కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని పరిచారకులమైన మనం మర్యాదగా నడుచుకుందాం

దేవుని పరిచారకులమైన మనం మర్యాదగా నడుచుకుందాం

దేవుని పరిచారకులమైన మనం మర్యాదగా నడుచుకుందాం

“దేవునిపోలి నడుచుకొనుడి.”—ఎఫె. 5:1.

1, 2. (ఎ) మర్యాద కనబర్చడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) ఈ ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాం?

గౌ రవప్రదమైన ప్రవర్తన గురించి గ్రంథకర్త సూ ఫాక్స్‌ ఇలా రాస్తోంది: “మనం ఎప్పుడూ మర్యాదగా నడుచుకోవాలి. అది అన్నిచోట్ల, అన్ని సమయాల్లో పనిచేస్తుంది.” ప్రజలు మంచి ప్రవర్తనను అలవాటు చేసుకున్నప్పుడు, ఇతరులతో సమస్యలు తగ్గిపోతాయి, లేక అవి కనుమరుగౌతాయి. అలాగే, ఇతరులతో అమర్యాదగా లేదా మొరటుగా ప్రవర్తించడం జగడాలకు, కక్ష్యలకు, అసంతోషానికి దారితీస్తుంది.

2 సాధారణంగా క్రైస్తవ సంఘాల్లో ప్రజలు ఎంతో మర్యాదగా నడుచుకుంటారు. అయినా మనం, నేడు లోకంలో సర్వసాధారణంగా కనిపించే కుసంస్కారాన్ని అలవర్చుకోకుండా జాగ్రత్తపడాలి. మర్యాద కనబర్చే విషయంలో బైబిలు సూత్రాలను అనుసరించడం మనల్నెలా కాపాడుతుందో, ప్రజల్నెలా సత్యారాధనవైపు ఆకర్షిస్తుందో చూద్దాం. చక్కని సంస్కారాన్ని ఎలా చూపించాలో అర్థం చేసుకునేందుకు యెహోవా దేవుని, ఆయన కుమారుని మాదిరిని పరిశీలిద్దాం.

యెహోవా, ఆయన కుమారుడు చక్కని సంస్కారాన్ని చూపించారు

3. సంస్కారాన్ని చూపించే విషయంలో యెహోవా దేవుడు ఎలాంటి మాదిరివుంచాడు?

3 సంస్కారాన్ని చూపించే విషయంలో యెహోవా దేవుడు పరిపూర్ణ మాదిరిగా ఉన్నాడు. ఆయన ఈ విశ్వమంతటికి సర్వాధిపతి అయినా, మానవులతో ఎంతో దయగా, మర్యాదగా వ్యవహరిస్తాడు. అబ్రాహాముకు, మోషేకు ఆజ్ఞ ఇస్తున్నప్పుడు కూడా దయచేసి చేయండి అని అర్థమిచ్చే హెబ్రీ పదాన్ని యెహోవా ఉపయోగించాడు. (ఆది. 13:14; నిర్గ. 4:6) తన సేవకులు తప్పు చేసినప్పుడు, యెహోవా వారి విషయంలో ‘దయా దాక్షిణ్యాలుగలవానిగా, దీర్ఘశాంతునిగా, కృపాసత్యములతో నిండినవానిగా’ వ్యవహరించాడు. (కీర్త. 86:15) ఇతరులు తాము ఆశించినట్లు చేయకపోతే కొందరు కోపంతో రగిలిపోతారు. అయితే యెహోవా ఎప్పుడు అలా చేయడు.

4. ఇతరులు మనతో మాట్లాడినప్పుడు యెహోవాలాగే మనమూ ఏమి చేయవచ్చు?

4 మానవులు మాట్లాడినప్పుడు దేవుడు విన్న విధానం నుండి కూడా మర్యాద నేర్చుకుంటాం. సొదొమ ప్రజల గురించి అబ్రాహాము అడిగిన ప్రతీ ప్రశ్నకు యెహోవా ఓపికగా సమాధానమిచ్చాడు. (ఆది. 18:23-32) అబ్రాహాము ఆందోళనను వ్యక్తపర్చినప్పుడు ఆయన తన సమయం వృథా అవుతోందని అనుకోలేదు. తన సేవకుల ప్రార్థనలను, పశ్చాత్తాపంతో పాపులు చేసే విన్నపాలను యెహోవా వింటాడు. (కీర్తన 51:11, 17 చదవండి.) ఇతరులు మనతో మాట్లాడినప్పుడు యెహోవాలాగే మనం కూడా వినవద్దా?

