కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బిగ్‌ రెడ్‌ ద్వీపానికి చేరిన బైబిలు

బిగ్‌ రెడ్‌ ద్వీపానికి చేరిన బైబిలు

బిగ్‌ రెడ్‌ ద్వీపానికి చేరిన బైబిలు

అఫ్రికా ఆగ్నేయ తీర ప్రాంతానికి దాదాపు 400 కి.మీ. దూరంలో మడగాస్కర్‌ అనే ద్వీపం ఉంది. అది ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ద్వీపం. మలగాసీ ప్రజలకు ఎంతోకాలంగా యెహోవా నామం తెలుసు. ఎందుకంటే దేవుని పేరున్న మలగాసీ బైబిలు అనువాదాలు దాదాపు 170 సంవత్సరాలుగా వారికి అందుబాటులో ఉన్నాయి. నిర్విరామ కృషి, అంకిత భావం ఉండడంవల్ల మలగాసీ బైబిలు అనువాదం వెలుగులోకి వచ్చింది.

ఆ దేశానికి సమీపానవున్న మారిషస్‌ ద్వీపంలో మలగాసీ బైబిలు అనువదించడానికి తొలి ప్రయత్నం జరిగింది. 1813లోనే, బ్రిటన్‌ దేశం మారిషస్‌ ద్వీపానికి గవర్నర్‌గా నియమించిన సర్‌ రాబర్ట్‌ ఫార్క్‌వర్‌ మలగాసీ భాషలోకి సువార్త పుస్తకాలు అనువదించబడేందుకు చర్యలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన, లండన్‌ మిషనరీ సొసైటీ (ఎల్‌యమ్‌ఎస్‌) నుండి అధ్యాపకులను బిగ్‌ రెడ్‌ ద్వీపానికి ఆహ్వానించమని మడగాస్కర్‌ రాజైన మొదటి రాడామాను ప్రోత్సహించాడు. మడగాస్కర్‌ ద్వీపాన్ని బిగ్‌ రెడ్‌ ద్వీపం అని పిలుస్తారు.

1818, ఆగస్టు 18న వేల్స్‌ ప్రాంతవాసులైన డేవిడ్‌ జోన్స్‌, థామస్‌ బెవన్‌ అనే మిషనరీలు మారిషస్‌ ద్వీపం నుండి తోమసీన రేవు పట్టణానికి వచ్చారు. అక్కడ వారు మతాభిమానంగల ప్రజల్ని చూశారు. పూర్వీకుల ఆరాధన, ఆచారాలు అక్కడ సర్వసాధారణం. మలగాసీ ప్రజలు హావభావాలతో మాట్లాడతారు, అది ఎంతో వినసొంపుగా ఉంటుంది. ఆ భాష ప్రాథమికంగా మల్లయోపాలనీషన్‌ భాష నుండి పుట్టుకొచ్చింది.

అక్కడ ఓ చిన్న పాఠశాల స్థాపించిన తర్వాత జోన్స్‌, బెవన్‌లు తమ భార్యాపిల్లల్ని మారిషస్‌ నుండి తోమసీన నగరానికి తీసుకొచ్చారు. విచారకరంగా, వారందరికీ మలేరియా సోకింది. దాంతో 1818 డిసెంబరులో జోన్స్‌ భార్య, వాళ్ల పాప చనిపోయారు. రెండు నెలల తర్వాత ఆ మలేరియా వ్యాధే బెవన్‌ను, ఆయన కుటుంబాన్ని పొట్టనబెట్టుకుంది. ఆఖరికి, డేవిడ్‌ జోన్స్‌ ఒక్కడే బ్రతికి బయటపడ్డాడు.

జోన్స్‌ ఆ విషాదం వల్ల నిరుత్సాహపడలేదు. మడగాస్కర్‌వాసులకు దేవుని వాక్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న కృతనిశ్చయాన్ని చూపించాడు. ఆరోగ్యం కుదుటపడేందుకు ఆయన మారిషస్‌కు తిరిగి వెళ్లిన తర్వాత మలగాసీ భాషను నేర్చుకునే కష్టమైన పనిని చేపట్టాడు. ఆ తర్వాత కొంతకాలానికే, ఆయన యోహాను సువార్తకు సంబంధించిన ప్రాథమిక అనువాదాన్ని మొదలుపెట్టాడు.

1820, అక్టోబరులో జోన్స్‌ మళ్లీ మడగాస్కర్‌కు వచ్చాడు. రాజధాని పట్టణమైన అంటనానారివోలో అడుగుపెట్టి అక్కడ ఒక కొత్త మిషనరీ పాఠశాలను స్థాపించాడు. కానీ, పరిస్థితులు మాత్రం అధ్వాన్నంగా ఉండేవి. పుస్తకాలు, బ్లాక్‌బోర్డులు, బెంచీలు వంటి కనీస సదుపాయాలు కూడా లేవు. కానీ బోధించడానికి ఎంపికచేయబడిన పాఠాలు మాత్రం చాలా బాగుండేవి. పిల్లలు కూడా నేర్చుకోవడానికి ఉత్సాహం చూపించేవారు.

