కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

స్త్రీలారా, మీరెందుకు శిరస్సత్వానికి లోబడాలి?

స్త్రీలారా, మీరెందుకు శిరస్సత్వానికి లోబడాలి?

స్త్రీలారా, మీరెందుకు శిరస్సత్వానికి లోబడాలి?

“స్త్రీకి శిరస్సు పురుషుడు.”—1 కొరిం. 11:3.

1, 2. (ఎ) శిరస్సత్వం విషయంలో, దానికి లోబడే విషయంలో యెహోవా చేసిన ఏర్పాటు గురించి అపొస్తలుడైన పౌలు ఏమి రాశాడు? (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నలను పరిశీలిస్తాం?

 యెహోవా ఓ వ్యవస్థీకృత విధానాన్ని ఏర్పరిచాడు. “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు,” “క్రీస్తునకు శిరస్సు దేవుడు” అని చెప్పినప్పుడు అపొస్తలుడైన పౌలు దాని గురించే ప్రస్తావించాడు. (1 కొరిం. 11:3) యేసు తన శిరస్సు అయిన యెహోవా దేవునికి లోబడి ఉండడాన్ని ఓ గౌరవంగా భావించాడని, అలా ఉండడానికి ఇష్టపడ్డాడని ముందటి ఆర్టికల్‌లో చూశాం. క్రైస్తవ పురుషులకు శిరస్సు క్రీస్తు అనే విషయం కూడా తెలుసుకున్నాం. క్రీస్తు ప్రజల పరిస్థితులను అర్థం చేసుకుంటూ వారితో దయగా, మృదువుగా, నిస్వార్థంగా వ్యవహరించాడు. సంఘంలోని పురుషులు కూడా ఇతరులతో, ముఖ్యంగా తమ భార్యలతో ఆ విధంగా వ్యవహరించాలి.

2 మరి స్త్రీల విషయమేమిటి? వారి శిరస్సు ఎవరు? “స్త్రీకి శిరస్సు పురుషుడు” అని పౌలు రాశాడు. దైవ ప్రేరణతో రాయబడిన ఆ మాటలను స్త్రీలు ఎలా పరిగణించాలి? సత్యంలో లేని భర్తకు కూడా లోబడివుండాలా? భార్య తన భర్త శిరస్సత్వానికి లోబడాలని చెప్పబడింది కాబట్టి, భర్త నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆమె తన అభిప్రాయాన్ని అస్సలు చెప్పకూడదని దానర్థమా? ఒక స్త్రీ కొనియాడబడాలంటే ఏమి చేయాలి?

‘వాని కోసం సాటియైన సహాయమును చేయుదును’

3, 4. శిరస్సత్వపు ఏర్పాటువల్ల వివాహ జీవితంలో ప్రయోజనాలున్నాయని ఎందుకు చెప్పవచ్చు?

3 దేవుడే శిరస్సత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆదాము సృష్టించబడిన తర్వాత, “నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదును” అని యెహోవా దేవుడు అనుకున్నాడు. హవ్వ సృష్టించబడిన తర్వాత తనకు జీవిత భాగస్వామి, సహాయకురాలు దొరికినందుకు ఆదాము ఎంత సంతోషించాడంటే ఆమెను చూసి, “నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము” అని అన్నాడు. (ఆది. 2:18-24) పరిపూర్ణమైన మానవజాతికి తల్లిదండ్రులయ్యే అద్భుతమైన అవకాశం వారికి ఇవ్వబడింది. వారికి పుట్టిన పిల్లలు భూపరదైసులో నిరంతరం సంతోషంగా జీవించి ఉండేవారు.

