కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ జ్ఞానేంద్రియాలకు శిక్షణనిస్తూ ఉండండి

మీ జ్ఞానేంద్రియాలకు శిక్షణనిస్తూ ఉండండి

మీ జ్ఞానేంద్రియాలకు శిక్షణనిస్తూ ఉండండి

నైపుణ్యంగల ఒక జిమ్నాస్ట్‌ తన శరీరాన్ని వేగంగా, అవలీలగా ఆకర్షణీయమైన రీతిలో వంపులు తిప్పడాన్ని చూసినప్పుడు మనకెంత ముచ్చటేస్తుంది! ఒక జిమ్నాస్ట్‌ సాధన చేసినట్లే, క్రైస్తవులు కూడా తమ ఆలోచనా సామర్థ్యాన్ని సాధకం చేసుకోవాలని బైబిలు ప్రోత్సహిస్తోంది.

హెబ్రీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “వయస్సు వచ్చిన వారు [‘పరిణతి సాధించినవారు,’ NW] అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.” (హెబ్రీ. 5:14) ఒక జిమ్నాస్ట్‌ తన కండరాలను సాధకం చేసుకున్నట్లే హెబ్రీ క్రైస్తవులు తమ ఆలోచనా సామర్థ్యాన్ని సాధకం చేసుకోవాలని పౌలు వారిని ఎందుకు ప్రోత్సహించాడు? మనం మన జ్ఞానేంద్రియాలను లేదా వివేచనా సామర్థ్యాలను ఎలా సాధకం చేసుకోవచ్చు?

“మీరు బోధకులుగా ఉండవలసినవారై” ఉన్నారు

‘మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధానయాజకునిగా’ యేసుకున్న స్థానం గురించి చెబుతూ పౌలు ఇలా రాశాడు: “[యేసును గూర్చి] మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు.”—హెబ్రీ. 5:9-12.

మొదటి శతాబ్దంలోని కొందరు యూదా క్రైస్తవులు తమ అవగాహనను పెంచుకోలేదనీ, ఆధ్యాత్మిక ప్రగతి సాధించలేదనీ తెలుస్తోంది. ఉదాహరణకు ధర్మశాస్త్రానికి సంబంధించి, సున్నతికి సంబంధించి అవగాహనలో వచ్చిన మార్పును వారు జీర్ణించుకోలేకపోయారు. (అపొ. 15:1, 2, 27-29; గల. 2:11-14; 6:12, 13) వారపు సబ్బాతుకు, వార్షిక ప్రాయశ్చిత్తార్థ దినానికి సంబంధించి తామెంతో కాలంగా చేస్తూ వచ్చిన ఆచారాలను వదిలేయడం కొందరికి కష్టమనిపించింది. (కొలొ. 2:16, 17; హెబ్రీ. 9:1-14) అందుకే, మేలు కీడులను గుర్తించేలా తమ వివేచనా సామర్థ్యాలను సాధకం చేసుకోమని వారిని పౌలు ప్రోత్సహించాడు. అంతేకాక, ‘పరిణతి సాధించమని’ కూడా చెప్పాడు. (హెబ్రీ. 6:1, 2, NW) ఆయనిచ్చిన ఉపదేశం వల్ల కొంతమంది తమ ఆలోచనా సామర్థ్యాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో పరిశీలించుకొని ఆధ్యాత్మిక ప్రగతి సాధించివుంటారు. మరి మన విషయమేమిటి?

మీ వివేచనా సామర్థ్యాలను సాధకం చేసుకోండి

ఆధ్యాత్మిక పరిణతి సాధించేందుకు మనం మన వివేచనా సామర్థ్యాలను ఎలా సాధకం చేసుకోవచ్చు? “అభ్యాసముచేత” సాధకం చేసుకోవచ్చని పౌలు చెప్పాడు. ఎంతో చూడముచ్చటైన రీతిలో, క్లిష్టమైన రీతిలో తమ శరీరాల్ని వంపులు తిప్పడానికి జిమ్నాస్ట్‌లు వ్యాయామం చేసి తమ కండరాలను సాధకం చేసుకుంటారు. అలాగే, మనం కూడా మంచి చెడులను గుర్తించగలిగేలా మన వివేచనా సామర్థ్యాలను సాధకం చేసుకోవాలి.

“సాధన చేయడం మెదడుకు చాలా మంచిది” అని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌లో మానసిక రుగ్మతల శాస్త్రానికి క్లినికల్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జాన్‌ రెటి అన్నారు. జార్జ్‌ వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయంలోని వృద్ధాప్యం, ఆరోగ్యం, మానవత్వానికి సంబంధించిన కేంద్రానికి డైరెక్టర్‌గా పనిచేస్తున్న జిన్‌ కొవన్‌ ఇలా చెప్పాడు: “మన మెదడుకు కష్టమైన పని ఇస్తే మెదడులోని కణాలు కొత్త డెండ్రైట్లను ఉత్పత్తి చేస్తాయి. వాటివల్ల నాడీ కేంద్రకాలు అధికమౌతాయి.”

