కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సాతాను తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి

సాతాను తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి

సాతాను తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి

‘మోసపోకండి. మీ దేవుడు మీకు సహాయం చేయడు. లొంగిపోండి లేదంటే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది!’ అష్షూరు రాజైన సన్హెరీబు ప్రతినిధి అయిన రబ్షాకే యెరూషలేము నివాసులను బెదిరిస్తూ మాట్లాడిన మాటల్లోని సారాంశం అదే. ఆ రాజు సైన్యాలు యూదా దేశంపై దండెత్తాయి. యెరూషలేమువాసుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి, వారు లొంగిపోయేలా భయాందోళనలకు గురిచేయాలనే అతడు అలా మాట్లాడాడు.—2 రాజు. 18:28-35.

అష్షూరీయులకు కర్కషంగా, క్రూరంగా ప్రవర్తిస్తారనే పేరుంది. బందీలను తామెంత క్రూరాతిక్రూరంగా హింసిస్తారో తెలియజేస్తూ శత్రువుల వెన్నులో చలిపుట్టించేవారు. చరిత్రకారుడైన ఫిలిప్‌ టేలర్‌ చెబుతున్న ప్రకారం అష్షూరీయులు, “తాము స్వాధీనం చేసుకున్న ప్రజలు తమకు అణిగిమణిగి ఉండేలా వారిని తీవ్ర భయాభ్రాంతులకు గురిచేసి, తామెలా ఇతరులను చిత్రహింసలకు గురిచేస్తారో తెలిపే వార్తలు ప్రచారం చేస్తూ వారిని మానసికంగా కృంగదీసేవారు.” ప్రచారం అనేది ఓ శక్తివంతమైన ఆయుధం. అది “ప్రజల మనసులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది” అని టేలర్‌ అన్నాడు.

నిజక్రైస్తవులు ‘శరీరులతో కాదు, దురాత్మల సమూహాలతో’ అంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఆత్మప్రాణులతో ‘పోరాడుతున్నారు.’ (ఎఫె. 6:12) అపవాదియైన సాతాను మన ప్రధాన శత్రువు. అతడు కూడా ప్రజలను భయాభ్రాంతులకు గురిచేస్తూ తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తాడు.

మనలో ప్రతీ ఒక్కరం మన యథార్థతను వదులుకునేలా చేయగలనని సాతాను వాదించాడు. పితరుడైన యోబు రోజుల్లో అతడు యెహోవా దేవునితో, “తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును” అని అన్నాడు. మరో మాటలో చెప్పాలంటే, తేవాల్సినంత ఒత్తిడి తెస్తే ఎప్పుడో ఒకప్పుడు ఓ వ్యక్తి దేవునిపట్ల తనకున్న యథార్థతను వదులుకుంటాడని అతడు అన్నాడు. (యోబు 2:4) సాతాను చెప్పింది నిజమేనా? ఒత్తిళ్లు ఒక స్థాయికి చేరుకుంటే వాటిని తట్టుకోలేక, ఎలాగైనా ప్రాణాలను కాపాడుకోవాలనే తపనతో మనం పాటిస్తున్న సూత్రాలను గాలికొదిలేస్తామా? మనం అలా ఆలోచించాలని సాతాను కోరుకుంటున్నాడు. మనలో అలాంటి ఆలోచన నాటాలనే ఉద్దేశంతోనే వాడు హానికరమైన ప్రచారాన్ని క్రమేపీ వ్యాప్తిలోకి తీసుకొస్తాడు. దానికి వాడు ఉపయోగించే కొన్ని పద్ధతులేమిటో, వాటిని తిప్పికొట్టేందుకు మనం ఏమి చేయాలో ఇప్పుడు చూద్దాం.

