కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఆత్మ ఖడ్గాన్ని’ నైపుణ్యంతో ఉపయోగించండి

‘ఆత్మ ఖడ్గాన్ని’ నైపుణ్యంతో ఉపయోగించండి

‘ఆత్మ ఖడ్గాన్ని’ నైపుణ్యంతో ఉపయోగించండి

“దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి.”—ఎఫె. 6:17.

1, 2. రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఏమి చేయాలి?

 ఆధ్యాత్మికంగా దీనస్థితిలోవున్న జనసమూహాన్ని చూసి యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి.” యేసు ఆ మాటలు చెప్పి ఊరుకోలేదు. ఆయన “తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి” ‘కోతపని’ కోసం అంటే ప్రకటనా పని కోసం వారిని పంపించాడు. (మత్త. 9:35-38; 10:1, 5) ఆ తర్వాత, ఆ పని కోసమే ఆయన ‘డెబ్బదిమంది యితరులను నియమించి, ప్రతిచోటికి ఇద్దరిద్దరిని పంపించాడు.’—లూకా 10:1, 2.

2 రాజ్య ప్రచారకుల అవసరం మన కాలంలో కూడా ఎక్కువగా ఉంది. 2009వ సేవా సంవత్సరంలో జ్ఞాపకార్థ ఆచరణకు ప్రపంచవ్యాప్తంగా 1,81,68,323 మంది హాజరయ్యారు అంటే యెహోవాసాక్షుల సంఖ్యకన్నా దాదాపు కోటిమంది ఎక్కువగా హాజరయ్యారు. నిజంగా, పొలాలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. (యోహా. 4:34, 35) కాబట్టి, ఎక్కువమంది పనివారి కోసం మనం ప్రార్థించాలి. అయితే మనం ప్రార్థనకు తగినట్లు ఎలా నడుచుకోవచ్చు? రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో మనం ఉత్సాహంగా పాల్గొంటూ సమర్థులైన ప్రచారకులముగా తయారవడం ద్వారా అలా చేయవచ్చు.—మత్త. 28:19, 20; మార్కు 13:10.

3. మనం పరిచర్యలో మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికి దేవుని ఆత్మ ఎలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది?

3 ‘దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించడానికి’ మనకు పరిశుద్ధాత్మ ఎలా సహాయం చేస్తుందో ముందటి ఆర్టికల్‌లో చూశాం. (అపొ. 4:31) నైపుణ్యంగల ప్రచారకులమయ్యేందుకు కూడా అది మనకు సహాయం చేస్తుంది. పరిచర్యలో మనం మరిన్ని సత్ఫలితాలు సాధించాలంటే మొదటిగా యెహోవా అనుగ్రహించిన మంచి సాధనాన్ని అంటే ఆయన వాక్యమైన బైబిలును చక్కగా ఉపయోగించాలి. అది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. (2 తిమో. 3:16) దేవుడే తన పరిశుద్ధాత్మ సహాయంతో దాన్ని రాయించాడు. కాబట్టి, మనం పరిచర్యలో బైబిలును నైపుణ్యంతో ఉపయోగిస్తే, పరిశుద్ధాత్మ నిర్దేశంలో బోధించినవారమౌతాం. మనం దాన్ని ఎలా చేయవచ్చో తెలుసుకునే ముందు, దేవుని వాక్యం ఎంత శక్తివంతమైనదో చూద్దాం.

‘దేవుని వాక్యం బలముగలది’

4. బైబిల్లోని సందేశం ఒక వ్యక్తిలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది?

4 దేవుని వాక్యానికి లేక సందేశానికి ఎంత శక్తివుంది! (హెబ్రీ. 4:12) ఒక రకంగా చెప్పాలంటే, బైబిల్లోవున్న సందేశం మూలుగను విభజించేంతగా దూసుకెళ్తుంది కాబట్టి అది మానవ ఖడ్గం కన్నా పదునైనది. అది ఓ వ్యక్తి తలంపులను, ఆలోచనలను శోధించి ఆయన నిజమైన వ్యక్తిత్వం ఏమిటో తెలియజేస్తుంది. బైబిలు సత్యం ఆయనమీద బలంగా పనిచేసి ఆయనలో ఎన్నో మార్పులు తీసుకురాగలదు. (కొలొస్సయులు 3:9, 10 చదవండి.) నిజమే, దేవుని వాక్యం జీవితాల్నే మార్చేస్తుంది!

