కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వృద్ధులను ఎందుకు గౌరవించాలి?

వృద్ధులను ఎందుకు గౌరవించాలి?

వృద్ధులను ఎందుకు గౌరవించాలి?

ప్రపంచంలోనే అత్యధికంగా ఫొటోలు తీయబడుతున్న చెట్లలో ఒకటి అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో ఉంది. దాని పేరు లోన్‌ సైప్రస్‌, అంటే అది ఒంటరి గొంజి చెట్టు అన్నమాట. ఈ చెట్టు 250 ఏళ్ల నాటిదని ఓ నివేదికను బట్టి తెలుస్తోంది. ఇది అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడిందని ప్రజలు అంటుంటారు. ఈ అందమైన చెట్టు ఎన్నో కారణాలను బట్టి చూపరులను ఆకట్టుకుంది. ఉదాహరణకు, ఈ చెట్టు స్థిరంగా ఉండేందుకు దానికి తీగలు కట్టారు, దాని చుట్టూ రాళ్లు పేర్చారు.

ఈ చెట్టును చూస్తే, మన మధ్య ఎంతో సహనంతో సేవచేస్తున్న వృద్ధ సహోదర సహోదరీలు మనకు గుర్తుకురావడంలేదా? రాజ్య సువార్త ప్రకటించడం ద్వారా వారు సహనాన్ని చూపిస్తున్నారు. అంత్యదినాల్లో “ముసలివారు” బైబిలు సందేశాన్ని ప్రకటిస్తారని యోవేలు ప్రవక్త ముందుగానే చెప్పాడు. (యోవే. 2:28-32; అపొ. 2:16-21) ‘రాజ్య సువార్తను’ ఇతరులకు తెలియజేసేందుకు వారు ఎంత ప్రయాసపడుతున్నారో ఆలోచించండి! అలా చేయడానికి వారు ఎన్నో గంటలు వెచ్చిస్తున్నారు. (మత్త. 24:14) కొంతమంది వృద్ధ ప్రచారకులు ఎన్నో సంవత్సరాలపాటు హింసను, ఇతర కష్టాలను సహిస్తూ వచ్చారు. సహనానికి పేరుగాంచిన ఓ మామూలు సైప్రస్‌ చెట్టుకే అన్ని రాళ్లు, తీగలు వేసి బలపరుస్తుంటే, మన మధ్యవున్న వృద్ధులను ఇంకెంత ఎక్కువగా గుర్తించి గౌరవమర్యాదలు ఇవ్వాలి!

యెహోవా దేవుడు గతంలో తన సేవకులకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “తల నెరసినవానియెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను.” (లేవీ. 19:32) ఎన్నో సంవత్సరాలుగా ‘దేవునితో నడుస్తున్న’ విశ్వాసులైన అనేకమంది మంచి మాదిరులను నేడు మనం చూస్తున్నాం. (మీకా 6:8, NW) వారు లేఖన సూత్రాలను అలవర్చుకుంటుండగా, వారి తల నెరపు నిజంగానే వారికి ఓ “సొగసైన కిరీటము” అవుతుంది.—సామె. 16:31.

“వృద్ధుని గద్దింపక తండ్రిగా” భావించాలని, ‘వృద్ధ స్త్రీలను తల్లులుగా’ పరిగణించాలని అపొస్తలుడైన పౌలు యువ తిమోతికి ఉపదేశించాడు. (1 తిమో. 5:1, 2) మరో మాటలో చెప్పాలంటే తిమోతి తల నెరసిన వారిముందు “లేచి నిలబడాలి.” దీన్నిబట్టి వృద్ధులతో మనం గౌరవమిస్తూ మాట్లాడాలని యెహోవా ఆశిస్తున్నాడన్న విషయం స్పష్టమౌతోంది.

“ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి” అని రోమీయులు 12:10 చెబుతోంది. సంఘంలోవున్న వృద్ధుల పట్ల పైవిచారణకర్తలు తగిన గౌరవాన్ని చూపిస్తారు. అయితే, ఒకరిపట్ల ఒకరం గౌరవం చూపించుకునే విషయంలో మనమందరం ముందుండాలి.

నిజానికి, తమ తల్లిదండ్రులను, తాతామామ్మలను చూసుకునే విషయంలో కుటుంబ సభ్యులకు ప్రత్యేక బాధ్యతవుంది. పైన ప్రస్తావించబడిన ఆ గొంజి చెట్టును కాపాడడానికి ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. అదేవిధంగా మనం కూడా వృద్ధులైన మన తల్లిదండ్రుల, తాతామామ్మల గౌరవం కాపాడడానికి కృషి చేస్తూ ఉండాలి. ఉదాహరణకు, వారు చెప్పేది జాగ్రత్తగా వింటే, మనకు నచ్చేవిధంగా జరగాలని పట్టుబట్టే బదులు వారి భావాలను పరిగణలోకి తీసుకుంటాం.—సామె. 23:22; 1 తిమో. 5:4.

మన మధ్యవున్న వృద్ధులంటే యెహోవాకు ఎంతో ఇష్టం. ఆయన వారిని ఎన్నడూ విడిచిపెట్టడు. (కీర్త. 71:18) తనను నమ్మకంగా సేవిస్తూ ఉండేలా సత్య దేవుడు వారిని బలపరుస్తాడు. మనం కూడా వృద్ధులను గౌరవిస్తూ వారికి కావాల్సిన సహాయాన్ని అందిస్తూ ఉందాం.

[7వ పేజీలోని చిత్రాలు]

లోన్‌ సైప్రస్‌ చెట్టు స్థిరంగా ఉండడానికి దానికి సహాయం అవసరమైనట్లే, వృద్ధులకు మన సహాయ సహకారాలు, గౌరవమర్యాదలు అవసరం!

[క్రెడిట్‌ లైను]

American Spirit Images/age fotostock