మెస్సీయ— దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ మార్గం
మెస్సీయ— దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ మార్గం
“ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.”—1 కొరిం. 15:22.
1, 2. (ఎ) యేసును కలిసిన తర్వాత అంద్రెయ, ఫిలిప్పు ఏమి చేశారు? (బి) యేసే మెస్సీయ అని అనడానికి, మొదటి శతాబ్దపు క్రైస్తవుల దగ్గర ఉన్నవాటికన్నా ఎక్కువ రుజువులు నేడు మనదగ్గర ఉన్నాయని ఎలా చెప్పవచ్చు?
నజరేయుడైన యేసే దేవుని అభిషిక్తుడనే నమ్మకం కుదిరి, అంద్రెయ తన సహోదరుడైన పేతురుతో “మేము మెస్సీయను కనుగొంటిమి” అని అన్నాడు. ఫిలిప్పుకు కూడా నమ్మకం కుదిరి తన స్నేహితుడైన నతనయేలు దగ్గరికి వెళ్లి, “ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు” అని చెప్పాడు.—యోహా. 1:40, 41, 45.
2 యేసే వాగ్దానం చేయబడిన మెస్సీయ అనీ, యెహోవా ఏర్పాటు చేసిన “రక్షణకర్త” అనీ మీకు పూర్తిగా నమ్మకం కుదిరిందా? (హెబ్రీ. 2:10) యేసే మెస్సీయ అని అనడానికి, మొదటి శతాబ్దపు అనుచరుల దగ్గర ఉన్నవాటికన్నా ఎక్కువ రుజువులు నేడు మన దగ్గర ఉన్నాయి. యేసు పుట్టుక నుండి పునరుత్థానం వరకు ఆయన జీవితంలో జరిగిన సంఘటనల గురించి దేవుని వాక్యం వివరిస్తుంది. దాన్నిబట్టి ఆయనే క్రీస్తు అని స్పష్టంగా తెలుస్తోంది. (యోహాను 20:30, 31 చదవండి.) అంతేకాక, యేసు పరలోకానికి వెళ్లిన తర్వాత కూడా మెస్సీయగా తాను చేయాల్సిన పనులను కొనసాగిస్తాడని బైబిలు చెబుతోంది. (యోహా. 6:40; 1 కొరింథీయులు 15:22 చదవండి.) మీకున్న బైబిలు జ్ఞానాన్నిబట్టి మీరు కూడా ‘మెస్సీయను కనుగొన్నాము’ అని చెప్పవచ్చు. అయితే ముందుగా, తొలి శిష్యులు తాము మెస్సీయను కనుగొన్నామని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారో చూద్దాం.
మెస్సీయ గురించిన ‘పరిశుద్ధ మర్మం’ క్రమక్రమంగా తెలియజేయబడింది
3, 4. (ఎ) మొదటి శతాబ్దపు శిష్యులు ‘మెస్సీయను ఎలా కనుక్కోగలిగారు’? (బి) కేవలం యేసు మాత్రమే ప్రవచనాలన్నీ నెరవేర్చగలిగాడని ఎందుకు చెప్పవచ్చు?
3 మొదటి శతాబ్దపు అనుచరులు యేసే మెస్సీయ అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు? మెస్సీయను గుర్తుపట్టేలా యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆయా సమయాల్లో వివిధ విషయాలను తెలియజేస్తూ వచ్చాడు. దీన్ని ఒక బైబిలు విద్వాంసుడు, ఒక ప్రతిమకు చెందిన వివిధ పాలరాతి ముక్కలను ఒక దగ్గరికి చేర్చి పూర్తి ప్రతిమను తయారు చేయడంతో పోల్చాడు. ముఖపరిచయంలేని చాలామంది ఆ ప్రతిమకు చెందిన ఒక్కో ముక్కను ఓ గదిలోకి తెచ్చారనుకుందాం. ఆ ముక్కలన్నిటినీ కలిపినప్పుడు ఓ పూర్తి ప్రతిమ ఏర్పడితే అది యాదృచ్ఛికంగా జరిగింది కాదని, ఎవరో ఒకరు ఆ ప్రతిమను ముక్కలుగా చేసి ఆ గదిలోకి వచ్చినవారికి ముందుగానే ఇచ్చివుంటారని మీకు అర్థమౌతుంది. ఆ ప్రతిమలోని ముక్కల్లాగే మెస్సీయకు సంబంధించిన ప్రతీ ప్రవచనం ఆయన గురించి ఏదో ఒక ప్రాముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది.
