కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు “సురక్షితముగా” ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు

మీరు “సురక్షితముగా” ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు

మీరు “సురక్షితముగా” ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు

చరిత్రలో మునుపెన్నడూ జరగని ఓ భయంకరమైన సంఘటన అకస్మాత్తుగా చోటుచేసుకున్నప్పుడు సర్వశక్తుడైన దేవుడు తన ఆమోదం ఉన్నవారందరూ ‘తప్పించబడేలా’ చూస్తాడు. (యోవే. 2:32) నిజానికి, గతంలో కూడా ప్రజలకు ఏ హానీ జరగకుండా కాపాడాలని యెహోవా అనుకున్నాడు. “జీవపు ఊట” ఆయన దగ్గర ఉంది కాబట్టి మానవులందరినీ ఆయన విలువైనవారిగా ఎంచుతాడు, వారిని కాపాడాలనుకుంటాడు.—కీర్త. 36:9.

జీవం పట్ల దేవునికున్న అభిప్రాయమే ప్రాచీన కాలంలోని దేవుని సేవకులకూ ఉండేది. యాకోబు, ఆయన కుటుంబం ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణించి “సురక్షితముగా” గమ్యం చేరుకున్నారని ఆదికాండము 33:18 చెబుతోంది. తమను రక్షించమని యాకోబు యెహోవాను కోరడమేకాక తనతో పాటు ప్రయాణించేవారందరినీ రక్షించేందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకున్నాడు. (ఆది. 32:7, 8; 33:14, 15) బైబిలు సూత్రాలు పాటిస్తే మీరు ఎంతో సురక్షితంగా ఉండగలుగుతారు, ఇతరులు కూడా సురక్షితంగా ఉండేలా చూడగలుగుతారు. రాజ్యమందిర నిర్మాణ పనులు, అలాంటి మరితర పనులు, విపత్తులు వచ్చినప్పుడు తీసుకునే సహాయక చర్యల వంటివాటిలో పాల్గొనేవారు ఆ సూత్రాలను ఎలా పాటించవచ్చో చూద్దాం.

సురక్షితంగా ఉండేందుకు ధర్మశాస్త్రం సహాయం చేసింది

దేవుని ప్రజలు సురక్షితంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోమని మోషే ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించబడింది. ఉదాహరణకు, ఓ ఇశ్రాయేలీయుడు ఇల్లు కడుతున్నప్పుడు ఇంటికి పిట్టగోడ కట్టాలి. ఎందుకు? అప్పట్లో ప్రజలు తరచూ మేడపైకి వెళ్లేవారు. పిట్టగోడ ఉంటే వారు పైనుండి కింద పడిపోకుండా సురక్షితంగా ఉండగలుగుతారు. (1 సమూ. 9:26; మత్త. 24:17) ఈ భద్రతా నియమాన్ని పాటించనందువల్ల ఏదైన ప్రమాదం జరిగితే యెహోవా ఆ ఇంటి యజమానిని బాధ్యునిగా ఎంచేవాడు.—ద్వితీ. 22:8.

అంతేకాక, పెంపుడు జంతువుల వల్ల హాని జరగకుండా ఉండేందుకు కూడా ధర్మశాస్త్రంలో ఆంక్షలు విధించబడ్డాయి. ఒకవేళ ఓ ఎద్దు కొమ్ములతో పొడవడం వల్ల ఎవరైనా చనిపోతే మళ్లీ అలాంటి హాని ఇతరులకు జరగకుండా ఉండడానికి ఆ ఎద్దు యజమాని దాన్ని చంపేయాలి. దాని మాంసాన్ని తినకూడదు, లేదా ఆహారం కోసం ఇతరులకు దాన్ని అమ్మకూడదు కాబట్టి అలా చంపడంవల్ల యజమాని బాగా నష్టపోతాడు. అయితే ఒకవేళ ఓ ఎద్దు ఎవరికైనా హానిచేసిన తర్వాత కూడా దాని యజమాని దాన్ని కట్టేసి ఉంచకపోతే అప్పుడేమి జరుగుతుంది? అదే ఎద్దు ఆ తర్వాత ఎవరినైనా చంపితే ఈసారి ఆ ఎద్దు, దాని యజమాని చంపబడతారు. ఆ నియమం, పశువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు తమ ప్రవర్తన గురించి ఆలోచించేలా చేసింది.—నిర్గ. 21:28, 29.

