కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తమ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునేలా యువతకు సహాయపడే ఓ సాధనం

తమ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునేలా యువతకు సహాయపడే ఓ సాధనం

తమ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునేలా యువతకు సహాయపడే ఓ సాధనం

“నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము” అని దాదాపు 3,000 సంవత్సరాల క్రితం జ్ఞానియైన సొలొమోను రాశాడు. (ప్రసం. 12:2) అలా చేసేందుకు సహాయం చేసే మరో సాధనం క్రైస్తవ యువతీయువకులు ఇప్పుడు అందుబాటులో ఉంది. 2008 మే నుండి 2009 జనవరి వరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన “పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తోంది” అనే యెహోవాసాక్షుల జిల్లా సమావేశాల్లో యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) 2వ సంపుటి విడుదల చేయబడింది.

ఈ పుస్తకం కవరు పేజీలో యువతీయువకుల కోసం పరిపాలక సభ రాసిన ఓ ఉత్తరం ఉంది. దానిలో కొన్ని వాక్యాలు ఇలా ఉన్నాయి: ‘ఈ రోజుల్లో యువత ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను, శోధనలను మీరు తట్టుకొని నిలబడేందుకు, దేవునికి ఇష్టమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ పుస్తకంలోని సమాచారం మీకు సహాయపడాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.’

తల్లిదండ్రులు తమ పిల్లల్ని “ప్రభువు [యెహోవా] యొక్క శిక్షలోను బోధలోను” పెంచాలని కోరుకోవడం సహజమే. (ఎఫె. 6:4) అయితే, యుక్తవయసుకు చేరుకున్న చాలామంది యువతీయువకుల్లో ఆత్మవిశ్వాసం లోపించడంవల్ల ఎవరైనా తమకు మార్గనిర్దేశం ఇవ్వాలని ఆశిస్తారు. మీకు యుక్తవయసు పిల్లలు ఉన్నట్లయితే, ఈ పుస్తకం నుండి పూర్తి ప్రయోజనం పొందేలా వారికి మీరు ఎలా సహాయం చేయగలరు? కింద కొన్ని సలహాలు ఇవ్వబడ్డాయి.

ముందు మీ కోసం ఒక కాపీని తీసుకొని దానిలో ఉన్న విషయాలను పూర్తిగా తెలుసుకోండి. కేవలం పుస్తకాన్ని చదివితే సరిపోదు. విషయాలను ఎలా వివరించారో గ్రహించడానికి ప్రయత్నించండి. ఈ పుస్తకం, యువతకు తప్పొప్పుల గురించి వివరించే బదులు వారి ‘జ్ఞానేంద్రియాలకు’ శిక్షణనిచ్చేందుకు రూపొందించబడింది. (హెబ్రీ. 5:14) వారు ధైర్యంగా ఎలా సరైనది చేయవచ్చో చూపించే కొన్ని పాటించదగిన సలహాలున్నాయి. ఉదాహరణకు, యౌవనస్థులు ఒత్తిళ్లు ఎదురైనప్పుడు కాదు, కూడదు అని చెప్పి ఊరుకోకుండా అలా ఎందుకు చెబుతున్నారో కూడా వివరించేందుకు 15వ అధ్యాయం (‘తోటివారి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?’) సహాయం చేస్తుంది. ప్రతీరోజూ తాము ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవడానికి బైబిలు సూత్రాలను ఎలా ఉపయోగించవచ్చో, ఆయా సందర్భాల్లో తోటివారు అడిగే ప్రశ్నలకు ఎలా జవాబివ్వవచ్చో ఈ పుస్తకం వివరిస్తుంది. ఆ సలహాలను పాటిస్తే వారు “ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో” తెలుసుకోగలుగుతారు.—కొలొ. 4:6.

సంభాషణా శైలిలోవున్న భాగాలను ఉపయోగించండి. ఈ భాగాలు యౌవనుల కోసమే తయారుచేయబడినప్పటికీ, మీ సొంత కాపీల్లో సాధ్యమైన చోట ఖాళీలను పూరించడానికి ప్రయత్నించండి. a ఉదాహరణకు, 16వ పేజీలో డేటింగ్‌కి సంబంధించి రెండు ప్రశ్నలను చదువుతున్నప్పుడు, మీరు మీ అబ్బాయి/అమ్మాయి వయసులో ఉన్నప్పుడు వాటి గురించి మీకు ఏమి అనిపించేదో గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇవ్వబడిన ఖాళీ స్థలంలో అప్పట్లో ఎలా జవాబు చెప్పివుండేవారో రాయవచ్చు. అప్పుడిలా ప్రశ్నించుకోండి: ‘ఈ విషయంలో సంవత్సరాలు గడుస్తుండగా నా ఆలోచనలో ఎలాంటి మార్పులొచ్చాయి? యుక్తవయసు నుండి ఇప్పటివరకు నా అవగాహన ఎంత పెరిగింది? నా పిల్లలకు సహాయం చేసేందుకు దాన్ని నేను ఎలా చక్కగా ఉపయోగించవచ్చు?’