4 అయితే, ఆదాముహవ్వల తిరుగుబాటు కారణంగా ఏదెను తోటలో ఓ పరిపూర్ణ పరిస్థితిలో జీవించే అవకాశం చేజారిపోయింది. (రోమీయులు 5:12 చదవండి.) కానీ, యెహోవా శిరస్సత్వపు ఏర్పాటును మాత్రం తీసివేయలేదు. అటు భర్త తన శిరస్సత్వాన్ని సరైన విధంగా నిర్వర్తిస్తూ, ఇటు భార్య దానికి లోబడుతూ ఉన్నట్లయితే, తమ వివాహ జీవితంలో వారిద్దరూ ఎన్నో ప్రయోజనాల్ని, ఎంతో సంతోషాన్ని పొందుతారు. అప్పుడు, తన శిరస్సు అయిన యెహోవాకు లోబడివుండే విషయంలో యేసుకు ఎలా అనిపించిందో భార్యకు కూడా అలాగే అనిపిస్తుంది. భూమ్మీదకు రాకముందు యేసు ‘నిత్యము యెహోవా సన్నిధిలో ఆనందించాడు.’ (సామె. 8:30) అపరిపూర్ణత వల్ల, పురుషులు తమ శిరస్సత్వాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించలేకపోతున్నారు. స్త్రీలు కూడా పరిపూర్ణ స్థాయిలో లోబడలేకపోతున్నారు. కానీ ఈ విషయంలో భార్యాభర్తలు తాము చేయగలిగినదంతా చేస్తే, ప్రస్తుత విధానంలో కూడా వారు సాధ్యమైనంత ఎక్కువ సంతోషాన్ని అనుభవించవచ్చు.

5. భార్యాభర్తలిద్దరూ రోమీయులు 12:10 లోని ఉపదేశాన్ని ఎందుకు పాటించాలి?

5 వివాహ జీవితం విజయవంతం కావాలంటే, భార్యాభర్తలిద్దరూ క్రైస్తవులకు ఇవ్వబడిన ఈ లేఖన ఉపదేశాన్ని పాటించడం ఎంతో అవసరం: “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.” (రోమా. 12:10) అంతేకాదు, భార్యాభర్తలిద్దరూ ‘ఒకరిపట్ల ఒకరు దయగలిగి కరుణాహృదయులై ఒకరినొకరు క్షమించుకోవడానికి’ కృషి చేయాలి.—ఎఫె. 4:32.

మీ భాగస్వామి సత్యంలో లేకపోతే

6, 7. క్రైస్తవురాలైన భార్య తన అవిశ్వాసియైన భర్తకు లోబడి ఉన్నట్లయితే ఎలాంటి ఫలితాలు రావచ్చు?

6 ఒకవేళ మీ భాగస్వామి యెహోవా ఆరాధకులు కాకపోతే అప్పుడేమి చేయాలి? సాధారణంగా ఎక్కువశాతం భర్తలే అవిశ్వాసులుగా ఉంటారు. అలాంటి కుటుంబంలో భార్య తన భర్తతో ఎలా వ్యవహరించాలి? బైబిలు దానికిలా జవాబిస్తోంది: “స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.”—1 పేతు. 3:1, 2.

7 అవిశ్వాసియైన తన భర్తకు భార్య లోబడి ఉండాలని దేవుని వాక్యం చెబుతోంది. భర్త ఆమె మంచి ప్రవర్తనను చూసి, ఆమె అలా ప్రవర్తించడానికి కారణమేమిటో తెలుసుకోవాలనుకోవచ్చు. దానివల్ల ఆయన క్రైస్తవురాలైన తన భార్య నమ్మకాల గురించి తెలుసుకొని కొంతకాలానికి సత్యాన్ని అంగీకరించవచ్చు.

8, 9. భార్య మంచి ప్రవర్తనను చూసి కూడా ఒకవేళ అవిశ్వాసియైన భర్త సానుకూలంగా స్పందించకపోతే ఆమె ఏమి చేయాలి?

8 ఒకవేళ అవిశ్వాసియైన భర్త సానుకూలంగా స్పందించకపోతే అప్పుడేమి చేయాలి? ఎంత కష్టమైనాసరే ఆమె అన్ని సమయాల్లో క్రైస్తవ లక్షణాలను చూపించాలని లేఖనాలు ప్రోత్సహిస్తున్నాయి. ఉదాహరణకు, 1 కొరింథీయులు 13:4లో మనమిలా చదువుతాం: “ప్రేమ దీర్ఘకాలము సహించును.” కాబట్టి, ఓ క్రైస్తవ భార్య ప్రేమతో పరిస్థితులకు సర్దుకుపోతూ, “దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను” నడుచుకోవడం మంచిది. (ఎఫె. 4:1-3) దేవుని పరిశుద్ధాత్మ సహాయం ఉంటే కష్ట పరిస్థితుల్లో కూడా వారు క్రైస్తవ లక్షణాలను చూపించగలుగుతారు.

