కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సహోదరులారా, ఆత్మనుబట్టి విత్తుతూ సంఘ బాధ్యతల కోసం అర్హత సంపాదించండి

సహోదరులారా, ఆత్మనుబట్టి విత్తుతూ సంఘ బాధ్యతల కోసం అర్హత సంపాదించండి

సహోదరులారా, ఆత్మనుబట్టి విత్తుతూ సంఘ బాధ్యతల కోసం అర్హత సంపాదించండి

“ఆత్మనుబట్టి విత్తువాడు . . . నిత్యజీవమను పంట కోయును.”—గల. 6:8.

1, 2. మత్తయి 9:37, 38లోని మాటలు నేడు ఎలా నెరవేరుతున్నాయి? దీనివల్ల సంఘాల్లో ఎవరి అవసరం ఏర్పడుతోంది?

 చరిత్రలో నిలిచిపోయే ప్రాముఖ్యమైన సంఘటనల్ని మీరు ఇప్పుడు కళ్లారా చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రవచించిన ఓ పని జోరుగా కొనసాగుతోంది. “కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి” అని యేసు చెప్పాడు. (మత్త. 9:37, 38) యెహోవా దేవుడు అలాంటి ప్రార్థనలకు అసాధారణ రీతిలో జవాబిస్తున్నాడు. 2009 సేవా సంవత్సరంలో 2,031 కొత్త సంఘాలు ఏర్పడ్డాయి. దానివల్ల ఇప్పుడు సంఘాల సంఖ్య 1,05,298కి చేరుకుంది. సగటున ప్రతీరోజు 757 మంది బాప్తిస్మం తీసుకున్నారు!

2 అంత అభివృద్ధి జరుగుతుంది కాబట్టి, సంఘాల్లో బోధించడానికి, మందను కాయడానికి అర్హులైన సహోదరుల అవసరం పెరుగుతోంది. (ఎఫె. 4:13) ఎన్నో సంవత్సరాలుగా యెహోవా తన గొర్రెల అవసరాలను చూసుకునేందుకు అర్హతగల పురుషులను నియమిస్తూ వచ్చాడు. భవిష్యత్తులో కూడా అలాగే చేస్తాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు. అంత్యదినాల్లో యెహోవా ప్రజలకు ‘ఏడుగురు గొర్రెల కాపరులు, ఎనిమిదిమంది ప్రధానులు’ ఉంటారని మీకా 5:5లో హామీ ఇవ్వబడింది. నాయకత్వం వహించే సమర్థులైన పురుషులు చాలామంది యెహోవా ప్రజల మధ్య ఉంటారని ఆ వచనాన్ని బట్టి తెలుస్తోంది.

3. ‘ఆత్మను బట్టి విత్తడం’ అంటే ఏమిటో వివరించండి.

3 మీరు బాప్తిస్మం తీసుకున్న సహోదరులైతే, సంఘంలో బాధ్యతలు చేపట్టేందుకు మీరెలా అర్హత సంపాదించుకోవచ్చు? ప్రాముఖ్యంగా, ‘ఆత్మనుబట్టి విత్తడం’ ద్వారా మీరలా చేయవచ్చు. (గల. 6:8) ఆత్మనుబట్టి విత్తాలంటే దేవుని పరిశుద్ధాత్మ మీ జీవితంలో పనిచేసే విధంగా నడుచుకోవాలి. ‘శరీరేచ్ఛలనుబట్టి విత్తకూడదు’ అని నిశ్చయించుకోవాలి. సౌకర్యాలు, కాలక్షేపం, వినోదం వంటి వాటివల్ల దేవుని సేవలో మీ ఉత్సాహం నీరుగారకుండా చూసుకోవాలి. క్రైస్తవులందరూ ‘ఆత్మను బట్టి విత్తాలి.’ ముఖ్యంగా సహోదరులు అలా చేస్తే, కొంతకాలానికి వారు సంఘంలో మరిన్ని బాధ్యతలు చేపట్టేందుకు అర్హులు కావచ్చు. ఇప్పుడు సంఘాల్లో పరిచర్య సేవకుల, పెద్దల అవసరం ఎంతో ఉంది కాబట్టి, ఈ ఆర్టికల్‌ ప్రత్యేకంగా క్రైస్తవ పురుషులను ఉద్దేశించి రాయబడింది. అందుకే, సహోదరులారా దీన్ని ప్రార్థనాపూర్వకంగా పరిశీలించమని మిమ్మల్ని కోరుతున్నాం.

