కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రీస్తు నిజమైన అనుచరులని నిరూపించుకోండి

క్రీస్తు నిజమైన అనుచరులని నిరూపించుకోండి

క్రీస్తు నిజమైన అనుచరులని నిరూపించుకోండి

“ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కానిఫలములు ఫలించును.” —మత్త. 7:17.

1, 2. ప్రాముఖ్యంగా ఈ అంత్యదినాల్లో క్రీస్తు నిజ అనుచరులకు, అబద్ధ అనుచరులకు మధ్య ఎలాంటి తేడా కనిపిస్తుంది?

 తనను సేవిస్తున్నామని చెప్పుకుంటున్నవారికీ, తన నిజ అనుచరులకూ మధ్యవున్న తేడాను వారి ఫలాలనుబట్టి అంటే వారి బోధలనుబట్టి, ప్రవర్తననుబట్టి గుర్తుపట్టవచ్చని యేసు చెప్పాడు. (మత్త. 7:15-17, 20) ప్రజలు తమ మనసుల్లో, హృదయాల్లో నింపుకునేవాటినిబట్టే ప్రవర్తిస్తారు. (మత్త. 15:18, 19) అబద్ధాలు బోధించబడేవారు “కానిఫలములు” ఫలిస్తారు, లేఖన సత్యాలు బోధించబడేవారు “మంచి ఫలములు” ఫలిస్తారు.

2 ఆ రెండు ఫలాలు ఈ అంత్యదినాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. (దానియేలు 12:3, 10 చదవండి.) అబద్ధ క్రైస్తవులకు దేవుని గురించి తప్పుడు అభిప్రాయముంది. వారు భక్తిగలవారమన్నట్లు నటిస్తున్నారు. అయితే ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకున్నవారు మాత్రం దేవుణ్ణి ‘ఆత్మతో, సత్యముతో’ ఆరాధిస్తారు. (యోహా. 4:24; 2 తిమో. 3:1-5) వారు క్రీస్తు లక్షణాలను కనబరచడానికి కృషిచేస్తారు. అయితే మన విషయమేమిటి? నిజక్రైస్తవులకు ఉండాల్సిన ఐదు లక్షణాలను మనం చర్చిస్తుండగా, ‘నేను దేవుని వాక్య ప్రకారంగా బోధిస్తున్నానా, ప్రవర్తిస్తున్నానా? నా ప్రవర్తన, నా బోధలు ఇతరులను సత్యంవైపు ఆకర్షించేలా ఉన్నాయా?’ అని ఆలోచించుకోండి.

దేవుని వాక్య ప్రకారం జీవించండి

3. యెహోవా దేన్నిబట్టి సంతోషిస్తాడు? దాని కోసం నిజక్రైస్తవులు ఏమి చేయాలి?

3 “ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును” అని యేసు చెప్పాడు. (మత్త. 7:21) క్రైస్తవులమని చెప్పుకున్నంత మాత్రాన యెహోవా సంతోషించడు కానీ క్రైస్తవులముగా జీవించినప్పుడే ఆయన సంతోషిస్తాడు. క్రీస్తు అనుచరులముగా మనం దేవుని నియమాలను జీవితాంతం పాటించాలి. అంతేకాక డబ్బు, ఉద్యోగం, వినోదం, లోక ఆచారాలు, అలవాట్లు, వివాహ బంధంతోపాటు మరితర సంబంధాల విషయంలో మన ఆలోచన తీరు కూడ మనం నిజక్రైస్తవులమని చూపించే విధంగా ఉండాలి. అయితే అబద్ధ క్రైస్తవులైతే, భక్తిహీనత రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ లోకంలో కనిపిస్తున్న ఆలోచన తీరునే కనబరుస్తున్నారు.—కీర్త. 92:7.

4, 5. మలాకీ 3:18లోని యెహోవా మాటల్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు?

4 అందుకే మలాకీ ప్రవక్త ఇలా రాశాడు: “అప్పుడు నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు తిరిగి కనుగొందురు.” (మలా. 3:18) మీరు ఆ మాటలను మనసులో ఉంచుకొని ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి: ‘నేను లోకంలో కలిసిపోతున్నానా లేదా దానికి భిన్నంగా ఉంటున్నానా? నా తోటి ఉద్యోగస్థుల్లా, తోటి విద్యార్థుల్లా ప్రవర్తిస్తూ వారిలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నానా లేదా అవకాశం దొరికినప్పుడు బైబిలు సూత్రాల గురించి ధైర్యంగా మాట్లాడుతూ ఆ సూత్రాలకు కట్టుబడివుంటున్నానా?’ (1 పేతురు 3:15, 16 చదవండి.) మనం స్వనీతిపరులముగా ఉండాలని కాదుగానీ, యెహోవాను ప్రేమించని, ఆయనను సేవించని ప్రజలకు భిన్నంగా ఉండాలి.

