కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా ‘కీడును జయిస్తూ ఉండండి’

కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా ‘కీడును జయిస్తూ ఉండండి’

కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా ‘కీడును జయిస్తూ ఉండండి’

“ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక . . . మేలు చేత కీడును జయించుము.”—రోమా. 12:19, 21.

1, 2. విమానంలో ప్రయాణిస్తున్న కొంతమంది సాక్షులు ఏ మంచి మాదిరిని ఉంచారు?

 ఓ బ్రాంచి కార్యాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు 34 మంది యెహోవాసాక్షులు విమానంలో బయలుదేరారు. మార్గమధ్యంలో యాంత్రిక సమస్యలవల్ల వారు పయనిస్తున్న విమానం ఒకానొక విమానాశ్రయంలో ఆగింది. ఇంధనం కోసమైతే మామూలుగా విమానం గంటసేపు ఆగుతుంది. కానీ యాంత్రిక సమస్యలవల్ల వారు 44 గంటలు ఓ మారుమూల విమానాశ్రయంలో గడపాల్సివచ్చింది. అక్కడ సరిపడా ఆహారం లేదు, నీళ్లు లేవు, పరిశుభ్రమైన వాతావరణం లేదు. దాంతో చాలామంది ప్రయాణికులు కోపంతో విమానాశ్రయ సిబ్బందిని బెదిరించారు. కానీ సహోదర సహోదరీలు మాత్రం శాంతంగా ఉన్నారు.

2 చివరకు వారు ప్రతిష్ఠాపన కార్యక్రమ ఆఖరిభాగానికి హాజరుకాగలిగారు. వారు అలసిపోయినప్పటికీ, స్థానిక సహోదరులతో సహవసించడానికి కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడే ఉండిపోయారు. తాము చూపించిన ఓపికను, సహనాన్ని తోటి ప్రయాణికులు గమనించారని వారు ఆ తర్వాత తెలుసుకున్నారు. వారితో ప్రయాణించిన ఓ వ్యక్తి విమాన సిబ్బందితో, “ఆ 34 మంది క్రైస్తవుల స్థానంలో వేరేవాళ్లు ఉండివుంటే విమానాశ్రయంలో పెద్ద రభసే జరిగేది” అని అన్నాడు.

కోపం నిండివున్న లోకంలో జీవిస్తున్నాం

3, 4. (ఎ) మానవులు హింసతో కూడిన కోపాన్ని ఎందుకు చూపిస్తున్నారు? ఎప్పటినుండి చూపిస్తున్నారు? (బి) కయీను తన కోపాన్ని అణచుకుని ఉండగలిగేవాడా? వివరించండి.

3 ఈ దుష్టలోకంలో ఎదురౌతున్న జీవిత ఒత్తిళ్లవల్ల ప్రజలకు ఇట్టే కోపం వస్తుంది. (ప్రసం. 7:7) ఆ కోపమే ద్వేషానికి, తీవ్రమైన హింసకు దారితీస్తుంది. దీనివల్ల వివిధ దేశాల మధ్యనే కాక దేశం లోపల కూడా యుద్ధాలు నడుస్తున్నాయి. ఆ యుద్ధవాతావరణాన్ని చాలా ఇళ్లల్లో కూడా చూస్తాం. అలాంటి కోపం, హింస ఇప్పుడు మొదలైనవి కావు, ఎప్పటినుండో ఉన్నాయి. ఆదాముహవ్వల మొదటి కుమారుడైన కయీను అసూయ, కోపాలతో తన తమ్ముడైన హేబెలును చంపాడు. కోపాన్ని అణచుకోమని యెహోవా కయీనును కోరాడు. అలా అణచుకుంటే ఆశీర్వదిస్తానని కూడా చెప్పాడు. అయినా అతడు ఆ దుష్కార్యానికి ఒడిగట్టాడు.—ఆదికాండము 4:6-8 చదవండి.

