కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కష్టకాలాల్లో సంతోషాన్ని కాపాడుకోండి

కష్టకాలాల్లో సంతోషాన్ని కాపాడుకోండి

కష్టకాలాల్లో సంతోషాన్ని కాపాడుకోండి

“నిన్ను [యెహోవాను] ఆశ్రయించువారందరు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు.”—కీర్త. 5:11.

1, 2. (ఎ) ఎంతో మనోవేదన కలిగించే కొన్ని విషయాలేమిటి? (బి) సామాన్యంగా మానవులకు వచ్చే కష్టాలతోపాటు, నిజక్రైస్తవులు దేన్ని కూడ సహించాలి?

యెహోవాసాక్షులు కూడ ఇతరుల్లాగే కష్ట పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. చాలామంది దేవుని సేవకులు నేరాలకు, యుద్ధాలకు బలయ్యారు, అన్యాయాలను ఎదుర్కొన్నారు. ప్రకృతి విపత్తులు, పేదరికం, అనారోగ్యం, మరణం వంటివి ఎంతో మనోవేదనను కలిగిస్తాయి. అందుకే అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నదని యెరుగుదుము.” (రోమా. 8:22) అంతేకాక, మనం అపరిపూర్ణులం. దావీదు రాజుకు అనిపించినట్లే మనకూ అనిపించవచ్చు. ఆయన ఇలా అన్నాడు: “నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడియున్నవి.”—కీర్త. 38:4.

2 సామాన్యంగా మానవులకు వచ్చే కష్టాలతోపాటు, నిజక్రైస్తవులు హింసాకొయ్యను కూడ మోస్తారు. (లూకా 14:27) అవును యేసులా, ఆయన శిష్యులు కూడ ద్వేషించబడి, హింసించబడతారు. (మత్త. 10:22, 23; యోహా. 15:20; 16:2) కాబట్టి, మనం క్రీస్తును అనుసరించాలంటే నూతనలోకంలో మనం అనుభవించే ఆశీర్వాదాల కోసం ఇప్పుడు ఎదురుచూస్తూ ఎంతో ప్రయాసపడాలి, శ్రమలను సహించాలి.—మత్త. 7:13, 14; లూకా 13:24.

3. దేవుణ్ణి సంతోషపెట్టేందుకు నిజ క్రైస్తవులు జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిన అవసరంలేదని మనకెలా తెలుసు?

3 నిజక్రైస్తవులు ఆనందం, సంతోషంలేని జీవితాన్ని గడపాలని దానర్థమా? అంతం వచ్చేంతవరకు మనం కష్టాలతో సతమతమౌతూనే ఉండాలా? మనం తన వాగ్దానాల నెరవేర్పు కోసం ఎదురుచూస్తూ సంతోషంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. సత్యారాధకులు సంతోషంగల ప్రజలని బైబిల్లో ఎన్నోసార్లు చెప్పబడింది. (యెషయా 65:13, 14 చదవండి.) “నిన్ను [యెహోవాను] ఆశ్రయించువారందరు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు” అని కీర్తనలు 5:11 చెబుతోంది. కష్టాలున్నా, ఉన్నవాటితో ఎంతో సంతోషంగా, సంతృప్తిగా, మనశ్శాంతితో ఉండడం సాధ్యమే. పరీక్షలు ఎదురైనా సంతోషంగా ఉండేందుకు బైబిలు మనకు ఎలా సహాయం చేస్తుందో మనమిప్పుడు చూద్దాం.

యెహోవాసంతోషంగల దేవుడు

4. తన అధికారాన్ని ధిక్కరించినప్పుడు దేవునికి ఎలా అనిపిస్తుంది?

