తొలి క్రైస్తవత్వం మరియు రోమన్ల దేవుళ్లు
తొలి క్రైస్తవత్వం మరియు రోమన్ల దేవుళ్లు
బితూనియా గవర్నరైన ప్లైని ద యంగర్, రోమా చక్రవర్తియైన ట్రాజన్‌కు రాసిన ఓ ఉత్తరంలో ఇలా అన్నాడు: “క్రైస్తవులని నిందించబడినవారి విషయంలో నేను ఈ విధంగా చేస్తున్నాను. వారు క్రైస్తవులేనా అని వారిని అడుగుతున్నాను. అవునని చెబితే, వారిని శిక్షిస్తానని రెండు మూడుసార్లు బెదిరిస్తున్నాను. అయినా వారు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే మరణశిక్ష విధించమని ఆజ్ఞాపిస్తున్నాను.” అయితే, క్రీస్తును దూషించడం ద్వారా క్రైస్తవత్వాన్ని నిరాకరించి చక్రవర్తి ప్రతిమను, దర్బారులోకి తాను తెచ్చిన ఇతర ప్రతిమల్ని ఆరాధించేవారిని తాను ఏమి చేస్తున్నాడో చెబుతూ ప్లైని ఇలా రాశాడు: “వారిని శిక్షించకుండా విడుదల చేయడమే మేలనుకున్నాను.”
చక్రవర్తి ఆరాధనను, వివిధ దేవుళ్ల ఆరాధనను నిరాకరించినందుకు తొలి క్రైస్తవులు హింసించబడ్డారు. రోమా సామ్రాజ్యమంతటా ఉన్న ఇతర మతాల విషయమేమిటి? అక్కడ ఏయే దేవుళ్లను, దేవతలను ఆరాధించేవారు? రోమన్లు వాటిని ఎలా పరిగణించేవారు? రోమా దేవుళ్లకు, దేవతలకు బలులు అర్పించనందుకు క్రైస్తవులు ఎందుకు హింసించబడ్డారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే, యెహోవాకు యథార్థంగా ఉండే విషయంలో మనకు అలాంటి పరీక్షలు ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తించాలో అర్థమౌతుంది.
రోమా సామ్రాజ్యంలోని మతాలు
రోమా సామ్రాజ్యంలో ఎన్నో భాషల, సంస్కృతుల ప్రజలు ఉండేవారు. అలాగే ఎన్నో దేవతల, దేవుళ్ల ఆరాధన కూడా జరిగేది. యూదా మతం వింతగా కనిపించినా రోమన్లు ఆ మతాన్ని రెలీజియోలైకిటాగా లేదా గుర్తింపు పొందిన మతంగా పరిగణించి ఆ మతాన్ని కాపాడారు. రోజుకు రెండుసార్లు యెరూషలేము దేవాలయంలో కైసరు కోసం, రోమా సామ్రాజ్యం కోసం రెండు గొర్రెపిల్లలు, ఓ ఎద్దు అర్పించబడేవి. ఈ బలులు ఒక్క దేవుణ్ణి శాంతపర్చడానికి అర్పించబడేవా లేక చాలామంది దేవుళ్లను శాంతపర్చడానికి అర్పించబడేవా అన్న విషయాన్ని రోమన్లు పట్టించుకునేవారు కాదు. వారికి కావాల్సిందల్లా ఆ బలుల ద్వారా యూదులు రోమా ప్రభుత్వం పట్ల తమకున్న విశ్వసనీయతను రుజువు చేసుకోవడమే.
స్థానికంగా ఏర్పడిన చిన్నచిన్న మత తెగల్లో ఎన్నో రకాల ఆరాధనలు జరిగేవి. గ్రీకు పురాణగాథలను చాలామంది నమ్మేవారు. ప్రజలకు శకునాలు చూసే అలవాటుండేది. కొన్ని రహస్యమైన కర్మాచరణలు చేస్తే భక్తులు అమరత్వాన్ని పొందవచ్చని, దైవసందేశాలు పొందవచ్చని, దేవుళ్లతో మాట్లాడవచ్చని, తూర్పు దేశాలకు చెందిన రహస్య మతాలు బోధించాయి. ఈ మతాలు రోమా సామ్రాజ్యమంతటా వ్యాప్తిచెందాయి. సామాన్య శకం ప్రారంభంలో ఐగుప్తు దేవుడైన సెరాపిస్, ఐసిస్ దేవత, సిరియన్ల మత్స్య దేవతయైన ఆటార్గాటిస్, పర్షియన్ల సూర్య దేవుడైన మిత్ర వంటి దేవతా దేవుళ్లను ఆరాధించే చిన్నచిన్న మత గుంపులు ప్రసిద్ధిగాంచాయి.