4 కయీనుకు వారసత్వంగా అపరిపూర్ణత వచ్చినప్పటికీ అతడు సరైన విధంగా ప్రవర్తించే అవకాశం ఉంది. అతడు కోపాన్ని అణచుకోగలిగేవాడే. అందుకే, క్రూరత్వంతో అతడు చేసిన కార్యానికి అతడే పూర్తిగా బాధ్యుడు. మనం అపరిపూర్ణులం కాబట్టి, మన కోపాన్ని అణచుకొని, కోప కార్యాలకు పాల్పడకుండా ఉండడం కష్టమే. అదీగాక ఈ “అపాయకరమైన కాలము[లలో]” తీవ్రమైన ఇతర సమస్యలు మనమీద ఒత్తిడిని పెంచుతున్నాయి. (2 తిమో. 3:1) ఉదాహరణకు, ఆర్థిక ఇబ్బందులవల్ల మన మీద ఒత్తిడి పెరిగే అవకాశముంది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడంవల్ల చాలామందికి త్వరగా కోపం వస్తోందనీ, గృహహింస పెరిగిపోయిందనీ పోలీసులు చెబుతున్నారు, కుటుంబ సంక్షేమ సంస్థలు నివేదిస్తున్నాయి.

5, 6. కోపం విషయంలో లోక వైఖరి మనల్ని ఎలా ప్రభావితం చేయవచ్చు?

5 అంతేకాక, ఇప్పటి లోకంలో చాలామంది “స్వార్థప్రియులు,” “అహంకారులు,” “క్రూరులు” ఉన్నారు కాబట్టి అలాంటివారే మనకు ప్రతీరోజు తారసపడుతుంటారు. వారి చెడు లక్షణాలు ఎంతో సులభంగా మనకు అంటుకొని వారిలా మనం కూడా కోపగించుకునే ప్రమాదముంది. (2 తిమో. 3:2-5) సమస్యలు ఎదురైనప్పుడు హింసకు పాల్పడడం సహజమేనని, న్యాయమేనని, పగతీర్చుకోవడం మంచిదేనని చలనచిత్రాలు, టీవీ కార్యక్రమాలు తరచూ చిత్రీకరిస్తున్నాయి. కథలోని విలన్‌కి “తగిన శాస్తి” జరిగే సమయం కోసం ప్రేక్షకులు వేచిచూసేలా చాలా కథలు రూపొందిస్తున్నారు. సాధారణంగా సినిమా చివర్లో హీరో విలన్‌ను క్రూరంగా చంపేయడాన్ని చూపిస్తారు.

6 అలాంటి ప్రచారం దేవుని విధానాలను కాదుగానీ, ఈ “లౌకికాత్మను,” దాని ఉగ్ర పరిపాలకుడైన సాతానును అనుసరించమని ప్రోత్సహిస్తోంది. (1 కొరిం. 2:12; ఎఫె. 2:2; ప్రక. 12:12) లౌకికాత్మ అపరిపూర్ణ శరీర కోరికలను తీర్చుకోమని ప్రోత్సహిస్తుంది కాబట్టి, అది దేవుని పరిశుద్ధాత్మకు, దాని ఫలానికి పూర్తి విరుద్ధమైనది. కోపం తెప్పించినప్పుడు ప్రతీకారం తీర్చుకోకూడదనేదే క్రైస్తవుల ప్రాథమిక బోధ. (మత్తయి 5:39, 44, 45 చదవండి.) కాబట్టి, మనం యేసు బోధలను మరింత ఎక్కువగా ఎలా పాటించవచ్చు?

మంచి మాదిరులు, చెడ్డ మాదిరులు

7. షిమ్యోను, లేవీలు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోకపోవడం వల్ల ఏమి జరిగింది?

