కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మంద ఒక్కటి, గొర్రెలకాపరి ఒక్కడు

మంద ఒక్కటి, గొర్రెలకాపరి ఒక్కడు

మంద ఒక్కటి, గొర్రెలకాపరి ఒక్కడు

“నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు.”—మత్త. 19:28.

1. అబ్రాహాము వంశస్థులతో యెహోవా ఎలా వ్యవహరించాడు? యెహోవా ఇతర జనాంగాలను కూడా పట్టించుకున్నాడని ఎలా చెప్పవచ్చు?

 యెహోవా అబ్రాహామును ప్రేమించాడు కాబట్టి, ఆయన వంశస్థులపట్ల యథార్థమైన ప్రేమ చూపించాడు. యెహోవా దాదాపు 1,500 కన్నా ఎక్కువ సంవత్సరాలు అబ్రాహాము నుండి వచ్చిన ఇశ్రాయేలు జనాంగాన్ని తాను ఎంచుకున్న ప్రజలుగా, “స్వకీయజనముగా” పరిగణించాడు. (ద్వితీయోపదేశకాండము 7:6 చదవండి.) యెహోవా ఇతర జనాంగాలను అసలు పట్టించుకోలేదని దానర్థమా? కాదు. ఆ సమయంలో, ఆయన తనను ఆరాధించాలనుకునే అన్యులకు తన స్వకీయ జనాంగంతో కలిసి ఉండే అవకాశాన్నిచ్చాడు. మతం మార్చుకున్న ఆ అన్యులు లేదా యుదా మతప్రవిష్టులు ఇశ్రాయేలు జనాంగంలో భాగంగా పరిగణించబడ్డారు. వారిని సహోదరులుగానే పరిగణించాలని యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. (లేవీ. 19:33, 34) అయితే అన్యుల విషయానికొస్తే, వారు యెహోవా నియమాలన్నిటినీ పాటించాలి.—లేవీ. 24:22.

2. ఆశ్చర్యాన్ని కలిగించే ఏ మాట యేసు అన్నాడు? అది చదివిన తర్వాత మన మనసులో ఎలాంటి ప్రశ్నలు మెదులుతాయి?

2 అయితే, యేసు తన కాలంలోని యూదులతో ఆశ్చర్యాన్ని కలిగించే ఈ మాట చెప్పాడు: “దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడును.” (మత్త. 21:43) మరి, ఈ కొత్త జనాంగంలో ఎవరు ఉంటారు? ఈ మార్పువల్ల మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం?

కొత్త జనాంగం

3, 4. (ఎ) అపొస్తలుడైన పేతురు ఆ కొత్త జనాంగం గురించి ఏమని స్పష్టం చేశాడు? (బి) ఆ కొత్త జనాంగంలో ఎవరుంటారు?

3 అపొస్తలుడైన పేతురు ఆ కొత్త జనాంగంలో ఎవరుంటారో స్పష్టం చేశాడు. ఆయన తన తోటి క్రైస్తవులకు ఈ మాటలు రాశాడు: “మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.” (1 పేతు. 2:9) ముందు చెప్పబడినట్లే, యేసును మెస్సీయగా అంగీకరించిన సహజ యూదులే ఈ కొత్త జనాంగంలోని తొలి సభ్యులు. (దాని. 9:27ఎ; మత్త. 10:6) ఆ తర్వాత ఎంతోమంది అన్యులు ఈ జనాంగంలో చేర్చబడ్డారు. పేతురు చెప్పిన ఈ మాటలనుబట్టి అది స్పష్టమౌతుంది: “ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి.”—1 పేతు. 2:10.

4 ఇక్కడ పేతురు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన తన పత్రిక ప్రారంభంలో ఇలా రాశాడు: “మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు . . . మనలను మరల జన్మింపజేసెను. ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.” (1 పేతు. 1:3-5) కాబట్టి, పరలోక నిరీక్షణగల అభిషిక్త క్రైస్తవులే ఈ కొత్త జనాంగంలో ఉన్నారు. వారే “దేవుని ఇశ్రాయేలు.” వారితోనే పేతురు ఆ మాటలన్నాడు. (గల. 6:16) “దేవుని ఇశ్రాయేలు”లో మొత్తం 1,44,000 మంది ఉండడాన్ని అపొస్తలుడైన యోహాను ఓ దర్శనంలో చూశాడు. వారు ‘యాజకులుగా’ సేవచేస్తూ ‘క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయడానికి’ ‘దేవుని కొరకును గొర్రెపిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడ్డారు.’—ప్రక. 5:9, 10; 7:4; 14:1, 4; 20:6; యాకో. 1:18.