దొడ్డ పనికోసం అర్హులుకండి

4, 5. (ఎ) బాప్తిస్మం తీసుకున్న సహోదరులు సంఘంలోని ఏ బాధ్యతలను చేపట్టేందుకు కృషిచేయాలి? (బి) ఎలా వాటికి అర్హత సంపాదించాలి?

4 ఎలాంటి కృషి లేకుండా ఓ క్రైస్తవ సహోదరుడు పైవిచారణకర్త కాలేడు. ఆయన ఈ “దొడ్డపని” కోసం అర్హత సంపాదించుకోవాలి. (1 తిమో. 3:1) దానిలో భాగంగా ఆయన తోటి విశ్వాసుల అవసరాల పట్ల నిజమైన శ్రద్ధ తీసుకుంటూ వారికి సేవ చేయాలి. (యెషయా 32:1, 2 చదవండి.) మంచి ఉద్దేశంతో అర్హత సంపాదించాలని కోరుకునే వ్యక్తికి అధికారదాహం ఉండదు కానీ, ఇతరులకు మేలు చేయాలనే నిస్వార్థమైన కోరిక ఉంటుంది.

5 లేఖనాల్లో ఇవ్వబడిన అర్హతలను పొందేందుకు కృషిచేయడం ద్వారా ఒక సహోదరుడు పరిచర్య సేవకునిగా, ఆ తర్వాత పైవిచారణకర్తగా నియమించబడేందుకు అర్హుడౌతాడు. (1 తిమో. 3:1-10, 12, 13; తీతు 1:5-9) మీరు సమర్పించుకున్న సహోదరులైతే మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘ప్రకటనాపనిలో నేను పూర్తిగా భాగం వహిస్తున్నానా? పూర్తిగా భాగం వహించేలా ఇతరులకు కూడా సహాయం చేస్తున్నానా? నా తోటి విశ్వాసుల బాగోగుల విషయంలో నిజమైన శ్రద్ధ చూపిస్తూ వారిని బలపరుస్తున్నానా? దేవుని వాక్యాన్ని చక్కగా అధ్యయనం చేసే వ్యక్తిగా నాకు పేరుందా? నేనిచ్చే వ్యాఖ్యానాలను మెరుగుపరచుకుంటున్నానా? సంఘ పెద్దలు నాకు అప్పగించిన బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తిస్తున్నానా?’ (2 తిమో. 4:5) ఇలాంటి ప్రశ్నల గురించి మీరు తీవ్రంగా ఆలోచించాలి.

6. సంఘ బాధ్యతలను చేపట్టేందుకు కావాల్సిన అర్హతలు సంపాదించడానికి ముఖ్యంగా ఏమి చేయాలి?

6 సంఘ బాధ్యతలను చేపట్టేందుకు అర్హులు కావాలంటే మరొకటి కూడా చేయాలి. ‘అంతరంగ పురుషునియందు శక్తికలిగి దేవుని ఆత్మవల్ల బలపరచబడాలి.’ (ఎఫె. 3:15-18) క్రైస్తవ సంఘంలో పరిచర్య సేవకుడు లేదా పైవిచారణకర్త కావడమంటే ఏదో ఒక స్థానానికి ఎన్నుకోబడడం కాదు. యెహోవాతో మన సంబంధాన్ని బలపర్చుకుంటేనే అది సాధ్యమౌతుంది. అయితే, ఆ సంబంధాన్ని ఎలా బలపరచుకోవచ్చు? ‘ఆత్మానుసారంగా నడుచుకుంటూ’ దాని ఫలాన్ని ఫలించడం ద్వారా అలా చేయవచ్చు. (గల. 5:16, 22, 23) అదనపు బాధ్యతలు చేపట్టేందుకు కావాల్సిన ఆధ్యాత్మిక లక్షణాలు సంపాదించారని చూపిస్తూ, ప్రగతి సాధించేందుకు ఇవ్వబడే సలహాలను అన్వయించుకుంటుండగా మీ ‘అభివృద్ధి అందరికి తేటగా కనిపిస్తుంది.’—1 తిమో. 4:15.

