కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంఘంలో మీ స్థానాన్ని విలువైనదిగా పరిగణించండి

సంఘంలో మీ స్థానాన్ని విలువైనదిగా పరిగణించండి

సంఘంలో మీ స్థానాన్ని విలువైనదిగా పరిగణించండి

“దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములో నుంచెను.” —1 కొరిం. 12:18.

1, 2. (ఎ) సంఘంలో ప్రతీ ఒక్కరికీ విలువైన స్థానం ఉంటుందని ఎలా చెప్పవచ్చు? (బి) ఈ ఆర్టికల్‌లో మనమే ప్రశ్నలు పరిశీలిస్తాం?

పూర్వం ఇశ్రాయేలు కాలం నుండి తన ప్రజలను ఆధ్యాత్మికంగా పోషించడానికి, నిర్దేశమివ్వడానికి దేవుడు ఓ సంఘ ఏర్పాటును ఉపయోగిస్తూ వచ్చాడు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు హాయి పట్టణాన్ని జయించిన తర్వాత, యెహోషువ సర్వసమాజము ఎదుట లేదా సంఘము ఎదుట “ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన వాటన్నిటినిబట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములనన్నిటిని, అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను.”—యెహో. 8:34, 35.

2 సా.శ. మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు, పెద్దగా సేవచేస్తున్న తిమోతికి క్రైస్తవ సంఘం ‘దేవుని మందిరమని’ అది “సత్యమునకు స్తంభమును, ఆధారమునై యున్నది” అని చెప్పాడు. (1 తిమో. 3:15) ప్రపంచవ్యాప్తంగావున్న నిజ క్రైస్తవ సహోదరత్వమే నేటి “దేవుని మందిరము.” దైవావేశంతో పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 12వ అధ్యాయంలో క్రైస్తవ సంఘాన్ని మానవ శరీరంతో పోల్చాడు. శరీరంలోని ప్రతీ అవయం వేర్వేరు పనులుచేసినా అవన్నీ అవసరమనీ, “దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో” ఉంచాడనీ ఆయన రాశాడు. అంతేకాక, “శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము” అని కూడా ఆయనన్నాడు. (1 కొరిం. 12:18, 23) కాబట్టి దేవుని సంఘంలోని యథార్థ క్రైస్తవుల్లో ఎవరూ ఒకరికన్నా ఒకరు ఎక్కువకాదు లేదా తక్కువ కాదు. వారుచేసే పనులు మాత్రమే వేర్వేరుగా ఉంటాయి. అలాగైతే దేవుని సంఘ ఏర్పాటులో మన స్థానమేమిటో తెలుసుకొని దానినెలా విలువైనదిగా పరిగణించవచ్చు? సంఘంలో మన స్థానంపై ఏయే విషయాలు ప్రభావం చూపించవచ్చు? మనమెలా మన ‘అభివృద్ధి అందరికి తేటగా కనిపించేలా’ చేయవచ్చు?—1 తిమో. 4:15.

మన స్థానానికి విలువ ఇస్తున్నామని ఎలా చూపిస్తాం?

3. సంఘంలో మన స్థానమేమిటో తెలుసుకొని దానిని విలువైనదిగా పరిగణిస్తున్నామని మొదటిగా మనమెలా చూపించవచ్చు?

