కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బధిరులైన సహోదర సహోదరీలను శ్రద్ధగా చూసుకుందాం

బధిరులైన సహోదర సహోదరీలను శ్రద్ధగా చూసుకుందాం

బధిరులైన సహోదర సహోదరీలను శ్రద్ధగా చూసుకుందాం

నేడు దేవుని ప్రజలు ఆధ్యాత్మిక సహోదర సహోదరీలున్న ఓ పెద్ద కుటుంబంలా ఉన్నారు. పూర్వ కాలంలోని నమ్మకస్థులైన స్త్రీ, పురుషులతో ఈ కుటుంబ మొదలైంది. ఆ పూర్వీకుల్లో సమూయేలు, దావీదు, సమ్సోను, రాహాబు, మోషే, అబ్రాహాము, శారా, నోవహు, హేబెలు ఉన్నారు. యెహోవా నమ్మకమైన సేవకుల్లో ఎంతోమంది బధిరులు కూడా ఉన్నారు. ఉదాహరణకు, మంగోలియాలో మొట్టమొదటిగా ఒక జంట యెహోవాసాక్షులయ్యారు. వారిద్దరూ బధిరులే. రష్యాలోని బధిరులైన మన సహోదర సహోదరీలు చూపించిన యథార్థతను బట్టి యూరోపియన్‌ మానవ హక్కుల న్యాయస్థానంలో చట్టపరమైన విజయాన్ని సాధించాం.

మనకాలంలో “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” సంజ్ఞా భాషలో ప్రచురణలను అందజేయడమే కాక, సంఘాలను, సమావేశాలను కూడా ఏర్పాటు చేశాడు. (మత్త. 24:45) ఈ ఏర్పాట్ల వల్ల బధిరులు ఎంతో ప్రయోజనం పొందారు. * ఈ ఏర్పాట్లేవీ లేనిరోజుల్లో బధిరులు సత్యదేవుణ్ణి తెలుసుకొని, సత్యంలో ప్రగతి సాధించడం ఎంత కష్టంగా ఉండేదో మీరెప్పుడైనా ఆలోచించారా? మీ ప్రాంతంలోవున్న బధిరులకు మీరెలా సహాయం చేయగలరో ఎప్పుడైనా ఆలోచించారా?

ఈ ఏర్పాట్లేవీ లేకముందున్న పరిస్థితి

దేవుని గురించి ఎలా తెలుసుకున్నారో చాలా కాలంగా సత్యంలోవున్న బధిరులను అడిగి చూడండి? బహుశ, దేవునికి ఒక పేరుందని మొదటిసారి తెలుసుకున్నప్పుడు వారికి ఎలా అనిపించిందో చెబుతారు. ఆ ఒక్క సత్యం వారి జీవితాన్ని ఎలా మార్చిందో వివరిస్తారు. బైబిలు సత్యాలను మరింత బాగా అర్థం చేసుకునేలా వీడియోలు లేదా డీవీడీలు సంజ్ఞా భాషలోకి వచ్చేంతవరకు ఈ సంవత్సరాలన్నిటిలో ఆ ఒక్క విషయమే వారిని సత్యంలో ఉండేలా ఎలా చేసిందో చెబుతారు. సంజ్ఞా భాషలో క్రైస్తవ కూటాలు జరగకముందు, లేదా వాటిని సంజ్ఞా భాషలోకి అనువాదం చేయడం మొదలుకాకముందు పరిస్థితి ఎలా ఉండేదో వారు వివరిస్తారు. అప్పట్లో ఎవరో ఒకరు వారి ప్రక్కన కూర్చొని కూటాల్లో చెబుతున్న దాన్ని నోట్సు మీదగానీ, పేపరు మీదగానీ రాసి వారికి చూపించేవారు. బధిరుడైన ఒక సహోదరుడు అదే పద్ధతిలో బైబిలు సత్యాలను నేర్చుకున్నాడు. అలా ఏడు సంవత్సరాలు గడిచిన తర్వాతే అక్కడికి సంజ్ఞా భాషలోకి అనువాదం చేసేవారు ఒకరు వచ్చారు.

