కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రశ్నలు అడిగేందుకు యెహోవాను మీరు అనుమతిస్తారా?

ప్రశ్నలు అడిగేందుకు యెహోవాను మీరు అనుమతిస్తారా?

ప్రశ్నలు అడిగేందుకు యెహోవాను మీరు అనుమతిస్తారా?

మన హృదయాలోచనలు, భావాలు ఎలా ఉన్నాయో పరిశోధించుకోవడానికి సహాయం చేసే వందలాది ప్రశ్నలు బైబిల్లో ఉన్నాయి. నిజానికి, ప్రాముఖ్యమైన సత్యాలు బోధించడానికి యెహోవా కూడా ప్రశ్నలు వేస్తాడు. హానికరమైన తన ప్రవర్తనను మార్చుకోమని కయీనును హెచ్చరిస్తున్నప్పుడు యెహోవా ఆయనను అనేక ప్రశ్నలు అడిగాడు. (ఆది. 4:6, 7) అదే విధంగా యెహోవా యెషయాను కూడా ప్రశ్నలడిగాడు. అప్పుడు యెషయా అనుకూలంగా ప్రతిస్పందించాడు. యెహోవా, “నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవును?” అని అడిగినప్పుడు ప్రవక్తయైన యెషయా, “చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము” అని జవాబిచ్చాడు.—యెష. 6:8.

గొప్ప బోధకుడైన యేసు కూడా ప్రశ్నలను చక్కగా ఉపయోగించాడు. యేసు అడిగిన 280కన్నా ఎక్కువ ప్రశ్నలు సువార్త పుస్తకాల్లో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో విమర్శకుల నోళ్లు మూయించడానికి యేసు ప్రశ్నలు ఉపయోగించినప్పటికీ, ముఖ్యంగా ఆయన తన శ్రోతల హృదయాన్ని చేరుకొని, దేవునితో తమకున్న సంబంధం గురించి వారు ఆలోచించేలా చేయడానికే ఎక్కువసార్లు ప్రశ్నలు ఉపయోగించాడు. (మత్త. 22:41-46; యోహా. 14:9, 10) క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని 14 పుస్తకాలను రాసిన అపొస్తలుడైన పౌలు కూడా అవతలి వ్యక్తిని ఒప్పించే విధంగా ప్రశ్నలు వేశాడు. (రోమా. 10:13-15) ఉదాహరణకు, ఆయన రాసిన రోమా పత్రికలో ఎన్నో ప్రశ్నలు కనిపిస్తాయి. ఆ పత్రికను చదివేవారు “దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము” గురించి తెలుసుకొని దాన్ని విలువైనదిగా ఎంచేందుకు ఆ ప్రశ్నలు దోహదపడతాయి.—రోమా. 11:33.

కొన్ని ప్రశ్నలు అవతలి వ్యక్తి నుండి జవాబును రాబడితే, మరికొన్ని ప్రశ్నలు అవతలి వ్యక్తిని ఎంతగానో ఆలోచింపజేస్తాయి. యేసు రెండవ కోవకు చెందిన ప్రశ్నల్నే ఎక్కువగా ఉపయోగించాడని సువార్త పుస్తకాలను చూస్తే తెలుస్తుంది. ఒక సందర్భంలో యేసు తన శిష్యుల్ని, “పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండినిగూర్చియు జాగ్రత్తపడుడి” అని హెచ్చరించాడు. యేసు ఇక్కడ వారి వేషధారణ, అబద్ధ బోధల గురించి జాగ్రత్తపడమని హెచ్చరించాడు. (మార్కు 8:15; మత్త. 16:12) కానీ, శిష్యులకు ఆ విషయం అర్థంకాక తాము రొట్టెల్ని తేవడం మరచిపోయిన సంగతి గురించి వాదులాడుకున్నారు. ఆ తర్వాత యేసు వారిని ఎలాంటి ప్రశ్నలు అడిగాడో చూడండి. ఆయన వారితో, “మనయొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠినహృదయము గలవారై యున్నారా? మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? . . . మీరింకను గ్రహింపకున్నారా?” అని అడిగాడు. యేసు వేసిన ప్రశ్నలు వారిని ఆలోచింపజేసి ఆయన మాటలకున్న అసలు అర్థం గురించి ధ్యానించేలా వారిని పురికొల్పాయి.—మార్కు 8:16-21.

