కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ఏ పరిస్థితిలో మళ్లీ బాప్తిస్మం తీసుకోవడం గురించి ఆలోచించవచ్చు?

బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి, తన బాప్తిస్మం ఎంత వరకు సరైనది, తాను మళ్లీ బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరముందా అని కొన్ని పరిస్థితుల్లో ఆలోచించవచ్చు. ఉదాహరణకు, ఓ వ్యక్తి తన జీవితాన్ని సరిదిద్దుకోకుండా బాప్తిస్మం తీసుకునే సమయానికి కూడా రహస్యంగా తప్పుచేస్తూ లేదా ప్రవర్తిస్తూ ఉండవచ్చు లేక లేఖన విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు. ఆయన ఒకవేళ అప్పటికే యుక్తరీతిలో బాప్తిస్మం తీసుకొని ఉంటే అలాంటి తప్పు లేదా ప్రవర్తన కారణంగా ఆ వ్యక్తి బహిష్కరించబడి ఉండేవాడు. అలా తననుతాను సరిదిద్దుకోకుండానే ఓ వ్యక్తి దేవునికి సమర్పించుకోవచ్చా? ఆ వ్యక్తి లేఖన విరుద్ధమైన ప్రవర్తనను మానుకుంటేనే యెహోవాకు యుక్తరీతిలో సమర్పించుకునే అవకాశముంది. అందువల్ల, అలాంటి తీవ్రమైన లోపమున్నా ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకున్నట్లయితే, అతడు మళ్లీ బాప్తిస్మం తీసుకోవడం గురించి ఆలోచించవచ్చు.

మరో వ్యక్తి ఇలా చేశాడనుకుందాం. అతడు బాప్తిస్మం తీసుకునే సమయానికి పాపం చేయలేదు కానీ, బాప్తిస్మం తీసుకున్న తర్వాత తప్పిదం చేశాడు. ఆ కారణంగా ఆ వ్యక్తి విషయంలో న్యాయనిర్ణయ కమిటీ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అప్పుడు ఏమి చేయాలి? ఒకవేళ ఆ వ్యక్తి తాను బాప్తిస్మం తీసుకునే సమయానికి తానేమి చేస్తున్నానో తనకు పూర్తి అవగాహన లేదు కాబట్టి తాను యుక్తరీతిలో బాప్తిస్మం తీసుకోలేదని చెబితే అప్పుడు ఏమి చేయాలి? పెద్దలు ఆ తప్పిదస్థునితో మాట్లాడేటప్పుడు అతని బాప్తిస్మానికి విలువలేదన్నట్లు మాట్లాడకూడదు, అతని సమర్పణ, బాప్తిస్మం తనకు యుక్తమైనదిగా అన్పిస్తుందా లేదా అని అడగకూడదు. ఎందుకంటే ఆయన బాప్తిస్మానికున్న ప్రాముఖ్యతను తెలియజేసే లేఖనాధారిత ప్రసంగాన్ని విన్నాడు. అంతేకాక, సమర్పణ, బాప్తిస్మానికి సంబంధించిన ప్రశ్నలన్నిటికీ ఆయన “అవును” అని జవాబిచ్చాడు. ఆ తర్వాత ఆయన బట్టలు మార్చుకొని, నీటిలో మునిగి బాప్తిస్మం తీసుకున్నాడు. కాబట్టి, తాను తీసుకుంటున్న చర్యలు ఎంత ప్రాముఖ్యమైనవో ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నాడని తెలుస్తోంది. అందుకే, పెద్దలు ఆయనను బాప్తిస్మం తీసుకున్న వ్యక్తిగా పరిగణించాలి.

ఆ వ్యక్తి ఒకవేళ తన బాప్తిస్మం యుక్తమైనది కాదని వాదిస్తే, పెద్దలు అతనికి కావలికోట (ఆంగ్లం), మార్చి 1, 1960 సంచికలోని 159, 160 పేజీలను; ఫిబ్రవరి 15, 1964 సంచికలోని 123 నుండి 126 పేజీలను చూపించాలి. ఆ పత్రికల్లో మళ్లీ బాప్తిస్మం తీసుకోవడం గురించిన మరింత సమాచారముంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో (బాప్తిస్మం తీసుకునే సమయానికి బైబిలు అవగాహన అంతగా లేకపోవడం వంటి పరిస్థితుల్లో) బాప్తిస్మం తీసుకోవాలా వద్దా అనేది వ్యక్తిగత విషయం.

చాలామందితో కలిసి ఒకే గదిలో లేక ఒకే ఇంట్లో నివసించాల్సిన పరిస్థితిలో క్రైస్తవులు ఏ విషయాల గురించి ఆలోచించాలి?

ప్రతీ ఒక్కరికీ తలదాచుకునేందుకు ఓ గూడు అవసరం. అయితే, నేడు చాలామందికి ఆ గూడే లేదు. ఆర్థిక పరిస్థితుల వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల, లేదా ఇతర సమస్యల వల్ల ఉమ్మడి కుటుంబంలో జీవించాల్సిన పరిస్థితి ఓ వ్యక్తికి ఎదురుకావచ్చు. కొన్ని దేశాల్లో ఏకాంతానికి అసలు అవకాశమే లేని విధంగా బంధువులందరూ ఒకే గదిలో నివసిస్తుండవచ్చు.