3 సంఘంలో మన స్థానమేమిటో తెలుసుకొని దానిని విలువైనదిగా పరిగణిస్తున్నామని చూపించాలంటే మొదటిగా, మనం ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునితో’ ఆ దాసునికి ప్రాతినిథ్యం వహించే పరిపాలక సభతో పూర్తిగా సహకరించాలి. (మత్తయి 24:45-47 చదవండి.) దాసుని తరగతి ఇచ్చే నిర్దేశానికి మనం ఎంతవరకు లోబడుతున్నామో పరీక్షించుకోవాలి. ఉదాహరణకు, గడచిన సంవత్సరాల్లో మన దుస్తులు, కనబడే తీరు, వినోదం విషయంలో ఇంటర్నెట్‌ను ఉపయోగించే విషయంలో మనకు స్పష్టమైన నిర్దేశం లభించింది. ఆధ్యాత్మికంగా కాపాడబడేలా మనం వారిచ్చే మంచి ఉపదేశాన్ని జాగ్రత్తగా అనుసరిస్తున్నామా? క్రమంగా కుటుంబ ఆరాధన ఏర్పాటు చేసుకోమని ఇచ్చిన సలహా విషయమేమిటి? ఆ సలహాను పాటిస్తూ కుటుంబ ఆరాధన కోసం ఓ సాయంకాలాన్ని కేటాయిస్తున్నామా? అవివాహితులమైతే, వ్యక్తిగత బైబిలు అధ్యయనం కోసం సమయం తీసుకుంటున్నామా? దాసుని తరగతి ఇస్తున్న నిర్దేశాన్ని అనుసరిస్తే యెహోవా మనల్ని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఆశీర్వదిస్తాడు.

4. వ్యక్తిగత విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనమే విషయాల గురించి ఆలోచించాలి?

4 వినోదం, దుస్తులు, కనబడే తీరు వంటివి వ్యక్తిగత విషయాలని కొందరనవచ్చు. కానీ సంఘంలో తన స్థానాన్ని విలువైనదిగా పరిగణించే సమర్పిత క్రైస్తవుడు కేవలం తన ఇష్టాయిష్టాలను బట్టే నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా వాటి గురించి యెహోవా తన వాక్యమైన బైబిల్లో ఏమి చెప్పాడో చూడాలి. దానిలోని సందేశం ‘మన పాదాలకు దీపంగా, మన త్రోవకు వెలుగుగా’ ఉండాలి. (కీర్త. 119:105) అలాగే వ్యక్తిగత విషయాల్లో మనం తీసుకునే నిర్ణయాలు మన పరిచర్యపై, సంఘంపై బయట వ్యక్తులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కూడా ఆలోచించాలి.—2 కొరింథీయులు 6:3, 4 చదవండి.

5. మనకు నచ్చిందే చేయాలనుకునే స్వభావం విషయంలో మనమెందుకు జాగ్రత్తగా ఉండాలి?

5 “అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి” లేదా స్వభావం మనం పీల్చుకునే గాలిలా అన్నిచోట్లా వ్యాపించి ఉంది. (ఎఫె. 2:2) ఆ స్వభావాన్ని అలవర్చుకుంటే, యెహోవా సంస్థ ఇచ్చే నిర్దేశాన్ని పాటించాల్సిన అవసరం లేదనుకునే అవకాశముంది. మనం నిశ్చయంగా ‘అపొస్తలుడైన యోహాను చెబుతున్న దేనినీ అంగీకరించడానికి’ ఇష్టపడని దియొత్రెఫేలా ఉండాలనుకోం. (3 యోహా. 9, 10) మనకు నచ్చిందే చేయాలనుకునే స్వభావం అలవర్చుకోకూడదు. ఉపదేశమిచ్చేందుకు యెహోవా నేడు ఉపయోగిస్తున్న సంస్థను మాటల ద్వారా లేదా క్రియల ద్వారా ఎన్నటికీ ఎదిరించకుండా ఉందాం. (సంఖ్యా. 16:1-3) బదులుగా, దాసుని తరగతితో సహకరించేందుకు మనం మన ఆధిక్యతను విలువైనదిగా పరిగణించాలి. అలాగే మన సంఘంలో సారథ్యం వహిస్తున్నవారి మాటవిని వారికి లోబడివుండేందుకు కృషిచేయవద్దా?—హెబ్రీయులు 13:7, 17 చదవండి.

6. మన వ్యక్తిగత పరిస్థితులను మనమెందుకు పరిశీలించుకోవాలి?

