దయగల మాటలు సత్సంబంధాలను పెంచుతాయి
దయగల మాటలు సత్సంబంధాలను పెంచుతాయి
‘మీ సంభాషణ ఎల్లప్పుడు కృపాసహితముగా ఉండనివ్వండి.’—కొలొ. 4:6.
1, 2. ఓ సహోదరుడు దయగా మాట్లాడడం వల్ల ఎలాంటి ఫలితం వచ్చింది?
“నేను ఇంటింటి పరిచర్యలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తిని కలిశాను. ఆయనకు నామీద ఎంత కోపం వచ్చిందంటే ఆయన పెదాలు వణికాయి, కోపంతో ఊగిపోయాడు” అని ఓ సహోదరుడు చెప్పాడు. “లేఖనాలను ఉపయోగిస్తూ ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నించాను కానీ ఆయన కోపం ఎంతకీ తగ్గలేదు. అదీగాక ఆయన భార్యాపిల్లలు నన్ను తిట్టడం మొదలుపెట్టారు. అక్కడి నుండి వెళ్లాల్సిన సమయం వచ్చిందని అప్పుడు నాకు అర్థమైంది. ‘సమాధానంగా వచ్చాను, సమాధానంగానే వెళ్లాలనుకుంటున్నాను’ అని వారికి చెప్పాను. కానీ వెళ్లే ముందు ప్రేమ, సాత్వికము, ఆశానిగ్రహము, సమాధానం గురించి వివరించే గలతీయులు 5:22, 23 వచనాలను చూపించాను.
2 “ఎదురుగా ఉన్న ఇళ్లల్లో మాట్లాడుతున్నప్పుడు ఆ కుటుంబపువారు తమ ఇంటి మెట్లమీద కూర్చొనివుండడాన్ని నేను గమనించాను. వాళ్లు నన్ను మళ్లీ పిలిచారు. ‘ఇప్పుడు ఏమి చేస్తారో?’ అని అనుకున్నాను. వెళ్లేసరికి ఆయన చేతిలో ఓ జగ్గు చల్లని నీళ్లు ఉన్నాయి, తాగమంటూ దాన్ని నాకు ఇచ్చాడు. తాను దురుసుగా ప్రవర్తించినందుకు క్షమాపణ కోరి, నాకున్న బలమైన విశ్వాసాన్ని అభినందించాడు. స్నేహపూర్వకంగా నేను సెలవు తీసుకున్నాను.”
3. ఇతరులు మనకు కోపం తెప్పించే పని చేసినప్పుడు మనం ఎందుకు కోపం తెచ్చుకోకూడదు?
3 ఒత్తిళ్లతో నిండిపోయిన ఈ లోకంలో మనం పరిచర్యలోనే కాక ఇతర చోట్ల కూడా కోపంగల ప్రజలను కలుసుకోక తప్పదు. అలాంటివారిని కలిసినప్పుడు, మనం ‘సాత్వికాన్ని, ప్రగాఢమైన గౌరవాన్ని’ కనబరచడం చాలా అవసరం. (1 పేతు. 3:15, NW) గృహస్థుడు నిర్దయతో, ఆగ్రహంతో ప్రవర్తించినందుకు సహోదరుడు కోపగించుకొనివుంటే ఆయన చల్లబడివుండేవాడు కాదు సరికదా మరింత కోపగించుకొని ఉండేవాడు. ఆ సహోదరుడు తనను తాను నిగ్రహించుకొని, దయతో మాట్లాడినందుకు మంచి ఫలితం వచ్చింది.
మనం దయతో మాట్లాడాలంటే ఏమి చేయాలి?
4. కృపాసహితంగా లేదా దయగా మాట్లాడడం ఎందుకు ప్రాముఖ్యం?