అపొ. 13:6, 7) పౌలు బర్నబాలు గ్రీకు దేవుళ్లైన హెర్మే, ద్యుపతులని లుస్త్ర ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. (అపొ. 14:11-13) పౌలు ఫిలిప్పీలో ఉన్నప్పుడు ఆయనకు సోదె చెప్పే ఓ బాలిక ఎదురైంది. (అపొ. 16:16-18) ఆయన ఏథెన్సులో ఉన్నప్పుడు, అక్కడి ప్రజలు ఇతరుల కన్నా ‘అతి దేవతాభక్తి గలవారనే’ విషయాన్ని గమనించాడు. అదే పట్టణంలో “తెలియబడని దేవునికి” అని రాయబడివున్న ఓ బలిపీఠాన్ని కూడా ఆయన చూశాడు. (అపొ. 17:22, 23) ఎఫెసీవాసులు అర్తెమిదేవిని ఆరాధించేవారు. (అపొ. 19:1, 23, 24, 34) మెలితే ద్వీపంలో పౌలును ఓ పాము కాటేసినా ఏమీ కాకపోవడం చూసి ఆ ద్వీపవాసులు ఆయనను ఓ దేవుడు అనుకున్నారు. (అపొ. 28:3-6) అలాంటి పరిస్థితుల్లో తమ స్వచ్ఛారాధన కలుషితం కాకుండా క్రైస్తవులు జాగ్రత్తపడాల్సి వచ్చింది.
మొదటి శతాబ్దపు క్రైస్తవుల చుట్టూవున్న ప్రజలు ఎలాంటి అన్యారాధన చేసేవారో బైబిలు పుస్తకమైన అపొస్తలుల కార్యములు స్పష్టంగా వివరిస్తోంది. ఉదాహరణకు, యూదుడైన ఓ గారడీవాడు కుప్రకు చెందిన రోమా అధిపతితో ఉన్నట్లు దానిలో చెప్పబడింది. (రోమన్ల మతం
రోమా సామ్రాజ్యం విస్తరించేకొద్దీ రోమన్లు కొత్త దేవతలను చూసినప్పుడు అవి తమ దేవతల వేరే రూపాలనుకొని వాటిని కూడా పూజించడం మొదలుపెట్టారు. అలాంటి అన్యమత గుంపులను నిర్మూలించాల్సిందిపోయి రోమా చక్రవర్తులు వాటిని అంగీకరించి, వాటి దేవతలను పూజించడం మొదలుపెట్టారు. రోమా సామ్రాజ్యంలో వివిధ సంస్కృతులు వచ్చి చేరినట్లే వివిధ మతగుంపులూ వచ్చి చేరాయి. రోమన్ల మతం దాని ఆరాధికుల నుండి సంపూర్ణ భక్తిని కోరలేదు. రోమన్లు ఒకే సమయంలో అనేక దేవతలను, దేవుళ్లను కొలవవచ్చు.
రోమన్లు తాము కొలిచే దేవుళ్లలో ఆప్టిమస్ మాక్సిమస్‌గా పిలువబడే జూపిటర్‌ను ఉత్తమునిగా, అత్యంత శక్తివంతునిగా పరిగణించేవారు. ఆయన గాలిలో, వర్షంలో, ఉరుముల్లో, మెరుపుల్లో ప్రత్యక్షమౌతాడని ప్రజలు నమ్మేవారు. జూపిటర్ సహోదరీ, భార్యా అయిన జూనో చంద్ర దేవతగా పరిగణించబడేది. ఆమె స్త్రీలకు సంబంధించిన అన్ని విషయాలు చూసుకుంటుందని ప్రజలు చెబుతుంటారు. జూపిటర్ కూతురు మినర్వను చేతిపనుల, వృత్తుల, కళల, యుద్ధాల దేవతగా కొలిచేవారు.
