వ్యర్థమైనవాటిని చూడకండి!
వ్యర్థమైనవాటిని చూడకండి!
“వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము.”—కీర్త. 119:37.
1. కళ్లు ఎంత ప్రాముఖ్యమైనవి?
మనకు కళ్లు ఎంత అవసరమో ఒకసారి ఆలోచించండి! వాటివల్లే మనం మన చుట్టూవున్న పరిసరాల ఎత్తును, లోతును, వెడల్పును, రంగును గుర్తించగలుగుతాం. కళ్లతోనే మనం ఇష్టపడే స్నేహితులను చూడగలుగుతాం, ప్రమాదాల్ని పసిగట్టగలుగుతాం. వాటితోనే మనం ప్రకృతి అందాలను వీక్షించగలుగుతాం, దానిలోని అద్భుతాలను ఆస్వాదించగలుగుతాం. అంతేకాదు, వాటన్నిటినీ చూసినప్పుడు దేవుడున్నాడని స్పష్టమౌతోంది, ఆయన మహిమ వెల్లడౌతోంది. (కీర్త. 8:3, 4; 19:1, 2; 104:24; రోమా. 1:20) మన మెదడుకు సంకేతాల్నిచ్చే ప్రాముఖ్యమైన ఇంద్రియం కన్నే కాబట్టి, యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకోవడానికి, ఆయనపై విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి అది మనకు ఎంతో సహాయం చేస్తుంది.—యెహో. 1:8; కీర్త. 1:2, 3.
2. మనం చూసేవాటి విషయంలో ఎందుకు జాగ్రత్త వహించాలి? కీర్తనకర్త హృదయపూర్వకంగా చేసిన విన్నపం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
2 అయితే, కొన్నిసార్లు మన కళ్లు మనకు హాని కూడా చేయగలవు. మన కళ్లకూ, మెదడుకూ ఎంత దగ్గరి సంబంధం ఉందంటే, మన కళ్ల ద్వారా మెదడులోకి చేరే విషయాలు మనం లక్ష్యాలు ఏర్పర్చుకునేలా చేయవచ్చు, మనలో కోరికలను రగిలించవచ్చు లేదా వాటిని పెంచవచ్చు. సాతాను చెప్పుచేతల్లోవున్న ఈ లోకం దుష్టత్వంతో, స్వార్థంతో నిండిపోయింది కాబట్టి, మనల్ని సులభంగా పక్కదారిపట్టించగల చిత్రాలు, ప్రచార కార్యక్రమాలు అనుక్షణం ప్రసారం చేయబడుతున్నాయి. వాటిని కేవలం కొద్ది క్షణాలు చూసినా చాలు మనం తప్పుదోవ పట్టవచ్చు. (1 యోహా. 5:19) అందుకే, కీర్తనకర్త దేవుణ్ణి ఇలా వేడుకున్నాడు: “వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుము.”—కీర్త. 119:37.
మన కళ్లు మనల్ని ఎలా తప్పుదోవ పట్టించవచ్చు?
3-5. మన కళ్లు మనల్ని తప్పుదోవ పట్టిస్తాయని ఏ బైబిలు ఉదాహరణలను బట్టి తెలుస్తోంది?
3 మొదటి స్త్రీయైన హవ్వకు ఏమి జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. ఆమె “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష” ఫలాలను తింటే ఆమె కళ్లు ‘తెరవబడతాయని’ సాతాను నమ్మించాడు. నిజంగానే తన కళ్లు ‘తెరవబడతాయనుకొని’ ఆ పండును తినేందుకు హవ్వ ఉత్సుకతను చూపించింది. “ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు,” యెహోవా తినకూడదని చెప్పిన ఆ పండును తినాలన్న కోరిక ఆమెలో మరింత పెరిగింది. ఆ కోరికతో చెట్టువైపు చూడడంవల్ల హవ్వ దేవుని ఆజ్ఞకు అవిధేయురాలైంది, ఆమె భర్తయైన ఆదాము కూడా అవిధేయుడయ్యాడు. దానివల్ల మానవులందరూ దుష్ఫలితాలను అనుభవించాల్సి వచ్చింది.—ఆది. 2:17; 3:2-6; రోమా. 5:12; యాకో. 1:14, 15.