4 సంఘంలోని వారితో వ్యవహరిస్తున్నా, సంఘం వెలుపలివారితో వ్యవహరిస్తున్నా, చివరకు మన కుటుంబ సభ్యులతో వ్యవహరిస్తున్నా అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని అనుసరించడం ప్రాముఖ్యం: “మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.” (కొలొ. 4:6) మన సంభాషణ మంచిగా, సమాధానకరంగా ఉండాలంటే మన మాటలు ఉప్పువేసినట్లు పరిస్థితికి తగినవిధంగా ఉండడం చాలా అవసరం.
5. మంచిగా మాట్లాడడమంటే ఏమి కాదు? ఓ ఉదాహరణ చెప్పండి.
5 మంచి సంభాషణ అంటే మనసుకు తోచినట్లు మాట్లాడడం కాదు. ప్రాముఖ్యంగా కోపంతో ఉన్నప్పుడు అలా చేయకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకోకుండా ప్రవర్తించడం బలాన్ని కాదుగానీ బలహీనతనే సూచిస్తుందని బైబిలు చెబుతోంది. (సామెతలు 25:28; 29:11 చదవండి.) తన సమకాలీనుల్లో ‘మిక్కిలి సాత్వికుడైన’ మోషే ఒకసారి ఇశ్రాయేలీయుల తిరుగుబాటు కారణంగా తన కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోయాడు. దానివల్ల దేవుణ్ణి స్తుతించలేకపోయాడు. ఆ సమయంలో మోషే తన మనసులో ఉన్నదే మాట్లాడాడు. కానీ యెహోవా దాన్ని ఇష్టపడలేదు. అందుకే, 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను నడిపించినప్పటికీ వాగ్దాన దేశంలోకి వారిని నడిపించే అవకాశాన్ని ఆయన కోల్పోయాడు.—సంఖ్యా. 12:3; 20:10, 12; కీర్త. 106:32.
6. వివేచనతో మాట్లాడడమంటే ఏమిటి?
6 కోపాన్ని అదుపులో ఉంచుకొని, వివేచనతో మాట్లాడడం మంచిదని లేఖనాలు చెబుతున్నాయి. “విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.” (సామె. 10:19; 17:27) అదే సమయంలో, వివేచనతో మాట్లాడడమంటే మనసులో ఉన్నది అసలు చెప్పకూడదని కాదుగానీ అవతలి వ్యక్తిని బాధపెట్టకుండా అతని గాయాలను మాన్పే విధంగా ‘కృపాసహితంగా’ మాట్లాడాలని దానర్థం.—సామెతలు 12:18; 18:21 చదవండి.
‘మౌనముగా ఉండుటకు మాట్లాడుటకు సమయము కలదు’
7. మనం ఎలా మాట్లాడకూడదు? ఎందుకు?
7 మన ఉద్యోగ స్థలంలో లేదా పరిచర్యలో ఎలాగైతే కోపాన్ని అదుపులో ఉంచుకొని దయగా మాట్లాడతామో అలాగే సంఘంలో, ఇంట్లో కూడా మాట్లాడాలి. పర్యవసానాల గురించి ఆలోచించకుండా కోపాన్ని వెళ్లగక్కితే అది మన ఆధ్యాత్మిక, భావోద్వేగ, భౌతిక ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం కలిగించవచ్చు. అంతేకాక ఇతరులకు కూడా అలాంటి నష్టమే కలిగించవచ్చు. (సామె. 18:6, 7) అపరిపూర్ణత వల్ల మనలో కలిగే చెడు భావాలను అణచుకోవాలి. ఇతరులను దూషించడం, అపహాస్యం చేయడం, అవమానకరంగా మాట్లాడడం, ద్వేషంతో కోపాన్ని వెళ్లగక్కడం వంటివి తప్పే. (కొలొ. 3:8; యాకో. 1:20) అవి ఇతరులతో మనకున్న అమూల్యమైన సంబంధాన్నే కాక, యెహోవాతో ఉన్న అమూల్యమైన సంబంధాన్ని కూడా దెబ్బతీయగలవు. యేసు ఇలా బోధించాడు: “తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి [‘గెహెన్నాకు,’ NW] లోనగును.”—మత్త. 5:22.
