శ్రమలను సహించడం వల్ల యెహోవాపై మా నమ్మకం బలపడింది
శ్రమలను సహించడం వల్ల యెహోవాపై మా నమ్మకం బలపడింది
ఆడా డెల్లో స్ట్రిట్టో చెప్పినది
దిన వచనాన్ని నా నోట్‌బుక్‌లో రాసుకోవడం నేను ఇప్పుడే పూర్తిచేశాను. నాకు 36 ఏళ్లు, అయినా అది రాయడానికి రెండు గంటలు పట్టింది. ఎందుకు అంతసేపు పట్టింది? మా అమ్మ చెబుతుంది వినండి.—జోయల్
నేనూ మావారు 1968లో బాప్తిస్మం తీసుకొని యెహోవాసాక్షులమయ్యాం. ఆరోగ్యవంతులైన డేవిడ్, మార్క్ అనే ఇద్దరు కుమారుల తర్వాత మాకు జోయల్ పుట్టాడు. జోయల్ 1973లో బెల్జియంలోని బైన్చ్ పట్టణంలోవున్న ఒక ఆసుపత్రిలో నెలలు నిండకముందే పుట్టాడు. ఈ పట్టణం బ్రస్సెల్స్‌కి దక్షిణాన 60 కి.మీ. దూరంలో ఉంది. జోయల్ పుట్టినప్పుడు 1.7 కిలోల బరువు మాత్రమే ఉన్నాడు. నన్ను డిశ్చార్జ్ చేశారు కానీ జోయల్‌ను మాత్రం బరువు పెరగడానికని ఆసుపత్రిలోనే ఉంచారు.
వారాలు గడిచినా వాడి పరిస్థితి మెరుగుపడకపోవడంతో నేనూ మావారు లూయిజీ, వాణ్ణి పిల్లల డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాం. జోయల్‌ను బాగా పరిశీలించిన తర్వాత డాక్టర్ ఇలా చెప్పాడు: “నేను మీకు ఈ విషయం చెప్పక తప్పడంలేదు. మీ ఇద్దరి అబ్బాయిలకు లేని ఆరోగ్య సమస్యలన్నీ ఈ బాబుకు ఉంటాయనిపిస్తోంది.” ఆ తర్వాత చాలాసేపు మౌనంగా ఉండిపోయాం. మా అబ్బాయికి ఏదో తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉందని అప్పుడు నాకు అర్థమైంది. డాక్టర్ మావారిని పక్కకు పిలిచి, “మీ బాబుకు ట్రైసోమీ 21 ఉంది” అని చెప్పాడు. దాన్ని డౌన్ సిండ్రోమ్ అని కూడా అంటారు. a
ఆ డాక్టర్ అలా చెప్పేసరికి మాకెంతో బాధేసి, మరో డాక్టర్ దగ్గరికి వెళ్లాలనుకున్నాం. ఏమీ మాట్లాడకుండా ఆ డాక్టర్ మా అబ్బాయిని దాదాపు గంటసేపు జాగ్రత్తగా పరీక్షించాడు. ఆయన పరీక్షించినంతసేపు క్షణమొక యుగంగా అనిపించింది. చివరికి, ఆయన మావంక చూసి, “మీ పిల్లవాడు సొంతగా ఏ పనీ చేసుకోలేడు, ప్రతీ పనిలో మీ సహాయం వాడికి ఎంతో అవసరమౌతుంది” అని చెప్పాడు. ఆ తర్వాత, ఆప్యాయత నిండిన స్వరంతో “కానీ, మీవాడికి ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి జోయల్ సంతోషంగా ఉంటాడు” అని కూడా అన్నాడు. దుఃఖం పట్టలేక వాణ్ణి నా చేతుల్లోకి తీసుకొని ఇంటికి వెళ్లిపోయాం. అప్పటికి వాడు ఎనిమిది వారాల పసికందు.
