కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మీరు నా స్నేహితులు’

‘మీరు నా స్నేహితులు’

‘మీరు నా స్నేహితులు’

“నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.” —యోహా. 15:14.

1, 2. (ఎ) యేసు శిష్యులు ఏయే వృత్తుల నుండి వచ్చారు? (బి) మనం యేసుతో స్నేహం చేయడం ఎందుకు చాలా ప్రాముఖ్యం?

ఆ మేడగదిలో వేరు వేరు వృత్తుల నుండి వచ్చినవారు యేసుతో కూర్చొని ఉన్నారు. అన్నదమ్ములైన పేతురు అంద్రెయలు ఒకప్పుడు చేపలు పట్టేవారు. మత్తయి ఒకప్పుడు పన్నులు వసూలు చేసే సుంకరి. యూదులు ఆ పనిచేసేవారిని అసహ్యించుకునేవారు. యాకోబు యోహాను వంటి కొందరికి యేసు చిన్నప్పటి నుండి తెలిసివుండవచ్చు. నతనయేలు వంటి మరికొందరికి ఆయన కొన్ని సంవత్సరాలుగా మాత్రమే తెలిసివుండవచ్చు. (యోహా. 1:43-50) కానీ ప్రాముఖ్యమైన పస్కా పండుగ రాత్రి యెరూషలేములోని ఆ మేడగదిలో కూర్చున్నవారందరికీ సజీవుడైన దేవుని కుమారుడు, వాగ్దానం చేయబడిన మెస్సీయ యేసేనని నమ్మకం కలిగింది. (యోహా. 6:68, 69) మిమ్మల్ని “స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని” అని యేసు వారితో అన్నప్పుడు వారు ఎంత పులకించిపోయివుంటారో!—యోహా. 15:15.

2 నమ్మకమైన అపొస్తలులతో యేసు అన్న ఆ మాటలు ప్రాముఖ్యంగా ఇప్పుడున్న అభిషిక్త క్రైస్తవులందరికీ వర్తించినా ఆ మాటలు వారి సహచరులైన ‘వేరేగొర్రెలకు’ కూడా వర్తిస్తాయి. (యోహా. 10:16) మనం ఎలాంటి నేపథ్యాల నుండి వచ్చినవారమైనప్పటికీ యేసు శిష్యులమయ్యే గొప్ప అవకాశం మనకుంది. ఆయన స్నేహితులుగా ఉండడం మనకెంతో ప్రాముఖ్యం ఎందుకంటే ఆయన స్నేహితులుగా ఉంటే యెహోవా దేవునికీ స్నేహితులమవుతాం. క్రీస్తుకు దగ్గరవకుండా యెహోవాకు దగ్గరవడం అసాధ్యం. (యోహాను 14:6, 21 చదవండి.) అయితే, యేసు స్నేహితులం అవ్వాలన్నా చిరకాలం ఆయన స్నేహితులముగా ఉండాలన్నా ఏమి చేయాలి? ఆ ప్రాముఖ్యమైన అంశం గురించి తెలుసుకునే ముందు మంచి స్నేహితునిగా యేసు ఉంచిన ఉదాహరణ గురించి చర్చిద్దాం. అంతేకాక, ఆయనతో స్నేహం చేయడం వల్ల ఆయన శిష్యుల మాటల్లో చేతల్లో ఎలాంటి మార్పు వచ్చిందో చూద్దాం.

మంచి స్నేహితునిగా యేసు ఉంచిన ఉదాహరణ

3. యేసు ఎవరితో స్నేహం చేశాడని ప్రజలు చెప్పుకున్నారు?