సంఘంలోని మిగతావారితో కలిసి వినగలిగే వారికి ప్రకటించడం ఎంత కష్టంగా ఉండేదో సత్యంలో చాలా కాలంగా ఉన్న బధిరులైన సహోదరులు వివరిస్తారు. వారు ఇంటింటి పరిచర్యకి వెళ్లినప్పుడు వారు చెప్పాలనుకున్నది రాసివున్న కార్డును ఒక చేతిలో పట్టుకుని కావలికోట, తేజరిల్లు! పత్రికలను మరో చేతిలో పట్టుకుని వెళ్లేవారు. బధిరుడైన మరో వ్యక్తితో బైబిలు అధ్యయనం చేయడం వారికొక పోరాటంలా ఉండేది. ఎందుకంటే వారు కేవలం ముద్రిత పుస్తకాలను ఉపయోగించే బైబిలు అధ్యయనం చేసేవారు, అయితే వాటిలోని విషయం వారిద్దరికీ సరిగా అర్థమయ్యేది కాదు. వారు చెప్పేది ఎదుటివారికి అర్థంకాకపోవడంతో బైబిలు సత్యాల గురించి ఇక ఏమి చెప్పలేక వారెంత బాధపడేవారో కొంతమంది బధిరులైన సహోదరులు జ్ఞాపకం చేసుకుంటారు. యెహోవాను తామెంతో ప్రేమిస్తున్నా, అందుకు తగ్గట్టు ధైర్యంగా చర్య తీసుకోలేకపోతున్నామనే ఆలోచనతో ఎంత మధనపడ్డారో కూడా వారికి తెలుసు. ఎందుకు? ఎందుకంటే ఒకానొక విషయాన్ని తాము అర్థం చేసుకున్నది ఎంతవరకు సరైనదోనన్న అనుమానం వారిని వేధించేది.

ఇన్ని ఇబ్బందులున్నా బధిరులైన మన సహోదర సహోదరీలు తమ యథార్థతను కాపాడుకుంటూ వచ్చారు. (యోబు 2:3) వారు యెహోవా మీద నమ్మకంతో కనిపెట్టుకుని ఉన్నారు. (కీర్త. 37:7) అలాగే ఆయన కూడా వారిని ఎంతగానో ఆశీర్వదించాడు. ఇంత గొప్ప ఆశీర్వాదాలు చవిచూస్తామని వారిలో చాలామంది ఎన్నడూ ఊహించలేదు.

బధిరుడైన ఒక సహోదరుడు ఎంత కష్టపడేవాడో ఇప్పుడు చూద్దాం. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. సంజ్ఞా భాష వీడియోలు రాకముందు నుండే ఆయన కుటుంబ అధ్యయనాన్ని నిర్వహించేవాడు. వాళ్లబ్బాయి అదేలా ఉండేదో జ్ఞాపకం చేసుకుంటూ ఇలా చెబుతున్నాడు: “అప్పట్లో ఆయన కుటుంబ అధ్యయనాలను పుస్తకాలను ఉపయోగించే నిర్వహించాల్సి వచ్చేది కాబట్టి, మా నాన్నకు అది ఎప్పుడూ కష్టంగా ఉండేది. చాలాసార్లు పుస్తకాల్లో ఉన్నది ఆయనకు పూర్తిగా అర్థమయ్యేది కాదు. మేమప్పుడు చిన్నపిల్లలం కాబట్టి మావల్ల ఆయనకు ఇంకా కష్టంగా ఉండేది. ఆయన ఎప్పుడైనా పొరపాటుగా వివరిస్తే అది తప్పని ఆయనతో వెంటనే చెప్పేసేవాళ్లం. ఇన్ని ఇబ్బందులున్నా ఆయన కుటుంబ అధ్యయనం చేయడం ఎప్పుడూ మానలేదు. ఇంగ్లీషు సరిగా అర్థంకాకపోవడం వల్ల ఆయనకు అప్పుడప్పుడు అవమానకరంగా అనిపించినా మేము యెహోవా గురించి ఎంతోకొంత తెలుసుకోవడమే ప్రాముఖ్యమని ఆయన అనుకునేవారు.”

అమెరికాలోని బ్రూక్లిన్‌లో ఉంటున్న సహోదరుడు రిచర్డ్‌ కూడా మంచి ఉదాహరణ. ఆయన వయసు డెబ్భై కన్నా ఎక్కువ ఉంటుంది. ఆయన బధిరుడు, అంధుడు. రిచర్డ్‌కు క్రమంగా కూటాలకు హాజరౌతాడనే మంచి పేరుంది. ఆయన కూటాలకు రావడానికి సబ్‌వేలో (భూగర్భ రైలు మార్గంలో) రైలు ఎక్కి స్టాపులు లెక్కపెట్టుకుంటూ గమ్యం చేరుకునేవాడు. ఓసారి శీతాకాలంలో విపరీతమైన మంచు తుఫాను రావడంతో ఆ రోజు కూటాన్ని రద్దు చేశారు. ఆ విషయం సంఘంలోవున్న వారందరికి చెప్పారుగానీ పొరపాటున రిచర్డ్‌కు చెప్పలేదు. జరిగింది గుర్తొచ్చి సహోదరులు ఆయన కోసం వెతికడం మొదలుపెట్టారు. అప్పటికే రిచర్డ్‌ రాజ్యమందిరం బయట ఎవరైన వచ్చి తలుపులు తెరుస్తారని ఓపికగా ఎదురుచూస్తూ నిలబడడం వారు చూశారు. మంచు తుఫానులో ఎందుకు బయటకొచ్చారని ఆ సహోదరులు రిచర్డ్‌ను అడిగినప్పుడు ఆయన, “నాకు యెహోవా అంటే ఎనలేని ప్రేమ” అని చెప్పాడు.

మీరు ఏమి చేయవచ్చు?

మీ ప్రాంతంలో బధిరులు ఉన్నారా? వారితో మాట్లాడడానికి మీరు సంజ్ఞా భాషను నేర్చుకోగలరా? సాధారణంగా బధిరులు తమ భాషను ఇతరులకు ఎంతో ప్రేమతో, ఓర్పుగా నేర్పిస్తారు. అనుకోకుండా లేదా పరిచర్యలో బధిరుల్ని కలిస్తే ఏమి చేయవచ్చు? వారితో మాట్లాడడానికి ప్రయత్నించండి. సైగలు చేయండి, పుస్తకం మీద రాసి చూపించండి, బొమ్మలు గీసి చూపించండి, చిత్రాలను చూపించండి లేదా వాటన్నిటిని కలిపి వివరించడానికి ప్రయత్నించండి. వారికి సత్యమంటే ఆసక్తి లేదని చెప్పినప్పటికీ వారి గురించి సాక్షుల్లోని బధిరులకు లేదా సంజ్ఞా భాష తెలిసినవారికి చెప్పండి. బహుశ మన సందేశాన్ని సంజ్ఞా భాషలో అందిస్తే వారు ఇష్టపడొచ్చు.

బహుశ మీరు సంజ్ఞా భాషను నేర్చుకుంటుండవచ్చు, లేదా సంజ్ఞా భాషా సంఘానికి వెళ్తుండవచ్చు. సంజ్ఞా భాషలో మరింత చక్కగా మాట్లాడడానికి, అర్థం చేసుకోవడానికి మీరు ఏమి చేయవచ్చు? సంఘంలో వినగలిగే ప్రచారకులున్నప్పటికీ వారితో కూడా సంజ్ఞా భాషలో మాట్లాడడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? అలా చేయడంవల్ల మీరు సంజ్ఞా భాషలో ఆలోచించగలుగుతారు. కానీ ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు సంజ్ఞా భాషను ఉపయోగించడం కన్నా మామూలుగా మాట్లాడడమే సులభంగా ఉంటుందని అనిపించవచ్చు. నిజానికి, ఏ కొత్త భాషను నేర్చుకోవడానికైనా ఓర్పు అవసరం.

సంజ్ఞా భాషలో మాట్లాడేందుకు మీరు చేసే కృషి, మీకు బధిరులైన సహోదర సహోదరీలు అంటే ప్రేమ, గౌరవం ఉన్నాయని చూపిస్తుంది. పని చేసేచోట లేదా పాఠశాలలో తమ చుట్టూ ఉన్నవారు చెబుతున్నది అర్థం చేసుకోలేక బధిరులు రోజూ ఎంత యాతన అనుభవిస్తారో ఆలోచించండి. బధిరుడైన ఒక సహోదరుడు, “నేను ప్రతీరోజు మామూలుగా మాట్లాడుకునే వారి మధ్యే ఉంటాను. అప్పుడు నేను ఒంటరిని, నన్ను ఎవరు పట్టించుకోరు అనే ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోతుంది, కోపం కూడా వస్తుంటుంది. కొన్నిసార్లు నాకు ఎలా అనిపిస్తుందో చెప్పడానికి మాటలు చాలవు” అని అంటున్నాడు. మన సహోదర సహోదరీల్లోని బధిరులకు మన కూటాలు ఎడారిలో నీటి చెలమలా ఆధ్యాత్మిక ఆహారాన్నీ, నలుగురితో కలిసి ఆప్యాయంగా మాట్లాడుకునే అవకాశాన్నీ, మంచి స్నేహితుల్నీ అందించేలా ఉండాలి.—యోహా. 13:34, 35.

సంఘాల్లో కూడుకునే చిన్నచిన్న సంజ్ఞా భాషా గుంపులు కూడా ప్రాముఖ్యమైనవే. వారి కోసం కూటాలను సంజ్ఞా భాషలోకి అనువదిస్తారు. కూటంలో చెప్తున్నది పూర్తిగా అర్థం చేసుకోవడానికి బధిరులు రాజ్య మందిరంలో ముందు వరుసల్లో కూర్చుంటారు. దీని వల్ల ఎలాంటి ఆటంకం, ఇబ్బంది లేకుండా వారు ప్రసంగీకుణ్ణి, అనువాదకుణ్ణి ఒకేసారి చూడగలుగుతారు. ఈ పద్ధతికి మిగతా సంఘ సభ్యులు త్వరగానే అలవాటు పడతారు, అది సంఘానికి ఎలాంటి ఆటంకం కాదని అనుభవాలు చూపించాయి. చిన్నా పెద్దా సమావేశాల్లో కూడా ఇదే పద్ధతిని పాటించవచ్చు. బధిరులు వాళ్లలో వారికి అర్థమయ్యేటట్లు ఎలా మాట్లాడుకుంటారో అంత సహజమైన సంజ్ఞా భాషలోకి కూటాలను అనువదించడానికి ఎంతో కృషి చేస్తున్న సంఘ సభ్యులు అభినందనీయులు.

ఒకవేళ మీ సంఘంతో సంజ్ఞా భాష గుంపు లేదా కొంతమంది బధిరులు సహవసిస్తుంటే వారిమీద మీకు శ్రద్ధ ఉందని చూపించడానికి మీరు ఏమి చేయవచ్చు? వారిని మీ ఇంటికి పిలవండి. సాధ్యమైతే ఓ నాలుగు సంజ్ఞలు నేర్చుకోండి. వారితో మాట్లాడగలమా అనే సందేహంతో వెనుకడుగు వేయవద్దు. ప్రయత్నిస్తే ఏదో రకంగా వారితో మాట్లాడగలరు. అలా మీరు ప్రేమ చూపించడానికి చేసిన ప్రయత్నాలు మధుర స్మృతుల్లా మిగిలిపోతాయి. (1 యోహా. 4:8) బధిరులైన మన తోటి సాక్షుల నుండి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. వాళ్లు చక్కగా మాట్లాడతారు, దేన్నైనా వెంటనే అర్థం చేసుకోగలుగుతారు, చాలా సరదాగా కూడా ఉంటారు. అమ్మానాన్నలు ఇద్దరూ బధిరులైన ఒక సహోదరుడు ఇలా అంటున్నాడు: “నా జీవితమంతా నేను బధిరుల మధ్యే గడిపాను. వాళ్లు నేనెప్పటికీ తిరిగి ఇవ్వలేనంత ఆనందాన్ని నాకు పంచి ఇచ్చారు. మన సహోదర సహోదరీల్లో ఉన్న బధిరుల నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు.”

యెహోవా ప్రేమించే నమ్మకస్థులైన ఆరాధికుల్లో బధిరులు కూడా ఉన్నారు. వారు చూపించే విశ్వాసం, ఓర్పు యెహోవా సంస్థకు తప్పకుండా మరింత కళను తీసుకొస్తాయి. కాబట్టి మన సహోదర సహోదరీల్లో బధిరులైన వారిని శ్రద్ధగా చూసుకుందాం!

[అధస్సూచి]

^ పేరా 3 కావలికోట ఆగస్టు 15, 2009లో వచ్చిన “యెహోవా తన ముఖకాంతిని వారిపై ప్రకాశింపజేశాడు” అనే ఆర్టికల్‌ చూడండి.

[31వ పేజీలోని చిత్రం]

రాజ్య సందేశాన్ని సంజ్ఞాభాషలో అందించినప్పుడు అది బధిరుడైన వ్యక్తికి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది

[32వ పేజీలోని చిత్రాలు]

బధిరులైన మన సహోదర సహోదరీలకు కూటాలు ఎడారిలోని నీటి చెలమలా ఆధ్యాత్మిక సేదదీర్పునివ్వాలి