5 మీ ప్రవర్తన మెరుగుపరచుకోవాల్సిన అవసరముందని అనిపిస్తే దాని గురించి ప్రార్థిస్తూ క్రమంగా బైబిలు అధ్యయనం చేయడం ద్వారా, కూటాలకు హాజరుకావడం ద్వారా ఆధ్యాత్మిక బలాన్ని పొందేందుకు కృషిచేయండి. దేవుని వాక్యాన్ని ఎంతగా అన్వయించుకుంటారో అంతగా ‘దేవుని నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలం’ వంటి ‘మంచి ఫలాలను’ మీరు అర్పిస్తారు.—హెబ్రీ. 13:15.

దేవుని రాజ్యాన్ని ప్రకటించండి

6, 7. రాజ్య సందేశం విషయంలో నిజక్రైస్తవులకు, అబద్ధ క్రైస్తవులకు మధ్య ఏ తేడాను చూస్తాం?

6 “నేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితిని” అని యేసు అన్నాడు. (లూకా 4:43) యేసు ముఖ్యంగా దేవుని రాజ్యం గురించే ఎందుకు ప్రకటించాడు? ఎందుకంటే దేవుని రాజ్యానికి రాజుగా తాను, పునరుత్థానం చేయబడే ఆత్మాభిషిక్త సహోదరులతో కలిసి మానవుల కష్టాలకు మూలకారణమైన పాపాన్ని, అపవాదిని లేకుండా చేస్తానని యేసుకు తెలుసు. (రోమా. 5:12; ప్రక. 20:10) అందుకే, ఈ దుష్ట విధానం అంతమయ్యేవరకు ఆ రాజ్యం గురించి ప్రకటించమని ఆయన తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. (మత్త. 24:14) క్రీస్తును అనుసరిస్తున్నామని చెప్పుకునేవారు ఈ పనిలో భాగం వహించరు, వారు దానిలో భాగం వహించలేరు కూడా. ఎందుకు? దానికి కనీసం మూడు కారణాలున్నాయి: మొదటిగా, తమకు అర్థంకాని దానిగురించి వారు ఇతరులకు ప్రకటించలేరు. రెండవదిగా, ఇతరులకు రాజ్య సువార్తను ప్రకటించడంవల్ల ఎదురయ్యే అపహాస్యాన్ని, వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు కావాల్సిన వినయం, ధైర్యం వారిలో చాలామందికి లేవు. (మత్త. 24:9; 1 పేతు. 2:23) మూడవదిగా, అబద్ధ క్రైస్తవులకు దేవుని పరిశుద్ధాత్మ సహాయం లేదు.—యోహా. 14:16, 17.

7 అయితే, దేవుని రాజ్యం అంటే ఏమిటో, అది ఏమి సాధిస్తుందో క్రీస్తు నిజ అనుచరులకు తెలుసు. అంతేకాక, వారు ఆ రాజ్య సంబంధ విషయాలకే తమ జీవితంలో ప్రాముఖ్యతనిస్తూ యెహోవా పరిశుద్ధాత్మ సహాయంతో ప్రపంచవ్యాప్తంగా రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారు. (జెక. 4:6) మీరు క్రమంగా ఈ పనిలో పాల్గొంటున్నారా? పరిచర్యలో ఎక్కువ సమయాన్ని గడపడం ద్వారా లేదా మరింత సమర్థంగా ప్రకటించడం ద్వారా రాజ్య ప్రచారకునిగా ప్రగతి సాధించడానికి కృషి చేస్తున్నారా? కొందరు బైబిలు చక్కగా ఉపయోగించడం ద్వారా పరిచర్యను మెరుగుపరచుకోవడానికి కృషిచేశారు. లేఖనాల నుండి తర్కించడం అలవాటు చేసుకున్న అపొస్తలుడైన పౌలు “దేవుని వాక్యము సజీవమై బలముగలదై” ఉంది అని రాశాడు.—హెబ్రీ. 4:12; అపొ. 17:2, 3.