8. ఎవరైనా మన మనసు నొప్పిస్తే దాని గురించి మనం ఎప్పుడు మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి?
8 అయితే కొన్ని విషయాల గురించి మాట్లాడడం మంచిదని మనకు అనిపించవచ్చు. బహుశా ఓ సహోదరుడు మిమ్మల్ని బాధించే మాటలు అనివుండవచ్చు లేదా బాధించే ఏ పనైనా చేసివుండవచ్చు. మీరు మరచిపోలేనంతగా ఆ విషయం మిమ్మల్ని బాధిస్తుంటే ఆ సహోదరుని మీద ద్వేషాన్ని పెంచుకోకండి. (సామె. 19:11) ఎవరైనా మీకు కోపం తెప్పించే పనిచేస్తే మీ కోపాన్ని అణచివేసుకున్న తర్వాతే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. పౌలు ఇలా రాశాడు: “సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు.” ఆ సమస్య మిమ్మల్ని బాధిస్తుంది కాబట్టి, సరైన సమయం చూసుకొని దయతో దాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. (ఎఫెసీయులు 4:26, 27, 31, 32 చదవండి.) మీ సహోదరునితో ఉన్న మంచి సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలనే ఉద్దేశంతో సమస్య గురించి అరమరికలు లేకుండా మాట్లాడండి. అదే సమయంలో దయతో మాట్లాడడం మరచిపోకండి.—లేవీ. 19:17; మత్త. 18:15.
9. ఇతరులతో సమస్య గురించి చర్చించే ముందు మనం కోపాన్ని ఎందుకు అదుపులో ఉంచుకోవాలి?
9 అలా మాట్లాడేందుకు సరైన సమయాన్ని ఎంచుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. ‘మౌనముగా నుండుటకు మాటలాడుటకు సమయం కలదు.’ (ప్రసం. 3:1, 7) అంతేకాక, “నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును.” (సామె. 15:28) అలా చేయాలంటే మనం సమస్య గురించి మాట్లాడడానికి సరైన సమయం కోసం వేచివుండాల్సి రావచ్చు. మనం ఎంతో కోపంగా ఉన్నప్పుడు మాట్లాడితే పరిస్థితి విషమించవచ్చు. అలాగని ఎక్కువ సమయం వేచివుండడం కూడా మంచిది కాదు.
దయతో చేసే పనులు సత్సంబంధాలను పెంచుతాయి
10. దయగల పనులు చేయడంవల్ల సంబంధాలు ఎలా మెరుగుపడతాయి?
10 ఇతరులతో సమాధానకరమైన సంబంధాన్ని ఏర్పరచుకొని దాన్ని కాపాడుకునేందుకు దయగల, మంచి మాటలు సహాయం చేస్తాయి. నిజానికి, ఇతరులతో మన సంబంధాన్ని మెరుగుపరచుకునేందుకు మనం చేయగలిగినదంతా చేస్తే వారితో మన సంభాషణను మెరుగుపరచుకోవచ్చు. ఇతరుల కోసం నిజాయితీగా, దయతో కూడిన పనులు చేయడానికి కృషిచేస్తే అంటే సహాయం చేయడం, ఇష్టపూర్వకంగా బహుమానం ఇవ్వడం, ఆతిథ్యం ఇవ్వడం వంటివి చేయడానికి కృషిచేస్తే వారితో దాపరికంలేకుండా మాట్లాడేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాక, వారిమీద ‘నిప్పులు కుప్పగా పోసి’ వారి మంచి లక్షణాలను వెలికితీయగలుగుతాం. వారితో సమస్య గురించి మనసువిప్పి మాట్లాడగలుగుతాం.—రోమా. 12:20, 21.
11. ఏశావుతో తిరిగి మంచి సంబంధం నెలకొల్పుకొనేందుకు యాకోబు ఎలా చొరవతీసుకున్నాడు? దానివల్ల ఎలాంటి ఫలితం వచ్చింది?