4 మెస్సీయకు సంబంధించిన ప్రవచనాలన్నీ యాదృచ్ఛికంగా ఒకే వ్యక్తిలో నెరవేరే అవకాశం ఉందా? లేదు! ఒక వ్యక్తి మెస్సీయకు సంబంధించిన ప్రవచనాలన్నీ యాదృచ్ఛికంగా నెరవేర్చగలడా? “అలా జరగడం అసాధ్యం” అని ఒక పరిశోధకుడు చెప్పాడు. “చరిత్రంతటిలో కేవలం యేసు మాత్రమే ప్రవచనాలన్నీ నెరవేర్చగలిగాడు” అని కూడా ఆయన చెప్పాడు.
5, 6. (ఎ) సాతాను మీద తీర్పు ఎలా అమలు చేయబడుతుంది? (బి) వాగ్దానం చేయబడిన ‘సంతానపు’ వంశ వివరాలు యెహోవా ఎలా క్రమంగా తెలియజేస్తూ వచ్చాడు?
5 మెస్సీయ ప్రవచనాలన్నీ ‘పరిశుద్ధ మర్మంతోనే’ ముడిపడివున్నాయి. ఆ ‘పరిశుద్ధ మర్మంలో’ తెలివిగల ప్రాణులందరికీ అవసరమైన ఎన్నో విషయాలు ఉన్నాయి. (కొలొ. 1:26, 27, NW; ఆది. 3:15) మనుష్యులను పాపమరణాల ఊబిలో పడేసిన “ఆది సర్పమైన” అపవాదియగు సాతానుకు తీర్పు తీర్చడం కూడా ఆ మర్మంలో భాగమే. (ప్రక. 12:9) ఆ తీర్పు ఎలా అమలు చేయబడుతుంది? సాతాను తలను చితకగొట్టే ‘స్త్రీ సంతానం’ గురించి యెహోవా ప్రవచించాడు. ప్రవచించబడినట్లే ఆ “సంతానం” తిరుగుబాటుకు, అనారోగ్యానికి, మరణానికి కారకుడైన సాతానును లేకుండా చేస్తాడు. అయితే, ఒకవిధంగా చెప్పాలంటే సాతాను మొదటిగా, దేవుని అనుమతితో స్త్రీ “సంతానం” మడిమె మీద కొడతాడు.
6 కాలం గడుస్తుండగా వాగ్దానం చేయబడిన ఆ “సంతానం” గురించి యెహోవా ఒక్కో విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. దేవుడు, “భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును” అని అబ్రాహాముకు మాటిచ్చాడు. (ఆది. 22:18) మెస్సీయ తనకన్నా గొప్ప “ప్రవక్త” అని మోషే ముందుగానే చెప్పాడు. (ద్వితీ. 18:18, 19) మెస్సీయ దావీదు వంశం నుండే వస్తాడని, ఆయన సింహాసనంపై యుగయుగములు పరిపాలిస్తాడని దావీదుకు వాగ్దానం చేయబడింది, తర్వాతి కాలంలో వచ్చిన ప్రవక్తలు కూడా ఆ విషయాన్ని బలపరిచారు.—2 సమూ. 7:12, 16; యిర్మీ. 23:5, 6.
యేసే మెస్సీయ అనడానికి రుజువులు
7. యేసు, దేవుని “స్త్రీ” నుండి వచ్చాడని ఎలా చెప్పవచ్చు?
7 యెహోవా తన భార్యలాంటి సంస్థనుండి అంటే ఆత్మప్రాణులున్న పరలోక సంస్థ నుండి తాను మొదటిగా సృష్టించిన తన కుమారుణ్ణి వాగ్దాన ‘సంతానంగా’ పంపించాడు. ఆ కుమారుడు అలా రావడానికి తన్ను తాను “రిక్తునిగా” చేసుకోవాలి అంటే, పరలోకంలో తనకున్న గొప్ప స్థానాన్ని వదులుకొని, పరిపూర్ణ మానవునిగా పుట్టాలి. (ఫిలి. 2:5-7; యోహా. 1:14) పరిశుద్ధాత్మ మరియను ‘కమ్ముకుంటుంది’ కాబట్టి పుట్టబోయే శిశువు ‘పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడతాడు.’—లూకా 1:35.
8. యేసు బాప్తిస్మం తీసుకోవడానికి వెళ్లినప్పుడు ఆయన మెస్సీయ ప్రవచనాన్ని ఎలా నెరవేర్చాడు?
8 యేసు ఎక్కడ, ఎప్పుడు ప్రత్యక్షమౌతాడో మెస్సీయ ప్రవచనాలు సూచించాయి. ముందు చెప్పబడినట్లే యేసు బేత్లెహేములో పుట్టాడు. (మీకా 5:2) మొదటి శతాబ్దంలోని యూదులు మెస్సీయ విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మెస్సీయ రాక కోసం ఎదురుచూస్తున్న కొందరు బాప్తిస్మమిచ్చు యోహానును చూసి, “ఇతడు క్రీస్తయి యుండునేమో” అనుకున్నారు. కానీ దానికి యోహాను, “నాకంటె శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు” అని జవాబిచ్చాడు. (లూకా 3:15, 16) సా.శ. 29 శరదృతువులో యేసుకు 30 ఏళ్లున్నప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గరికి సరిగ్గా ప్రవచించబడిన సమయానికే వెళ్లి, తానే మెస్సీయ అని నిరూపించుకున్నాడు. (దాని. 9:25) ఆ తర్వాత యేసు ప్రాముఖ్యమైన తన పరిచర్యను ప్రారంభించేముందు, “కాలము సంపూర్ణమైయున్నది, దేవుని రాజ్యము సమీపించి యున్నది” అని అన్నాడు.—మార్కు 1:14, 15.
9. తమకు అన్నీ తెలియకపోయినా, యేసు శిష్యులు దేన్ని బలంగా నమ్మారు?
9 అయితే, ప్రజలు మెస్సీయ విషయంలో తమ అంచనాలు మార్చుకోవాల్సివుంది. యేసు రాజనే విషయాన్నైతే బాగానే అర్థం చేసుకొని స్తుతించారు కానీ, ఆయన భవిష్యత్తులో పరలోకం నుండి పరిపాలిస్తాడని వారు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. (యోహా. 12:12-16; 16:12, 13; అపొ. 2:32-36) అయినా, యేసు “మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు?” అని అడిగినప్పుడు పేతురు ఏ మాత్రం సంకోచించకుండా, “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు” అని జవాబిచ్చాడు. (మత్త. 16:13-16) యేసు బోధించిన ఒకానొక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకొని కొందరు ఆయనను వదిలివెళ్లినప్పుడు కూడా పేతురు అలాంటి జవాబే ఇచ్చాడు.—యోహాను 6:68, 69 చదవండి.
మెస్సీయ మాట వినండి
10. తన కుమారుని మాట వినాల్సిన అవసరం ఉందని యెహోవా ఎందుకు నొక్కిచెప్పాడు?
