కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆధ్యాత్మిక విషయాల్లో సేదదీర్పు పొందండి

ఆధ్యాత్మిక విషయాల్లో సేదదీర్పు పొందండి

ఆధ్యాత్మిక విషయాల్లో సేదదీర్పు పొందండి

‘మీమీద నా కాడి ఎత్తుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది.’—మత్త. 11:29.

1. సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఏ ఏర్పాటు చేశాడు? ఎందుకు?

 సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీయులతో యెహోవా ధర్మశాస్త్ర నిబంధన చేసుకున్నప్పుడు, ప్రతీవారం సబ్బాతును లేదా విశ్రాంతి దినాన్ని ఆచరించాలనే ఆజ్ఞ కూడా ఇవ్వబడింది. యెహోవా తన ప్రతినిధి అయిన మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి ఇలా ఆజ్ఞాపించాడు: “ఆరు దినములు నీ పనులు చేసి, నీ యెద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించునట్లు ఏడవ దినమున ఊరక యుండవలెను.” (నిర్గ. 23:12) తన ధర్మశాస్త్రం కిందవున్న ప్రజల పట్ల యెహోవాకు శ్రద్ధ ఉంది కాబట్టే వారు ‘విశ్రాంతి’ పొందేలా ప్రేమతో ఆ ఏర్పాటు చేశాడు.

2. సబ్బాతును పాటించడం వల్ల ఇశ్రాయేలీయులు ఎలా ప్రయోజనం పొందారు?

2 అయితే, సబ్బాతు కేవలం విశ్రాంతి తీసుకునే రోజు మాత్రమేనా? కాదు. ఇశ్రాయేలీయులు చేసే ఆరాధనలో అదొక ప్రాముఖ్యమైన భాగం. సబ్బాతును పాటించడం వల్ల తమ కుటుంబం ‘నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గాన్ని గైకొనేలా’ సహాయం చేసేందుకు కుటుంబ శిరస్సులకు సమయం దొరికేది. (ఆది. 18:19) యెహోవా కార్యాల గురించి ఆలోచిస్తూ స్నేహితులతో ఆనందంగా గడిపే అవకాశం కూడా వారికి లభించేది. (యెష. 58:13, 14) అన్నింటికన్నా ప్రాముఖ్యమైన విషయం మరొకటి ఉంది. ప్రవచనాత్మకంగా అది నిజమైన సేదదీర్పు లభించే క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన కాలాన్ని సూచించింది. (రోమా. 8:20, 21) మన కాలం విషయమేమిటి? యెహోవా మార్గాలను ఇష్టపడే నిజక్రైస్తవులు అలాంటి సేదదీర్పును ఎక్కడ, ఎలా పొందవచ్చు?

క్రైస్తవ సహవాసం ద్వారా సేదదీర్పును పొందండి

3. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఒకరికొకరు ఎలా సహాయసహకారాలను అందించుకున్నారు? దాని ఫలితమేమిటి?

3 క్రైస్తవ సంఘం “సత్యమునకు స్తంభమును ఆధారమునై యున్నది” అని అపొస్తలుడైన పౌలు వివరించాడు. (1 తిమో. 3:15) ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ద్వారా, ప్రేమలో ఒకరినొకరు బలపరచుకోవడం ద్వారా తొలి క్రైస్తవులు ఎన్నో విధాలుగా సహాయసహకారాలను పొందారు. (ఎఫె. 4:11, 12, 16) పౌలు ఎఫెసులో ఉన్నప్పుడు కొరింథు సంఘపువారు వచ్చి ఆయనను ప్రోత్సహించారు. దాని ఫలితమేమిటి? ‘స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనువారు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. వీరు నా ఆత్మకు సుఖము కలుగజేసిరి’ అని పౌలు అన్నాడు. (1 కొరిం. 16:17, 18) అలాగే తీతు కొరింథులోని సహోదరులకు పరిచారం చేసేందుకు వెళ్లినప్పుడు, పౌలు వారికి మరో ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో, ‘తీతుయొక్క ఆత్మ మీ అందరివల్ల విశ్రాంతి పొందింది’ అని రాశాడు. (2 కొరిం. 7:13) అలాగే, నేడు కూడా యెహోవాసాక్షులు ప్రోత్సాహకరమైన క్రైస్తవ సహవాసం వల్ల నిజమైన సేదదీర్పును పొందుతున్నారు.