ఆ జనాంగంలో ఇతరులు కూడా ఉన్నారా?

5. (ఎ) “దేవుని ఇశ్రాయేలు” అనే మాట ఎవరికి వర్తిస్తుంది? (బి) “ఇశ్రాయేలు” అనే మాట అభిషిక్తులను మాత్రమే సూచించదని ఎలా చెప్పవచ్చు?

5 పైన చూసిన దాన్నిబట్టి, గలతీయులు 6:16 లోని “దేవుని ఇశ్రాయేలు” అనే మాట కేవలం అభిషిక్త క్రైస్తవులకే వర్తిస్తుందని స్పష్టమౌతుంది. అయితే, అభిషిక్త క్రైస్తవులుకాని వారిని సూచించడానికి ఇశ్రాయేలు జనాంగం అనే మాటను యెహోవా ఎప్పుడైనా ఉపయోగించాడా? యేసు తన నమ్మకమైన అపొస్తలులతో అన్న మాటల్లో మనకు జవాబు దొరుకుతుంది: “నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని, సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి మీరు తీర్పుతీర్చుటకై, నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను.” (లూకా 22:28-30) క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో ‘పునర్జననం’ లేదా పునఃసృష్టి జరిగినప్పుడు అది నెరవేరుతుంది.—మత్తయి 19:28 చదవండి.

6, 7. మత్తయి 19:28 మరియు లూకా 22:29, 30 వచనాల్లో ‘ఇశ్రాయేలు పండ్రెండు గోత్రాలవారు’ ఎవరిని సూచిస్తున్నారు?

6 క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో 1,44,000 మంది పరలోకంలో రాజులుగా, యాజకులుగా, న్యాయాధిపతులుగా సేవచేస్తారు. (ప్రక. 20:4) వారు ఎవరికి తీర్పుతీరుస్తారు? ఎవరిని పరిపాలిస్తారు? ‘ఇశ్రాయేలు పండ్రెండు గోత్రాలవారికి’ తీర్పుతీరుస్తారని మత్తయి 19:28 మరియు లూకా 22:29, 30లో చెప్పబడింది. ఇక్కడ ‘ఇశ్రాయేలు పండ్రెండు గోత్రాలవారు’ ఎవరిని సూచిస్తున్నారు? వీరు భూమ్మీద నివసించే అవకాశమున్న వారందరిని సూచిస్తున్నారు. వీరు యేసు బలిపట్ల విశ్వాసముంచుతారు కానీ రాచరిక, యాజక వర్గానికి చెందినవారు కారు. (ఇశ్రాయేలు 12 గోత్రాల్లో లేవీ గోత్రం చేర్చబడలేదు.) కాబట్టి యేసు, ఇశ్రాయేలు 12 గోత్రాలవారు అని అన్నప్పుడు 1,44,000 మంది యాజకసేవల నుండి ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందేవారి గురించే మాట్లాడాడు. యాజకులుకాని వీరు కూడా దేవుని ప్రజలే. ఆయన వారిని ప్రేమించి, వారిని తన ప్రజలుగా పరిగణిస్తాడు. కాబట్టి, ప్రాచీన కాలంలోని తన సేవకులతో వారిని పోల్చడం తప్పుకాదు.

7 అందుకే, అపొస్తలుడైన యోహాను కూడా ఓ దర్శనంలో, మహాశ్రమలకు ముందు 1,44,000 మంది ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులు శాశ్వతంగా ముద్రించబడడాన్ని చూసిన తర్వాత, “ప్రతి జనములోనుండి” వచ్చే ఎవరూ లెక్కింపజాలని ‘గొప్పసమూహాన్ని’ చూశాడు. (ప్రక. 7:9) ఆ గొప్పసమూహపువారు మహాశ్రమలను తప్పించుకొని క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలోకి ప్రవేశిస్తారు. ఆ పరిపాలనలో కోట్లాదిమంది పునరుత్థానం చేయబడతారు. (యోహా. 5:28, 29; ప్రక. 20:13) వీళ్లందరూ ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలుగా పరిగణించబడతారు. ఈ పన్నెండు గోత్రాలవారికి యేసు, ఆయన 1,44,000 తోటి పరిపాలకులు తీర్పుతీరుస్తారు.—అపొ. 17:31; 24:14, 15; ప్రక. 20:12.