4 నోవహు దినాల్లో కొందరు దేవదూతలు కూడా తాము చూసినదాన్నిబట్టి తప్పుదారిపట్టారు. ఆ దూతల గురించి ఆదికాండము 6:2 ఇలా చెబుతోంది: “దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.” ఆ తిరుగుబాటుదారులైన దేవదూతలు కామవాంఛతో స్త్రీలను చూసినందువల్ల వారితో లైంగిక సంబంధాలు ఏర్పర్చుకోవాలనే అసహజమైన కోరిక వారిలో పుట్టింది. ఆ తర్వాత వాళ్లు నరుల కుమార్తెలతో సంబంధాలు ఏర్పర్చుకొని సంకర జాతి పిల్లల్ని కన్నారు. వారివల్ల దుష్టత్వం పెరగడంతో నోవహు కుటుంబంతప్ప మొత్తం మానవజాతి నాశనం చేయబడింది.—ఆది. 6:4-7, 11, 12.
5 శతాబ్దాల తర్వాత, ఇశ్రాయేలీయుడైన ఆకాను తన కళ్లతో చూసినదానిబట్టి ఆకర్షితుడై ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకున్న యెరికో పట్టణంలో నుండి కొన్ని వస్తువులను దొంగిలించాడు. యెహోవా ధనాగారంలో ఉంచాల్సిన వస్తువులు తప్ప పట్టణంలోని మిగతావాటన్నిటినీ నాశనం చేయమని యెహోవా ఆజ్ఞాపించాడు. తమలో ఆశ పుట్టి ఆ పట్టణంలోని వస్తువులను తీసుకొనిపోకుండా ఉండేందుకు ఇశ్రాయేలీయుల్ని యెహోవా ఇలా హెచ్చరించాడు: “శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు.” కానీ ఆకాను యెహోవా ఆజ్ఞను మీరినందువల్ల ఇశ్రాయేలీయులు హాయి పట్టణస్థుల చేతుల్లో ఓటమి పాలయ్యారు, చాలామంది మరణించారు. తాను పట్టుబడేంతవరకు ఆకాను దొంగతనం చేశానని ఒప్పుకోలేదు. “నేను చూచి వాటిని ఆశించి తీసికొంటిని” అని ఆకాను చెప్పాడు. నేత్రాశవల్ల అతనే కాదు, అతనికి “కలిగిన సమస్తము” నాశనం చేయబడ్డాయి. (యెహో. 6:18, 19; 7:1-26) ఆకాను నిషేధించబడినవాటిని కోరుకున్నాడు.
మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోవాలి
6, 7. మనల్ని ప్రలోభపెట్టేందుకు సాతాను ఏ ‘తంత్రాన్ని’ ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు? వాణిజ్య ప్రకటనలను రూపొందించేవారు దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు?
6 హవ్వ, అవిధేయులైన దేవదూతలు, ఆకాను శోధించబడినట్లే నేడు కూడా మానవులు శోధించబడుతున్నారు. మానవజాతిని తప్పుదోవ పట్టించడానికి సాతాను ఉపయోగించే ‘తంత్రాల్లో’ ‘నేత్రాశే’ అత్యంత శక్తివంతమైనది. (2 కొరిం. 2:11; 1 యోహా. 2:16) ప్రజలు తాము చూసేవాటినిబట్టి ఆకర్షితులౌతారనే విషయం వాణిజ్య ప్రకటనలు రూపొందించేవారికి తెలుసు. ఐరోపా దేశానికి చెందిన ఓ మార్కెట్ నిపుణుడు ఇలా చెబుతున్నాడు: “చెడు చేసేలా మన కళ్లే మనల్ని ఎక్కువగా ప్రలోభపెడతాయి. అవి ఇతర జ్ఞానేంద్రియాలపై ఆధిపత్యం చెలాయిస్తాయి. అంతేకాదు, మంచిచెడ్డలు తెలిసినా చెడువైపే మొగ్గు చూపేలా చేసే శక్తి వాటికుంది.”