4. సంఘ కూటాలు మనకు ఎలా సేదదీర్పును ఇస్తాయి?

4 క్రైస్తవ కూటాల నుండి ఎంతో ఆనందం పొందవచ్చని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అక్కడ మనం ‘ఒకరి విశ్వాసం చేత మరొకరం ఆదరణ పొందుతాం.’ (రోమా. 1:11, 12) మన క్రైస్తవ సహోదర సహోదరీలు ఏదో అప్పుడప్పుడు కలుసుకొనే ముఖపరిచయస్థులు కాదు. వారు మనం ఎంతగానో ప్రేమించే, గౌరవించే నిజమైన స్నేహితులు. కూటాలకు వెళ్లి క్రమంగా వారితో సహవసించడం ద్వారా మనం ఎంతో ఆనందాన్ని, ఊరటను పొందుతాం.—ఫిలే. 7.

5. పెద్ద పెద్ద సమావేశాలప్పుడు మనమెలా ఒకరికొకరు సేదదీర్పుగా ఉండవచ్చు?

5 చిన్నా పెద్దా సమావేశాల ద్వారా కూడా మనం సేదదీర్పు పొందుతాం. ఈ సమావేశాలు దేవుని వాక్యమైన బైబిల్లో ఉన్న సత్యమనే జీవజలాలను అందించడమే కాక, మన సహవాసాలను ‘విశాలపరచుకునే’ లేదా పెంచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. (2 కొరిం. 6:12, 13) ఒకవేళ మనం బిడియస్థులమైతే, ప్రజలను కలుసుకొని వారితో మాట్లాడడం మనకు కష్టమనిపించవచ్చు. అలాంటప్పుడు మనం ఏమి చేయాలి? సమావేశానికి సంబంధించిన పనుల్లో చేయూతనివ్వడానికి ముందుకురావడం ద్వారా మనం మన సహోదర సహోదరీలతో పరిచయం పెంచుకోవచ్చు. ఓ సహోదరి ఒకానొక అంతర్జాతీయ సమావేశంలో స్వచ్ఛందంగా వివిధ పనుల్లో పాల్గొన్న తర్వాత ఇలా చెప్పింది: “మా కుటుంబపువారిని పక్కనపెడితే నాకున్న స్నేహితులను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు, అక్కడున్న చాలామంది నాకు తెలియదు. అయితే ఆ సమావేశ పరిసరాలను శుభ్రం చేయడానికి సహాయం చేస్తున్నప్పుడు నేను చాలామంది సహోదరసహోదరీలను కలిశాను! సమయం చాలా సరదాగా గడిచింది!”

6. సెలవులు తీసుకుంటున్నప్పుడు మనం సేదదీర్పు పొందగల ఒక మార్గమేమిటి?

6 ఇశ్రాయేలీయులు ప్రతీ సంవత్సరం మూడు పండుగలు జరుపుకునేవారు. ఆ సమయంలో యెహోవాను ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్లేవారు. (నిర్గ. 34:23) అలా వెళ్లాలంటే వారు తమ పొలాలను, దుకాణాలను విడిచిపెట్టి ఎన్నో రోజులపాటు దుమ్ముతో నిండిన రోడ్లమీద కాలినడకన వెళ్లాల్సివచ్చేది. అక్కడికి వెళ్లినవారు ‘యెహోవాను స్తుతించేవారు’ కాబట్టి, అంత కష్టమైనప్పటికీ దేవాలయానికి వెళ్లడం వల్ల వారు ‘బహు సంతోషించేవారు.’ (2 దిన. 30:21) అలాగే, తమ కుటుంబాలతో కలిసి యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయమైన బెతెల్‌ను సందర్శించడం వల్ల చాలామంది యెహోవా సేవకులకు ఎంతో ఆనందం కలుగుతుంది. భవిష్యత్తులో సెలవులు తీసుకుంటున్నప్పుడు మీరు కుటుంబంగా బెతెల్‌ను కూడా సందర్శించగలరేమో ఆలోచించండి.