5. యేసులా మర్యాద కనబర్చడం ఇతరులతో మన సంబంధాలను ఎలా మెరుగుపరుస్తుంది?

5 యేసుక్రీస్తు తన తండ్రి దగ్గర అనేక విషయాలతోపాటు చక్కని సంస్కారాన్ని కూడా నేర్చుకున్నాడు. అప్పుడప్పుడు పరిచర్యకు ఎంతో సమయాన్ని, శక్తిని ఉపయోగించాల్సివచ్చినా యేసు ఎల్లప్పుడూ ఓపికను, దయను కనబర్చాడు. అడుక్కుతినే స్థితికి చేరుకున్న కుష్ఠరోగులు, గుడ్డివారు, అవసరంలో ఉన్న ఇతరులు తమకు సహాయం చేయడానికి యేసు ఎప్పుడూ సిద్ధంగా ఉండడం గమనించారు. అలాంటివారు ముందుగా తనను అడక్కుండా వచ్చినాసరే ఆయన వారిని నిర్లక్ష్యం చేయలేదు. ఆయన చాలాసార్లు తానుచేస్తున్న పని ఆపుజేసి బాధపడుతున్న వ్యక్తికి సహాయం చేశాడు. తనను విశ్వసించినవారి పట్ల యేసు అసాధారణ శ్రద్ధ కనబర్చాడు. (మార్కు 5:30-34; లూకా 18:35-41) క్రైస్తవులముగా మనం కూడా యేసులాగే దయతో సహాయం చేయాలి. అలాంటి ప్రవర్తనను మన బంధువులు, పొరుగువారు, ఇతరులు గమనించకుండా ఉండరు. అంతేకాక అలాంటి ప్రవర్తన యెహోవాను మహిమపర్చడమే కాక, మనకూ సంతోషాన్నిస్తుంది.

6. ఆప్యాయత కనబర్చడంలో యేసు ఎలాంటి మాదిరివుంచాడు?

6 పేరుపెట్టి పిలవడం ద్వారా కూడా యేసు చక్కని మర్యాద కనబర్చాడు. యూదా మతనాయకులు ఆ విధంగా ఇతరులను గౌరవించారా? లేదు. ధర్మశాస్తం తెలియని ప్రజలను ‘శాపగ్రస్తమైనవారని’ అంటూ వారిని హీనంగా చూసేవారు. (యోహా. 7:49) కానీ దేవుని కుమారుడు అలా వ్యవహరించలేదు. మార్త, మరియ, జక్కయ వంటి ఎందరినో ఆయన పేరుపెట్టి పిలిచాడు. (లూకా 10:41, 42; 19:5) నేడు ప్రజలను ఎలా పిలవాలనేది ఆయా సంస్కృతుల్ని బట్టి పరిస్థితుల్ని బట్టి వేర్వేరుగావున్నా యెహోవా సేవకులు మాత్రం ఇతరులతో ఆప్యాయంగా మెలగడాన్ని అలవర్చుకుంటారు. * వర్గ భేదాల్లేకుండా వారు తోటి విశ్వాసులను, ఇతరులను గౌరవిస్తారు.—యాకోబు 2:1-4 చదవండి.

7. అన్ని ప్రాంతాల్లో నివసించే తోటి మానవులను గౌరవించడానికి బైబిలు సూత్రాలు ఎలా సహాయం చేస్తాయి?