10 పరలోకంలో ఉన్నప్పుడు దేవుని అద్వితీయ కుమారుడు ఓ శక్తివంతమైన ఆత్మ ప్రాణి. యేసు “తండ్రి యొద్దనుండి బయలుదేరి,” ఆయన ప్రతినిధిగా భూమ్మీదికి వచ్చాడు. (యోహా. 16:27, 28) ఆయన ఇలా అన్నాడు: “నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.” (యోహా. 7:16) రూపాంతరమప్పుడు యేసే మెస్సీయ అనే విషయాన్ని బలపరుస్తూ యెహోవా, “ఈయన మాట వినుడి” అని చెప్పాడు. (లూకా 9:35) ఈ అభిషిక్తుని మాట వినాలి లేక ఆయనకు లోబడివుండాలి. అలా చేయాలంటే విశ్వాసం కనబరచి, సత్క్రియలు చేయాలి. యెహోవాను సంతోషపెట్టి, నిత్యజీవం పొందడానికి ఆ రెండూ చేయడం చాలా అవసరం.—యోహా. 3:16, 35, 36.
11, 12. (ఎ) మొదటి శతాబ్దపు యూదులు ఏ కారణాలనుబట్టి యేసును మెస్సీయగా అంగీకరించలేదు? (బి) అయితే, ఎవరు యేసును విశ్వసించారు?
11 యేసు మెస్సీయ అని అనడానికి ఎన్నో రుజువులున్నా, మొదటి శతాబ్దంలోని యూదులు ఆయనను తిరస్కరించారు. ఎందుకు? మెస్సీయ గురించి వారు ఏవేవో ఊహించుకున్నారు, ఆయన నాయకునిగా వచ్చి రోమన్ల అణచివేత నుండి తమను రక్షిస్తాడని వారు అనుకున్నారు. (యోహాను 12:34 చదవండి.) మెస్సీయ తృణీకరించబడతాడని, మనుష్యులు ఆయనకు దూరంగా ఉంటారని, బాధలను, వ్యాధిని అనుభవించి చివరకు చంపబడేందుకు దేవుడు ఆయనను ఎంపిక చేసుకున్నాడని ప్రవచనాలు చెబుతున్నాయి. ఆ ప్రవచనాలు యేసు జీవితంలో నెరవేరుతున్నప్పుడు, వారు ఆయనను మెస్సీయగా అంగీకరించలేకపోయారు. (యెష. 53:3, 5) తమను రోమన్ల చేతుల్లో నుండి విడిపించలేదని కొందరు సన్నిహిత శిష్యులు కూడ నిరాశచెందారు. అయినా, వారు ఆయనకు నమ్మకంగా ఉన్నారు, సకాలంలో వారికి మెస్సీయ గురించి స్పష్టమైన అవగాహన అనుగ్రహించబడింది.—లూకా 24:21.
12 యేసు బోధలను జీర్ణించుకోలేక కూడ చాలామంది ఆయనను వాగ్దానం చేయబడిన మెస్సీయగా అంగీకరించలేదు. రాజ్యంలోకి ప్రవేశించాలంటే ‘తమను తాము ఉపేక్షించుకోవాలి,’ తన శరీరాన్ని ‘తిని’ రక్తాన్ని ‘తాగాలి,’ ‘కొత్తగా జన్మించాలి,’ ‘లోకసంబంధులు కాకూడదు’ అని యేసు బోధించాడు. (మార్కు 8:34; యోహా. 3:3; 6:53; 17:14, 16) ఆ ఆజ్ఞలను పాటించడం కష్టమని గర్విష్ఠులకు, ఐశ్వర్యవంతులకు, వేషధారులకు అనిపించింది. కానీ, దీనులైన యూదులు, కొందరు సమరయులు యేసును మెస్సీయగా అంగీకరించారు. “ఈయన నిజముగా లోకరక్షకుడు” అని ఆ సమరయులు ఆయన గురించి చెప్పుకున్నారు.—యోహా. 4:25, 26, 41, 42; 7:31.
13. యేసు మడిమె మీద కొట్టబడి ఎలా బాధను అనుభవించాడు?
