కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రేమనుబట్టి ఐక్యపరచబడ్డాం వార్షిక కూటానికి సంబంధించిన నివేదిక

ప్రేమనుబట్టి ఐక్యపరచబడ్డాం వార్షిక కూటానికి సంబంధించిన నివేదిక

ప్రేమనుబట్టి ఐక్యపరచబడ్డాం వార్షిక కూటానికి సంబంధించిన నివేదిక

అది 2009 అక్టోబరు 3వ తారీఖు. ఆ రోజు ఉదయం అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోవున్న జెర్సీ నగరంలో యెహోవాసాక్షుల సమావేశపు హాలు సందడి సందడిగా ఉంది. అక్కడ జరిగిన వాచ్‌టవర్‌ బైబిలు అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ఆఫ్‌ పెన్సిల్వేనియా 125వ వార్షిక కూటానికి 5,000 మంది హాజరయ్యారు. అమెరికాలోని మూడు బెతెల్‌ సముదాయాలకే కాక కెనడా బెతెల్‌కు కూడా ఆడియో/వీడియో ద్వారా ప్రసారం చేయడంవల్ల ఇంకా వేలాదిమంది ఆ కార్యక్రమాన్ని వినగలిగారు లేదా చూడగలిగారు. అలా యెహోవా పట్ల ఉన్న ప్రేమనుబట్టి ఐక్యపరచబడిన 13,235 మంది ఆ మూడు గంటలు ఎంతో ఆనందించారు.

పరిపాలక సభ సభ్యుడైన జెఫ్రీ జాక్సన్‌ ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించాడు. ఆయన, బెతెల్‌ సభ్యులతో కూడిన గాయనీగాయకుల బృందాన్ని పరిచయం చేస్తూ కార్యక్రమాన్ని ఆరంభించాడు. వారు కొత్త పాటల పుస్తకం నుండి పాటలు పాడారు. పరిపాలక సభకు చెందిన మరో సభ్యుడు, డేవిడ్‌ స్ప్లేన్‌ ఆ బృందానికి నాయకత్వం వహిస్తూ స్వచ్ఛారాధనలో సంగీతానికున్న ప్రాముఖ్యతను కొద్దిసేపు వివరించాడు. మూడు కొత్త పాటలు పాడమని అక్కడ సమావేశమైనవారిని ఆహ్వానించాడు. మొదట గాయనీగాయకుల బృందం ఆ పాటను పాడారు. ఆ తర్వాత వారు మళ్లీ పాడుతుండగా సమావేశమైనవారు శ్రుతి కలిపారు. ఆ బృందగానాన్ని కేవలం ఈ ప్రత్యేక సమావేశం కోసం మాత్రమే ఏర్పాటు చేశారు. కానీ ఈ పద్ధతిని సంఘ కూటాల్లో, ఇతర సమావేశాల్లో పాటించకూడదు.

వివిధ బ్రాంచి కార్యాలయాల నివేదికలు

ఆ కార్యక్రమానికి హాజరైన బ్రాంచి కమిటీ సభ్యులు ఐదు బ్రాంచి కార్యాలయాల నివేదికలు అందించారు. త్వరలో అమెరికాకు, కెనడాకు కావాల్సిన చాలా పత్రికలు కెనడాలోనే ముద్రించబడతాయని, అలా తమ బ్రాంచి మునుపటికన్నా పదింతలు ఎక్కువ సాహిత్యాన్ని ఉత్పత్తి చేస్తుందని సహోదరుడు కెనత్‌ లిటల్‌ చెప్పాడు. ఇంత సాహిత్యాన్ని ఉత్పత్తి చేయాలంటే, ఈ మధ్యే కొనుగోలు చేసిన కొత్త ముద్రణా యంత్రాన్ని రోజుకు రెండు షిఫ్టుల్లో నడిపించాలి. అంటే దాన్ని 16 గంటలు నడిపించాల్సి ఉంటుంది.