8, 9. (ఎ) మన పరిచర్యలో బైబిలు ఉపయోగించడం ఎంతో ప్రాముఖ్యమని తెలియజేసే కొన్ని అనుభవాలు చెప్పండి. (బి) దేవుని వాక్యాన్ని ఉపయోగించడంలో మనం నైపుణ్యాన్ని ఎలా సంపాదించవచ్చు?

8 ఇంటింటి పరిచర్యలో ఉన్నప్పుడు ఓ సహోదరుడు దానియేలు 2:44 ను ఒక క్యాథలిక్‌కు చదివి వినిపించి దేవుని రాజ్యం ఎలా శాంతిభద్రతలను తీసుకొస్తుందో వివరించాడు. అప్పుడు ఆ వ్యక్తి, “మీరు ఏదో ఒకటి చెప్పి ఊరుకునే బదులు చక్కగా బైబిలును తెరచి, లేఖనం చదివి వినిపించారు” అని అన్నాడు. మరో సహోదరుడు గ్రీకు ఆర్థొడాక్స్‌ చర్చికి చెందిన స్త్రీకి ఒక లేఖనం చదివి వినిపించినప్పుడు ఆమె ఎన్నో మంచి ప్రశ్నలు వేసింది. ఈ సహోదరుడు, ఆయన భార్య కూడా ఆమె ప్రశ్నలకు బైబిలును ఉపయోగించి జవాబిచ్చారు. ఆ తర్వాత ఆ స్త్రీ, “నేను మీతో మాట్లాడేందుకు ఎందుకు ఇష్టపడ్డానో తెలుసా? మీరు బైబిలుతో మా ఇంటికి వచ్చి, దానిలోని లేఖనాలు చదివారు.”

9 మన సాహిత్యాలు ఎంతో అమూల్యమైనవి. వాటిని మన ప్రాంతంలో అందించాలి కూడా. అయితే, మనం ముఖ్యంగా బైబిలునే ఎక్కువగా ఉపయోగించాలి. దాన్ని పరిచర్యలో క్రమంగా ఉపయోగించే అలవాటు మీకు లేనట్లయితే, ఆ దిశలో కృషిచేయండి. దేవుని రాజ్యం గురించి వివరించి, మీ ప్రాంతంలోని ప్రజలను బాధపెడుతున్న సమస్యలను అది ఎలా పరిష్కరిస్తుందో తెలియజేసే కొన్ని ముఖ్య వచనాలను మీరు ఎంపికచేసుకోవచ్చు. ఆ తర్వాత వాటిని ఇంటింటి పరిచర్యలో చదవడానికి సిద్ధంగా ఉండండి.

దేవుని నామాన్ని సగర్వంగా ధరించండి

10, 11. దేవుని పేరును ఉపయోగించే విషయంలో యేసుకూ ఆయనను అనుసరిస్తున్నామని చెప్పుకునే అనేకమందికీ మధ్యవున్న తేడా ఏమిటి?

10 “నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.” (యెష. 43:12) యెహోవా గురించి సాక్ష్యమిచ్చినవారిలో ప్రముఖుడైన యేసుక్రీస్తు ఆయన నామాన్ని ధరించి, దాన్ని ఇతరులకు తెలియజేయడాన్ని తనకు లభించిన గొప్ప గౌరవంగా భావించాడు. (నిర్గమకాండము 3:15; యోహాను 17:6; హెబ్రీయులు 2:11, 12 చదవండి.) యేసు తన తండ్రి పేరును ప్రకటించాడు కాబట్టి, ఆయన “నమ్మకమైన సాక్షి” అని పిలవబడ్డాడు.—ప్రక. 1:5; మత్త. 6:9.

11 దానికి భిన్నంగా, దేవునికి, ఆయన కుమారునికి ప్రతినిధులమని చెప్పుకునే చాలామంది దైవిక నామంపట్ల అవమానకరంగా ప్రవర్తించారు. చివరకు తమ బైబిలు అనువాదాల నుండి ఏకంగా ఆయన పేరునే తొలగించారు. ఇటీవల క్యాథలిక్‌ బిషప్పులకు అందిన నిర్దేశంలో కూడ అలాంటి వైఖరే కనిపిస్తుంది. ఆ నిర్దేశంలో, “యహ్‌వహ్‌ అనే నాలుగు హల్లులుగల హీబ్రూ పదరూపంలో ఉన్న దేవుని పేరును ఆరాధనలో ఉపయోగించడం గానీ, ఉచ్ఛరించడం గానీ చేయకూడదు” అని ఉంది. a వారిది ఎంత సిగ్గుకరమైన ఆలోచన!