13 ప్రధాన యాజకులు తనకు మరణ శిక్ష విధిస్తారని, అన్యజనులు తనను మ్రానున వేలాడదీస్తారని, అయినా తాను మూడవ రోజున తిరిగి లేపబడతానని యేసు ప్రవచించాడు. (మత్త. 20:17-19) సమాజ మందిరంలో తాను ‘దేవుని కుమారుడైన క్రీస్తునని’ చెప్పినందుకు, దేవదూషణ చేస్తున్నాడని ఆయనకు తీర్పుతీర్చారు. (మత్త. 26:63-66) “మరణమునకు తగినదేది” యేసు చేయలేదని పిలాతుకు అనిపించినా, యేసు తిరుగుబాటు రేపుతున్నాడని యూదులు నిందించారు కాబట్టి పిలాతు “యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను.” (లూకా 23:13-15, 25) యేసును దేవుడే పంపాడనడానికి బలమైన రుజువులున్నా యూదులు ఆయనను “నిరాకరించి,” “జీవాధిపతి” అయిన యేసును చంపడానికి కుట్ర పన్నారు. (అపొ. 3:13-15) బైబిలు ప్రవచించినట్లుగానే మెస్సీయ ‘నిర్మూలం చేయబడ్డాడు.’ సా.శ. 33 పస్కా పండుగ రోజున ఆయనను మ్రానున వ్రేలాడదీసి చంపేశారు. (దాని. 9:26, 27; అపొ. 2:22, 23) అలా క్రూరంగా మరణించడం ద్వారా ఆయన, ఆదికాండము 3:15లో ప్రవచించబడినట్లు “మడిమె” మీద కొట్టబడి బాధను అనుభవించాడు.
మెస్సీయ ఎందుకు మరణించాల్సి వచ్చింది?
14, 15. (ఎ) యెహోవా ఏ రెండు కారణాలనుబట్టి యేసును చనిపోనిచ్చాడు? (బి) యేసు పునరుత్థానం చేయబడిన తర్వాత ఏమి చేశాడు?
14 యెహోవా రెండు ముఖ్యమైన కారణాలనుబట్టి యేసును చనిపోయేందుకు అనుమతించాడు. మొదటిగా, యేసు మరణం వరకు నమ్మకంగా ఉండడంవల్ల ‘పరిశుద్ధ మర్మంలో’ భాగంగావున్న ఓ ప్రాముఖ్యమైన వివాదం పరిష్కరించబడింది. సాతాను ఎంత తీవ్రంగా పరీక్షించినా ఒక పరిపూర్ణ మానవుడు ఎల్లప్పుడూ “దైవభక్తిని” చూపించగలడని, దేవుని సర్వాధిపత్యాన్ని సమర్థించగలడని యేసు తిరుగులేని విధంగా నిరూపించాడు. (1 తిమో. 3:16) రెండవ కారణాన్ని మనం యేసు మాటల్లో చూడవచ్చు. ఆయనిలా అన్నాడు: ‘మనుష్యకుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెను.’ (మత్త. 20:28) యేసు “అందరికొరకు విమోచన క్రయధనముగా” తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా, ఆదాముహవ్వల నుండి వారసత్వంగా వచ్చిన పాపానికి పరిహారం చెల్లించి, తనను దేవుని రక్షణ మార్గంగా అంగీకరించేవారు నిత్యజీవం పొందే అవకాశాన్ని కల్పించాడు.—1 తిమో. 2:5, 6.
15 క్రీస్తు సమాధిలో మూడు రోజులున్న తర్వాత పునరుత్థానం చేయబడ్డాడు. తాను సజీవుడనయ్యానని చూపించడానికి, మరిన్ని మార్గనిర్దేశాలు ఇవ్వడానికి ఆయన 40 రోజులపాటు తన శిష్యులకు కనిపించాడు. (అపొ. 1:3-5) ఆ తర్వాత ఆయన అమూల్యమైన తన బలి విలువను యెహోవాకు సమర్పించడానికి పరలోకానికి ఆరోహణమయ్యాడు. అక్కడ మెస్సీయ రాజుగా తన పరిపాలనను మొదలుపెట్టే సమయం వచ్చేంతవరకు వేచివున్నాడు. అంతవరకు, ఆయనెంతో చేయాల్సివుంది.