6 సంఘంలో మన స్థానాన్ని విలువైనదిగా పరిగణిస్తున్నామని మరో విధంగా కూడా చూపించవచ్చు. మన వ్యక్తిగత పరిస్థితుల్ని జాగ్రత్తగా పరిశీలించుకుని మన ‘పరిచర్యను ఘనపర్చేందుకు’ శాయశక్తులా కృషిచేస్తూ యెహోవాను మహిమపర్చాలి. (రోమా. 11:13, 14) కొందరు క్రమ పయినీరు సేవ చేయగలుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరితరులు మిషనరీలుగా, ప్రయాణ పైవిచారణకర్తలుగా, బెతెల్‌ కుటుంబ సభ్యులుగా పూర్తికాల సేవచేస్తున్నారు. ఎందరో సహోదర సహోదరీలు రాజ్య మందిర నిర్మాణ పనుల్లో సహాయం చేస్తున్నారు. యెహోవా ప్రజల్లో చాలామంది తమ కుటుంబాల ఆధ్యాత్మిక అవసరాలను శ్రద్ధగా తీరుస్తూ, ప్రతీవారం పరిచర్యలో పూర్తిగా పాల్గొనేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నారు. (కొలొస్సయులు 3:23, 24 చదవండి.) దేవుని సేవ చేయడానికి ఇష్టపూర్వకంగా ముందుకొచ్చి శక్తివంచన లేకుండా ఆయన సేవ చేసినప్పుడు ఆయన సంఘ ఏర్పాటులో మనకొక స్థానముంటుందనే నమ్మకంతో ఉండవచ్చు.

సంఘంలో మన స్థానంపై ప్రభావం చూపించే విషయాలు

7. సంఘంలో మన స్థానంపై మన పరిస్థితులు ఎలా ప్రభావం చూపించవచ్చో వివరించండి.

7 మన పరిస్థితుల్ని పరిశీలించుకోవడం ప్రాముఖ్యం. ఎందుకంటే సంఘంలో మనం ఎంత చేయగలం అనేది కొంతవరకు వాటిపైనే ఆధారపడివుంటుంది. ఉదాహరణకు, సంఘంలో సహోదరులకు సహోదరీలకు ఒకే విధమైన బాధ్యతలు ఉండవు. యెహోవా సేవలో మనమెంత చేయగలం అనేది మన వయసు, ఆరోగ్యం, మరితర అంశాలనుబట్టి కూడా ఉంటుంది. “యౌవనస్థుల బలము వారికి అలంకారము తలనెరపు వృద్ధులకు సౌందర్యము” అని సామెతలు 20:29 చెబుతోంది. యౌవన బలాన్ని బట్టి యువతీయువకులు ఎక్కువ శరీర కష్టంచేస్తే, వృద్ధులు తమ జ్ఞానం, అనుభవాన్ని బట్టి సంఘానికెంతో ప్రయోజనం చేకూరుస్తారు. యెహోవా సంస్థలో మనమేది చేయగలిగినా అది దేవుని అపార కృపవల్లే చేయగలిగామని కూడా గుర్తుంచుకోవాలి.—అపొ. 14:26; రోమా. 12:6-8.

8. సంఘంలో మనం చేసే సేవపై కోరికలు ఎంతమేర ప్రభావం చూపిస్తాయి?

8 సంఘంలో మన స్థానంపై ప్రభావం చూపించే మరో విషయాన్ని ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఉదాహరణ నొక్కిచెబుతోంది. ఇద్దరూ ఉన్నత విద్య పూర్తిచేశారు. వారిద్దరి పరిస్థితులూ ఒకేలా ఉన్నాయి. చదువు పూర్తయిన తర్వాత క్రమ పయినీరు సేవకు అర్హులయ్యేలా వారిని ప్రోత్సహించేందుకు వారి తల్లిదండ్రులు చేయగలిగినంతా చేశారు. చదువు పూర్తయిన తర్వాత, ఒకరు పయినీరు సేవ చేపట్టారు, మరొకరు ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు. ఎందుకు వారిద్దరు తలోదారి ఎంచుకున్నారు? ఎందుకంటే వారిద్దరు ఎవరు కోరుకుంది వారు చేశారు. మనలో చాలామందిమి అలాగే చేస్తున్నాం కదా? దేవుని సేవలో మనమేమి చేయడానికి ఇష్టపడుతున్నామో మనఃపూర్వకంగా ఆలోచించాలి. అవసరమైతే మన పరిస్థితుల్లో సర్దుబాటు చేసుకొని దేవుని సేవలో మనం మరింత చేయగల అవకాశముందేమో ఆలోచించుకోవాలి.—2 కొరిం. 9:7.