సహోదరుడు రేనర్‌ థాంప్సన్‌ డొమినికన్‌ రిపబ్లిక్‌లో జరుగుతున్న రాజ్య పనుల గురించి, సహోదరుడు ఆల్బర్ట్‌ ఓలి నైజీరియాలో జరుగుతున్న రాజ్య పనుల గురించి నివేదించారు. ఎన్నో ఏళ్లు హింసను అనుభవించిన తర్వాత 1992లో యెహోవాసాక్షులు మొజాంబిక్‌లో చట్టబద్ధంగా రిజిస్టరు చేయబడ్డారు అని ఆ దేశం నుండి వచ్చిన సహోదరుడు ఎమిల్‌ క్రిట్‌సింగర్‌ వివరించాడు. ఇటీవల ఈ మూడు దేశాల్లో ప్రచారకుల సంఖ్య ఎంతగానో పెరిగింది. ఆస్ట్రేలియా బ్రాంచి నుండి వచ్చిన సహోదరుడు వివ్‌ మోరిట్స్‌ తమ బ్రాంచి పర్యవేక్షణలోవున్న తూర్పు టీమోర్‌లో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడాడు.

పరిపాలక సభ కమిటీలు

1976లో యెహోవాసాక్షుల పనులన్నీ పరిపాలక సభలోని ఆరు కమిటీల పర్యవేక్షణలోకి వచ్చాయి. ఆ తర్వాత వేరే గొర్రెలకు చెందిన కొంతమంది వారికి సహాయకులుగా నియమించబడ్డారు. ఇప్పుడు మొత్తం 23 మంది సహాయకులున్నారు. వారిలో ఆరుగురిని ఇంటర్వ్యూ చేశారు. వీరు మొత్తం కలిపి 341 సంవత్సరాలు పూర్తికాల సేవలో గడిపారు. అంటే ఒక్కొక్కరు సగటున 57 ఏళ్లుగా పూర్తికాల సేవలో ఉన్నారు.

కో-ఆర్డినేటర్స్‌ కమిటీలో పరిపాలక సభలోని ఐదు ఇతర కమిటీల సమన్వయకర్తలు ఉంటారని 1943లో బెతెల్‌కు వచ్చిన డాన్‌ ఆడమ్స్‌ చెప్పాడు. ఈ కమిటీ మిగతా ఐదు కమిటీల పని సవ్యంగా జరిగేలా చూస్తుంది. అత్యవసర పరిస్థితులు, హింసలు, కోర్టు కేసులు, విపత్తులు, తక్షణ చర్య అవసరమయ్యే మరితర సమస్యలు ప్రపంచవ్యాప్తంగావున్న యెహోవాసాక్షులకు ఎదురైనప్పుడు ఈ కమిటీ కావాల్సిన సహాయం చేస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 19,851 బెతెల్‌ సభ్యుల ఆధ్యాత్మిక, భౌతిక అవసరాలను పర్సోనెల్‌ కమిటీ చూసుకుంటుందని డాన్‌ మోల్చన్‌ వివరించాడు. బ్రాంచీలకు కావాల్సిన వివిధ వస్తు సామగ్రిని, యంత్రాలను కొనుగోలు చేసే పనిని పబ్లిషింగ్‌ కమిటీ ఎలా చూసుకుంటుందో డేవిడ్‌ సింక్లేర్‌ వివరించాడు. ఆ తర్వాత, దాదాపు 60 ఏళ్లుగా బెతెల్‌లో సేవ చేస్తున్న రాబర్ట్‌ వాలన్‌ మాట్లాడాడు. సర్వీస్‌ కమిటీ యెహోవా ప్రజలు చేస్తున్న పరిచర్యను, సంఘాల్లో జరిగే పనిని ఎలా పర్యవేక్షిస్తుందో ఆయన వివరించాడు. సమావేశ కార్యక్రమాలను తయారుచేయడానికి టీచింగ్‌ కమిటీ ఎంత కష్టపడుతుందో విలియమ్‌ మాలన్‌ఫాంట్‌ వివరించాడు. చివరిగా రైటింగ్‌ కమిటీ చేసే పని గురించి జాన్‌ విస్‌చక్‌ చెప్పాడు. ఆ కమిటీ మన ప్రచురణల కోసం సమాచారాన్ని తయారుచేసే పనిని, దాని ముద్రణకు సంబంధించిన పనులను ఎలా పర్యవేక్షిస్తుందో ఆయన వివరించాడు. a

