కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యౌవనస్థులారా, యెహోవాను సేవించాలనే కోరికను పెంపొందించుకోండి

యౌవనస్థులారా, యెహోవాను సేవించాలనే కోరికను పెంపొందించుకోండి

యౌవనస్థులారా, యెహోవాను సేవించాలనే కోరికను పెంపొందించుకోండి

“నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.”—ప్రసం. 12:2.

1. ఇశ్రాయేలు జనాంగంలోని పిల్లలకు ఏ ఆహ్వానం ఇవ్వబడింది?

 దాదాపు 3,500 సంవత్సరాల క్రితం యాజకులకు, ఇశ్రాయేలు పెద్దలకు ప్రవక్తయైన మోషే ఇలా ఆజ్ఞాపించాడు: “మీ దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి . . . వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను.” (ద్వితీ. 31:12) ఆరాధన కోసం ఎవరెవరు సమకూడాలో గమనించండి. పురుషులు, స్త్రీలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ సమకూడాలి. అవును, పిల్లలు కూడా యెహోవా నిర్దేశాన్ని వినాలని, దాన్ని నేర్చుకొని అనుసరించాలని ఉపదేశించబడ్డారు.

2. తొలి క్రైస్తవ సంఘంలోని యౌవనస్థుల పట్ల తనకు శ్రద్ధ ఉందని యెహోవా ఎలా చూపించాడు?

2 మొదటి శతాబ్దంలో కూడా దైవభక్తిగల యౌవనస్థుల పట్ల తనకు ఎంత శ్రద్ధ ఉందో యెహోవా చూపించాడు. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు సంఘాలకు రాసిన కొన్ని పత్రికల్లో, ప్రత్యేకంగా యౌవనస్థులను ఉద్దేశించి కొన్ని నిర్దేశాలు చేర్చాడు. అలా చేర్చేందుకు యెహోవా ఆయనను ప్రేరేపించాడు. (ఎఫెసీయులు 6:1; కొలొస్సయులు 3:20 చదవండి.) అలాంటి ఉపదేశాన్ని అన్వయించుకున్న పిల్లలు తమ పరలోక తండ్రిపట్ల కృతజ్ఞత పెంచుకొని, ఆయన ఆశీర్వాదాలు పొందారు.

3. దేవుణ్ణి సేవించాలనే కోరిక తమకుందని నేటి యౌవనస్థులు ఎలా చూపిస్తున్నారు?

3 మరి మనకాలం విషయమేమిటి? యెహోవాను ఆరాధించేందుకు సమకూడమని యౌవనస్థులకు ఇప్పుడు కూడా ఆహ్వానం ఇవ్వబడుతోందా? ఇవ్వబడుతోంది! ప్రపంచవ్యాప్తంగా దైవభక్తిగల యౌవనస్థులు ఎంతోమంది పౌలు చెప్పిన మాటల్ని పాటించడాన్ని చూసి దేవుని సేవకులందరూ ఆనందిస్తున్నారు. పౌలు ఇలా చెప్పాడు: “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీ. 10:24, 25) అంతేకాక, చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి ప్రకటనా పనిలో పాల్గొంటున్నారు. (మత్త. 24:14) ప్రతీ సంవత్సరం, వేలాదిమంది యౌవనస్థులు తాము యెహోవాను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నామని చూపించేందుకు బాప్తిస్మం తీసుకుంటున్నారు. అలా వారు క్రీస్తు శిష్యులవడం వల్ల వచ్చే ఆశీర్వాదాలను అనుభవిస్తున్నారు.—మత్త. 16:24; మార్కు 10:29, 30.

ఆ ఆహ్వానానికి ఇప్పుడే స్పందించండి

4. తనను సేవించమని దేవుడు ఇచ్చిన ఆహ్వానానికి యౌవనస్థులు ఎప్పుడు స్పందించాలి?