8. వార్షిక ప్రాయశ్చిత్తార్థ దినాన జరిగే కొన్ని సంఘటనలు 1,44,000 మందికీ, మిగతా మానవులకూ మధ్యవున్న సంబంధాన్ని ఎలా సూచిస్తున్నాయి?

8 వార్షిక ప్రాయశ్చిత్తార్థ దినాన జరిగే కొన్ని సంఘటనలు 1,44,000 మందికీ, మిగతా మానవులకూ మధ్య ఉన్న సంబంధాన్ని సూచించాయి. (లేవీ. 16:6-10) ప్రధాన యాజకుడు మొదటిగా ‘తన నిమిత్తము తన యింటివారి నిమిత్తము’ పాపపరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించాలి. అదే విధంగా, తనతోపాటు పరలోకంలో సేవించే తోటి యాజకులు మొదటిగా యేసు బలి నుండి ప్రయోజనం పొందుతారు. అదే రోజు, మిగతా ఇశ్రాయేలీయుల పాపాల కోసం రెండు మేకలను తీసుకొచ్చేవారు. యాజక గోత్రం 1,44,000 మందిని సూచిస్తుంటే, మిగతా ఇశ్రాయేలీయులు భూనిరీక్షణగల వారిని సూచిస్తున్నారు. దీన్నిబట్టి, మత్తయి 19:28 లోని “ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు” అనే మాట ఆత్మాభిషిక్తులైన యేసు తోటి యాజకులను కాదుగానీ, యేసు బలిపట్ల విశ్వాసముంచే వారందరిని సూచిస్తోందని చెప్పవచ్చు. a

9. యెహెజ్కేలు ఆలయ దర్శనంలో యాజకులు ఎవరిని సూచిస్తున్నారు? యాజకులుకాని ఇతర గోత్రాల ఇశ్రాయేలీయులు ఎవరిని సూచిస్తున్నారు?

9 మరో ఉదాహరణను చూద్దాం. యెహెజ్కేలు ప్రవక్తకు యెహోవా ఆలయానికి సంబంధించిన ఓ దర్శనం ఇవ్వబడింది. దానిలో ఆయన ఎన్నో వివరాలను చూశాడు. (యెహె., 40-48 అధ్యాయాలు) ఆ దర్శనంలో యాజకులు, ఆలయంలో పనిచేయడాన్ని, ప్రజలకు ఉపదేశించడాన్ని, యెహోవా నుండి ఉపదేశాన్ని, దిద్దుబాటును పొందడాన్ని ఆయన చూశాడు. (యెహె. 44:23-31) అంతేకాక, వివిధ గోత్రాలవారు ఆరాధించేందుకు, బలులు అర్పించేందుకు ఆలయానికి రావడాన్ని కూడా ఆయన చూశాడు. (యెహె. 45:16, 17) కాబట్టి, ఆలయంలోని యాజకులు అభిషిక్తులను సూచిస్తుంటే, యాజకులుకాని ఇతర గోత్రాల ఇశ్రాయేలీయులు భూనిరీక్షణ ఉన్నవారిని సూచిస్తున్నారు. ఆ రెండు గుంపులు చక్కని సమన్వయంతో పనిచేస్తున్నాయనీ, యాజక తరగతివారు స్వచ్ఛారాధనలో నాయకత్వం వహిస్తున్నారనీ ఆ దర్శనం తెలియజేస్తుంది.

10, 11. (ఎ) యేసు చెప్పిన ఏ మాటలు నెరవేరడాన్ని మనం చూశాం? (బి) వేరేగొర్రెలకు సంబంధించి మన మనసులో ఏ ప్రశ్న మెదులుతుంది?