3 “ధనికులకు చాలామంది స్నేహితులు ఉంటారు” అని జ్ఞానియైన సొలొమోను రాశాడు. (సామె. 14:20, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అపరిపూర్ణ మానవుల స్వభావం ఎలాంటిదో ఆ మాటల్లో ఉట్టిపడుతుంది. ఇతరుల నుండి ఏదైనా ఆశించే స్నేహం చేస్తారు కానీ వారికి ఏమైనా ఇవ్వాలనే ఆలోచనతో స్నేహం చేయరు. యేసు అలాంటి స్వభావాన్ని చూపించలేదు. ఒక వ్యక్తికున్న డబ్బునూ, హోదానూ చూసి స్నేహం చేయలేదు. నిజమే ధనవంతుడైన ఒక యువ అధికారి పట్ల ప్రేమ చూపించి తనను వెంబడించమని యేసు ఆహ్వానించాడు. అయితే, ఆయనకు ఉన్నవన్నీ అమ్మేసి పేదలకు ఇమ్మని యేసు ఆ అధికారికి చెప్పాడు. (మార్కు 10:17-22; లూకా 18:18, 23) యేసు, డబ్బూ పేరు ప్రఖ్యాతలూ ఉన్నవారితో స్నేహం చేశాడని కాదుగానీ దీనులతో నీచంగా చూడబడినవారితో స్నేహం చేశాడని ప్రజలు చెప్పుకున్నారు.—మత్త. 11:19.

4. యేసు స్నేహితుల్లో లోపాలు ఉన్నాయని ఎలా చెప్పవచ్చు?

4 యేసు స్నేహితుల్లో లోపాలున్న మాట నిజమే. ఉదాహరణకు, కొన్నిసార్లు పేతురు దేవుడు ఆలోచించినట్లు ఆలోచించలేదు. (మత్త. 16:21-23) యాకోబు, యోహానులు అధికార దాహంతో తన రాజ్యంలో ప్రముఖ స్థానం ఇమ్మని యేసును కోరారు. వారు చేసిన పనికి మిగతా అపొస్తలులకు కోపం వచ్చింది. తమలో ఎవరు గొప్పవారు అనే విషయంలో వారి మధ్య ఎప్పుడూ వాగ్వివాదం జరిగేది. అయితే యేసు ఓపిగ్గా తన స్నేహితుల ఆలోచనను సరిచేయడానికి ప్రయత్నించాడే తప్ప వారి మీద వెంటనే విసుక్కోలేదు.—మత్త. 20:20-28.

5, 6. (ఎ) తన అపొస్తలుల్లోని చాలామందితో యేసు చివరివరకు ఎందుకు స్నేహం చేశాడు? (బి) యేసు యూదాతో స్నేహం చేయడం ఎందుకు మానేశాడు?

5 యేసు ఈ అపరిపూర్ణ మానవులతో స్నేహం చేసింది వారి అపరిపూర్ణతలను మరీ చూసీచూడనట్లు వదిలిపెట్టినందు వల్ల లేక వారి అపరిపూర్ణతలు తెలియకపోయినందు వల్ల కాదు. బదులుగా వారికున్న మంచి ఉద్దేశాలపై, లక్షణాలపై దృష్టి నిలిపాడు కాబట్టి వారితో స్నేహం చేశాడు. ఉదాహరణకు, యేసు తన జీవితంలో అత్యంత కష్ట సమయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు పేతురు యాకోబు యోహానులు ఆయనకు తోడుగా ప్రార్థించే బదులు నిద్రలోకి జారుకున్నారు. వారిని అలా చూసి యేసు బాధపడడం సబబే. అయినప్పటికీ, వారి ఉద్దేశాలు మంచివేనని గుర్తించి ఆయన, “ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము” అని వారితో అన్నాడు.—మత్త. 26:41.

6 అదే ఇస్కరియోతు యూదా విషయానికొస్తే యేసు ఆయనతో స్నేహం చేయడం మానేశాడు. యూదా తనతో స్నేహం చేస్తున్నట్లు నటించినా యేసు మాత్రం అతని అసలు రూపాన్ని పసిగట్టాడు. ఒకప్పుడు మంచి స్నేహితునిగా ఉన్న అతడు తన హృదయాన్ని భ్రష్టుపట్టనిచ్చాడని యేసు గుర్తించాడు. యూదా లోకంతో స్నేహం చేయడంవల్ల దేవునికి శత్రువయ్యాడు. (యాకో. 4:4) అందుకే పదకొండుమంది అపొస్తలులతో తాను స్నేహం చేస్తున్నానని చెప్పే ముందే యేసు ఇస్కరియోతు యూదాను బయటకు పంపించేశాడు.—యోహా. 13:21-35.

7, 8. తన స్నేహితుల పట్ల ప్రేమను యేసు ఎలా చూపించాడు?

