందు వారు ఒకరిపట్ల ఒకరు చూపించే ప్రేమనుబట్టే తన శిష్యులని ఇతరులు తెలుసుకుంటారని చెప్పాడు. (యోహా. 13:35) భవిష్యత్తులో వచ్చే శ్రమలను సహిస్తూ, యేసు త్వరలో వారికి అప్పగించబోయే పనిని పూర్తిచేయాలంటే అపొస్తలులు చిరకాలం సన్నిహిత స్నేహితులుగా ఉండాలి. అయితే, మొదటి శతాబ్ద క్రైస్తవులు అచంచలమైన దైవభక్తికి, ఒకరిపట్ల ఒకరికివున్న ప్రగాఢమైన ప్రేమకూ పేరుగాంచారు.

2. (ఎ) మనం ఏమి చేయాలని నిశ్చయించుకున్నాం, ఎందుకు? (బి) మనం ఏ ప్రశ్నల గురించి చర్చిస్తాం?

2 మొదటి శతాబ్దపు క్రైస్తవుల మాదిరిని అనుసరించే ప్రపంచవ్యాప్త సంస్థతో నేడు మనం సహవసించడం ఎంత సంతోషించదగిన విషయం! ఒకరిపట్ల ఒకరం నిజమైన ప్రేమను చూపించాలన్న యేసు ఆజ్ఞకు లోబడాలని మనం ధృడంగా నిశ్చయించుకున్నాం. అయితే ఈ అంత్యదినాల్లో చాలామంది నమ్మకద్రోహులుగా, అనురాగరహితులుగా ఉన్నారు. (2 తిమో. 3:1-3) వారు స్వార్థంతోనే స్నేహం చేస్తారు. వారు పైకి స్నేహితుల్లా నటిస్తారు. అయితే, నిజ క్రైస్తవులముగా మనం మన గుర్తింపును నిలబెట్టుకోవాలంటే వారిలా ఉండకూడదు. మంచి స్నేహితులను కలిగివుండాలంటే ఏమి అవసరం? మంచి స్నేహితులను ఎలా సంపాదించుకోవచ్చు? మన స్నేహాన్ని ఎప్పుడు తెగతెంపులు చేసుకోవాలి? మంచి స్నేహాన్ని ఎలా కాపాడుకోవచ్చు? అనే ప్రశ్నలను మనం ఇప్పుడు చర్చిద్దాం.

మంచి స్నేహితులను కలిగివుండాలంటే ఏమి అవసరం?

3, 4. స్నేహ బంధం చిరకాలం ఉండాలంటే ఏమి అవసరం, ఎందుకు?

3 యెహోవా మీదున్న ప్రేమ వల్ల ఏర్పడే స్నేహాలు కలకాలం ఉంటాయి. రాజైన సొలొమోను ఇలా రాశాడు: “ఒంటరియగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరు కూడి వాని నెదిరింపగలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా?” (ప్రసం. 4:12) మన స్నేహబంధంలో యెహోవాకు చోటిస్తే అది చిరకాలం ఉంటుంది.

4 నిజమే, యెహోవాను ప్రేమించనివారు కూడా మంచి స్నేహితులుగా ఉండొచ్చు. కానీ దేవుని పట్ల ప్రేమతో ఒకరికొకరు దగ్గరైన వారి స్నేహం కలకాలం ఉంటుంది. మనస్పర్థలు వచ్చినప్పుడు నిజమైన స్నేహితులు యెహోవాకు నచ్చే విధంగా ఒకరితో ఒకరు ప్రవర్తిస్తారు. నిజక్రైస్తవుల మధ్య విభేదాలు సృష్టించడానికి దేవుని వ్యతిరేకులు ప్రయత్నించినప్పుడు వారి స్నేహాలు విడదీయలేనివని తెలుసుకుంటారు. చరిత్ర అంతటిలో యెహోవా సేవకులు ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధపడ్డారు కానీ నమ్మకద్రోహం మాత్రం చేయలేదు.—1 యోహాను 3:16 చదవండి.