4 యెహోవా ఉదాహరణే తీసుకోండి. ఆయన విశ్వసర్వాధిపతి. ఆయనకు ఏదీ కొదువలేదు. ఆయనకు ఎవరి అవసరంలేదు. అయితే, యెహోవాకు సాటిలేని శక్తివున్నా ఆయన ఆత్మ కుమారుడు ఒకడు తిరుగుబాటు చేసి సాతానుగా మారినప్పుడు ఆయన నిరాశపడివుంటాడు. ఆ తర్వాత ఇతర దేవదూతలు ఆ తిరుగుబాటులో సాతానుతో చేయికలిపినప్పుడు ఆయన ఎంతో నొచ్చుకొని ఉంటాడు. తన భౌతిక సృష్టిలో మానవులను ఆయన ఎంతో ప్రత్యేకమైన విధంగా సృష్టించాడు. అయితే వారే తనమీద తిరుగుబాటు చేసినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడో ఒక్కసారి ఊహించుకోండి! అప్పటినుండి, వారి సంతానంలోని లక్షలాదిమంది యెహోవా అధికారాన్ని ధిక్కరిస్తూనే ఉన్నారు.—రోమా. 3:23.

5. యెహోవాకు ఏది ఎక్కువగా మనోవేదన కలిగించింది?

5 సాతాను ఇప్పటికీ తిరుగుబాటు చేస్తున్నాడు. దాదాపు 6,000 సంవత్సరాలుగా, మానవులు చేస్తున్న విగ్రహారాధనను, హింసను, హత్యను, లైంగిక విచ్చలవిడితనాన్ని యెహోవా చూస్తున్నాడు. (ఆది. 6:5, 6, 11, 12) ప్రజలు పచ్చి అబద్ధాలు చెప్పడాన్ని, తనను దూషించడాన్ని కూడ ఆయన విన్నాడు. కొన్నిసార్లు ఆయన సత్యారాధకులే ఆయన మనసు నొప్పించారు. అలాంటి ఓ సందర్భాన్ని బైబిలు ఇలా వివరిస్తోంది: “అరణ్యమున వారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగబడిరి. ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి. మాటిమాటికి వారు దేవుని శోధించిరి. మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి.” (కీర్త. 78:40, 41) తన ప్రజలు ఆయనను తిరస్కరించినప్పుడు ఆయన పడే బాధ ఇంతా అంతా కాదు. (యిర్మీ. 3:1-10) చెడు జరిగినప్పుడు యెహోవా ఎంతో బాధపడతాడని దీన్నిబట్టి అర్థమౌతుంది.—యెషయా 63:9, 10 చదవండి.

6. మనోవేదన కలిగించే పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుడు ఏమి చేస్తాడు?

6 అయినా బాధనుబట్టి, నిరాశనుబట్టి యెహోవా డీలాపడిపోలేదు. సమస్యలు తలెత్తినప్పుడు, దానివల్ల వచ్చే చెడు పర్యవసానాలను తగ్గించేందుకు వెంటనే చర్యలు తీసుకున్నాడు. చివరకు తాను అనుకున్నది నెరవేర్చేందుకు ఆయన దీర్ఘకాలిక చర్యలు కూడ తీసుకున్నాడు. అలాంటి సరైన చర్యలు తీసుకున్నాడు కాబట్టే, ఆయన తన సర్వాధిపత్యం సరైనదని నిరూపించబడే, యథార్థవంతులైన తన ఆరాధకులు ఆశీర్వాదాలు పొందే సమయం కోసం ఆనందంగా ఎదురుచూస్తున్నాడు. (కీర్త. 104:31) తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా, యెహోవా ‘సంతోషంగల దేవునిగానే’ ఉన్నాడు.—1 తిమో. 1:11, NW; కీర్త. 16:11.

7, 8. సమస్యలు ఎదురైనప్పుడు మనం యెహోవాను ఎలా అనుకరించవచ్చు?

