కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని ప్రజల మధ్య భద్రతను పొందండి

దేవుని ప్రజల మధ్య భద్రతను పొందండి

దేవుని ప్రజల మధ్య భద్రతను పొందండి

“మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను.”—కీర్త. 35:18.

1-3. (ఎ) కొంతమంది క్రైస్తవులు ఎలా ఆధ్యాత్మిక ప్రమాదంలో పడవచ్చు? (బి) దేవుని ప్రజలు ఎక్కడ సురక్షితంగా ఉండవచ్చు?

 సెలవుల్లో జో, అతని భార్య ఓ సముద్రం దగ్గరికి వెళ్లారు. వారు సముద్రంలో ఈదుతూ ఉష్ణమండల పగడపు దిబ్బలు (ట్రాపికల్‌ కోరల్‌ రీఫ్‌) ఉన్నచోటికి వెళ్లారు. నీటి లోపల వేర్వేరు సైజుల్లో ఉన్న రంగు రంగుల చేపలెన్నో ఆ దిబ్బల చుట్టూ ఉన్నాయి. కనువిందైన ఆ దృశ్యాన్ని వీక్షిస్తూ వారు ఇంకొంచెం లోపలికి వెళ్లారు. ఒకానొక చోట సముద్ర గర్భం ఎంతో లోతుగా కనిపించినప్పుడు జో భార్య, “మనం చాలా దూరం వచ్చినట్లున్నాం” అని అంది. దానికి జో, “భయపడకు, నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు” అని అన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత, ‘ఇప్పటిదాకా కనిపించిన చేపలన్నీ ఎక్కడికెళ్లాయి’ అని ఆశ్చర్యపోయాడు. ఆయన అలా అనుకునేలోపే ఓ భయంకరమైన విషయం అర్థమైంది. లోపలి నుండి ఒక షార్క్‌ చేప వారివైపు రాసాగింది. అప్పుడు వారిది ఏమీ చేయలేని పరిస్థితి. కానీ, ఆ చేప వారి దగ్గరిదాకా వచ్చినట్లే వచ్చి అంతలోనే పక్కకు తిరిగి వెళ్లిపోయింది.

2 ఓ క్రైస్తవుడు, సాతాను వ్యవస్థ అందించే వినోదం, ఉద్యోగం, ఆస్తిపాస్తుల వంటి ఆకర్షణీయమైన విషయాల్లో ఎంతగా మునిగిపోవచ్చంటే తాను ప్రమాదకరమైన నీటిలో ఉన్నాననే విషయాన్ని ఆయన గుర్తించకపోవచ్చు. క్రైస్తవ సంఘ పెద్దగా సేవచేస్తున్న జో ఇలా అన్నాడు: “నాకు ఎదురైన ఆ అనుభవం మనం ఎవరితో సహవసిస్తున్నామనే విషయం గురించి ఆలోచించేలా చేసింది. ఎప్పుడైనా సరే మీరు సురక్షితంగా, సంతోషంగా ఉండగలిగే చోట మాత్రమే అంటే సంఘంలోనే ఈదండి!” ఆధ్యాత్మికంగా మిమ్మల్ని ఒంటరివాళ్లను చేసే, ప్రమాదంలోకి నెట్టివేసే లోతైన నీళ్లలోకి వెళ్లకండి. మీరు అలాంటి నీళ్లలో ఉన్నారని గుర్తిస్తే, తక్షణమే తిరిగి ‘సురక్షితమైన నీటిలోకి’ రండి. మీరలా చేయకపోతే ఆధ్యాత్మిక ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

3 నేటి లోకం క్రైస్తవులకు సురక్షితమైన స్థలం కాదు. (2 తిమో. 3:1-5) తనకు సమయం కొంచెమే ఉందని సాతానుకు తెలుసు కాబట్టి అప్రమత్తంగా లేనివారిని మ్రింగివేయాలని ప్రయత్నిస్తున్నాడు. (1 పేతు. 5:8; ప్రక. 12:12, 17) అయినా, మనకు ఓ సురక్షితమైన స్థలం ఉంది. యెహోవా తన ప్రజల కోసం క్రైస్తవ సంఘమనే సురక్షితమైన ఆశ్రయ స్థలాన్ని ఏర్పాటు చేశాడు.

4, 5. చాలామంది తమ భవిష్యత్తు గురించి ఏమి అనుకుంటున్నారు, ఎందుకు?