4 ప్రసంగి 12:2లో ఇలా చెప్పబడింది: “నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.” యౌవనస్థులారా, యెహోవాను ఆరాధిస్తూ ఆయనను సేవించమని ఆప్యాయతతో మీకు ఇవ్వబడిన ఆ ఆహ్వానానికి స్పందించేందుకు మీకు ఎంత వయసు ఉండాలి? ఇంత వయసు ఉండాలని బైబిలు ఏమీ చెప్పడంలేదు. యెహోవా చెప్పేది విని, ఆయనను సేవించేంత వయసు మీకు రాలేదనుకొని వెనకడుగు వేయకండి. మీకు ఎంత వయసున్నా, ఆలస్యం చేయకుండా ఆ ఆహ్వానానికి స్పందించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం.

5. పిల్లలు ఆధ్యాత్మిక ప్రగతి సాధించేందుకు తల్లిదండ్రులు ఎలా సహాయం చేయవచ్చు?

5 తల్లిదండ్రులిద్దరూ సహాయం చేయడంవల్ల లేదా వారిలో ఎవరో ఒకరు సహాయం చేయడంవల్ల మీలో చాలామంది ఆధ్యాత్మిక ప్రగతి సాధించివుంటారు. అలాగైతే, మీరు ప్రాచీన కాలంలోని తిమోతిలాంటి వారేనని చెప్పవచ్చు. తిమోతి ఇంకా శిశువుగా ఉన్నప్పుడే వాళ్ల అమ్మ యునీకే, వాళ్ల అమ్మమ్మ లోయి ఆయనకు పరిశుద్ధ లేఖనాలను బోధించారు. (2 తిమో. 3:14, 15) మీతో కలిసి బైబిలు చదవడం ద్వారా, మీతో ప్రార్థించడం ద్వారా, క్రైస్తవ కూటాలకు, పెద్దపెద్ద సమావేశాలకు మిమ్మల్ని తీసుకువెళ్లడం ద్వారా, మీతో కలిసి పరిచర్యలో పాల్గొనడం ద్వారా మీ తల్లిదండ్రులు కూడా మీకు అలాంటి శిక్షణే ఇస్తుండవచ్చు. తన మార్గాలను మీకు బోధించే అత్యంత ప్రాముఖ్యమైన బాధ్యతను యెహోవా మీ తల్లిదండ్రులకు అప్పగించాడు. వారు చూపిస్తున్న ప్రేమను, శ్రద్ధను మీరు అర్థంచేసుకుంటున్నారా?—సామె. 23:22.

6. (ఎ) కీర్తన 110:3 చెబుతున్నట్లుగా, ఎలాంటి ఆరాధనను యెహోవా ఇష్టపడతాడు? (బి) మనం ఇప్పుడు ఏమి పరిశీలిస్తాం?

6 అయితే, పెద్దవారయ్యేకొద్దీ, తిమోతిలాగే మీరు ‘ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైవున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలని’ యెహోవా ఆశిస్తున్నాడు. (రోమా. 12:2) మీరు అలా చేస్తే, సంఘ కార్యకలాపాల్లో పాల్గొంటారు. మీ తల్లిదండ్రులను తృప్తిపరచాలని కాదుగానీ దేవుని చిత్తం చేయాలనే కోరికతోనే మీరలా చేస్తారు. మీరు ఇష్టపూర్వకంగా యెహోవాను సేవిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు. (కీర్త. 110:3) అయితే, యెహోవా చెప్పేది విని, ఆయన నిర్దేశాన్ని అనుసరించాలనే కోరికను పెంచుకోవాలనుకుంటున్నారని మీరెలా చూపించవచ్చు? మూడు ప్రాముఖ్యమైన విధానాల ద్వారా అంటే అధ్యయనం చేయడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, మీ ప్రవర్తన ద్వారా మీరలా కోరుకుంటున్నారని చూపించవచ్చు. ఇప్పుడు ఈ మూడు విషయాలను ఒక్కొక్కటిగా చూద్దాం.