7 సమస్యలు పరిష్కరించే విషయంలో మనకూ యెహోవాకూ పోలికలేదనుకోండి. అయినా కష్టాలు ఎదురైనప్పుడు మనం యెహోవాను అనుకరించవచ్చు. కష్టపరిస్థితులు ఎదురైనప్పుడు మనం కొంత నిరుత్సాహపడడం సహజమే. అయితే మనం ఆ నిరుత్సాహంలోనే ఉండిపోవాల్సిన అవసరంలేదు. మనం యెహోవా పోలికలో సృష్టించబడ్డాం కాబట్టి, మన సమస్యల గురించి ఆలోచించి, పరిస్థితికి తగ్గట్టు సరైన చర్య తీసుకునేందుకు కావాల్సిన ఆలోచనా సామర్థ్యం, జ్ఞానం మనకున్నాయి.

8 కొన్ని విషయాలు మన చేతుల్లో లేవు అనే ప్రాముఖ్యమైన సత్యాన్ని మనసులో ఉంచుకుంటే జీవిత సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. వాటి గురించి బాధపడుతూ కూర్చుంటే చికాకు పెరగవచ్చు. దాంతో సత్యారాధనలో పాల్గొనడంవల్ల వచ్చే సంతోషాన్ని మనం దూరం చేసుకునే అవకాశముంది. సమస్య పరిష్కరించుకోవడానికి చేయగలిగినదంతా చేసిన తర్వాత మనకు మేలు చేకూర్చే పనులమీద మనసు నిలపడం మంచిది. ఇప్పుడు మనం చూడబోయే బైబిలు ఉదాహరణలు దాన్ని రుజువుచేస్తాయి.

పరిస్థితిని అర్థంచేసుకొని వ్యవహరించడం ప్రాముఖ్యం

9. హన్నా తన పరిస్థితిని అర్థం చేసుకొని ఎలా వ్యవహరించింది?

9 సమూయేలు ప్రవక్తకు తల్లి అయిన హన్నా ఉదాహరణ తీసుకోండి. సమూయేలు పుట్టకముందు ఆమె చాలాకాలం గొడ్రాలిగా ఉంది. ఆ కారణంగా ఎంతో కృంగిపోయింది. గొడ్రాలిగా ఉన్నందుకు ఆమెను ఇతరులు అపహసించారు. కొన్నిసార్లు హన్నా ఎంతగా బాధపడేదంటే ఆమె ఏడుస్తూ, భోజనం కూడ చేసేదికాదు. (1 సమూ. 1:2-7) హన్నా యెహోవా మందిరానికి వెళ్లిన ఓ సందర్భంలో ఆమె, ‘బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థనచేయుచు బహుగా ఏడ్చెను.’ (1 సమూ. 1:10) హన్నా యెహోవాకు తన ఆవేదనంతా తెలియజేసిన తర్వాత, ప్రధాన యాజకుడైన ఏలీ ఆమె దగ్గరికి వచ్చి, “నీవు క్షేమముగా వెళ్లుము; ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక” అని అన్నాడు. (1 సమూ. 1:17) ఆ సమయంలో, హన్నా తాను చేయగలిగినదంతా చేశానని గ్రహించేవుంటుంది. తన గొడ్రాలితనం విషయంలో ఆమె చేయగలిగింది ఏమీ లేదు. హన్నా తన పరిస్థితిని అర్థంచేసుకుంది. ఆ తర్వాత ఆమె “తన దారిని వెళ్లిపోయి భోజనము చేయుచు నాటనుండి దుఃఖముఖిగా నుండుట మానెను.”—1 సమూ. 1:18.

10. పరిష్కరించుకోలేని సమస్య ఎదురైనప్పుడు పౌలు, పరిస్థితిని అర్థం చేసుకొని ఎలా ప్రవర్తించాడు?

10 కష్టాలు వచ్చినప్పుడు అపొస్తలుడైన పౌలు కూడ అలాగే ప్రవర్తించాడు. ఎంతో వేదనకరమైన ఓ బాధను ఆయన అనుభవించాడు. ఆయన ఆ బాధను “శరీరములో ఒక ముల్లు” అని పిలిచాడు. (2 కొరిం. 12:7) ఆ బాధ ఎలాంటిదో మనకు తెలియదు కానీ దాన్ని తొలగించుకోవడానికి చేయగలిగినదంతా చేస్తూ ఉపశమనం కోసం యెహోవాకు ప్రార్థించాడు. పౌలు దాని విషయంలో యెహోవాను ఎన్నిసార్లు వేడుకున్నాడు? మూడుసార్లు. మూడోసారి వేడుకున్నప్పుడు, ‘శరీరములో ముల్లు’ అద్భుతంగా తొలగించబడదని దేవుడు పౌలుకు తెలియజేశాడు. ఆ వాస్తవాన్ని అర్థం చేసుకొని ఆయన యెహోవాను సంపూర్ణంగా సేవించేందుకు కృషిచేశాడు.—2 కొరింథీయులు 12:8-10 చదవండి.

11. ప్రార్థనా విజ్ఞాపనలు చేయడం ద్వారా మనం సమస్యలను ఎలా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం?

11 మనకు మనోవేదన కలిగించే సమస్యల గురించి ప్రార్థించకూడదని దానర్థంకాదు. (కీర్త. 86:7) అయితే, దేవుని వాక్యం మనల్ని ఇలా వేడుకుంటోంది: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.” అలాంటి ప్రార్థన విజ్ఞాపనలకు యెహోవా ఎలా జవాబిస్తాడు? తర్వాతి వచనం ఇలా చెబుతుంది: “అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” (ఫిలి. 4:6, 7) యెహోవా మన సమస్యను తీసివేయకపోవచ్చు కానీ మన తలంపులకు కావలిగా ఉండడం ద్వారా ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడు. మనం ఒకానొక విషయం గురించి ప్రార్థించిన తర్వాత మన మనసు ప్రశాంతంగా మారుతుంది, బాగా దిగులుపడడం వల్ల వచ్చే ప్రమాదాలేంటో కూడా గ్రహిస్తాం.

దేవుని చిత్తం చేయడంలో సంతోషించండి

12. చాలాకాలంపాటు నిరుత్సాహంతో ఉంటే నష్టం జరుగుతుందని ఎందుకు చెప్పవచ్చు?

12సామెతలు 24:10 ఇలా చెబుతోంది: “శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు.” మరో సామెత ఇలా చెబుతోంది: “మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును.” (సామె. 15:13) కొందరు క్రైస్తవులు ఎంతగా నిరుత్సాహపడ్డారంటే వారు తమ వ్యక్తిగత బైబిలు పఠనాన్ని, ధ్యానించడాన్ని మానేశారు. వారి ప్రార్థనలు యాంత్రికమైపోయాయి. అలా కొంతకాలానికి వారు తోటి ఆరాధకులనుండి దూరమయ్యే అవకాశముంది. బాధల్లో మునిగిపోవడం వల్ల నష్టమే జరుగుతుందని దీన్నిబట్టి స్పష్టమౌతుంది.—సామె. 18:1, 14.

13. మన నిరుత్సాహాన్ని తొలగించి మనకు కొంతమేరకు ఆనందాన్నిచ్చే కొన్ని విషయాలేమిటి?

13 అదే సమయంలో, సానుకూలంగా ఆలోచిస్తే మన జీవితంలో సంతోషాన్నిచ్చేవాటి మీద మనసు నిలుపగలుగుతాం. దావీదు ఇలా రాశాడు: “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము.” (కీర్త. 40:8) కష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు మనం క్రమం తప్పకుండా యెహోవాను ఆరాధించాలి. దుఃఖాన్ని అధిగమించాలంటే మనం క్రమంగా సంతోషాన్నిచ్చే ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనాలి. తన వాక్యాన్ని చదివి, దాన్ని క్రమంగా తేరిచూడడం ద్వారా లేదా పరిశోధించడం ద్వారా మనం సంతోషాన్ని, ఆనందాన్ని సొంతం చేసుకుంటామని యెహోవా ఉపదేశించాడు. (కీర్త. 1:1, 2; యాకో. 1:25) పరిశుద్ధ లేఖనాలను చదవడం ద్వారా, క్రైస్తవ కూటాలకు హాజరవడం ద్వారా మనల్ని ప్రోత్సహించే, మనసును ఉల్లాసపరిచే ‘ఇంపైన మాటలను’ ఆస్వాదించగలుగుతాం.—సామె. 12:25; 16:24.

14. యెహోవా ఇచ్చిన ఏ వాగ్దానం మనకు ఇప్పుడు సంతోషాన్నిస్తుంది?

14 దేవుని అనుగ్రహం వల్ల మనం సంతోషంగా ఉండేందుకు ఎన్నో కారణాలున్నాయి. ఆయన వాగ్దానం చేసిన రక్షణ మనకు ఎంతో సంతోషాన్నిస్తుంది. (కీర్త. 13:5) మనం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తనను మనస్ఫూర్తిగా వెదికేవారిని చివరకు యెహోవా ఆశీర్వదిస్తాడని తెలుసు. (ప్రసంగి 8:12 చదవండి.) హబక్కూకు ప్రవక్త అలాంటి నమ్మకాన్నే కనబరుస్తూ ఇలా రాశాడు: “అంజూరపుచెట్లు పూయకుండినను ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను ఒలీవచెట్లు కాపులేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను.”—హబ. 3:17, 18.

“యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు”

15, 16. భవిష్యత్తులో దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాల కోసం ఎదురుచూస్తూ ఇప్పుడు మనం ఆస్వాదించగల కొన్ని వరాలేమిటి?

15 మన కోసం తాను వాగ్దానం చేసిన అద్భుతమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తూ తాను మనకు అనుగ్రహిస్తున్న మంచివాటిని ఆస్వాదించాలని యెహోవా కోరుకుంటున్నాడు. బైబిలు ఇలా చెబుతోంది: “మనుషులు సంతోషంగా ఉండి, బ్రతికినంతవరకూ మేలు చేస్తూ ఉండాలి. మనుషులకు ఇంతకంటే క్షేమకరమైనది మరొకటి లేదని నాకు తెలుసు. అంతే గాక, ఒక వ్యక్తి అన్నపానాలు పుచ్చుకొంటూ, తన ప్రయాసమంతట్లో తృప్తిపడితే అది దేవుని బహుమానమే.” (ప్రసం. 3:12, 13, పవిత్ర గ్రంథము, వ్యాఖ్యాన సహితం) “మేలు చేస్తూ” ఉండాలంటే మనం ఇతరులకు మంచి చేస్తూ ఉండాలి. తీసుకోవడంకన్నా ఇవ్వడంలోనే ఎంతో ఆనందం ఉందని యేసు చెప్పాడు. మన భాగస్వాములకు, పిల్లలకు, తల్లిదండ్రులకు, బంధువులకు దయతో సహాయం చేయడంవల్ల మనం ఎంతో సంతృప్తిని పొందుతాం. (సామె. 3:27) సౌమ్యంగా ప్రవర్తిస్తూ మన సహోదర సహోదరీలకు ఆతిథ్యాన్నివ్వడం వల్ల, వారిని క్షమించడం వల్ల మనం ఎంతో ఆనందాన్ని పొందుతాం. అది చూసి యెహోవా కూడా సంతోషిస్తాడు. (గల. 6:10; కొలొ. 3:12-14; 1 పేతు. 4:8, 9) త్యాగాలు చేయడానికి సంసిద్ధత కనబరుస్తూ మన పరిచర్యను చేయడంవల్ల ఎన్నో ఆశీర్వాదాలు పొందుతాం.