7. (ఎ) పార్టీలు మనకు ఎలా ప్రయోజనం చేకూరుస్తాయి? (బి) పార్టీలు అందరూ గుర్తుపెట్టుకునే విధంగా, ప్రోత్సాహకరంగా ఉండడానికి ఏమి చేయవచ్చు?

7 కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుంటున్నప్పుడు కూడా సేదదీర్పు పొందవచ్చు. జ్ఞానియైన సొలొమోను ఇలా చెప్పాడు: “అన్నపానములు పుచ్చుకొనుటకంటెను, తన కష్టార్జితముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు.” (ప్రసం. 2:24) పార్టీలు మనకు సేదదీర్పునిస్తాయి. అంతేకాక, ఆ సందర్భాల్లో మన తోటి క్రైస్తవులను మరింత తెలుసుకుంటుండగా మన ప్రేమానుబంధాలు కూడా బలపడతాయి. పార్టీలు అందరూ గుర్తుపెట్టుకునే విధంగా, ప్రోత్సాహకరంగా ఉండాలంటే, కొంతమందినే పిలవడం, సరైన పర్యవేక్షణ ఉండేలా చూడడం మంచిది. ఒకవేళ మద్యం అందిస్తున్నట్లయితే అలాంటి పర్యవేక్షణ మరింత అవసరమౌతుంది.

పరిచర్య సేదదీర్పునిస్తుంది

8, 9. (ఎ) యేసు సందేశానికీ, శాస్త్రులు పరిసయ్యులు విధించిన నియమాలకూ మధ్యవున్న తేడా ఏమిటి? (బి) బైబిలు సత్యాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా మనం ఎలా ప్రయోజనం పొందుతాం?

8 యేసు పరిచర్య విషయంలో ఉత్సాహాన్ని చూపించాడు. తన శిష్యులూ అలాగే ఉండాలని ప్రోత్సహించాడు. ఆయన చెప్పిన ఈ మాటలనుబట్టి అది స్పష్టమౌతుంది: “కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి.” (మత్త. 9:37, 38) యేసు బోధించిన సందేశం నిజంగా సేదదీర్పునిచ్చింది. ఎందుకంటే అది “సువార్త.” (మత్త. 4:23; 24:14) ఆ సువార్త పరిసయ్యులు ప్రజలమీద విధించిన భారమైన నియమాల్లా లేదు.—మత్తయి 23:4, 23, 24 చదవండి.

9 ఇతరులకు రాజ్య సందేశాన్ని ప్రకటిస్తున్నప్పుడు మనం వారికి ఆధ్యాత్మిక సేదదీర్పునిస్తాం. అదే సమయంలో అమూల్యమైన బైబిలు సత్యాల పట్ల మనకున్న అవగాహనను, హృదయపూర్వక కృతజ్ఞతను పెంచుకుంటాం. అందుకే కీర్తనకర్త ఇలా అన్నాడు: “యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము.” (కీర్త. 147:1) ఇతరుల ముందు యెహోవాను స్తుతించడంలో మీరు పొందే ఆనందాన్ని పెంచుకోగలరేమో ఆలోచించండి.

10. ప్రజలు మన సందేశానికి మంచిగా స్పందిస్తేనే మనం పరిచర్యలో బాగా ప్రకటిస్తున్నట్లా? వివరించండి.

10 నిజమే, సువార్త వినే విషయంలో కొన్ని ప్రాంతాలవారు ఇతర ప్రాంతాలవారికన్నా ఎక్కువ ఆసక్తి చూపిస్తుండవచ్చు. (అపొస్తలుల కార్యములు 18:1, 5-8 చదవండి.) మీ ప్రాంతంలోని ప్రజలు రాజ్య సందేశానికి అంతగా స్పందించడం లేనట్లయితే, పరిచర్యలో మీరు చేస్తున్న మంచి పని గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి. యెహోవా నామాన్ని ప్రకటించడానికి మీరు పట్టుదలతో చేస్తున్న ప్రయత్నాలు వ్యర్థంకావని గుర్తుంచుకోండి. (1 కొరిం. 15:58) అంతేకాక, ప్రజలు సువార్తను ఎలా వింటున్నారు అనేదాన్నిబట్టి మనం దాన్ని ఎంత బాగా ప్రకటిస్తున్నామనేది చెప్పలేం. ఏదేమైనా, సహృదయంగలవారికి రాజ్య సందేశాన్ని వినే అవకాశం యెహోవా కల్పిస్తాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు.—యోహా. 6:44.