యెహోవా వ్యక్తిత్వాన్ని తెలుసుకోండి

7. లేఖనాలను అధ్యయనం చేసే విషయంలో యేసు ఎలా మంచి మాదిరినుంచాడు? ఈ విషయంలో ఆయనకు ఏది సహాయం చేసింది?

7 మొదటిగా, మీరు ప్రతీరోజు దేవుని వాక్యమైన బైబిలును చదవడం ద్వారా యెహోవాను సేవించాలనే మీ కోరికను మరింత పెంచుకోవాలనుకుంటున్నారని చూపించవచ్చు. అలా చేస్తే మీరు ‘మీ ఆధ్యాత్మిక అవసరాన్ని’ తీర్చుకొని అమూల్యమైన బైబిలు జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. (మత్త. 5:3, NW) ఈ విషయంలో యేసు మంచి మాదిరినుంచాడు. ఆయనకు 12 ఏళ్లున్నప్పుడు ఆలయంలో “బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండ[డాన్ని]” ఆయన తల్లిదండ్రులు చూశారు. (లూకా 2:44-46) బాలునిగా ఉన్నప్పుడే యేసు లేఖనాలను చదవాలనే కోరికను, వాటి పట్ల అవగాహనను పెంచుకున్నాడు. అలా పెంచుకునేందుకు ఆయనకు ఏది సహాయం చేసింది? ఖచ్చితంగా ఆయన తల్లి మరియ, ఆయనను పెంచిన తండ్రి యోసేపు ఇచ్చిన శిక్షణ ఆయనకు ఎంతో సహాయం చేసింది. దేవుని సేవకులైన ఆయన తల్లిదండ్రులు బాల్యం నుండే ఆయనకు దేవుని నీతినియమాలను బోధించారు.—మత్త. 1:18-20; లూకా 2:41, 51.

8. (ఎ) తల్లిదండ్రులు పిల్లల హృదయాల్లో ఎప్పటి నుండి దేవుని వాక్యం పట్ల ప్రేమను పెంపొందించాలి? (బి) పసితనం నుండి పిల్లలకు శిక్షణ ఇవ్వడం ప్రాముఖ్యమని రుజువుచేసే ఓ అనుభవం చెప్పండి.

8 పసితనం నుండే బైబిలు సత్యాన్ని తెలుసుకోవాలనే కోరికను పిల్లల హృదయాల్లో పెంపొందించడం ఎంత ప్రాముఖ్యమో నేడు దైవభక్తిగల తల్లిదండ్రులు గుర్తిస్తారు. (ద్వితీ. 6:6-9) రూబీ అనే సహోదరి, తన మొదటి అబ్బాయి జోసెఫ్‌ పుట్టిన తర్వాత ఆ పనే చేసింది. ప్రతీరోజు ఆ అబ్బాయి కోసం నా బైబిలు కథల పుస్తకము నుండి కథలను చదివి వినిపించేది. ఆ అబ్బాయి ఎదిగేకొద్దీ వివిధ లేఖనాలను కంఠస్థం చేయించింది. జోసెఫ్‌ అలాంటి శిక్షణ నుండి ప్రయోజనం పొందాడా? ఆ అబ్బాయికి మాటలు రావడం ఆలస్యం, చాలా బైబిలు కథలను తన సొంత మాటల్లో చెప్పడం మొదలుపెట్టాడు. జోసెఫ్‌కు ఐదేళ్లున్నప్పుడు, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో మొదటి ప్రసంగాన్నిచ్చాడు.

9. బైబిలును చదివి, ధ్యానించడం ఎందుకు ప్రాముఖ్యం?

