కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సహోదర ప్రేమను అధికం చేసుకుంటూ ఉండండి

సహోదర ప్రేమను అధికం చేసుకుంటూ ఉండండి

సహోదర ప్రేమను అధికం చేసుకుంటూ ఉండండి

‘క్రీస్తు మిమ్మును ప్రేమించినట్లే, మీరునూ ప్రేమకలిగి నడుచుకోండి.’—ఎఫె. 5:2.

1. తన శిష్యుల్లో ప్రముఖంగా ఏ లక్షణం కనబడుతుందని యేసు చెప్పాడు?

యెహోవాసాక్షులకు దేవుని రాజ్య సువార్తను ఇంటింటా ప్రకటిస్తారనే ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే, క్రీస్తుయేసు తన నిజ శిష్యులను గుర్తించే మరో విషయం గురించి మాట్లాడుతూ ఇలా చెప్పాడు: “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.”—యోహా. 13:34, 35.

2, 3. క్రైస్తవ కూటాలకు హాజరయ్యేవారిపై మన సహోదర ప్రేమ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

2 నిజ క్రైస్తవ సహోదరుల్లో కనిపించే ప్రేమను మానవ సమాజంలో మరెక్కడా చూడలేము. అయస్కాంతం ఇనుమును ఆకర్షించినట్లే, ప్రేమ యెహోవా సేవకులు ఒక్కతాటిపై నడిచేందుకే కాక, మంచి మనసున్నవారు సత్యారాధన వైపు ఆకర్షించబడేందుకూ దోహదపడుతుంది. ఉదాహరణకు, కామెరూన్‌ దేశంలో నివసించే మార్సిలీనో విషయమే తీసుకోండి. ఉద్యోగ స్థలంలో జరిగిన ఓ ప్రమాదంలో ఆయన కంటిచూపు పోయింది. ప్రమాదం జరిగిన తర్వాత, ఆయన మంత్రగాడు కాబట్టే చూపు పోయిందనే పుకారు పుట్టింది. ఆయనను ఓదార్చే బదులు ఆయన చర్చి పాస్టరు, ఇతరులు ఆయనను వాళ్ల సంఘం నుండి వెలివేశారు. ఆ తర్వాత యెహోవాసాక్షి ఒకరు మార్సిలీనోను తమ కూటానికి రమ్మని ఆహ్వానించినప్పుడు ఆయన తటపటాయించాడు. ఇక్కడివాళ్లు కూడా తనను చేర్చుకోరేమో అని భయపడ్డాడు.

3 కానీ మార్సిలీనో రాజ్యమందిరానికి వచ్చినప్పుడు అక్కడి పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాడు. అందరూ ఆయనను సాదరంగా ఆహ్వానించారు, పైగా అక్కడ విన్న బైబిలు విషయాలను బట్టి ఎంతో ఓదార్పు పొందాడు. ఆయన సంఘ కూటాలన్నిటికీ హాజరవడం మొదలుపెట్టి, క్రమంగా బైబిలు అధ్యయనం చేసి, 2006లో బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయనిప్పుడు తన కుటుంబ సభ్యులతో, పొరుగువారితో సత్యాన్ని పంచుకుంటూ అనేక బైబిలు అధ్యయనాలు ఆరంభించాడు. తనతో బైబిలు అధ్యయనం చేస్తున్నవారు కూడా తనలాగే దేవుని ప్రజల ప్రేమను చవిచూడాలని మార్సిలీనో కోరుకుంటున్నాడు.

4. “ప్రేమగలిగి నడుచుకొనుడి” అని పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని మనమెందుకు అనుసరించాలి?

4 అందరికీ నచ్చే ఇలాంటి సహోదర ప్రేమను కాపాడుకునేందుకు మనవంతు మనం కృషిచేయాలి. ఉదాహరణకు, ఒంటికి వెచ్చదనమిచ్చే చలిమంట గురించి ఆలోచించండి. దాని వెచ్చదనాన్ని ఆస్వాదించేవారు ఆ మంటలో పుల్లలు వేస్తుండకపోతే అది ఆరిపోతుంది. అదేవిధంగా, సంఘంలో కనిపించే అద్భుతమైన ప్రేమను క్రైస్తవులముగా మనలో ప్రతీ ఒక్కరం బలపర్చకపోతే అది బలహీనపడిపోతుంది. మరి ఆ ప్రేమను మనమెలా బలపర్చవచ్చు? దానికి అపొస్తలుడైన పౌలు ఇలా జవాబిస్తున్నాడు: “క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.” (ఎఫె. 5:2) కాబట్టి మనం వ్యక్తిగతంగా ‘నేను ఏయే విధాలుగా ప్రేమకలిగి నడవాలి?’ అని ప్రశ్నించుకోవాలి.

“మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి”

5, 6. తమ ‘హృదయాలు విశాలపర్చుకోవాలని’ పౌలు కొరింథు క్రైస్తవులను ఎందుకు వేడుకున్నాడు?

5 కొరింథులోని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “ఓ కొరింథీయులారా, అరమర లేకుండ మీతో మాటలాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడియున్నది. మీ యెడల మా అంతఃకరణము సంకుచితమై యుండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై యున్నది. మీయెడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి; మీరు నా పిల్లలని మీతో ఈలాగు చెప్పుచున్నాను.” (2 కొరిం. 6:11-13) తమ హృదయాలను విశాలపర్చుకోవాలని ఆ క్రైస్తవులను పౌలు ఎందుకు వేడుకున్నాడు?

6 పూర్వకాలంలో కొరింథు సంఘం ఎలా మొదలైందో పరిశీలించండి. పౌలు సా.శ. 50 చివర్లో కొరింథుకు వెళ్లాడు. ఆరంభంలో అక్కడ ప్రకటనా పనికి వ్యతిరేకత ఎదురైనా ఆ అపొస్తలుడు వెనుకంజవేయలేదు. అనతికాలంలోనే ఆ నగరంలో చాలామంది సువార్తను అంగీకరించారు. పౌలు “సంవత్సరము మీద ఆరునెలలు” తననుతాను వ్యయపర్చుకొని బోధిస్తూ ఆ కొత్త సంఘాన్ని బలపర్చాడు. ఆయన కొరింథు క్రైస్తవులను ఎంతో ప్రేమించాడు. (అపొ. 18:5, 6, 9-11) అందువల్ల వారు కూడా తిరిగి ఆయనను ప్రేమించి గౌరవించాలి. కానీ సంఘంలోని కొందరు ఆయనను ఇష్టపడలేదు. ఆయన సూటిగా ఇచ్చిన సలహా బహుశా వారికి నచ్చకపోయి ఉండవచ్చు. (1 కొరిం. 5:1-5; 6:1-10) మరి కొందరు ‘మిక్కిలి శ్రేష్ఠులైన అపొస్తలులు’ చెప్పిన చాడీలు నమ్మి ఉండవచ్చు. (2 కొరిం. 11:5, 6) అయితే పౌలు సహోదర సహోదరీలందరూ తనపట్ల కల్మషంలేని ప్రేమను చూపించాలని కోరుకున్నాడు. కాబట్టి వారు, తనకూ తోటి విశ్వాసులైన ఇతరులకూ సన్నిహితమవడం ద్వారా తమ ‘హృదయాలను విశాలపర్చుకోవాలని’ వేడుకున్నాడు.

7. సహోదర ప్రేమను కనబర్చడంలో మనమెలా మన ‘హృదయాలను విశాలపర్చుకోవచ్చు’?

7 మరి మన విషయమేమిటి? సహోదర ప్రేమను కనబర్చడంలో మనమెలా మన ‘హృదయాలను విశాలపర్చుకోవచ్చు’? ఒకే వయసులో ఉన్నవారు లేదా ఒకే జాతి నుండి వచ్చినవారు సహజంగానే పరస్పరం సహోదర ప్రేమతో మెలిగే అవకాశముంది. వినోదం విషయంలో ఒకే అభిరుచిగలవారు తరచూ కలిసి ఎక్కువ సమయం గడుపుతారు. అయితే మనలాంటి ఇష్టాయిష్టాలు కొందరు క్రైస్తవులకు ఉండకపోవచ్చు. అలాంటివారితో సన్నిహితంగా మెలగలేకపోతుంటే, మనం మన ‘హృదయాలను విశాలపర్చుకోవాలి.’ మనమిలా ప్రశ్నించుకోవాలి: ‘నేను, పరిచర్యలో లేదా ఇతర కార్యక్రమాల్లో నా సన్నిహిత స్నేహితులు కాని సహోదర సహోదరీలతో అరుదుగా పాల్గొంటున్నానా? సమయం గడిచేకొద్దీ వారే వచ్చి నా స్నేహాన్ని సంపాదించుకోవాలని అనుకుంటూ రాజ్య మందిరానికి వస్తున్న కొత్తవారితో అంటీముట్టనట్టుగా ఉంటున్నానా? చిన్నాపెద్దా అనే తేడా లేకుండా సంఘంలో అందరినీ పలకరిస్తున్నానా?’