9, 10. యెహోవా సేవలో ఎక్కువ చేయాలనే కోరిక లోపిస్తే మనమేమి చేయాలి?

9 యెహోవా సేవ ఎక్కువ చేయాలనే కోరిక లోపించి సంఘంలో ఏదో నామమాత్రంగా సేవ చేస్తుంటే అప్పుడేమిటి? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు ఇలా రాశాడు: “మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.” అవును, యెహోవా మనలో కార్యసిద్ధి కలిగించి మనం ఇష్టపడేలా లేదా కోరుకునేలా పురికొల్పగలడు.—ఫిలి. 2:13; 4:13.

10 కాబట్టి, తన చిత్తం చేయాలని కోరుకునేలా పురికొల్పమని మనం యెహోవాను ప్రార్థించవద్దా? పూర్వకాలంలో ఇశ్రాయేలు రాజైన దావీదు అదే చేశాడు. “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను” అని ఆయన ప్రార్థించాడు. (కీర్త. 25:4, 5) తన ఇష్టాన్ని చేయాలని కోరుకునేలా పురికొల్పమని మనం కూడా దావీదులాగే ప్రార్థించవచ్చు. యెహోవా ఆయన కుమారుడు ఇష్టపడేది మనం చేస్తే వారికి ఎలా అనిపిస్తుందో ఆలోచించినప్పుడు, మన హృదయాలు కృతజ్ఞతతో నిండిపోతాయి. (మత్త. 26:6-10; లూకా 21:1-4) ఆ కృతజ్ఞతా భావం మనలో ఉన్నప్పుడు, యెహోవా సేవ మరింతగా చేయాలని కోరుకునేలా పురికొల్పమని ఆయనను యాచిస్తాం. మనం ఎలాంటి స్వభావం అలవర్చుకోవాలో యెషయా ప్రవక్తను చూసి నేర్చుకోవచ్చు. “నేను ఎవని పంపుదును? మా నిమిత్తము ఎవడు పోవును?” అని యెహోవా అడిగినప్పుడు, ఆ ప్రవక్త “నేనున్నాను నన్ను పంపు” అని జవాబిచ్చాడు.—యెష. 6:8.

ఎలా అభివృద్ధి సాధించాలి?

11. (ఎ) సంస్థలో సహోదరులు ఎలాంటి అర్హతలు సంపాదించుకోవాల్సిన అవసరత ఉంది? (బి) ఒక సహోదరుడు సేవాధిక్యలు చేపట్టేందుకు ఎలా అర్హుడవ్వగలడు?

11 ప్రపంచవ్యాప్తంగా 2008వ సేవా సంవత్సరంలో 2,89,678 మంది బాప్తిస్మం తీసుకోవడాన్ని గమినిస్తే, సారథ్యం వహించాల్సిన సహోదరుల అవసరం ఎంతో ఉందని తెలుస్తూనే ఉంది. ఈ అవసరం తీర్చడానికి తనవంతు సహాయం చేయాలంటే ఒక సహోదరుడు ఏమి చేయాలి? ఒక్కమాటలో చెప్పాలంటే, లేఖనాల్లో పరిచర్య సేవకుల కోసం, పెద్దల కోసం పేర్కొనబడిన అర్హతలు సంపాదించుకునేందుకు కృషిచేయాలి. (1 తిమో. 3:1-10, 12, 13; తీతు 1:5-9) ఒక సహోదరుడు అలాంటి అర్హతలను ఎలా సంపాదించుకోవచ్చు? పరిచర్యలో చురుకుగా పాల్గొనడం ద్వారా, సంఘ నియామకాలను శ్రద్ధగా నిర్వహించడం ద్వారా, క్రైస్తవ కూటాల్లో అర్థవంతంగా వ్యాఖ్యానించేందుకు కృషిచేయడం ద్వారా, తోటి విశ్వాసులపట్ల వ్యక్తిగత ఆసక్తి కనబరచడం ద్వారా సంపాదించవచ్చు. ఆయన సంఘంలో తన స్థానాన్ని విలువైనదిగా పరిగణిస్తున్నాడని అది చూపిస్తుంది.