స్వయంత్యాగ స్ఫూర్తి అవసరం

7. ఇతరులకు సేవ చేయాలంటే ఏమి చేయాలి?

7 ఇతరులకు సేవ చేయాలంటే ఎంతో కష్టపడాలి, స్వయంత్యాగ స్ఫూర్తి చూపించాలి. క్రైస్తవ పైవిచారణకర్తలు ఆధ్యాత్మిక కాపరులు కాబట్టి మందకు సంబంధించిన సమస్యల గురించి వారెంతో ఆలోచిస్తారు. కాపరి పనికి సంబంధించిన బాధ్యతలు అపొస్తలుడైన పౌలును ఎలా ప్రభావితం చేశాయో గమనించండి. ఆయన కొరింథులోని తోటి విశ్వాసులకు ఇలా చెప్పాడు: “మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని, మీయెడల నాకు కలిగియున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలిసికొనవలెనని, నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని.” (2 కొరిం. 2:4) దీన్నిబట్టి, పౌలు తన పనికే అంకితమయ్యాడని స్పష్టమౌతోంది.

8, 9. బైబిలు కాలంలోని కొంతమంది పురుషులు ఇతరుల అవసరాలపట్ల ఎలా శ్రద్ధ చూపించారో చెప్పండి.

8 యెహోవా సేవకుల కోసం శ్రమించిన పురుషులు ఎల్లప్పుడూ స్వయంత్యాగ స్ఫూర్తిని కనబరిచారు. ఉదాహరణకు, నోవహు తన ఇంటివారితో, ‘ఓడ పని పూర్తయ్యాక చెప్పండి, నేను మీతో వస్తాను’ అని చెప్పినట్లు మనం ఊహించలేం. మోషే ఐగుప్తులోని ఇశ్రాయేలీయులతో, ‘ఎర్ర సముద్రం దగ్గర కలుసుకుందాం. మీరు ఏదో విధంగా అక్కడికి చేరుకోండి’ అని చెప్పలేదు. అలాగే యెహోషువ, ‘యెరికో పట్టణపు గోడలు కూలినప్పుడు నాకు చెప్పండి’ అని అనలేదు. యెషయా ఎవరినో చూపించి, ‘ఆయన ఉన్నాడు. ఆయనను పంపు’ అని అనలేదు.—యెష. 6:8.

9 దేవుని ఆత్మ నిర్దేశానుసారంగా నడిచినవారిలో అత్యంత గొప్ప మాదిరి యేసుక్రీస్తే. మానవుల విమోచకునిగా తనకు ఇవ్వబడిన నియామకాన్ని ఆయన ఇష్టపూర్వకంగా అంగీకరించాడు. (యోహా. 3:16) ఆయన స్వయంత్యాగపూరితమైన ప్రేమను పరిశీలించినప్పుడు మనం కూడా స్వయంత్యాగ స్ఫూర్తిని చూపించాలని అనిపించడంలేదా? ఎంతోకాలంగా సంఘ పెద్దగా సేవచేస్తున్న ఓ సహోదరుడు మంద పట్ల తనకున్న భావాలను ఇలా చెప్పాడు: “‘నా గొర్రెలను కాయుము’ అని యేసు పేతురుతో అన్న మాటలు నన్ను ఎంతగానో కదిలించాయి. ప్రేమతో కొన్ని మాటలు చెప్పినా లేదా దయతో చిన్న సహాయం చేసినా అది ఓ వ్యక్తిని ఎంతగా ప్రోత్సహిస్తుందో నేను ఇప్పటికి ఎన్నోసార్లు గమనించాను. కాపరి పనిని నేను ఎంతో ఇష్టపడతాను.”—యోహా. 21:16.