4 ఈ లోక సంస్థలు మనకు భౌతికంగానైనా, భావోద్వేగపరంగానైనా కొంతమేరకు మాత్రమే భద్రతను ఇవ్వగలవు. నేరం, హింస, పెరుగుతున్న జీవన వ్యయం, వాతావరణ సమస్యల వంటివాటి వల్ల తమ భద్రతకు ప్రమాదం పొంచివుందని చాలామంది అనుకుంటున్నారు. వృద్ధాప్యం, అనారోగ్యం వంటి సమస్యలు అందరికీ ఉన్నాయి. ఉద్యోగం, ఇళ్లు, కావాల్సినంత డబ్బు, కొంతమేరకు మంచి ఆరోగ్యం వంటివి ఉన్నవారు అవి తమకు ఎంతోకాలం ఉండకపోవచ్చని ఆందోళన చెందుతుండవచ్చు.

5 అదేవిధంగా చాలామందికి భావోద్వేగపరమైన భద్రత కరువైంది. విచారకరమైన విషయమేమిటంటే చాలామంది పెళ్లిచేసుకొని పిల్లల్ని కని, సుఖసంతోషాలతో ఉండాలని ఆశించారు. కానీ పెళ్లి తర్వాత వారి ఆశలు అడియాశలుగానే మిగిలాయి. ఇక ఆధ్యాత్మిక భద్రత విషయానికొస్తే, చర్చీలకు వెళ్తున్న చాలామంది తమకు ఇవ్వబడుతున్న మార్గనిర్దేశం అసలు ప్రయోజనకరమైనదేనా అని ఆలోచిస్తూ అయోమయంలో ఉన్నారు. ముఖ్యంగా చర్చీల్లోని మతనాయకులు బైబిలుకు విరుద్ధంగా ప్రవర్తించడం, బోధించడం చూసి ప్రజలు అలా అయోమయంలో పడుతున్నారు. ఇక విజ్ఞానశాస్త్రాన్ని లేదా తోటిమానవుల మంచితనాన్ని నమ్ముకోవడమే మేలని చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి, ప్రజలు ఎంతో అభద్రతా భావంతో ఉండడం లేదా భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించకూడదని అనుకోవడం చూసి మనం ఆశ్చర్యపోనక్కర్లేదు.

6, 7. (ఎ) భవిష్యత్తు విషయంలో యెహోవాను సేవించేవారికీ, సేవించనివారికీ మధ్య ఎందుకు అంత తేడా ఉంది? (బి) మనం ఏమి పరిశీలిస్తాం?

6 భవిష్యత్తు విషయంలో లోకస్థుల ఆలోచనా తీరుకూ, క్రైస్తవ సంఘంలోనివారి ఆలోచనా తీరుకూ మధ్య ఎంత తేడా ఉంది! అయితే, లోకస్థులకు ఎదురయ్యే సమస్యలే మనకూ ఎదురౌతున్నా యెహోవా ప్రజలుగా మనం వాటికి స్పందించే తీరు పూర్తి భిన్నంగా ఉంటుంది. (యెషయా 65:13, 14; మలాకీ 3:18 చదవండి.) ఎందుకు? ప్రస్తుతం మానవజాతి ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉందనే ప్రశ్నకు బైబిలు సంతృప్తికరమైన జవాబిస్తోంది. కాబట్టి, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, సమస్యలను తట్టుకొని నిలబడడానికి మనం సంసిద్ధంగా ఉన్నాం. ఆ కారణంగా, మనం భవిష్యత్తు గురించి అతిగా చింతించం. యెహోవా ఆరాధికులముగా మనం, లేఖన విరుద్ధమైన తప్పుడు తర్కాల నుండి, అనైతిక ప్రవర్తన నుండి, వాటివల్ల వచ్చే దుష్ఫలితాల నుండి కాపాడబడుతున్నాం. అందుకే, క్రైస్తవ సంఘ సభ్యులముగా మనం ఇతరులు చవిచూడని ప్రశాంతతను అనుభవిస్తున్నాం.—యెష. 48:17, 18; ఫిలి. 4:6, 7.

7 లోకస్థులకు లేని భద్రత, యెహోవా సేవకులు ఎలా అనుభవిస్తున్నారో తెలుసుకునేందుకు కొన్ని ఉదాహరణలు సహాయం చేయవచ్చు. మన ఆలోచనలను, అలవాట్లను పరిశీలించుకొని, మన రక్షణ కోసం యెహోవా ఇచ్చిన నిర్దేశాన్ని మనం మరింత ఎక్కువగా అన్వయించుకునే అవకాశముందా అని ఆలోచించడానికి ఈ ఉదాహరణలు సహాయం చేయవచ్చు.—యెష. 30:21.

“నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను”

8. యెహోవా సేవకులు ఎల్లప్పుడూ ఏమి చేయాల్సివచ్చింది?

8 మానవ చరిత్ర ఆరంభం నుండి, యెహోవాను సేవించి ఆయనకు లోబడాలని నిర్ణయించుకున్నవారు, యెహోవా సేవకులుకాని వారితో స్నేహం చేయలేదు. నిజానికి, తన ఆరాధికులకూ సాతాను అనుచరులకూ మధ్య శత్రుత్వం ఉంటుందని యెహోవా ముందే సూచించాడు. (ఆది. 3:15) దేవుని ప్రజలు ఆయన సూత్రాలను తూ.చా. తప్పకుండా పాటించారు కాబట్టి, వారు తమ చుట్టూవున్న వారికి భిన్నంగా ప్రవర్తించారు. (యోహా. 17:15, 16; 1 యోహా. 2:15-17) అలా ప్రవర్తించడం అన్ని సందర్భాల్లో సులభమేమీ కాలేదు. నిజానికి గతంలో కొంతమంది యెహోవా సేవకులు, అసలు స్వయంత్యాగపూరితమైన జీవితాన్ని గడపడం జ్ఞానయుక్తమేనా అని కొన్నిసార్లు ప్రశ్నించారు.

9. 73వ కీర్తనను రాసిన వ్యక్తి ఎలాంటి సంఘర్షణను అనుభవించాడు?

9 కొంతమంది యెహోవా సేవకులు తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనా అని ఆలోచించారు. అలా ఆలోచించినవారిలో 73వ కీర్తనను రాసిన వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన బహుశా ఆసాపు వంశీయుడు అయ్యుండొచ్చు. దేవుణ్ణి సేవించడానికి కృషి చేసేవారు పరీక్షలను, కష్టాలను అనుభవిస్తుంటే దుష్టులు మాత్రం వర్ధిల్లుతూ సుఖసంతోషాలను ఎందుకు అనుభవిస్తున్నారని ఆ కీర్తనకర్త అడిగాడు.కీర్తన 73:1-13 చదవండి.

10. కీర్తనకర్త ప్రస్తావించిన విషయాల గురించి మీరు ఎందుకు ఆలోచించాలి?

10 కీర్తనకర్త ప్రస్తావించిన అలాంటి ప్రశ్నల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? అలాగైతే, మీరు ఏదో తప్పుగా ఆలోచించినట్లు అపరాధ భావాలతో సతమతం కానవసరంలేదు లేదా మీ విశ్వాసం బలహీనపడిందని బాధపడాల్సిన అవసరం లేదు. నిజానికి, బైబిలు రాయడానికి యెహోవా ఉపయోగించుకున్న వారితోసహా చాలామంది యెహోవా సేవకులకు అలాంటి ప్రశ్నలే వచ్చాయి. (యోబు 21:7-13; కీర్త. 37:1; యిర్మీ. 12:1; హబ. 1:1-4, 13) అయితే, యెహోవాను సేవించాలని కోరుకునేవారందరూ, “దేవుణ్ణి సేవిస్తూ ఆయనకు విధేయత చూపించడం ఉత్తమమైనదేనా?” అనే ప్రశ్న గురించి తప్పక తీవ్రంగా ఆలోచించి, దాని జవాబును అంగీకరించాలి. సాతాను ఏదెను తోటలో లేవదీసిన వివాదాంశంతో ఈ ప్రశ్నకు సంబంధముంది. దేవుని విశ్వసర్వాధిపత్యపు హక్కుకు సంబంధించిన వివాదాంశంలో అదే ముఖ్యమైనది. (ఆది. 3:4, 5) అందుకే, మనం కీర్తనకర్త ప్రస్తావించిన విషయాల గురించి ఆలోచించాలి. ఎలాంటి సమస్యలు లేకుండా చక్కగా జీవిస్తున్నట్లు కనిపించే దుష్టులను చూసి మనం అసూయపడాలా? యెహోవాను సేవించడం మానేసి ఈ లోకంలోని ప్రజల్ని అనుకరించాలా? మనం అలా చేయాలనే సాతాను కోరుకుంటున్నాడు.

11, 12. (ఎ) తనకు వచ్చిన సందేహాల్ని కీర్తనకర్త ఎలా తీర్చుకున్నాడు? దాని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (బి) కీర్తనకర్త వచ్చిన ముగింపుకు మీరు కూడా రావడానికి మీకు ఏది సహాయం చేసింది?