8, 9. మన సహోదర ప్రేమను అధికం చేసుకునేలా ఒకరినొకరు పలకరించుకోవడానికి రోమీయులు 15:7లో పౌలు ఇచ్చిన సలహా మనకెలా సహాయం చేస్తుంది?

8 ఒకరినొకరు పలకరించుకునే విషయంలో రోములోని క్రైస్తవులకు పౌలు చెప్పిన మాటలు తోటి ఆరాధకుల పట్ల సరైన స్వభావాన్ని అలవర్చుకునేందుకు మనకు సహాయం చేస్తాయి. (రోమీయులు 15:7 చదవండి.) అక్కడ “చేర్చుకొనుడి” అని అనువదించబడిన గ్రీకు పదానికి “అప్యాయంగా లేదా ప్రేమగా పలకరించడం, తమ సమాజంలోకి లేదా స్నేహితుల్లోకి ఆహ్వానించడం” అనే అర్థంవుంది. మొదటి శతాబ్దంలో ఆతిథ్యమిచ్చే వ్యక్తి తన స్నేహితుల్ని ఇంటిలోకి ఆహ్వానించేటప్పుడు, వారిని కలుసుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పేవాడు. క్రీస్తు కూడా మనల్ని ఆ విధంగానే క్రైస్తవ సంఘంలోకి చేర్చుకున్నాడు, కాబట్టి మనం కూడా ఆయనలాగే తోటి ఆరాధకులను చేర్చుకోవాలని చెప్పబడింది.

9 రాజ్యమందిరంలో, ఇతర ప్రదేశాల్లో మన సహోదరులను పలకరించేటప్పుడు, మనం ఈ మధ్య కలవని లేదా మాట్లాడని వారెవరైనా ఉన్నారో గమనించి వారి దగ్గరకెళ్లి పలకరించవచ్చు. వారితో కాసేపు ఎందుకు మాట్లాడకూడదు? తర్వాతి కూటంలో ఈ విధంగానే మరి కొంతమందిని పలకరించవచ్చు. అనతికాలంలోనే, మన సహోదర సహోదరీలందరిని కలిసి సంతోషంగా మాట్లాడగలుగుతాం. ఒకేరోజు అందరినీ పలకరించలేకపోయినా దాని గురించి బాధపడనక్కర్లేదు. ప్రతీ కూటంలో మనం పలకరించలేకపోయినా దానికెవరూ బాధపడకూడదు.

10. సంఘంలో అందరికీ ఏ అమూల్య అవకాశం ఉంది? మనం దానినెలా పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు?

10 ఇతరులను చేర్చుకోవాలంటే ముందుగా వారిని పలకరించాలి. అలా పలకరించడం ఆ తర్వాత సంతోషంగా మాట్లాడుకోవడానికి, చిరకాల స్నేహానికి దారితీస్తుంది. ఉదాహరణకు, చిన్నాపెద్దా సమావేశాలకు హాజరయ్యేవారు ఇతరులను పరిచయం చేసుకొని మాట్లాడడం ఆరంభిస్తే, వారిని తిరిగి కలుసుకోవాలని ఎదురుచూస్తారు. రాజ్యమందిర నిర్మాణంచేసే స్వచ్ఛంద సేవకులు, అలాగే సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేవారు తమ అనుభవాలను పంచుకుంటూ ఒకరి మంచి లక్షణాలను మరొకరు తెలుసుకోగలుగుతారు కాబట్టి వారు తరచూ మంచి స్నేహితులౌతారు. చిరకాల స్నేహితుల్ని సంపాదించుకునే అవకాశాలు యెహోవా సంస్థలో కోకొల్లలు! మనం మన ‘హృదయాలను విశాలపర్చుకుంటే’ మన స్నేహితుల పరిధి పెరిగి, సత్యారాధనలో మనల్ని ఐక్యంగావుంచే ప్రేమ ప్రగాఢమౌతుంది.

ఇతరులకు అందుబాటులో ఉండండి

11. మార్కు 10:13-16 వివరిస్తున్నట్లుగా యేసు ఎలాంటి మాదిరివుంచాడు?

11 క్రైస్తవులందరూ యేసులాగే అందరికీ అందుబాటులో ఉండేందుకు ప్రయత్నించవచ్చు. యేసు దగ్గరకు తమ పిల్లలను తీసుకొస్తున్న తల్లిదండ్రులను నివారించడానికి శిష్యులు ప్రయత్నించినప్పుడు, ఆయన ఏమన్నాడో చూడండి. “చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు; దేవునిరాజ్యము ఈలాటివారిదే” అని చెప్పి, “ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.” (మార్కు 10:13-16) గొప్ప బోధకుడు తమపై చూపించిన ఆ ప్రేమను బట్టి ఆ పిల్లలెంత మురిసిపోయుంటారో ఒక్కసారి ఆలోచించండి!

12. ఇతరులతో మాట్లాడకుండా ఏది మనల్ని అడ్డగించవచ్చు?

12 ప్రతీ క్రైస్తవుడు ఇలా ప్రశ్నించుకోవాలి, ‘నేను ఇతరులకు అందుబాటులో ఉంటున్నానా, లేక ఎప్పుడూ ఏదోక పనిలో మునిగివున్నట్లు కనిపిస్తున్నానా?’ కొన్ని అలవాట్లు హానికరం కాకపోయినా, అవి కొన్నిసార్లు మన సంభాషణకు అడ్డుపడొచ్చు. ఉదాహరణకు, ఇతరుల మధ్య ఉన్నప్పుడు మనం తరచూ సెల్‌ఫోన్లో మాట్లాడుతుంటే లేదా ఇయర్‌ఫోన్లు తగిలించుకుని ఏదోకటి వింటుంటే, వారి మధ్య ఉండడం మనకిష్టం లేదని చెప్పినట్లౌతుంది. నిజమే కొన్నిసార్లు మనం ‘మౌనంగా ఉండాల్సిన’ సమయం ఉంటుందనుకోండి. కానీ మనం ఇతరుల మధ్య ఉన్నప్పుడు మాత్రం అది ‘మాట్లాడాల్సిన సమయం.’ (ప్రసం. 3:7) “ఎక్కువగా మాట్లాడడం నాకిష్టముండదు” లేదా “కొన్నిసమయాల్లో నాకు ఎవరితోనూ మాట్లాడాలనిపించదు” అని కొందరనవచ్చు. కానీ మనకు ఇష్టం లేకపోయినా ఇతరులతో స్నేహపూర్వకంగా మాట్లాడ్డం ‘స్వప్రయోజనం విచారించుకొనని’ ప్రేమకు రుజువుగా ఉంటుంది.—1 కొరిం. 13:5.

13. క్రైస్తవ సహోదరులను, సహోదరీలను ఎలా చూడాలని పౌలు తిమోతిని ప్రోత్సహించాడు?

13 సంఘ సభ్యులందరిని గౌరవించాలని యువ తిమోతిని పౌలు ప్రోత్సహించాడు. (1 తిమోతి 5:1, 2 చదవండి.) మనం కూడా వృద్ధ క్రైస్తవులను మన తల్లిదండ్రుల్లా, యౌవనుల్ని తోబుట్టువుల్లా చూడాలి. మనకలాంటి స్వభావముంటే, మన ప్రియ సహోదర సహోదరీలు ఎవరూ మనల్ని పరాయివాళ్లలా చూడరు.

14. ఇతరులతో ప్రోత్సాహకరంగా మాట్లాడడంవల్ల వచ్చే కొన్ని ప్రయోజనాలు ఏమిటి?

14 ఇతరులతో మనం ప్రోత్సాహకరంగా మాట్లాడితే, వారి ఆధ్యాత్మికతకు, వారి మానసిక సంక్షేమానికి దోహదపడినవారిగా ఉంటాం. బ్రాంచి కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సహోదరుడు తాను బెతెల్‌కు వచ్చిన కొత్తలో అప్పటికే అక్కడ సేవ చేస్తున్న చాలామంది పెద్దవారు సమయం తీసుకొని తనతో మాట్లాడడాన్ని జ్ఞాపకం చేసుకుంటే సంతోషం కలుగుతుందని చెబుతున్నాడు. వారి ప్రోత్సాహకరమైన మాటలు బెతెల్‌ కుటుంబం తననెంతో ప్రేమిస్తున్నట్లు ఆయన భావించేలా చేశాయి. ఇప్పుడాయన వారిలాగే తోటి బెతెల్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు.