యౌవనుల ఏకాంతతను గౌరవించండి. ఈ పుస్తకంలోని సంభాషణా శైలిలో ఉన్న భాగాలు, మీ పిల్లలు తమ మనసులో ఉన్నదాన్ని పుస్తకంలో రాసేలా లేక దాని గురించి ఆలోచించేలా చేస్తాయి. మీరు వాళ్ల హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి కానీ వారి పుస్తకంలో ఏముందనేది కాదు. పుస్తకంలోని 3వ పేజీలో ‘తల్లిదండ్రులకు గమనిక’ అని ఉన్న భాగంలో ఇలా ఉంది: ‘యౌవనులు తమ మనసులో ఉన్నది నిజాయితీగా రాసేలా వారికి కొంత ఏకాంతాన్ని ఇవ్వండి. ఆ తర్వాత వారు తాము రాసుకున్న విషయాల గురించి మీతో మాట్లాడడానికి సంకోచించకపోవచ్చు.’

కుటుంబ బైబిలు అధ్యయనంలో ఉపయోగించవచ్చు

మీ కుటుంబ ఆరాధన సమయంలో ఉపయోగించడానికి యువత అడిగే ప్రశ్నలు (ఆంగ్లం) 2వ సంపుటి ఎంతో చక్కటి పుస్తకం. అయితే, ప్రతీ పేరాకు ప్రశ్నలు లేవు కాబట్టి, మీరు దాన్ని ఎలా ఉపయోగించవచ్చు? మీ పిల్లలతో ఎలా అధ్యయనం చేస్తే బాగుంటుందో చూసి ఆ విధంగా అధ్యయనం చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి.

ఉదాహరణకు, కొన్ని కుటుంబాలు తమ కుటుంబ అధ్యయనమప్పుడు 132, 133 పేజీల్లోవున్న ‘తోటివారి ఒత్తిడిని నేను ఇలా ఎదుర్కొంటాను’ అనే భాగాన్ని ప్రాక్టీసు చేయవచ్చు. తమకు చాలా కష్టమనిపించే సమస్యను గుర్తించడానికి అక్కడ ఇవ్వబడిన మొదటి ప్రశ్న మీ పిల్లలకు సహాయం చేస్తుంది. ఎక్కడ ఆ సమస్య ఎదురుకావచ్చో గుర్తించడానికి రెండవ ప్రశ్న సహాయం చేస్తుంది. తోటివారి ఒత్తిడికి లొంగిపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సివుంటుందో లేక దాన్ని ఎదిరిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఆలోచించిన తర్వాత మీ పిల్లలు ఎలా సమాధానం చెప్పాలనుకుంటున్నారో పుస్తకంలో రాసుకోవచ్చు. అంటే మృదువుగా జవాబివ్వాలో, తెలివిగా జవాబివ్వాలో, లేదా ధీటుగా జవాబివ్వాలో వారు నిర్ణయించుకోవచ్చు. మీ పిల్లలు ధైర్యంగా ఎలాంటి కష్టం లేకుండా, ఆత్మవిశ్వాసంతో, నేర్పుతో జవాబిచ్చేలా సిద్ధపడేందుకు వారికి సహాయం చేయండి.—కీర్త. 119:46.

మాట్లాడుకోవడానికి సహాయం చేసే పుస్తకం

యువత అడిగే ప్రశ్నలు (ఆంగ్లం) 2వ సంపుటి, యువతీయువకులు తమ తల్లిదండ్రులతో మాట్లాడాలని ప్రోత్సహిస్తోంది. ఉదాహరణకు, సున్నితమైన విషయాలు సహితం తల్లిదండ్రులతో మాట్లాడడానికి సహాయం చేసే కొన్ని పాటించదగిన సలహాలు, ‘లైంగిక విషయాల గురించి అమ్మానాన్నలతో నేను ఎలా మాట్లాడగలను?’ (63-64 పేజీలు), ‘మీ తల్లిదండ్రులతో మాట్లాడండి!’ (189వ పేజీ) వంటి బాక్సుల్లో ఉన్నాయి. ఓ 13 ఏళ్ల అమ్మాయి ఇలా రాసింది: “నన్ను బాధిస్తున్న విషయాల గురించి, నేను చేసిన కొన్ని పనుల గురించి తల్లిదండ్రులతో మాట్లాడడానికి కావాల్సిన ధైర్యాన్ని ఈ పుస్తకం నాకు ఇచ్చింది.”