10 ‘ఈ దొడ్డివికాని’ అంటే అభిషిక్త క్రైస్తవుల ‘చిన్నమందకు’ చెందని ‘వేరే గొర్రెల’ గురించి యేసు మాట్లాడాడు. (యోహా. 10:16; లూకా 12:32) ఆయన ఇలా అన్నాడు: “వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును.” ఆ మాటలు నెరవేరడాన్ని చూస్తున్నందుకు మన విశ్వాసం ఎంత బలపడింది! రెండు గుంపులవారు అంటే అభిషిక్త క్రైస్తవుల చిన్న గుంపు, వేరేగొర్రెలైన గొప్పసమూహపువారు ఒక దగ్గర చేరారు. (జెకర్యా 8:23 చదవండి.) వేరేగొర్రెలకు చెందినవారు సూచనార్థకంగా ఆధ్యాత్మిక ఆలయంలోని లోపలి ఆవరణలో సేవ చేయకపోయినా, వారు ఆలయ వెలుపలి ఆవరణలో సేవ చేస్తున్నారు.

11 ఈ వేరేగొర్రెలను సూచించేందుకు యెహోవా కొన్నిసార్లు ప్రాచీన ఇశ్రాయేలులోని యాజకులుకాని వారిని ప్రస్తావించాడు కాబట్టి, భూనిరీక్షణ ఉన్నవారు కూడా జ్ఞాపకార్థ చిహ్నాల్లో భాగం వహించాలా? ఆ ప్రశ్నకు జవాబు మనమిప్పుడు చూద్దాం.

కొత్త నిబంధన

12. యెహోవా ఏ కొత్త ఏర్పాటు గురించి ప్రవచించాడు?

12 యెహోవా తన ప్రజల విషయంలో ఓ కొత్త ఏర్పాటు గురించి ప్రవచించాడు. “ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితో . . . చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు” అని యెహోవా అన్నాడు. (యిర్మీ. 31:31-34) ఈ కొత్త నిబంధన ద్వారా యెహోవా అబ్రాహాముకు చేసిన వాగ్దానం అద్భుతమైన విధంగా, శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే విధంగా నెరవేరుతుంది.—ఆదికాండము 22:18 చదవండి.

13, 14. (ఎ) కొత్త నిబంధనలో ఎవరు భాగం వహిస్తారు? (బి) దాని నుండి ఎవరు ప్రయోజనం పొందుతారు? అలా ప్రయోజనం పొందేవారు దాన్ని ఎలా ‘ఆధారము చేసుకుంటారు’?

13 యేసు తన మరణానికి ముందురోజు రాత్రి ఈ కొత్త నిబంధన గురించే మాట్లాడాడు. ఆయన “ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన” అని అన్నాడు. (లూకా 22:20; 1 కొరిం. 11:25) క్రైస్తవులందరూ ఆ కొత్త నిబంధనలోకి వస్తారా? రారు. ఆ రోజు సాయంత్రం అపొస్తలులు మాత్రమే ఆ గిన్నెలోనిది తాగారు. అలాగే కొంతమంది మాత్రమే ఆ నిబంధనలో భాగం వహిస్తారు. b తన రాజ్యంలో వారు తనతోపాటు పరిపాలించేలా యేసు వారితో మరో నిబంధన చేసుకున్నాడు. (లూకా 22:28-30) వారు యేసుతో కలిసి రాజ్యపరిపాలన చేస్తారు.—లూకా 22:15, 16.

14 యేసు రాజ్యపరిపాలనలో ఈ భూమ్మీద జీవించేవారి విషయమేమిటి? వారు కొత్త నిబంధన నుండి ప్రయోజనం పొందుతారు. (గల. 3:8, 9) వారు ఆ నిబంధనలో భాగస్థులు కాకపోయినా, దాని నియమాలను పాటించడం ద్వారా దాన్ని ‘ఆధారము చేసుకుంటారు.’ ఈ విషయాన్ని యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు: “విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను.” యెహోవా ఆ తర్వాత ఇలా చెప్పాడు: “నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమనబడును.”—యెష. 56:6, 7.

జ్ఞాపకార్థ చిహ్నాల్లో ఎవరు భాగం వహించాలి?