12. దేవుని సేవకులు తాము యెహోవాకు చెందినవారమని మరింత స్పష్టంగా 1931లో ఎలా చాటిచెప్పారు?

12 క్రీస్తుతో సహా, భూమ్మీద ఆయనకన్నా ముందు జీవించిన గొప్ప ‘సాక్షి సమూహంలా’ నిజక్రైస్తవులు దేవుని పేరును గర్వంగా ఉపయోగిస్తారు. (హెబ్రీ. 12:1) 1931లో, దేవుని సేవకులు యెహోవాసాక్షులు అనే పేరును స్వీకరించడం ద్వారా తాము యెహోవాకు చెందినవారమని మరింత స్పష్టంగా చాటిచెప్పారు. (యెషయా 43:10-12 చదవండి.) ఆ విధంగా ఓ ప్రత్యేకభావంలో క్రీస్తు నిజమైన అనుచరులు ‘దేవుని నామం పెట్టబడిన’ ప్రజలయ్యారు.—అపొ. 15:14, 16-18.

13. దేవుడు మనకు ఇచ్చిన పేరుకు తగ్గట్లు ఎలా జీవించవచ్చు?

13 దేవుడు మనకు ఇచ్చిన నామానికి అనుగుణంగా ఎలా జీవించవచ్చు? దానికి ఉన్న ఒక మార్గం, మనం నమ్మకంగా దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడమే. “ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు?” అని పౌలు రాశాడు. (రోమా. 10:13-15) అంతేకాక, నరకం వంటి అబద్ధ సిద్ధాంతాలు, అపవాదికున్న క్రూరమైన లక్షణాలు ప్రేమగల దేవునికి ఉన్నట్లు చూపించి, ఆయన పేరును పాడుచేస్తాయి కాబట్టి, మనం ఆ సిద్ధాంతాలు తప్పని నేర్పుతో బట్టబయలు చేయాలి.—యిర్మీ. 7:31; 1 యోహా. 4:8; మార్కు 9:17-27 ను పోల్చండి.

14. దేవుని పేరు తెలుసుకున్నప్పుడు కొందరు ఎలా స్పందించారు?

14 మీ పరలోక తండ్రి పేరును ధరించినందుకు గర్వపడుతున్నారా? ఆ పరిశుద్ధ నామం తెలుసుకునేలా మీరు ఇతరులకు సహాయం చేస్తున్నారా? ఫ్రాన్స్‌ దేశంలోని పారిస్‌కు చెందిన ఒక స్త్రీ యెహోవాసాక్షులకు దేవుని పేరు తెలుసని విన్నది. ఆ తర్వాత తాను ఓ సాక్షిని కలిసినప్పుడు దేవుని పేరు ఎక్కడుందో తన బైబిల్లో చూపించమని అడిగింది. ఆ సాక్షి, కీర్తన 83:18 చూపించినప్పుడు ఆ స్త్రీ ఎంతో ముగ్ధురాలైంది. ఆమె బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించి, కొంతకాలానికి బాప్తిస్మం తీసుకుంది. ఇప్పుడు ఆమె మరో దేశంలో నమ్మకంగా సేవచేస్తోంది. ఆస్ట్రేలియాలోని ఓ క్యాథలిక్‌ స్త్రీ బైబిల్లో దేవుని పేరును మొదటిసారిగా చూసినప్పుడు ఆనందంతో కంటతడిపెట్టింది. ఇప్పుడు ఆమె ఎన్నో సంవత్సరాలుగా క్రమ పయినీరుగా సేవచేస్తోంది. ఈ మధ్యే, జమైకాలోని సాక్షులు ఓ స్త్రీకి దేవుని పేరును ఆమె సొంత బైబిల్లో చూపించినప్పుడు, ఆ స్త్రీ కూడ ఆనందబాష్పాలు రాల్చింది. అందుకే, దేవుని పేరును ధరించినందుకు గర్వపడండి. యేసులా ఆ అమూల్యమైన పేరును అందరికీ తెలియజేయండి.

‘ఈ లోకమును ప్రేమించకండి’

15, 16. నిజక్రైస్తవులు లోకాన్ని ఎలా పరిగణిస్తారు? మనం ఏ విషయాల గురించి ఆలోచించాలి?