‘మట్టిలో పుట్టినవారు’

దేవుని పట్ల నమ్మకంగా నిలిచివుండే శక్తి మానవులకు లేదు అని వాదించేందుకు సాతాను యోబును పరామర్శించేందుకు వచ్చిన ముగ్గురు సహచరుల్లో ఒకడైన ఎలీఫజును ఉపయోగించాడు. మానవులు “జిగటమంటి యిండ్లలో నివసించువారు” అని అంటూ, అతడు యోబుతో, “మంటిలో పుట్టినవారియందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును? ఉదయము మొదలుకొని సాయంత్రమువరకు ఉండి వారు బద్దలైపోవుదురు ఎన్నికలేనివారై సదాకాలము నాశనమైయుందురు” అని అన్నాడు.—యోబు 4:19, 20.

లేఖనాల్లో మరో చోట మనం ‘మంటి ఘటములతో’ అంటే సులభంగా పగిలిపోయే మట్టికుండలతో పోల్చబడ్డాం. (2 కొరిం. 4:7) పాపం, అపరిపూర్ణత వారసత్వంగా వచ్చాయి కాబట్టి మనం బలహీనులమే. (రోమా. 5:12) కాబట్టి మన స్వశక్తితో సాతాను దాడులను ఎదుర్కోలేము. అయితే క్రైస్తవులముగా మనకు యెహోవా సహాయం ఉంది. మనకు బలహీనతలున్నా, ఆయన మనకు ఎంతో విలువిస్తున్నాడు. (యెష. 43:4) అంతేకాక, తనను వేడుకునేవారికి యెహోవా పరిశుద్ధాత్మను ఇస్తాడు. (లూకా 11:13) ఆయన ఆత్మ మనకు “బలాధిక్యము” ఇచ్చి, సాతాను మనమీద తీసుకొచ్చే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొనేందుకు కావాల్సిన శక్తినిస్తుంది. (2 కొరిం. 4:7; ఫిలి. 4:13) మనం ‘స్థిరమైన విశ్వాసాన్ని’ కనబరుస్తూ అపవాదిని ఎదిరిస్తూ ధైర్యంగా నిలబడితే, దేవుడు మనల్ని స్థిరపరచి, బలపరుస్తాడు. (1 పేతు. 5:8-10) కాబట్టి, మనం అపవాదియైన సాతానుకు భయపడాల్సిన అవసరంలేదు.

మానవుడు “నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడు”

“శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు?” అని ఎలీఫజు అడిగాడు. ఆ తర్వాత అతనే జవాబిస్తూ, “ఆలోచించుము ఆయన తన దూతలయందు నమ్మిక యుంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు గదా” అని అన్నాడు. (యోబు 15:14-16) యెహోవా ఏ నరుణ్ణి నీతిమంతునిగా ఎంచడని ఎలీఫజు యోబుకు చెప్పాడు. అలాంటి తప్పుడు ఆలోచనను అపవాది కూడా సొమ్ము చేసుకుంటాడు. మనం గతంలో చేసిన తప్పుల గురించి ఆందోళన చెందుతూ, మనల్ని మనం ఎక్కువగా విమర్శించుకోవాలని, మనం క్షమించబడే అవకాశంలేదని అనుకోవాలనే వాడు కోరుకుంటాడు. అంతేకాక, యెహోవా మన నుండి అధికంగా ఆశిస్తున్నాడని మనం అనుకోవాలనీ, ఆయన కనికరాన్ని, క్షమాగుణాన్ని, ఆయన అందించే సహాయాన్ని మనం తక్కువ అంచనావేయాలనీ వాడు కోరుకుంటున్నాడు.

నిజమే, మనందరం “పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నాం.” ఏ అపరిపూర్ణ మానవుడు యెహోవా పరిపూర్ణ ప్రమాణాలను పాటించలేడు. (రోమా. 3:23; 7:21-23) అంతమాత్రాన ఆయన మనల్ని పనికిరానివాళ్లుగా చూస్తున్నాడని కాదు. ‘అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమే’ మన పాపభరిత పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నాడని యెహోవాకు తెలుసు. (ప్రక. 12:9, 10) మనం ‘మంటివారము’ అనే విషయాన్ని మనసులో ఉంచుకొని ఆయన ‘ఎల్లప్పుడూ వ్యాజ్యెమాడడు’ అంటే మనలో ఎప్పుడూ తప్పులు పట్టుకుంటూ కూర్చోడు.—కీర్త. 103:8, 9, 14.