15, 16. (ఎ) కొత్త నిబంధనలో భాగం వహించేవారికి ఏ గొప్ప అవకాశం లభిస్తుందని అపొస్తలుడైన పౌలు చెప్పాడు? (బి) భూనిరీక్షణ ఉన్నవారు జ్ఞాపకార్థ చిహ్నాల్లో ఎందుకు భాగం వహించకూడదు?

15 ఆ కొత్త నిబంధనలోకి వచ్చేవారు ‘పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు ధైర్యము కలిగివున్నారు.’ (హెబ్రీయులు 10:15-20 చదవండి.) వారే ‘నిశ్చలమైన రాజ్యమును పొందుతారు.’ (హెబ్రీ. 12:28) కాబట్టి, పరలోకంలో యేసుక్రీస్తుతోపాటు రాజులుగా, యాజకులుగా పరిపాలించేవారు మాత్రమే కొత్త నిబంధనను సూచించే ‘గిన్నెలో’ నుండి తాగాలి. ఆ కొత్త నిబంధనలో భాగస్థులైనవారికే గొర్రెపిల్లతో పెళ్లి జరుగుతుందని వాగ్దానం చేయబడింది. (2 కొరిం. 11:2; ప్రక. 21:2, 9) చిహ్నాల్లో భాగం వహించని ఇతరులు గౌరవభావంతో గమనించేవారిగా జ్ఞాపకార్థ ఆచరణకు హాజరౌతారు.

16 భూనిరీక్షణ ఉన్నవారు జ్ఞాపకార్థ చిహ్నాల్లో భాగం వహించరనే విషయాన్ని పౌలు కూడా తన పత్రికలో తెలియజేశాడు. ఆయన అభిషిక్త క్రైస్తవులకు ఇలా రాశాడు: “మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్ర లోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.” (1 కొరిం. 11:26) ప్రభువు ఎప్పుడు ‘వస్తాడు’? అభిషిక్త పెళ్లికుమార్తె తరగతిలోని చివరి వ్యక్తిని పరలోకానికి తీసుకుపోవడానికి వచ్చినప్పుడు ఆయన ‘వస్తాడు.’ (యోహా. 14:2, 3) ప్రభువు రాత్రి భోజనం నిరంతరం కొనసాగే ఆచరణ కాదని దీన్నిబట్టి అర్థమౌతోంది. భూమ్మీదున్న స్త్రీ సంతానంలోని ‘శేషించినవారు’ తమలోని చివరి వ్యక్తి పరలోక బహుమానాన్ని పొందేంతవరకు ప్రభువు రాత్రి భోజనంలో పాల్గొంటారు. (ప్రక. 12:17) ఒకవేళ భూమ్మీద నిరంతరం జీవించేవారికి ఈ జ్ఞాపకార్థ చిహ్నాల్లో భాగం వహించే హక్కు ఉన్నట్లయితే, ఈ జ్ఞాపకార్థ ఆచరణను నిరంతరం ఆచరించాల్సి ఉంటుంది.

“నాకు జనులగుదురు”

17, 18. యెహెజ్కేలు 37:26, 27లో చెప్పబడిన ప్రవచనం ఎలా నెరవేరింది?

17 యెహోవా తన ప్రజల మధ్యవుండే ఐక్యత గురించి ఇలా ప్రవచించాడు: “నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసెదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారిమధ్య నా పరిశుద్ధస్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగానుండును, నేను వారిదేవుడనై యుందును వారు నా జనులైయుందురు.”—యెహె. 37:26, 27.

18 సమాధానార్థమైన నిబంధన విషయంలో యెహోవా చేసిన ఈ అద్భుతమైన వాగ్దానం నుండి దేవుని ప్రజలందరూ ప్రయోజనం పొందవచ్చు. తనకు విధేయులైన సేవకులందరికీ సమాధానాన్ని అనుగ్రహిస్తానని యెహోవా మాట ఇచ్చాడు. తన ఆత్మఫలం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. క్రైస్తవ స్వచ్ఛారాధనను సూచిస్తున్న ఆయన పరిశుద్ధ స్థలం వారి మధ్య ఉంది. వారు అన్ని రకాల విగ్రహారాధనను విడిచి యెహోవా దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తున్నారు కాబట్టి వారు నిజంగా ఆయన ప్రజలయ్యారు.