7 కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి సంబంధించి బైబిల్లో ఎన్నో సలహాలున్నాయి. అంతేకాక, కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఏమి జరుగుతుందో, అదుపులో ఉంచుకోకపోతే ఏమి జరుగుతుందో చూపించే చక్కని ఉదాహరణలు బైబిల్లో చాలా ఉన్నాయి. యాకోబు కుమారులైన షిమ్యోను, లేవీల విషయమే తీసుకోండి. తమ సహోదరియైన దీనాను పాడుచేసినందుకు వారు షెకెముమీద పగతీర్చుకున్నారు. దానికి ముందు జరిగిన సంఘటనలను పరిశీలించండి. వారు మొదటిగా “సంతాపము పొందిరి, వారికి మిగుల కోపము వచ్చెను.” (ఆది. 34:7) ఆ తర్వాత యాకోబు ఇతర కుమారులు షెకెము పట్టణంపై దాడిచేసి, ఆ ఊరును దోచుకున్నారు, ఆ ఊరి స్త్రీలను, పిల్లలను చెరపట్టి తీసుకొచ్చారు. దీనాకు అవమానం జరిగినందుకే కాక, బహుశా ఆ సంఘటనవల్ల తమ పేరుప్రతిష్ఠలకు మచ్చ వచ్చిందనే ఉద్దేశంతో కూడా వారు అలా చేసివుంటారు. వాళ్లను, వాళ్ల నాన్న అయిన యాకోబును షెకెము బాధపెట్టాడని వారు అనుకున్నారు. అయితే, వారి ప్రవర్తన యాకోబుకు ఎలా అనిపించింది?

8. పగతీర్చుకోవడం గురించి మనం షిమ్యోను, లేవీల ఉదాహరణ నుండి ఏమి నేర్చుకోవచ్చు?

8 దీనాకు ఎదురైన ఘోరమైన అవమానాన్ని చూసి యాకోబు ఎంతగానో బాధపడినప్పటికీ ఆయన తన కుమారులు ప్రతీకారంతో తీసుకున్న చర్యను ఖండించాడు. అయినా షిమ్యోను, లేవీలు తాము చేసిన పనిని సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. “వేశ్యయెడల జరిగించినట్లు మా సహోదరియెడల ప్రవర్తింపవచ్చునా?” అని వారు అన్నారు. (ఆది. 34:31) అది అంతటితో ముగిసిపోలేదు. వారి ప్రవర్తననుబట్టి యెహోవా కూడా బాధపడ్డాడు. చాలా సంవత్సరాల తర్వాత, యాకోబు వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పాడు. వారు కోపంతో హింసాయుత చర్యలకు పాల్పడినందుకు వారు, వారి వంశస్థులు ఇశ్రాయేలు గోత్రాల మధ్య చెల్లాచెదరౌతారని ప్రవచించాడు. (ఆదికాండము 49:5-7 చదవండి.) కోపాన్ని అదుపులో ఉంచుకోకపోవడంవల్ల వారిని దేవుడు ఇష్టపడలేదు, వారి తండ్రి కూడా ఇష్టపడలేదు.

9. ఏ సందర్భంలో దావీదు కోపం దాదాపు అదుపుతప్పింది?

9 అయితే, దావీదు రాజు వారిలా ప్రవర్తించలేదు. పగతీర్చుకునేందుకు ఆయనకు ఎన్నో అవకాశాలు లభించినా, ఆయన ప్రతీకారం తీర్చుకోలేదు. (1 సమూ. 24:3-7) అయితే, ఒక సందర్భంలో ఆయన కోపం దాదాపు అదుపు తప్పింది. ధనికుడైన నాబాలుకు చెందిన మందలను, కాపరులను దావీదు మనుష్యులు రక్షించినప్పటికీ నాబాలు వారిని దూషించాడు. బహుశా తన మనుష్యులను అలా అన్నందుకు దావీదు ఆయనమీద పగతీర్చుకోవడానికి కోపంతో బయలుదేరాడు. దావీదు, ఆయన మనుష్యులు నాబాలుమీద, ఆయన ఇంటివారిమీద దాడిచేయడానికి వెళ్తున్నప్పుడు ఓ యువకుడు జరిగిన సంఘటనను తెలివిగల నాబాలు భార్య అబీగయీలుకు తెలియజేసి, తగిన చర్య తీసుకోమని వేడుకున్నాడు. ఆమె వెంటనే చాలా బహుమానాలను తీసుకొని దావీదును కలిసేందుకు వెళ్లింది. ఆమె వినయంతో నాబాలు తరఫున క్షమాపణ కోరి, యెహోవాపట్ల దావీదుకున్న భయభక్తులను గుర్తుచేసింది. దావీదు తన పొరపాటును గ్రహించి ఇలా అన్నాడు: “ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక.”—1 సమూ. 25:2-35.