2010వ వార్షిక వచనం ప్రేమ గురించి వివరిస్తోంది

తర్వాతి మూడు ప్రసంగాలను పరిపాలక సభ సభ్యులు ఇచ్చారు. “ఇతరులు మిమ్మల్ని ప్రేమించాలని మీరు కోరుకుంటున్నారా?” అనే ప్రశ్నతో గెరిట్‌ లోష్‌ తన ప్రసంగాన్ని ఆరంభించాడు. ప్రేమ మానవునికి చాలా అవసరమనీ ప్రేమ ఉంటేనే జీవితంలో రాణిస్తామనీ ఆయన వివరించాడు. ప్రేమవల్లే మనం ఉనికిలో ఉన్నాం, ఎందుకంటే యెహోవా నిస్వార్థమైన ప్రేమతోనే మనల్ని సృష్టించాడు. అంతేకాక, యెహోవాపట్ల ఉన్న ప్రేమనుబట్టే మనం ప్రకటిస్తాం, బోధిస్తాం.

దేవుని సూత్రాలకు అనుగుణంగా చూపించే ప్రేమ మనలో ఉంటే కేవలం పొరుగువారినే కాక మన శత్రువుల్ని కూడా ప్రేమిస్తాం. (మత్త. 5:43-45) ప్రజలు యేసును కొట్టారు, ఎగతాళి చేశారు, ఆయనపై ఉమ్మి వేశారు, పొడిచారు. అలా ఆయన మనకోసం ఎన్ని భరించాడో ఆలోచించమని శ్రోతలు ప్రోత్సహించబడ్డారు. అంత జరిగినా, తనను చంపిన సైనికుల కోసం యేసు ప్రార్థించాడు. దీని గురించి ఆలోచించినప్పుడు ఆయనను మరింత ఎక్కువగా ప్రేమించాలని మనకు అనిపించడం లేదా? 1 కొరింథీయులు 13: 7, 8 నుండి తీసుకోబడిన ‘ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వతకాలముంటుంది’ అనేది 2010 వార్షిక వచనం అని సహోదరుడు లోష్‌ ఆ తర్వాత ప్రకటించాడు. మనకు కేవలం నిత్యం జీవించే అవకాశమేకాక నిత్యం ప్రేమిస్తూ, ఇతరుల ప్రేమను పొందుతూ ఉండే అవకాశం కూడా ఉంది.

ఇంధనం లేకుండా నడుపుతున్నారా?

సామ్యూల్‌ హెర్డ్‌ ఓ ఉపమానంతో తన ప్రసంగాన్ని ఆరంభించాడు. 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి మిమ్మల్ని తీసుకెళ్లడానికి మీ స్నేహితుడు కారులో మీ దగ్గరకు వచ్చాడనుకోండి. పక్కసీటులో కూర్చున్న మీరు ఇంధనం గేజ్‌ను చూసినప్పుడు వాహనంలో ఇంధనం లేదని మీకు అర్థమౌతుంది. ఇంధనం దాదాపు అయిపోయిందని మీరు మీ స్నేహితునికి చెబుతారు. మీ స్నేహితుడు, ‘ఏం ఫరవాలేదు. ట్యాంకులో ఇంకా 4 లీటర్లు ఉన్నాయి’ అని చెబుతాడు. అయితే కొద్దిసేపటికే ఇంధనం అయిపోతుంది. ‘ఇంధనం లేదని,’ మార్గమధ్యంలో బండి ఆగిపోవచ్చని తెలిసి కూడా దాన్ని నడుపుకుంటూ వెళ్లడం తెలివైన పనేనా? ట్యాంకు నిండా ఇంధనం ఉండేలా చూసుకోవడం ఎంత మంచిది! అలాగే, యెహోవాను గురించిన జ్ఞానమనే ఇంధనంతో మనం మన ట్యాంకులను పూర్తిగా నింపుకోవాలి.