7 అందుకే, వాణిజ్య ప్రకటనలు కంటికి ఆకర్షణీయంగా కనిపించేలా, ఫలాని వస్తువు కొనాలి లేదా ఫలాని సేవలు వినియోగించుకోవాలని మనకు అనిపించేలా చాలా తెలివిగా రూపొందించబడుతున్నాయి. వాణిజ్య ప్రకటనలు వ్యక్తులపై ఎలా ప్రభావం చూపిస్తాయనే దానిగురించి అధ్యయనం చేసిన ఓ అమెరికా పరిశోధకుడు ఇలా అన్నాడు: “కేవలం అవగాహన కల్పించడం కోసం కాదుగానీ ప్రాముఖ్యంగా ఒక వ్యక్తిలో భావావేశాన్ని కలుగజేసి దాని ప్రకారం అతడు చర్య తీసుకునేలా అవి రూపొందించబడతాయి.” వాణిజ్య ప్రకటనల్లో ఎక్కువగా రెచ్చగొట్టే అశ్లీల చిత్రాలను, దృశ్యాలను ఉపయోగిస్తున్నారు. కాబట్టి, మనం చూసేవాటి విషయంలో, మన హృదయంలోకి అనుమతించేవాటి విషయంలో జాగ్రత్తపడడం ఎంత ప్రాముఖ్యం!
8. మన కళ్లను అదుపులో ఉంచుకోవాలనే విషయం బైబిల్లో ఎలా నొక్కిచెప్పబడింది?
8 నిజక్రైస్తవులు కూడా నేత్రాశకు, శరీరాశకు లొంగిపోయే అవకాశం ఉంది. అందుకే మనం చూసేవాటి విషయంలో, కోరుకునేవాటి విషయంలో మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోవాలని దేవుని వాక్యం ప్రోత్సహిస్తోంది. (1 కొరిం. 9:25, 27; 1 యోహాను 2:15-17 చదవండి.) మనం చూసేదానికి, కోరుకునేదానికి మధ్య ఎంత దగ్గరి సంబంధం ఉందో నీతిమంతుడైన యోబు గుర్తించాడు. ఆయనిలా అన్నాడు: “నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?” (యోబు 31:1) యోబు చెడు ఆలోచనతో స్త్రీని ముట్టుకోలేదు సరికదా అలాంటి ఆలోచన కూడా మనసులోకి రానివ్వలేదు. ఒక వ్యక్తి అనైతిక ఆలోచనలను తన మనసులో రానివ్వకూడదనే విషయాన్ని నొక్కిచెప్పేందుకు యేసు ఇలా అన్నాడు: “ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.”—మత్త. 5:28.
వ్యర్థమైన ఏ విషయాలకు దూరంగా ఉండాలి?
9. (ఎ) ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నప్పుడు మనం ఎందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి? (బి) అశ్లీల చిత్రాలను, దృశ్యాలను కొద్ది క్షణాలు చూసినా ఎలాంటి హాని జరుగుతుంది?