11 తనకు వచ్చిన సందేహాలను తీర్చుకోవడానికి కీర్తనకర్తకు ఏది సహాయం చేసింది? తాను నీతి మార్గాల నుండి దాదాపు తప్పిపోయానని ఆయన ఒప్పుకున్నాడు. అయితే, ‘దేవుని పరిశుద్ధ స్థలంలోకి’ ప్రవేశించినప్పుడు అంటే దేవుని ఆలయంలోని ఆధ్యాత్మిక ప్రజలతో సహవసించి దేవుని సంకల్పం గురించి ధ్యానించినప్పుడు ఆయన అభిప్రాయం మారింది. దుష్టులకు జరిగేవిధంగా తనకు జరగకూడదని అప్పుడు ఆయనకు అర్థమైంది. వారు ప్రవర్తించేతీరు వల్ల, జీవితంలో వారు తీసుకుంటున్న నిర్ణయాలవల్ల “కాలుజారు చోట” ఉన్నారని ఆయన గ్రహించగలిగాడు. యెహోవాను విడిచిపెట్టి ఆధ్యాత్మిక వ్యభిచారం చేసేవారు “మహాభయముచేత” అంతమౌతారు. కానీ, తనను సేవించేవారిని మాత్రం యెహోవా ఆదుకుంటాడని కీర్తనకర్త అర్థం చేసుకున్నాడు. (కీర్తన 73:16-19, 27, 28 చదవండి.) ఆ మాటలు అక్షరాలా నిజమని మీరు గుర్తించేవుంటారు. దేవుని నియమాలను పట్టించుకోకుండా తమ స్వప్రయోజనం కోసం జీవిస్తే బాగుంటుందని చాలామందికి అనిపించవచ్చు. కానీ, అలా జీవించడం వల్ల వచ్చే పరిణామాలను వారు తప్పించుకోలేరు.—గల. 6:7-9.

12 కీర్తనకర్త అనుభవం నుండి మనం ఇంకేమి నేర్చుకోవచ్చు? దేవుని ప్రజల మధ్య భద్రత, జ్ఞానం ఉన్నాయని ఆయన తెలుసుకున్నాడు. యెహోవా ఆరాధనా స్థలానికి వెళ్లినప్పుడు ఆయన జాగ్రత్తగా, తర్కబద్ధంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. నేడు కూడా, మనం కూటాలకు వెళ్లినప్పుడు అక్కడ వివేకంగల ఉపదేశకులను చూస్తాం, మంచి ఆధ్యాత్మిక ఆహారాన్ని ఆస్వాదిస్తాం. అందుకే యెహోవా, క్రైస్తవ కూటాలకు హాజరుకమ్మని తన సేవకులకు చెప్పాడు. అక్కడే వారు కావాల్సిన ప్రోత్సాహాన్ని పొందుతారు, వివేకంతో ప్రవర్తించాలనే ప్రేరణనూ పొందుతారు.—యెష. 32:1, 2; హెబ్రీ. 10:24, 25.

మీ స్నేహితులను జ్ఞానయుక్తంగా ఎంచుకోండి

13-15. (ఎ) దీనాకు ఎలాంటి అనుభవం ఎదురైంది? దాని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (బి) తోటి క్రైస్తవులతో స్నేహం చేస్తే సురక్షితంగా ఉంటామని ఎందుకు చెప్పవచ్చు?

13 లోకస్థులతో స్నేహం చేయడం వల్ల ఎంతోమంది పెద్దపెద్ద సమస్యల్లో చిక్కుకున్నారు. వారిలో యాకోబు కుమార్తెయైన దీనా ఒకరు. తమ కుటుంబం నివసిస్తున్న ప్రాంతంలోని కనాను యువతులతో దీనా స్నేహం చేసేదని ఆదికాండములోని వృత్తాంతం చూపిస్తోంది. యెహోవా ఆరాధకులు పాటించే ఉన్నత నైతిక ప్రమాణాలను కనానీయులు పాటించేవారు కాదు. పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్న దాన్నిబట్టి, కనానీయుల ప్రవర్తన తమ దేశమంతా విగ్రహారాధనతో, అనైతికతతో, దిగజారిన లైంగిక ఆరాధనతో, హింసతో నిండిపోయేలా చేసిందని తెలుస్తోంది. (నిర్గ. 23:23; లేవీ. 18:2-25; ద్వితీ. 18:9-12) అలాంటి ప్రజలతో దీనా సహవసించడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు వచ్చాయో గుర్తుచేసుకోండి.