మెస్సీయగా తనకు అప్పగించబడిన పనిని పూర్తి చేయడం
16, 17. యేసు పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఏయే పనులు చేశాడో చెప్పండి.
16 యేసు పునరుత్థానం చేయబడి ఎన్నో శతాబ్దాలు గడిచాయి. అప్పటి నుండి ఇప్పటివరకు, తాను రాజుగా పరిపాలిస్తున్న క్రైస్తవ సంఘానికి సంబంధించిన కార్యకలాపాలన్నిటినీ నమ్మకంగా పర్యవేక్షిస్తూనే ఉన్నాడు. (కొలొ. 1:13) నియమిత సమయంలో దేవుని రాజ్యానికి రాజుగా యేసు తనకున్న అధికారాన్ని ఉపయోగించడం ఆరంభిస్తాడు. ఆయన 1914లో రాజుగా పరిపాలించడం మొదలుపెట్టాడని, “యుగసమాప్తి” కాలం మొదలైందని బైబిలు ప్రవచనాలనుబట్టి, ప్రపంచ సంఘటనలనుబట్టి స్పష్టంగా తెలుస్తోంది. (మత్త. 24:3; ప్రక. 11:15) ఆయన రాజుగా అధికారం చేపట్టిన కొంతకాలానికే తన దూతలతో కలిసి సాతానును, ఆయన దయ్యాలను పరలోకంనుండి పడద్రోశాడు.—ప్రక. 12:7-10.
17 సా.శ. 29లో యేసు మొదలుపెట్టిన ప్రకటనా పని, బోధనా పని అద్భుతమైన ముగింపుకు వస్తోంది. త్వరలోనే ఆయన సజీవులందరికీ తీర్పుతీస్తాడు. ఆ తర్వాత, యెహోవా రక్షణ మార్గాన్ని తన ద్వారా ఏర్పాటు చేశాడని నమ్మే గొర్రెల్లాంటి ప్రజలతో యేసు, “మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి” అని అంటాడు. (మత్త. 25:31-34, 41) యేసు తన దూతల సైన్యంతో కలిసి ఈ దుష్టత్వంపై దాడి చేసినప్పుడు తనను రాజుగా అంగీకరించని వాళ్లంతా నాశనం చేయబడతారు. అప్పుడు ఆయన సాతానును బంధించి, అతడి దయ్యాలను “అగాధములో” పడవేస్తాడు.—ప్రక. 19:11-14; 20:1-3.
18, 19. యేసు మెస్సీయగా ఏ పనులు పూర్తి చేస్తాడు? దానివల్ల విధేయులైనవారు ఎలాంటి ఆశీర్వాదాలు అనుభవిస్తారు?
18 ఆయన వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో, “ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి” అనే తన బిరుదులకు తగినట్లు పరిపాలిస్తాడు. (యెష. 9:6, 7) ఆయన పరిపాలనలో, పునరుత్థానమైన వారితోసహా మానవులందరూ పరిపూర్ణులౌతారు. (యోహా. 5:26-29) మెస్సీయ విధేయులైన మానవులను “జీవజలముల బుగ్గలయొద్దకు” నడిపిస్తాడు. దానివల్ల, వారు దేవునితో సమాధానకరమైన సంబంధాన్ని ఆనందించగలుగుతారు. (ప్రకటన 7:16, 17 చదవండి.) అంతిమ పరీక్ష తర్వాత సాతాను, అతడి దయ్యాలతోసహా తిరుగుబాటుదారులందరూ “అగ్ని గంధకములుగల గుండములో” పడవేయబడతారు. అలా ‘సర్పం’ మరణించేలా దాని తల చితకగొట్టబడుతుంది.—ప్రక. 20:10.