జోన్స్‌ దాదాపు ఏడు నెలలపాటు ఒంటరిగా పనిచేసిన తర్వాత, బెవన్‌ స్థానంలో డేవిడ్‌ గ్రిఫత్స్‌ అనే కొత్త మిషనరీ వచ్చాడు. వీరిద్దరూ మలగాసీ భాషలోకి బైబిలును అనువదించడానికి అంకితభావంతో నిర్విరామంగా కృషిచేశారు.

బైబిలు అనువాదం మొదలైంది

1820ల తొలిభాగంలో మలగాసీ భాషను కేవలం అరబిక్‌ లిపిలోనే రాసేవారు. ఆ లిపిని సురభి అని పిలిచేవారు. కేవలం కొద్దిమంది మాత్రమే దాన్ని చదవగలిగేవారు. అయితే, ఈ మిషనరీలు వెళ్లి మడగాస్కర్‌ రాజైన మొదటి రాడామాను కలిసి సమస్యను వివరించినప్పుడు, సురభి స్థానంలో రోమన్‌ లిపిలో మలగాసీ భాషను రాసేందుకు రాజు అనుమతినిచ్చాడు.

1823, సెప్టెంబరు 10న అనువాదపు పని మొదలైంది. జోన్స్‌ ఆదికాండము, మత్తయి సువార్తను అనువదిస్తే, గ్రిఫత్స్‌ ఏమో నిర్గమకాండము, లూకా సువార్తను అనువదించడం మొదలుపెట్టాడు. వీరిద్దరూ నిర్విరామంగా కృషిచేశారు. ఒకవైపు అనువాదపు పనిలో ఒంటరిగా పనిచేస్తూనే, ఉదయం, సాయంకాలం పాఠశాలలో పాఠాలు చెప్పేవారు. అంతేకాదు, మూడు భాషల్లో చర్చి సేవల కోసం సిద్ధపడి వాటిని నిర్వహించేవారు. అయితే, మిగతా పనులకన్నా బైబిలు అనువాదానికే ప్రాధాన్యతనిచ్చారు.

వీరిద్దరు 12 మంది విద్యార్థుల సహాయంతో, గ్రీకు లేఖనాలను, హెబ్రీ లేఖనాల్లోని చాలా పుస్తకాలను కేవలం 18 నెలల్లోనే అనువదించడం పూర్తిచేశారు. ఆ తర్వాతి సంవత్సరంలోనే బైబిలు ప్రాథమిక అనువాదం పూర్తైపోయింది. కానీ, అనువాదానికి ఇంకా కొన్ని మెరుగులుదిద్దాల్సివుంది కాబట్టి, వీరికి సహాయం చేయడానికి డేవిడ్‌ జాన్స్‌, జోసెఫ్‌ ఫ్రీమన్‌ అనే ఇద్దరు భాషా ప్రవీణులను ఇంగ్లాండు నుంచి పంపించారు.

ప్రతికూల పరిస్థితుల్లో కూడా వెనుకడుగువేయలేదు

మలగాసీ భాషా బైబిలు అనువాదం పూర్తైన తర్వాత, లండన్‌ మిషనరీ సొసైటీ మడగాస్కర్‌లో మొదటి ముద్రణా యంత్రాన్ని స్థాపించేందుకు చార్ల్స్‌ హావన్‌డన్‌ అనే వ్యక్తిని పంపించింది. ఆయన 1826, నవంబరు 21న వచ్చాడు. అయితే, నెల తిరిగేలోపే ఆయనకు మలేరియా సోకి మరణించాడు. దాంతో, ఆ యంత్రాన్ని నడిపించేవారు ఎవ్వరూ లేకపోయారు. ఆ తర్వాతి సంవత్సరంలో స్కాట్‌ల్యాండ్‌ నుండి వచ్చిన నైపుణ్యంగల పనివాడైన జేమ్స్‌ కామ్రన్‌ యంత్రాల మధ్య పడివున్న పుస్తకం సహాయంతో కిందామీదాపడి చివరికి ఆ యంత్రాన్ని అమర్చాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత 1827, డిసెంబరు 4న కామ్రన్‌ ఆదికాండము మొదటి అధ్యాయంలోని కొంతభాగాన్ని ముద్రించగలిగాడు. *