9 “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను” అని పౌలు రాశాడు. (ఫిలి. 4:13) మామూలుగా సాధ్యంకాని ఎన్నో పనులు చేయడానికి దేవుని పరిశుద్ధాత్మ క్రైస్తవ భాగస్వామికి సహాయం చేస్తుంది. ఉదాహరణకు, భర్త లేదా భార్య క్రూరంగా ప్రవర్తించినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనిపించవచ్చు. అయితే, క్రైస్తవులందరికీ బైబిలు ఇలా ఉపదేశిస్తోంది: “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు . . . పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.” (రోమా. 12:17-19) అదేవిధంగా, 1 థెస్సలొనీకయులు 5:15 కూడా ఇలా ఉపదేశిస్తోంది: “ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి; మీరు ఒకనియెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి.” పరిశుద్ధాత్మ సహాయంతో, మనం మన స్వశక్తితో చేయలేనివాటిని కూడా చేయగలుగుతాం. మనకు కొదువగా ఉన్నది పొందేలా పరిశుద్ధాత్మను అనుగ్రహించమని దేవునికి ప్రార్థించడం ఎంత సముచితం!

10. తనతో నిర్దయగా మాట్లాడిన, ప్రవర్తించిన వారితో యేసు ఎలా వ్యవహరించాడు?

10 తనను దూషించినవారితో లేదా తనకు బాధకలిగించే పనులు చేసిన వారితో వ్యవహరించే విషయంలో యేసు మంచి మాదిరిని ఉంచాడు. “ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను” అని 1 పేతురు 2:23 చెబుతోంది. ఆయన మంచి మాదిరిని అనుకరించాలని మనం ప్రోత్సహించబడుతున్నాం. ఇతరుల చెడు ప్రవర్తననుబట్టి కోపం తెచ్చుకోకండి. క్రైస్తవులముగా మనం ‘కరుణాచిత్తులముగా, వినయమనస్కులముగా’ ఉంటూ “కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణయైనను చేయక” ఉండాలని ప్రోత్సహించబడ్డాం.—1 పేతు. 3:8, 9.

మౌనంగా ఉండాలా?

11. కొంతమంది క్రైస్తవ స్త్రీలకు ఏ గొప్ప సేవాధిక్యత ఉంది?

11 శిరస్సత్వానికి లోబడడమంటే కుటుంబానికి సంబంధించిన నిర్ణయాల్లో, మరితర విషయాల్లో ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండాలని దానర్థమా? కాదు. యెహోవా పురుషులకే కాక స్త్రీలకు కూడా ఎన్నో సేవాధిక్యతలు ఇచ్చాడు. 1,44,000 మందికి ఉన్న గొప్ప సేవాధిక్యత గురించి ఆలోచించండి! వారు క్రీస్తుతోపాటు రాజులుగా యాజకులుగా ఉంటారు. వారిలో స్త్రీలు కూడా ఉన్నారు. (గల. 3:26-29) యెహోవా తన ఏర్పాట్లలో స్త్రీలకు ఓ క్రియాశీల పాత్రను ఇచ్చాడని దీన్నిబట్టి అర్థమౌతోంది.

12, 13. స్త్రీలు ప్రవచించారని చెప్పేందుకు ఓ ఉదాహరణ ఇవ్వండి.

12 ఉదాహరణకు, బైబిలు కాలాల్లో కొంతమంది స్త్రీలు ప్రవచించారు. యోవేలు 2:28, 29లో ఇలా ప్రవచించబడింది: “నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు . . . ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మరింతును.”

13 సా.శ. 33 పెంతెకొస్తు రోజున, మేడ గదిలో సమకూడిన 120 మంది శిష్యుల్లో పురుషులతోపాటు స్త్రీలు కూడా ఉన్నారు. అక్కడ సమకూడిన వారందరిపైన దేవుని పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. అందుకే పేతురు యోవేలు ప్రవక్త ప్రవచించిన మాటలను ఉల్లేఖిస్తూ వాటిని ఇటు పురుషులకు, అటు స్త్రీలకు అన్వయించాడు. పేతురు ఇలా చెప్పాడు: “యోవేలు ప్రవక్తద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా —అంత్యదినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు . . . ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్రమీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.”—అపొ. 2:16-18.