“నేను నీకు ప్రశ్న వేయుదును”

తన సేవకుడైన యోబు ఆలోచనను సరిదిద్దేందుకు యెహోవా దేవుడు ప్రశ్నలు అడిగాడు. యెహోవా అలా వరుసగా ప్రశ్నలడిగి యోబు తన ముందు ఎంత అల్పమైనవాడో గ్రహించేలా చేశాడు. (యోబు, 38-41 అధ్యా.) తాను అడిగిన ప్రతీ ప్రశ్నకు యోబు జవాబు చెప్పాలని యెహోవా ఆశించాడా? లేదనిపిస్తోంది. యోబు తన ఆలోచనలను, భావాలను పరిశోధించుకునేందుకే యెహోవా, “నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి?” అని ఆయనను అడిగాడు. అలాంటి ప్రశ్నల పరంపరను ఎదుర్కొన్న తర్వాత యోబుకు దాదాపు నోట మాటరాలేదు. చివరకు ఆయనిలా అన్నాడు: “నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును.” (యోబు 38:4; 40:4) యోబు విషయాన్ని అర్థం చేసుకొని తనను తాను తగ్గించుకున్నాడు. అయితే, యెహోవా కేవలం యోబుకు వినయం గురించిన పాఠం మాత్రమే నేర్పించలేదు, ఆయన ఆలోచనాతీరును కూడా సరిదిద్దాడు. ఎలా?

యోబు ‘యథార్థవర్తనుడు, న్యాయవంతుడు’ అయినప్పటికీ, కొన్నిసార్లు ఆయన అన్న మాటలనుబట్టి ఆయన తప్పుడు అభిప్రాయాన్ని కలిగివున్నాడని తెలుస్తోంది. అందుకే ఎలీహు, యోబు “దేవునికంటె తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి” ఆయనను సరిదిద్దాడు. (యోబు 1:8; 32:2; 33:8-12) అయితే ఆ తర్వాత, యెహోవా వేసిన ప్రశ్నలు కూడా యోబు ఆలోచనను సరిదిద్దాయి. యెహోవా సుడిగాలిలోనుండి మాట్లాడుతూ “జ్ఞానములేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేయుదును నీవు దానిని నాకు తెలియజెప్పుము” అని యోబుతో అన్నాడు. (యోబు 38:1-3) ప్రశ్నలడుగుతూ తన అద్భుతమైన సృష్టి కార్యాల్లో కనిపించే అపారమైన తన జ్ఞానాన్ని, శక్తిని యెహోవా యోబు దృష్టికి తీసుకువచ్చాడు. దాంతో, యెహోవా కార్యాలన్నీ న్యాయంగానే ఉంటాయని యోబుకు మరింత నమ్మకం కుదిరింది. యోబు ఎంత అద్భుతమైన అనుభవాన్ని చవిచూశాడో కదా! ఏకంగా సర్వోన్నతుడైన యెహోవాయే ఆయనను ప్రశ్నించాడు.

ప్రశ్నలు అడిగేందుకు మనం యెహోవాను ఎలా అనుమతించవచ్చు?

మన విషయమేమిటి? బైబిల్లోవున్న ప్రశ్నల నుండి మనం కూడా ప్రయోజనం పొందవచ్చా? ఖచ్చితంగా పొందవచ్చు. బైబిల్లోని ప్రశ్నల గురించి కాసేపు ఆలోచిస్తే ఎన్నో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మన సొంతమౌతాయి. దేవుని వాక్యంలో శక్తివంతమైన ప్రశ్నలున్నాయి కాబట్టే అది ఎంతో ప్రభావవంతమైనది. నిజానికి, ‘దేవుని వాక్యం బలముగలదై హృదయ తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది.’ (హెబ్రీ. 4:12) బైబిల్లోని ప్రశ్నల నుండి సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం పొందాలంటే, మనల్ని మనం ఆ ప్రశ్నలు వేసుకోవాలి. (రోమా. 15:4) ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం.

“సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా?” (ఆది. 18:25) సొదొమ గొమొఱ్ఱా పట్టణాలకు తీర్పు తీరుస్తున్నప్పుడు అబ్రాహాము యెహోవాను ఆ ప్రశ్న అడిగాడు. యెహోవా ఎన్నడూ అన్యాయం చేయడనీ, దుష్టులతోపాటు నీతిమంతులను నాశనం చేయడనీ అబ్రాహాము నమ్మాడు. అబ్రాహాము వేసిన ప్రశ్నను బట్టి యెహోవాపై ఆయనకెంత బలమైన విశ్వాసం ఉందో తెలుస్తోంది.

కొంతమంది, భవిష్యత్తులో యెహోవా తీర్చబోయే తీర్పుల గురించి అంటే, హార్‌మెగిద్దోనును ఎవరు తప్పించుకుంటారు లేదా ఎవరు పునరుత్థానం చేయబడతారు వంటివాటి గురించి ఊహాగానాలు చేయడానికి ప్రయత్నించవచ్చు. అలాంటివాటి గురించి ఆలోచించి బుర్రపాడు చేసుకునే బదులు అబ్రాహాము వేసిన ప్రశ్నను గుర్తుచేసుకోవడం మంచిది. అబ్రాహాములాగే మనమూ యెహోవా ఎంతో దయగల తండ్రి అని తెలుసుకొని ఆయన న్యాయవంతుడనీ, కనికరం గలవాడనీ పూర్తిగా నమ్మినట్లయితే అనవసరమైన విషయాలమీద, మన విశ్వాసాన్ని బలహీనపర్చే సందేహాలమీద, వ్యర్థమైన వాదోపవాదాలమీద మన సమయాన్ని, శక్తిని వృథా చేసుకోం.

“మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?” (మత్త. 6:27) తన శిష్యులు కూడా ఉన్న ఓ పెద్ద గుంపును ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రేమగల యెహోవామీద వారు నమ్మకముంచాలని నొక్కిచెప్పేందుకు యేసు ఈ ప్రశ్నను వేశాడు. ఈ దుష్టవిధానపు చివరి దినాల్లో మనం ఎన్నో చింతల్ని ఎదుర్కొంటాం. కానీ, వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే మన ఆయుష్షు పెరగదు సరికదా మన పరిస్థితి కూడా బాగుపడదు.

మనం మన గురించి, మన ప్రియమైనవారి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నప్పుడు, యేసు వేసిన ఆ ప్రశ్న గురించి ఆలోచించినట్లయితే జీవిత చింతల విషయంలో మనం సరైన వైఖరితో ఉండగలుగుతాం. అప్పుడు మానసికంగా, భావోద్వేగంగా, శారీరకంగా మనల్ని అశక్తుల్ని చేసే ప్రతికూల విషయాల గురించి ఆలోచించకుండా ఉండగలుగుతాం. పక్షుల్ని పోషించే, భూమ్మీది పచ్చదనాన్ని అందంగా అలంకరించే మన పరలోక తండ్రికి మన అవసరాలేమిటో బాగా తెలుసని యేసు అభయమిచ్చాడు.—మత్త. 6:26-34.

“ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా?” (సామె. 6:27) సామెతల గ్రంథంలోని మొదటి తొమ్మిది అధ్యాయాల్లో ఒక తండ్రి తన కుమారునికి జీవితంలో అవసరమయ్యే జ్ఞానోపదేశాలు ఇవ్వడాన్ని చూస్తాం. ఒక వ్యక్తి వ్యభిచారానికి పాల్పడడంవల్ల ఎదురయ్యే చెడు పర్యవసానాల గురించి పై ప్రశ్న మాట్లాడుతోంది. (సామె. 6:29) సరసాలాడడం లేదా అనుచిత లైంగిక కోరికల్ని పెంచుకోవడం వంటివాటిని చేస్తున్నట్లయితే పై ప్రశ్న మన చెవుల్లో ప్రమాద ఘంటికలా మోగాలి. నిజానికి, ఏ తెలివితక్కువ పని చేయాలనిపించినా ఒక వ్యక్తి ఈ ప్రశ్న వేసుకోవచ్చు. మీరు ‘విత్తినదాన్నే కోస్తారనే’ బైబిలు సూత్రాన్ని ఇది ఎంత చక్కగా నొక్కి చెబుతోంది!—గల. 6:7.

“పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు?” (రోమా. 14:4) రోమీయులకు రాసిన పత్రికలో పౌలు, మొదటి శతాబ్దపు సంఘంలో తలెత్తిన సమస్యల గురించి చర్చించాడు. వేర్వేరు నేపథ్యాల నుండి రావడంవల్ల కొంతమంది క్రైస్తవులకు తోటి విశ్వాసుల నిర్ణయాల విషయంలో, వారు చేసే పనుల విషయంలో తీర్పుతీర్చే అలవాటుండేది. పౌలు అడిగిన ఆ ప్రశ్న, తాము ఒకరినొకరు చేర్చుకోవాలనీ, తీర్పుతీర్చే పని యెహోవాకే వదిలేయాలనీ వారికి గుర్తుచేసింది.

నేడు కూడా యెహోవా ప్రజల్లో వివిధ నేపథ్యాల నుండి వచ్చినవారు ఉన్నారు. అయినా, యెహోవా మనల్ని ఒక చోటకు చేర్చి ఐక్యపరిచాడు. ఆ ఐక్యతకు దోహదపడేలా మనవంతు కృషి చేస్తున్నామా? ఒక సహోదరుడు జాగ్రత్తగా ఆలోచించి చేసిన పనిని వెంటనే ఖండించే అలవాటు మనకున్నట్లయితే, పౌలు వేసిన పై ప్రశ్న గురించి ఆలోచించడం ఎంత మంచిది!

ప్రశ్నలు యెహోవాకు దగ్గరయ్యేందుకు సహాయం చేస్తాయి

దేవుని వాక్యంలో ఉన్న ప్రశ్నలు ఎంత శక్తివంతమైనవోపైన ప్రస్తావించబడిన కొన్ని ఉదాహరణలు తెలియజేస్తున్నాయి. ఫలాని ప్రశ్న ఏ సందర్భంలో అడిగారో ఆలోచించినట్లయితే మన పరిస్థితులకు వాటిని అన్వయించుకోగలుగుతాం. బైబిలు చదువుతున్నప్పుడు మనకు సహాయం చేసే అదనపు ప్రశ్నల్ని కూడా మనం చూస్తాం.—14వ పేజీలోని బాక్సు చూడండి.

మన హృదయాలోచనలు, భావాలు ఎలా ఉన్నాయో పరిశోధించుకునేందుకు మనం బైబిలు ప్రశ్నల్ని వేసుకున్నట్లయితే యెహోవా నీతిమార్గాలకు అనుగుణంగా మన మనసుల్ని, హృదయాల్ని మలచుకోగలుగుతాం. యెహోవా తనను ప్రశ్నించిన తర్వాత యోబు ఇలా అన్నాడు: “వినికిడిచేత నిన్నుగూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను.” (యోబు 42:5) అవును యోబుకు, యెహోవా కంటికి కనిపించేంత వాస్తవమైన వ్యక్తి అయ్యాడు. దీని గురించే శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు: “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.” (యాకో. 4:8) ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు, యెహోవాను వాస్తవమైన వ్యక్తిగా ‘చూసేందుకు’ దేవుని వాక్యంలోని ప్రశ్నలను వేసుకుందాం, బైబిల్లోని ప్రతీ విషయాన్ని చదివి, ధ్యానిద్దాం!

[14వ పేజీలోని బాక్సు]

యెహోవాలా ఆలోచించడానికి ఈ కింది ప్రశ్నలు మీకెలా సహాయం చేస్తాయి?

▪ “తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా?”—1 సమూ. 15:22.

▪ “కంటిని నిర్మించినవాడు కానకుండునా?”—కీర్త. 94:9.

▪ “తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా?”—సామె. 26:12.

▪ “నీవు కోపించుట న్యాయమా?”—యోనా 4:4.

▪ “ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము?”—మత్త. 16:26.

▪ “క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు?”—రోమా. 8:35.

▪ ‘నీవు దేవుని నుంచి పొందినది తప్ప నీకు మరేం కలిగింది?’—1 కొరిం. 4:7, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.

▪ “వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?”—2 కొరిం. 6:14.

[15వ పేజీలోని చిత్రం]

యెహోవా వేసిన ప్రశ్నల నుండి యోబు ఏమి నేర్చుకున్నాడు?