7 దేవుడు ఆయన కుమారుడు చక్కని సంస్కారంతో సకల దేశాల, జాతుల ప్రజలతో వ్యవహరించడం వారికి ఆ ప్రజలపట్ల గౌరవముందని చూపించడమే కాక, సరైన మనోవైఖరిగలవారు సత్యాన్ని అంగీకరించేలా చేస్తోంది. అయితే మర్యాద చూపించడమనేది ప్రాంతాలను బట్టి వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి, మర్యాద కనబర్చే విషయంలో మనం నిర్దిష్టంగా ఒకే పద్ధతిని పాటిస్తామని పట్టుబట్టం. బదులుగా, బైబిలు సూత్రాలను బట్టి అన్ని ప్రాంతాలకు చెందిన తోటి మానవులను వారికి తగినట్లు గౌరవిస్తాం. ప్రజలతో మర్యాదగా నడుచుకోవడంవల్ల క్రైస్తవ పరిచర్యలో మనం మరిన్ని సత్ఫలితాలు ఎలా సాధించగలమో పరిశీలిద్దాం.

ప్రజలను పలకరించాలి, వారితో మాట్లాడాలి

8, 9. (ఎ) ఎలాంటి అలవాటును అమర్యాద ప్రవర్తనగా చెప్పవచ్చు? (బి) మనం ప్రజలతో వ్యవహరించే తీరు, మత్తయి 5:47లో రాయబడిన యేసు మాటలకు అనుగుణంగా ఎందుకు ఉండాలి?

8 నేడు అనేక ప్రాంతాల్లో జీవితం రాకెట్‌ వేగంతో వెళ్తున్న కారణంగా, ఇద్దరు వ్యక్తులు ఎదురుపడినా ఒకరినొకరు “హలో” అనో, “ఎలావున్నారు” అనో పలకరించుకోవడమే కరవైపోయింది. అయితే జనం కిక్కిరిసిన దారిలో ఎదురుపడిన ప్రతీవారిని పలకరించాలని కాదు. కానీ వేరేచోట్ల, ఇతరులను పలకరించడం మంచిది. ప్రజలను పలకరించే అలవాటు మీకుందా? లేక ఎలాంటి చిరునవ్వు లేకుండా లేదా ఆప్యాయంగా పలకరించకుండా మీ దారిన మీరు నడిచివెళ్లిపోతుంటారా? నిజానికి ఒక వ్యక్తి ఎలాంటి దురుద్దేశం లేకుండానే అమర్యాదగా ప్రవర్తించే అలవాటును పెంచుకునే అవకాశముంది.

9 “మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా” అనే చెప్పినప్పుడు యేసు ఈ విషయాన్నే మనకు గుర్తుచేస్తున్నాడు. (మత్త. 5:47) దీని గురించి సలహాదారుడైన డానెల్డ్‌ విస్‌ ఇలా రాశాడు: “తమను పట్టించుకోకుండా వెళ్లినప్పుడు ప్రజలకు కోపం వస్తుంది. ఎవరినైనా పలకరించనందుకు ఏ సాకూ చెప్పలేము. కాబట్టి, పరిష్కారం ఒకటే: అందరినీ పలకరించండి, అందరితో మాట్లాడండి.” ఇతరులకు దూరదూరంగా లేదా అంటీముట్టనట్టు ఉండకూడదు. అలా ఉంటే మంచి ఫలితాలు సాధించలేము.

10. చక్కని సంస్కారాన్ని చూపించినప్పుడు పరిచర్యలో మనమెలాంటి సత్ఫలితాలు సాధించగలుగుతాం? (“చిరునవ్వుతో పలకరించండి” అనే బాక్సు చూడండి.)

10 ఉత్తర అమెరికాలోని ఓ మహానగరంలో నివసిస్తున్న టామ్‌, కారెల్‌ అనే క్రైస్తవ దంపతుల విషయమే తీసుకోండి. వారు తమ పరిచర్యలో భాగంగా తమ పొరుగువారితో ఆహ్లాదకరంగా మాట్లాడారు. అలా వారెలా మాట్లాడగలిగారు? యాకోబు 3:18ని ప్రస్తావిస్తూ టామ్‌ ఇలా చెబుతున్నాడు: “మేము ప్రజలతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ వారితో శాంతియుతంగా మెలిగేందుకు ప్రయత్నిస్తాం. తమ ఇళ్ల బయట కనబడినవారి దగ్గరకు, ఆ ప్రాంతంలో పనిచేస్తున్నవారి దగ్గరకు వెళ్లి మాట్లాడతాం. చిరునవ్వుతో వారిని పలకరిస్తాం. వారికి ఆసక్తిగా ఉండే విషయాలు అంటే వారి పిల్లలకు, వారి కుక్కలకు, వారి ఇంటికి, వారి ఉద్యోగానికి సంబంధించి విషయాలు మాట్లాడతాం. కొన్ని రోజులకు వారు మమ్మల్ని తమ స్నేహితులుగా చూస్తారు.” కారెల్‌ మాట్లాడుతూ, “ఆ తర్వాత కలిసినప్పుడు మా పేర్లుచెప్పి వారి పేర్లు అడిగి తెలుసుకుంటాం. మేము వారి పొరుగువారమని, ఫలానా పని చేస్తుంటామని క్లుప్తంగా వివరిస్తాం. అలా చివరకు మేము వారికి సాక్ష్యమివ్వగలుగుతాం.” టామ్‌, కారెల్‌ తమ పొరుగునున్న చాలామంది నమ్మకాన్ని పొందగలిగారు. వారిలో చాలామంది బైబిలు ప్రచురణలు తీసుకుంటే, కొందరు సత్యం తెలుసుకోవాలనే చక్కని ఆసక్తిని కనబర్చారు.

క్లిష్ట పరిస్థితుల్లోనూ మర్యాదగా నడుచుకోండి

11, 12. సువార్త ప్రకటించేటప్పుడు కొందరు మనతో మొరటుగా వ్యవహరిస్తారని ఎందుకు ఎదురుచూడవచ్చు? అలాంటప్పుడు మనమెలా స్పందించాలి?

11 సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొందరు మనతో మొరటుగా వ్యవహరించవచ్చు. ఇలా జరుగుతుందని మనం ఎదురుచూడవచ్చు ఎందుకంటే, “లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు” అని క్రీస్తుయేసు తన శిష్యులను ముందే హెచ్చరించాడు. (యోహా. 15:20) మనం కూడా వారిలాగే ఈసడింపుగా మాట్లాడడం సత్ఫలితాలు తీసుకురాదు. మరి మనమెలా స్పందించాలి? అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు: “మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి.” (1 పేతు. 3:15) మృదువుగా, గౌరవపూర్వకంగా మాట్లాడుతూ మనం మంచి మర్యాదను కనబర్చినప్పుడు, మనల్ని అవమానపర్చే వారు మన సందేశం వినడానికి ఇష్టపడవచ్చు.—తీతు 2:7, 8.

12 మొరటుగా మాట్లాడేవారికి దేవుడు ఆమోదించే రీతిలో సమాధానమిచ్చేలా సిద్ధపడగలమా? సిద్ధపడగలం. పౌలు ఇలా ఉపదేశించాడు: “ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.” (కొలొ. 4:6) కుటుంబ సభ్యులతో, తోటి విద్యార్థులతో, తోటిపనివారితో, సంఘ సభ్యులతో, ఇరుగుపొరుగున అందరితో మర్యాదగా ప్రవర్తించడం అలవాటు చేసుకుంటే, క్రైస్తవులకు తగినట్లుగా అపహాస్యాన్ని, అవమానాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంటాం.—రోమీయులు 12:17-21 చదవండి.

13. మర్యాద కనబర్చడంవల్ల వ్యతిరేకులు మనం చెప్పేది వినడానికి ఇష్టపడవచ్చని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.