14. క్రైస్తవత్వాన్ని వ్యాప్తి చేయడంలో స్త్రీలు ఎలాంటి పాత్ర పోషించారు?

14 మొదటి శతాబ్దంలో, క్రైస్తవత్వాన్ని వ్యాప్తి చేయడంలో స్త్రీలు ప్రముఖ పాత్ర పోషించారు. వారు ఇతరులకు దేవుని రాజ్యం గురించి ప్రకటించారు, ప్రకటనా పనికి సంబంధించిన పనులు చేశారు. (లూకా 8:1-3) ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు ఫీబేను ‘కెంక్రేయలో ఉన్న క్రీస్తుసంఘంలో సేవకురాలు’ అని పిలిచాడు. ఆయన తోటి క్రైస్తవులకు వందనాలు తెలియజేస్తున్నప్పుడు కొంతమంది నమ్మకమైన స్త్రీల పేర్లను ప్రస్తావిస్తూ “ప్రభువులో ప్రయాసపడే త్రుఫైనాకూ త్రుఫోసాకూ అభివందనాలు” అని చెప్పాడు. అంతేకాక, “ప్రియమైన పెర్సిస్కుకు అభివందనాలు ఆమె ప్రభువులో అధికంగా ప్రయాసపడింది” అని అన్నాడు.—రోమా. 16:1, 12, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.

15. మన కాలంలో క్రైస్తవత్వాన్ని వ్యాప్తి చేయడంలో స్త్రీలు ఏ పాత్ర పోషిస్తున్నారు?

15 నేడు, ప్రపంచవ్యాప్తంగా 70 లక్షలకన్నా ఎక్కువమంది దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారు. వారిలో స్త్రీలే అధికం. ఆ స్త్రీలలో అన్ని వయసులవారు ఉన్నారు. (మత్త. 24:14) వారిలో చాలామంది పూర్తికాల సేవకులుగా, మిషనరీలుగా, బెతెల్‌ సభ్యులుగా సేవచేస్తున్నారు. కీర్తనకర్తయైన దావీదు ఇలా పాడాడు: “ప్రభువు [యెహోవా] మాట సెలవిచ్చుచున్నాడు. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు.” (కీర్త. 68:11) ఆ మాటలు ముమ్మాటికీ నిజం! సువార్తను ప్రకటించడంలో, తన ఉద్దేశాలు నెరవేర్చడంలో స్త్రీలు పోషించే పాత్రకు యెహోవా ఎంతో విలువిస్తున్నాడు. క్రైస్తవ స్త్రీలు శిరస్సత్వానికి లోబడాలని దేవుడు చెప్పాడంటే దానర్థం వారు మౌనంగా ఉండాలని కాదు.

మౌనంగా ఉండని ఇద్దరు స్త్రీలు

16, 17. కుటుంబంలో నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు స్త్రీలు మౌనంగా ఉండాల్సిన అవసరంలేదని శారా ఉదాహరణ ఎలా చూపిస్తుంది?

16 యెహోవాయే స్త్రీలకు అనేక సేవాధిక్యతలు ఇస్తున్నప్పుడు, పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకునే విషయంలో భర్తలు తమ భార్యలను సంప్రదించడం సరైనది కాదా? అలా సంప్రదించడం తెలివైన పని. తమ భర్తలు అడగకపోయినా తమ అభిప్రాయాన్ని తెలియజేసిన లేదా చర్యలు తీసుకున్న భార్యలున్నారు. అలాంటివారి గురించిన ఎన్నో ఉదాహరణలను బైబిలు ప్రస్తావిస్తోంది. మనం ఇప్పుడు రెండు ఉదాహరణలు చూద్దాం.

17 పూర్వీకుడైన అబ్రాహాము భార్య శారా విషయమే తీసుకోండి. తన దాసి, దాసి కుమారుడు తనపట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నందుకు వారిని పంపించేయమని ఆమె అబ్రాహాముకు చెబుతూ వచ్చింది. “ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను.” కానీ దేవునికి అలా అనిపించలేదు. అందుకే, యెహోవా అబ్రాహాముకు ఇలా చెప్పాడు: “ఈ చిన్నవానిబట్టియు నీ దాసినిబట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా . . . మాట వినుము.” (ఆది. 21:8-12) అబ్రాహాము యెహోవాకు లోబడి శారా మాట విన్నాడు. ఆమె కోరినట్లే చేశాడు.