7 తన స్నేహితులు చేసిన తప్పిదాల మీద దృష్టి నిలపకుండా వారి మంచి కోసం పాటుపడ్డాడు. ఉదాహరణకు, శ్రమలప్పుడు వారిని కాపాడమని తన తండ్రికి ప్రార్థించాడు. (యోహాను 17:11 చదవండి.) ఆయన వారి పరిమితులను అర్థంచేసుకున్నాడు. (మార్కు 6:30-32) తాను ఏమనుకుంటున్నాడో వారికి చెప్పడం మాత్రమే కాదుగానీ వారి మనసులో ఏముందో అర్థంచేసుకునేందుకు, తెలుసుకునేందుకు ఇష్టపడ్డాడు.—మత్త. 16:13-16; 17:24-26.

8 యేసు తన స్నేహితుల కోసమే జీవించాడు, చనిపోయాడు. నిజమే, తన తండ్రి న్యాయ ప్రమాణాల ప్రకారం తాను తన జీవితాన్ని అర్పించాల్సివుందని యేసుకు తెలుసు. (మత్త. 26:27, 28; హెబ్రీ. 9:22, 28) కానీ స్నేహితుల పట్ల ఉన్న ప్రేమను బట్టి యేసు తన జీవితాన్ని అర్పించాడు. “తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు” అని యేసు అన్నాడు.—యోహా. 15:13.

యేసు స్నేహానికి శిష్యులు ఎలా స్పందించారు?

9, 10. యేసు ఉదారంగా ఇచ్చినందుకు ప్రజలు ఎలా స్పందించారు?

9 యేసు వారితో ఎంతో సమయాన్ని గడిపాడు. వారిని ఎంతో ఆప్యాయంగా చూశాడు. వస్తుపరంగా కూడా ఎంతో ఇచ్చాడు. అందుకే ప్రజలు ఆయనను ఇష్టపడ్డారు, తమకున్న వాటిని ఆయనకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. (లూకా 8:1-3) అందుకే యేసు తన సొంత అనుభవం నుండి ఇలా చెప్పగలిగాడు: “ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును. అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండుకొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడును.”—లూకా 6:38.

10 ఆయన నుండి లాభం పొందాలనే కొందరు ఆయనతో స్నేహం చేయడానికి చూశారనుకోండి. ఆ కపట స్నేహితులు యేసు చెప్పిన ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు ఆయనను విడిచివెళ్లిపోయారు. ఆయన చెప్పింది వారికి అర్థంకానప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచే బదులు ఆయనను అపార్థం చేసుకొని ఆయనను విడిచిపెట్టారు. అయితే అపొస్తలులు చివరివరకూ ఆయనకు నమ్మకంగా ఉన్నారు. క్రీస్తుతో వారికున్న స్నేహం ఎన్నోసార్లు పరీక్షించబడింది. అయినా ఆయన కష్టసుఖాల్లో తోడుగా ఉండేందుకు వారు చేయగలిగినదంతా చేశారు. (యోహాను 6:26, 56, 60, 66-68 చదవండి.) మానవునిగా భూమ్మీద తన చివరిరాత్రి తాను తన స్నేహితులను ఎంతగా ప్రేమిస్తున్నాడో యేసు చెప్పాడు. ఆయన, “నా శోధనలలో నాతో కూడ నిలిచి యున్నవారు మీరే” అని అన్నాడు.—లూకా 22:28.

11, 12. యేసు తన శిష్యులకు ఎలా అభయాన్నిచ్చాడు? దానికి వారెలా స్పందించారు?

11 నమ్మకంగా ఉన్నందుకు యేసు తన శిష్యులను మెచ్చుకున్నాడు. అలా మెచ్చుకున్న కొంతకాలానికే వారు ఆయనను విడిచిపెట్టారు. మనుష్యుల భయం వల్ల క్రీస్తుపట్ల వారికున్న ప్రేమ కొంతకాలం మరుగునపడింది. ఈ సమయంలో కూడా యేసు వారిని క్షమించాడు. పునరుత్థానం తర్వాత యేసు వారికి కనిపించి వారిని తన స్నేహితుల్లాగే చూస్తున్నాడన్న అభయాన్నిచ్చాడు. అంతేకాక వారికి పవిత్రమైన పనిని కూడా అప్పగించాడు. “సమస్త జనులను” శిష్యులుగా చేయమనీ, “భూదిగంతముల వరకు” ఆయనకు సాక్షులుగా ఉండమనీ చెప్పాడు. (మత్త. 28:19; అపొ. 1:8) దానికి శిష్యులు ఎలా స్పందించారు?

