కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనారోగ్యంతోవున్న ఆత్మీయులను చూసుకుంటున్నప్పుడు ఆధ్యాత్మికంగా బలంగా ఉండండి

అనారోగ్యంతోవున్న ఆత్మీయులను చూసుకుంటున్నప్పుడు ఆధ్యాత్మికంగా బలంగా ఉండండి

అనారోగ్యంతోవున్న ఆత్మీయులను చూసుకుంటున్నప్పుడు ఆధ్యాత్మికంగా బలంగా ఉండండి

కిమ్‌ అనే సాక్షికి వెన్నెముక దగ్గర ఓ కంతి ఏర్పడింది. దాన్ని పరీక్షిస్తే అది క్యాన్సర్‌ కంతి అని తేలింది. a “ఆపరేషన్‌ చేసి ఆ కంతిని తీసేసిన తర్వాత, కిమ్‌కు రేడియోథెరపి (రేడియో ధార్మిక శక్తి ప్రభావంతో రోగ చికిత్స), కీమోథెరపి (రసాయన పదార్థాల సహాయంతో వ్యాధి నయం చేయడం) చేశారు. ఆ చికిత్స వల్ల తనెంతో బలహీనంగా తయారైంది. ముందులా ఇప్పుడు లేచి అటూఇటూ తిరగలేకపోతుంది” అని తన భర్త స్టీవ్‌ చెబుతున్నాడు.

తానెంతగానో ప్రేమిస్తున్న తన జీవిత భాగస్వామి రోజురోజుకీ బలహీనపర్చే వ్యాధితో బాధపడడం చూసి స్టీవ్‌ ఎంత వేదనను అనుభవించి ఉంటాడో ఊహించగలరా? ఆరోగ్యం క్షీణించేలా చేసే వ్యాధితో లేదా వృద్ధాప్యం వల్ల వచ్చే సమస్యలతో బాధపడుతున్న కుటుంబ సభ్యులు మీకు ఉండవచ్చు. (ప్రసం. 12:1-7) అలాగైతే వారిని సరిగ్గా చూసుకోవాలంటే మీ గురించి కూడా ఆలోచించుకోవాలని మీకు తెలుసు. మీరు ఆధ్యాత్మికంగా బలహీనపడితే మానసికంగా కృంగిపోతారు, మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దానివల్ల వారికి కావాల్సిన సహాయం మీరు చేయలేకపోవచ్చు. అనారోగ్యంతో లేదా వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆత్మీయులను చూసుకుంటూనే మీ క్రైస్తవ బాధ్యతలను ఎలా నిర్వర్తించవచ్చు? అనారోగ్యంతో బాధపడుతున్న అలాంటి వారి కోసం సంఘ సభ్యులు ఏమైనా చేయగలరా?

సమతుల్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు?

అనారోగ్యంతో ఉన్నవారిని చూసుకుంటూనే మీ ఆధ్యాత్మిక సమతుల్యాన్ని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మీ రోజువారీ పనుల్లో కావాల్సిన మార్పులు చేసుకోవాలి. అంతేకాక మీ సమయాన్ని, శక్తిని ఉపయోగించే విషయంలో సరైన ప్రణాళిక వేసుకోవాలి. “వినయముగలవారియొద్ద [‘అణకువగలవారియొద్ద,’ NW] జ్ఞానమున్నది” అని సామెతలు 11:2 చెబుతోంది. ఈ సందర్భంలో “అణకువ” అంటే పరిమితులను గుర్తించి ప్రవర్తించడం అని అర్థం. మీ సామర్థ్యానికి మించిన పనులు చేయకూడదంటే మీ రోజువారీ పనులను, మీ బాధ్యతలను పరిశీలించుకోవాలి.