10. ఇతరులకు సేవ చేసే విషయంలో క్రైస్తవ సహోదరులు యేసును అనుకరించాలంటే వారికి ఏ లక్షణాలు అవసరం?

10 సంఘంలోని సమర్పిత సహోదరులు దేవుని మందతో యేసు ప్రవర్తించినట్లే ప్రవర్తించాలని తప్పక కోరుకుంటారు. ఆయన ఇలా అన్నాడు: “నేను మీకు విశ్రాంతి కలుగజేతును.” (మత్త. 11:28) క్రైస్తవ పురుషులకు దేవుని పట్ల విశ్వాసం, సంఘం పట్ల ప్రేమ ఉన్నట్లయితే ఈ దొడ్డ పని చేయడం ఎంతో కష్టమని, దానికోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుందని అనుకోరు గానీ దానికి అర్హత సంపాదించుకోవడానికి కృషిచేస్తారు. మరిన్ని బాధ్యతలు చేపట్టేందుకు కావాల్సిన అర్హతలు సంపాదించుకోవడం ఇష్టంలేని సహోదరుని విషయమేమిటి? సంఘంలో సేవ చేయాలనే కోరికను ఆయన పెంపొందించుకోగలడా?

ఇతరులకు సేవచేయాలనే కోరికను పెంపొందించుకోండి

11. ఇతరులకు సేవచేయాలనే కోరికను ఒక సహోదరుడు ఎలా పెంపొందించుకోవచ్చు?

11 బాధ్యతలు చేపట్టేందుకు కావాల్సిన సామర్థ్యం, అర్హత లేదనుకొని మీరు వెనకడుగు వేస్తుంటే పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించడం మంచిది. (లూకా 11:13) ఈ విషయంలో మీకు ఎలాంటి చింత ఉన్నా దాన్ని అధిగమించేందుకు యెహోవా ఆత్మ సహాయం చేస్తుంది. ఒక సహోదరుడు సంఘంలో బాధ్యతలు చేపట్టేలా అర్హత సంపాదించడానికి కృషి చేసేందుకు యెహోవా ఆత్మ ప్రేరణనిస్తుంది. అంతేకాక ఆ పవిత్ర సేవ చేయడానికి కావాల్సిన బలాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఆ కోరిక దేవుడే కలిగిస్తాడని చెప్పవచ్చు. (ఫిలి. 2:13; 4:13) సంఘంలో మరిన్ని బాధ్యతలను అంగీకరించాలనే కోరికను పెంపొందించుకునేందుకు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించడం సమంజసమే.—కీర్తన 25:4, 5 చదవండి.

12. తనకు అప్పగించబడిన బాధ్యతలను నిర్వర్తించేందుకు కావాల్సిన జ్ఞానాన్ని ఓ సహోదరుడు ఎలా సంపాదించుకోవచ్చు?

12 మందకు వివిధ అవసరాలు ఉంటాయని, వాటిని చూసుకోవడానికి ఎంతో సమయం పోతుందని అనిపించి ఓ క్రైస్తవుడు, బాధ్యతలు చేపట్టేందుకు కావాల్సిన అర్హతలు సంపాదించుకోవడానికి కృషిచేయకపోవచ్చు. లేదా బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన జ్ఞానం తనకు లేదని ఆయన అనుకోవచ్చు. అలాగైతే, ఆయన దేవుని వాక్యాన్ని, బైబిలు సాహిత్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఆయన తనను తాను ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘దేవుని వాక్యాన్ని చదవడానికి నేను సమయాన్ని కేటాయిస్తున్నానా? నేను జ్ఞానం కోసం దేవునికి ప్రార్థిస్తున్నానా?’ శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు: “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.” (యాకో. 1:5) దైవ ప్రేరణతో రాయబడిన ఈ మాటలను మీరు నమ్ముతున్నారా? సొలొమోను చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడు ఆయనకు “బుద్ధి వివేకములు గల హృదయము[ను]” అనుగ్రహించాడు. దానివల్ల ఆయన తీర్పు తీరుస్తున్నప్పుడు మంచిచెడులను వివేచించగలిగాడు. (1 రాజు. 3:7-14) నిజానికి, సొలొమోను విషయంలో జరిగింది ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. అయినా, సంఘ బాధ్యతలు అప్పగించబడిన సహోదరులు దేవుని గొర్రెలను బాగుగా చూసుకునేలా దేవుడు వారికి కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు.—సామె. 2:6.