12 రాజ్య సందేశాన్ని వ్యాప్తి చేయడానికి శిష్యులు చేయగలిగినదంతా చేశారు. యెహోవా పరిశుద్ధాత్మ సహాయంతో వారు యెరూషలేమంతటా బోధించారు. (అపొ. 5:27-29) వారి ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా వారు శిష్యులను చేయమని యేసు ఇచ్చిన ఆజ్ఞకు విధేయులయ్యారు. వారు యేసు నుండి ఆ ఆజ్ఞను పొందిన కేవలం కొద్ది సంవత్సరాలకే, “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి” సువార్త ప్రకటించబడిందని అపొస్తలుడైన పౌలు రాయగలిగాడు. (కొలొ. 1:23) యేసుతో తమకున్న స్నేహానికి ఎంతో విలువిస్తున్నామనే విషయాన్ని ఆ శిష్యులు నిరూపించారని చెప్పవచ్చు.

13. యేసు శిష్యులు ఆయన బోధలు విని ఏ మార్పులు చేసుకున్నారు?

13 అంతేకాక, యేసు శిష్యులైనవారు ఆయన బోధలు విని తమ జీవితంలో మార్పులు చేసుకున్నారు. వారిలో చాలామంది ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో పెను మార్పులే చేసుకోవాల్సి వచ్చింది. కొత్తగా శిష్యులైన వారిలో కొందరు ఒకప్పుడు సలింగసంయోగులుగా, వ్యభిచారులుగా, త్రాగుబోతులుగా, లేక దొంగలుగా ఉండేవారు. (1 కొరిం. 6:9-11) మరి కొందరు వేరే జాతివారి విషయంలో తమకున్న అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. (అపొ. 10:25-28) అయినా వారు యేసుకు విధేయులయ్యారు. వారు ప్రాచీన స్వభావాన్ని విడిచి నవీన స్వభావాన్ని ధరించుకున్నారు. (ఎఫె. 4:20-24) వారు “క్రీస్తు మనస్సు”ను బాగా అర్థంచేసుకుని, ఆయన ఆలోచించే విధంగా ఆలోచించారు, ఆయన ప్రవర్తించినట్లు ప్రవర్తించారు.—1 కొరిం. 2:16.

నేడు క్రీస్తుతో స్నేహం చేయడం

14. “యుగసమాప్తి” కాలంలో ఏమి చేస్తానని యేసు వాగ్దానం చేశాడు?

14 మొదటి శతాబ్ద క్రైస్తవుల్లో చాలామందికి యేసు తెలుసు లేక పునరుత్థానం తర్వాత ఆయనను చూశారు. మనకు అలాంటి గొప్ప అవకాశం లేదు. మరి మనం క్రీస్తు స్నేహితులం కావాలంటే ఏమి చేయాలి? మొదటిగా, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి నుండి వచ్చే నిర్దేశాలకు విధేయులమవ్వాలి. ఆ తరగతిలో భూమ్మీద సజీవంగావున్న ఆత్మాభిషిక్త క్రైస్తవులు ఉన్నారు. “యుగసమాప్తి” కాలంలో “తన యావదాస్తిమీద” ఈ దాసుని తరగతిని నియమిస్తానని యేసు వాగ్దానం చేశాడు. (మత్త. 24:3, 45-47) నేడు క్రీస్తు స్నేహితులవ్వాలనుకునే చాలామంది ఆ దాసుని తరగతిలోని సభ్యులు కాదు. అయితే, నమ్మకమైన దాసుని తరగతి నుండి వచ్చే నిర్దేశానికి స్పందించే తీరును బట్టి క్రీస్తుతో వారి స్నేహం ఎలా ప్రభావితమౌతుంది?

15. ఒక వ్యక్తి గొర్రెలాంటివాడో మేకలాంటివాడో ఎలా తెలుస్తుంది?