19, 20. యెహోవా ఎవరిని కూడా ‘నా జనులు’ అని పిలుస్తున్నాడు? కొత్త నిబంధనవల్ల ఏది సాధ్యమౌతుంది?

19 మన కాలంలో ఆ రెండు గుంపులు ఐక్యమవడాన్ని కళ్లారా చూడడం ఎంత పులకరింపజేస్తుందో కదా! రోజురోజుకీ పెరుగుతున్న గొప్పసమూహానికి పరలోక నిరీక్షణ లేకపోయినప్పటికీ, పరలోకానికి వెళ్లేవారితో సహవసిస్తున్నందుకు వారు ఎంతో సంతోషిస్తున్నారు. వారు దేవుని ఇశ్రాయేలుతో కలిసి పనిచేస్తున్నారు. అలా చేస్తున్నారు కాబట్టి యెహోవా వారిని కూడా ‘నా జనులు’ అని పిలుస్తున్నాడు. వారి విషయంలో ఈ ప్రవచనం నెరవేరుతోంది: “ఆ దినమున అన్యజనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసముచేతును.”—జెక. 2:11; 8:21; యెషయా 65:22; ప్రకటన 21:3, 4 చదవండి.

20 కొత్త నిబంధన ద్వారా యెహోవా ఇవన్నీ సాధ్యమయ్యేలా చేశాడు. వివిధ దేశాలకు చెందిన లక్షలాదిమంది యెహోవా అనుగ్రహం పొందిన జనాంగంలో భాగమయ్యారు. (మీకా 4:1-5) ఆ నిబంధనలోని ఏర్పాట్లను అంగీకరించి, దానికి సంబంధించిన నియమాలను పాటించడం ద్వారా ఆ నిబంధనను ‘ఆధారము చేసుకోవాలనే’ కృతనిశ్చయంతో వారు ఉన్నారు. (యెష. 56:6, 7) అలా చేయడం ద్వారా వారు దేవుని ఇశ్రాయేలుతోపాటు నిరంతరం సమాధానకర పరిస్థితిని అనుభవించే గొప్ప ఆశీర్వాదాన్ని చవిచూస్తారు. మీరు ఆ ఆశీర్వాదాన్ని ఇప్పుడూ, ఎల్లప్పుడూ పొందుదురు గాక!

[అధస్సూచీలు]

a అదే విధంగా, “సంఘము” అనే మాట ప్రాముఖ్యంగా అభిషిక్తులను సూచించడానికి ఉపయోగించబడుతుంది. (హెబ్రీ. 12:23) అయితే, “సంఘము” అనే మాటకు మరో అర్థం కూడా ఉంది. భూనిరీక్షణ, పరలోక నిరీక్షణ అనే తేడా లేకుండా క్రైస్తవులందరినీ సూచించడానికి కూడా ఆ మాట ఉపయోగించబడుతుంది.—కావలికోట, ఏప్రిల్‌ 15, 2007, 21-23 పేజీలు చూడండి.

b యేసు ఆ నిబంధనకు మధ్యవర్తే కానీ దానిలో భాగం వహించే వ్యక్తి కాదు. ఓ మధ్యవర్తిగా ఆయన ఆ చిహ్నాల్లో భాగం వహించలేదని స్పష్టంగా తెలుస్తోంది.

మీకు జ్ఞాపకమున్నాయా?

• 1,44,000 మంది తీర్పుతీర్చే ‘ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారు’ ఎవరు?

• అభిషిక్తులకు, వేరే గొర్రెలకు కొత్తనిబంధనతో ఎలాంటి సంబంధముంది?

• జ్ఞాపకార్థ చిహ్నాల్లో క్రైస్తవులందరూ భాగం వహించాలా?

• మన కాలంలో ఎలాంటి సమాధానకర పరిస్థితి ఉంటుందని ప్రవచించబడింది?

[అధ్యయన ప్రశ్నలు]

[25వ పేజీలోని గ్రాఫు/చిత్రాలు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఇప్పుడు చాలామంది దేవుని ఇశ్రాయేలుతో కలిసి పనిచేస్తున్నారు

1950 | 3,73,430

1970 | 14,83,430

1990 | 40,17,213

2009 | 73,13,173