14 స్థానికుడైన షెకెము “తన తండ్రి యింటి వారందరిలో ఘనుడు” అనే పేరు పొందాడు. ఆయన దీనాను చూసి “ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను.” (ఆది. 34:1, 2, 19) ఎంత ఘోరం జరిగింది! తనకు అలా జరుగుతుందని అసలు దీనా ఎప్పుడైనా ఊహించివుంటుందా? బహుశా చాలా మంచివారిగా కనిపించిన స్థానిక యువతీయువకులతో ఆమె స్నేహం చేయడానికి ప్రయత్నించివుంటుంది. కానీ, దీనా ఎంతో మోసపోయింది.

15 ఈ వృత్తాంతం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? అవిశ్వాసులతో స్నేహం చేస్తూ మనకు ఎలాంటి హాని జరగదని అనుకోలేం. “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును” అని లేఖనాలు చెబుతున్నాయి. (1 కొరిం. 15:33) అయితే మీకున్న నమ్మకాలు, ఉన్నత నైతిక ప్రమాణాలు ఉన్నవారితోనే, యెహోవాను ప్రేమించేవారితోనే స్నేహం చేస్తే మీరు సురక్షితంగా ఉంటారు. అంతేకాక, మీరు జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలనే ప్రోత్సాహాన్ని పొందుతారు.—సామె. 13:20.

‘మీరు కడుగబడ్డారు’

16. కొరింథు సంఘంలోని కొందరి గురించి పౌలు ఏమి చెప్పాడు?

16 తమకున్న అపవిత్రమైన అలవాట్లను మానుకునేందుకు చాలామందికి క్రైస్తవ సంఘం సహాయం చేసింది. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, దేవుని ప్రమాణాలకు అనుగుణంగా జీవించేందుకు అక్కడి క్రైస్తవులు చేసుకున్న మార్పులను గురించి రాశాడు. వారిలో కొందరు జారులుగా, విగ్రహారాధకులుగా, వ్యభిచారులుగా, సలింగ సంయోగులుగా, దొంగలుగా, తాగుబోతులుగా ఉండేవారు. కానీ, ‘మీరు కడుగబడ్డారు’ అని పౌలు వారికి చెప్పాడు.—1 కొరింథీయులు 6:9-11 చదవండి.

17. బైబిలు ప్రమాణాలను పాటించడం వల్ల చాలామంది జీవితాలు ఎలా మారాయి?

17 అవిశ్వాసులు సరైన మార్గనిర్దేశక సూత్రాలను పాటించరు. వారు తమకిష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తారు లేదా పూర్వం కొరింథీయులు విశ్వాసులుగా మారకముందు చెడు మార్గాల్ని అనుసరించినట్లే నేటి అవిశ్వాసులు కూడా తమ చుట్టూవున్న ప్రజల అనైతిక విధానాలను అనుసరిస్తారు. (ఎఫె. 4:14) కానీ దేవుని వాక్యం గురించిన, ఆయన సంకల్పం గురించిన ఖచ్చితమైన జ్ఞానానికి ప్రజల జీవితాలను మార్చే శక్తి ఉంది. అలా మారాలంటే వారు లేఖనాలను తమ జీవితంలో అన్వయించుకోవాలి. (కొలొ. 3:5-10; హెబ్రీ. 4:12) తాము యెహోవా నీతి ప్రమాణాల గురించి నేర్చుకొని వాటిని పాటించకముందు తామెంత విచ్ఛలవిడిగా జీవించారో నేడు క్రైస్తవ సంఘంలో భాగంగావున్న చాలామంది మీకు చెప్పగలరు. అలా జీవించినప్పటికీ వారు సంతృప్తిని, సంతోషాన్ని పొందలేకపోయారు. కానీ, దేవుని ప్రజలతో స్నేహం చేయడం ప్రారంభించి బైబిలు సూత్రాలను పాటించినప్పటి నుండే వారు సమాధానాన్ని చవిచూశారు.

18. ఒక యౌవనస్థురాలికి ఎలాంటి అనుభవం ఎదురైంది? అది దేన్ని రుజువు చేస్తోంది?