15మత్తయి 25:31-40 చదవండి. నమ్మకమైన దాసుని తరగతిలో ఉన్నవారిని యేసు, సహోదరులని పిలిచాడు. మేకల నుండి గొర్రెలను వేరుపరచడం గురించిన ఉపమానంలో తన సహోదరులకు మంచి చేసినా చెడు చేసినా అది తనకే చేసినట్లు భావిస్తానని యేసు చెప్పాడు. “మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో” ఒకరికి చేసిన దాన్నిబట్టి ఒక వ్యక్తి గొర్రెలాంటివాడో మేకలాంటివాడో తెలుస్తుందని ఆయన చెప్పాడు. అందుకే భూనిరీక్షణ ఉన్నవారు క్రీస్తుతో స్నేహం చేయాలనే తమ కోరికను ముఖ్యంగా నమ్మకమైన దాసుని తరగతికి మద్దతునివ్వడం ద్వారా చూపిస్తారు.

16, 17. క్రీస్తు సహోదరుల పట్ల మనకున్న స్నేహాన్ని ఎలా చూపించవచ్చు?

16 మీరు దేవుని రాజ్యంలో భూమ్మీద జీవించాలని కోరుకుంటున్నట్లైతే క్రీస్తు సహోదరులతో స్నేహం చేస్తున్నట్లు ఎలా చూపించవచ్చు? క్రీస్తు సహోదరులతో స్నేహం చేస్తున్నట్లు చూపించే అనేక విధానాల్లో మూడు విధానాలను ఇప్పుడు చూద్దాం. మొదటిగా, ప్రకటనా పనిలో మనస్ఫూర్తిగా పాల్గొనాలి. ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటించమని క్రీస్తు తన సహోదరులకు ఆజ్ఞాపించాడు. (మత్త. 24:14) అయితే, వేరేగొర్రెల మద్దతు లేకపోతే క్రీస్తు సహోదరుల్లో నేడు భూమ్మీద శేషించినవారికి అది శక్తికి మించిన పనే అవుతుంది. వేరేగొర్రెలకు చెందినవారు ప్రకటనా పనిలో పొల్గొన్న ప్రతీసారి క్రీస్తు సహోదరులు చేయాల్సిన పవిత్ర పనిలో వారికి చేయూతనిస్తారు. స్నేహం కోసం వారు చేస్తున్న ఆ సహాయాన్ని క్రీస్తు, ఆయన దాసుని తరగతి వారు మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నారు.

17 రెండవదిగా, ప్రకటనా పనికి ఆర్థిక సహాయం చేయడం ద్వారా వేరేగొర్రెలు దాసుని తరగతికి సహాయం చేయవచ్చు. “అన్యాయపు సిరివలన” స్నేహితులను సంపాదించుకోమని యేసు తన శిష్యులను ప్రోత్సహించాడు. (లూకా 16:9) యెహోవా, యేసు స్నేహాన్ని డబ్బుతో కొనగలమని దానర్థం కాదు. బదులుగా దేవుని రాజ్యం కోసం భూమ్మీదున్న సంఘ పని కోసం మన వస్తు సంపదలను ఉపయోగించడం ద్వారా మనం మన స్నేహాన్ని ప్రేమను మాటల్లోనే కాదు ‘క్రియలతోను సత్యముతోను’ చూపిస్తాం. (1 యోహా. 3:16-18) మనం ప్రకటనా పని కోసం డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు, ఆరాధనా స్థలాల నిర్మాణానికి, నిర్వాహణకు, ప్రపంచవ్యాప్త ప్రకటనా పనికి విరాళాలు ఇచ్చినప్పుడు మనం అలాంటి ఆర్థిక సహాయాన్ని చేస్తాం. మనం ఇచ్చేది ఎంతైనా సంతోషంగా ఇస్తే యెహోవా దేవుడు, యేసుక్రీస్తు నిజంగా మెచ్చుకుంటారు.—2 కొరిం. 9:7.

18. సంఘ పెద్దలు ఇచ్చే బైబిలు నిర్దేశాన్ని మనం ఎందుకు పాటించాలి?