18. అబీగయీలు ఏ చొరవ తీసుకుంది?

18 నాబాలు భార్యయైన అబీగయీలు గురించి కూడా ఆలోచించండి. అసూయపరుడైన సౌలు రాజును తప్పించుకొని దావీదు పారిపోతున్నప్పుడు ఆయన ధనవంతుడైన నాబాలు మందల దగ్గర బసచేశాడు. దావీదు, ఆయన మనుష్యులు ఆ ధనవంతుడి ఆస్తి దోచుకునే బదులు దాన్ని కాపాడారు. అయితే, నాబాలు ‘మోటువాడు, దుర్మార్గుడు’ కాబట్టి ఆయన దావీదు మనుష్యులతో ‘కఠినంగా మాట్లాడాడు.’ అంతేకాక, ఆయన ‘బహు పనికిమాలినవాడు, మోటుతనం అతని గుణం.’ దావీదు మనుష్యులు తినడానికి ఆహారాన్ని ఇవ్వమని మర్యాదగా అడిగినప్పుడు నాబాలు ఒప్పుకోలేదు. నాబాలు అలా చేశాడని విన్నప్పుడు అబీగయీలు ఏమి చేసింది? నాబాలుకు చెప్పకుండా ఆమె “త్వరపడి రెండువందల రొట్టెలను, రెండు ద్రాక్షారసపు తిత్తులను, వండిన అయిదు గొఱ్ఱెల మాంసమును, అయిదు మానికల వేచిన ధాన్యమును, నూరు ద్రాక్షగెలలను, రెండువందల అంజూరపు అడలను” తనతోపాటు తీసుకువెళ్లి దావీదుకు, ఆయన మనుష్యులకు ఇచ్చింది. అబీగయీలు సరైనదే చేసిందా? ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలను బట్టి ఆమె సరైనదే చేసిందని తెలుస్తుంది. “యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను” అని బైబిలు చెబుతోంది. దావీదు ఆ తర్వాత అబీగయీలును పెళ్లి చేసుకున్నాడు.—1 సమూ. 25:3, 14-19, 23-25, 38-42.

‘కొనియాడబడే స్త్రీ’

19, 20. ఒక స్త్రీ నిజంగా ఎప్పుడు కొనియాడబడుతుంది?

19 యెహోవా ఇష్టపడేలా నడుచుకునే స్త్రీలను బైబిలు మెచ్చుకుంటోంది. సామెతల గ్రంథం ‘గుణవతియైన భార్య’ గురించి ఇలా చెబుతోంది: “అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మికయుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రదుకు దినములన్నియు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు. జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన యింటివారి నడతలను బాగుగా కనిపెట్టును పనిచేయకుండ ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు . . . ఆమె పెనిమిటి ఆమెను పొగడును.”—సామె. 31:10-12, 26-29.

20 ఓ స్త్రీని ఆ విధంగా ఎప్పుడు మెచ్చుకుంటారు? “అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును” అని సామెతలు 31:30 చెబుతోంది. ఆమె యెహోవాపట్ల భయభక్తులు కలిగివుండాలంటే శిరస్సత్వానికి సంబంధించి ఆయన చేసిన ఏర్పాటుకు కూడా ఇష్టపూర్వకంగా లోబడాలి. “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు . . . క్రీస్తునకు శిరస్సు దేవుడు.” అదేవిధంగా “స్త్రీకి శిరస్సు పురుషుడు.”—1 కొరిం. 11:3.

దేవుడు ఇచ్చిన బహుమతిని బట్టి కృతజ్ఞతలు చెల్లించండి

21, 22. (ఎ) దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి వివాహిత క్రైస్తవులకు ఎలాంటి కారణాలున్నాయి? (బి) అధికారం, శిరస్సత్వం విషయంలో యెహోవా చేసిన ఏర్పాట్ల పట్ల మనం ఎందుకు గౌరవం చూపించాలి? (17వ పేజీలోవున్న బాక్సు చూడండి.)