కూటాలు, పరిచర్య వల్ల మేము బలపర్చబడ్డాం
మరిన్ని పరీక్షలు చేసిన తర్వాత, వాడి గుండెలో తీవ్రమైన లోపం ఉందని, బాలాస్థిరోగము (విటమిన్ డి లోపంవల్ల ఇది సంభవిస్తుంది.) కూడా తీవ్రస్థాయిలో ఉందని తేలింది. వాడి
గుండె పరిమాణం పెరగడం వల్ల అది ఊపిరితిత్తుల మధ్య ఒత్తుకుపోయేది. దానివల్ల తరచూ వాడికి జబ్బు చేసేది. కొద్దికాలానికే అంటే నాలుగు నెలలకే నిమోనియా వచ్చినందువల్ల ఆసుపత్రికి తీసుకెళ్లాల్సివచ్చింది. అక్కడ వాడిని వేరుగా ఉంచారు. వాడు పడే బాధను చూసి తట్టుకోలేకపోయాం. వాణ్ణి చేతుల్లోకి తీసుకొని లాలించాలనిపించేది, కానీ పదివారాలపాటు వాడిని అసలు ముట్టనివ్వలేదు కాబట్టి మేము ఎంతో వ్యథను అనుభవించాం. వాణ్ణి చూస్తూ మేమిద్దరం కలిసి ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేకపోయాం.అలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో సహితం మా ఇద్దరు పిల్లలతో కలిసి క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరయ్యేవాళ్లం. అప్పుడు డేవిడ్‌కు ఆరేళ్లు, మార్క్‌కు మూడేళ్లు. రాజ్యమందిరంలో ఉన్నంతసేపు ప్రేమగల యెహోవా కాపుదలలో ఉన్నట్లు మాకు అనిపించేది. క్రైస్తవ సహోదర సహోదరీల మధ్యవున్న ఆ కొన్ని గంటలు మేము మా భారాన్ని యెహోవా మీద మోపగలుగుతున్నామని అనిపించేది. అంతేకాక కొంత మనశ్శాంతిని కూడా పొందాం. (కీర్త. 55:22) కృంగిపోకుండా మానసిక స్థైర్యంతో ఉండేందుకు క్రైస్తవ కూటాలు మాకు ఎలా సహాయం చేశాయో జోయల్‌ను చూసుకుంటున్న నర్సులు కూడా గమనించి ఆ విషయాన్ని మాతో చెప్పారు.
అదే సమయంలో, పరిచర్యకు వెళ్లేందుకు కూడా శక్తినివ్వమని యెహోవాను వేడుకున్నాను. ఏడుస్తూ ఇంట్లో కూర్చునే బదులు రోగాలు లేని లోకం వస్తుందన్న దేవుని వాగ్దానం నాకు ఎలా బలాన్నిచ్చిందో ఇతరులకు చెప్పాలనుకున్నాను. పరిచర్యలో పాల్గొంటున్న ప్రతీసారి యెహోవా నా ప్రార్థనలకు జవాబిచ్చాడని అనిపించేది.
“ఇది నిజంగా ఓ అద్భుతం!”
చివరిగా, మేము జోయల్‌ను ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకువచ్చినప్పుడు ఎంతో సంతోషించాం. మరుసటి రోజే మా సంతోషమంతా నీరుగారిపోయింది. జోయల్ ఆరోగ్య పరిస్థితి త్వరగా విషమించడంతో మళ్లీ ఆసుపత్రికి పరుగు తీయాల్సివచ్చింది. తనను పరిశీలించిన తర్వాత, “మహా అయితే మీ బాబు మరో ఆరు నెలలు బ్రతుకుతాడు” అని డాక్టర్లు చెప్పారు. రెండు నెలల తర్వాత అంటే, వాడికి దాదాపు ఎనిమిది నెలలు ఉన్నప్పుడు వాడి పరిస్థితి విషమించడంతో డాక్టర్లు చెప్పింది నిజమౌతున్నట్లు అనిపించింది. ఒక డాక్టర్ మాతో ఇలా అన్నాడు: “సారీ. ఇక మేము చేయగలిగింది ఏమీ లేదు. ఈ సమయంలో మీకు సహాయం చేయగలిగినవారు ఎవరైనా ఉన్నారంటే అది యెహోవాయే.”