మనం దుష్ట మార్గాన్ని విడిచి పశ్చాత్తాపంతో యెహోవాకు ప్రార్థిస్తే, ఆయన ‘బహుగా క్షమిస్తాడు.’ (యెష. 55:7; కీర్త. 51:17) మన పాపాలు “రక్తమువలె ఎఱ్ఱనివైనను అవి హిమమువలె తెల్లబడును” అని బైబిలు చెబుతోంది. (యెష. 1:18) కాబట్టి, ఎల్లప్పుడూ దేవుడు ఇష్టపడే విధంగా నడుచుకోవాలనే కృతనిశ్చయంతో ముందుకు సాగుదాం.

మనం పాపులం కాబట్టి, మనం సొంత ప్రయత్నాలతో దేవుని ముందు నీతిమంతులముగా నిలబడలేం. పాపం చేయడం ద్వారా ఆదాముహవ్వలు నిత్యజీవాన్ని కోల్పోయారు, వారివల్ల మనందరం కూడా నిత్యజీవాన్ని కోల్పోయాం. (రోమా. 6:23) అయితే, యెహోవా మానవులపట్ల ఎంతో ప్రేమతో మన పాపాల క్షమాపణ కోసం ఓ ఏర్పాటు చేశాడు. మనం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అర్పించిన విమోచన క్రయధనం పట్ల విశ్వాసముంచితే మన పాపాలు క్షమించబడతాయి. (మత్త. 20:28; యోహా. 3:16) దేవుడు తన “కృపను” ఎంత అద్భుతంగా చూపించాడు! (తీతు 2:11) దేవుడు చేసిన ఏర్పాటు వల్ల మన పాపాలు క్షమించబడే అవకాశముంది! అలాంటప్పుడు క్షమించబడమని మనం అనుకునేలా చేసేందుకు సాతానుకు ఎందుకు అవకాశమివ్వాలి?

‘అతని ఎముకను, అతని దేహమును’ మొత్తుము

ఆరోగ్యం పాడైతే యోబు తన విశ్వాసాన్ని వదులుకుంటాడని సాతాను వాదించాడు. అపవాది యెహోవాతో ఇలా సవాలుచేశాడు: “అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును.” (యోబు 2:5) మనకున్న బలహీనతల కారణంగా మనం దేనికీ పనికిరానివారమని మనం అనుకునేలా చేయగలిగినప్పుడు దేవుని శత్రువు ఖచ్చితంగా సంతోషిస్తాడు.

యెహోవా సేవలో ఒకప్పుడు చేసినంత ఇప్పుడు చేయలేకపోతే యెహోవా మనల్ని తిరస్కరించడు. మన స్నేహితునిపై దాడి జరిగి, ఆయన గాయాలపాలైతే మనమేమి చేస్తాం? ఆయన ఒకప్పుడు చేసినంత ఇప్పుడు చేయలేకపోతున్నందుకు ఆయనను చిన్నచూపు చూస్తామా? లేదు! అలాంటి పరిస్థితుల్లోనూ ఆయనను ప్రేమగా చూసుకుంటాం. మరిముఖ్యంగా మనకోసం ఏదో చేస్తూ గాయపడితే ఇంకెంతో శ్రద్ధగా చూసుకుంటాం. మనమే ఆ విధంగా చూసుకుంటే, మరి యెహోవా విషయమేమిటి? ఆయన మనల్ని మరింత శ్రద్ధగా చూసుకోడా? “మీరు చేసిన కార్యమును, . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు” అని బైబిలు చెబుతోంది.—హెబ్రీ. 6:10.