21 వివాహిత క్రైస్తవులు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఎన్నో కారణాలున్నాయి! ఒకటేమిటంటే, వారు అన్యోన్యంగా ఉంటూ సంతోషంగా జీవించగలుగుతారు. వారు ప్రత్యేకంగా మరో కారణాన్నిబట్టి అంటే వారిద్దరూ ఏకమై యెహోవాతో నడిచేందుకు తమకు దొరికిన అవకాశాన్నిబట్టి కూడా వారు కృతజ్ఞతలు చెల్లించవచ్చు. (రూతు 1:9; మీకా 6:8) వివాహ ఏర్పాటును యెహోవాయే ఆరంభించాడు కాబట్టి, దంపతులు ఏమి చేస్తే సంతోషంగా ఉంటారో ఖచ్చితంగా ఆయనకే తెలుసు. ఎప్పుడూ ఆయన ఇష్టపడే విధంగా నడుచుకోండి. అలా చేస్తే కష్టాలతో నిండిన ఈ లోకంలో కూడా “యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు.”—నెహె. 8:10.

22 ఓ భర్త తనను తాను ప్రేమించుకున్నట్లే తన భార్యను ప్రేమించినట్లయితే ఆమెను అర్థం చేసుకుంటూ మృదువుగా తన శిరస్సత్వాన్ని నిర్వర్తిస్తాడు. దైవభక్తిగల భార్య తన భర్తకు మంచి సహకారాన్ని అందిస్తూ, ఆయనకు ఎంతో గౌరవం చూపిస్తుంది కాబట్టి ఆమెను భర్త ఎంతో ఇష్టపడతాడు. అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, వారిద్దరూ మాదిరికరమైన వివాహ జీవితాన్ని గడిపితే స్తోత్రార్హుడైన యెహోవా దేవుణ్ణి ఘనపరచగలుగుతారు.

మీకు గుర్తున్నాయా?

• శిరస్సత్వం విషయంలో, దానికి లోబడివుండే విషయంలో యెహోవా ఏ ఏర్పాటు చేశాడు?

• భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు ఎందుకు గౌరవించుకోవాలి?

• విశ్వాసియైన భార్య అవిశ్వాసియైన తన భర్తతో ఎలా ప్రవర్తించాలి?

• పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు భర్తలు తమ భార్యలను ఎందుకు సంప్రదించాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[17వ పేజీలోని బాక్సు]

అధికారాన్ని ఎందుకు గౌరవించాలి?

అధికారం, శిరస్సత్వం అనే ఏర్పాట్లను యెహోవా తెలివిగల ప్రాణుల మధ్య చేశాడు. ఆత్మప్రాణుల, మానవుల మంచి కోసమే ఆయన ఆ రెండింటినీ ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటువల్ల వారు తమ స్వేచ్ఛా చిత్తాన్ని ఉపయోగించే అవకాశం దొరకుతుంది. అంతేకాక, యెహోవాను ఐక్యంగా, సమాధానకరంగా సేవిస్తూ ఆయనను ఘనపర్చే అవకాశమూ లభిస్తుంది.—కీర్త. 133:1.

అభిషిక్త క్రైస్తవుల సంఘం యేసుక్రీస్తు అధికారాన్ని, శిరస్సత్వాన్ని గుర్తిస్తోంది. (ఎఫె. 1:22, 23) యెహోవా అధికారాన్ని గుర్తిస్తూ, చివరకు ‘కుమారుడు, దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.’ (1 కొరిం. 15:27, 28) కాబట్టి, దేవునికి సమర్పించుకున్నవారు సంఘంలో, కుటుంబంలో దేవుడు ఏర్పాటు చేసిన శిరస్సత్వానికి లోబడివుండడం ఎంత సముచితం! (1 కొరిం. 11:3; హెబ్రీ. 13:17) అలా చేస్తే మనం యెహోవా అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొందుతాం.—యెష. 48:17.

[13వ పేజీలోని చిత్రం]

ప్రార్థనవల్ల ఓ క్రైస్తవ స్త్రీ దైవిక లక్షణాలను కనబరచగలుగుతుంది

[15వ పేజీలోని చిత్రాలు]

రాజ్య సంబంధమైన కార్యకలాపాల్లో స్త్రీలు పోషించే పాత్రను యెహోవా విలువైనదిగా ఎంచుతాడు