13 క్లిష్ట పరిస్థితుల్లోనూ మర్యాద కనబర్చడంవల్ల మంచి ఫలితాలొస్తాయి. ఉదాహరణకు, జపాన్‌లో ఒక గృహస్థుడు, అతని అతిథి ఓ సాక్షిని అపహసించారు. మన సహోదరుడు మారు మాట్లాడకుండా ఆ ఇల్లు వదిలి మర్యాదగా వెళ్లిపోయాడు. ఆ ప్రాంతంలోనే తన ప్రకటనా పనిని కొనసాగిస్తుండగా, ఆ అతిథి కొద్ది దూరం నుండి తనను చూస్తున్నట్లు ఆ సహోదరుడు గమనించాడు. ఆయన ఆ అతిథి దగ్గరకు వెళ్లినప్పుడు ఆ అతిథి, “క్షమించండి, జరిగినదానికి చింతిస్తున్నాను. మేము అమర్యాదగా మాట్లాడినా, మీరు చిరునవ్వు చిందిస్తూ ఉండడం నేను గమనించాను. మీలా ఉండాలంటే నేనేమి చేయాలి?” అని అన్నాడు. అప్పటికే తన ఉద్యోగాన్ని కోల్పోయినందువల్ల, కొద్దిరోజుల ముందే ఆయన తల్లి చనిపోవడంవల్ల సంతోషంగా ఉండలేకపోతున్నాడు. సాక్షి బైబిలు అధ్యయనం చేయమని ప్రోత్సహించినప్పుడు ఆయన దానికి అంగీకరించాడు. అనతికాలంలోనే ఆయన వారానికి రెండుసార్లు అధ్యయనం చేయడం ఆరంభించాడు.

మర్యాదను అలవర్చుకునే ఉత్తమ విధానం

14, 15. పూర్వకాలంలో యెహోవా సేవకులు తమ పిల్లలకు ఎలాంటి శిక్షణ ఇచ్చారు?

14 పూర్వం భక్తిపరులైన తల్లిదండ్రులు ఇంటి దగ్గరే తమ పిల్లలకు మర్యాద కనబర్చే విషయంలో ప్రాథమిక అంశాలు నేర్పేవారు. ఉదాహరణకు, అబ్రాహామూ ఆయన కుమారుడూ ఒకరితో ఒకరు ఎలా మర్యాదగా మాట్లాడుకున్నారో ఆదికాండము 22:7లో గమనించండి. యోసేపుకు కూడా వారి తల్లిదండ్రులు మంచి శిక్షణ ఇచ్చారని తెలుస్తోంది. చెరసాలలో ఉన్నప్పుడు, ఆయన తోటి ఖైదీలతో కూడా మర్యాదగా ప్రవర్తించాడు. (ఆది. 40:8, 14) ఫరోతో ఆయన మాట్లాడిన తీరు ఉన్నత పదవిలోవున్న వారితో ఎలా మాట్లాడాలో ఆయనకు తెలుసని చూపిస్తోంది.—ఆది. 41:16, 33, 34.

15 ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన పది ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞ కూడా చేర్చబడింది: “నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.” (నిర్గ. 20:12) పిల్లలు తమ తల్లిదండ్రులను గౌరవించే ఒక మార్గమేమిటంటే, వారు ఇంట్లో మర్యాదగా నడుచుకోవాలి. యెఫ్తా కుమార్తె క్లిష్ట పరిస్థితిలోనూ తన తండ్రి చేసిన ప్రమాణానికి కట్టుబడి ఆయన పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని చూపించింది.—న్యాయా. 11:35-40.

16-18. (ఎ) పిల్లలకు మర్యాద నేర్పించడానికి ఏమిచేయాలి? (బి) పిల్లలకు మంచీ మర్యాద నేర్పించడంవల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఏమిటి?

16 మర్యాదగా నడుచుకునేలా మన పిల్లలకు శిక్షణ ఇవ్వడం చాలా ప్రాముఖ్యం. పెద్దవారైన తర్వాత కూడా మర్యాదస్థులుగా మెలగాలంటే, పిల్లలు చిన్నప్పుడే సరైన రీతిలో కొత్తవారిని పలకరించడం, ఫోనులో మాట్లాడడం, ఇతరులతో కలిసి భోజనం చేయడం వంటివి నేర్చుకోవాలి. ఇతరులకు తలుపు తెరిచి పట్టుకోవడం, వృద్ధుల పట్ల, వ్యాధిగ్రస్థుల పట్ల దయగా ప్రవర్తించడం, బరువైన వస్తువులు మోస్తున్నవారికి చేయందించడం ఎందుకు అవసరమో అర్థం చేసుకునేలా పిల్లలకు సహాయం చేయాలి. “దయచేసి” (“ప్లీజ్‌”), “థాంక్యూ”, “ఫరవాలేదండి”, “సహాయం చేయమంటారా?”, “క్షమించండి” వంటి మాటలు నిష్కపటంగా ఎందుకు ఉపయోగించాలో వారు అర్థం చేసుకోవాలి.