నేను జోయల్‌వున్న వార్డులోకి వెళ్ళాను. నేను శారీరకంగా నీరసించిపోయినా, మానసికంగా కృంగిపోయినా వాణ్ణి విడిచి వెళ్లొద్దనుకున్నాను. మావారు మా పెద్ద కుమారుల్ని చూసుకోవడానికి వెళ్లాల్సివచ్చేది కాబట్టి చాలామంది సహోదరీలు వంతులవారీగా వచ్చి నాతో పాటు ఉండేవారు. అలా ఒక వారం గడిచింది. ఉన్నట్టుండి వాడికి గుండెపోటు వచ్చింది. నర్సులు జోయల్ గదిలోకి పరుగెత్తుకువచ్చారు కానీ ఏమీ చేయలేకపోయారు. కొన్ని నిమిషాల తర్వాత వారిలో ఒకరు నెమ్మదిగా “అంతా అయిపోయింది . . . ” అని అన్నారు. అది విని నేను కుప్పకూలిపోయాను. ఏడుస్తూ ఆ గది నుండి వెళ్లిపోయాను. యెహోవాకు ప్రార్థించాలనుకున్నాను కానీ నా బాధను వ్యక్తం చేసేందుకు మాటలు రాలేదు. అలా 15 నిమిషాలు గడిచిన తర్వాత ఒక నర్సు నన్ను పిలిచి “జోయల్ కోలుకుంటున్నాడు!” అని చెప్పింది. నా భుజం మీద చేయివేసి “జోయల్‌ను ఇప్పుడు చూడవచ్చు” అని ఆమె నన్ను లోపలికి తీసుకెళ్లింది. లోపలికి వెళ్లి చూసేసరికి జోయల్ గుండె మళ్లీ కొట్టుకుంటోంది! మా బాబు కోలుకుంటున్నాడన్న వార్త అంతటా వ్యాపించింది. నర్సులు, డాక్టర్లు మా బాబును చూడడానికి వచ్చారు. వాళ్లలో చాలామంది, “ఇది నిజంగా ఓ అద్భుతం!” అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు.
నాలుగేళ్ల ప్రాయంలో ఊహించని ప్రగతి
జోయల్ చిన్నగా ఉన్నప్పుడు పిల్లల డాక్టర్, “జోయల్‌ను ఎంతో ప్రేమగా చూసుకోవాలి” అని పదేపదే చెప్పేవారు. వాడు పుట్టిన తర్వాత యెహోవా ప్రేమను మేము ప్రత్యేకంగా చవిచూశాము కాబట్టి మా కుమారుడికి
కూడా ఆ ప్రేమను పంచాలనుకున్నాం. ప్రతీ పనిలో వాడికి మా సహాయం అవసరమయ్యేది కాబట్టి మా ప్రేమను చూపించే అవకాశాలు ఎన్నో దొరికాయి.జోయల్‌కు ఏడేళ్లు నిండేవరకూ అవే సంఘటనలు మళ్లీ మళ్లీ చోటుచేసుకున్నాయి. అక్టోబరు-మార్చి మధ్యకాలంలో వాడికి తరచూ అనారోగ్య సమస్య వచ్చేది. ఆసుపత్రికి పదేపదే తీసుకెళ్లాల్సివచ్చేది. అదే సమయంలో డేవిడ్, మార్క్‌లతో సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నించాను. వారు కూడా జోయల్ ప్రగతికి ఎంతో తోడ్పడ్డారు, దానివల్ల మేము ఊహించని ఫలితాలొచ్చాయి. ఉదాహరణకు, జోయల్ అసలెన్నడూ నడవలేడని చాలామంది డాక్టర్లు చెప్పారు. కానీ వాడికి నాలుగేళ్లు ఉన్నప్పుడు మార్క్ “నువ్వు నడవగలవు రా! అమ్మకు నడిచి చూపించు” అని అన్నాడు. జోయల్ తప్పటడుగులు వేయడాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను! ఆ రోజు మా సంతోషానికి అవధుల్లేవు. హృదయపూర్వకంగా యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించడానికి కుటుంబమంతా కలిసి ప్రార్థించాం. వేరే విషయాల్లో ఎలాంటి చిన్న అభివృద్ధిని సాధించినా మేము వాణ్ణి ఉత్సాహంగా మెచ్చుకునేవాళ్లం.
బాల్యం నుండి దైవిక శిక్షణనివ్వడం వల్ల మంచి ఫలితాలొచ్చాయి
సాధ్యమైనప్పుడెల్లా మేము జోయల్‌ను కూటాలకు తీసుకెళ్లేవాళ్లం. ఊరికే జబ్బుపడకూడదని సూక్ష్మ క్రిములనుండి కాపాడడానికి మేము వాణ్ణి సన్నని ప్లాస్టిక్ కవరున్న ఓ ప్రత్యేక ట్రాలీలో పెట్టేవాళ్లం. ఆ కవరు లోపలున్నా సంఘంతో సహవసిస్తున్నందుకు జోయల్ సంతోషించేవాడు.
సహోదర సహోదరీలు ప్రేమ చూపిస్తూ కావాల్సిన సహాయాన్ని అందిస్తూ మమ్మల్ని ఎంతో బలపర్చారు. ఒక సహోదరుడు యెషయా 59:1లో ఉన్న మాటలను ఎప్పుడూ మాకు గుర్తుచేసేవాడు. అక్కడిలా ఉంది: “రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు.” ధైర్యాన్నిచ్చే ఆ మాటలు యెహోవా మీద నమ్మకముంచేలా మాకు సహాయం చేశాయి.
జోయల్ పెద్దవాడు అవుతుండగా, వాడు తన జీవితంలో యెహోవా సేవకు ప్రాముఖ్యతనిచ్చేలా సహాయం చేసేందుకు మేము కృషిచేశాం. తన పరలోక తండ్రితో వాడికి అనుబంధం ఏర్పడేలా మేము ప్రతీ సందర్భంలో యెహోవా గురించి మాట్లాడేవాళ్లం. దైవిక శిక్షణ వల్ల మంచి ఫలితాలు వచ్చేలా ఆశీర్వదించమని మేము యెహోవాను వేడుకునేవాళ్లం.
జోయల్ యౌవనంలోకి అడుగుపెట్టినప్పుడు తాను కలుసుకున్నవారితో బైబిలు సత్యాలను పంచుకోవడానికి ఇష్టపడడాన్ని చూసి మేమెంతో సంతోషించాం. 14 ఏళ్లున్నప్పుడు జోయల్‌కు ఓ పెద్ద ఆపరేషన్ జరిగింది. దానినుండి కోలుకుంటుండగా, “అమ్మా, నిరంతరం జీవించగలరు పుస్తకాన్ని డాక్టర్‌కు ఇవ్వనా?” అని వాడు నన్ను అడిగినప్పుడు చాలా సంతోషించాను. కొన్ని సంవత్సరాల తర్వాత మరో ఆపరేషన్ చేయాల్సివచ్చింది. వాడు దాన్ని తట్టుకొని బ్రతుకడేమోనని మేము భయపడ్డాం. ఆపరేషన్‌కు ముందు జోయల్ మేము వాడితో కలిసి రాసిన ఓ ఉత్తరాన్ని డాక్టర్లకు ఇచ్చాడు. ఆ ఉత్తరంలో రక్తం విషయంలో వాడి నమ్మకాలను వివరించాం. సర్జన్, “ఇందులో ఉన్నట్లే చేయమంటావా?” అని జోయల్‌ను అడిగాడు. జోయల్ ధైర్యంగా, “చేయండి డాక్టర్” అని జవాబిచ్చాడు. సృష్టికర్త పట్ల వాడికున్న నమ్మకాన్ని, ఆయనను సంతోషపెట్టాలనే కృతనిశ్చయాన్ని చూసి మేము ఎంతో గర్వపడ్డాం. ఆసుపత్రి సిబ్బంది కూడా మాకు ఎంతో సహకరించారు. వారి సహకారాన్ని మేము ఎప్పుడూ మరచిపోం.
జోయల్ ఆధ్యాత్మిక ప్రగతి
పదిహేడేళ్లున్నప్పుడు జోయల్ తన సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకున్నాడు. మేము ఆ రోజును ఎన్నడూ మరచిపోలేం! వాడు సాధించిన ఆధ్యాత్మిక ప్రగతిని చూస్తే మాకు ఎంతో సంతోషం కలుగుతుంది. బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి యెహోవా పట్ల ప్రేమ, సత్యంపట్ల వాడి ఆసక్తి సన్నగిల్లలేదు. నిజానికి తాను కలుసుకునే ప్రతీ ఒక్కరితో జోయల్, “సత్యమే నా జీవితం!” అని చెప్పడానికి ఇష్టపడతాడు.
జోయల్ ఇంకా పెద్దవాడు అవుతుండగా చదవడం, రాయడం నేర్చుకున్నాడు. దానికోసం వాడు ఎంతో కష్టపడ్డాడు. వాడు రాసిన ప్రతీ అక్షరం ఒక్కొక్క విజయపు మెట్టులాంటిది. అప్పటినుండి, వాడు అన్నిటికన్నా ముందు ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం నుండి దినవచనాన్ని చదువుతున్నాడు. ఆ తర్వాత చాలా కష్టపడుతూ ఆ రోజుకున్న లేఖనాన్ని వాడి నోట్సులో రాసుకుంటాడు. అలా వాడు ఇప్పటికీ ఎన్నో వచనాలు రాశాడు.
జోయల్ సమయానికి చేరుకొని రాజ్యమందిరానికి వచ్చేవారినందరినీ సాదరంగా ఆహ్వానించాలనుకుంటాడు కాబట్టి, కూటాలు జరిగే రోజు త్వరగా బయల్దేరుదామని మమ్మల్ని తొందరపెడతాడు. జోయల్ కూటాల్లో వ్యాఖ్యానిస్తాడు, ప్రదర్శనల్లో పాల్గొంటాడు. సౌండ్ విభాగంలో, మరితర పనుల్లో కూడా సహాయం చేస్తాడు. ఆరోగ్యం బాగుంటే ప్రతీవారం మాతో ప్రకటనాపనిలో పాల్గొంటాడు. 2007వ సంవత్సరంలో జోయల్ ఓ పరిచర్య సేవకునిగా నియమించబడినట్లు సంఘంలో ప్రకటన చేశారు. అప్పుడు మేము ఆనందబాష్పాలు రాల్చాం. అది యెహోవా దయతో ఇచ్చిన ఓ ఆశీర్వాదం.