కుటుంబ ఆరాధన సేదదీర్పునిస్తుంది

11. యెహోవా తల్లిదండ్రులకు ఏ బాధ్యత ఇచ్చాడు? వారు దాన్ని ఎలా నిర్వర్తించవచ్చు?

11 యెహోవా గురించి, ఆయన మార్గాల గురించి పిల్లలకు బోధించే బాధ్యత దైవభక్తిగల తల్లిదండ్రులకు ఉంది. (ద్వితీ. 11:18, 19) మీరు తల్లిదండ్రులైతే మన ప్రేమగల పరలోక తండ్రి గురించి మీ పిల్లలకు బోధించడానికి సమయం కేటాయిస్తున్నారా? ఈ ప్రాముఖ్యమైన బాధ్యతను నెరవేరుస్తూ, మీ కుటుంబ అవసరాలను తీర్చే విషయంలో సహాయం చేయడానికి పుస్తకాలు, పత్రికలు, వీడియోలు, ఆడియోల రూపంలో యెహోవా ఎంతో చక్కని ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించాడు.

12, 13. (ఎ) కుటుంబాలు తమ ఆరాధనా సాయంత్రం నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు? (బి) కుటుంబ ఆరాధన సేదదీర్పునిచ్చేదిగా ఉండేందుకు తల్లిదండ్రులు ఏమి చేయవచ్చు?

12 అంతేకాక, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి కుటుంబ ఆరాధన కోసం ఓ సాయంత్రాన్ని కేటాయించేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. కుటుంబ బైబిలు అధ్యయనం చేయడానికి ప్రతీవారం ఈ సాయంత్రాన్ని కేటాయించాలి. ఈ ఏర్పాటువల్ల తమ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరిగిందని, యెహోవాతో తమ సంబంధం బలపడిందని చాలామంది గ్రహించారు. అయితే, తమ కుటుంబ ఆరాధన ఆధ్యాత్మిక సేదదీర్పునిచ్చేదిగా ఉండేందుకు తల్లిదండ్రులు ఏమి చేయాలి?

13 కుటుంబ ఆరాధనా సాయంత్రం బోరుగా, చాలా గంభీరమైన వాతావరణంలో సాగే కార్యక్రమం కాకూడదు. ఎంతైనా మనం ‘సంతోషంగల దేవుణ్ణి’ ఆరాధిస్తున్నాం. అంతేకాక మనం ఆనందంగా తనను ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. (1 తిమో. 1:11, NW; ఫిలి. 4:4) బైబిల్లోని ముత్యాల్లాంటి ఆధ్యాత్మిక సత్యాల గురించి చర్చించడానికి మరో సాయంత్రాన్ని కేటాయించడం నిజంగా ఆశీర్వాదకరం. తల్లిదండ్రులు ఒకే బోధనా పద్ధతిని ఉపయోగించే బదులు వారు తమ సృజనాత్మకతను, ఊహాశక్తిని ఉపయోగిస్తూ అధ్యయనాన్ని ఆసక్తికరంగా చేయాలి. ఉదాహరణకు, ఓ కుటుంబపువారు తమ పదేళ్ల కుమారుడు బ్రాన్డన్‌ను “యెహోవా సాతానును సూచించడానికి పామును ఎందుకు ఉపయోగించాడు?” అనే విషయంమీద మాట్లాడమని చెప్పారు. ఈ విషయం బ్రాన్డన్‌కు ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే వాడికి పాములంటే మహా ఇష్టం, వాటిని సాతానుతో ముడిపెట్టినందుకు బాధపడ్డాడు. కొన్ని కుటుంబాలవారు తమ కుటుంబ ఆరాధనా సమయంలో అప్పుడప్పుడు బైబిలు నాటకాలు వేస్తారు. ఒకొక్కరు ఒక్కొక్క పాత్ర పోషిస్తూ తమ పాత్రలోని మాటలను నేరుగా బైబిలు నుండి చదువుతారు లేదా బైబిల్లోని ఒక సంఘటనను ఎంచుకొని దాన్ని నటిస్తారు. ఇలాంటి బోధనా పద్ధతులు పిల్లల్లో సరదా పుట్టించడమే కాక వారు కూడా దానిలో భాగం వహించేలా చేస్తాయి. దానివల్ల బైబిలు సూత్రాలు వారి హృదయానికి చేరుకుంటాయి. a