5. ఏయే విధాలుగా బైబిలు మనల్ని నిర్దేశించగలదు? దానివల్ల మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం?

5 అంతేకాక, బైబిల్లో ఉన్న జ్ఞానానికి మరేదీ సాటిరాదు. కష్టాలను ఎలా నెగ్గుకురావాలో అది చెబుతోంది. దేవుని వాక్యం మన అడుగులనే కాక, మన ముందున్న త్రోవను కూడా వెలుగుమయం చేస్తుంది. (కీర్త. 119:105) మనం సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు లేదా స్నేహితులు, వినోదం, ఉద్యోగం, దుస్తులు మొదలైన విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు అది ఎంతో సహాయం చేస్తుంది. (కీర్త. 37:25; సామె. 13:20; యోహా. 15:14; 1 తిమో. 2:9) దేవుని వాక్యంలోని సూత్రాలను పాటించడం వల్ల మనం ఇతరులతో చక్కగా మెలగగలుగుతాం. (మత్త. 7:12; ఫిలి. 2:3, 4) దేవుని వాక్యం మన ముందున్న మార్గానికి వెలుగుగా ఉంటుంది కాబట్టి, మనం తీసుకునే నిర్ణయాలవల్ల ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో కూడా ఆలోచించగలుగుతాం. (1 తిమో. 6:9) లేఖనాలు భవిష్యత్తు విషయంలో దేవుని ఉద్దేశమేమిటో తెలియజేస్తున్నాయి కాబట్టి, ఆ ఉద్దేశానికి అనుగుణంగా మన జీవితాన్ని మలచుకోగలుగుతాం. (మత్త. 6:33; 1 యోహా. 2:17, 18) దేవుని సూత్రాలను పాటించడంవల్ల ఓ వ్యక్తి జీవితానికి ఎంత అర్థం ఉంటుంది!

6. మనం చేసే ఆధ్యాత్మిక యుద్ధంలో బైబిలు శక్తివంతమైన ఆయుధమని ఎందుకు చెప్పవచ్చు?

6 అంతేకాక, మనం చేసే ఆధ్యాత్మిక యుద్ధంలో బైబిలు ఎంత శక్తివంతమైన ఆయుధమో ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యాన్ని పౌలు “ఆత్మ ఖడ్గము” అని పిలిచాడు. (ఎఫెసీయులు 6:12, 17 చదవండి.) బైబిలు సందేశాన్ని నైపుణ్యంతో ప్రకటించినప్పుడు అది ప్రజలను సాతాను బంధకాల నుండి విడిపిస్తుంది. ఆ ఖడ్గం ప్రజలను చంపదు కానీ, వారి ప్రాణాలను రక్షిస్తుంది. కాబట్టి, మనం దాన్ని నైపుణ్యంతో ఉపయోగించడానికి కృషిచేయాలి.

దాన్ని సరిగ్గా ఉపయోగించండి

7. ‘ఆత్మ ఖడ్గాన్ని’ సమర్థంగా ఉపయోగించడాన్ని నేర్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

7 ఓ సైనికుడు ప్రతీరోజు అభ్యాసం చేసి ఆయుధాలను చక్కగా ఉపయోగించడం నేర్చుకుంటేనే యుద్ధంలో వాటిని నైపుణ్యంతో వాడగలుగుతాడు. ఆధ్యాత్మిక యుద్ధంలో వాడే ‘ఆత్మ ఖడ్గం’ విషయంలో కూడా అంతే. “దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము” అని పౌలు రాశాడు.—2 తిమో. 2:15.

8, 9. బైబిలును సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఏమి చేయాలి? ఓ ఉదాహరణ చెప్పండి.

8 పరిచర్యలో ‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలంటే’ మనం ఏమి చేయాలి? బైబిలు బోధలను ఇతరులకు బాగా వివరించాలంటే ముందుగా మనం దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒక లేఖనాన్ని అర్థం చేసుకోవాలంటే, మొదటిగా దాని సందర్భాన్ని పరిశీలించాలి.