17 పిల్లలకు మంచీ మర్యాద నేర్పించడానికి కఠినంగా ఉండాల్సిన అవసరంలేదు. చక్కని మాదిరి ఉంచడమే ఉత్తమ విధానం. తాను తన ఇద్దరు అన్నలు, తమ్ముడు మర్యాద కనబర్చడాన్ని ఎలా నేర్చుకున్నారో 25 ఏళ్ల కూర్ట్‌ చెబుతున్నాడు: “మా డాడీ మమ్మీ ఒకరితో ఒకరు దయగా మాట్లాడుకోవడం విన్నాం, ఇతరుల కష్టసుఖాలను దృష్టిలో పెట్టుకొని వారితో ఓపికగా వ్యవహరించడం గమనించాం. రాజ్యమందిరంలో నాన్నగారు కూటాలకు ముందు, ఆ తర్వాత వృద్ధ సహోదర సహోదరీలతో మాట్లాడేందుకు నన్ను తనతో తీసుకెళ్లేవారు. ఆయన వారిని పలకరించడాన్ని విన్నాను, వారిని గౌరవించడం చూశాను.” కూర్ట్‌ ఇంకా అలా చెబుతున్నాడు: “త్వరలోనే ఆయన మన్నన, మర్యాద నాకు అలవడ్డాయి. నేను సహజంగానే ఇతరులతో మర్యాదగా ప్రవర్తించడం ఆరంభించాను. మీరెలా ప్రవర్తిస్తారనేది కాదుగానీ, మీరెలా ప్రవర్తించాలని కోరుకుంటారనేది ప్రాముఖ్యం.”

18 తల్లిదండ్రులు తమ పిల్లలకు మర్యాద నేర్పిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి? పిల్లలు స్నేహితులను సంపాదించుకొని, ఇతరులతో సామరస్యంగా మెలుగుతారు. తమ యజమానులతో, తోటి ఉద్యోగస్థులతో కలిసి పనిచేసేటప్పుడు చక్కగా ప్రవర్తించగలుగుతారు. అంతేకాక సంస్కారవంతులు, మన్నన, మర్యాదగల పిల్లలు తమ తల్లిదండ్రులకు ఆనందాన్ని, సంతృప్తిని తీసుకొస్తారు.—సామెతలు 23:24, 25 చదవండి.

సంస్కారం విషయలో మనం ఇతరుల్లా ఉండం

19, 20. దాక్షిణ్యం చూపించే మన దేవుని, ఆయన కుమారుని మాదిరిని అనుకరించడానికి మనమెందుకు ధృడంగా తీర్మానించుకోవాలి?

19 “మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి” అని పౌలు రాశాడు. (ఎఫె. 5:1) యెహోవా దేవుణ్ణి, ఆయన కుమారుణ్ణి అనుకరించాలంటే మనం ఈ ఆర్టికల్‌లో పరిశీలించినటువంటి బైబిలు సూత్రాలను అనుసరించాలి. అలా చేసినప్పుడు మనం పై అధికారి అనుగ్రహం పొందాలనో లేదా ఏదో లాభాపేక్షతోనో మర్యాద కనబర్చే కపట వేషధారులుగా ఉండం.—యూదా 15, 16.

20 తన దుష్ట పరిపాలనకున్న చివరి రోజుల్లో సాతాను, గౌరవప్రదమైన ప్రవర్తనకు సంబంధించి యెహోవా నెలకొల్పిన ప్రమాణాలను రూపుమాపాలని కంకణం కట్టుకున్నాడు. అయితే అపవాది నిజ క్రైస్తవులు కనబర్చే మర్యాదను లేక సంస్కారాన్ని రూపుమాపలేడు. దాక్షిణ్యం లేదా సంస్కారంగల మన దేవుడు, ఆయన కుమారుడు చేసినట్లే చేయాలని ధృడంగా తీర్మానించుకుందాం. అప్పుడు మన సంభాషణ, ప్రవర్తన ఎల్లప్పుడూ అమర్యాదగా ప్రవర్తించాలనుకునేవారికి భిన్నంగా ఉంటాయి. అలా మనం సంస్కారానికి మారుపేరైన యెహోవా దేవుని నామానికి స్తుతులు తీసుకురావడమే కాక, నిష్కపటులైన ప్రజలు సత్యారాధన చేపట్టేందుకు తోడ్పడిన వారమౌతాం.