12. యౌవనులు సత్యంపట్ల తమ ఉత్సాహాన్ని ఎలా కనబర్చవచ్చు?

12 సంఘంలో అభివృద్ధి సాధించేందుకు యౌవన సహోదరులు, ముఖ్యంగా టీనేజీలో ఉన్నవారు ఏమి చేయవచ్చు? బైబిలు పరిజ్ఞానం సంపాదించుకుంటూ వారు ‘సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమునుగలవారిగా,’ ఎదిగేందుకు ప్రయత్నించాలి. (కొలొ. 1:9) వారలా ఎదగాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయాలి, సంఘ కూటాల్లో చురుగ్గా పాల్గొనాలి. అలాగే వారు వివిధ రకాల పూర్తికాల సేవలో ‘ఫలవంతమైన కార్యాలు చెయ్యడానికి ఉన్న గొప్ప అవకాశం’ ఉపయోగించుకునేందుకు అర్హులవడం ద్వారా కూడా వారు అభివృద్ధి సాధించవచ్చు. (1 కొరిం. 16:9, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) యెహోవా సేవలో ముందుకు సాగిపోవడం సంతృప్తికరమైన జీవితాన్నివ్వడమే కాక, మెండైన ఆశీర్వాదాలనూ తీసుకొస్తుంది.—ప్రసంగి 12:1, 2 చదవండి.

13, 14. సహోదరీలు ఏయే విధాలుగా సంఘంలో తమ స్థానాన్ని విలువైనదిగా పరిగణిస్తున్నట్లు చూపించగలరు?

13కీర్తన 68:11 నెరవేర్పులో వ్యక్తిగతంగా పాల్గొనడం ద్వారా సహోదరీలు కూడా తమ ఆధిక్యతను విలువైనదిగా పరిగణిస్తున్నారని చూపించవచ్చు. మనమక్కడ ఇలా చదువుతాం: “ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని [సువార్తను] ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు.” శిష్యులను చేసే పనిలో భాగం వహించడం ద్వారా కూడా సంఘంలో తమ స్థానాన్ని విలువైనదిగా పరిగణిస్తున్నారని సహోదరీలు చూపించగలరు. (మత్త. 28:19, 20) కాబట్టి, పరిచర్యలో పూర్తిగా భాగంవహిస్తూ, ఆ పనికోసం ఇష్టపూర్వకంగా త్యాగాలు చేయడం ద్వారా సహోదరీలు సంఘంలో తమ స్థానాన్ని విలువైనదిగా పరిగణిస్తున్నారని చూపిస్తారు.

14 తీతుకు రాసిన పత్రికలో పౌలు ఇలా అన్నాడు: “వృద్ధస్త్రీలు . . . ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెననియు, దేవునివాక్యము దూషింపబడకుండునట్లు, యౌవనస్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని బుద్ధిచెప్పుచు, మంచి ఉపదేశము చేయువారునై యుండవలెను.” (తీతు 2:3-5) సంఘంలో పరిణతిగల సహోదరీలు ఉండడం ఎంత మేలు చేస్తుంది! సంఘంలో సారథ్యం వహిస్తున్న సహోదరులను గౌరవిస్తూ, దుస్తులు, కనబడే తీరు, వినోదం వంటి విషయాల్లో చక్కని నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నప్పుడు వారు ఇతరులకు మంచి మాదిరి ఉంచడమే కాక, సంఘంలో తమ స్థానాన్ని విలువైనదిగా పరిగణిస్తున్నవారిగా కూడా ఉంటారు.

15. ఒంటరితనాన్ని ఎదుర్కొనేందుకు ఒక సహోదరి ఏమిచేయవచ్చు?