అయితే 1828, జూలై 27న మొదటి రాడామా రాజు చనిపోయినప్పుడు అనువాదపు పనికి మరో ఎదురుదెబ్బ తగిలింది. అప్పటివరకు ఆ రాజు అనువాదపు పనికి ఎంతో సహాయం చేశాడు. ఆ సంఘటన జరిగినప్పుడు డేవిడ్‌ జోన్స్‌ ఇలా చెప్పాడు: “మొదటి రాడామా రాజు మృదుస్వభావి, స్నేహశీలి. ఆయన విద్యను ప్రోత్సహించాడు. నాగరికత గురించి ప్రజలకు బోధించడం వెండిబంగారాలకన్నా విలువైనదని ఆయన అనుకున్నాడు.” రాజు మరణించిన తర్వాత, ఆయన భార్య రనవలోనా అధికారంలోకి వచ్చింది. ఆమె తన భర్తలా అనువాదపు పనికి మద్దతివ్వదని కొంతకాలానికే అర్థమైపోయింది.

రాణి సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత, ఇంగ్లాండు నుండి వచ్చిన ఓ వ్యక్తి, అనువాదపు పని గురించి రాణితో మాట్లాడడానికి అనుమతి కోరాడు. కానీ, ఆయనకు అనుమతి లభించలేదు. మరో సందర్భంలో, ప్రజలకు గ్రీకు, హెబ్రీతో సహా ఇంకా ఎంతో నేర్పించాల్సివుందని మిషనరీలు రాణిని కోరినప్పుడు ఆమె ఇలా అంది: “గ్రీకు, హెబ్రీ గురించి నాకు అవసరంలేదు, నా ప్రజలకు ఏమైనా నేర్పించాలనుకుంటే సబ్బు తయారీలాంటి పనికొచ్చేవేమైనా నేర్పించండి.” మలగాసీ బైబిలు పూర్తవకముందే దేశం విడిచివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమోనని ఊహించి, ఆమె చెప్పినదాని గురించి ఆలోచించుకునేందుకు ఒక వారం గడువిమ్మని రాణిని కామ్రన్‌ అడిగాడు.

తర్వాతి వారం కామ్రన్‌, స్థానికంగా దొరికే వస్తువులతో తయారు చేసిన రెండు చిన్న సబ్బులను రాణి రాయబారులకు బహుమానంగా ఇచ్చాడు. దీనితోపాటు, మిషనరీ కార్మికులు చేసిన మరితర సమాజ సేవలు రాణిని కొంతకాలంవరకు మెప్పించాయి. అయితే, వారు కొన్ని హెబ్రీ పుస్తకాలు తప్ప బైబిలంతటినీ ముద్రించడం పూర్తిచేయడానికి వారికి లభించిన ఆ కొంత సమయం సరిపోయింది.

మొదట ఆశ్చర్యం, తర్వాత నిరాశ

మిషనరీలు చేసిన పనిని అంతగా ఆదరించని రాణి 1831, మే నెలలో ఆశ్చర్యాన్ని కలిగించే ఒక ఆజ్ఞ జారీ చేసింది. తన ప్రజలు క్రైస్తవులుగా మారి బాప్తిస్మం తీసుకునేందుకు అనుమతినిచ్చింది. కానీ, అది ఎంతోకాలం నిలవలేదు. ఎ హిస్టరీ ఆఫ్‌ మడగాస్కర్‌ చెబుతున్నదాని ప్రకారం, “ఈ మార్పులు గిట్టని, రాణి దర్బారులోని కొంతమంది, బాప్తిస్మం తీసుకునే వారి సంఖ్యను చూసి ఆందోళనపడ్డారు. చర్చి కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం బ్రిటీష్‌ సామ్రాజ్యానికి లోబడడంతో సమానమౌతుందని చెప్పి వారు రాణిమీద ఒత్తిడి తీసుకొచ్చారు.” ఆ కారణంగా, 1831 సంవత్సరం చివరికల్లా అంటే క్రైస్తవ బాప్తిస్మాలను ఆమోదించిన ఆరునెలలకే వాటిని రద్దు చేశారు.

ఒకవైపు రాణి ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది, మరోవైపు ప్రభుత్వంలో సాంప్రదాయవాదుల ప్రభావం పెరుగుతూ వెళ్లింది. ఇవి మిషనరీల్లో పట్టుదలను పెంచాయి. దాంతో వారు చివరికి బైబిలు ముద్రణను పూర్తిచేశారు. అప్పటికే క్రైస్తవ గ్రీకు లేఖనాలు పూర్తై, వేలాది కాపీలు పంచిపెట్టబడ్డాయి. అయితే, 1835 మార్చి 1న మరో ఆటంకం వారికి ఎదురైంది. ఆ రోజున రాణి రనవలోనా-1 క్రైస్తవత్వాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించి, క్రైస్తవ పుస్తకాలన్నీ అధికారులకు అప్పగించాలని ఆదేశించింది.