9 యౌవనస్థులారా, మీరు ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలంటే, మీ బాల్యం నుండే బైబిలు చదవడాన్ని అలవాటు చేసుకొని, దాన్ని ఎల్లప్పుడూ కొనసాగించండి. (కీర్త. 71:17) బైబిలు చదవడం వల్ల మీరు ఆధ్యాత్మిక ప్రగతిని ఎలా సాధిస్తారు? యేసు తన తండ్రికి చేసిన ప్రార్థనలో అన్న మాటలను గమనించండి: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహా. 17:3) యెహోవా గురించి మీరు తెలుసుకునేకొద్దీ, ఆయన మీకు ఒక నిజమైన వ్యక్తి అవుతాడు, ఆయనపట్ల మీ ప్రేమ పెరుగుతుంది. (హెబ్రీ. 11:27) కాబట్టి, మీరు బైబిలు చదివిన ప్రతీసారి యెహోవా గురించి మరింత తెలుసుకునేందుకు ప్రయత్నించండి. మీరు ఈ ప్రశ్నల గురించి ఆలోచించవచ్చు: ‘ఈ బైబిలు భాగం నుండి నేను యెహోవా వ్యక్తిత్వం గురించి ఏమి నేర్చుకున్నాను? నాపట్ల దేవునికి ప్రేమ, శ్రద్ధ ఉన్నాయని ఇది ఎలా చూపిస్తోంది?’ సమయం తీసుకొని అలాంటి ప్రశ్నల గురించి ఆలోచిస్తే యెహోవా ఆలోచనా తీరు గురించి, ఆయన భావాల గురించి తెలుసుకుంటారు, ఆయన మీ నుండి ఏమి కోరుతున్నాడో కూడా గ్రహిస్తారు. (సామెతలు 2:1-5 చదవండి.) అంతేకాక, యువ తిమోతిలాగే మీరూ లేఖనాల నుండి నేర్చుకున్నవి ‘రూఢియని తెలుసుకుంటారు,’ మనస్ఫూర్తిగా యెహోవాను సేవించాలనుకుంటారు.—2 తిమో. 3:14.

ప్రార్థించడం ద్వారా యెహోవాపట్ల మీ ప్రేమ ఎలా పెరుగుతుంది?

10, 11. ప్రార్థించడం ద్వారా యెహోవాను సేవించాలనే మీ కోరిక ఎలా పెరుగుతుంది?

10 రెండవదిగా, ప్రార్థించడం ద్వారా హృదయపూర్వకంగా యెహోవాను సేవించాలనే మీ కోరికను పెంచుకోవచ్చు. కీర్తన 65:2లో మనమిలా చదువుతాం: “ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు.” ఇశ్రాయేలీయులు తన నిబంధనా ప్రజలుగా ఉన్న కాలంలో కూడా అన్యులు తన ఆలయంలోకి వచ్చి తనకు ప్రార్థించేందుకు యెహోవా అనుమతించాడు. (1 రాజు. 8:41, 42) దేవుడు పక్షపాతికాడు. తన ఆజ్ఞలు పాటించేవారి ప్రార్థనలను వింటానని ఆయన హామీనిచ్చాడు. (సామె. 15:8) కాబట్టి, ఆ ‘సర్వశరీరుల్లో’ యౌవనస్థులైన మీరు కూడా ఉన్నారు.

11 నిజమైన స్నేహానికి మంచి సంభాషణ ఊపిరి లాంటిదని మీకు తెలుసు. మీరు బహుశా మీ మనసులో ఉన్న ఆలోచనలను, చింతలను, భావాలను దగ్గరి స్నేహితునితో పంచుకోవడానికి ఇష్టపడుతుండవచ్చు. అదే విధంగా హృదయపూర్వకంగా ప్రార్థించడం ద్వారా మీరు మీ గొప్ప సృష్టికర్తతో మాట్లాడగలుగుతారు. (ఫిలి. 4:6, 7) మీరు ప్రేమగల తల్లి/తండ్రితో లేదా దగ్గరి స్నేహితునితో/స్నేహితురాలితో మనసువిప్పి మాట్లాడినట్లే యెహోవాతో మాట్లాడండి. నిజానికి, మీరు ప్రార్థించే తీరుకూ, యెహోవాపట్ల మీకున్న భావాలకూ మధ్య దగ్గరి సంబంధముంది. యెహోవాతో మీ స్నేహం ఎంత బలపడితే, మీ ప్రార్థనలు అంత అర్థవంతంగా తయారౌతాయి.