యెహోవా సహాయ హస్తాన్ని చూడగలుగుతున్నాం
మాకు 1999లో మరో పరీక్ష ఎదురైంది. ఓ డ్రైవరు నిర్లక్ష్యంగా నడుపుతూ మా కారును గుద్దాడు. దాంతో మావారు తీవ్రంగా గాయపడ్డారు. ఒక కాలు తీసేయాల్సి వచ్చింది, వెన్నెముకకు సంబంధించిన ఎన్నో పెద్దపెద్ద ఆపరేషన్లు కూడా అయ్యాయి. ఈ సందర్భంలో కూడా యెహోవాపై నమ్మకం ఉంచడం ద్వారా అవసరంలోవున్న తన సేవకులకు ఆయనిచ్చే బలాన్ని చవిచూశాం. (ఫిలి. 4:13) మావారు లూయిజీ ఇప్పుడు అంగవైకల్యంతో బాధపడుతున్నా, మాకు జరిగిన మంచి గురించే ఎక్కువగా ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాం. మావారు ఇప్పుడు బయట ఉద్యోగం చేయలేరు కాబట్టి జోయల్‌ను చూసుకోవడానికి ఆయనకు చాలా సమయం దొరుకుతుంది. దానివల్ల నేను ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఎక్కువ సమయాన్ని ఇవ్వగలుగుతున్నాను. మావారు కూడా మా కుటుంబ, సంఘ ఆధ్యాత్మిక అవసరాలకు ఎక్కువ సమయాన్ని ఇవ్వగలుగుతున్నారు. ఆయనిప్పుడు సంఘంలో పెద్దల సభ సమన్వయకర్తగా సేవచేస్తున్నారు.
మా ఇంటి పరిస్థితులు ఇలా ఉండడం వల్ల కుటుంబంగా మేము ఎంతో సమయాన్ని కలిసి గడపగలుగుతున్నాం. రోజులు గడుస్తుండగా, మాకు చేతకానివి చేయడానికి ప్రయత్నించే బదులు పరిస్థితిని అర్థంచేసుకొని ప్రవర్తించడం నేర్చుకున్నాం. మాకు నిరుత్సాహం అనిపించిన రోజు, యెహోవాకు మా భావాలను తెలియజేస్తాం. అయితే, బాధాకరమైన విషయమేమిటంటే, మా పెద్దబ్బాయిలిద్దరూ పెరిగి పెద్దవారైన తర్వాత ఇంట్లో నుండి వెళ్లిపోయారు, మెల్లమెల్లగా యెహోవాను సేవించడం మానేశారు. వారు ఏదో ఒక రోజు యెహోవా దగ్గరికి తిరిగివస్తారనే ఆశతో మేము ఉన్నాం.—లూకా 15:17-24.
ఈ కష్టకాలాల్లో, యెహోవా కాపుదలను మేము చవిచూశాం. మాకు ఏ సమస్య ఎదురైనా ఆయన సహాయం కోరాలని తెలుసుకున్నాం. యెషయా 41:13 లోవున్న మాటలంటే మాకు ఎంతో ఇష్టం: “నీ దేవుడనైన యెహోవానగు నేను—భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.” యెహోవా మన చేతులను గట్టిగా పట్టుకుంటాడని తెలుసుకోవడం ఎంతో ఊరటనిస్తుంది. శ్రమలను సహించడం వల్ల మన పరలోక తండ్రియైన యెహోవాపై మా నమ్మకం బలపడిందని మేము మనస్ఫూర్తిగా చెప్పగలం.
[అధస్సూచి]
a ట్రైసోమీ 21 పుట్టుకతోవచ్చే లోపం. దీనివల్ల బుద్ధి మాంద్యం కలుగుతుంది. క్రోమోసోమ్‌లు సాధారణంగా జతలుగా ఉంటాయి. ఈ వ్యాధితో పుట్టేవారికి జతలోని ఒక క్రోమోసోమ్‌కు మరో క్రోమోసోమ్ అదనంగా ఉంటుంది. ట్రైసోమీ 21 ఉన్నవాళ్లకు 21వ జతకు మరొక క్రోమోసోమ్ అదనంగా ఉంటుంది.
[16, 17వ పేజీలోని చిత్రాలు]
జోయల్, వాళ్లమ్మతో
[18వ పేజీలోని చిత్రం]
ఆడా, జోయల్, లూయిజీ
[19వ పేజీలోని చిత్రం]
రాజ్యమందిరంలో సహోదర సహోదరీలను సాదరంగా ఆహ్వానించడమంటే జోయల్‌కు ఎంతో ఇష్టం