15 “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.” (1 యోహా. 2:15) లోకం, దాని ఆలోచన తీరు యెహోవాకు, ఆయన పరిశుద్ధాత్మకు విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి, క్రీస్తు నిజ అనుచరులు కేవలం లోకానికి వేరుగా ఉండరు. శిష్యుడైన యాకోబు రాసిన మాటలను గుర్తుంచుకుంటారు కాబట్టి వారు లోకాన్ని ప్రేమించరు. ఆయన ఇలా రాశాడు: “యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.”—యాకో. 4:4.

16 మనల్ని ఎన్నో విధాలుగా శోధించే ఈ లోకంలో యాకోబు మాటలు పాటించడం కష్టమే. (2 తిమో. 4:10) అందుకే, యేసు తన అనుచరుల కోసం ఇలా ప్రార్థించాడు: “నీవు లోకములో నుండి వారిని తీసికొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” (యోహా. 17:15, 16) మీరు ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి: ‘నేను లోకానికి వేరుగా ఉండడానికి కృషిచేస్తున్నానా? లేఖనవిరుద్ధమైన ఆచారాల, వేడుకల విషయంలో నా నమ్మకాల గురించి ఇతరులకు తెలుసా? అలాగే, అబద్ధ ఆరాధనకు సంబంధం లేకపోయినా లౌకికాత్మ కొన్ని వేడుకల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వేడుకల విషయంలో నా నమ్మకాలేమిటో ఇతరులకు తెలుసా?’—2 కొరిం. 6:16-18; 1 పేతు. 4:3, 4.

17. యథార్థ హృదయులు దేన్ని చూసి యెహోవా సేవకులయ్యే అవకాశముంది?

17 బైబిలు సూత్రాల ప్రకారం జీవిస్తే లోకం ఆమోదాన్ని సంపాదించుకోలేం గానీ యథార్థ హృదయంగల వారిలో ఆసక్తిని రేకెత్తించవచ్చు. మనకున్న బలమైన విశ్వాసం లేఖనాధారమైనదని, మన జీవితంలోని అన్ని రంగాల్లో దాన్ని కనబరుస్తున్నామని అలాంటి వారు గమనించినప్పుడు వారు పరోక్షంగా అభిషిక్తులకు ఇలా చెప్పవచ్చు: “దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుము.”—జెక. 8:23.

నిజమైన క్రైస్తవ ప్రేమ చూపించండి

18. యెహోవాపట్ల, మన పొరుగువారిపట్ల ప్రేమ చూపించాలంటే ఏమి చేయాలి?

18 “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను” అని, “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను” అని యేసు చెప్పాడు. (మత్త. 22:37, 39) ఆ ప్రేమ నిజమైన ప్రేమ (గ్రీకులో అగాపే). ఆ ప్రేమ బాధ్యతలు, సూత్రాలు, నీతి వంటివాటిని పరిగణలోకి తీసుకుంటుంది. కానీ ముఖ్యంగా దానిలో బలమైన భావోద్వేగాలుంటాయి. అంతేకాక, దానిలో వాత్సల్యంతోకూడిన మిక్కుటమైన ప్రేమ కూడ ఉండవచ్చు. (1 పేతు. 1:22) ఆ ప్రేమ నిస్వార్థమైన మాటల్లో, చేతల్లో కనిపిస్తుంది కాబట్టి అది స్వార్థానికి పూర్తి విరుద్ధమైనది.—1 కొరింథీయులు 13:4-7 చదవండి.

19, 20. క్రైస్తవ ప్రేమకున్న శక్తిని చూపించే కొన్ని ఉదాహరణలు చెప్పండి.

