కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

హారాను ప్రాచీనకాలంలో జనసమ్మర్ధమైన ప్రాంతం

హారాను ప్రాచీనకాలంలో జనసమ్మర్ధమైన ప్రాంతం

హారాను ప్రాచీనకాలంలో జనసమ్మర్ధమైన ప్రాంతం

లేఖనాలతో పరిచయం ఉన్నవారు హారాను అనే పేరు వినగానే నమ్మకంగా జీవించిన పూర్వీకుడైన అబ్రాహామును గుర్తుతెచ్చుకుంటారు. ఊరు పట్టణం నుండి కనానుకు వెళ్తున్నప్పుడు అబ్రాహాము, అతని భార్యయైన శారా, అతని తండ్రియైన తెరహు, అతని అన్న కుమారుడైన లోతు హారానులో ఆగారు. అక్కడున్నప్పుడు అబ్రాహాము ఎన్నో ఆస్తిపాస్తులను సంపాదించాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత అబ్రాహాము తనకు దేవుడు వాగ్దానం చేసిన దేశంవైపు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. (ఆది. 11:31, 32; 12:4, 5; అపొ. 7:2-4) ఆ తర్వాత, ఇస్సాకు కోసం భార్యను చూడమని అబ్రాహాము తన పెద్ద దాసునికి చెప్పి ఆయనను హారానుకు లేక దాని సమీప ప్రాంతానికి పంపించాడు. అబ్రాహాము మనుమడైన యాకోబు కూడా అక్కడ చాలా ఏళ్లు జీవించాడు.—ఆది. 24:1-4, 10; 27:42-45; 28:1, 2, 10.

అష్షూరు రాజైన సన్హెరీబు యూదా రాజైన హిజ్కియాకు పంపిన చివరి హెచ్చరికా పత్రంలో తాను ఇతర ‘దేశాలతోపాటు’ హారానును కూడా జయించానని ప్రస్తావించాడు. అప్పట్లో “హారాను” అన్న పేరు ఆ పట్టణాన్నే కాక చుట్టుప్రక్కలున్న ప్రాంతాలను కూడా సూచించింది. (2 రాజు. 19:11, 12) తూరు పట్టణంతో వర్తక లావాదేవీలు సాగించిన పట్టణాల్లో హారాను ముఖ్యమైనదని యెహెజ్కేలు ప్రవచనం చెబుతోంది. దీన్నిబట్టి హారాను ప్రాముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధి చెందిందని తెలుస్తోంది.—యెహె. 27:1, 2, 23.

ఇప్పుడు హారాను తూర్పు టర్కీలోని షాన్లవుర్ఫా నగరానికి దగ్గర్లోవున్న ఓ చిన్న పట్టణం. అప్పట్లో హారాను నిజంగానే జనసమ్మర్ధంగా ఉండేది. ప్రాచీనకాల పట్టణాల్లో కేవలం కొన్ని మాత్రమే ఇప్పటికీ బైబిలు ఉపయోగించిన పేర్లతోనే పిలువబడుతున్నాయి. అలా పిలువబడుతున్న వాటిలో హారాను పట్టణం ఒకటి. అష్షూరీయుల భాషలో ఈ పట్టణానికి కరాను అనే పేరుంది. దీనికి “రహదారి” లేదా “వర్తకుల దారి” అనే అర్థాలున్నాయి. హారాను పెద్దపెద్ద పట్టణాల మధ్యవున్న ముఖ్యమైన వర్తక మార్గాల కూడలిలో నెలకొనివుండేదని దీన్నిబట్టి మనకు అర్థమౌతోంది. హారానులో కొన్ని స్మారక చిహ్నాలు వెలుగుచూశాయి. వాటిని చూస్తే, సీను దేవాలయంలో హారానుకు చెందిన చంద్ర దేవుడు బబులోను రాజైన నెబోనైడస్‌ తల్లి ప్రధాన అర్చకురాలిగా పనిచేసిందని తెలుస్తోంది. ఈ దేవాలయాన్ని నెబోనైడస్‌ బాగుచేశాడని కొందరు చెబుతారు. ఆ తర్వాత ఎన్నో రాజ్యాలు ఉనికిలోకి వచ్చి ఆ తర్వాత కనుమరుగవ్వడాన్ని హారాను పట్టణం చూసింది.

హారాను పట్టణానికి ఒకప్పటి వైభవం ఇప్పుడు లేదు. గతంలో హారాను చాలా అభివృద్ధి చెందిన ప్రముఖ పట్టణం. ప్రత్యేకంగా కొన్ని కాలాల్లో అదొక వెలుగువెలిగింది. ఇప్పుడు హారానులో గుండ్రని పైకప్పులుగల కొన్ని ఇళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ పట్టణం చుట్టూ ప్రాచీన నాగరికతకు సంబంధించిన శిథిలాలు ఉన్నాయి. దేవుని నూతనలోకం స్థాపించబడినప్పుడు హారానులో ఒకప్పుడు నివసించిన అబ్రాహాము, శారా, లోతు వంటి వారు పునరుత్థానం చేయబడతారు. అప్పుడు, వారు జనసమ్మర్ధమైన హారాను పట్టణం గురించి మనకు మరిన్ని వివరాలు ఇవ్వవచ్చు.

[20వ పేజీలోని చిత్రం]

హారాను పట్టణపు శిథిలాలు

[20వ పేజీలోని చిత్రం]

గుండ్రని పైకప్పులున్న ఇళ్లు

[20వ పేజీలోని చిత్రం]

ఇప్పుడు హారాను పట్టణం దూరం నుండి ఇలా కనిపిస్తుంది