అలా చేయాలంటే, మనం క్రమంగా ఇంధనాన్ని నింపుకుంటూ ఉండాలి. దీన్ని నాలుగు విధాలుగా చేయవచ్చు. మొదటిగా, వ్యక్తిగత అధ్యయనం చేయాలి. ప్రతీ రోజు బైబిలు చదువుతూ దానిలోని విషయాలను బాగా తెలుసుకోండి. అక్కడున్న పదాలను కేవలం చదివితే సరిపోదు, చదువుతున్నదాన్ని అర్థం చేసుకోవాలి. రెండవదిగా, కుటుంబ ఆరాధనా సమయాన్ని చక్కగా ఉపయోగించుకోండి. ప్రతీవారం అలా చేస్తూ మన ట్యాంకులను పూర్తిగా నింపుకుంటున్నామా? లేదా కొంచెమే నింపుకుంటున్నామా? మూడవదిగా, సంఘ కూటాలన్నిటికీ క్రమంగా హాజరవ్వాలి. నాలుగవదిగా, ప్రశాంత వాతావరణంలో యెహోవా మార్గాల గురించి ధ్యానించాలి. “పూర్వదినములు జ్ఞాపకము చేసికొనుచున్నాను, నీ క్రియలన్నియు ధ్యానించుచున్నాను” అని కీర్తన 143:5 చెబుతోంది.

‘నీతిమంతులు తేజరిల్లుతారు’

చివరిదైన మూడవ ప్రసంగాన్ని జాన్‌ బార్‌ ఇచ్చాడు. ఆ ప్రసంగంలో ఆయన, యేసు చెప్పిన గోధుమలు గురుగుల ఉపమానాన్ని వివరించాడు. (మత్త. 13:24-30, 38, 43) ఆ ఉపమానం ‘కోతకాలం’ గురించి చెబుతోంది. ఆ కాలంలో “రాజ్య సంబంధులు” లేదా రాజ్య కుమారులు సమకూర్చబడతారు, గురుగులు కాల్చివేయబడడానికి వేరుచేయబడతారు.

సమకూర్చే పని ఎల్లకాలం కొనసాగదని సహోదరుడు బార్‌ స్పష్టం చేశాడు. ఆయన ఆ ప్రసంగంలో మత్తయి 24:34 వ వచనాన్ని ప్రస్తావించాడు. అక్కడ ఇలా ఉంది: “ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదు.” ఆయన రెండుసార్లు ఈ మాటల్ని చదివాడు: “1914లో సూచన కనిపించినప్పుడు దాన్ని చూసిన అభిషిక్తులు జీవించిన కాలంలోనే కొత్తగా అభిషిక్తులైనవారు ఆ సూచన చూడకపోయినా మహాశ్రమల ప్రారంభాన్ని చూస్తారు. ఓ గుంపుగా వీరందరిని ఉద్దేశించే యేసు ‘తరము’ అనే మాట అన్నాడు.” “ఈ తరము” అనే మాట ఖచ్చితంగా ఎంతకాలాన్ని సూచిస్తుందో మనకు తెలియదుగానీ, అది ఒకే కాలంలో జీవించే ఆ రెండు గుంపుల అభిషిక్తుల్ని సూచిస్తోంది. వీరు వివిధ వయసులవారే అయినా అంత్యదినాల్లో సమకాలీనులుగా ఉంటారు. 1914లో జరిగిన సంఘటనలు చూసి సూచనను అర్థం చేసుకున్న అభిషిక్తులు జీవించిన కాలంలోనే కొత్తగా అభిషిక్తులైనవారిలో కొందరు మహాశ్రమలు ఆరంభమయ్యే వరకు తమ భూజీవితాన్ని చాలించరని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరమో కదా!