18 మూడవదిగా, సంఘ పెద్దల నిర్దేశాలను పాటించడం ద్వారా మనమంతా క్రీస్తు స్నేహితులమని చూపించవచ్చు. ఈ పెద్దలు క్రీస్తు నిర్దేశంలో పరిశుద్ధాత్మచేత నియమించబడతారు. (ఎఫె. 5:23) ‘మీపైని నాయకులుగా ఉన్నవారి మాట విని, వారికి లోబడియుండుడి’ అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (హెబ్రీ. 13:17) సంఘ పెద్దలు ఇచ్చే బైబిలు నిర్దేశాన్ని పాటించడం కొన్నిసార్లు మనకు కష్టమనిపించవచ్చు. మనకు వారి బలహీనతలు తెలిసివుండవచ్చు కాబట్టి వారి ఉపదేశాన్ని తప్పుగా భావించే అవకాశముంది. కానీ, సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు ఈ అపరిపూర్ణ మానవులను పెద్దలుగా ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే వారి అధికారానికి మనం స్పందించే తీరు క్రీస్తుతో మనకున్న స్నేహాన్ని ప్రభావితం చేస్తుంది. పెద్దల లోపాలను పట్టించుకోకుండా వారి నిర్దేశాలను సంతోషంగా పాటించినప్పుడు క్రీస్తును ప్రేమిస్తున్నామని చూపిస్తాం.

మంచి స్నేహితులను ఎక్కడ కనుగొంటాం?

19, 20. సంఘంలో మనం ఎవర్ని కనుగొంటాం? తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏమి చూస్తాం?

19 ప్రేమగల కాపరుల పర్యవేక్షణ రూపంలో యేసు మనపై శ్రద్ధ చూపిస్తూ ఉండడమే కాక సంఘంలో ఆధ్యాత్మిక తల్లులను అన్నదమ్ముళ్లను, అక్కచెల్లెళ్లను ఇవ్వడం ద్వారా కూడా శ్రద్ధ చూపిస్తున్నాడు. (మార్కు 10:29, 30) యెహోవా సంస్థతో మీరు సహవాసం చేయడం ప్రారంభించినప్పుడు మీ బంధువులు ఎలా స్పందించారు? దేవునికీ క్రీస్తుకూ దగ్గరవ్వడానికి మీరు చేసిన ప్రయత్నాలకు వారు బహుశా మద్దతు ఇచ్చివుంటారు. అయితే కొన్నిసార్లు “ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు” అని యేసు హెచ్చరించాడు. (మత్త. 10:36) ఊరటనిచ్చే విషయం ఏమిటంటే, సొంత సహోదరునికన్నా సన్నిహితంగా ఉండేవారిని సంఘంలో కనుగొనవచ్చు.—సామె. 18:24.

20 పౌలు రోమా సంఘంలో ఎంతోమంది దగ్గరి స్నేహితులను సంపాదించుకున్నాడని ఆ సంఘానికి రాసిన పత్రికలోని ముగింపు మాటలను బట్టి తెలుస్తుంది. (రోమా. 16:8-16) అపొస్తలుడైన యోహాను తన మూడవ పత్రిక ముగింపులో, “నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము” అని రాశాడు. (3 యోహా. 14) యోహాను కూడా చిరకాల స్నేహితులను సంపాదించుకున్నాడు. ఆధ్యాత్మిక సహోదర సహోదరీలతో మంచి స్నేహాన్ని పెంచుకుని దాన్ని చిరకాలం కాపాడుకోవడం ద్వారా మనం యేసూ ఆయన శిష్యుల మాదిరిని ఎలా అనుకరించవచ్చు? తర్వాతి ఆర్టికల్‌లో దీనికి జవాబు చూద్దాం.

మీరెలా జవాబిస్తారు?

• మంచి స్నేహితునిగా ఉండే విషయంలో యేసు ఎలాంటి మాదిరి ఉంచాడు?

• యేసు స్నేహానికి అపొస్తలులు ఎలా స్పందించారు?

• మనం క్రీస్తు స్నేహితులమని ఎలా నిరూపించుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[14వ పేజీలోని చిత్రం]

యేసు తన స్నేహితుల మనసులో ఏముందో అర్థం చేసుకునేందుకు, తెలుసుకునేందుకు ఇష్టపడ్డాడు

[16వ పేజీలోని చిత్రాలు]

క్రీస్తుకు స్నేహితులముగా ఉండాలని కోరుకుంటున్నామని ఎలా చూపించవచ్చు?