9 సందర్భాన్ని పరిగణలోకి తీసుకుంటే మనం లేఖనాలను ఎలా అర్థం చేసుకోవచ్చో తెలుసుకునేందుకు గలతీయులు 5:13లో పౌలు రాసిన మాటలను చూద్దాం. ఆయన ఇలా రాశాడు: “సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి.” పౌలు ఏ స్వాతంత్ర్యం గురించి మాట్లాడాడు? ఆయన పాపమరణాల నుండి, అబద్ధ నమ్మకాల నుండి స్వాతంత్ర్యం పొందడం గురించి మాట్లాడాడా లేక వేరే దేనిగురించైనా మాట్లాడాడా? ఆ లేఖన సందర్భాన్ని గమనిస్తే పౌలు ‘ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించబడడం’ వల్ల వచ్చే స్వాతంత్ర్యం గురించి మాట్లాడాడని తెలుస్తుంది. (గల. 3:13, 19-24; 4:1-5) క్రీస్తును అనుసరించడంవల్ల వచ్చే స్వాతంత్ర్యం గురించి ఆయన మాట్లాడాడు. ఆ స్వాతంత్ర్యాన్ని అర్థం చేసుకున్నవారు ప్రేమతో ఒకరికొకరు సేవచేసుకున్నారు. కానీ ప్రేమలేనివారు ఇతరుల గురించి కొండెములు చెప్పారు, ఇతరులతో కొట్లాడారు.—గల. 5:15.

10. లేఖనాలకున్న సరైన అర్థాన్ని గ్రహించాలంటే, వేటి గురించి తెలుసుకోవడానికి కృషిచేయాలి? ఆ సమాచారం మనకు ఎక్కడ దొరుకుతుంది?

10 మనం ఓ లేఖనాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే దాని పూర్వాపరాల గురించి కూడా తెలుసుకోవాలి. అంటే ఆ బైబిలు పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఎవరో, అది ఎప్పుడు రాయబడిందో, ఎలాంటి పరిస్థితుల్లో రాయబడిందో కూడా తెలుసుకోవాలి. అంతేకాక, ఫలాని పుస్తకం ఎందుకు రాశారో తెలుసుకోవాలి. వీలైతే అప్పటి ప్రజల సాంప్రదాయాలు, ప్రవర్తన, పాటించిన విలువలు, వారి ఆరాధన గురించి తెలుసుకోవడానికి కూడా కృషిచేయాలి. a

11. లేఖనాలను వివరిస్తున్నప్పుడు మనం ఏ జాగ్రత్త తీసుకోవాలి?

11 ‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలంటే’ కేవలం లేఖన సత్యాలను ఉన్నదున్నట్లు బోధిస్తే సరిపోదు. మనం ఇతరులను భయపెట్టేందుకు బైబిలును ఉపయోగించకుండా జాగ్రత్తపడాలి. అపవాది శోధించినప్పుడు యేసు చేసినట్లే మనం సత్యాన్ని సమర్థించేందుకు లేఖనాలను ఉపయోగించవచ్చు. అయితే, శ్రోతలను భయపెట్టేందుకు, మన నమ్మకాలను వారిమీద రుద్దేందుకు మనం వాటిని ఉపయోగించకూడదు. (ద్వితీ. 6:16; 8:3; 10:20; మత్త. 4:4, 7, 10) మనం అపొస్తలుడైన పేతురు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని పాటించాలి: “మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి.”—1 పేతు. 3:15.

12, 13. దేవుని వాక్య సత్యం ఎలాంటి ‘దుర్గాలను’ పడద్రోయగలదు? ఓ ఉదాహరణ చెప్పండి.