12. (ఎ) అర్థవంతంగా ప్రార్థించడమంటే ఏమిటి? (బి) మీరు దేన్ని గుర్తిస్తే యెహోవా మీకు దగ్గరగా ఉన్నాడని గ్రహిస్తారు?

12 అయితే అర్థవంతంగా ప్రార్థించడమంటే ఏదో కొన్ని మాటలు చెప్పడం కాదుగానీ హృదయాన్ని విప్పి మాట్లాడడమని గుర్తుంచుకోండి. మీ ప్రార్థనల్లో యెహోవాపట్ల మీకున్న ప్రగాఢమైన ప్రేమను, గౌరవాన్ని, ఆయనపట్ల మీకున్న పూర్తి నమ్మకాన్ని తెలియజేయండి. యెహోవా మీ ప్రార్థనలకు ఎలా జవాబిస్తాడో గుర్తించినప్పుడు, “తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి . . . యెహోవా సమీపముగా ఉన్నాడు” అని మునుపటికన్నా మరింత ఎక్కువగా మీరు గ్రహిస్తారు. (కీర్త. 145:18) అప్పుడు యెహోవా మీకు దగ్గరౌతాడు. అంతేకాక, అపవాదిని ఎదిరిస్తూ, జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు కావాల్సిన బలాన్నిస్తాడు.—యాకోబు 4:7, 8 చదవండి.

13. (ఎ) దేవునితో స్నేహం చేయడం వల్ల ఓ సహోదరి ఎలా ప్రయోజనం పొందింది? (బి) దేవునితో స్నేహం చేయడం వల్ల తోటివారి ఒత్తిడిని మీరెలా అధిగమించగలుగుతారు?

13 యెహోవాతో దగ్గరి సంబంధం కలిగివుండడంవల్ల బలాన్ని పొందిన షెరీ అనే సహోదరి ఉదాహరణను చూడండి. ఆమె ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు మంచి మార్కులు సంపాదించి, క్రీడల్లో బాగా రాణించింది కాబట్టి ఎన్నో అవార్డులను పొందింది. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, ఉన్నత విద్యను అభ్యసించేందుకు కావాల్సిన స్కాలర్‌షిప్‌ను ఆమెకు ఇవ్వజూపారు. షెరీ ఇలా అంటోంది: “అది ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. దాన్ని తీసుకోమని కోచ్‌లు, తోటి విద్యార్థులు ఎంతో ఒత్తిడి చేశారు.” అయితే, ఉన్నత విద్యను అభ్యసిస్తే కేవలం చదువుల కోసం, క్రీడలకు సిద్ధపడడం కోసం తన సమయాన్నంతా కేటాయించాల్సి వస్తుందని, దాంతో యెహోవాను సేవించడానికి తనకు సమయం సరిపోదని ఆమె గుర్తించింది. షెరీ ఏమి చేసింది? “యెహోవాకు ప్రార్థించిన తర్వాత, నేను ఆ స్కాలర్‌షిప్‌ తీసుకోకుండా, క్రమ పయినీరుగా సేవచేయడం మొదలుపెట్టాను” అని ఆమె చెప్పింది. ఉన్నత విద్యను అభ్యసించే బదులు, ఆమె గత ఐదు సంవత్సరాలుగా పయినీరు సేవ చేస్తోంది. “నేను తీసుకున్న నిర్ణయాన్నిబట్టి బాధపడడంలేదు. యెహోవాకు ఇష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నాను కాబట్టి ఎంతో సంతోషిస్తున్నాను. మనం నిజంగా దేవుని రాజ్యానికి మొదటి స్థానమిస్తే, మిగతావన్నీ అనుగ్రహించబడతాయి” అని ఆమె చెప్పింది.—మత్త. 6:33.