15 అప్పుడప్పుడు, అవివాహిత సహోదరికి సంఘంలో తన స్థానమేమిటో తెలుసుకోవడం కష్టంగా అనిపించవచ్చు. ఈ పరిస్థితిని ఎదుర్కొన్న ఓ సహోదరి ఇలా అంటోంది: “అవివాహితులు కొన్నిసార్లు ఒంటరితనంతో బాధపడతారు.” మరి ఆ పరిస్థితిని తానెలా ఎదుర్కొంటోందని అడిగినప్పుడు ఆమె ఇలా జవాబిచ్చింది: “ప్రార్థన, అధ్యయనం సంఘంలో నా స్థానాన్ని తిరిగి గుర్తించేందుకు సహాయం చేసింది. యెహోవా నన్నెలా దృష్టిస్తున్నాడో శ్రద్ధగా పరిశీలించి, సంఘంలోని ఇతరులకు సహాయకారిగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఇలా చేయడంవల్ల నేను నా గురించి కాక ఇతరుల గురించి ఆలోచించగలుగుతాను.” కీర్తన 32:8 చెబుతున్నట్లుగా యెహోవా దావీదుతో ఇలా అన్నాడు: “నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను.” యెహోవా ఒంటరిగావున్న సహోదరీలతోసహా తన సేవకులందరి విషయంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని, వారందరూ సంఘంలో తమ స్థానాన్ని విలువైనదిగా పరిగణించేందుకు సహాయం చేస్తాడు.

మీ స్థానంలో పదిలంగా ఉండండి!

16, 17. (ఎ) తన సంస్థలో భాగస్థులుగా ఉండమని యెహోవా ఇచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించడం మనం తీసుకున్న నిర్ణయాల్లో అత్యుత్తమమైనదని ఎందుకు చెప్పవచ్చు? (బి) యెహోవా సంస్థలో మనమెలా మన స్థానంలో పదిలంగా ఉండవచ్చు?

16 తనతో మంచి సంబంధం కలిగివుండేలా యెహోవా తన సేవకులందరినీ ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు. “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు” అని యేసు చెప్పాడు. (యోహా. 6:44) భూమ్మీదున్న కోట్లాదిమందిలో మనల్ని మాత్రమే నేటి తన సంఘంలో భాగస్థులుగా ఉండమని యెహోవా వ్యక్తిగతంగా ఆహ్వానించాడు. ఈ ఆహ్వానాన్ని అంగీకరించడం మనం తీసుకున్న నిర్ణయాల్లో అత్యుత్తమమైనది. అది మన జీవితాలకు ఓ సంకల్పాన్నిచ్చింది. సంఘంలో మనకు ఓ స్థానం ఉన్నందున మనమెంత సంతృప్తిని, ఆనందాన్ని అనుభవిస్తున్నాం!

17 “యెహోవా, నీ నివాసమందిరమును . . . నేను ప్రేమించుచున్నాను,” “సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో యెహోవాను స్తుతించెదను” అని కీర్తనకర్త పాడాడు. (కీర్త. 26:8, 12) సత్యదేవుడు మనలో ప్రతీ ఒక్కరికి తన సంస్థలో ఓ స్థానమిచ్చాడు. దైవపరిపాలనా నిర్దేశాన్ని అనుసరిస్తూ, దేవుని సేవలో నిమగ్నమై ఉండడం ద్వారా యెహోవా సంఘ ఏర్పాటులోని మన విలువైన స్థానంలో పదిలంగా ఉంటాం.

మీకు గుర్తున్నాయా?

• సంఘంలో క్రైస్తవులందరికి ఒక స్థానం ఉంటుందని ఎందుకు చెప్పవచ్చు?

• దేవుని సంస్థలో మన స్థానం విలువైనదిగా పరిగణిస్తున్నట్లు ఎలా చూపించవచ్చు?

• సంఘంలో మన స్థానాన్ని ఏవి ప్రభావితం చేయగలవు?

• దేవుని సంఘంలో తమ స్థానం విలువైనదిగా పరిగణిస్తున్నట్లు క్రైస్తవ యౌవనులు, పెద్దవారు ఎలా చూపించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[16వ పేజీలోని చిత్రాలు]

సంఘంలో బాధ్యతలు చేపట్టేలా సహోదరులు ఎలా అర్హత సంపాదించుకోవచ్చు?

[17వ పేజీలోని చిత్రం]

సంఘంలో తమ స్థానాన్ని విలువైనదిగా పరిగణిస్తున్నారని సహోదరీలు ఎలా చూపించవచ్చు