స్టీవ్‌ తనకున్న పని భారం గురించి ఒకసారి ఆలోచించుకోవడం ద్వారా జ్ఞానాన్ని, అణకువను చూపించాడు. ఆయన ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఐర్లాండ్‌లోని యెహోవాసాక్షుల సంఘంలో పెద్దల సభ సమన్వయకర్తగా, సేవా పైవిచారణకర్తగా సేవచేశాడు. అంతేకాక ఆసుపత్రి అనుసంధాన కమిటీ సభ్యునిగా కూడా పనిచేశాడు. “ఈ బాధ్యతలకు ఎక్కువ సమయాన్నిస్తూ తనను పట్టించుకోవడం లేదని నా భార్య కిమ్‌ ఏనాడూ ఫిర్యాదు చేయలేదు. నా సామర్థ్యానికి మించి చేస్తున్నానని నాకు తెలుసు” అని స్టీవ్‌ చెబుతున్నాడు. అప్పుడు స్టీవ్‌ ఏమి చేశాడు? “ప్రార్థనాపూర్వకంగా ఆలోచించిన తర్వాత, సంఘ సమన్వయకర్తగా ఇక కొనసాగకూడదని అనుకున్నాను. కానీ సంఘ పెద్దగా సేవచేస్తూ నా భారాన్ని తగ్గించుకోవడానికి కొన్ని సంఘ బాధ్యతలను ఇతరులకు అప్పగించాను. కాబట్టి, కిమ్‌తో ఎక్కువ సమయం గడుపుతూ తనకు కావాల్సిన సహాయం చేయగలిగాను” అని ఆయన చెప్పాడు.

కొంతకాలానికి కిమ్‌ ఆరోగ్యం కుదుటపడింది. దాంతో స్టీవ్‌, కిమ్‌లు తమ పరిస్థితి గురించి మళ్లీ ఒకసారి ఆలోచించుకున్నారు. భార్య సహకారంతో కిమ్‌ గతంలో నిర్వర్తించిన సంఘ బాధ్యతలను తిరిగి చేపట్టాడు. “అనారోగ్యం వల్ల ఏర్పడిన పరిమితులను మనసులో ఉంచుకొని పనిచేయడం నేర్చుకున్నాం. నాకు సహాయం చేసినందుకు యెహోవాకూ, అనారోగ్యంతోవున్నా ఫిర్యాదు చేయకుండా సహకరిస్తున్న నా భార్యకూ ఎంతో రుణపడివున్నాను” అని స్టీవ్‌ చెబుతున్నాడు.

ప్రయాణ పైవిచారణకర్తగా పనిచేస్తున్న జెర్రీ, ఆయన భార్య మరీయల అనుభవాన్ని కూడా తీసుకోండి. వృద్ధులైన తమ తల్లిదండ్రులను చూసుకునేందుకు వారు తమ లక్ష్యాలను మార్చుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో మరీయ ఇలా చెబుతోంది: “వేరే దేశంలో మిషనరీలుగా పనిచేయాలనే లక్ష్యం మాకుండేది. అయితే, మా అత్తామామలకు జెర్రీ ఒక్కగానొక్క కుమారుడు. వారిని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఐర్లాండ్‌లోనే ఉండాలనుకున్నాం. మా మామయ్య చనిపోవడానికి కొంతకాలం ముందు ఆసుపత్రిలో ఉన్నారు. ఆ సమయంలో మేము అక్కడేవున్నాం కాబట్టి ఆయనను చూసుకోగలిగాం. ఇప్పుడు ప్రతీరోజూ మా అత్తమ్మ బాగోగులను అడిగి తెలుసుకుంటుంటాం, ఆమెకు కావాల్సిన సహాయం చేసేలా దగ్గర్లోనే ఉన్నాం. మా అత్తమ్మ వాళ్ల సంఘ సభ్యులు కూడా ఆమెకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మేము ప్రయాణ సేవలో కొనసాగగలుగుతున్నాం.”

ఇతరులు ఎలా సహాయం చేయవచ్చు?

సంఘంలో వృద్ధ విధవరాళ్లకు వస్తుపరంగా ఎలాంటి సహాయాన్ని అందించవచ్చనే విషయాన్ని ప్రస్తావిస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.” తమ ఆరాధన ‘దేవుని దృష్టికి అనుకూలంగా’ ఉండాలంటే తమ వృద్ధ తల్లిదండ్రుల, తాతామామ్మల అవసరాలను తీర్చాలని పౌలు తన తోటి క్రైస్తవులకు గుర్తుచేశాడు. (1 తిమో. 5:4, 8) అయితే సంఘంలోని సభ్యులు కూడా తమవంతు సహకారాన్ని అందించవచ్చు, అందించాలి కూడా.

స్వీడన్‌లో నివసిస్తున్న హోకన్‌, ఇంగర్‌ అనే వృద్ధ దంపతులకు ఏమి జరిగిందో చూడండి. హోకన్‌ ఇలా చెబుతున్నాడు: “నా భార్యకు క్యాన్సర్‌ ఉందని తెలిసినప్పుడు మేము ఆ విషయాన్ని నమ్మలేకపోయాం. తను ఎప్పుడూ ఆరోగ్యంగా, బలంగా ఉండేది. కానీ ఇప్పుడు మేము చికిత్స కోసం ప్రతీరోజు ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది. తను తీసుకునే మందుల వల్ల రోజురోజుకీ నీరసంగా తయారౌతోంది. ఈ సమయంలో తను ఇంట్లోనే ఉండడంవల్ల తనను చూసుకోవడానికి నేను తనతోనే ఉండాల్సివచ్చింది.” వారికి సంఘ సభ్యులు ఎలా సహాయం చేశారు?

ఆ దంపతులు క్రైస్తవ కూటాలను టెలిఫోను ద్వారా వినేలా సంఘ పెద్దలు ఏర్పాటు చేశారు. అంతేకాక, సహోదర సహోదరీలు వారి బాగోగులను తెలుసుకోవడానికి వారి దగ్గరికి వెళ్లేవారు లేదా ఫోన్‌లో మాట్లాడేవారు. అంతేకాక ఉత్తరాలను, కార్డులను కూడా పంపించేవారు. హోకన్‌ ఇలా అన్నాడు: “సహోదరుల సహకారాన్ని, యెహోవా సహాయాన్ని మేము చవిచూశాం. వారు మాపట్ల శ్రద్ధ చూపించడం వల్ల మేము ఆధ్యాత్మికంగా బలంగా ఉండగలిగాం. సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఇంగర్‌ కోలుకుంది. క్రైస్తవ కూటాలకు హాజరయ్యేందుకు మేము మళ్ళీ రాజ్యమందిరానికి వెళ్లగలుగుతున్నాం.” అనారోగ్యంతో ఉన్నవారికి, వృద్ధులకు సహాయం చేసేందుకు సంఘ సభ్యులు శాయశక్తులా కృషిచేసినప్పుడు తాము ‘విడువక ప్రేమిస్తూ దుర్దశలో సహోదరులుగా ఉండే నిజమైన స్నేహితులని’ నిరూపించుకుంటారు.—సామె. 17:17.

యెహోవా మీ కృషిని మెచ్చుకుంటున్నాడు

అనారోగ్యంతోవున్న కుటుంబ సభ్యులను చూసుకుంటున్నప్పుడు శారీరకంగా, మానసికంగా మనం ఎంతో అలసిపోవచ్చు. “బీదలను [‘దీనులను,’ NW] కటాక్షించువాడు ధన్యుడు” అని రాజైన దావీదు రాశాడు. ఇక్కడ “దీనులు,” అనారోగ్యం వల్ల గానీ మరితర కారణాల వల్ల గానీ సహాయం అవసరమైన వారిని సూచిస్తున్నారు.—కీర్త. 41:1.

అనారోగ్యంతో బాధపడేవారిని చూసుకునేవారు ఎందుకు సంతోషంగా ఉంటారు? “బీదలను [‘దీనులను,’ NW] కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును” అని సామెతలు 19:17 చెబుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న తన యథార్థ సేవకుల పట్ల సత్య దేవుడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాడు. వారి పట్ల కనికరం చూపించేవారిని ఆయన ఆశీర్వదిస్తాడు. “రోగశయ్యమీద యెహోవా [అలాంటి] వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు” అని కీర్తనకర్త అయిన దావీదు పాడాడు. (కీర్త. 41:3) ప్రేమతో ఇతరులను చూసుకునే వ్యక్తికే ఒకవేళ కష్టాలు ఎదురైతే యెహోవా తప్పక అతనికి సహాయం చేస్తాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఆత్మీయులను చూసుకోవడానికి మనం చేసే కృషిని యెహోవా గమనిస్తున్నాడనీ, మనం చేసేదాన్ని ఆయన ఇష్టపడుతున్నాడనీ తెలుసుకోవడం మనకు ఎంత ఊరటనిస్తుంది! అలా సహాయం చేయడానికి మనం ఎంతో కృషిచేయాల్సి ఉంటుంది. అయినా “అట్టి యాగములు దేవునికిష్టమైనవి” అని లేఖనాలు హామీ ఇస్తున్నాయి.—హెబ్రీ. 13:16.

[అధస్సూచి]

a పేర్లు మార్చబడ్డాయి.

[18వ పేజీలోని చిత్రాలు]

ఆధ్యాత్మిక సమతుల్యాన్ని కాపాడుకుంటూ ఇతరుల సహాయాన్ని స్వీకరించండి