5. రూతు నయోమిల స్నేహం చిరకాలం ఎందుకు నిలిచింది?

5 యెహోవాను ప్రేమించేవారితో చేసే స్నేహాలు మాత్రమే మనకు ఎంతో సంతృప్తినిస్తాయి. బైబిల్లో ఎంతో మంచి స్నేహితుల ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో రూతు నయోమిల ఉదాహరణ ఒకటి. వారి స్నేహం ఎందుకు చిరకాలం నిలిచింది? దానికిగల కారణం ఏమిటో రూతు నయోమితో అన్న మాటల్లో తెలుస్తుంది. “నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు. . . . మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక” అని ఆమె అంది. (రూతు 1:16, 17) రూతు నయోమిలు ఇద్దరూ దేవుణ్ణి ఎంతో ప్రేమించారు. ఆ ప్రేమనుబట్టే వారు ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగా వ్యవహరించారు. అందుకే యెహోవా వారిని ఆశీర్వదించాడు.

మంచి స్నేహితులను ఎలా సంపాదించుకోవచ్చు?

6-8. (ఎ) చిరకాల స్నేహాలు ఎలా ఏర్పడతాయి? (బి) స్నేహితులను చేసుకోవడానికి మీరు ఎలా చొరవ తీసుకోవచ్చు?

6 రూతు నయోమిల ఉదాహరణ చూపిస్తున్నట్లు మన ప్రయత్నం లేకుండా మంచి స్నేహితులను సంపాదించుకోలేం. స్నేహితులిద్దరూ యెహోవాను ప్రేమించాలి. అయితే, స్నేహం కలకాలం నిలిచివుండాలంటే దానికోసం కష్టపడాలి, స్వయం త్యాగ స్వభావాన్ని చూపించాలి. క్రైస్తవ కుటుంబాల్లో ఉండే తోబుట్టువులు కూడా సన్నిహిత స్నేహాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. అయితే మంచి స్నేహితులను ఎలా సంపాదించుకోవచ్చు?

7చొరవ తీసుకోండి. అపొస్తలుడైన పౌలు రోమా సంఘంలోవున్న తన స్నేహితులను ఇలా ప్రోత్సహించాడు: “పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.” (రోమా. 12:13) అందుకే మనం మంచి స్నేహితులను సంపాదించుకోవాలంటే ఆతిథ్యం చూపించడానికి దొరికే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ కోసం వేరే ఎవ్వరూ అతిథ్యాన్ని చూపలేరు. (సామెతలు 3:27 చదవండి.) సంఘంలోని వివిధ వ్యక్తులను భోజనానికి పిలువవచ్చు. స్నేహితులను చేసుకునే విధానాల్లో అది ఒకటి. అయితే మీరు క్రమంగా సంఘంలోని సహోదర సహోదరీలకు ఆతిథ్యం ఇవ్వడాన్ని అలవాటుగా చేసుకోగలరేమో ఆలోచించండి?

8 అంతేకాక, ప్రకటనా పనిలో మీతో పాటు కలిసి పనిచేయమని వేర్వేరు వ్యక్తులను కోరడం ద్వారా కూడా స్నేహితులను చేసుకోవడానికి చొరవ తీసుకోవచ్చు. ప్రకటనా పనిలో అపరిచితుల ఇంటి దగ్గర నిల్చొని మీ తోటి సహోదరులు యెహోవా పట్ల తమకున్న ప్రేమ గురించి మనస్ఫూర్తిగా మాట్లాడినప్పుడు మీరు సహజంగానే ఆ సహోదరులకు దగ్గరౌతారు.

9, 10. పౌలు ఏ మాదిరి ఉంచాడు? మనం ఆయనను ఎలా అనుకరించవచ్చు?