9 ముఖ్యంగా ఇంటర్నెట్‌లాంటి మాధ్యమాల్లో ప్రజలు అశ్లీల చిత్రాలను, దృశ్యాలను ‘చూస్తూ’ ఉండడం మన కాలంలో సర్వసాధారణమైపోయింది. అలాంటి వెబ్‌సైట్ల కోసం మనం వెదకాల్సిన పనిలేదు, అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఎలా? కంప్యూటర్ స్క్రీన్‌పై అకస్మాత్తుగా అశ్లీల చిత్రమున్న ఓ ప్రకటన రావచ్చు లేదా మామూలుగా కనిపించే ఓ ఈ-మెయిల్ రావచ్చు. కానీ మూయకుండా అలాగే చూడాలనిపించే అశ్లీల చిత్రం అందులో ఉండవచ్చు. అయితే, ఒక వ్యక్తి ఈ-మెయిల్‌ని మూసేలోపు కొద్ది క్షణాలు ఆ చిత్రాన్ని చూసినా అది ఆయన మనసులో ముద్రపడిపోతుంది. కేవలం కొద్ది క్షణాలు చూసినా చాలు అది బాధాకరమైన పర్యవసానాలకు దారితీయగలదు. దానివల్ల ఒక వ్యక్తి అపరాధ భావాలతో సతమతంకావచ్చు, ఆ చిత్రాలను తన మనసులో నుండి తీసేసుకోవడం చాలా కష్టమనిపించవచ్చు. అయితే, ఓ వ్యక్తి అలాంటి చిత్రాలను ‘చూస్తూ’ ఉన్నాడంటే, ఆయన తన హృదయంలోవున్న చెడు కోరికలను చంపుకోలేదని దానర్థం.—ఎఫెసీయులు 5:3, 4, 12 చదవండి; కొలొ. 3:5, 6.
10. ప్రత్యేకంగా పిల్లలు అశ్లీల చిత్రాలను, దృశ్యాలను చూసే ప్రమాదం ఎందుకు ఉంది? అవి చూడడంవల్ల ఏమి జరగవచ్చు?
10 తమ సహజ కుతూహలాన్నిబట్టి పిల్లలు అశ్లీల చిత్రాలకు, దృశ్యాలకు ఆకర్షితులుకావచ్చు. ఒకవేళ అదే జరిగితే లైంగిక విషయాల్లో వారికున్న అభిప్రాయంపై అది బలమైన ప్రభావం చూపించవచ్చు. వారికి లైంగికతకు సంబంధించి వక్రీకరించబడిన అభిప్రాయం ఏర్పడవచ్చు లేదా “ప్రేమపూర్వకమైన మంచి సంబంధాలను కాపాడుకోవడం కష్టమనిపించవచ్చు, ఆడవారి విషయంలో తప్పుడు అభిప్రాయం ఏర్పడవచ్చు, అశ్లీల చిత్రాలు చూడనిదే రోజు గడవని పరిస్థితి రావచ్చు, స్కూలులో పాఠాలమీద మనసు పెట్టలేకపోవచ్చు, స్నేహాలు, కుటుంబ సంబంధాలు దెబ్బతినవచ్చు” అని ఓ నివేదిక చెబుతోంది. అంతకంటే ఘోరమైన విషయమేమిటంటే దానివల్ల, వారు తమ దాంపత్య జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సిరావచ్చు.
11. అశ్లీల చిత్రాలు చూడడంవల్ల ప్రమాదం ఉందని చూపించే ఓ ఉదాహరణ చెప్పండి.
11 ఓ సహోదరుడు ఇలా చెబుతున్నాడు: “సాక్షిని కాకముందు నాకు కొన్ని వ్యసనాలుండేవి. వాటిలో అశ్లీల చిత్రాలను చూసే వ్యసనాన్ని మానుకోవడం మాత్రం చాలా కష్టమైంది. అకస్మాత్తుగా వచ్చే వాసననుబట్టి, కొన్నిరకాల సంగీతాన్నిబట్టి, నేను చూసిన దాన్నిబట్టి లేదా పరధ్యానంలో ఉన్నప్పుడు వచ్చే ఆలోచననుబట్టి ఇప్పటికీ కొన్నిసార్లు ఈ చిత్రాలు నా మనసులో మెదులుతుంటాయి. నిజానికి నాకు ప్రతీ రోజూ, ప్రతీ క్షణం ఓ పోరాటమే.” మరో సహోదరుడు చిన్నప్పుడు, సత్యంలోలేని తన నాన్న చూసే అశ్లీల చిత్రాల పత్రికలను తన తల్లిదండ్రులు లేని సమయంలో చూసేవాడు. ఆయనిలా రాశాడు: “నా పసిహృదయంపై అవి ఎంత ఘోరమైన ప్రభావం చూపించాయంటే, అది జరిగి 25 ఏళ్లు గడిచినా ఇప్పటికీ నేను కొన్ని చిత్రాలను మరచిపోలేకపోతున్నాను. ఎంత ప్రయత్నించినా అవి నా మనసులో నుండి తీసేసుకోలేకపోతున్నాను. నేను వాటి గురించి ఆలోచించకపోయినా అపరాధ భావాలతో సతమతమౌతున్నాను.” కృంగదీసే భావాలు కలుగజేసే వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండడం ఎంత జ్ఞానయుక్తం! అయితే, ఒక వ్యక్తి అలాంటివాటిని చూడకుండా ఉండాలంటే ఏమి చేయాలి? ‘ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టాలి.’—2 కొరిం. 10:5.
12, 13. క్రైస్తవులు ఏ వ్యర్థమైనవాటిని చూడకూడదు? ఎందుకు?
12 మనం మరో ‘దుష్కార్యానికి’ లేదా వ్యర్థమైన దానికి అంటే ధనాపేక్షను, మంత్ర తంత్రాలను, దౌర్జన్యాన్ని, హింసను, రక్తపాతాన్ని చూపించే వినోదానికి దూరంగా ఉండాలి. (కీర్తన 101:3 చదవండి.) తమ ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలు చూడాలో నిర్ణయించే బాధ్యత తల్లిదండ్రులకు ఇవ్వబడింది. అయితే, ఏ నిజ క్రైస్తవుడు భూతప్రేత సంబంధమైనవాటిలో భాగం వహించడు. అయినా ఏ సినిమాల్లో, ధారావాహికల్లో, వీడియోగేముల్లో, హాస్య పుస్తకాల్లో, పిల్లల పుస్తకాల్లో మంత్ర తంత్రాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయో తల్లిదండ్రులు కనిపెట్టాలి.—సామె. 22:5.
13 హత్య, హింస వంటివి మన ముందే జరుగుతున్నట్లు అనిపించే వీడియోగేములు, సినిమాలు కొన్ని ఉన్నాయి. మనం పిల్లలమైనా, పెద్దవాళ్లమైనా అలాంటివాటిని ఇష్టపడకూడదు. (కీర్తన 11:5 చదవండి.) యెహోవా ఖండించే విషయాలపై మన మనసు నిలుపకూడదు. మన మనసుల్ని పాడుచేయడమే సాతాను లక్ష్యమని గుర్తుంచుకోండి. (2 కొరిం. 11:3) కుటుంబమంతా కలిసి ఆనందించదగిన వినోదానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించినాసరే కుటుంబ ఆరాధనకు, క్రమమైన బైబిలు పఠనానికి, కూటాలకు సిద్ధపడడానికి సమయం లేకుండాపోతుంది.—ఫిలి. 1:9, 10.
యేసు మాదిరిని అనుకరించండి
14, 15. క్రీస్తుపై సాతాను తెచ్చిన మూడవ శోధనలో గమనించదగిన ఓ విషయం ఏమిటి? యేసు దాన్నెలా తట్టుకొని నిలబడగలిగాడు?