తల్లిదండ్రులు, పిల్లలు మాట్లాడుకోవడానికి ఈ పుస్తకం వేరే విధాలుగా కూడా దోహదపడుతుంది. ప్రతీ అధ్యాయం చివర్లో ‘మీరు ఏమి అనుకుంటున్నారు?’ అనే బాక్సు ఉంది. ఆ బాక్సును కేవలం పునఃసమీక్ష కోసమే కాక, కుటుంబంగా చర్చించుకోవడానికి అవసరమైన సమాచారంగా కూడా ఉపయోగించవచ్చు. ప్రతీ అధ్యాయం చివర్లో ‘నేను ఇలా చేయాలనుకుంటున్నాను’ అనే బాక్సు కూడా ఉంది. ఒక అధ్యాయంలో నేర్చుకున్నవి వారు ఎలా పాటించాలనుకుంటున్నారో రాయడానికి ఈ బాక్సుల్లో ఖాళీలున్నాయి. ఆ బాక్సు చివర్లోనే, ‘నేను మా అమ్మానాన్నలను ఈ విషయం గురించి అడగాలనుకుంటున్నాను. . . ’ అని ఉంది. యువతీయువకులు తమ తల్లిదండ్రుల మంచి సలహా తీసుకోవడానికి ఇది సహాయం చేస్తుంది.

హృదయాన్ని చేరుకోండి!

తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల హృదయాన్ని చేరుకోవడానికి కృషిచేయాలి. ఈ విషయంలో, యువత అడిగే ప్రశ్నలు (ఆంగ్లం) 2వ సంపుటి మీకు సహాయకరంగా ఉంటుంది. ఒక తండ్రి తన కూతురితో దాపరికంలేకుండా మాట్లాడడానికి ఈ పుస్తకాన్ని ఎలా ఉపయోగించగలిగాడో చూడండి.

“నేను, రిబేకా ఇష్టపడే కొన్ని మంచి ప్రదేశాలున్నాయి. ఆ ప్రదేశాల్లో వాహ్యాళికి వెళ్లడమన్నా, బైకు మీద వెళ్లడమన్నా లేదా కారులో వెళ్లడమన్నా మాకు ఎంతో ఇష్టం. అలాంటి ప్రదేశాల్లో రిబేకా మనసు విప్పి మాట్లాడుతోందని గమనించాను.

“మేము మొదట పరిపాలక సభ నుండి వచ్చిన ఉత్తరాన్ని, ‘తల్లిదండ్రులకు గమనిక’ అనే భాగాన్ని చర్చించాం. 3వ పేజీలో ఉన్నట్లుగా, తన అభిప్రాయాలను స్వేచ్ఛగా పుస్తకంలో రాయవచ్చనే విషయం మా కూతురికి తెలియాలని అలా చేశాను. ఆమె ఏమి రాసిందో నేను చూసేవాణ్ణి కాదు.

“తను నాతో చర్చించాలనుకుంటున్న అధ్యాయాలను ఎంచుకోమని రిబేకాకు చెప్పాను. మొదట ఆమె, ‘నేను వీడియో గేములు ఆడాలా?’ అనే అధ్యాయాన్ని ఎంచుకుంది. ఆమె ఆ అధ్యాయాన్ని ఎంచుకుంటుందని అసలు ఊహించనేలేదు! అయితే, ఆమె స్నేహితుల్లోని చాలామంది ఎంతో భయంకరమైన గేములను ఆడుతున్నారు కాబట్టి ఆమె ఆ అధ్యాయాన్ని ఎంచుకుంది. వీడియో గేముల్లో హింస, బూతు మాటలు ఉంటాయని అంతవరకు నాకు తెలియనే తెలియదు! కానీ 251వ పేజీలోని ‘నేను ఇలా చేయాలనుకుంటున్నాను’ అనే అంశాన్ని మేము చర్చిస్తున్నప్పుడు ఆ విషయం తెలుసుకున్నాను. ఎవరైనా అలాంటి గేమ్‌ ఆడమని ఒత్తిడి చేస్తే ఎలా జవాబివ్వాలో తెలుసుకోవడానికి ఈ బాక్సు రిబేకాకు కూడా సహాయం చేసింది.