లేఖనాలు “ఒక బీద విధవరాలు” గురించి చెబుతున్నాయి. ఆమె అనేక సంవత్సరాల నుండి దేవుని ఆరాధన కోసం విరాళాలు ఇస్తూ వచ్చివుండవచ్చు. ఆమె ఆలయ కానుకపెట్టెలో అతి తక్కువ వెలవున్న ‘రెండు కాసులను’ వేయడం యేసు చూసినప్పుడు, ఆమె విరాళం పనికిరాదని ఆయన అనుకున్నాడా? లేదు, సత్యారాధన కోసం విరాళాలు ఇవ్వడానికి ఆమె చేయగలిగినదంతా చేస్తున్నందుకు ఆమెను మెచ్చుకున్నాడు.—లూకా 21:1-4.

మన యథార్థతను కాపాడుకుంటే, అపరిపూర్ణత కారణంగా మనం వృద్ధులమైనా, అనారోగ్యం పాలైనా యెహోవాతో మన సంబంధమైతే చెక్కుచెదరకుండా ఉంటుందని నమ్మవచ్చు. కష్టాల కారణంగా యెహోవా సేవలో ఎక్కువ చేయలేకపోతున్నంత మాత్రాన ఆయన తన నమ్మకమైన సేవకులను ఎన్నడూ విడువడు.—కీర్త. 71:9, 17, 18.

“రక్షణయను శిరస్త్రాణమును” ధరించుకోండి

సాతాను తప్పుడు ప్రచారం నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు? అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “ప్రభువుయొక్క మహా శక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి.” ఆ ఆధ్యాత్మిక కవచంలో “రక్షణయను శిరస్త్రాణము” కూడా ఉంది. (ఎఫె. 6:10, 11, 17) సాతాను తప్పుడు ప్రచారం నుండి కాపాడుకోవాలంటే, మనం ఆ శిరస్త్రాణాన్ని స్వీకరించి, దాన్ని ఎల్లప్పుడూ ధరించుకొని ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. శిరస్త్రాణం ఓ సైనికుని తలను కాపాడుతుంది. మన “రక్షణనిరీక్షణ” అంటే అద్భుతమైన నూతనలోకం విషయంలో దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేరుతాయనే నమ్మకం, సాతాను ప్రచారం చేసే అబద్ధాల నుండి మన మనసుల్ని కాపాడుతుంది. (1 థెస్స. 5:8) లేఖనాలను శ్రద్ధగా అధ్యయనం చేస్తూ మనం ఆ నిరీక్షణను బలంగా, సజీవంగా ఉంచుకోవాలి.

సాతాను ద్వేషంతో తీసుకువచ్చిన క్రూరమైన దాడులను యోబు సహించాడు. పునరుత్థానం జరుగుతుందని యోబు ఎంత బలంగా నమ్మాడంటే ఆయన మరణించడానికి కూడా భయపడలేదు. బదులుగా ఆయన యెహోవాతో ఇలా అన్నాడు: “నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.” (యోబు 14:15) యథార్థతను కాపాడుకోవడానికి తాను చనిపోవాల్సివచ్చినా, దేవునికి తన నమ్మకమైన సేవకులపట్ల ప్రేమవుంది కాబట్టి ఆయన తనను పునరుత్థానం చేస్తాడని యోబు నమ్మాడు.

సత్యదేవుని పట్ల మనం కూడా అలాంటి నమ్మకాన్నే కనబరుద్దాం. సాతాను, అతని అనుచరులు మనకు ఎంత హాని కలిగించినా యెహోవా మనల్ని రక్షించగలడు. పౌలు మనకు ఇచ్చిన ఈ హామీని కూడా గుర్తుంచుకోండి: “దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.”—1 కొరిం. 10:13.

[20వ పేజీలోని చిత్రం]

మీరు నమ్మకంగా చేసే సేవను యెహోవా విలువైనదిగా పరిగణిస్తాడు

[21వ పేజీలోని చిత్రం]

రక్షణయను శిరస్త్రాణాన్ని స్వీకరించి, దాన్ని ఎల్లప్పుడూ ధరించుకొని ఉండండి