16 తినడం, తాగడం వంటి చిన్నచిన్న సంతోషాల గురించి ప్రసంగి పుస్తకంలోని పై మాటలు చెబుతున్నాయి. పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు కూడ దేవుడు మనకు ఇప్పటికే అనుగ్రహించినవాటిలో ఆనందాన్ని పొందవచ్చు. అంతేకాక, చూడచక్కని సూర్యాస్తమయం, రమణీయమైన ప్రకృతిదృశ్యాలు, జంతు పిల్లల చిలిపిచేష్టలతోపాటు ప్రకృతిలోని ఇతర అద్భుతాలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తి, సంతోషాన్నిస్తాయి. అయితే, వాటిని ఆస్వాదించడానికి మనం వెలకట్టనవసరంలేదు. అలాంటి వరాలన్నీ యెహోవాయే అనుగ్రహిస్తాడు కాబట్టి, మనం వాటి గురించి ఆలోచిస్తే యెహోవా పట్ల మనకున్న ప్రేమ పెరుగుతుంది.

17. ఏమి చేయడం ద్వారా కష్టాల నుండి పూర్తి విముక్తి పొందుతాం? అప్పటివరకు మనకు ఏది ఊరటనిస్తుంది?

17 చివరగా, దేవునిపట్ల ప్రేమ కనబరుస్తూ, ఆయన ఆజ్ఞలకు లోబడుతూ, విమోచన క్రయధనం పట్ల విశ్వాసముంచడం ద్వారా భవిష్యత్తులో, అపరిపూర్ణత వల్ల ఎదురయ్యే సమస్యల నుండి విముక్తి పొంది నిత్యమూ ఆనందంగా ఉంటాం. (1 యోహా. 5:3) అప్పటివరకు, మన కష్టాల గురించి యెహోవాకు బాగా తెలుసనే విషయం మనకు ఊరటనిస్తుంది. దావీదు ఇలా రాశాడు: “నీవు నా బాధను దృష్టించి యున్నావు నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి యున్నావు కావున నీ కృపనుబట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను.” (కీర్త. 31:7) మనపట్ల ప్రేమతో, యెహోవా మనల్ని కష్టాల నుండి రక్షిస్తాడు.—కీర్త. 34:19.

18. దేవుని ప్రజలు ఎందుకు చాలా సంతోషంగా ఉండాలి?

18 యెహోవా వాగ్దానాల నెరవేర్పు కోసం ఎదురుచూస్తూ సంతోషంగల దేవుడైన యెహోవాను అనుకరిద్దాం. ప్రతికూల ఆలోచనలనుబట్టి మనం ఆధ్యాత్మికంగా డీలాపడిపోకుండా ఉందాం. సమస్యలు తలెత్తినప్పుడు ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ, పరిస్థితికి తగినట్లు వ్యవహరిద్దాం. మన భావోద్వేగాలు అదుపులో ఉంచుకొని, కష్టపరిస్థితులవల్ల వచ్చే చెడు పర్యవసానాలను తగ్గించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకునేలా యెహోవా మనకు సహాయం చేస్తాడు. ఆయన మనకు అనుగ్రహించే భౌతిక, ఆధ్యాత్మిక వరాలన్నిటిలో ఆనందం పొందుదాం. “యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు” కాబట్టి దేవునికి సన్నిహితంగా ఉంటే సంతోషంగా ఉండగలుగుతాం.—కీర్త. 144:15.

మీరేమి నేర్చుకున్నారు?

• కష్టాలొచ్చినప్పుడు మనం యెహోవాను ఎలా అనుకరించవచ్చు?

• పరిస్థితిని అర్థం చేసుకొని వ్యవహరించడం వల్ల మనం కష్టాలను ఎలా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం?

• కష్టాల్లో ఉన్నప్పుడు, దేవుని చిత్తం చేయడంలో మనం ఎలా ఆనందాన్ని పొందుతాం?

[అధ్యయన ప్రశ్నలు]

[16వ పేజీలోని చిత్రాలు]

లోకంలో జరుగుతున్న చెడును చూసి యెహోవా ఎంతో బాధపడుతున్నాడు

[క్రెడిట్‌ లైను]

© G.M.B. Akash/Panos Pictures

[18వ పేజీలోని చిత్రాలు]

మనం నిత్యమూ సంతోషంగా ఉండడానికి యెహోవా ఎన్నో వరాలిచ్చాడు