రాణి ఆజ్ఞవల్ల మలగాసీ విద్యార్థులెవ్వరూ ముద్రణా పనిలో పాల్గొనలేకపోయారు. ఉన్న కొద్ది మంది మిషనరీల సహాయంతో వారు రాత్రనకా పగలనకా కష్టపడి చివరకు 1835 జూన్‌లో పూర్తి బైబిలును విడుదలచేశారు. ఎట్టకేలకు మలగాసీ బైబిలు వెలుగులోకి వచ్చింది!

నిషేధం అమలులో ఉంది కాబట్టి బైబిళ్లను త్వరత్వరగా ప్రజలకు పంచిపెట్టారు. అది శత్రువుల చేతుల్లో పడకూడదని వారు 70 కాపీలను భూమిలో పాతిపెట్టారు. వాళ్లు అలా చేయడం మంచిదైంది. ఎందుకంటే, ఏడాదిలోగా మొత్తం ద్వీపం మీద ఇద్దరే మిషనరీలు మిగిలారు. అయినా, దేవుని వాక్యం బిగ్‌ రెడ్‌ ద్వీపంలో వ్యాప్తిచెందింది.

బైబిలుపట్ల మలగాసీవాసులకున్న ప్రేమ

దేవుని వాక్యాన్ని మాతృభాషలో చదవడం మడగాస్కర్‌వాసులకు ఎంత సంతోషాన్నిచ్చివుంటుంది! దాంట్లో కొన్ని తప్పులు దొర్లినా, అది పాతకాలపు భాషలో రాయబడినా మడగాస్కర్‌లో బైబిలు లేని ఇల్లంటూ కనబడదు. అంతేకాక, చాలామంది మలగాసీవాసులు క్రమం తప్పకుండా బైబిలు చదువుతారు. ఈ అనువాదంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే హెబ్రీ లేఖనాలన్నిటిలో దేవుని పేరైన యెహోవా ఎన్నోచోట్ల ఉపయోగించబడింది. అసలు ప్రతుల్లో దేవుని పేరు గ్రీకు లేఖనాల్లో కూడ కనిపిస్తుంది. దానివల్ల చాలామంది మలగాసీవాసులకు దేవుని పేరు తెలుసు.

గ్రీకు లేఖనాల మొదటి ప్రతులు ముద్రించబడినప్పుడు, ముద్రణా యంత్రాన్ని నడిపించిన బేకర్‌ అనే వ్యక్తి మలగాసీ ప్రజల ఆనందాన్ని కళ్లారా చూసి, “నేను ప్రవచించడంలేదు కానీ, దేవుని వాక్యాన్ని ఈ దేశంలో లేకుండా చేయడం ఎన్నటికీ సాధ్యంకాదనే నమ్మకం నాకుంది!” అని అన్నాడు. నిజంగా, ఆయన అన్నట్లే జరిగింది. మలేరియాగానీ, కష్టమైన భాష నేర్చుకునే సవాలుగానీ, పరిపాలకుల కఠిన ఉత్తర్వులుగానీ, ఏవి కూడా మడగాస్కర్‌ వాసుల చేతుల్లోకి దేవుని వాక్యం చేరకుండా ఆపలేకపోయాయి.

ఇప్పుడు పరిస్థితి మరింత మెరుగుపడింది. ఎలా? 2008లో మలగాసీ భాషలో హెబ్రీ, గ్రీకు లేఖనాలు ఉన్న పరిశుద్ధ లేఖనాల నూతనలోక అనువాదం విడుదల చేయబడింది. ఈ కొత్త అనువాదంతో మరో గొప్ప మైలురాయి చేరుకున్నట్లయింది. ఇది సులభంగా అర్థమయ్యే ఆధునిక భాషలో అనువదించబడింది. కాబట్టి, బిగ్‌ రెడ్‌ ద్వీపంలో దేవుని వాక్యం ముందుకన్నా మరింత బలంగా స్థిరపడింది.—యెష. 40:8.

[అధస్సూచి]

^ పేరా 14 మలగాసీ భాషలో మొట్టమొదటిగా బైబిల్లోని పది ఆజ్ఞలు, పరలోక ప్రార్థన ముద్రించబడ్డాయి. దాని మొదటి ప్రతి 1826 ఏప్రిల్‌/మే నెలలో మారిషస్‌ ద్వీపంలో విడుదల చేయబడింది. అయితే, దాని కాపీలు కేవలం రాడామా రాజు కుటుంబానికి, కొంతమంది ప్రభుత్వాధికారులకు పంచిపెట్టబడ్డాయి.

[31వ పేజీలోని చిత్రం]

మలగాసీ భాషలోని “నూతనలోక అనువాదం” దేవుని నామమైన యెహోవాను ఘనపరుస్తుంది