18 మరోవైపున, క్రైస్తవ సంఘమనే ‘సురక్షితమైన నీటిని’ విడిచిపెట్టి వెళ్లినవారు తాము తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇప్పుడు ఎంతో బాధపడుతున్నారు. ఒక సహోదరి అనుభవాన్ని చూద్దాం. ఆమెను మనం టాన్యా అని పిలుద్దాం. తనకు “చిన్నప్పటి నుండి కొంతమట్టుకు సత్యం తెలుసు” అని ఆమె చెబుతోంది. కానీ, తనకు 16 ఏళ్లున్నప్పుడు “లోక ప్రలోభాలకు ఆకర్షితురాలై” సంఘాన్ని విడిచివెళ్లింది. దానివల్ల ఆమె అవాంఛిత గర్భధారణను, గర్భస్రావాన్ని, మరితర చెడు పరిణామాలను చవిచూసింది. ఇప్పుడు ఆమె ఇలా చెబుతోంది: “క్రైస్తవ సంఘాన్ని విడిచి నేను ఈ లోకంలో గడిపిన మూడు సంవత్సరాలు నా హృదయంపై మానని గాయాల్నే మిగిల్చాయి. ఇంకా పుట్టని నా బిడ్డను నేను చంపేసుకున్నానన్న అపరాధ భావనే నన్ను పదేపదే వేధిస్తుంటుంది. . . . కనీసం కొంతకాలమైనా ఈ లోకాన్ని ‘అనుభవిద్దామని’ అనుకునే యౌవనస్థులకు నేను చెప్పేది ఒక్కటే. ‘వద్దు, అలా చేయవద్దు!’ మొదట్లో అది బాగానే అనిపిస్తుంది కానీ ఆ తర్వాత దానివల్ల మీ జీవితంలో చేదు అనుభవాలే మిగులుతాయి. ఈ లోకం మీకు దుఃఖాన్ని తప్ప మరేమీ ఇవ్వదు. ఎందుకంటే ఆ బాధను నేను అనుభవించాను. మీరు యెహోవా సంస్థలోనే ఉండండి! జీవితంలో సంతోషాన్నిచ్చే మార్గం ఇదొక్కటే.”

19, 20. క్రైస్తవ సంఘంలో ఎలాంటి భద్రత లభిస్తుంది? ఎలా లభిస్తుంది?

19 మీరు క్రైస్తవ సంఘంలో ఉండే సురక్షితమైన వాతావరణాన్ని విడిచిపెడితే ఏమి జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి! సత్యంలోకి రాకముందు తాము గడిపిన వ్యర్థమైన జీవితం గురించి అసలు మళ్లీ ఆలోచించకూడదని చాలామంది అనుకుంటారు. (యోహా. 6:68, 69) క్రైస్తవ సహోదర సహోదరీలతో సన్నిహిత సంబంధం కలిగివుండడం ద్వారా మీరు సాతాను లోకంలో సాధారణంగా కనిపించే శ్రమలను, దుఃఖాన్ని చవిచూడకుండా సురక్షితంగా ఉండవచ్చు. క్రమంగా కూటాలకు హాజరౌతూ క్రైస్తవ సహోదర సహోదరీలతో సహవసించడం వల్ల యెహోవా నీతి ప్రమాణాలు ఎంత జ్ఞానయుక్తమైనవో ఎల్లప్పుడూ గుర్తుంచుకోగలుగుతారు. అంతేకాక, వాటిని పాటించాలనే ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. కీర్తనకర్తలాగే ‘మహాసమాజంలో యెహోవాను స్తుతించడానికి’ మీకు ఎన్నో కారణాలున్నాయి.—కీర్త. 35:18.

20 వివిధ కారణాలనుబట్టి కొన్నిసార్లు క్రైస్తవులకు తమ యథార్థతను కాపాడుకోవడం కష్టమనిపించే అవకాశముంది. అలాంటప్పుడు వారికి ఎవరో ఒకరు సరైన మార్గాన్ని చూపించాల్సి రావచ్చు. అయితే అలాంటి సందర్భాల్లో మీరూ, క్రైస్తవ సంఘంలోని ఇతరులూ వారికి ఎలా సహాయం చేయవచ్చు? మీరు ఎలా ‘ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగజేసుకోవచ్చో’ తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.—1 థెస్స. 5:11.

మీరెలా జవాబిస్తారు?

• 73వ కీర్తనను రాసిన వ్యక్తి అనుభవాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

• దీనా అనుభవం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

• మీరు క్రైస్తవ సంఘంలో సురక్షితంగా ఉంటారని ఎందుకు చెప్పవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[7వ పేజీలోని చిత్రాలు]

సురక్షితమైన చోట ఈదండి. క్రైస్తవ సంఘంలోనే ఉండండి!