మంచి ప్రవర్తనవల్ల మీకు “శుద్ధమైన హృదయము” ఉందని చూపిస్తారు

14. యెహోవా ముందు మంచి ప్రవర్తన కలిగివుండడం ఎందుకు ప్రాముఖ్యం?

14 మూడవదిగా, మీ ప్రవర్తన ద్వారా యెహోవాను ఇష్టపూర్వకంగా సేవిస్తున్నారని చూపించవచ్చు. నైతిక విషయాల్లో పవిత్రంగా ఉన్న యౌవనస్థులను యెహోవా ఆశీర్వదిస్తాడు. (కీర్తన 24:3-5 చదవండి.) యువ సమూయేలు ప్రధాన యాజకుడైన ఏలీ కుమారుల అనైతిక ప్రవర్తనను అనుకరించడానికి ఇష్టపడలేదు. సమూయేలు మంచి ప్రవర్తనను అందరూ గమనించారు. దాని గురించి బైబిలు ఇలా చెబుతోంది: “బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.”—1 సమూ. 2:26.

15. మీరు మంచి ప్రవర్తనను కాపాడుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

15 పౌలు చెప్పినట్లు నేటి లోకంలో స్వార్థప్రియులను, అహంకారులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞతలేనివారిని, అపవిత్రులను, క్రూరులను, గర్వాంధులను, దేవునికంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారిని మనం చూస్తున్నాం. ఇవే కాక ఇంకా ఎన్నో చెడు లక్షణాలను మనం నేటి లోకంలో చూస్తున్నాం. (2 తిమో. 3:1-5) కాబట్టి, ఇలాంటి చెడు వాతావరణంలో జీవిస్తూ మంచి ప్రవర్తనను కాపాడుకోవడం మీకు ఎంతో కష్టమనిపించవచ్చు. అయితే చెడుగా ప్రవర్తించకుండా, మీరు సరైనది చేసిన ప్రతీసారి విశ్వసర్వాధిపత్యపు వివాదాంశంలో యెహోవా పక్షాన ఉన్నారని చూపిస్తారు. (యోబు 2:3, 4) యెహోవా ప్రేమతో చేస్తున్న ఈ విన్నపానికి స్పందిస్తున్నారనే సంతృప్తి కూడా మీకు ఉంటుంది: “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.” (సామె. 27:11) అంతేకాక, యెహోవా ఆమోదం మీకు ఉందని తెలుసుకున్నప్పుడు ఆయనను సేవించాలనే కోరిక కూడా పెరుగుతుంది.

16. ఓ సహోదరి యెహోవా హృదయాన్ని ఎలా సంతోషపెట్టింది?