13, 14. (ఎ) పౌలు ‘క్రీస్తు ప్రేమను’ మనసులో ఉంచుకొని ఎలా ప్రవర్తించాడు? (బి) ‘క్రీస్తు ప్రేమను’ మనసులో ఉంచుకొని మనం ఎలా ప్రవర్తించాలి?

13 ఇతరులకు సేవచేయాలనే కోరికను పెంపొందించుకోవాలంటే మరొకటి కూడా చేయాలి. యెహోవా, ఆయన కుమారుడు మన కోసం చేసిన వాటన్నిటి గురించి తీవ్రంగా ఆలోచించాలి. ఉదాహరణకు, 2 కొరింథీయులు 5:14, 15 వచనాలను పరిశీలించండి. (చదవండి.) ‘క్రీస్తు ప్రేమ మనల్ని’ ఎలా ‘బలవంతం చేస్తుంది?’ దేవుని చిత్తానికి అనుగుణంగా క్రీస్తు మనకోసం తన జీవాన్ని అర్పించాడు. అలా అర్పించి ఆయన ఎంత గొప్పగా తన ప్రేమను చూపించాడంటే దానిపట్ల మన అవగాహన, కృతజ్ఞత పెరిగేకొద్దీ మన హృదయం కదిలించబడుతుంది. పౌలు ప్రతీది క్రీస్తు ప్రేమను మనసులో ఉంచుకొనే చేశాడు. అందుకే ఆయన నిస్వార్థంగా ప్రవర్తించాడు. దేవుణ్ణి సేవించడానికీ, సంఘం లోపల, వెలుపల ఉన్న తోటి మానవులకు సేవ చేయడానికీ ఆయన ప్రాముఖ్యతనిచ్చాడు.

14 ప్రజలపట్ల క్రీస్తుకున్న ప్రేమను గురించి ధ్యానిస్తే మన హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగుతుంది. అప్పుడు మనం ‘శరీరేచ్ఛలనుబట్టి విత్తుతూ’ ఉండడం ఎంత మాత్రం సరైనది కాదని గుర్తిస్తాం. అంటే స్వార్థపూరితమైన లక్ష్యాలను సాధించేందుకు కృషిచేయం. మన సొంత కోరికలను తీర్చుకునేందుకే ప్రాముఖ్యతనివ్వం. బదులుగా, దేవుడు మనకు అప్పగించిన పనికి మొదటి స్థానమిచ్చేందుకు మన జీవితంలో అవసరమైన మార్పులను చేసుకుంటాం. సహోదరుల పట్ల ప్రేమతో వారికి ‘దాసులముగా’ ఉండాలనుకుంటాం. (గలతీయులు 5:13 చదవండి.) యెహోవా సమర్పిత సేవకుల కోసం వినయంతో సేవచేసే దాసులముగా మనల్ని మనం పరిగణించుకుంటే మనం ఇతరులకు గౌరవమర్యాదలనిస్తాం. సాతాను ప్రోత్సహించిన విమర్శనాత్మక ధోరణిని, ఇతరులను నిందించే ధోరణిని మనం అనుకరించం.—ప్రక. 12:10.

కుటుంబమంతా కలిసి కృషిచేయాలి

15, 16. ఓ సహోదరుడు పరిచర్య సేవకునిగా లేదా పెద్దగా నియమించబడేందుకు అర్హుడయ్యే విషయంలో ఆయన భార్యాపిల్లలు ఏ పాత్ర పోషిస్తారు?