కాబట్టి, మన వివేచనా సామర్థ్యాలను సాధకం చేసుకొని బైబిలు జ్ఞానాన్ని పెంచుకోవాలి. అలా చేస్తే, మనం ‘సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని’ చేయడానికి సంసిద్ధంగా ఉంటాం.—రోమా. 12:1, 2.

‘బలమైన ఆహారంపట్ల’ ఆకలిని పెంచుకోండి

మనం ‘పరిణతి సాధించాలని’ కోరుకున్నట్లయితే, మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘బైబిలు సత్యానికి సంబంధించిన అవగాహనను నేను పెంచుకుంటున్నానా? ఇతరులు నన్ను ఆధ్యాత్మిక పరిణతి సాధించిన వ్యక్తిగా పరిగణిస్తున్నారా?’ ఒక తల్లి తన బిడ్డ శిశువుగా ఉన్నప్పుడు పాలు, కొంచెం ఎదిగిన తర్వాత బేబీ ఫుడ్‌ ఇవ్వడానికి ఎంతో సంతోషిస్తుంది. కానీ, ఆ బిడ్డ పెద్దైన తర్వాత కూడా బలమైన ఆహారం తీసుకోకపోతే తల్లి ఎంత బాధపడుతుందో ఆలోచించండి. అలాగే, మన బైబిలు విద్యార్థి సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకునేంతగా ప్రగతి సాధిస్తే మనం ఎంతో సంతోషిస్తాం. కానీ, బాప్తిస్మం తర్వాత ఆ వ్యక్తి ప్రగతి సాధించకపోతే మనకు బాధనిపించదా? (1 కొరిం. 3:1-4) కొంతకాలానికి మన బైబిలు విద్యార్థులు కూడా మనలాగే బోధకులవ్వాలని ఆశిస్తాం.

మన వివేచనా సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ వివిధ విషయాల గురించి తర్కించాలంటే ధ్యానించడం అవసరం. అలా చేయడానికి మనమెంతో కృషి చేయాల్సివుంటుంది. (కీర్త. 1:1-3) టీవీ చూడడం, మరితర వ్యాపకాల వంటివి మనల్ని ప్రాముఖ్యమైన విషయాల గురించి ధ్యానించకుండా పక్కదారి పట్టించగలవు కాబట్టి అలాంటివాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మన వివేచనా సామర్థ్యాన్ని వృద్ధి చేసుకోవాలంటే బైబిలు చదివే విషయంలో, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ప్రచురించిన ప్రచురణలను చదివే విషయంలో మనం ఆకలిని పెంచుకొని, దాన్ని తీర్చుకోవాలి. (మత్త. 24:45-47) క్రమంగా వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేయడంతోపాటు, కుటుంబ ఆరాధనకు, వివిధ బైబిలు అంశాలను లోతుగా అధ్యయనం చేయడానికి కూడా సమయాన్ని కేటాయించడం ప్రాముఖ్యం.

మెక్సికోలో ప్రయాణ పైవిచారణకర్తగా పనిచేస్తున్న జెరొనిమో, ప్రతీ కావలికోట సంచిక చేతిలోకి వచ్చిన వెంటనే చదివేస్తానని చెబుతున్నాడు. తన భార్యతో కలిసి అధ్యయనం చేసేందుకు కూడా ఆయన సమయాన్ని కేటాయిస్తాడు. ఆయనిలా అంటున్నాడు: “మేమిద్దరం కలిసి ప్రతీరోజు బైబిలు చదువుతాం. అంతేకాక, ‘మంచి దేశము’ బ్రోషురును, మరితర ప్రచురణలను కూడా ఉపయోగిస్తాం.” రానల్డ్‌ అనే మరో క్రైస్తవుడు, తాను సంఘ బైబిలు పఠన పట్టికను అనుసరిస్తానని చెబుతున్నాడు. ఆయనకు వ్యక్తిగత అధ్యయనం కోసం ఒకట్రెండు దీర్ఘకాలిక ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. “మళ్లీ ఎప్పుడెప్పుడు అధ్యయనం చేద్దామా అని ఎదురుచూసేలా ఈ ప్రాజెక్టులు నాకు సహాయం చేస్తున్నాయి” అని రానల్డ్‌ చెబుతున్నాడు.

మరి మన విషయమేమిటి? దేవుని వాక్యాన్ని చదవడానికి, ధ్యానించడానికి తగినంత సమయాన్ని కేటాయిస్తున్నామా? మన వివేచనా సామర్థ్యాన్ని సాధకం చేసుకుంటూ లేఖన సూత్రాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో అనుభవం సంపాదిస్తున్నామా? (సామె. 2:1-7) ఆధ్యాత్మికంగా పరిణతి సాధించిన వ్యక్తికి మేలు కీడులను వివేచించడానికి కావాల్సిన జ్ఞానం, తెలివి ఉంటాయి. మనమూ వారిలాగే తయారవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకుందాం.

[23వ పేజీలోని చిత్రం]

“అభ్యాసముచేత” మనం మన వివేచనా సామర్థ్యాల్ని సాధకం చేసుకుంటాం