19 లోకంలోనివారు జాతీయ, సాంస్కృతిక, రాజకీయ అడ్డంకులను అధిగమించలేరు. ప్రేమ దేవుని పరిశుద్ధాత్మ ఫలంలోని ఒక లక్షణం కాబట్టి, నిజక్రైస్తవులు ఆ ప్రేమవల్ల లోకం అధిగమించలేని దాన్ని అధిగమించగలుగుతారు. (యోహాను 13:34, 35 చదవండి; గల. 5:22) గొర్రెల్లాంటివారు అలాంటి ప్రేమను చూసినప్పుడు వారు ఎంతగానో చలించిపోతారు. ఉదాహరణకు, ఇశ్రాయేలు దేశంలో ఓ యువ యూదుడు మొట్టమొదటిసారి క్రైస్తవ కూటానికి హాజరయ్యాడు. అక్కడ యూదులు, అరబ్బీయులు కలిసి యెహోవాను ఆరాధించడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ కారణంగా, ఆయన కూటాలకు క్రమంగా హాజరుకావడం మొదలుపెట్టి, బైబిలు అధ్యయనాన్ని అంగీకరించాడు. వారిలాగే మీరూ మీ సహోదరులను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నారా? దేశం, రంగు, హోదా వంటి వాటిని మనసులో ఉంచుకోకుండా మీ రాజ్యమందిరానికి వచ్చే కొత్తవారిని సాదరంగా ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నారా?

20 నిజక్రైస్తవులముగా మనం అందరిపట్ల ప్రేమ చూపించడానికి కృషిచేస్తాం. ఎల్‌ సాల్వెడార్‌లో ఓ యువ ప్రచారకుడు క్యాథలిక్‌ చర్చికి అంటిపెట్టుకొనివున్న 87 ఏళ్ల వృద్ధురాలితో అధ్యయనం చేస్తుండేవాడు. ఒకరోజు, ఆమె తీవ్రంగా అస్వస్థురాలై ఆసుపత్రిపాలైంది. ఆమె ఇంటికి తిరిగివచ్చినప్పుడు సాక్షులు ఆమెను నెల రోజులపాటు పరామర్శించడానికి వచ్చారు, ఆమెకు భోజనం తీసుకొచ్చారు. కానీ ఆ నెల రోజులు ఆమెను చూడడానికి ఆమె చర్చివాళ్లెవ్వరూ రాలేదు. అప్పుడు ఆమె ఏమి చేసింది? తన దగ్గరున్న విగ్రహాలను పారేసి, తన చర్చికి రాజీనామా చేసి బైబిలు అధ్యయనాన్ని కొనసాగించింది. నిజంగా, క్రైస్తవ ప్రేమకు ఎంతో శక్తివుంది! కేవలం ప్రకటించడంతో సరిపెట్టుకోక ప్రేమను కూడ చూపించడంవల్ల మనం ప్రజల హృదయాలకు చేరువకావచ్చు.

21. మన భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే మనం ఏమి చేయాలి?

21 త్వరలోనే యేసు, తనను సేవిస్తున్నామని చెప్పుకునే అబద్ధ అనుచరులతో, “నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండి” అని చెబుతాడు. (మత్త. 7:23) తండ్రిని, కుమారుణ్ణి ఘనపర్చే విధంగా మనం మంచి ఫలాల్ని ఫలిద్దాం. “యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును” అని యేసు చెప్పాడు. (మత్త. 7:24) మనం క్రీస్తు నిజమైన అనుచరులమని నిరూపించుకుంటే దేవుని ఆమోదాన్ని పొందుతాం. అంతేకాదు, మన భవిష్యత్తు కూడా బండమీద కట్టబడిన ఇల్లులా సురక్షితంగా ఉంటుంది!

[అధస్సూచి]

a ఆంధ్ర క్యాతలిక్‌ బైబిలు సంఘం ప్రచురించిన పవిత్ర గ్రంథము క్యాతలిక్‌ అనువాదము యహ్‌వహ్‌ అనే నాలుగు హల్లులుగల హీబ్రూ పదాన్ని “యావే” లేదా “యాహ్వే” అని అనువదించింది.

మీకు జ్ఞాపకమున్నాయా?

• క్రీస్తు నిజమైన అనుచరులకు, అబద్ధ అనుచరులకు మధ్యవున్న తేడా ఏమిటి?

• నిజ క్రైస్తవులను గుర్తించడానికి సహాయం చేసే కొన్ని ‘ఫలాలు’ ఏమిటి?

• క్రైస్తవులుగా మంచి ఫలాల్ని ఫలించడానికి మీరు ఏమి చేయాలనుకుంటున్నారు?

[అధ్యయన ప్రశ్నలు]

[13వ పేజీలోని చిత్రం]

పరిచర్యలో క్రమంగా బైబిలు ఉపయోగించే అలవాటు మీకుందా?

[15వ పేజీలోని చిత్రం]

లేఖన విరుద్ధమైన పండుగల విషయంలో మీ నమ్మకాలేమిటో ఇతరులకు తెలుసా?