9స్నేహితులను పెంచుకోండి. (2 కొరింథీయులు 6:12, 13 చదవండి.) స్నేహం చేయదగినవారు సంఘంలో ఏ ఒక్కరూ లేరు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా అనిపించివుంటే, స్నేహితులను ఎంపికచేసుకునే విషయంలో మీ చుట్టూ మీరే గిరిగీసుకుని కూర్చున్నారేమో ఆలోచించండి? స్నేహితులను పెంచుకునే విషయంలో అపొస్తలుడైన పౌలు మంచి మాదిరి ఉంచాడు. యూదులుకాని వారితో సన్నిహిత స్నేహం చేస్తానని ఆయన ఒకప్పుడు అసలు ఊహించివుండడు. అలాంటిది, ఆయన ‘అన్యజనులకు అపొస్తలుడయ్యాడు.’—రోమా. 11:13, 14.

10 అంతేకాక, పౌలు కేవలం తన వయసువారితోనే స్నేహం చేయలేదు. ఉదాహరణకు, వయసులో తేడావున్నా, నేపథ్యాలు వేరైనా పౌలు, తిమోతిలు మంచి స్నేహితులయ్యారు. వయసులో పెద్దవారితో తమకున్న స్నేహానికి నేడు చాలామంది యౌవనస్థులు ఎంతో విలువిస్తారు. “50వ పడిలోవున్న మంచి స్నేహితురాలు నాకు ఉంది” అని 20వ పడిలోవున్న వెనెస్సా చెబుతోంది. “నా తోటి వయసువారితో చెప్పే ఏ విషయమైనా నేను ఈమెతో చెప్పగలను. ఆమె నా గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది.” అలాంటి స్నేహితులను సంపాదించుకోవడానికి ఏమి చేయాలి? వెనెస్సా ఇలా చెబుతోంది: “తనే నా దగ్గరకు వస్తుందిలే అని ఎదురుచూడకుండా నేనే స్నేహ హస్తాన్ని అందించాను.” మీకన్నా పెద్దవారితో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నారా? మీరు చేసే కృషిని యెహోవా తప్పక ఆశీర్వదిస్తాడు.

11. యోనాతాను దావీదుల ఉదాహరణ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

11నమ్మకంగా ఉండండి. “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును” అని సొలొమోను రాశాడు. (సామె. 17:17) తన తండ్రియైన దావీదు, యోనాతానుల మధ్యవున్న స్నేహాన్ని మనసులో ఉంచుకొని సొలొమోను ఈ సామెతను కూర్చివుంటాడు. (1 సమూ. 18:1) తన తర్వాత యోనాతాను రాజవ్వాలని సౌలు కోరుకున్నాడు. కానీ యెహోవా దావీదును రాజుగా ఎన్నుకున్నాడన్న వాస్తవాన్ని యోనాతాను అంగీకరించాడు. సౌలులా యోనాతాను దావీదును చూసి ఈర్ష్యపడలేదు. దావీదుకు వచ్చిన కీర్తిని చూసి కోపగించుకోలేదు. దావీదు మీద సౌలు వేసిన నిందలను నమ్మలేదు. (1 సమూ. 20:24-34) మనం యోనాతానులా ఉన్నామా? మన స్నేహితులకు సంఘంలో ఏమైనా బాధ్యతలు అప్పగించబడితే సంతోషిస్తున్నామా? కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఓదారుస్తూ, అండగా నిలుస్తున్నామా? మనం వారి గురించి ఏదైనా చెడు విన్నప్పుడు దాన్ని వెంటనే నమ్ముతున్నామా? లేక యోనాతానులా మన స్నేహితునికి అండగా నిలుస్తున్నామా?

స్నేహాన్ని తెగతెంపులు చేసుకోవాల్సివచ్చినప్పుడు

12-14. కొందరు బైబిలు విద్యార్థులు ఏ సవాలును ఎదుర్కొంటారు? వారికి మనం ఎలా సహాయం చేయవచ్చు?

12 బైబిలు విద్యార్థి తన జీవితంలో మార్పులు చేసుకోవడం ఆరంభించినప్పుడు స్నేహం విషయంలో ఎంతో సవాలు ఎదురుకావచ్చు. బైబిలు సూత్రాలను పాటించని లోక స్నేహితులు ఆయనకు ఉండవచ్చు. గతంలో వారితో ఎక్కువగా సమయం గడిపివుండొచ్చు. వారు చేసే పనులు తనపై చెడు ప్రభావం చూపిస్తుంది కాబట్టి అలాంటి వారితో స్నేహం తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించవచ్చు. (1 కొరిం. 15:33) అయినా, వారితో సహవసించకపోతే మిత్రద్రోహం చేసినట్లౌతుందని ఆయనకు అనిపించవచ్చు.

13 ఈ సవాలును ఎదుర్కొంటున్న బైబిలు విద్యార్థి మీరే అయితే మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ వ్యక్తి మీకు నిజమైన స్నేహితుడైతే మీరు మీ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి సంతోషిస్తాడు. మీతో కలిసి యెహోవా గురించి నేర్చుకోవడానికి ఆ స్నేహితుడు కూడా ఇష్టపడతాడు. అదే కపట స్నేహితులైతే ‘అపరిమితమైన దుర్వ్యాపారమునందు’ తమతోకూడ మీరు పరుగెత్తకపోయినందుకు ‘మిమ్మును దూషిస్తారు.’ (1 పేతు. 4:3, 4) నిజం చెప్పాలంటే, నమ్మకద్రోహులు వారే కాని మీరు కాదు.

14 దేవుని ప్రేమించని తమ పాత స్నేహితులు బైబిలు విద్యార్థులను విడిచిపెడితే ఆ లోటును సంఘ సభ్యులు తీర్చగలరు. (గల. 6:10) బైబిలు అధ్యయనం చేస్తున్న కొందరు కూటాలకు హాజరౌతుండవచ్చు. మీకు వారితో పరిచయముందా? అప్పుడప్పుడు మీరు వారిని ప్రోత్సహించగలుగుతున్నారా?

15, 16. (ఎ) మన స్నేహితులు యెహోవాను ఆరాధించడం మానేస్తే ఏమి చేయాలి? (బి) దేవుని పట్ల మనకు ప్రేమ ఉందని ఎలా చూపించవచ్చు?

15 సంఘంలోని స్నేహితుడు యెహోవాను విడిచిపెడితే, బహుశా బహిష్కరించబడే పరిస్థితి వస్తే అప్పుడేమిటి? అప్పుడు ఎంతో బాధేస్తుంది. తన సన్నిహిత స్నేహితురాలు యెహోవాను ఆరాధించడం మానేసినప్పుడు తనకు ఎలా అనిపించిందో వివరిస్తూ ఒక సహోదరి ఇలా చెప్పింది: “అది తెలుసుకొని నేను కుప్పకూలిపోయాను. సత్యంలో బలంగా ఉందనుకున్నాను, కానీ నిజానికి ఆమె అలా లేదు. తన కుటుంబస్థులను సంతోషపెట్టడానికే ఆమె యెహోవాను సేవించిందా? అని నాకు అనిపించింది. మరి నేను ఎందుకు యెహోవాను సేవిస్తున్నాను, ఆయనను నేను ఇష్టపడే సేవిస్తున్నానా? అని నన్ను నేను పరిశీలించుకోవడం మొదలుపెట్టాను.” ఆ బాధ నుండి ఆమె ఎలా బయటకు రాగలిగింది? “నా భారాన్ని యెహోవా మీద మోపాను. కేవలం సంఘంలో స్నేహితులను ఇస్తున్నందుకు యెహోవాను ప్రేమించడం లేదుగానీ ఆయన మీద ఉన్న ఇష్టాన్ని బట్టే ప్రేమిస్తున్నట్లు యెహోవాకు చూపించాలని గట్టిగా నిర్ణయించుకున్నాను” అని ఆమె అన్నది.

16 లోకంతో స్నేహం చేయాలనుకునే వారితో సహవసిస్తే మనం దేవుని స్నేహితులముగా ఉండలేం. శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు: “యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.” (యాకో. 4:4) మనం దేవునికి విశ్వసనీయంగా ఉంటే స్నేహితుణ్ణి పోగొట్టుకున్నామనే బాధను భరించేందుకు ఆయన సహాయం చేస్తాడని నమ్ముతాం. అలా నమ్మితే మనకు ఆయన పట్ల ప్రేమ ఉందని చూపించవచ్చు. (కీర్తనలు 18:25 చదవండి.) పైన ప్రస్తావించిన సహోదరి చివరిగా ఇలా చెబుతోంది: “యెహోవాను ప్రేమించేలా లేదా మనల్ని ప్రేమించేలా ఎవర్నీ మనం బలవంతపెట్టలేమని నేను తెలుసుకున్నాను. ఇది ఎవరికి వారే నిర్ణయించుకోవాల్సిన విషయం.” అయితే, సంఘంలోనే ఉన్నవారితో మంచి స్నేహాన్ని కాపాడుకోవాలంటే ఏమి చేయాలి?

మంచి స్నేహాలను కాపాడుకోవడం

17. మంచి స్నేహితులు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటారు?

17 మంచి సంభాషణ స్నేహానికి ఊపిరిపోస్తుంది. మీరు నయోమి రూతుల గురించి, దావీదు యోనాతానుల గురించి, పౌలు తిమోతిల గురించి బైబిల్లో చదివినప్పుడు మంచి స్నేహితులు దాపరికం లేకుండా గౌరవపూర్వకంగా మాట్లాడుకుంటారనే విషయాన్ని గమనించివుంటారు. ఇతరులతో మనం ఎలా సంభాషించాలో పౌలు చెప్పాడు. ఆయన ఇలా రాశాడు, “మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.” ముఖ్యంగా ‘వెలుపటి వారితో’ అంటే క్రైస్తవ సహోదరులు కానివారితో మనం ఎలా మాట్లాడాలో పౌలు చెబుతున్నాడు. (కొలొ. 4:5, 6) అవిశ్వాసులతోనే గౌరవపూర్వకంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు సంఘంలోని వారితో ఇంకెంత గౌరవపూర్వకంగా మాట్లాడాలి!

18, 19. క్రైస్తవ స్నేహితులు ఇచ్చే ఎలాంటి ఉపదేశాన్నైనా మనం ఎలా చూడాలి? ఎఫెసులోని పెద్దలు మనకు ఎలాంటి మాదిరి ఉంచారు?

18 మంచి స్నేహితులు ఒకరి అభిప్రాయానికి మరొకరు విలువిస్తారు. కాబట్టి, వారు దయతో, దాపరికం లేకుండా మాట్లాడుకోవాలి. జ్ఞానియైన సొలొమోను ఇలా రాశాడు: “తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును.” (సామె. 27:9) స్నేహితుని నుండి పొందే ఎలాంటి ఉపదేశాన్నైనా మీరు అలాగే చూస్తున్నారా? (కీర్తన 141:5 చదవండి.) ఫలాని విషయంలో మీరు తప్పు చేస్తున్నట్లు తనకు అనిపిస్తుందని మీ స్నేహితుడు అంటే మీరేమి చేస్తారు? ఆయన మీ మంచి కోరే అలా చెప్పాడనుకుంటారా? లేక కోపగించుకుంటారా?

19 అపొస్తలుడైన పౌలుకు ఎఫెసు సంఘ పెద్దలతో సన్నిహిత సంబంధం ఉండేది. వారిలో కొందరు విశ్వాసులైనప్పటి నుండి ఆయనకు తెలిసుండవచ్చు. చివరిసారి వారిని కలిసినప్పుడు ఆయన వారికి నిర్మొహమాటంగా కొన్ని విషయాలను చెప్పాడు. ఆయన ఉపదేశాన్ని వారెలా తీసుకున్నారు? వారు కోపగించుకోలేదు. బదులుగా తమపట్ల ఆయన చూపించిన శ్రద్ధకు సంతోషించారు. వారు పౌలును మళ్లీ చూడలేమన్న బాధతో ఏడ్చారు కూడా.—అపొ. 20:17, 29, 30, 36-38.

20. ప్రేమగల స్నేహితుడు ఏమి చేస్తాడు?

20 నిజమైన స్నేహితులు మంచి ఉపదేశాన్ని తీసుకోవడమే కాదు ఇస్తారు కూడా. మనం ఎప్పుడు ‘పరులజోలికి పోకుండా’ ఉండాలో గుర్తించాలి. (1 థెస్స. 4:10-12) అంతేకాక మనలో ప్రతీ ఒక్కరు “తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను” అని గుర్తించాలి. (రోమా. 14:11, 12) అవసరమైనప్పుడు ప్రేమించే స్నేహితుడు యెహోవా ప్రమాణాల గురించి దయతో గుర్తుచేస్తాడు. (1 కొరిం. 7:39) ఉదాహరణకు, పెళ్లికాని మీ స్నేహితుడు సాక్షికాని వారెవరితోనైనా అనుబంధాన్ని ఏర్పరచుకుంటున్నాడని మీకనిపిస్తే మీరేమి చేస్తారు? మీ స్నేహం చెడిపోకూడదని వారితో ఆ విషయాన్ని గురించి మాట్లాడకుండా ఉంటారా? మీ సలహాను మీ స్నేహితుడు పట్టించుకోకపోతే మీరేమి చేస్తారు? మంచి స్నేహితుడు, తప్పుదారి పట్టిన తన స్నేహితునికి సహాయం చేయమని ప్రేమగల కాపరులను కోరతాడు. అలా చేయడానికి ధైర్యం అవసరం. అయితే మీ ఇద్దరికీ యెహోవా మీద ప్రేమ ఉంటే మీ స్నేహం చెడిపోదు.

21. కొన్నిసార్లు మనమంతా ఏమి చేస్తాం? కానీ సంఘంలో మన స్నేహాలు ఎల్లప్పుడూ పటిష్ఠంగా ఉంచుకోవడం ఎందుకు అవసరం?

21కొలొస్సయులు 3:13, 14 చదవండి. కొన్నిసార్లు మనవల్ల మన స్నేహితునికి ఏదైనా ‘హాని’ జరిగివుండవచ్చు, లేదా వారు కూడా మనల్ని ఏదైనా మాట అనివుండవచ్చు, లేక కోపాన్ని రేపే పని ఏదైనా చేసివుండవచ్చు. “అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము” అని యాకోబు రాశాడు. (యాకో. 3:2) అయితే, మనం ఒకరినొకరం ఎన్నిసార్లు బాధపెట్టామనే దాన్నిబట్టి కాదుగానీ ఎన్నిసార్లు మనం పూర్తిగా ఒకరినొకరం క్షమించుకున్నామనే దాన్నిబట్టే మన స్నేహం ఎలాంటిదో తెలుస్తుంది. ఎలాంటి దాపరికం లేకుండా మాట్లాడుతూ ఒకరినొకరం మనస్ఫూర్తిగా క్షమించుకుంటూ మన స్నేహాన్ని పటిష్ఠపరచుకోవడం ఎంత అవసరం! అలా చేసినప్పుడు మన మధ్య “పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ” ఉంటుంది.

మీరెలా జవాబిస్తారు?

• మనం మంచి స్నేహితులను ఎలా సంపాదించుకోవచ్చు?

• మన స్నేహాన్ని ఎప్పుడు తెగతెంపులు చేసుకోవాల్సి వస్తుంది?

• స్నేహాలను ఎల్లప్పుడూ పటిష్ఠపరచుకోవడానికి ఏమి చేయాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[18వ పేజీలోని చిత్రం]

రూతు నయోమిల స్నేహం చిరకాలం ఉండడానికి గల కారణం ఏమిటి?

[19వ పేజీలోని చిత్రం]

మీరు ఆతిథ్యం ఇవ్వడాన్ని అలవాటుగా చేసుకున్నారా?