[అధస్సూచి]

^ పేరా 6 కొన్ని సంస్కృతుల్లో తమకన్నా వయసులో పెద్దవారిని వారి అనుమతి లేకుండా పేరుపెట్టి పిలవడం మర్యాద కాదు. క్రైస్తవులు అలాంటి పద్ధతుల్ని గౌరవించాలి.

మీరు గుర్తుచేసుకోగలరా?

• సంస్కారాన్ని చూపించే విషయంలో యెహోవా, ఆయన కుమారుని నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

• ప్రజలను ఆప్యాయంగా పలకరించడం క్రైస్తవులుగా మనకెందుకు మంచి పేరు తెస్తుంది?

• మర్యాదగా ప్రవర్తించడం ఫలవంతమైన పరిచర్యకు ఎలా తోడ్పడుతుంది?

• పిల్లలకు మంచీ మర్యాదను నేర్పించే విషయంలో తల్లిదండ్రులకు ఎలాంటి బాధ్యతవుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[27వ పేజీలోని బాక్సు]

చిరునవ్వుతో పలకరించండి

చాలామంది తమకు తెలియనివారితో మాట్లాడేందుకు వెనకాడతారు. కానీ దేవుని పట్ల, తమ పొరుగువారి పట్ల ప్రేమవున్న యెహోవాసాక్షులు ఇతరులతో బైబిలు సత్యాలు పంచుకునేలా చక్కగా సంభాషించడం నేర్చుకోవాలని హృదయపూర్వకంగా ప్రయత్నిస్తారు. ఈ విషయంలో అభివృద్ధి సాధించేలా మీకేది సహాయం చేయగలదు?

ఓ విలువైన సూత్రం ఫిలిప్పీయులు 2:4లో ఉంది. అక్కడ మనమిలా చదువుతాం: “మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.” ఈ మాటల్ని మనసులో ఉంచుకొని ఇలా ఆలోచించండి: ముందెన్నడూ కలవని వ్యక్తి, మీరెవరో తెలియక ఆశ్చర్యంగా చూస్తాడు. ఆయన మీతో బిడియం లేకుండా మాట్లాడాలంటే ఏమిచేయాలి? చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించి మాట్లాడాలి. అయితే అది మాత్రమే సరిపోదు.

ఎవరితోనైనా సంభాషణ ఆరంభించడానికి ప్రయత్నించినప్పుడు బహుశా మీరు ఆ వ్యక్తి ఆలోచనలకు అడ్డుపడివుంటారు. ఆయన ఏమి ఆలోచిస్తున్నాడో పట్టించుకోకుండా మీరనుకున్న విషయం గురించి ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే, ఆయన సానుకూలంగా స్పందించకపోవచ్చు. కాబట్టి, ఆ వ్యక్తి దేనిగురించి ఆలోచిస్తుండవచ్చో మీరు గ్రహించగలిగితే, ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ ఆయనతో మాట్లాడడం ఎందుకు ఆరంభించకూడదు? సమరయలో ఓ బావి దగ్గర స్త్రీని కలిసినప్పుడు యేసు అదే చేశాడు? (యోహా. 4:7-26) ఆమె ఆలోచన నీరు చేదుకోవడంపైనే ఉంది. కాబట్టి దాని ఆధారంగానే యేసు ఆమెతో మాట్లాడడం ఆరంభించినందువల్ల, చాలా తక్కువ సమయంలోనే ఆధ్యాత్మిక విషయాల గురించి ఎంతో చక్కగా చర్చించగలిగాడు.

[26వ పేజీలోని చిత్రాలు]

ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండడం చక్కని సాక్ష్యమిచ్చేందుకు దారితీయవచ్చు

[28వ పేజీలోని చిత్రం]

మర్యాదగా నడుచుకోవడం ఎల్లప్పుడూ తగినదే