కృంగదీసేవాటికి దూరంగా ఉండండి

14, 15. (ఎ) అంత్యదినాల్లో ఒత్తిడి, అభద్రతాభావం ఎలా పెరిగాయి? (బి) మనం ఇంకా ఏ ఒత్తిడిని ఎదుర్కోవాల్సిరావచ్చు?

14 ఈ దుష్ట విధానపు అంత్యదినాల్లో ఒత్తిడి, అభద్రతాభావం పెరిగిపోతున్నాయి. నిరుద్యోగం, ఇతర ఆర్థిక సమస్యలు లక్షలాదిమందిని బాధిస్తున్నాయి. ఉద్యోగం చేస్తున్నవారు కూడా తమ సంపాదనను చిల్లులు పడిన జేబులో పెట్టుకున్నట్లుందని, దానివల్ల తమ కుటుంబం పెద్దగా ప్రయోజనం పొందడంలేదని అనుకుంటున్నారు. (హగ్గయి 1:4-6ను పోల్చండి.) రాజకీయ నాయకులతోపాటు ఇతర నాయకులు ఉగ్రవాదాన్ని, మరితర చెడు పనులను రూపుమాపేందుకు కిందామీదా పడుతున్నారు కాబట్టి వారు ఇతర సమస్యల విషయంలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. చాలామంది తమ సొంత బలహీనతలనుబట్టి కృంగిపోతున్నారు.—కీర్త. 38:4.

15 సాతాను లోకం నుండి వస్తున్న సమస్యలను, ఒత్తిళ్లను నిజక్రైస్తవులు కూడా అనుభవిస్తారు. (1 యోహా. 5:19) యెహోవాకు నమ్మకంగా ఉండడానికి క్రీస్తు శిష్యులు కృషి చేస్తుండగా వారు కొన్నిసార్లు వేరే ఒత్తిడిని ఎదుర్కోవాల్సిరావచ్చు. “లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు” అని యేసు చెప్పాడు. (యోహా. 15:20) అయితే, మనం ‘హింసించబడినప్పటికీ దిక్కులేనివారము కాము.’ (2 కొరిం. 4:9, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఎందుకు అలా చెప్పవచ్చు?

16. మన ఆనందాన్ని కాపాడుకోవడానికి ఏది సహాయం చేస్తుంది?

16 యేసు ఇలా చెప్పాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.” (మత్త. 11:28) మనం క్రీస్తు విమోచన క్రయధన ఏర్పాటు పట్ల పూర్తి విశ్వాసముంచడం ద్వారా యెహోవా హస్తాల క్రిందకు వెళ్తాం. ఆ విధంగా మనం “బలాధిక్యము” పొందుతాం. (2 కొరిం. 4:7) “ఆదరణకర్త” అయిన దేవుని పరిశుద్ధాత్మ మన విశ్వాసాన్ని ఎంత బలపరుస్తుందంటే మనం పరీక్షలను, కష్టాలను సహించగలుగుతాం, అదే సమయంలో మన ఆనందాన్ని కూడా కాపాడుకోగలుగుతాం.—యోహా. 14:26; యాకో. 1:2-4.

17, 18. (ఎ) మనం ఎలాంటి లోక పోకడ విషయంలో జాగ్రత్త వహించాలి? (బి) వ్యర్థమైన సుఖభోగాలకు ప్రాముఖ్యతనిస్తే ఏమౌతుంది?

17 ఎలాగైనా సుఖాన్ని అనుభవించాలనే లోక పోకడ తమను ప్రభావితం చేయకుండా ఉండేలా నేడు నిజక్రైస్తవులు జాగ్రత్త వహించాలి. (ఎఫెసీయులు 2:2-5 చదవండి.) ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, మనం ‘శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము’ వంటి ప్రలోభాల్లో పడే ప్రమాదం ఉంది. (1 యోహా. 2:16) లేదా శరీర కోరికలు తీర్చుకోవడం వల్ల సేదదీరుతామని అపోహపడే అవకాశముంది. (రోమా. 8:5, 6) ఉదాహరణకు, కొందరు ఉత్తేజాన్ని పొందాలనే ఉద్దేశంతో మాదకద్రవ్యాలకు, తాగుడుకు బానిసలయ్యారు, అశ్లీల చిత్రాలను చూడడానికి అలవాటుపడ్డారు, లేదా ప్రమాదకరమైన క్రీడల్లో, క్రైస్తవులకు తగని వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో సాతాను తన “తంత్రములను” ఉపయోగిస్తున్నాడు. సేదదీరే విషయంలో తప్పుడు ఆలోచనను ప్రజల్లో కలిగించడం ద్వారా వాడు అలా చేస్తున్నాడు.—ఎఫె. 6:11.

18 నిజమే తినడం, తాగడం, మంచి వినోదాన్ని ఆస్వాదించడం వంటివి మితంగా చేస్తే తప్పులేదు. అయితే మనం మన జీవితంలో వాటికే ప్రాముఖ్యతనివ్వం. మనం జీవిస్తున్న కాలాలు అపాయకరమైనవి కాబట్టి అలాంటి విషయాల్లో సమతుల్యం, ఆశానిగ్రహం చాలా ప్రాముఖ్యం. వ్యక్తిగత లక్ష్యాలు మనల్ని ఎంతగా నిరుత్సాహపరచవచ్చంటే, ‘మన ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అనుభవజ్ఞానం విషయములో మనం సోమరులుగా, నిష్ఫలులుగా’ అయ్యే అవకాశముంది.—2 పేతు. 1:8.

19, 20. నిజమైన సేదదీర్పును ఎలా పొందవచ్చు?

19 యెహోవా నియమాలకు అనుగుణంగా మనం మన ఆలోచనలను మలచుకున్నప్పుడు, ఈ లోకం అందించే సుఖభోగాలు క్షణికమైనవని మనం గుర్తిస్తాం. మోషే ఆ విషయాన్ని గుర్తించాడు, మనం కూడా గుర్తించాలి. (హెబ్రీ. 11:24) మన పరలోక తండ్రి చిత్తం చేయడంవల్ల మాత్రమే నిజమైన సేదదీర్పును పొందుతాం. అది మనకు చిరకాలం ఉండే అపారమైన ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది.—మత్త. 5:6.

20 ఆధ్యాత్మిక విషయాల్లో మనం సేదదీర్పును పొందుతూ ఉందాం. అలా చేయడం ద్వారా మనం ‘భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కోసం ఎదురుచూస్తాం.’ (తీతు 2:12, 13) యేసు అధికారానికి, నడిపింపుకు లోబడడం ద్వారా ఆయన కాడి కింద ఉండాలనే కృతనిశ్చయంతో ఉందాం. అలా చేస్తే మనం నిజమైన సంతోషాన్ని, సేదదీర్పును పొందుతాం!

[అధస్సూచి]

a కుటుంబ అధ్యయనాన్ని ఆసక్తికరంగా, ఉపదేశాన్నిచ్చేదిగా ఎలా చేసుకోవచ్చో మరింత తెలుసుకునేందుకు మన రాజ్య పరిచర్య, జనవరి, 1991, 1వ పేజీ చూడండి.

మీరు ఎలా జవాబిస్తారు?

• నేటి యెహోవా ప్రజలు సేదదీర్పును ఎలా పొందుతారు?

• పరిచర్య మనకూ, మన సందేశాన్ని వినేవారికీ ఎలా సేదదీర్పునిస్తుంది?

• తమ కుటుంబ ఆరాధన సేదదీర్పునిచ్చేదిగా ఉండేందుకు కుటుంబ శిరస్సులు ఏమి చేయవచ్చు?

• ఏవి మనల్ని ఆధ్యాత్మికంగా నిరుత్సాహపరచవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[26వ పేజీలోని చిత్రాలు]

యేసు కాడిని ఎత్తుకోవడం ద్వారా, మనం ఎన్నో విధాలుగా సేదదీర్పును పొందుతాం