“రాజ్య సంబంధులు” లేదా రాజ్య కుమారులు తమ పరలోక బహుమానం కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే, మనమందరం చివరివరకు యథార్థంగా ఉంటూ సూర్యునిలా తేజరిల్లాలి. మన కాలంలో ‘గోధుమలు’ సమకూర్చబడడాన్ని చూడడం ఎంత గొప్ప అవకాశం!

చివరి పాట తర్వాత పరిపాలక సభ సభ్యుడైన థియోడోర్‌ జారస్‌ ముగింపు ప్రార్థన చేశాడు. ఆ వార్షిక కూటంలో జరిగిన కార్యక్రమాలు ఎంత ప్రోత్సాహకరమైనవి!

[అధస్సూచి]

a పరిపాలక సభలోని ఆరు కమిటీలు చేసే పని గురించిన మరింత వివరణ కోసం కావలికోట మే 15, 2008, 29వ పేజీ చూడండి.

[5వ పేజీలోని బాక్సు]

సంఘ పెద్దల కోసం ఏర్పాటు చేయబడిన పాఠశాల

వార్షిక కూటంలో పరిపాలక సభ సభ్యుడైన ఆంథనీ మారిస్‌, సంఘ పెద్దలకు క్రమంగా నిర్వహించబడే శిక్షణా కార్యక్రమం గురించిన ఓ ప్రకటన చేశాడు. 2008వ సంవత్సరపు ప్రారంభంలో పెద్దల కోసం ఏర్పాటు చేయబడిన ఓ పాఠశాల న్యూయార్క్‌లోని ప్యాటర్సన్‌లోవున్న ఎడ్యుకేషనల్‌ సెంటర్‌లో మొదలైంది. ఇటీవలే 72వ తరగతి ముగిసింది. ఇప్పటివరకు 6,720 మంది పెద్దలు శిక్షణ పొందారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఒక్క అమెరికాలోనే 86,000 కన్నా ఎక్కువమంది సంఘ పెద్దలు ఉన్నారు. అందుకే, 2009 డిసెంబరు 7వ తేదీ నుండి న్యూయార్క్‌లోవున్న బ్రూక్లిన్‌లో అదనంగా మరో పాఠశాలను నిర్వహించేందుకు పరిపాలక సభ ఆమోదించింది.

రెండు నెలలపాటు ప్యాటర్సన్‌లో నలుగురు ప్రయాణ పైవిచారణకర్తలకు పాఠశాల ఉపదేశకులుగా శిక్షణ ఇవ్వబడుతుంది. వీరు బ్రూక్లిన్‌కు వెళ్లి మరో నలుగురికి శిక్షణనిస్తారు. ఆ నలుగురు బ్రూక్లిన్‌లో జరిగే పాఠశాలలో బోధిస్తారు. మొదట శిక్షణపొందిన నలుగురేమో సమావేశ హాళ్లలో, రాజ్యమందిరాల్లో జరిగే పాఠశాలలో బోధిస్తారు. అమెరికాలో ప్రతీవారం ఆంగ్ల భాషలో నిర్వహించబడే ఆరు పాఠశాలల్లో బోధించేందుకు 12 మంది ఉపదేశకులు తయారయ్యేంతవరకూ ఈ పద్ధతి కొనసాగుతుంది. ఆ తర్వాత, స్పానిష్‌ భాషలో బోధించడానికి ఇంకా నలుగురికి శిక్షణ ఇవ్వబడుతుంది. అయితే ప్రస్తుతమున్న రాజ్య పరిచర్య పాఠశాల మాత్రం అలాగే ఉంటుంది. సంఘ పెద్దల ఆధ్యాత్మికత పెంచడమే ఈ కొత్త పాఠశాల ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగావున్న మిగతా బ్రాంచీలు సమావేశ హాళ్లలో, రాజ్యమందిరాల్లో ఈ పాఠశాలను 2011 సేవా సంవత్సరంలో ఆరంభిస్తాయి.

[4వ పేజీలోని చిత్రాలు]

“యెహోవాకు కీర్తనలు పాడదాం” (ఆంగ్లం) అనే కొత్త పాటల పుస్తకం నుండి పాటలు పాడి వార్షిక కూటాన్ని ఆరంభించారు