19 యేసు మెస్సీయగా తన పాత్రను ఏ తప్పు లేకుండా ఎంత చక్కగా నిర్వర్తిస్తాడు! పరిపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా నిరంతరం జీవించే పాపవిముక్తులైన మానవులతో పరదైసు భూమి నిండిపోతుంది. యెహోవా పవిత్ర నామం మీద తీసుకురాబడిన కళంకం తుడిచివేయబడుతుంది, దేవుని విశ్వసర్వాధిపత్యమే సరైనదని సంపూర్ణంగా నిరూపించబడుతుంది. దేవుని అభిషిక్తుని మాట వినేవారందరికీ ఎంత గొప్ప భవిష్యత్తు వేచివుంది!
మీరు మెస్సీయను కనుగొన్నారా?
20, 21. మెస్సీయ గురించి ఇతరులకు మీరు ఎందుకు చెప్పాలనుకుంటున్నారు?
20 మనం 1914 నుండి క్రీస్తు పరోసియాలో లేదా ఆయన ప్రత్యక్షతా కాలంలో జీవిస్తున్నాం. రాజుగా ఆయన పరిపాలించడాన్ని మనం కళ్లారా చూడకపోయినా, ప్రవచనాల నెరవేర్పులనుబట్టి ఆయన పరిపాలిస్తున్నాడని స్పష్టమౌతోంది. (ప్రక. 6:2-8) అయితే, మొదటి శతాబ్దపు యూదుల్లాగే నేడూ చాలామంది మెస్సీయ పరిపాలిస్తున్నాడనడానికున్న రుజువులను పట్టించుకోవడంలేదు. వారి దృష్టిలో మెస్సీయ ఒక రాజకీయ నాయకుడి రూపంలో రావాలి లేదా కనీసం రాజకీయ నాయకుల ద్వారా పరిపాలించే ఓ వ్యక్తైనా అయ్యుండాలి. మీరైతే, యేసు దేవుని రాజ్యానికి రాజుగా ఇప్పుడు పరిపాలిస్తున్నాడని తెలుసుకున్నారు. అది తెలుసుకున్న తర్వాత మీరు పులకించిపోలేదా? మొదటి శతాబ్దపు శిష్యుల్లాగే, “మేము మెస్సీయను కనుగొంటిమి” అని అనాలని మీకనిపించలేదా?
21 మీరు సత్యం గురించి ఇతరులకు వివరిస్తున్నప్పుడు, మెస్సీయగా యేసు చేసే పనుల గురించి చెబుతున్నారా? అలా చెబితే ఆయన మీ కోసం చేసినదాన్నిబట్టి, చేస్తున్నదాన్నిబట్టి, చేయబోయేదాన్నిబట్టి మీ కృతజ్ఞత పెరుగుతుంది. అంద్రెయ, ఫిలిప్పు మాట్లాడినట్లే మీరూ మెస్సీయ గురించి మీ బంధుమిత్రులతో మాట్లాడేవుంటారు. యేసుక్రీస్తే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని, దేవుడు ఆయన ద్వారా మనకు రక్షణ ఏర్పాటు చేశాడని మీరు వారికి నూతనోత్తేజంతో తెలియజేయండి.
మీరు వివరించగలరా?
• మొదటి శతాబ్దపు శిష్యులు మెస్సీయను ఎలా కనుగొన్నారు?
• ఏ రెండు ప్రాముఖ్యమైన కారణాలనుబట్టి యేసు మరణించాడు?
• మెస్సీయగా యేసు ఇంకా ఏ పనులు చేస్తాడు?
[అధ్యయన ప్రశ్నలు]
[21వ పేజీలోని చిత్రాలు]
యేసే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని మొదటి శతాబ్దంలోని ప్రజలు ఎలా చెప్పగలిగారు?
[23వ పేజీలోని చిత్రం]
మీరు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, మెస్సీయగా యేసు చేసే పనుల గురించి చెబుతున్నారా?