15 ఒకవేళ ఓ సహోదరుడు వివాహితుడైతే, ఆయన పరిచర్య సేవకునిగా లేదా పెద్దగా సేవచేసేందుకు అర్హుడా కాదా అని నిర్ణయించేటప్పుడు ఆయన భార్యాపిల్లల పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఆయన కుటుంబ ఆధ్యాత్మిక పరిస్థితిని, సమాజంలో, సంఘంలో వారికున్న పేరును పరిగణలోకి తీసుకుంటారు. సంఘంలో పరిచర్య సేవకునిగా లేదా పెద్దగా సేవచేయడానికి కుటుంబ శిరస్సు ప్రయత్నిస్తుండగా కుటుంబ సభ్యులు ఆయనకు మద్దతు ఇవ్వడం ఎంత ప్రాముఖ్యమో దీన్నిబట్టి తెలుస్తోంది.—1 తిమోతి 3:4, 5, 12 చదవండి.

16 ఓ క్రైస్తవ కుటుంబంలోని సభ్యులంతా ఒకరికొకరు సహకరించుకుంటే యెహోవా సంతోషిస్తాడు. (ఎఫె. 3:14, 15) ఇటు సంఘ బాధ్యతలు నిర్వర్తిస్తూ అటు తన ఇంటివారిని ‘బాగుగా ఏలాలంటే’ సమతుల్యత అవసరం. కాబట్టి, తన భార్యాపిల్లలు కుటుంబ ఆరాధన నుండి ప్రయోజనం పొందేలా ఓ పెద్ద లేదా పరిచర్య సేవకుడు ప్రతీవారం వారితో కలిసి బైబిలు అధ్యయనం చేయడం చాలా ప్రాముఖ్యం. వారితో కలిసి క్రమంగా పరిచర్యలో పాల్గొనాలి. అదే సమయంలో, కుటుంబ సభ్యులు కూడా తమ ఇంటి శిరస్సు చేస్తున్న ప్రయత్నాలకు తగిన సహకారాన్ని అందించడం ప్రాముఖ్యం.

మీరు మళ్లీ సేవచేస్తారా?

17, 18. (ఎ) ఓ సహోదరుడు పరిచర్య సేవకునిగా లేదా పెద్దగా సేవచేసేందుకు కావాల్సిన అర్హతలను కోల్పోయినట్లయితే, ఆయన ఏమి చేయవచ్చు? (బి) గతంలో పెద్దగా లేదా పరిచర్య సేవకునిగా సేవచేసిన సహోదరుడు ఎలాంటి వైఖరిని కనబరచాలి?

17 మీరు ఒకప్పుడు పరిచర్య సేవకునిగా లేదా పెద్దగా సేవచేసి ఉంటారు. కానీ ఏదో కారణాన్ని బట్టి ఇప్పుడు ఆ బాధ్యత నిర్వర్తిస్తుండకపోవచ్చు. అయితే మీరు యెహోవాను ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయనకు మీపట్ల ఇప్పటికీ శ్రద్ధవుంది. (1 పేతు. 5:6, 7) మీరు కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరముందని పెద్దలు మీకు చెప్పారా? మీ తప్పును ఒప్పుకొని, దేవుని సహాయంతో వాటిని సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉండండి. సంఘంపై కోపాన్ని పెంచుకోకుండా జాగ్రత్తపడండి. జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తూ సానుకూలంగా ఆలోచించండి. ఎన్నో సంవత్సరాలు పెద్దగా సేవచేసి, ఆ తర్వాత ఆ సేవాధిక్యతను కోల్పోయిన ఓ సహోదరుడు ఇలా అన్నాడు: “పెద్దగా ఉన్నప్పుడు నేను ఏ విధంగా కూటాలకు హాజరౌతూ, పరిచర్యలో పాల్గొంటూ బైబిలు అధ్యయనం చేస్తూ ఉండేవాడినో ఆ విధంగానే ఆ తర్వాత కూడా కొనసాగాను. ఒకట్రెండు సంవత్సరాల్లో మళ్లీ నేను సంఘ పెద్దను అవుతానని అనుకున్నాను, కానీ ఆ నియామకాన్ని మళ్లీ పొందడానికి దాదాపు ఏడేళ్లు పట్టింది. ఆ సమయంలో నేను ఓపిగ్గా వేచివుండడం నేర్చుకున్నాను. అలయక కృషి చేస్తూ ఉండాలని ఇవ్వబడిన ప్రోత్సాహం ఆ సమయంలో నాకు ఎంతగానో సహాయం చేసింది.”