“ఇప్పుడు రిబేకా తన పుస్తకంలో రాసుకున్నవి నాకు చెప్పడానికి సంకోచించదు. మేము చక్కగా సంభాషించుకుంటూ అధ్యయనం చేస్తున్నాం. మేము తలా ఒక పేరా చదివిన తర్వాత తను పుస్తకంలో ఇవ్వబడిన చిత్రాలు బాక్సులతోసహా ప్రతీ విషయంపై మాట్లాడాలనుకుంటుంది. అలా, తన వయసులో ఉన్నప్పుడు నాకు ఎలా అనిపించేదో చెప్పే అవకాశం నాకు దొరుకుతుంది. నేను మాట్లాడిన తర్వాత నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయో తను నాకు చెబుతుంది. ఆమె ప్రతీ విషయం నాకు చెప్పాలనుకుంటుంది!”

మీరు తల్లిదండ్రులైతే, ఈ పుస్తకం విడుదల చేయబడినప్పుడు ఎంతో సంతోషించివుంటారు. దీన్ని బాగా ఉపయోగించే అవకాశం మీకు ఇప్పుడు ఉంది. యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) 2వ సంపుటి మీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందని పరిపాలక సభ ఆశిస్తుంది. “ఆత్మానుసారముగా నడుచు[కునేందుకు]” మీకందరికీ, ముఖ్యంగా మన యౌవనులందరికీ ఈ పుస్తకం సహాయం చేయును గాక!—గల. 5:16.

[అధస్సూచి]

a సంభాషణా శైలిలోవున్న కొన్ని వర్క్‌ షీట్లు అన్ని వయసులవారికి ఉపయోగకరంగా ఉంటాయి. ఉదాహరణకు, ‘మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి’ అనే బాక్సు (221వ పేజీ) మీ పిల్లలకు ఎంత సహాయకరంగా ఉంటుందో మీకూ అంతే సహాయకరంగా ఉండవచ్చు. ‘తోటివారి ఒత్తిడిని నేను ఇలా ఎదుర్కొంటాను’ (132-133 పేజీలు), ‘నెల బడ్జెట్‌’ (163వ పేజీ), ‘నా లక్ష్యాలు’ (314వ పేజీ) వంటి శీర్షికలు కూడా ఉపయోగపడతాయి.

[30వ పేజీలోని బాక్సు]

కొంతమంది యౌవనస్థులు ఏమి చెబుతున్నారంటే . . .

“పెన్సిల్‌ పట్టుకొని ధ్యానిస్తూ చదవాల్సిన పుస్తకం ఇది. ఇది వ్యక్తిగత డైరీలా ఉంటుంది కాబట్టి మీ మనసులోవున్న విషయాలు రాసుకోవచ్చు. అలా మీకోసం మీరు ఓ శ్రేష్ఠమైన జీవిత మార్గాన్ని ఏర్పర్చుకోగలుగుతారు.”—నికోలా.

“డేటింగ్‌ చేయాలని ఇతరులు, చివరికి నా మంచి కోరేవారు కూడా నాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎవరేమి చెప్పినా నేను డేటింగ్‌కి సిద్ధంగా లేనని ఈ పుస్తకంలోని మొదటి భాగం చదివి తెలుసుకున్నాను.”—కట్రీనా.

“‘మీరు బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నారా?’ అనే బాక్సు, నేను నా బాప్తిస్మాన్ని మరింత గంభీరమైనదిగా పరిగణించడానికి నాకు సహాయం చేసింది. నా అధ్యయన అలవాట్లు, ప్రార్థన అలవాట్లు ఎలా ఉన్నాయో చూసుకోవడానికి అది నన్ను ప్రోత్సహించింది.”—యాష్లీ.

“నా క్రైస్తవ తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి నాకు నేర్పించినప్పటికీ, నా జీవితంలో నేను ఏమి చేయాలో వ్యక్తిగతంగా ఆలోచించుకునేలా ఈ పుస్తకం నాకు సహాయం చేసింది. నా తల్లిదండ్రులతో ముందుకన్నా ఎక్కువగా దాపరికం లేకుండా మాట్లాడడానికి కూడా నాకు సహాయం చేసింది.”—జమీరా.

[31వ పేజీలోని చిత్రం]

తల్లిదండ్రులారా, మీరు ఈ పుస్తకంలో ఉన్న విషయాలను పూర్తిగా తెలుసుకోండి

[32వ పేజీలోని చిత్రం]

మీ పిల్లల హృదయాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి