కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు యెహోవాను తండ్రిగా పరిగణిస్తున్నారా?

మీరు యెహోవాను తండ్రిగా పరిగణిస్తున్నారా?

మీరు యెహోవాను తండ్రిగా పరిగణిస్తున్నారా?

‘ప్రభువా, మాకు ప్రార్థన చేయ నేర్పుము’ అని యేసును, ఆయన శిష్యుల్లో ఒకరు అడిగినప్పుడు యేసు, “మీరు ప్రార్థన చేయునప్పుడు—తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక” అని చెప్పమని అన్నాడు. (లూకా 11:1, 2) ‘సర్వశక్తుడు,’ ‘మహోపదేశకుడు,’ ‘సృష్టికర్త,’ ‘మహావృద్ధుడు,’ ‘యుగములలో రాజా’ వంటి పెద్దపెద్ద బిరుదులు ఉపయోగించి యెహోవా గురించి యేసు మాట్లాడివుండేవాడే. (ఆది. 49:25; యెష. 30:20, NW; 40:28; దాని. 7:9; 1 తిమో. 1:17) కానీ, యేసు “తండ్రీ” అనే పదాన్ని ఉపయోగించాడు. ఎందుకు? ఓ చిన్నపిల్లవాడు ప్రేమగల తన తండ్రి దగ్గరకు ఎలా వెళ్తాడో అలాగే మనం విశ్వంలోని అతి గొప్ప వ్యక్తిని సమీపించాలని ఆయన అలా చెప్పివుంటాడు.

దేవుణ్ణి తమ తండ్రిగా ఊహించుకోవడం కొందరికి కష్టమే. అనిత a అనే ఓ క్రైస్తవురాలు ఇలా ఒప్పుకుంటోంది, “బాప్తిస్మం తీసుకొని ఎన్నో ఏళ్లు గడిచిన తర్వాత కూడా యెహోవాకు దగ్గరవడం, ఆయనను తండ్రిగా ఊహించుకొని ప్రార్థించడం నాకు కష్టమైంది.” దానికిగల ఒక కారణాన్ని చెబుతూ ఆమె ఇలా అంది: ‘నాకు ఊహ తెలిసి మా నాన్న నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసుకోలేదు.’

అపాయకరమైన ఈ అంత్యదినాల్లో, తండ్రులు తాము చూపించాల్సిన ‘అనురాగాన్ని’ చూపించట్లేదు. (2 తిమో. 3:1, 3) కాబట్టి, అనితకు అనిపించినట్లే చాలామందికి అనిపించవచ్చు. కానీ, నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, యెహోవాను ప్రేమగల తండ్రిగా పరిగణించడానికి ఎన్నో కారణాలున్నాయి.

యెహోవా ప్రేమగల పోషకుడు

యెహోవాను తండ్రిగా పరిగణించాలంటే మనం ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవాలి. “తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడు గాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు” అని యేసు చెప్పాడు. (మత్త. 11:27) యెహోవా ఎంత ప్రేమగల తండ్రో తెలుసుకోవడానికి మనకు ఓ ఉత్తమమైన మార్గం ఉంది. మనం సత్యదేవుని గురించి యేసు చెప్పిన విషయాలను ఆలోచించడమే ఆ మార్గం. అయితే, యేసు తన తండ్రి గురించి ఏమి చెప్పాడు?

యెహోవా తన జీవదాత అని చెబుతూ యేసు ఇలా అన్నాడు: ‘నేను తండ్రి మూలముగా జీవించుచున్నాను.’ (యోహా. 6:57) మనం కూడా ఉనికిలో ఉన్నందుకు తండ్రికి రుణపడివున్నాం. (కీర్త. 36:9; అపొ. 17:28) యెహోవా ఇతరులకు ఎందుకు జీవాన్నిచ్చాడు? ప్రేమ ఉండడంవల్లనే కదా? అంత మంచి బహుమానం ఇచ్చినందుకు కృతజ్ఞతగా మనం మన పరలోక తండ్రిని ప్రేమించాలి.

మానవుల కోసం తన కుమారుణ్ణి విమోచన క్రయధనంగా అర్పించడం ద్వారా వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుడు చూపించాడు. అలా ప్రేమ చూపించాడు కాబట్టి, పాపులైన మానవులు తన ప్రియ కుమారుని ద్వారా ఆయనతో దగ్గరి సంబంధాన్ని ఏర్పరచుకోవడం సాధ్యమైంది. (రోమా. 5:12; 1 యోహా. 4:9, 10) అంతేకాక, మన పరలోక తండ్రి తాను ఇచ్చిన మాటను నెరవేరుస్తాడు కాబట్టి, ఆయనను ప్రేమిస్తూ ఆయనకు లోబడేవారందరూ చివరకు, ‘దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యాన్ని’ అనుభవిస్తారు.—రోమా. 8:20, 21.

అంతేకాక, మన పరలోక తండ్రి ప్రతీరోజు మనమీద ‘తన సూర్యుణ్ణి ఉదయింపజేస్తాడు.’ (మత్త. 5:45) సూర్యుడు ఉదయించాలని మనం ప్రార్థించం. దానికోసం ప్రార్థించాలనే ఆలోచన కూడా మనకు రాకపోవచ్చు. అయినప్పటికీ మనకు అది ఎంత అవసరం! మనం వెచ్చని సూర్యకిరణాలను ఎంతగా ఆస్వాదిస్తాం! అంతేకాక, మన అవసరాలను తీర్చడంలో ఆయనకు ఎవరూ సాటిరారు. మనం అడగక ముందే మన అవసరాలేమిటో ఆయనకు తెలుసు. కాబట్టి, మన ప్రేమగల తండ్రి తన సృష్టిని ఎలా చూసుకుంటున్నాడో గమనించి, కృతజ్ఞతతో దాని గురించి ఆలోచించడానికి సమయం తీసుకోవాలి.—మత్త. 6:8, 26.

మన తండ్రి—‘దయగల రక్షకుడు’

పూర్వం దేవుని ప్రజలకు యెషయా ప్రవచనంలో ఈ హామీ ఇవ్వబడింది: “పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు [‘దయగల రక్షకుడైన,’ ద బైబిల్‌ ఇన్‌ లివింగ్‌ ఇంగ్లీష్‌] యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (యెష. 54:10) ఈ విషయాన్నే నొక్కిచెబుతూ యేసు తాను మరణించే ముందు రోజు రాత్రి చేసిన ప్రార్థనలో యెహోవా నిజంగా ‘దయగల రక్షకుడు’ అని చూపించాడు. తన శిష్యుల గురించి ఆయనిలా ప్రార్థించాడు: “వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, . . . నీ నామమందు వారిని కాపాడుము.” (యోహా. 17:11, 14) యేసు అనుచరులను యెహోవా జాగ్రత్తగా కనిపెట్టుకొనివుంటూ, వారిని కాపాడాడు.

మన కాలంలో దేవుడు సాతాను పన్నాగాల నుండి మనల్ని రక్షించడానికి “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” తరగతి ద్వారా సమయానికి తగిన ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తున్నాడు. (మత్త. 24:45) మనం ‘దేవుడిచ్చే సర్వాంగకవచమును ధరించాలంటే’ ఆ బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఉదాహరణకు, ఆ సర్వాంగ కవచంలోని ‘విశ్వాసమను డాలుతో’ మనం “దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులం” అవుతాం. (ఎఫె. 6:11, 16) మన విశ్వాసం ఆధ్యాత్మిక హాని జరగకుండా మనల్ని కాపాడుతుంది, మనల్ని రక్షించే శక్తి దేవునికి ఉందని రుజువుచేస్తుంది.

దేవుని కుమారుడు భూమ్మీదున్నప్పుడు ఎలా ప్రవర్తించాడో జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మన పరలోక తండ్రి ఎంత దయగలవాడో మనం మరింత ఎక్కువగా అర్థంచేసుకోగలుగుతాం. మార్కు 10:13-16 లోవున్న వృత్తాంతాన్ని గమనించండి. అక్కడ యేసు తన శిష్యులతో, “చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి” అని అన్నాడు. ఆ చిన్నపిల్లలు తన చుట్టూ చేరినప్పుడు, యేసు వారిని ప్రేమతో దగ్గరకు తీసుకొని ఆశీర్వదించాడు. సంతోషంతో వారి ముఖాలు ఎలా వెలిగిపోయుంటాయో ఒక్కసారి ఊహించుకోండి! “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు” అని యేసు చెప్పాడు. దీన్నిబట్టి, మనం తనకు దగ్గరవ్వాలనే కోరిక తండ్రికి ఉందని అర్థమౌతుంది.—యోహా. 14:9.

యెహోవా దేవుని ప్రేమ అపారమైనది. పోషించి సంరక్షించే విషయంలో ఆయనకు ఎవరూ సాటిలేరు. అలాంటి వ్యక్తి మనం తనకు సన్నిహితం కావాలని కోరుతున్నాడు. (యాకో. 4:8) నిస్సందేహంగా, యెహోవా మన ఊహకందనంత గొప్ప తండ్రి!

మనం ఎన్నో ప్రయోజనాలు పొందుతాం

ప్రేమానురాగాలుగల తండ్రియైన యెహోవా మీద నమ్మకముంచడం ద్వారా మనం ఎంతో ప్రయోజనం పొందుతాం. (సామె. 3:5, 6) తన తండ్రిని పూర్తిగా నమ్మడంవల్ల యేసు ప్రయోజనం పొందాడు. “నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము” అని క్రీస్తు తన శిష్యులతో అన్నాడు. (యోహా. 8:16) యెహోవా తనకు సహాయం చేస్తాడని యేసు ఎల్లప్పుడూ నమ్మాడు. ఉదాహరణకు బాప్తిస్మమప్పుడు, తండ్రి ఆయనకు ప్రేమతో ఈ అభయాన్నిచ్చాడు: “ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను.” (మత్త. 3:15-17) తాను చనిపోయే కొన్ని క్షణాల ముందు యేసు, “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను” అని బిగ్గరగా అన్నాడు. (లూకా 23:46) ఎప్పటిలాగే ఈ సమయంలో కూడా ఆయన తన తండ్రిమీద బలమైన విశ్వాసముంచాడు.

మన విషయంలోనూ అలాగే జరగవచ్చు. యెహోవా మనకు తోడు ఉండగా దేనికైనా, ఎవరికైనా భయపడాల్సిన అవసరముందా? (కీర్త. 118:6) పైన ప్రస్తావించబడిన అనిత అనే సహోదరి ఎవరి సహాయం తీసుకోకుండా సొంతగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించేది. అయితే, ఆమె యేసు జీవితం గురించి, పరిచర్య గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. ఆ అధ్యయనంలో, యేసుకు తన పరలోక తండ్రితో ఉన్న దగ్గరి సంబంధం గురించి తెలుసుకోవడానికే ఆమె ప్రాముఖ్యతనిచ్చింది. దాని ఫలితమేమిటి? “తండ్రి అనేవాడు ఎలా ఉంటాడో, ఆయనమీద నమ్మకముంచడం అంటే ఏమిటో తెలుసుకున్నాను” అని ఆమె అంటోంది. ఆమె ఇంకా ఇలా చెబుతోంది: “నేను నిజమైన సమాధానాన్ని, సంతోషాన్ని చవిచూశాను. ఇప్పుడిక నేను దేని గురించీ కంగారుపడాల్సిన అవసరంలేదు.”

యెహోవాను మన తండ్రిగా పరిగణించడం వల్ల మనం ఇంకా ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం? పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తారు కాబట్టి వారు ఇష్టపడే విధంగా నడుచుకోవాలనుకుంటారు. దేవుని కుమారుడు ప్రేమతో ‘తన తండ్రికి ఇష్టమైన కార్యాలే ఎల్లప్పుడూ చేశాడు.’ (యోహా. 8:29) అదేవిధంగా, మన పరలోక తండ్రిపట్ల ప్రేమవుంటే మనం జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తూ అందరిముందు ఆయనను ‘స్తుతిస్తాం.’—మత్త. 11:25; యోహా. 5:19.

తండ్రి ‘మన కుడిచేతిని పట్టుకుంటున్నాడు’

అంతేకాక, మన పరలోక తండ్రి మనకు “ఆదరణకర్తను” అంటే పరిశుద్ధాత్మను కూడా అనుగ్రహించాడు. అది “సర్వసత్యములోనికి” నడిపిస్తుందని యేసు చెప్పాడు. (యోహా. 14:15-17; 16:12, 13) మన తండ్రిని బాగా అర్థం చేసుకునేందుకు దేవుని పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. అంతేకాక, “దుర్గములను” పడద్రోసేందుకు అంటే ముందుగా ఏర్పర్చుకున్న అభిప్రాయాలను, తప్పుడు సిద్ధాంతాలను, వక్రీకరించబడిన అభిప్రాయాలను పడద్రోసి ‘ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టేందుకు’ కూడా అది మనకు సహాయం చేస్తుంది. (2 కొరిం. 10:4, 5) కాబట్టి, “పరలోకమందున్న . . . తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును” అనే నమ్మకంతో, వాగ్దానం చేయబడిన “ఆదరణకర్త” కోసం యెహోవాకు ప్రార్థిద్దాం. (లూకా 11:13) యెహోవాకు మరింత దగ్గరయ్యేందుకు పరిశుద్ధాత్మ సహాయం ఇవ్వమని కూడా మనం ప్రార్థించవచ్చు.

తన తండ్రి చేయి పట్టుకుని నడుస్తున్నప్పుడు ఓ చిన్న పిల్లవాడు తాను సురక్షితంగా ఉన్నాననే నమ్మకంతో ధైర్యంగా ఉంటాడు. యెహోవాను నిజంగా మీ తండ్రిగా పరిగణిస్తున్నట్లయితే, మీరు ఊరటనిచ్చే ఈ మాటలను నమ్మవచ్చు: “నీ దేవుడనైన యెహోవానగు నేను—భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.” (యెష. 41:13) దేవునితో నిరంతరం ‘నడిచే’ గొప్ప అవకాశం మీకు లభిస్తుంది. (మీకా 6:8) ఆయన ఇష్టపడేవిధంగా మీరు నడుచుకుంటూ ఉండండి. అప్పుడు, యెహోవాను మీ తండ్రిగా పరిగణించడం వల్ల వచ్చే సంతోషాన్ని, భద్రతాభావాన్ని అనుభవిస్తారు, ఆయన ప్రేమను చవిచూస్తారు.

[అధస్సూచి]

a పేరు మార్చబడింది.