రోమన్లు లెక్కలేనన్ని దేవుళ్లను, దేవతలను ఆరాధించేవారు. ల్యారీస్ మరియు పెనేటిస్‌లను కుల దైవాలుగా కొలిచేవారు. వెస్టను పొయ్యి దేవతగా ఎంచేవారు. రెండు తలల దేవుడైన జేనస్‌ను అన్నిటి ఆరంభానికి దేవుడని అనుకునేవారు. ప్రతీ వృత్తికి ఓ దేవత లేక దేవుడు ఉండేవారు. చిన్నచిన్న విషయాలకు కూడా వారికి దేవుళ్లుండేవారు. ప్యాక్స్‌ను శాంతికి, సేలుస్‌ను ఆరోగ్యానికి, పుడికిట్యాను అణకువ, పవిత్రతకు, ఫిడెస్‌ను విశ్వసనీయతకు, వర్టూస్‌ను
ధైర్యానికి, వోలుప్టాస్‌ను సంతోషానికి దేవతలుగా కొలిచేవారు. రోమా సామ్రాజ్యంలో ఇంటాబయటా జరిగే ప్రతీ విషయం దేవుళ్ల ఇష్టప్రకారమే జరుగుతాయని ప్రజలు నమ్మేవారు. ఏదైనా పనిలో విజయం సాధించాలంటే కర్మాచరణలు, బలులు, పండుగల ద్వారా దానికి సంబంధించిన దేవతను లేక దేవుణ్ణి శాంతపరచాలని అనుకునేవారు.శకునాలు చూస్తే దేవతల ఇష్టాయిష్టాలేమిటో తెలుసుకోవచ్చని ప్రజలు నమ్మేవారు. ముఖ్యంగా బలి అర్పించిన జంతువుల లోపలి అవయవాలను పరిశీలించి శకునాలు తెలుసుకునేవారు. ఒకవేళ అవి బాగుంటే దేవత అనుగ్రహం తమకుందని, లేకపోతే దేవత అనుగ్రహం తమకు లేదని వారు నమ్మేవారు.
సా.శ.పూ. రెండవ శతాబ్దపు చివరికల్లా రోమన్లు, తమ దేవుళ్లూ గ్రీకు దేవుళ్లూ ఒకటేనని భావించడం మొదలుపెట్టారు. ఉదాహరణకు జూపిటర్‌ను ద్యుపతి అని, జూనోను హిర అని వారు అనుకున్నారు. గ్రీకు దేవతలకు, దేవుళ్లకు సంబంధించిన పురాణగాథలు తమ పురాణగాథల్లా ఉన్నప్పుడు వాటిని కూడా వారు స్వీకరించారు. నిజానికి ఈ పురాణగాథలు ఆ దేవతల్ని అసలు స్తుతించడం లేదు. ఎందుకంటే ఆ దేవతలకు కూడా మానవులకున్న లోపాలు, పరిమితులు ఉన్నట్లు అవి చూపిస్తున్నాయి. ఉదాహరణకు, ద్యుపతి మానభంగం చేసేవాడిగా, పిల్లలపై లైంగిక అత్యాచారాలకు పాల్పడేవాడిగా, మానవులతో, అమరులని చెప్పబడినవారితో లైంగిక సంబంధాలు ఏర్పర్చుకునేవాడిగా చూపించబడ్డాడు. ఆ దేవుళ్ల సిగ్గులేని కృత్యాలను ప్రాచీన రంగస్థలాల్లో చూపిస్తుంటే ప్రజలు తరచూ హర్షధ్వానాలు చేసేవారు. అంతేకాదు, అలాంటి ఘోరమైన కృత్యాలను తాము కూడా చేయవచ్చని వారి భక్తులు అనుకున్నారు.
కొంతమంది విద్యావంతులు ఆ పురాణగాథలు నిజంగా జరిగాయని అనుకొనివుంటారు. మరికొంతమంది వాటిని కట్టుకథలనుకున్నారు. బహుశా, పొంతి పిలాతు ఆ అభిప్రాయంతోనే “సత్యమనగా ఏమిటి?” అని అడిగివుంటాడు. (యోహా. 18:37, 38) అలాంటి అభిప్రాయాలున్నాయి కాబట్టే అప్పట్లో, “ఏ విషయం గురించైనా పూర్తి సత్యం తెలుసుకోవడం అసాధ్యమని చాలామంది విద్యావంతులు భావించేవారు.”
చక్రవర్తి ఆరాధన
ఔగుస్తు పరిపాలనలో (సా.శ.పూ. 27 నుండి సా.శ. 14 వరకు) చక్రవర్తి ఆరాధన మొదలైంది. ఎంతోకాలంపాటు సాగిన యుద్ధం ముగిసిన తర్వాత ఆయన శాంతిసంవృద్ధి ఉండేలా చూశాడు కాబట్టి ఆయనకు తాము రుణపడివున్నామని ప్రత్యేకంగా తూర్పు ప్రాంతాల్లో గ్రీకు భాష మాట్లాడే ప్రజలు భావించారు. తమ కళ్లకు కనిపించే ఓ నాయకుడు తమను ఎల్లప్పుడూ కాపాడాలని వారు కోరుకున్నారు. మత భేదాలను రూపుమాపి, జాతీయతను పెంచి ప్రపంచాన్నంతా దాని “రక్షకుని” కిందకు తీసుకొచ్చే ఓ ప్రభుత్వాన్ని వారు కోరుకున్నారు. దానివల్ల, ప్రజలు చక్రవర్తినే దేవునిగా కొలవడం మొదలుపెట్టారు.
తాను బ్రతికుండగా ప్రజలు తనను దేవుడిగా చూసేందుకు ఔగుస్తు ఒప్పుకోకపోయినా రోమా దేశాన్ని ఓ దేవతగా ఆరాధించాలని ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చి, దానికి రోమా డియా అనే పేరు పెట్టాడు. అయితే, తన మరణం తర్వాత ఆయన ఓ దేవుడిగా కొలవబడ్డాడు. ఆ విధంగా సామ్రాజ్య కేంద్రమైన రోమును, దాని పరిపాలకులను రోమా ప్రజలు ఆరాధించేవారు, తమ దేశభక్తిని చాటేవారు. కొత్తదైన ఈ చక్రవర్తి ఆరాధన ఇతర ప్రాంతాలకు త్వరగా వ్యాపించి దేశానికి గౌరవాన్ని, విశ్వసనీయతను చూపించే మార్గంగా మారింది.
సా.శ. 81 నుండి 96 వరకు డమిషన్ చక్రవర్తి రోమాను పరిపాలించాడు. తనను ఆరాధించమని ఆజ్ఞాపించిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే. ఆయన కాలానికల్లా రోమన్లు, క్రైస్తవులకూ యూదులకూ మధ్యవున్న తేడాను గుర్తించి, కొత్తదిగా పరిగణించబడిన మతగుంపును వ్యతిరేకించడం మొదలుపెట్టారు. బహుశా డమిషన్ పరిపాలనలోనే అపొస్తలుడైన యోహాను “యేసునుగూర్చిన సాక్ష్యము” ఇచ్చినందుకు పత్మాసు ద్వీపంలో పరవాసిగా ఉండివుంటాడు.—ప్రక. 1:9.
యోహాను బందీగా ఉన్నప్పుడే ప్రకటన పుస్తకాన్ని రాశాడు. చక్రవర్తి ఆరాధనకు ముఖ్య కేంద్రమైన పెర్గములో చంపబడిన అంతిపను గురించి ఆయన ఆ పుస్తకంలో ప్రస్తావించాడు. (ప్రక. 2:12, 13) ఆ సమయానికల్లా రాష్ట్ర మతానికి సంబంధించిన ఆచారాలను పాటించమని రోమా సామ్రాజ్యం క్రైస్తవుల మీదికి ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టి ఉంటుంది. సా.శ. 112వ సంవత్సరం వరకు అది అలాగే కొనసాగిందో లేదో మనకు తెలీదుగానీ, పైన ప్రస్తావించబడినట్లు ప్లైని అలాంటి ఆచారాలను ఆచరించమని బితూనియా క్రైస్తవుల మీదికి ఒత్తిడితెచ్చినట్లు ఆయన ట్రాజన్‌కు రాసిన లేఖను బట్టి తెలుస్తోంది.
క్రైస్తవులని నిందించబడినవారితో ప్లైని వ్యవహరిస్తున్న తీరును ట్రాజన్ మెచ్చుకొని, రోమా దేవుళ్లను ఆరాధించడానికి నిరాకరించే క్రైస్తవులకు మరణశిక్ష విధించమని ఆజ్ఞాపించాడు. ట్రాజన్ ఇలా రాశాడు: “అయితే, ఎవరైనా తాము క్రైస్తవులంకామని చెప్పడమేకాక మన దేవుళ్లను ఆరాధించి దాన్ని రుజువు చేస్తే (గతంలో వారిమీద వచ్చిన అనుమానాల్ని మనసులో పెట్టుకోకుండా) వారు చూపించిన పశ్చాత్తాపాన్ని బట్టి వారిని విడుదల చేయండి.”
సంపూర్ణ భక్తిని ఆశించే మతం గురించి రోమన్లు అర్థం చేసుకోలేకపోయారు. రోమా దేవుళ్లు అలాంటి భక్తిని కోరనప్పుడు క్రైస్తవుల దేవుడు దాన్ని ఎందుకు కోరుతున్నట్లు? అని వారు అనుకున్నారు. తమ రాష్ట్ర దేవుళ్లను, దేవతలను ఆరాధించడం రాజకీయ వ్యవస్థను గుర్తించడంతో సమానమని వారు అనుకున్నారు. కాబట్టి, వాటిని ఆరాధించకపోవడాన్ని రాజద్రోహంగా పరిగణించేవారు. వాటిని ఆరాధించేలా క్రైస్తవులను ఏ విధంగానూ బలవంతపెట్టలేనని ప్లైని గుర్తించాడు. ఎందుకంటే అలా చేస్తే యెహోవాకు తాము యథార్థంగా ఉండే విషయంలో రాజీపడినట్లేనని క్రైస్తవులు భావించారు. అందుకే చాలామంది క్రైస్తవులు విగ్రహారాధనతో సమానమైన చక్రవర్తి ఆరాధనను చేయడంకన్నా చనిపోవడమే మేలనుకున్నారు.
అసలు మనం దీనంతటి గురించి ఎందుకు తెలుసుకోవాలి? దేశ పౌరులు జాతీయ చిహ్నాలకు తప్పనిసరిగా వందనం చేయాలని కొన్ని దేశాలు ఆదేశిస్తున్నాయి. నిజమే, క్రైస్తవులముగా మనం ఈ లోక ప్రభుత్వాలను గౌరవిస్తాం. (రోమా. 13:1) కానీ, జాతీయ చిహ్నాలకు సంబంధించిన ఆచారాల విషయానికొస్తే, తనకు సంపూర్ణ భక్తిని చెల్లించాలని యెహోవా మనకిచ్చిన ఉపదేశానికి లోబడతాం. అంతేకాక, “విగ్రహారాధనకు దూరముగా పారిపొండి” అని, “విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి” అని ఆయన తన వాక్యంలో ఇచ్చిన ఉపదేశానికి కూడా లోబడతాం. (1 కొరిం. 10:14; 1 యోహా. 5:21; నహూ. 1:2) యేసు ఇలా చెప్పాడు: “నీ దేవుడైన ప్రభువునకు [యెహోవాకు] మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను.” (లూకా 4:8) కాబట్టి, ఎల్లప్పుడూ మనం ఆరాధించే యెహోవాకు యథార్థంగా ఉందాం.
[5వ పేజీలోని బ్లర్బ్]
నిజ క్రైస్తవులు యెహోవాకు సంపూర్ణ భక్తిని చెల్లిస్తారు
[3వ పేజీలోని చిత్రాలు]
తొలి క్రైస్తవులు చక్రవర్తిని లేదా ఇతర దేవుళ్ల ప్రతిమల్ని ఆరాధించడానికి నిరాకరించారు
డమిషన్ చక్రవర్తి
ద్యుపతి
[క్రెడిట్ లైనులు]
డమిషన్ చక్రవర్తి: Todd Bolen/Bible Places.com; ద్యుపతి: Photograph by Todd Bolen/Bible Places.com, taken at Archaeological Museum of Istanbul
[4వ పేజీలోని చిత్రం]
ఎఫెసులోని క్రైస్తవులు ప్రజాదరణ పొందిన అర్తెమిదేవిని ఆరాధించడానికి నిరాకరించారు.—అపొ. 19:23-41