16 క్యారల్‌ అనే క్రైస్తవ సహోదరి యౌవనస్థురాలిగా ఉన్నప్పుడు పాఠశాలలో బైబిలు సూత్రాలను తూ.చా. తప్పకుండా పాటించేది. ఆమె మంచి ప్రవర్తనను అందరూ గమనించారు. అయితే, ఆమె తోటి విద్యార్థులు ఎలా స్పందించారు? ఆమెను హేళనచేశారు. ఎందుకంటే ఆమె తన మనస్సాక్షిని బైబిలు ప్రకారం మలచుకుంది కాబట్టి, పండుగల్లో, దేశభక్తికి సంబంధించిన ఉత్సవాల్లో పాల్గొనేది కాదు. అలాంటి సందర్భాల్లో తన నమ్మకాల గురించి ఇతరులకు చెప్పే అవకాశం ఆమెకు కొన్నిసార్లు లభించింది. అనేక సంవత్సరాల తర్వాత, క్యారల్‌కు గతంలో తనతో కలిసి చదివిన ఓ విద్యార్థిని నుండి ఓ కార్డు వచ్చింది. అందులో ఆమె, “ఏదో ఒక రోజు నిన్ను కలిసి కృతజ్ఞతలు చెప్పాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. మనం స్కూల్లో చదువుతున్నప్పుడు నీ మంచి ప్రవర్తనను, క్రైస్తవురాలిగా నీ మాదిరిని, పండుగలకు సంబంధించి నీ అభిప్రాయం తెలియజేసే విషయంలో నువ్వు చూపించిన ధైర్యాన్ని నేను గమనించాను. నేను కలిసిన మొదటి యెహోవాసాక్షివి నువ్వే” అని రాసింది. క్యారల్‌ మాదిరి ఆమెను ఎంత ముగ్ధురాలిని చేసిందంటే ఆ తర్వాత ఆమె బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. తాను బాప్తిస్మం తీసుకొని 40 కన్నా ఎక్కువ సంవత్సరాలైందని ఆమె కార్డులో రాసింది! క్యారల్‌లాగే నేడు యౌవనస్థులైన మీరు బైబిలు సూత్రాలను ధైర్యంగా పాటిస్తే దాన్ని చూసే యథార్థహృదయులు యెహోవా గురించి తెలుసుకోవాలనుకోవచ్చు.

యెహోవాను స్తుతిస్తున్న యౌవనస్థులు

17, 18. (ఎ) మీ సంఘంలోని యౌవనస్థులను చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? (బి) దైవభక్తిగల యౌవనస్థులకు ఎలాంటి భవిష్యత్తు ఉంది?

17 సత్యారాధనలో భాగం వహిస్తున్న వేలాదిమంది ఉత్సాహవంతులైన యౌవనస్థులను చూసి యెహోవా ప్రపంచవ్యాప్త సంస్థలోవున్న మనందరి మనసు పులకించిపోతుంది! రోజూ బైబిలు చదవడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, దేవుడు ఇష్టపడే విధంగా ప్రవర్తించడం ద్వారా ఆ యౌవనస్థులు యెహోవాను ఆరాధించాలనే తమ కోరికను పెంచుకుంటున్నారు. అలాంటి మంచి మాదిరిని ఉంచుతున్న యౌవనస్థులు తమ తల్లిదండ్రులకే కాక యెహోవా ప్రజలందరికీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నారు.—సామె. 23:24, 25.

18 భవిష్యత్తులో, దేవుడు వాగ్దానం చేసిన నూతనలోకంలోకి ప్రవేశించేవారిలో నమ్మకమైన యౌవనస్థులు కూడా ఉంటారు. (ప్రక. 7:9, 14) అక్కడ వారు యెహోవాపట్ల తమ అవగాహనను, కృతజ్ఞతను పెంచుకుంటుండగా లెక్కలేనన్ని ఆశీర్వాదాలు అనుభవించగలుగుతారు, ఆయనను నిరంతరం స్తుతించగలుగుతారు.—కీర్త. 148:12, 13.

మీరు వివరించగలరా?

• నేడు సత్యారాధనలో యౌవనస్థులు ఎలా భాగం వహించవచ్చు?

• బైబిలు పఠనం నుండి ప్రయోజనం పొందడానికి, ధ్యానించడం ఎందుకు చాలా అవసరం?

• యెహోవాకు దగ్గరయ్యేందుకు ప్రార్థన మీకు ఎలా సహాయం చేస్తుంది?

• క్రైస్తవులమైన మనం మంచిగా ప్రవర్తిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి?

[అధ్యయన ప్రశ్నలు]

[5వ పేజీలోని చిత్రం]

మీరు ప్రతీరోజు బైబిలు చదువుతున్నారా?