14 విచారకరంగా, నేటి దుష్ట లోకంలో కొన్ని వ్యర్థమైన విషయాల నుండి పూర్తిగా తప్పించుకోలేం. అంతెందుకు, యేసుకు కూడా అలాంటివి బలవంతంగా చూపించబడ్డాయి. దేవుని చిత్తం చేయనీయకుండా యేసును పక్కదారి పట్టించేందుకు సాతాను మూడోసారి ప్రయత్నించినప్పుడు, ‘అపవాది మిగుల ఎత్తయిన ఒక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, ఈ లోకరాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపించాడు.’ (మత్త. 4:8) సాతాను ఎందుకలా చేశాడు? నేత్రాశను ఉపయోగించి యేసును తప్పుదోవ పట్టించాలనుకున్నాడు. ప్రపంచ రాజ్యాల వైభవాన్ని చూసి ప్రపంచంలో ఒక గొప్ప స్థానాన్ని కలిగివుండాలనే కోరిక యేసులో కలిగే అవకాశం ఉంది. కానీ, యేసు ఏమి చేశాడు?
15 ఆకర్షణీయంగా కనిపించే ఆ ప్రతిపాదనను యేసు పట్టించుకోలేదు. తన హృదయంలో చెడు కోరికలకు చోటివ్వలేదు. అపవాది ప్రతిపాదనను తిరస్కరించాలా వద్దా అని ఆలోచించడానికి ఆయన కొంత సమయం కూడా తీసుకోలేదు. వెంటనే దాన్ని తిరస్కరించి “సాతానా, పొమ్ము” అని వాణ్ణి ఆజ్ఞాపించాడు. (మత్త. 4:10) యేసు యెహోవాతో తనకున్న సంబంధాన్ని మనసులో ఉంచుకొని, దేవుని చిత్తం చేయాలనే తన జీవితాశయానికి అనుగుణంగా జవాబిచ్చాడు. (హెబ్రీ. 10:7) దానివల్ల యేసు సమర్థంగా సాతాను కుయుక్తితో పన్నిన పన్నాగాన్ని తిప్పికొట్టాడు.
16. సాతాను శోధనల్ని ఎదిరించే విషయంలో యేసు మాదిరి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
16 యేసు ఉదాహరణ నుండి మనమెంతో నేర్చుకోవచ్చు. మొదటిగా, సాతాను తన కుతంత్రాలతో ఎవరినైనా శోధించగలడు. (మత్త. 24:24) రెండవదిగా, మనం మన కళ్లతో దేన్నైతే చూస్తామో అది మన హృదయ కోరికల్ని రగిలించవచ్చు. దానివల్ల మనకు చెడైనా జరగవచ్చు లేక మంచైనా జరగవచ్చు. మూడవదిగా, సాతాను మనల్ని తప్పుదోవ పట్టించడానికి ‘నేత్రాశను’ ఎంత వీలైతే అంత ఎక్కువగా ఉపయోగిస్తాడు. (1 పేతు. 5:8) నాలుగవదిగా, తక్షణమే చర్య తీసుకున్నట్లయితే మనం కూడా సాతానును ఎదిరించగలం.—యాకో. 4:7; 1 పేతు. 2:21.
మీ కంటిని “తేటగా” ఉంచుకోండి
17. వ్యర్థమైనవి తారసపడేంతవరకు ఆగి ఆ తర్వాత ఏమి చేయాలో నిర్ణయించుకోవడం ఎందుకు తెలివైన పని కాదు?
17 యెహోవాకు సమర్పించుకున్నప్పుడు వ్యర్థమైనవాటికి దూరంగా ఉంటామని మనం మాటిచ్చాం. దేవుని చిత్తం చేస్తామని మాటివ్వడం ద్వారా మనం కీర్తనకర్తతో ఏకీభవించాం. ఆయనిలా అన్నాడు: “నేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్టమార్గములన్నిటిలోనుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను.” (కీర్త. 119:101) వ్యర్థమైనవి తారసపడేంతవరకు ఆగి ఆ తర్వాత ఏమి చేయాలో నిర్ణయించుకోవడం తెలివైన పని కాదు. ఏ విషయాల్ని లేఖనాలు ఖండిస్తున్నాయో మనకు స్ఫష్టంగా తెలియజేయబడింది. సాతాను తంత్రాలు మనకు తెలియనివి కావు. రాళ్లను రొట్టెలుగా మార్చమని యేసును సాతాను ఎప్పుడు శోధించాడు? యేసు 40 రోజులు, 40 రాత్రులు ఉపవాసం చేసి చాలా ‘ఆకలితో’ ఉన్నప్పుడు శోధించాడు. (మత్త. 4:1-4) మనం ఎప్పుడు బలహీనంగా ఉంటామో, ఎప్పుడు శోధనలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుందో సాతాను పసిగట్టగలడు. కాబట్టి, మీరు ఇప్పుడే ఈ విషయాల గురించి శ్రద్ధగా ఆలోచించండి. తర్వాత చూద్దాంలే అని వాయిదా వేయకండి! యెహోవాకు చేసిన ప్రమాణాన్ని ప్రతీరోజూ మనసులో ఉంచుకున్నట్లయితే వ్యర్థమైనవాటి నుండి దూరంగా ఉండాలనే కృతనిశ్చయంతో ఉండగలుగుతాం.—సామె. 1:5; 19:20.
18, 19. (ఎ) “తేటగా” ఉండే కన్నుకు, “చెడిన” కన్నుకు మధ్యవున్న తేడాను చెప్పండి. (బి) ప్రాముఖ్యమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉండడం ఎందుకు చాలా అవసరం? దీనికి సంబంధించి ఫిలిప్పీయులు 4:8లో ఏ సలహా ఉంది?
18 మనల్ని పక్కదారి పట్టించే ఎన్నో ఆకర్షణీయమైన విషయాలు మనకు ప్రతీరోజు తారసపడుతుంటాయి. అందుకే, మన కంటిని “తేటగా” ఉంచుకోమని యేసు ఇచ్చిన సలహాను పాటించడం మునుపటికన్నా ఇప్పుడు చాలా అవసరం. (మత్త. 6:22, 23) మన కంటిని “తేటగా” ఉంచుకుంటే ఒకే విషయంపై అంటే దేవుని చిత్తం చేయడంపైనే మన మనసు నిలుపగలుగుతాం. అదే మన కన్ను “చెడినదైతే” మనం మోసపూరితమైన, దురాశతోకూడిన విషయాల గురించి ఆలోచిస్తాం, వ్యర్థమైన వాటివైపు ఆకర్షించబడతాం.
19 మనం చూసేవాటినే మనసులోకి తీసుకుంటాం, మనసులోకి తీసుకున్నవి మన హృదయాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే మనం ప్రాముఖ్యమైనవాటి గురించి ఆలోచిస్తూ ఉండడం ఎంతో అవసరం. (ఫిలిప్పీయులు 4:8 చదవండి.) అలా ఉండేందుకు మనం కూడా, “వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము” అని కీర్తనకర్తలా ప్రార్థిద్దాం. ఆ విన్నపానికి తగినట్లు ప్రవర్తించడానికి ప్రయత్నించినప్పుడు తన ‘మార్గములలో నడుచుకునేందుకు’ యెహోవా మనల్ని ‘బ్రతికిస్తాడనే’ నమ్మకంతో ఉండవచ్చు.—కీర్త. 119:37; హెబ్రీ. 10:36.
మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు . . .
• మన కళ్లకు, మనసుకు, హృదయానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
• అశ్లీల చిత్రాలు, దృశ్యాలు చూడడంవల్ల ఎలాంటి ప్రమాదాలు ఎదురౌతాయి?
• మన కంటిని “తేటగా” ఉంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
[అధ్యయన ప్రశ్నలు]
[23వ పేజీలోని చిత్రాలు]
వ్యర్థమైన ఏ విషయాలను క్రైస్తవులు చూడకూడదు?