క్రైస్తవులు ఎలా ఉండాలి?

10. పగతీర్చుకునే విషయంలో క్రైస్తవుల ఆలోచన ఎలా ఉండాలి?

10 షిమ్యోను, లేవీల విషయంలో జరిగినది, దావీదు అబీగయీలుల మధ్య జరిగినది పరిశీలిస్తే అదుపులేని కోపాన్ని, హింసను యెహోవా ఇష్టపడడని తెలుస్తోంది. అంతేకాదు, సమాధానపడేందుకు మనం చేసే ప్రయత్నాలను ఆయన ఆశీర్వదిస్తాడని కూడా అర్థమౌతోంది. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి—పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.”—రోమా. 12:18-21. a

11. ఓ సహోదరి తన కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఎలా నేర్చుకుంది?

11 మనం ఆయన ఉపదేశాన్ని అనుసరించవచ్చు. ఉదాహరణకు, ఓ సహోదరి తన పనిస్థలంలో కొత్త మేనేజర్‌తో తనకు ఎదురౌతున్న సమస్య గురించి ఓ సంఘ పెద్దకు వివరించింది. ఆ మేనేజరు తనతో అన్యాయంగా, నిర్దయగా వ్యవహరిస్తోందని ఆమె చెప్పింది. ఆ మేనేజరు మీద కోపంతో ఉద్యోగం మానేయాలనుకుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆ పెద్ద ఆమెకు సలహా ఇచ్చాడు. మేనేజరు ప్రవర్తననుబట్టి సహోదరి కోపగించుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైందని ఆయన గుర్తించాడు. (తీతు 3:1-3) కొంతకాలానికి మరో ఉద్యోగం దొరికినాసరే సమస్య పరిష్కారం కాదని, ఎవరైనా నిర్దయతో ప్రవర్తించినప్పుడు ఆమె ప్రతిస్పందిస్తున్న తీరును ఖచ్చితంగా మార్చుకోవాల్సిందేనని ఆయన సూచించాడు. ఇతరులు మనతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటామో అలాగే మనమూ వారితో ప్రవర్తించాలని యేసు బోధించాడు. దాన్ని మనసులో ఉంచుకొని మేనేజరుతో ప్రవర్తించమని ఆ సహోదరుడు ఆమెకు సలహా ఇచ్చాడు. (లూకా 6:31 చదవండి.) ఆ సహోదరి సరేనంది. ఆ తర్వాత ఏమి జరిగింది? కొంతకాలానికి, సహోదరి ప్రవర్తన వల్ల మేనేజరు మరింత దయతో వ్యవహరించసాగింది. అంతేకాదు, ఆ సహోదరి చేస్తున్న పనిని కూడా మెచ్చుకుంది.

12. ప్రత్యేకంగా క్రైస్తవుల మధ్య విభేదాలు వస్తే మనం ఎందుకు బాధపడతాం?

12 సంఘం వెలుపలివారి నుండి అలాంటి సమస్యలు ఎదురైతే మనం ఆశ్చర్యపోము. సాతాను వ్యవస్థ తరచూ అన్యాయమే చేస్తుందనీ దుష్టులు మనకు కోపం తెప్పించే పనులు చేసినప్పుడు మనం నిగ్రహాన్ని చూపించాలనీ మనకు తెలుసు. (కీర్త. 37:1-11; ప్రసం. 8:12, 13; 12:13, 14) అయితే, మన ఆధ్యాత్మిక సహోదర సహోదరీలతో సమస్య వస్తే మాత్రం మనకు ఎంతో బాధ కలుగుతుంది. ఒక సాక్షి ఇలా గుర్తుచేసుకుంది: “నేను సత్యం నేర్చుకుంటున్నప్పుడు యెహోవా ప్రజలు అపరిపూర్ణులు అనే వాస్తవాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయాను.” సంఘంలోని వారందరూ ఒకరితో ఒకరు దయగా వ్యవహరిస్తారనే ఆశతో మనం ఈ ప్రేమలేని లోకాన్ని వదిలి వచ్చాం. కాబట్టి, ఓ తోటి క్రైస్తవుడు, మరిముఖ్యంగా సంఘ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సహోదరుడు అనాలోచితంగా మాట్లాడితే లేదా క్రైస్తవులకు తగని విధంగా ప్రవర్తిస్తే మనకెంతో బాధ కలుగుతుంది లేదా కోపం వస్తుంది. ‘యెహోవా ప్రజల మధ్య ఇలాంటివి జరగడమేమిటి?’ అని మనం అనుకోవచ్చు. నిజానికి, అపొస్తలుల కాలంలోని అభిషిక్త క్రైస్తవుల మధ్య కూడా అలాంటివే జరిగాయి. (గల. 2:11-14; 5:15; యాకో. 3:14, 15) ఒకవేళ మనకు అలా జరిగితే మనం ఏమి చేయాలి?

13. విభేదాలను పరిష్కరించుకునేందుకు మనం ఎందుకు కృషిచేయాలి? ఎలా కృషిచేయాలి?

13 ముందు పేరాలో ప్రస్తావించబడిన ఆ సహోదరి ఇలా చెప్పింది: “నన్ను బాధపెట్టినవారి కోసం ప్రార్థించడం నేర్చుకున్నాను. దానివల్ల పరిస్థితి ఎప్పుడూ మెరుగుపడుతుంది.” మనం ఇంతకుముందు చదివినట్లు, మనల్ని హింసించేవారి కోసం ప్రార్థించమని యేసు బోధించాడు. (మత్త. 5:44) అలాంటప్పుడు మనం మన ఆధ్యాత్మిక సహోదర సహోదరీల కోసం ఇంకెంత ఎక్కువగా ప్రార్థించాలి! తన పిల్లలు ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఓ తండ్రి ఎలా కోరుకుంటాడో అలాగే యెహోవా కూడా భూమ్మీదున్న తన సేవకులు ఒకరినొకరు ప్రేమించుకోవాలని కోరుకుంటున్నాడు. సమాధానంగా, సంతోషంగా నిరంతరం ఐక్యంగా జీవించే కాలం కోసం మనం ఎదురుచూస్తున్నాం. అదే సమయంలో, ఇప్పుడు అలా ఉండేందుకు కావాల్సిన శిక్షణను యెహోవా ఇస్తున్నాడు. తన గొప్ప పనిని చేయడంలో మనం ఆయనకు సహకరించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి, సమస్యలుంటే వాటిని పరిష్కరించుకుందాం లేదా ‘తప్పులు క్షమించి’ కలిసికట్టుగా ముందుకుసాగిపోదాం. (సామెతలు 19:11 చదవండి.) సమస్యలు వచ్చినప్పుడు మనం మన సహోదరులకు దూరంగా వెళ్లేబదులు ‘నిత్యముగానుండే’ యెహోవా ‘బాహువుల్లోనే’ సురక్షితంగా ఉండేందుకు ఒకరికొకరం సహాయం చేసుకోవాలి.—ద్వితీ. 33:27.

అందరితో సాధువుగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి

14. మన మధ్య విభజనలు సృష్టించడానికి సాతాను చేసే ప్రయత్నాలను మనం ఎలా తిప్పికొట్టవచ్చు?

14 మనల్ని సువార్త ప్రకటించనివ్వకుండా చేయాలనే ఉద్దేశంతో సాతాను, అతని దయ్యాలు సంతోషకరమైన కుటుంబాలను, సంఘాలను విచ్ఛిన్నం చేయడానికి చురుగ్గా పనిచేస్తున్నారు. మనలో విభజనలు ఏర్పడితే అది మనకే హానిచేస్తుందని తెలుసు కాబట్టి, మన మధ్య అభిప్రాయ భేదాలను సృష్టించడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారు. (మత్త. 12:25) వారి దుష్ట ప్రభావంలో మనం పడకూడదంటే పౌలు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని అనుసరించాలి: ‘ప్రభువుయొక్క దాసుడు జగడమాడక అందరి యెడల సాధువుగా ఉండవలెను.’ (2 తిమో. 2:23-26) మనం ‘శరీరులతో కాదుగానీ దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం.’ ఈ పోరాటంలో విజయం సాధించాలంటే, మనం ‘సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడుతోపాటు’ ఆధ్యాత్మిక కవచంలోని మిగతావాటిని ధరించాలి.—ఎఫె. 6:12-18.

15. సంఘం వెలుపలివారు మనమీద దాడిచేస్తే మనం ఏమి చేయాలి?

15 సమాధానంగా ఉండే యెహోవా ప్రజలపై సంఘం వెలుపలుండే శత్రువులు క్రూరమైన దాడులు చేస్తారు. వారిలో కొందరు యెహోవాసాక్షులమీద నేరుగా దాడిచేస్తారు. మరికొందరు వార్తామాధ్యమాల్లో వారి మీద అబద్ధ ప్రచారం చేస్తారు లేదా న్యాయస్థానాల్లో అబద్ధ సాక్ష్యం చెబుతారు. ఇలా జరుగుతుందని యేసు తన శిష్యులకు ముందే చెప్పాడు. (మత్త. 5:11, 12) అలా మనకు జరిగితే మనం ఏమి చేయాలి? మనం ఎన్నడూ మాటల ద్వారా గానీ, చేతల ద్వారా గానీ ‘కీడుకు ప్రతికీడు’ చేయకూడదు.—రోమా. 12:17; 1 పేతురు 3:15, 16 చదవండి.

16, 17. ఒక సంఘానికి ఎలాంటి సమస్య ఎదురైంది?

16 అపవాది మనమీద ఏమి తీసుకొచ్చినా, ‘మేలు చేత కీడును జయించడం’ ద్వారా మనం చక్కని సాక్ష్యమివ్వగలుగుతాం. ఉదాహరణకు, ఒకానొక పసిఫిక్‌ ద్వీపంలో మన సహోదరులు జ్ఞాపకార్థ ఆచరణ కోసం ఓ హాలును అద్దెకు తీసుకున్నారు. దాని గురించి తెలుసుకున్న స్థానిక చర్చి అధికారులు, సరిగ్గా జ్ఞాపకార్థ ఆచరణ జరగాల్సిన సమయానికి తమ చర్చి సభ్యులందరినీ చర్చి సేవల కోసం ఆ హాలుకు రమ్మని చెప్పారు. అయితే ఓ పోలీసు అధికారి, మన కూటం జరుపుకునే సమయానికల్లా ఆ హాలును ఖాళీ చేయాలని ఆ చర్చి వారికి చెప్పాడు. కానీ, మన ఆచరణ ప్రారంభం కావాల్సిన సమయానికల్లా చర్చి సభ్యులతో హాలు నిండిపోయింది, వారు తమ చర్చి సేవలు ప్రారంభించుకున్నారు.

17 బలప్రయోగం చేసి వారిని వెళ్లగొడదామని పోలీసులు అనుకుంటున్నప్పుడు, చర్చి ప్రెసిడెంట్‌ మన పెద్దల్లో ఒకరి దగ్గరికి వచ్చి, “ఇప్పుడు ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమం ఉందా మీకు?” అని అడిగాడు. ఆ సహోదరుడు జ్ఞాపకార్థ ఆచరణ గురించి చెప్పినప్పుడు, ఆ వ్యక్తి, “ఓ అలాగా, నాకు తెలియదే!” అని అన్నాడు. అప్పుడు ఓ పోలీసు ఇలా చెప్పాడు: “దీని గురించి మీకు ఉదయమే చెప్పాం కదా!” అప్పుడు ఆ ప్రెసిడెంట్‌ వెటకారంగా నవ్వుతూ మన పెద్దవైపు చూసి, “అయ్యో మీరు ఇప్పుడు ఏమి చేస్తారు? హాలు నిండా ప్రజలు ఉన్నారే. పోలీసులతో మమ్మల్ని గెంటించేస్తారా?” అని అన్నాడు. సాక్షులు హింసించే ప్రజలని చిత్రీకరించేందుకే ఆ ప్రెసిడెంట్‌ కుయుక్తిగా పన్నాగం పన్ని అదంతా నడిపించాడు! అప్పుడు మన సహోదరులు ఏమి చేశారు?