పనిముట్లను సరైన విధంగా వాడే విషయంలో కూడా ధర్మశాస్త్రంలో నియమాలు ఇవ్వబడ్డాయి. చాలామంది ఇశ్రాయేలీయులు కట్టెలు కొట్టడానికి గొడ్డలిని వాడేవారు. అనుకోకుండా గొడ్డలి పిడి ఊడిపోయి పొరుగువానికి తగలడం వల్ల అతడు చనిపోతే కట్టెలు కొట్టే వ్యక్తి ఆశ్రయపురానికి పారిపోయి ప్రధాన యాజకుడు చనిపోయేంతవరకు అక్కడే ఉండాలి. అంటే పొరపాటున నరహత్య చేసిన ఆ వ్యక్తి తన కుటుంబాన్ని, ఇంటిని చాలా ఏళ్లు విడిచిపెట్టాల్సి వచ్చేది. యెహోవా జీవాన్ని పరిశుద్ధంగా ఎంచుతాడని ఇశ్రాయేలు జనాంగం ఆ ఏర్పాటు నుండి నేర్చుకున్నారు. జీవం పట్ల యెహోవాకున్న అభిప్రాయాన్ని కలిగివున్నవారు తమ పనిముట్లను మంచిస్థితిలో ఉంచుకొని వాటిని జాగ్రత్తగా ఉపయోగించేవారు.—సంఖ్యా. 35:25; ద్వితీ. 19:4-6.

ఇంటా బయటా సురక్షితంగా ఉండేందుకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకోమని యెహోవా తన ప్రజలకు అలాంటి నియమాల ద్వారా స్పష్టం చేశాడు. ఎవరైనా ఇతరులకు హాని కలిగిస్తే లేదా ఇతరుల చావుకు కారణమైతే వారు యెహోవాకు జవాబు చెప్పాలి. ఒకవేళ అనుకోకుండా హాని చేసినా అలా జవాబు చెప్పాల్సిందే. తన ప్రజల భద్రత విషయంలో యెహోవా అభిప్రాయం ఇప్పటికీ మారలేదు. (మలా. 3:6) ప్రజలు తమకుతాము హాని చేసుకోకూడదని, పొరుగువారికి హాని చేయకూడదని యెహోవా ఇప్పటికీ కోరుకుంటున్నాడు. సత్యారాధన కోసం భవనాలను నిర్మిస్తున్నప్పుడు లేదా మరమ్మత్తు చేస్తున్నప్పుడు కూడా తన ప్రజలు సురక్షితంగా ఉండాలని యెహోవా ఆశిస్తున్నాడు.

నిర్మాణ పనులు చేస్తున్నప్పుడు భద్రతను పాటించండి

రాజ్యమందిరాలను, సమావేశ హాళ్లను, బ్రాంచి కార్యాలయాలను నిర్మించడం, మరమ్మత్తు చేయడం వంటి పనులను మనకు లభించిన గొప్ప అవకాశాలుగా భావిస్తాం. విపత్తులు వచ్చినప్పుడు సహాయక చర్యల్ని చేపట్టే విషయంలో కూడా మనం అలాగే భావిస్తాం. మనం అన్ని సమయాల్లో మన పనిని నైపుణ్యంతో చేయాలి. చిన్నచిన్న పనుల్లో సహితం తగిన నైపుణ్యం చూపించకపోతే మనకు, ఇతరులకు హాని జరగవచ్చు. (ప్రసం. 10:9) పనిచేసేటప్పుడు సురక్షితంగా ఉండేందుకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఏ హానీ జరగదు.