వినయం సమాధానపడేందుకు దోహదపడుతుంది

15. మనలో కూడా అభిప్రాయభేదాలు వస్తాయని ఏది చూపిస్తుంది?

15 పూర్వం ఫిలిప్పీ సంఘంలోవున్న యువొదియ, సుంటుకే అనే ఇద్దరు క్రైస్తవ సహోదరీలు తమ మధ్యవున్న సమస్యను పరిష్కరించుకోలేక ఇబ్బందిపడ్డారు. (ఫిలి. 4:2, 3) పౌలు, బర్నబాలు తీవ్రంగా వాదించుకోవడం అందిరికీ తెలిసిపోవడంతో వారిద్దరూ కొంతకాలంపాటు కలిసి సేవ చేయలేదు. (అపొ. 15:37-39) సత్యారాధకుల్లో కూడా కొన్నిసార్లు అభిప్రాయభేదాలు వస్తాయని ఈ ఉదాహరణలు చూపిస్తున్నాయి. సమస్యల్ని పరిష్కరించుకొని తిరిగి స్నేహితులయ్యేందుకు యెహోవా మనకు సహాయం చేస్తాడు. అయితే మనం కూడా ఏదో చేయాలని ఆయన కోరుతున్నాడు.

16, 17. (ఎ) ఇద్దరి మధ్యగల సమస్యల్ని పరిష్కరించుకోవడానికి వినయం ఎందుకు అవసరం? (బి) యాకోబు ఏశావును సమీపించిన తీరు వినయం ఎంతో విలువైనదని ఎలా చూపిస్తుంది?

16 మీరూ మీ స్నేహితుడూ కలిసి కారులో బయలుదేరుతున్నారని ఊహించుకోండి. మీ ప్రయాణం ఆరంభించడానికి ముందు తాళం తిప్పి కారు స్టార్టు చేయాలి. అలాగే అభిప్రాయభేదాలను పరిష్కరించుకోవడానికి కూడా ఒక తాళం అవసరం. ఆ తాళమే వినయం. (యాకోబు 4:10 చదవండి.) క్రింది బైబిలు ఉదాహరణ చూపిస్తున్నట్లుగా, విభేదాలున్నా బైబిలు సూత్రాలను పాటించడం మొదలుపెట్టడానికి ఆ తాళం సహాయం చేస్తుంది.

17 ఏశావు తన తోబుట్టువైన యాకోబుకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుని అప్పటికి ఇరవై సంవత్సరాలైంది. ఆయన యాకోబును చంపాలనుకున్నాడు. అన్ని సంవత్సరాల తర్వాత ఆ కవలలు మళ్లీ కలుసుకోబోతున్నారు, అప్పుడు “యాకోబు మిక్కిలి భయపడి తొందరపడ్డాడు” లేదా ఆందోళనచెందాడు. ఏశావు తప్పకుండా తనపై దాడిచేస్తాడని ఆయననుకున్నాడు. అయితే వారు కలుసుకున్నప్పుడు ఏశావు ఊహించని ఓ మంచి పనిని యాకోబు చేశాడు. ఆయన తన సహోదరుని సమీపిస్తుండగా “నేలను సాగిలపడ్డాడు.” ఆ తర్వాత ఏమి జరిగింది? “ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడమీద పడి ముద్దుపెట్టుకొనెను; వారిద్దరు కన్నీరు విడిచిరి.” యుద్ధ ప్రమాదం తప్పింది. యాకోబు చూపించిన వినయం ఏశావు పెంచుకున్న ద్వేషాన్ని పూర్తిగా మటుమాయం చేసింది.—ఆది. 27:41; 32:3-8; 33:3, 4.

18, 19. (ఎ) వివాదం ఏర్పడినప్పుడు బైబిలు సలహాను అనుసరించడానికి మనమే ఎందుకు చొరవతీసుకోవాలి? (బి) అవతలి వ్యక్తి మొదట్లో సానుకూలంగా స్పందించకపోయినా మనమెందుకు ఆశలు వదులుకోకూడదు?

18 వివాదాలను పరిష్కరించుకునే విషయంలో బైబిల్లో చక్కని సలహాలున్నాయి (మత్త. 5:23, 24; 18:15-17; ఎఫె. 4:26, 27) * అయితే ఆ సలహాలను మనం వినయంతో పాటించకపోతే సమాధానపడడం కష్టం. మనం కూడా వినయం చూపించే అవకాశమున్నప్పుడు, అవతలి వ్యక్తే వినయం చూపించాలని వేచిచూస్తే సమస్య పరిష్కారమవ్వదు.

19 సమాధానపడేందుకు మనంచేసే తొలి ప్రయత్నాలు ఏ కారణంవల్లనైనా సఫలం కానంతమాత్రాన మనం ఆశలు వదులుకోకూడదు. తన వైఖరిలో మార్పు తెచ్చుకునేందుకు అవతలి వ్యక్తికి సమయం పట్టవచ్చు. యోసేపు సహోదరులు ఆయనపట్ల దారుణంగా ప్రవర్తించారు. అనేక సంవత్సరాల తర్వాత వారు, యోసేపు ఐగుప్తులో ప్రధాన అధికారిగా ఉన్నప్పుడు ఆయనను కలుసుకున్నారు. అయితే వారిప్పుడు మనసు మార్చుకుని ఆయనను క్షమించమని బ్రతిమిలాడారు. యోసేపు వారిని క్షమించాడు, అందువల్ల యాకోబు కుమారులు యెహోవా నామం ధరించే ఆధిక్యతగల గొప్ప జనాంగమయ్యారు. (ఆది. 50:15-21) మన సహోదర సహోదరీలతో సమాధానంగా ఉన్నప్పుడు మనం సంఘం ఐక్యంగా, ఆనందంగా ఉండేందుకు దోహదపడతాం.—కొలొస్సయులు 3:12-14 చదవండి.

“క్రియతోను సత్యముతోను” ప్రేమిద్దాం

20, 21. యేసు తన అపొస్తలుల కాళ్లు కడగడం నుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు?

20 చనిపోవడానికి ముందురాత్రి యేసు తన అపొస్తలులతో, “నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని” అని అన్నాడు. (యోహా. 13:13-17) ఆయన అప్పుడే ఆ 12 మంది కాళ్లు కడిగాడు. యేసు ఏదో ఆచారం చొప్పున లేదా దయ చూపించడానికి అన్నట్లు అలా కడగలేదు. ఆయన కాళ్లు కడిగిన విషయాన్ని చెప్పడానికి ముందు యోహాను ఇలా రాశాడు: ‘యేసు లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను.’ (యోహా. 13:1) శిష్యులపట్ల యేసుకు ప్రేమవుంది కాబట్టే ఆయన ఒక దాసుడు చేసేపని చేయడానికైనా వెనకాడలేదు. ఇప్పుడు ఆ అపొస్తలులు వినయంతో ఒకరిపట్ల ఒకరికి ప్రేమవుందని చూపించే పనులు చేయాలి. మన క్రైస్తవ సహోదర సహోదరీలందరి పట్ల శ్రద్ధాసక్తులు కనబర్చేలా నిజమైన ప్రేమ మనల్ని పురికొల్పాలి.

21 దేవుని కుమారుడు తన కాళ్లు ఎందుకు కడిగాడో అర్థం చేసుకున్న అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు: “నిష్కపటమైన సహోదరప్రేమ కలుగునట్లు, మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి.” (1 పేతు. 1:22) ప్రభువు ఎవరి కాళ్లు కూడా కడిగాడో ఆ అపొస్తలుడైన యోహాను ఇలా అన్నాడు: “చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.” (1 యోహా. 3:18) కాబట్టి, మన సహోదరులపట్ల మన ప్రేమను క్రియల్లో చూపిద్దాం.

[అధస్సూచి]

^ పేరా 18 యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం పుస్తకంలో 144-150 పేజీలు చూడండి.

మీకు గుర్తున్నాయా?

• ఒకరినొకరు ప్రేమించే విషయంలో ఏయే విధాలుగా మన ‘హృదయాలను విశాలపర్చుకోవచ్చు’?

• ఇతరులకు అందుబాటులో ఉండేందుకు మనకేది సహాయం చేస్తుంది?

• సమాధానపడేందుకు వినయం ఎందుకు ప్రాముఖ్యం?

• తోటి విశ్వాసుల పట్ల శ్రద్ధ చూపించేలా మనల్నేది పురికొల్పుతుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[21వ పేజీలోని చిత్రం]

తోటి విశ్వాసులను ఆప్యాయంగా చేర్చుకోండి

[23వ పేజీలోని చిత్రం]

ఇతరులకు అందుబాటులోవుండే అవకాశాలు చేజార్చుకోకండి