11 పితరుడైన యాకోబు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. యాకోబు కవల సహోదరుడైన ఏశావుకు యాకోబు మీద ఎంత కోపం ఉండేదంటే తనను చంపేస్తాడేమోననే భయంతో యాకోబు ఊరు విడిచి పారిపోవాల్సివచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత యాకోబు తిరిగివచ్చాడు. అప్పుడు ఏశావు 400 మంది మనుష్యులతో కలిసి ఆయనను కలవడానికి వెళ్లాడు. ఆ సమయంలో యాకోబు యెహోవా సహాయం కోసం ప్రార్థించాడు. ఆ తర్వాత ఏశావును కలుసుకునే ముందు యాకోబు ఆయనకు బహుమానంగా ఎన్నో పశువులను పంపించాడు. దానివల్ల యాకోబు అనుకున్నది సాధించగలిగాడు. వారు కలుసుకునే సమయానికి ఏశావు మనసు మెత్తబడింది, ఆయన పరుగెత్తుకొని వెళ్లి తన తమ్ముణ్ణి కౌగిలించుకున్నాడు.—ఆది. 27:41-44; 32:6, 11, 13-15; 33:4, 10.
దయగల మాటలతో ఇతరులను ప్రోత్సహించండి
12. మనం మన సహోదరులతో ఎందుకు దయగా మాట్లాడాలి?
12 క్రైస్తవులు దేవుణ్ణి సేవిస్తారు కానీ మనుష్యులను కాదు. అయినా ఇతరుల ఆమోదం పొందాలని మనం కోరుకోవడం సహజమే. మన దయగల మాటలు సహోదర సహోదరీల భారాలను తగ్గిస్తాయి. అదే మనం కఠినంగా విమర్శిస్తే వారి భారాలు మరింత పెరుగుతాయి. యెహోవా అనుగ్రహాన్ని తాము కోల్పోయామేమో అని కొందరు అనుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి, మనం నిజాయితీగా ఇతరులను ప్రోత్సహించే విధంగా మాట్లాడదాం. “వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకు[దాం].”—ఎఫె. 4:29.
13. పెద్దలు (ఎ) ఉపదేశమిస్తున్నప్పుడు (బి) ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతున్నప్పుడు ఏమి గుర్తుంచుకోవాలి?
13 ముఖ్యంగా పెద్దలు ‘సాధు’ స్వభావాన్ని చూపిస్తూ మందతో మృదువుగా వ్యవహరించాలి. (1 థెస్స. 2:7, 8) పెద్దలు ఎవరికైనా, చివరకు ‘ఎదురాడువారికైనా’ సరే ఉపదేశమివ్వాల్సివస్తే దాన్ని ‘సాత్వికంగా’ ఇవ్వాలి. (2 తిమో. 2:26) ఇతర పెద్దల సభకు లేదా బ్రాంచి కార్యాలయానికి ఉత్తరాలు రాయాల్సివచ్చినప్పుడు కూడా వారు దయగల మాటలనే ఉపయోగించాలి. వారు మత్తయి 7:12లోని మాటలను గుర్తుంచుకొని అవతలివారిని నొప్పించని విధంగా, దయగా వ్యవహరించాలి.
కుటుంబంలో దయగల మాటలు ఉపయోగించండి
14. పౌలు భర్తలకు ఏ ఉపదేశాన్నిచ్చాడు? ఎందుకు?
14 మన మాటలు, ముఖకవళికలు, శరీర భాష ఇతరుల మీద మనం అనుకునేదాని కన్నా ఎక్కువ ప్రభావం చూపించవచ్చు. ఉదాహరణకు, తాము మాట్లాడే మాటలు స్త్రీల మనసును ఎంత బాధపెడతాయో కొంతమంది పురుషులకు తెలియకపోవచ్చు. ఓ సహోదరి ఇలా చెప్పింది: “నామీద మావారు కోపంతో గట్టిగా మాట్లాడినప్పుడు నాకు భయమేస్తుంది.” కఠినమైన మాటలు ఓ పురుషునికన్నా స్త్రీమీద ఎక్కువ ప్రభావం చూపించవచ్చు. అలాంటి మాటల్ని ఓ స్త్రీ ఎంతోకాలం గుర్తుంచుకునే అవకాశముంది. (లూకా 2:19) ప్రేమించి, గౌరవించాలనుకునే వ్యక్తే అలా మాట్లాడితే ఆమె ఎంతో బాధపడుతుంది. పౌలు భర్తలకు ఇలా ఉపదేశించాడు: “భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి.”—కొలొ. 3:19.
15. ఓ భర్త తన భార్యతో ఎందుకు సున్నితంగా వ్యవహరించాలో ఉదహరించండి.
15 ఓ భర్త తన భార్యను ‘బలహీనమైన ఘటంగా’ పరిగణించి ఆమెతో ఎందుకు సున్నితంగా వ్యవహరించాలో వివరించేందుకు అనుభవంగల వివాహిత సహోదరుడు ఒక ఉదాహరణ చెప్పాడు. “ఎంతో విలువైన, సున్నితమైన ఓ గాజుపాత్రను మీరు పట్టుకుంటున్నప్పుడు మీరు మీ బలాన్నంతా ఉపయోగించి పట్టుకోరు. అలా చేస్తే దానిమీద పగుళ్లు ఏర్పడతాయి. దాన్ని అతికించినా, పగుళ్లైతే స్పష్టంగా కనిపిస్తాయి” అని ఆయన అన్నాడు. “ఓ భర్త తన భార్యతో కఠినంగా మాట్లాడితే, ఆయన ఆమెను బాధపెట్టవచ్చు. వారి బంధంపై అది శాశ్వత పగుళ్లను మిగిల్చవచ్చు.”—1 పేతురు 3:7 చదవండి.
16. ఓ భార్య తన కుటుంబాన్ని ఎలా ప్రోత్సహించవచ్చు?
16 ఇతరుల మాటలవల్ల, ముఖ్యంగా తమ భార్యల మాటలవల్ల పురుషులు కూడా ప్రోత్సహించబడవచ్చు లేదా నిరుత్సాహానికి గురికావచ్చు. ఓ భర్త “సుబుద్ధిగల భార్య” మీద ఎంతో ‘నమ్మకముంచుతాడు.’ అలాంటి భార్య తన భావాలను భర్త అర్థం చేసుకోవాలని ఎలాగైతే కోరుకుంటుందో అలాగే తన భర్త భావాలను ఆమె అర్థం చేసుకుంటుంది. (సామె. 19:14; 31:11) మంచికైనా, చెడుకైనా భార్య ఓ కుటుంబంపై ఎంతో ప్రభావాన్ని చూపించవచ్చు. “జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టును మూఢురాలు తన చేతులతో తన యిల్లు ఊడ బెరుకును” అని బైబిలు చెబుతోంది.—సామె. 14:1.
17. (ఎ) పిల్లలు తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి? (బి) పెద్దవారు పిల్లలతో ఎలా మాట్లాడాలి? ఎందుకు?
17 అలాగే తల్లిదండ్రులు, పిల్లలు ఒకరితో ఒకరు దయగా మాట్లాడుకోవాలి. (మత్త. 15:4) ఆలోచించి మాట్లాడితే మనం పిల్లలకు ‘కోపం’ పుట్టించం. (కొలొ. 3:21; ఎఫె. 6:4) తల్లిదండ్రులు, పెద్దలు పిల్లలను క్రమశిక్షణలో పెట్టాల్సివచ్చినా వారితో గౌరవపూర్వకంగా మాట్లాడాలి. అలా చేస్తే తప్పులను సరిదిద్దుకోవడానికి పిల్లలకు కష్టమనిపించదు. అంతేకాక, వారు దేవునితో తమకున్న సంబంధాన్ని కాపాడుకోగలుగుతారు. మనం గౌరవపూర్వకంగా మాట్లాడాలే కానీ వారిని బాగుచేయడం మన తరంకాదు అనే విధంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే వారు కూడా తాము మారడం సాధ్యంకాదని అనుకునే ప్రమాదముంది. తమను సరిదిద్దేందుకు ఇతరులు చెప్పిన మాటలన్నీ పిల్లలు గుర్తుంచుకోకపోవచ్చు కానీ, తమతో మాట్లాడిన తీరును మాత్రం గుర్తుంచుకుంటారు.
