కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి

యెహోవా పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి

యెహోవా పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి

‘దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఆయనయందు [“దానితోనే,” NW] మీరు ముద్రింపబడ్డారు.’—ఎఫె. 4:30.

1. యెహోవా లక్షలాదిమంది కోసం ఏ ఏర్పాటు చేశాడు? వారిపై ఏ బాధ్యత ఉంది?

 కల్లోలభరితమైన ఈ లోకంలో నివసిస్తున్న లక్షలాదిమంది కోసం యెహోవా ఓ ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు. తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తనకు దగ్గరయ్యే అవకాశాన్ని ఆయన కల్పించాడు. (యోహా. 6:44) మీరు దేవునికి సమర్పించుకొని దానికి తగ్గట్టు జీవిస్తున్నట్లయితే ఆ అవకాశం మీకు కూడా ఉంది. పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకున్నవారిగా ఆ ఆత్మకు అనుగుణంగా ప్రవర్తించే బాధ్యత మీపై ఉంది.—మత్త. 28:19.

2. మనం ఏ ప్రశ్నలను పరిశీలిస్తాం?

2 మనం ‘ఆత్మనుబట్టి విత్తుతాం’ కాబట్టి, నూతన వ్యక్తిత్వాన్ని ధరించుకుంటాం. (గల. 6:8; ఎఫె. 4:17-24) అయితే, పౌలు ఈ విషయంలో మనకు ఉపదేశాన్నిచ్చి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదని హెచ్చరించాడు. (ఎఫెసీయులు 4:25-32 చదవండి.) అపొస్తలుడైన పౌలు చెప్పిన ఆ ఉపదేశాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. దేవుని ఆత్మను దుఃఖపరచకూడదని పౌలు అన్న మాటలకు అర్థమేమిటి? యెహోవాకు సమర్పించుకున్నవారు ఏయే విధాలుగా ఆయన ఆత్మను దుఃఖపరిచే అవకాశముంది? యెహోవా ఆత్మను దుఃఖపరచకూడదంటే మనం ఏమి చేయాలి?

పౌలు మాటలకున్న అర్థమేమిటి?

3. ఎఫెసీయులు 4:30 లోని మాటలకున్న అర్థాన్ని వివరించండి.

3 మొదటిగా, ఎఫెసీయులు 4:30లో పౌలు చెప్పిన మాటలను గమనించండి. ఆయన ఇలా రాశాడు: “దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు ఆయనయందు [‘దానితోనే,’ NW] మీరు ముద్రింపబడి యున్నారు.” తన ప్రియమైన తోటి విశ్వాసులు దేవుని ముందు తమకున్న మంచి పేరును, ఆయనతోవున్న మంచి సంబంధాన్ని పాడుచేసుకోకూడదని పౌలు కోరుకున్నాడు. యెహోవా పరిశుద్ధాత్మతోనే వారు ‘విమోచనదినం వరకు ముద్రించబడ్డారు.’ నమ్మకమైన అభిషిక్తులకు దేవుని పరిశుద్ధాత్మ ఓ ముద్రగా లేదా “రానున్న దానికి హామీగా” ఉండేది, ఇప్పటికీ అలాగే ఉంది. (2 కొరిం. 1:22, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) తాము దేవుని సొత్తని, తమకు పరలోక జీవితం అనుగ్రహించబడుతుందని ఆ ముద్ర సూచిస్తోంది. ముద్రించబడేవారి పూర్తి సంఖ్య 1,44,000.—ప్రక. 7:2-4.

4. దేవుని ఆత్మను దుఃఖపరచకుండా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

4 ఓ క్రైస్తవుడు ఆత్మను దుఃఖపరిస్తే కొంతకాలానికి ఆయన జీవితంలో దేవుని చురుకైన శక్తి పనిచేయకపోవచ్చు. దావీదు బత్షెబతో పాపం చేసిన తర్వాత ఆయన చెప్పిన మాటలనుబట్టి అది స్పష్టమౌతోంది. దావీదు పశ్చాత్తాపంతో యెహోవాను ఇలా వేడుకున్నాడు: “నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము.” (కీర్త. 51:11) “మరణమువరకు నమ్మకముగా” ఉండే అభిషిక్తులు మాత్రమే పరలోకంలో అమరత్వమనే ‘జీవకిరీటాన్ని’ పొందుతారు. (ప్రక. 2:10; 1 కొరిం. 15:53) ఈ విషయంలో అభిషిక్తులకు పరిశుద్ధాత్మ సహాయం అవసరమైనట్లే, భూమ్మీద నిరంతరం జీవించే అవకాశమున్నవారికి కూడా తమ యథార్థతను కాపాడుకోవడానికి, క్రీస్తు విమోచన క్రయధన బలిపట్ల తమకున్న విశ్వాసం ఆధారంగా దేవుడు ఇచ్చే జీవమనే బహుమానాన్ని పొందడానికి పరిశుద్ధాత్మ సహాయం అవసరం. (యోహా. 3:36; రోమా. 5:8; 6:23) కాబట్టి, యెహోవా ఆత్మను దుఃఖపరచకుండా మనమందరం జాగ్రత్తపడాలి.

ఒక క్రైస్తవుడు ఆత్మను ఎలా దుఃఖపరిచే అవకాశముంది?

5, 6. ఓ క్రైస్తవుడు యెహోవా ఆత్మను ఎలా దుఃఖపరిచే అవకాశముంది?

5 సమర్పిత క్రైస్తవులముగా మనం ఆత్మను దుఃఖపరచకుండా ఉండవచ్చు. ‘ఆత్మను అనుసరిస్తూ జీవించినట్లయితే’ అది సాధ్యమౌతుంది. అలా జీవిస్తే మనం శరీరేచ్ఛలకు లొంగిపోం, చెడు లక్షణాలను చూపించం. (గల. 5:16, 25, 26) అయితే ఆ పరిస్థితి మారవచ్చు. బహుశా మనకు తెలియకుండానే మెల్లమెల్లగా పక్కదారిపట్టి దేవుని ప్రేరేపిత వాక్యం ఖండిస్తున్న ప్రవర్తనను కనబరచడం ద్వారా మనం దేవుని ఆత్మను కొంతవరకు దుఃఖపరిచే ప్రమాదముంది.

6 మనం పరిశుద్ధాత్మ నిర్దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వెళ్తే మనం దాన్ని, దానికి మూలమైన యెహోవాను దుఃఖపరుస్తాం. ఎఫెసీయులు 4:25-32 లోని మాటలను పరిశీలిస్తే, మనం ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటాం. అలా తెలుసుకోవడం వల్ల దేవుని ఆత్మను దుఃఖపరచకుండా ఉండగలుగుతాం.

దేవుని ఆత్మను దుఃఖపరచకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

7, 8. మనం ఎందుకు సత్యం మాట్లాడాలో వివరించండి.

7 మనం సత్యమే మాట్లాడాలి. ఎఫెసీయులు 4:25లో పౌలు ఇలా రాశాడు: “మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.” “మనము ఒకరికొకరము అవయవములై యున్నాము” కాబట్టి మనం మోసగించకూడదు లేదా మన తోటి విశ్వాసులను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించకూడదు. ఎందుకంటే అది అబద్ధమాడడంతో సమానం. అలా ప్రవర్తిస్తూ ఉండేవారు దేవునితో తమకున్న సంబంధాన్ని పూర్తిగా కోల్పోతారు.—సామెతలు 3:32 చదవండి.

8 మోసపూరితమైన మాటలు, చేతలు సంఘ ఐక్యతను పాడుచేస్తాయి. కాబట్టి, మనం నమ్మకస్థుడైన దానియేలు ప్రవక్తలా ఉండాలి, ఇతరులు ఆయనలో ఎలాంటి తప్పును కనిపెట్టలేకపోయారు. (దాని. 6:4) ‘క్రీస్తు శరీరములోని’ ప్రతీ సభ్యుడు ఒకరికొకరు చెందినవారని, వారు నమ్మకస్థులైన ఇతర అభిషిక్త అనుచరులతో ఐక్యంగా ఉండాలని పరలోక నిరీక్షణ ఉన్న క్రైస్తవులకు పౌలు చెప్పిన ఉపదేశాన్ని మనం మనసులో ఉంచుకోవాలి. (ఎఫె. 4:13) మనకు పరదైసు భూమిపై నిరంతరం జీవించే అవకాశమున్నట్లయితే, మనం కూడా సత్యం మాట్లాడడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సహోదరుల ఐక్యతకు తోడ్పడాలి.

9. ఎఫెసీయులు 4:26, 27 లోని మాటలను పాటించడం ఎందుకు ప్రాముఖ్యం?

9 మనం అపవాదిని ఎదిరించాలి, మనకు ఆధ్యాత్మికంగా హాని చేసే ఎలాంటి అవకాశం వాడికి ఇవ్వకూడదు. (యాకో. 4:7) సాతానును ఎదిరించేందుకు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు, అదుపులేని కోపం రాకుండా చూసుకోవడం ద్వారా మనం అలా చేయవచ్చు. పౌలు ఇలా రాశాడు: “కోపపడుడిగాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు. అపవాదికి చోటియ్యకుడి.” (ఎఫె. 4:26, 27) మనకు కోపం రావడానికి సరైన కారణమే ఉన్నా మనసులో వెంటనే ప్రార్థన చేసుకుంటే మనం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచే విధంగా ప్రవర్తించే బదులు ‘శాంతగుణం కలిగి’ ఆశానిగ్రహంతో ప్రవర్తించగలుగుతాం. (సామె. 17:27) మన మనసులో కోపాన్ని అలాగే ఉంచుకుంటే, తప్పు చేసేలా సాతాను మనల్ని ప్రలోభపెట్టగలడు కాబట్టి, అలాంటి అవకాశం వాడికి ఇవ్వకుండా ఉందాం. (కీర్త. 37:8, 9) యేసు ఉపదేశించినట్లు మనం వెంటనే తగాదాలను పరిష్కరించుకుంటే వాణ్ణి ఎదిరించగలుగుతాం.—మత్త. 5:23, 24; 18:15-17.

10, 11. మనం ఎందుకు దొంగిలించకూడదు లేదా ఇతరులను మోసగించకూడదు?

10 దొంగతనం చేయాలనే లేదా మోసం చేయాలనే శోధనకు లొంగిపోకూడదు. దొంగతనం గురించి పౌలు ఇలా రాశాడు: “దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.” (ఎఫె. 4:27, 28) ఓ సమర్పిత క్రైస్తవుడు దొంగతనం చేస్తే అతడు నిజానికి ‘దేవుని నామాన్ని దూషించి’ దాన్ని అవమానించినవాడౌతాడు. (సామె. 30:7-9) చివరికి, పేదరికం కూడా దొంగతనానికి సాకుకాదు. దేవుణ్ణి, పొరుగువారిని ప్రేమించేవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దొంగతనం చేయడం తప్పేనని గుర్తిస్తారు.—మార్కు 12:28-31.

11 పౌలు కేవలం ఏమి చేయకూడదో చెప్పి ఊరుకోలేదు, ఏమి చేయాలో కూడా చెప్పాడు. మనం పరిశుద్ధాత్మకు అనుగుణంగా జీవిస్తున్నట్లయితే కష్టపడి పనిచేస్తాం. అలా పనిచేస్తే మన కుటుంబ అవసరాలను తీర్చగలుగుతాం, ‘అక్కరగలవానికి’ కూడా ‘పంచిపెట్టగలుగుతాం.’ (1 తిమో. 5:8) పేదవారికి సహాయం చేయడానికి యేసు, ఆయన అపొస్తలులు కొంత డబ్బును పక్కనబెట్టేవారు. కానీ యేసును అప్పగించిన ఇస్కరియోతు యూదా కొంత డబ్బును దొంగిలిస్తూ వచ్చాడు. (యోహా. 12:4-6) ఆయన పరిశుద్ధాత్మచేత నడిపించబడలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. దేవుని ఆత్మచేత నడిపించబడే మనం పౌలులా ‘అన్ని విషయాల్లో యోగ్యముగా [“నిజాయితీగా,” NW] ప్రవర్తిస్తాం.’ (హెబ్రీ. 13:18) అలా మనం యెహోవా పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండగలుగుతాం.

ఆత్మను దుఃఖపరచకుండా ఉండడానికి ఇంకేమి చేయాలి?

12, 13. (ఎ) ఎలాంటి మాటలు మాట్లాడకూడదని ఎఫెసీయులు 4:29 చెబుతోంది? (బి) మనం ఎలా మాట్లాడాలి?

12 మన మాటల విషయంలో జాగ్రత్త వహించాలి. పౌలు ఇలా చెప్పాడు: “వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి.” (ఎఫె. 4:29) ఇక్కడ కూడా పౌలు కేవలం మనం ఏమి చేయకూడదో చెప్పి ఊరుకోలేదు కానీ ఏమి చేయాలో కూడా చెప్పాడు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనమీద పనిచేస్తే మనం ‘వినువారికి మేలు కలిగేలా క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుతాం.’ అంతేకాక, మనం ‘దుర్భాషలాడకుండా’ ఉంటాం. ఈ లేఖనంలో ‘దుర్భాష’ అని అనువదించబడిన గ్రీకు మూలపదం కుళ్లిపోతున్న పండును గానీ, కుళ్లిపోతున్న చేపను గానీ, కుళ్లిపోతున్న మాంసాన్ని గానీ సూచించడానికి ఉపయోగించబడింది. మనం అలాంటి ఆహారాన్ని ఎలాగైతే అసహ్యించుకుంటామో అలాగే యెహోవా చెడుగా పరిగణించే మాటలనూ అసహ్యించుకుంటాం.