ప్రపంచవ్యాప్త సంఘంలోని సహోదరసహోదరీలు ఎలాంటి గృహాల్లో, ఎలాంటి వారితో, ఎలాంటి పరిస్థితిలో నివసించవచ్చో తెలియజేసే ఓ పెద్ద లిస్టు తయారుచేసే బాధ్యత యెహోవా సంస్థకు లేదు. తాము ఉంటున్న ఇల్లు, అందులోని పరిస్థితులు దేవుడు ఇష్టపడే విధంగా ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు దోహదపడే లేఖన సూత్రాల గురించి ఆలోచించాలని క్రైస్తవులు ప్రోత్సహించబడుతున్నారు. ఆ సూత్రాల్లో కొన్ని ఏమిటి?

మనతోపాటు నివసిస్తున్నవారు మనమీద, మన ఆధ్యాత్మికతమీద ఎలాంటి ప్రభావం చూపిస్తారో మొదట ఆలోచించాలి. మనతో ఎవరుంటున్నారు? వారు యెహోవా ఆరాధకులా? వారు బైబిలు ప్రమాణాల ప్రకారం జీవిస్తున్నారా? అని కూడా ఆలోచించాలి. “మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును” అని అపొస్తలుడైన పౌలు రాశాడు.—1 కొరిం. 15:33.

జారత్వాన్ని, వ్యభిచారాన్ని యెహోవా ఖండిస్తున్నాడని లేఖనాలు వివరిస్తున్నాయి. (హెబ్రీ. 13:4) అవివాహితులైన స్త్రీపురుషులు భార్యభర్తలన్నట్లుగా సహజీవనం సాగిస్తూ ఒకే గదిలో పడుకోవడం దేవునికి ఆమోదయోగ్యం కానేకాదు. లైంగిక అనైతికతను చూసీచూడనట్లుగా వదిలేసే స్థలంలో ఓ క్రైస్తవుడు నివసించాలని దేవుడు కోరుకోడు.

అంతేకాక, దేవుని అనుగ్రహం పొందాలనుకునే వారందరూ ‘జారత్వానికి దూరంగా పారిపోవాలి’ అని బైబిలు ప్రోత్సహిస్తోంది. (1 కొరిం. 6:18) కాబట్టి, లైంగిక దుర్నీతికి పాల్పడేలా శోధించబడే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశమున్న ఇంటిలో నివసించకుండా ఉండడమే క్రైస్తవులకు శ్రేయస్కరం. ఉదాహరణకు, చాలామంది క్రైస్తవులు ఒకే ఇంటిలో నిద్రపోతుంటారనుకుందాం. ఊహించని పరిస్థితుల్లో మీరక్కడ తప్పుచేసేలా శోధించబడే అవకాశముందా? సాధారణంగా ఇంట్లో ఉండేవారు కాసేపు ఎక్కడికైనా వెళ్తే భార్యాభర్తలుకాని ఇద్దరు వ్యక్తులు అనుకోని విధంగా ఏకాంతంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పుడేమిటి? అలాగే, ఒకరినొకరు ఇష్టపడ్డ ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంట్లో నివసించడం కూడా నైతికంగా ప్రమాదకరమైనదే. అలాంటి పరిస్థితులు ఏర్పడే ఇంటిలో నివసించకుండా ఉండడం తెలివైన పని.

విడాకులు తీసుకున్న ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంట్లో నివసిస్తుండడం కూడా సరైనదికాదు. వారు దాంపత్య జీవితానికి అలవాటుపడిన వ్యక్తులు కాబట్టి, వారు లైంగిక దుర్నీతికి పాల్పడే అవకాశముంది.—సామె. 22:3.

నివాస స్థలాన్ని ఎంపిక చేసుకుంటున్నప్పుడు మరో ముఖ్యమైన విషయాన్ని అంటే సమాజం ఏమనుకుంటుందో కూడా ఆలోచించాలి. తాను ఇంటి విషయంలో చేసుకున్న ఏర్పాట్లలో ఎలాంటి సమస్య లేనట్లు ఓ క్రైస్తవునికి అనిపించవచ్చు, కానీ సమాజంలో దాని గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఆయన దాని గురించి ఆలోచించాలి. మన ప్రవర్తన కారణంగా యెహోవా నామానికి చెడ్డ పేరు రావాలని మనం ఎన్నడూ కోరుకోం. పౌలు ఇలా చెప్పాడు: “యూదులకైనను, గ్రీసుదేశస్థులకైనను, దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోషపెట్టుచున్నాను.”—1 కొరిం. 10:32, 33.

సరైన వసతులు, ఏర్పాట్లున్న ఇంటిని కనుగొనడం యెహోవా నీతియుక్త ప్రమాణాలను పాటించాలనుకునేవారికి ఎంతో కష్టమనిపించవచ్చు. అయితే, క్రైస్తవులు ‘ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో పరీక్షిస్తూ ఉండాలి.’ తమ ఇంటిలో అసభ్యకరమైనదేదీ జరగకుండా చూసుకోవాలి. (ఎఫె. 5:5, 10) అలా చూసుకోవాలంటే క్రైస్తవులు దేవుని మార్గనిర్దేశం కోసం ప్రార్థిస్తూ తమదే కాక ఇతరుల శారీరక, నైతిక సంక్షేమం కోసం, యెహోవా ముందు మంచి పేరు కోసం చేయగలిగినదంతా చేయాలి.