మనస్ఫూర్తిగా మంచి విషయాలు మాట్లాడండి
18. కోపావేశాలను ఎలా తీసేసుకోవచ్చు?
18 కోపాన్ని అదుపులో ఉంచుకోవడమంటే, లోన కోపమున్నా బయటికి ప్రశాంతంగా ఉన్నట్లు నటించడం కాదు. మనకున్న బలమైన భావోద్వేగాలను అణచుకుంటే సరిపోదు. లోలోన కోపం అగ్గిలా మండుతున్నా బయటికి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తే అది మనపై ఒత్తిడిని పెంచుతుంది. అది ఒకే సమయంలో యాక్సిలేటర్‌ను తొక్కుతూ బ్రేకు వేసినట్లు ఉంటుంది. అది కారు ఇంజన్‌మీద అదనపు భారాన్ని పెంచి దాన్ని పాడుచేస్తుంది. కోపాన్ని పట్టివుంచి ఆ తర్వాత ఒకేసారి దాన్ని వెళ్లగక్కకండి. కోపావేశాలను తగ్గించుకునేందుకు సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించండి. ఆయన చిత్తానికి అనుగుణంగా మీ మనసుల్ని, హృదయాల్ని మలిచేందుకు దేవుని ఆత్మను అనుమతించండి.—రోమీయులు 12:2; ఎఫెసీయులు 4:23, 24 చదవండి.
19. కోపంతో ఒకరిమీద ఒకరు విరుచుకుపడే పరిస్థితి రాకూడదంటే మనం ఏ చర్యలు తీసుకోవాలి?
19 మీ భావోద్వేగాలను అణచుకునేందుకు కావాల్సిన చర్యలు తీసుకోండి. ఆవేశం కలిగించే పరిస్థితిలో మీరు ఉన్నారనుకుందాం. మీలో కోపం పెరుగుతోందని మీకు అనిపిస్తే మీరు ఆ స్థలాన్ని విడిచివెళ్లడం మంచిది. దానివల్ల మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేందుకు వీలౌతుంది. (సామె. 17:14) అవతలి వ్యక్తి కోపంతో మాట్లాడడం మొదలుపెడితే దయగా మాట్లాడడానికి మరింత ఎక్కువగా కృషిచేయండి. “మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును” అని గుర్తుంచుకోండి. (సామె. 15:1) మనసు బాధపెట్టే కఠినమైన మాటను మృదువైన స్వరంతో చెప్పినా సరే అది అగ్నికి ఆజ్యం పోస్తుంది. (సామె. 26:21) ఒకానొక పరిస్థితి మీ ఆత్మ నిగ్రహాన్ని పరీక్షిస్తే ‘మాటలాడుటకు, కోపించుటకు నిదానించండి.’ చెడు మాటలను కాకుండా మంచి మాటల్నే మాట్లాడేలా పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇవ్వమని యెహోవాకు ప్రార్థించండి.—యాకో. 1:19.
మనస్ఫూర్తిగా క్షమించండి
20, 21. ఇతరులను క్షమించడానికి మనకు ఏది సహాయం చేస్తుంది? మనం ఎందుకు అలా చేయాలి?