18. చర్చివారు కోపం తెప్పించే పనిచేసినా సహోదరులు ఎలా ప్రవర్తించారు? దానివల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి?

18 ఓ అరగంటసేపు చర్చి సేవలు జరుపుకోమని, ఆ తర్వాత జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకుంటామని సాక్షులు వారితో చెప్పారు. కానీ వాళ్లు ఎక్కువ సమయం తీసుకున్నారు. అయితే చర్చి సభ్యులు బయటికి వెళ్లిన తర్వాత సాక్షులు జ్ఞాపకార్థ ఆచరణ జరుపుకున్నారు. మరుసటి రోజు, విచారణ కోసం ప్రభుత్వం ఓ మండలిని ఏర్పాటు చేసింది. ఆ మండలి వాస్తవాలను పరిశీలించిన తర్వాత, సమస్యకు సాక్షులు కారణంకాదనీ చర్చి ప్రెసిడెంటే దానికి కారణమనీ చర్చి ప్రకటించాల్సిందిగా ఆదేశించింది. ఆ సమస్యను ఓపికతో పరిష్కరించినందుకు మండలి యెహోవాసాక్షులను అభినందించింది. “సమస్త మనుష్యులతో సమాధానముగా” ఉండేందుకు సాక్షులు చేసిన ప్రయత్నంవల్ల వారు మంచి ఫలితాలు సాధించారు.

19. ఇతరులతో సమాధానంగా ఉండాలంటే మనం ఇంకా ఏమి చేయాలి?

19 ఇతరులతో సమాధానంగా ఉండాలంటే మనం మరొకటి కూడా చేయాలి. మనం ఇతరులతో దయగా మాట్లాడాలి. దయగల మాటలంటే ఏమిటో, మనం వాటిని ఎలా అలవాటు చేసుకోవచ్చో, సంభాషణలో ఎలా ఉపయోగించవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

[అధస్సూచి]

a ముడిఖనిజాన్ని కరిగించి లోహాన్ని వెలికితీసేందుకు ఉపయోగించే ప్రాచీన పద్ధతిని మనసులో ఉంచుకొని పౌలు ‘నిప్పుల’ కుప్ప గురించి ప్రస్తావించివుంటాడు. ఈ పద్ధతిలో ముడిఖనిజం కింద మాత్రమే కాక దానిపైన కూడ నిప్పులు పెట్టేవారు. మనతో నిర్దయగా ప్రవర్తించేవారిపట్ల మనం దయతో ప్రవర్తిస్తే వారి మనసు మారి మంచి లక్షణాలను కనబరచవచ్చు.

మీరు వివరించగలరా?

• లోకంలోని ప్రజలు ఎందుకు అంత కోపిష్ఠులుగా ఉన్నారు?

• కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల, ఉంచుకోకపోవడం వల్ల వచ్చే ఫలితాలను చూపించే బైబిలు ఉదాహరణలు చెప్పండి.

• తోటి సహోదర సహోదరీలు మన మనసు నొప్పిస్తే మనం ఏమి చేయాలి?

• సంఘం వెలుపలివారు మనమీద దాడిచేసినప్పుడు మనం ఎలా స్పందించాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[16వ పేజీలోని చిత్రం]

షిమ్యోను, లేవీలు కోపాన్ని వెళ్లగక్కిన తర్వాతే తిరిగివచ్చారు

[18వ పేజీలోని చిత్రాలు]

మనం ఇతరులతో దయగా ప్రవర్తిస్తే వారి ప్రవర్తనా తీరు మారవచ్చు