12 దేవుని వాక్య సత్యాన్ని సరిగా ఉపయోగిస్తే ఏమి సాధించవచ్చు? (2 కొరింథీయులు 10:4, 5 చదవండి.) లేఖన సత్యాలతో ‘దుర్గాలను’ పడద్రోయవచ్చు. అంటే అపరిపూర్ణ మానవుల జ్ఞానం ఆధారంగా పుట్టుకొచ్చిన అబద్ధ సిద్ధాంతాలు, హానికరమైన అలవాట్లు, తత్వజ్ఞానం తప్పని నిరూపించవచ్చు. ‘దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు’ ప్రతీ సిద్ధాంతాన్ని పడద్రోయడానికి మనం బైబిలును ఉపయోగించవచ్చు. బైబిలు సత్యాలకు అనుగుణంగా ఇతరులు తమ ఆలోచనను మార్చుకునేలా సహాయం చేసేందుకు మనం వాటిని ఉపయోగించవచ్చు.

13 ఇండియాలోని 93 ఏళ్ల ఓ వృద్ధురాలి ఉదాహరణే తీసుకోండి. ఆమె చిన్నప్పటి నుండి పునర్జన్మ సిద్ధాంతాన్ని వింటూ వచ్చింది. విదేశాల్లోవున్న తన కుమారునితో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూ బైబిలు అధ్యయనం చేయసాగింది. మొదట్లో ఆమె యెహోవా గురించి, ఆయన వాగ్దానాల గురించి తాను నేర్చుకుంటున్న విషయాలు సత్యమని వెంటనే నమ్మింది. అయితే, ఆమె మనసులో పునర్జన్మ సిద్ధాంతం ఎంతగా పాతుకుపోయిందంటే చనిపోయినవారి స్థితి గురించి తన కుమారుడు రాసిన విషయాలతో తీవ్రంగా విభేదించింది. ఆమె తన కుమారునికి ఇలా రాసింది: “మీ లేఖనాల్లో ఉన్న సత్యం నాకు అసలు అర్థంకావట్లేదు. చనిపోయిన తర్వాత మనలో ఏదో ఒక భాగం బ్రతికేవుంటుందని అన్ని మతాలు బోధిస్తున్నాయి. శరీరం చనిపోతుంది కానీ మన శరీరంలో కనిపించని ఓ భాగం దాదాపు 84 లక్షలసార్లు పునర్జన్మ ఎత్తుతుందని నేను ఇప్పటివరకు నమ్ముతూ వచ్చాను. అసలు ఈ నమ్మకం ఎలా తప్పు అవుతుంది? చాలా మతాలు అబద్ధం బోధిస్తున్నాయా?” ఆమెలో బలంగా పాతుకుపోయిన ఆ నమ్మకాన్ని ‘ఆత్మఖడ్గం’ పెకిలించివేయగలదా? పునర్జన్మ గురించి ఆమెతో లేఖనాలు ఉపయోగించి చర్చించిన కొన్ని వారాలకు ఆమె ఇలా రాసింది: “అసలు మరణించిన తర్వాత ఏమి జరుగుతుందో చివరకు సరిగ్గా అర్థం చేసుకున్నాను. పునరుత్థానం జరిగినప్పుడు మనం మన ఆత్మీయులను తిరిగి కలుసుకోగలుగుతామని తెలుసుకొని నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుని రాజ్యం త్వరగా రావాలని ఆశగా ఎదురుచూస్తున్నాను.”

ఇతరులను ఒప్పించేలా దాన్ని ఉపయోగించండి

14. మన శ్రోతలను ఒప్పించాలంటే ఏమి చేయాలి?

14 పరిచర్యలో బైబిలును సమర్థంగా ఉపయోగించాలంటే, కేవలం లేఖనాలను చూపిస్తే సరిపోదు. పౌలు “ఒప్పించుచు” మాట్లాడాడు. మనం కూడా అలాగే మాట్లాడాలి. (అపొస్తలుల కార్యములు 19:8, 9; 28:23 చదవండి.) బైబిలు బోధను అంగీకరించేలా మనం ఓ వ్యక్తిని ఒప్పించగలిగినప్పుడు నిజానికి మనం ఆయన ఆ బోధపై నమ్మకముంచేలా చేస్తాం. వారలా నమ్మకముంచాలంటే మనం చెప్పేది ఎంత సత్యమో ఆయన గ్రహించేలా సహాయం చేయాలి. మనం ఈ కింది పద్ధతులను పాటించి వారికి సహాయం చేయవచ్చు.

15. దేవుని వాక్యం పట్ల గౌరవం ఏర్పడేలా మీరెలా బోధించవచ్చు?

15 దేవుని వాక్యం పట్ల గౌరవం ఏర్పడేలా దాన్ని బోధించండి. మీరు ఓ లేఖనాన్ని చూపిస్తున్నప్పుడు ఫలాని విషయంలో దేవుని అభిప్రాయం తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో వివరించండి. ఓ ప్రశ్న వేసి గృహస్థుని జవాబు విన్న తర్వాత, ‘ఈ విషయంలో దేవుని అభిప్రాయం ఏమిటో చూద్దాం’ అని మీరు అనవచ్చు. లేక ‘ఈ విషయం గురించి దేవుడు ఏమి చెబుతున్నాడో తెలుసా?’ అని అడగవచ్చు. లేఖనాన్ని మనం ఈ విధంగా పరిచయం చేస్తే బైబిలు దేవుని వాక్యమని చూపించగలుగుతాం, దానిపట్ల వారి గౌరవాన్ని పెంచగలుగుతాం. కొందరు దేవుణ్ణి నమ్ముతుండవచ్చు, కానీ వారికి బైబిలు బోధలు తెలియకపోవచ్చు. అలాంటివారికి సాక్ష్యమిస్తున్నప్పుడు పై పద్ధతిని పాటించడం చాలా ప్రాముఖ్యం.—కీర్త. 19:7-10.

16. లేఖనాలను మీరు సరిగ్గా ఎలా వివరించవచ్చు?

16 కేవలం లేఖనాలను చదివితే సరిపోదు, వాటిని వివరించాలి కూడా. “లేఖనాలలో నుంచి విషయాలెత్తి . . . వివరించే” అలవాటు పౌలుకు ఉండేది. (అపొ. 17:2, 3, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) ఓ లేఖనంలో అనేక విషయాలుంటాయి, అయితే మీరు చర్చిస్తున్నదానికి సంబంధమున్న ముఖ్యమైన పదబంధాలను మాత్రమే గృహస్థునికి వివరించాల్సిరావచ్చు. ముఖ్యాంశమున్న ఆ పదాలను మరోసారి చెప్పడం ద్వారా లేదా వాటిని గుర్తించేలా గృహస్థునికి సహాయం చేసే ప్రశ్నలు వేయడం ద్వారా మీరలా చేయవచ్చు. ఆ తర్వాత లేఖనంలోని ఆ భాగాన్ని వివరించండి. అలా చేసిన తర్వాత, ఆ లేఖనాన్ని ఆయన తన జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చో గ్రహించేలా ఆ వ్యక్తికి సహాయం చేయండి.

17. మీరు ఇతరులను ఒప్పించేలా లేఖనాల నుండి ఎలా తర్కించవచ్చు?

17 ఒప్పించేలా లేఖనాల నుండి తర్కించండి. మనస్ఫూర్తిగా వేడుకుంటూ, చక్కని తర్కాన్ని ఉపయోగిస్తూ పౌలు ఒప్పించేలా ‘ఇతరులతో లేఖనాల నుండి తర్కించాడు.’ (అపొ. 17:2, 4) ఆయనలాగే మనం శ్రోతల హృదయాన్ని తాకేందుకు కృషిచేయాలి. ఆ వ్యక్తి పట్ల మీకు శ్రద్ధవుందని చూపించేలా దయతో కొన్ని ప్రశ్నలు వేయడం ద్వారా వారి హృదయంలో ఉన్నదాన్ని బయటికి ‘చేదండి.’ (సామె. 20:5) వేలెత్తి చూపించేలా మాట్లాడకండి. స్పష్టంగా, తర్కబద్ధంగా మాట్లాడండి. మీరు చెబుతున్న మాటలకు సరైన రుజువులు కూడా చూపించండి. వారితో లేఖనాలను ఉపయోగించే మాట్లాడండి. రెండు మూడు లేఖనాలను వరుసగా చదివే బదులు ఓ లేఖనాన్ని చదివి దాన్ని ఉదాహరణలతో వివరించడం మంచిది. మీరు చెబుతున్నదానికి రుజువులను కూడా చూపిస్తే, ‘మీరు ఒప్పించేలా మాట్లాడగలుగుతారు.’ (సామె. 16:23, NW) కొన్నిసార్లు, పరిశోధన చేసి, వారికి అదనపు సమాచారాన్ని వివరించాల్సిరావచ్చు. పైన ప్రస్తావించబడిన 93 ఏళ్ల వృద్ధురాలికి అమర్త్యమైన ఆత్మ అనే సిద్ధాంతాన్ని చాలామంది ఎందుకు నమ్ముతారో వివరించాల్సివచ్చింది. ఆమె బైబిలు బోధలను ఒప్పుకునేలా చేసేందుకు ఆ సిద్ధాంతం ఎక్కడ పుట్టుకొచ్చింది, ప్రపంచ మతాల్లోకి ఎలా ప్రవేశించింది వంటి విషయాలను వివరించాల్సివచ్చింది. b

నైపుణ్యంతో ఉపయోగిస్తూ ఉండండి

18, 19. ‘ఆత్మ ఖడ్గాన్ని’ మనం ఎందుకు నైపుణ్యంతో ఉపయోగిస్తూ ఉండాలి?

18 “ఈ లోకపు నటన గతించుచున్నది” అని బైబిలు చెబుతోంది. దుష్టులు మరింత దుష్టులుగా మారుతున్నారు. (1 కొరిం. 7:31; 2 తిమో. 3:13) ‘దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని’ ఉపయోగిస్తూ ‘దుర్గాలను’ పడద్రోయడం చాలా ప్రాముఖ్యం.

19 దేవుని వాక్యమైన బైబిలు మన దగ్గర ఉన్నందుకు, అబద్ధ బోధలను వేళ్లతో సహా పెకిలించి, యథార్థహృదయులైనవారికి ప్రకటించేలా దానిలోని శక్తివంతమైన సందేశాన్ని ఉపయోగించే అవకాశం లభించినందుకు మనం ఎంత సంతోషిస్తున్నాం! ఆ సందేశం కన్నా బలమైన దుర్గాలు ఏవీ లేవు. కాబట్టి, దేవుడు ఇచ్చిన రాజ్య ప్రకటనా పనిలో ఆ ‘ఆత్మఖడ్గాన్ని’ నైపుణ్యంగా ఉపయోగించేందుకు నిజాయితీగా కృషిచేద్దాం.

[అధస్సూచీలు]

a బైబిలు పుస్తకాల పూర్వాపరాలను తెలుసుకోవడానికి చక్కని సమాచారం “ప్రతిలేఖనము దైవప్రేరేపితమును, ప్రయోజనకరమునై ఉన్నది” (ఆంగ్లం), లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) వంటి పుస్తకాల్లో, కావలికోట సంచికల్లో “యెహోవా వాక్యము సజీవమైనది” అనే శీర్షికతో వచ్చిన ఆర్టికల్స్‌లో కనుగొనవచ్చు.

b మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే . . . అనే బ్రోషుర్‌లోని 5-16 పేజీలు చూడండి.

మీరేమి నేర్చుకున్నారు?

• దేవుని వాక్యం శక్తివంతమైనదని ఎందుకు చెప్పవచ్చు?

• మనం ఎలా ‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించవచ్చు?’

• బైబిల్లోని సందేశం ‘దుర్గాలను’ ఏమి చేయగలదు?

• పరిచర్యలో ఒప్పించేలా మాట్లాడే విషయంలో మీరు ఎలా ప్రగతి సాధించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[12వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఇతరులను ఒప్పించేలా దేవుని వాక్యాన్ని ఎలా ఉపయోగించవచ్చు?

▪ బైబిలు పట్ల గౌరవం ఏర్పడేలా బోధించండి

▪ లేఖనాలను వివరించండి

▪ హృదయాలను తాకేలా ఒప్పించే విధంగా తర్కించండి

[11వ పేజీలోని చిత్రం]

‘ఆత్మ ఖడ్గాన్ని’ సమర్థంగా ఉపయోగించడాన్ని నేర్చుకోండి