“యౌవనస్థుల బలము వారికి అలంకారము. తలనెరపు వృద్ధులకు సౌందర్యము” అని బైబిలు చెబుతోంది. (సామె. 20:29) పెద్దపెద్ద పనులు జరగాలంటే యౌవనస్థుల బలము అవసరం. కానీ తలనెరసిన పనివారు అంటే నిర్మాణ పనుల్లో అనుభవం ఉన్న పెద్దవారు పనిముట్లను నైపుణ్యంగా ఉపయోగించి నిర్మాణాన్ని చక్కగా లేదా అందంగా తీర్చిదిద్దుతారు. వృద్ధులైన వీరు ఒకప్పుడు ఎంతో కష్టమైన పనులు చేయడానికి తమ యౌవన బలాన్ని ఉపయోగించారు. మీరు కొత్తగా చేరిన స్వచ్ఛంద సేవకులైతే అనుభవంగల సహోదరులు ఎలా పని చేస్తున్నారో గమనించి, వారిచ్చే సూచనలు పాటించండి. మీకు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే వారు మీకు ఎన్నో విషయాలు నేర్పిస్తారు. ప్రమాదకరమైన వస్తువులను ఉపయోగించేటప్పుడు, పెద్దపెద్ద బరువులను ఎత్తేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారు మీకు నేర్పిస్తారు. అప్పుడు మీరు ఎంతో పనిని సంతోషంగా పూర్తి చేస్తారు, సురక్షితంగా ఉంటారు.

నిర్మాణ పని జరిగే స్థలంలో ఉన్న సహోదరులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అక్కడ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. నిన్నటివరకు గట్టి నేలగా కనిపించిన చోట ఇప్పుడు గుంటలు తవ్వి ఉండవచ్చు. లేక మనతోపాటు పనిచేసేవారు నిచ్చెననో, చెక్క పలకనో, పెయింట్‌ బకెట్‌నో తీసుకొచ్చి దారిలో పెట్టివుండవచ్చు. ఆ సమయంలో మనం పరధ్యానంగా ఉంటే మనకు హాని జరగవచ్చు. పనిచేసే స్థలంలో ప్రతీ ఒక్కరూ సురక్షితంగా ఉండేందుకు దోహదపడే పరికరాలను వాడాలని ఇవ్వబడే సూచనల్ని పాటించాలి. పని స్థలంలో కళ్లజోడు, హెల్మెట్‌, సరైన బూట్లు వంటివి వాడితే చాలా ప్రమాదాలను అరికట్టవచ్చు. అయితే మీరు ఆ పరికరాల్ని మంచి స్థితిలో ఉంచుకుంటూ వాటిని విధిగా వాడితేనే సురక్షితంగా ఉండగలుగుతారు.

చాలా పనిముట్లు చూడడానికి మామూలుగానే కనిపించవచ్చు. కానీ వాటిని జాగ్రత్తగా, నైపుణ్యంగా ఉపయోగించాలంటే మంచి శిక్షణ అవసరం. పనిచేయడానికి అవసరమయ్యే ఒకానొక పరికరాన్ని ఎలా ఉపయోగించాలో మీకు తెలియకపోతే, ఆ పనిని పర్యవేక్షిస్తున్న సహోదరునికి ఆ విషయం చెప్పండి. అప్పుడు ఆయన మీకు సరైన శిక్షణ అందేలా చూస్తాడు. మీ పరిమితులేమిటో గుర్తించడం చాలా మంచిది. అలా గుర్తిస్తేనే పనిస్థలంలో మీకూ, ఇతరులకూ ఏ హాని జరగదు.—సామె. 11:2.

సాధారణంగా నిర్మాణ పనులప్పుడు కిందపడడం వల్లే దెబ్బలు తగులుతుంటాయి. నిచ్చెనలు ఎక్కేటప్పుడు లేక పరంజా (నిర్మాణ పనులు జరిగేటప్పుడు పనివాళ్ల కోసం కట్టెలతో కట్టించిన కట్టడం) ఎక్కేటప్పుడు అవి మంచి స్థితిలో ఉన్నాయో లేవో చూసుకోవాలి. మీరు పరంజా ఎక్కి లేదా మేడపైకి ఎక్కి పనిచేయాల్సివస్తే పైనుండి కింద పడిపోకుండా సేఫ్టీ బెల్ట్‌ ధరించుకోవాలి. ఎత్తైన స్థలానికి ఎక్కి పనిచేసే విషయంలో మీకేమైనా సందేహాలుంటే పనిని పర్యవేక్షిస్తున్న సహోదరుణ్ణి అడిగి తెలుసుకోండి. a

ప్రపంచవ్యాప్తంగా యెహోవా సేవకుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి సత్యారాధన కోసం ఎన్నో రాజ్యమందిరాలు, సదుపాయాలు అవసరమౌతాయి. నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న సహోదరులకు తమ పర్యవేక్షణలో ఉన్న యెహోవా అమూల్యమైన గొర్రెలను కాపాడే బాధ్యత ఉంది. (యెష. 32:1, 2) నిర్మాణ పనుల్లో సహోదర సహోదరీలను నిర్దేశించే బాధ్యత ఒకవేళ మీకు అప్పగించబడితే ముందు జాగ్రత్తలు తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేయకండి. పని జరిగే స్థలం అనవసరమైన వస్తువులతో చిందరవందరగా ఉండకుండా చూడండి. కొంతమందికి భద్రతా సూచనలను పదేపదే గుర్తుచేయాల్సిరావచ్చు, అలాంటివారికి దయతోనే అయినా నిక్కచ్చిగా సూచనలను ఇస్తూ ఉండండి. యౌవనస్థులను లేదా అనుభవంలేనివారిని ప్రమాదకరమైన స్థలాల్లో పనిచేయనివ్వకండి. పనిచేసేవారికి ఎలాంటి ప్రమాదాలు ఎదురౌతాయో పసిగట్టి, వారు సురక్షితంగా ఉండేందుకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకునేలా సిద్ధం చేయండి. ఎవ్వరికీ ఏ హాని కలగకుండా పని ముగించాలన్నదే మన లక్ష్యమని గుర్తుంచుకోండి.

సురక్షితంగా ఉండాలంటే ప్రేమ ఎందుకు అవసరం?

సత్యారాధన కోసం ఉపయోగించే రాజ్యమందిరాలను, మరితర భవనాలను నిర్మించేటప్పుడు ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. కాబట్టి, అలాంటి పనుల్లో పాల్గొంటున్నవారు జాగ్రత్తగా ఉండాలి. బైబిలు సూత్రాలను గౌరవించడం ద్వారా, పనికి సంబంధించిన సూచనలను పాటించడం ద్వారా, మంచి వివేచనను ఉపయోగించడం ద్వారా మీరు ప్రమాదాలను నివారించి మీకు, మీ తోటి పనివారికి ఏ హాని కలగకుండా చూసుకోగలుగుతారు.

సురక్షితంగా ఉండేందుకు మనమెందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం? ప్రేమనుబట్టే మనమలా చేస్తాం. యెహోవా పట్ల ప్రేమ ఉంటే ఆయనలాగే జీవాన్ని అమూల్యమైనదిగా ఎంచుతాం. అంతేకాదు ప్రజల పట్ల ప్రేమ ఉన్నట్లయితే వారికి ఏ హాని కలగకుండా చూస్తాం. (మత్త. 22:37-39) కాబట్టి, మన భవన నిర్మాణ పనుల్లో పాల్గొనేవారు “సురక్షితముగా” ఉండేందుకు శాయశక్తులా కృషిచేద్దాం.

[అధస్సూచి]

a 30వ పేజీల్లోవున్న “నిచ్చెన ఎక్కి పనిచేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు” అనే బాక్సు చూడండి.

[30వ పేజీలోని బాక్సు/చిత్రం]

నిచ్చెన ఎక్కి పనిచేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇటీవల ఒక సంవత్సరంలో, అమెరికాలో నిచ్చెన మీద నుండి పడి 1,60,000 కన్నా ఎక్కువమంది గాయాలపాలయ్యారు, దాదాపు 150 మంది చనిపోయారు. మీరు ఏ దేశంలోవున్నా, ఎక్కడ పనిచేస్తున్నా నిచ్చెన మీద నుండి పడిపోకుండా ఉండేందుకు పాటించాల్సిన కొన్ని సూచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

◇ కదులుతున్న లేదా పాడైపోయిన నిచ్చెనను వాడకండి. అలాంటి దాన్ని బాగుచేయడానికి ప్రయత్నించే బదులు దాన్ని తీసిపారేయండి.

◇ ప్రతీ నిచ్చెనకు ఒక పరిమితి ఉంటుంది. కాబట్టి మీ బరువును, మీతో పాటు తీసుకెళ్లే పరికరాల బరువును నిచ్చెన మోయగలదో లేదో చూసుకోండి.

◇ ఎగుడుదిగుడుగా ఉన్న ఉపరితలంపై నిచ్చెనను పెట్టకండి. పరంజా లాంటిదానిపై లేదా బకెట్లు, బాక్సుల వంటి వాటిపై నిచ్చెనను పెట్టకండి.

◇ ఎక్కేటప్పుడుగానీ దిగేటప్పుడుగానీ దిక్కులు చూడకుండా నిచ్చెననే చూడండి.

◇ ఏ నిచ్చెనైనా సరే దానికుండే పైరెండు మెట్లమీద నిలబడకండి లేదా కూర్చోకండి.

◇ మేడపైకి ఎక్కడానికైనా దిగడానికైనా నిచ్చెనను వాడుతున్నప్పుడు అది పైకప్పుకన్నా 1 మీటరు ఎత్తు ఉండాలి. నిచ్చెన పడిపోకుండా ఉండేందుకు దాని కాళ్లను దేనికైనా కట్టండి లేదా దాని కాళ్లకు ఆనుకొనివుండేలా ఓ చెక్కముక్కను అమర్చండి. ఇవేవీ చేయలేకపోతే, మీరు నిచ్చెనపై పనిచేస్తున్నప్పుడు నిచ్చెనను పట్టుకోమని ఎవరినైనా కోరండి. నిచ్చెన పైభాగం పక్కకు జరిగే అవకాశం ఉంది కాబట్టి అది దేనికైనా ఆనుకొని ఉండేలా తాడుతో కట్టి ఉంచండి.

◇ రెండు నిచ్చెనల మెట్లకు మధ్య చెక్క పెట్టి దానిమీద పనిచేయకండి.

◇ నిచ్చెన పైకెక్కి పనిచేస్తున్నప్పుడు మీ చేతులను, కాళ్లను చాపవద్దు. ఒకవేళ అలా చేస్తే నిచ్చెన పక్కకు ఒరిగి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే, కాళ్లు చేతులు చాపి పనిచేసే బదులు దగ్గరగా ఉండి పనిచేసేలా మీ నిచ్చెనను ఎక్కడికి కావాలంటే అక్కడికి జరుపుకోండి.

◇ మూసిన తలుపు ముందు పనిచేయాల్సి వస్తే ఆ తలుపుకు ఓ సైన్‌ బోర్డ్‌ పెట్టి, దానికి తాళం వేయండి. ఒకవేళ తాళం వేయడానికి వీలు కాకపోతే ఎవరూ దాని దగ్గరికి రాకుండా ఉండేందుకు అక్కడ ఓ మనిషిని పెట్టండి.

◇ కొన్ని నిచ్చెనలు ఇద్దరు ఎక్కి పనిచేసే విధంగా రూపొందించబడతాయి. అలాంటి నిచ్చెనపై తప్ప మిగతా నిచ్చెనలపై ఇద్దరు ఎక్కి పనిచేయకూడదు. b

[అధస్సూచి]

b నిచ్చెనలపైకి ఎక్కి పనిచేసేటప్పుడు తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తల గురించి తెలుసుకునేందుకు తేజరిల్లు!, సెప్టెంబరు 8, 1999 సంచికలోని 26-28 పేజీలు చూడండి.

[29వ పేజీలోని చిత్రం]

ప్రజలు తమ ఇంటి పైకప్పు చుట్టూ పిట్టగోడ కట్టాలని మోషే ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించబడింది