“ఆధ్యాత్మికంగా వికసించడం పిల్లల హక్కు”
“ఆధ్యాత్మికంగా వికసించడం పిల్లల హక్కు”
పి ల్లల హక్కులకు సంబంధించిన స్వీడన్ అకాడమీవాళ్లు 2008, డిసెంబరు 9న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో “ఆధ్యాత్మికంగా వికసించడం పిల్లల హక్కు” అనే అంశం మీద చర్చ జరిగింది. స్వీడన్ చర్చి నుండి, ఇతర క్రైస్తవమత శాఖల నుండి, ఇస్లాం మతం నుండి వచ్చిన ప్రతినిధులు, మానవతావాదులు ఆ విషయం మీద రకరకాల అభిప్రాయాలను వ్యక్తంచేశారు.
ఓ మతాధికారి తన ప్రసంగంలో ఇలా అన్నాడు: “పిల్లల ఆధ్యాత్మికతకు బైబిల్లోని అనేక వృత్తాంతాలు ఎంత అవసరమో ఎవరూ పూర్తిగా వివరించలేరు.” బైబిలు వృత్తాంతాలు పిల్లల ఆధ్యాత్మిక అవసరాలను ఎలా తీరుస్తాయి?
“పిల్లలు సొంతగా ఆలోచించడానికి, ధ్యానించడానికి కావాల్సిన సమాచారం లేఖనాల్లో ఉంది” అని ఆ మతాధికారి అన్నాడు. ఆయన “ఆదాముహవ్వల, కయీను హేబెలుల, దావీదు గొల్యాతుల కథలను, యేసు పుట్టుకను గురించిన, సుంకరి అయిన జక్కయ్య గురించిన వృత్తాంతాలను, తప్పిపోయిన కుమారుడు, మంచి పొరుగువాడైన సమరయుడు వంటి ఉపమానాలను” ప్రస్తావించాడు. అవి, “మోసం, క్షమించడం, పాప పరిహారం చెల్లించడం, ద్వేషించడం, పతనమవడం, నష్టపరిహారం చెల్లించడం, సహోదర ప్రేమనూ నిస్వార్థ ప్రేమనూ చూపించడం వంటి ప్రాముఖ్యమైన విషయాల్లో పిల్లవాడి ఆలోచనను సరిదిద్దగలవు.” అప్పుడు “ఈ లేఖనాల్లో నేర్చుకున్నవి వారి జీవితంలో భాగమౌతాయి, వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు, పాటించగలుగుతారు” అని కూడా ఆయన అన్నాడు.
బైబిలు చదవమని చెప్పడం మంచిదే. కానీ తాము చదివిన లేఖనాలను “సొంతగా ఆలోచించి, ధ్యానించి,” సరైన విధంగా అర్థంచేసుకునే సామర్థ్యం పిల్లలకు ఉందా?
పెద్దవాళ్లకు కూడా లేఖనాలను వివరించాల్సి ఉంటుంది కదా. ఉదాహరణకు, “సొంతగా ఆలోచించి, ధ్యానించడం” ద్వారా నిజమైన ఆధ్యాత్మికతను సంపాదించుకోలేని ఐతియోపీయుడైన అధికారి గురించి బైబిలు తెలియజేస్తుంది. ఆయన యెషయా ప్రవచనాన్ని సొంతగా చదివాడు కానీ ఆయనకు ఏమీ అర్థంకాలేదు. ప్రవక్త చెప్పిన సందేశాన్ని ఆయన అర్థం చేసుకోవాలనుకున్నాడు కాబట్టి శిష్యుడైన ఫిలిప్పు సహాయాన్ని అంగీకరించాడు. (అపొ. 8:26-40) ఆయనకే కాదు లేఖనాలను అర్థం చేసుకోవడానికి మనందరికీ ముఖ్యంగా పిల్లలకు సహాయం అవసరం.
“బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును” అని బైబిలు చెబుతోంది. (సామె. 22:15) పిల్లలకు మార్గనిర్దేశం అవసరం. అయితే అది ఇవ్వాల్సింది తల్లిదండ్రులే. వారు బైబిలు చదువుతున్నప్పుడు, సంఘ కూటాలకు హాజరైనప్పుడు తాము నేర్చుకున్న నైతిక, ఆధ్యాత్మిక విషయాలను తమ పిల్లలకు బోధించాలి. ఆ శిక్షణ పొందే హక్కు పిల్లలకు ఉంది. పిల్లలు ఆధ్యాత్మికంగా వికసించాలంటే వారికి ఖచ్చితమైన బైబిలు జ్ఞానం అవసరం. కాబట్టి పసితనం నుండి వారికి ఆ జ్ఞానం అందేలా చూడాలి. అప్పుడే వారు “వయసు వచ్చిన” వారిలా “అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు” కలిగివుంటారు.—హెబ్రీ. 5:14.