13 మన మాటలు మర్యాదకరంగా, దయగా, “ఉప్పువేసినట్టు” ఉండాలి. (కొలొ. 3:8-10; 4:6) మనకూ ఇతరులకూ తేడావుందని మన మాటలనుబట్టి ప్రజలు గుర్తించగలగాలి. కాబట్టి, ‘క్షేమాభివృద్ధికరమైన’ మాటలు మాట్లాడడం ద్వారా మనం ఇతరులకు సహాయం చేద్దాం. మనం కూడా కీర్తనకర్తలాగే భావిద్దాం. ఆయన ఇలా పాడాడు: “యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక.”—కీర్త. 19:14.

14. మనం వేటిని విసర్జించాలని ఎఫెసీయులు 4:30, 31 చెబుతోంది?

14 మనం ద్వేషాన్ని, క్రోధాన్ని, దూషణను, అన్ని రకాల దుష్టత్వాన్ని విసర్జించాలి. దేవుని ఆత్మను దుఃఖపరచకూడదని హెచ్చరించిన తర్వాత పౌలు ఇలా రాశాడు: “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.” (ఎఫె. 4:30, 31) అపరిపూర్ణ మానవులముగా మనమందరం మన ఆలోచనలను, చర్యలను నియంత్రించుకునేందుకు ఎంతో కష్టపడాలి. “ద్వేషము, కోపము, క్రోధము” వంటివాటిని మనం అదుపులో ఉంచుకోకపోతే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాం. ఇతరులు చేసిన తప్పులను గుర్తుంచుకుంటూ, వారిమీద కోపాన్ని పెంచుకోవడం, వారితో సమాధానపడేందుకు నిరాకరించడం వంటివి చేస్తే కూడా మనం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాం. బైబిలు ఉపదేశాన్ని మనం పెడచెవినిబెట్టడం ఆరంభించినాసరే ఆత్మకు వ్యతిరేకంగా పాపం చేయడానికి నడిపించే లక్షణాలు పెంపొందించుకునే ప్రమాదముంది. దానివల్ల తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి రావచ్చు.

15. ఎవరైనా మనకు కీడు చేస్తే మనం ఏమి చేయాలి?

15 మనం దయ, కరుణ, క్షమాగుణాన్ని కనబరచాలి. పౌలు ఇలా రాశాడు: “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.” (ఎఫె. 4:32) ఇతరులు మనకు చేసిన కీడునుబట్టి మనం ఎంత బాధపడినా, దేవునిలాగే మనం వారిని క్షమించాలి. (లూకా 11:4) తోటి విశ్వాసి మన గురించి ఇతరులకు ఏదో చెడు చెప్పాడనుకుందాం. సమస్యను పరిష్కరించుకునేందుకు మనం ఆయన దగ్గరకు వెళ్లాం, ఆయన తాను చేసినదానికి ఎంతో బాధపడి, క్షమించమని కోరతాడు. అప్పుడు మనం ఆయనను క్షమిస్తాం. అయితే, అది మాత్రమే సరిపోదు. లేవీయకాండము 19:18 ఇలా చెబుతోంది: “కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచు కొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.”

అప్రమత్తంగా ఉండాలి

16. యెహోవా పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండాలంటే మనం మార్పులు చేసుకోవాల్సి రావచ్చని చూపించే ఓ ఉదాహరణ చెప్పండి.

16 మనం ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా దేవునికి ఇష్టంలేని విధంగా ప్రవర్తించేలా శోధించబడే అవకాశముంది. ఉదాహరణకు, ఓ సహోదరుడు క్రైస్తవులకు తగని సంగీతాన్ని వింటున్నాడని అనుకుందాం. కొంతకాలానికి “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ప్రచురణల ద్వారా అందిస్తున్న బైబిలు ఉపదేశాన్ని పట్టించుకోనందుకు ఆయన మనస్సాక్షి వేధిస్తుంది. (మత్త. 24:45) ఆయన ఈ సమస్య గురించి ప్రార్థించి, ఎఫెసీయులు 4:30 లోని పౌలు మాటలను గుర్తుచేసుకోవచ్చు. ఇక ఎప్పుడూ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదనే కృతనిశ్చయంతో ఆ సంగీతానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. యెహోవా ఆ సహోదరుడు చూపించిన వైఖరిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి, మనం ఎల్లప్పుడూ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా జాగ్రత్త వహిద్దాం.

17. మనం తరచూ ప్రార్థిస్తూ అప్రమత్తంగా ఉండకపోతే ఏమి కావచ్చు?

17 మనం తరచూ ప్రార్థిస్తూ అప్రమత్తంగా ఉండకపోతే, అపవిత్రమైన ప్రవర్తనకు లేదా చెడు ప్రవర్తనకు అలవాటుపడి పరిశుద్ధాత్మను దుఃఖపరిచే ప్రమాదముంది. పరిశుద్ధాత్మ, తండ్రి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే లక్షణాలను పెంపొందిస్తుంది కాబట్టి, దాన్ని దుఃఖపరచడం ద్వారా లేదా బాధపెట్టడం ద్వారా యెహోవాను దుఃఖపరుస్తాం. అలా చేయాలని మనం ఎన్నడూ కోరుకోము. (ఎఫె. 4:30) మొదటి శతాబ్దపు యూదామత శాస్త్రులు, సాతాను శక్తితో యేసు అద్భుతాలు చేస్తున్నాడని చెప్పి పాపం చేశారు. (మార్కు 3:22-30 చదవండి.) ఆ క్రీస్తు శత్రువులు ‘పరిశుద్ధాత్మకు’ వ్యతిరేకంగా ‘దూషణ’ చేసి క్షమించరాని పాపం చేశారు. మనం ఎన్నడూ అలా చేయకుండా ఉందాం!

18. మనం క్షమించరాని పాపం చేయలేదని ఎలా నిర్ధారించుకోవచ్చు?

18 క్షమించరాని పాపం చేసే పరిస్థితి మనకు అస్సలు రాకూడదని అనుకుంటాం కాబట్టి ఆత్మను దుఃఖపరచకుండా ఉండే విషయంలో పౌలు చెప్పిన మాటలను మనం గుర్తుంచుకోవాలి. అయితే మనం గంభీరమైన పాపం చేస్తే ఏమి చేయాలి? మనం పశ్చాత్తాపపడి, పెద్దల సహాయం తీసుకున్నట్లయితే దేవుడు మనల్ని క్షమించాడనే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేయలేదనే నిర్ధారణకు మనం రావచ్చు. దేవుని సహాయంతో, మనం పరిశుద్ధాత్మను మళ్లీ ఏ విధంగానూ దుఃఖపరచకుండా ఉండగలుగుతాం.

19, 20. (ఎ) మనం ఏమి చేయకూడదు? (బి) మనం ఏమని నిశ్చయించుకోవాలి?

19 తన ప్రజల మధ్య ప్రేమను, సంతోషాన్ని, ఐక్యతను పెంచేందుకు దేవుడు తన పరిశుద్ధాత్మను ఉపయోగిస్తాడు. (కీర్త. 133:1-3) కాబట్టి, పరిశుద్ధాత్మను దుఃఖపరిచేలా మనం హానికరమైన కొండెములు చెప్పము, పరిశుద్ధాత్మ చేత నియమించబడిన కాపరుల గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడము. (అపొ. 20:28; యూదా 8) బదులుగా, మనం సంఘ ఐక్యతకు దోహదపడతాం, ఒకరిపట్ల మరొకరికి గౌరవం పెరిగేలా ప్రవర్తిస్తాం. అంతేకాక, దేవుని సంఘంలో ప్రత్యేకమైన గుంపులను ప్రోత్సహించం. పౌలు ఇలా రాశాడు: “సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.”—1 కొరిం. 1:10.

20 తన పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకుండా ఉండేలా యెహోవా మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు, ఆయన అలా చేయగలడు కూడా. కాబట్టి, మనం పరిశుద్ధాత్మ సహాయం కోసం యెహోవాను వేడుకుంటూ, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండాలని నిశ్చయించుకుందాం. ‘ఆత్మనుబట్టి విత్తుతూ,’ దాని నిర్దేశాన్ని ఇప్పుడూ, ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుందాం.

మీరెలా జవాబిస్తారు?

• దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచడమంటే ఏమిటి?

• యెహోవాకు సమర్పించుకున్న వ్యక్తి పరిశుద్ధాత్మను ఎలా దుఃఖపరిచే అవకాశం ఉంది?

• మనం ఏయే విధాలుగా పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండగలుగుతాం?

[అధ్యయన ప్రశ్నలు]

[30వ పేజీలోని చిత్రం]

తగాదాలను త్వరగా పరిష్కరించుకోండి

[31వ పేజీలోని చిత్రం]

మీ మాటలు ఎలా ఉన్నాయి?