20 విచారకరంగా, మనలో ఎవ్వరమూ పరిపూర్ణ స్థాయిలో నాలుకను అదుపులో ఉంచుకోలేం. (యాకో. 3:2) కుటుంబ సభ్యులు, మన ప్రియ సహోదర సహోదరీలు బాధపెట్టే మాటలు మాట్లాడకూడదని ఎంతో ప్రయత్నిస్తుండవచ్చు. అయినా వారు కూడా కొన్నిసార్లు మన మనసు నొప్పించే అవకాశముంది. అలాంటప్పుడు వెంటనే వారిమీద కోపగించుకునే బదులు వారు ఎందుకు అలా అన్నారో ఓపిగ్గా ఆలోచించాలి. (ప్రసంగి 7:8, 9 చదవండి.) వారు ఒత్తిడిలో ఉన్నారా? ఏ విషయంలోనైనా భయపడుతున్నారా? లేదా ఆరోగ్యం బాగాలేదా? ఏదైనా సమస్య వారిని వేధిస్తోందా?
21 అలాంటి పరిస్థితులు ఉన్నంతమాత్రాన ఓ వ్యక్తి అవతలివారిమీద విరుచుకుపడాలనేమీ లేదు. అయితే వారి పరిస్థితులను మనసులో ఉంచుకుంటే కొన్నిసార్లు ప్రజలు ఎందుకు అనకూడని మాటలు అంటారో, ఎందుకు చేయకూడని పనులు చేస్తారో మనం అర్థం చేసుకుంటాం. వారిని క్షమించగలుగుతాం. ఇతరులను బాధపెట్టే మాటలను మనందరం అనివుంటాం లేదా బాధపెట్టే పనులను చేసివుంటాం. అలాంటి సమయాల్లో వారు మనల్ని దయతో క్షమించాలని ఆశిస్తాం. (ప్రసం. 7:21, 22) దేవుడు మనల్ని క్షమించాలంటే, మనం తప్పనిసరిగా ఇతరులను క్షమించాలని యేసు చెప్పాడు. (మత్త. 6:14, 15; 18:21, 22, 35) కాబట్టి క్షమాపణ కోరేందుకూ, క్షమించేందుకూ త్వరపడాలి. అలా మనం కుటుంబంలో, సంఘంలో “పరిపూర్ణతకు అనుబంధమైన” ప్రేమను కాపాడుకోగలుగుతాం.—కొలొ. 3:14.
22. దయతో మాట్లాడేందుకు కృషిచేయడం ఎందుకు ప్రయోజనకరం?
22 కోపంతో నిండిన ఈ విధానపు అంతం దగ్గరపడుతుండగా మన సంతోషాన్ని, ఐక్యతను దెబ్బతీసే విషయాలు పెరగవచ్చు. దేవుని వాక్యంలో మనకు ఉపయోగపడే సూత్రాలను అన్వయించుకుంటే మనం మంచికే గానీ చెడుకు మన నాలుకను ఉపయోగించం. మనం సంఘంలోనివారితో, కుటుంబ సభ్యులతో సమాధానంగా ఉండగలుగుతాం. మన మాదిరివల్ల ‘సమాధానకర్తయగు దేవుడైన’ యెహోవా గురించి ఇతరులకు చక్కని సాక్ష్యమివ్వగలుగుతాం.—రోమా. 15:33.
మీరు వివరించగలరా?
• సమస్యలను చర్చించడానికి సరైన సమయాన్ని ఎంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
• కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఒకరితో ఒకరు “కృపాసహితముగా” లేదా దయగా ఎందుకు మాట్లాడుకోవాలి?
• ఇతరులను బాధపెట్టే మాటలు మాట్లాడకూడదంటే ఏమి చేయాలి?
• ఇతరులను క్షమించేందుకు మనకు ఏది సహాయం చేస్తుంది?
[అధ్యయన ప్రశ్నలు]
[21వ పేజీలోని చిత్రాలు]
మీ భావోద్వేగాలు చల్లారిన తర్వాతే సరైన సమయం చూసుకొని మాట్లాడండి
[23వ పేజీలోని చిత్రం]
ఓ వ్యక్తి తన భార్యతో ఎప్పుడూ మృదువుగా మాట్లాడాలి