18 మీ పరిస్థితి కూడా అదే అయితే, నిరుత్సాహపడకండి. మీ పరిచర్యను, కుటుంబాన్ని యెహోవా ఎలా ఆశీర్వదిస్తున్నాడో ఆలోచించండి. మీ కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా బలపర్చండి, అనారోగ్యంతో ఉన్నవారిని సందర్శించండి, బలహీనులను ప్రోత్సహించండి. అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, దేవుణ్ణి స్తుతించే విషయంలో, ఓ యెహోవాసాక్షిగా రాజ్యసువార్తను ప్రకటించే విషయంలో మీకున్న గొప్ప అవకాశాన్ని విలువైనదిగా ఎంచండి. aకీర్త. 145:1, 2; యెష. 43:10-12.

ఓ కొత్త కోణంలో మీ పరిస్థితులను చూడండి

19, 20. (ఎ) బాప్తిస్మం తీసుకున్న సహోదరులు ఏమి చేయాలని ప్రోత్సహించబడుతున్నారు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చర్చించబడుతుంది?

19 పైవిచారణకర్తల, పరిచర్య సేవకుల అవసరం గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువగా ఉంది. కాబట్టి బాప్తిస్మం తీసుకున్న సహోదరులారా, మీ పరిస్థితులను ఓ కొత్త కోణంలో చూస్తూ, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం: ‘నేను ఇంకా ఓ పరిచర్య సేవకునిగా లేదా పెద్దగా నియమించబడనట్లయితే, దానికి కారణాలేమిటి?’ ఈ ప్రాముఖ్యమైన విషయంలో మీకు సరైన వైఖరి ఉండేలా దేవుని పరిశుద్ధాత్మ సహాయం చేయును గాక.

20 సంఘ సభ్యులందరూ తమ తోటి విశ్వాసులు దైవభక్తితో చేసే త్యాగాల నుండి ప్రయోజనం పొందుతారు. మనం దయాపూర్వకంగా, నిస్వార్థంగా పనులు చేస్తే ఇతరులకు సేవ చేయడంవల్ల, ఆత్మనుబట్టి విత్తడం వల్ల వచ్చే ఆనందాన్ని చవిచూస్తాం. అయితే, మనం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. మనం దాన్ని దుఃఖపరచకూడదంటే ఏమి చేయాలో తర్వాతి ఆర్టికల్‌ వివరిస్తుంది.

[అధస్సూచి]

మీరెలా జవాబిస్తారు?

మీకా 5:5లోని ప్రవచనం మనకు ఏ అభయాన్నిస్తోంది?

• స్వయంత్యాగ స్ఫూర్తిని కనబరచాలంటే ఏమి చేయాలి?

• ఇతరులకు సేవ చేయాలనే కోరికను ఓ సహోదరుడు ఎలా పెంపొందించుకోవచ్చు?

• ఓ సహోదరుడు పరిచర్య సేవకునిగా లేదా పెద్దగా అర్హుడయ్యే విషయంలో భార్యాపిల్లల సహకారం ఎంత ప్రాముఖ్యం?

[అధ్యయన ప్రశ్నలు]

[25వ పేజీలోని చిత్రాలు]

సంఘంలో బాధ్యతలు చేపట్టేందుకు అర్హులు కావాలంటే మీరు ఏమి చేయాలి?